సిరిసిల్లలో కేటీఆర్ ఎదురీత?
posted on Nov 23, 2023 5:35AM
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ కు సొంత నియోజకవర్గం సిరిసిల్లలో ఎదురుగాలి వీస్తోందా? ప్రజావ్యతిరేకత ప్రస్ఫుటంగా కనిపిస్తోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఇందుకు తార్కానంగా ఆయన మంగళవారం నియోజకవర్గ పార్టీ క్యాడర్ తో మాట్లాడిన వీడియోకాల్ ను ఉదహరిస్తున్నారు. ఆ వీడియోలో కేటీఆర్ ప్రజా వ్యతిరేకత ఉందని అంగీకరించడం, ప్రజలకు ఎన్ని పనులు చేసినా, ఎంత మంచి చేసినా ఎక్కడో కొంత అసంతృప్తి ఉంటుందని, ప్రజలకు తనకు మధ్య డైరెక్టన్ కనెక్షన్ తెగిపోయిందనే అభిప్రాయాలు కూడా జనం నుంచి నియోజకవర్గంలో వినిపిస్తున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సొంత పార్టీ కేడర్‌లోనే చాలా మందికి తనతో యాక్సెస్ లేదనే అసంతృప్తి ఉన్నదని, ఏ సమస్య ఉన్నా తనతో చెప్పుకోవాలని కోరుకుంటున్నారని, కానీ ఇంతకాలం ఎమ్మెల్యేగా క్యాడర్ కు దగ్గర కాలేదనీ, కానీ మరో సారి అవకాశం ఇస్తే తప్పకుండా నెలలో రెండు రోజుల పాటు సిరిసిల్లలోనే ఉంటానని, నేరుగా అందుబాటులో ఉంటానని శ్రేణులకు హామీ ఇచ్చారు.
ఇంత చేశాం, అంత చేశాం, హైదరాబాద్ కు ప్రపంచం నలుమూలల నుంచీ పెట్టుబడి దారులు వలస వచ్చేలా చేశాం. తెలంగాణ అభివృద్ధికి బాటలు వేశాం. దేశానికి రాష్గ్రాన్ని ధాన్యాగారంగా మార్చేశాం అని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ ఎన్నికల ముందు కేడర్ తో ఇలా బేలగా మాట్లాడమే ఆయన సిరిసిల్లలో ఎదురీదుతున్నారనడానికి తార్కానంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక్కడ నుంచి ప్రచారం చాలా కీలకమని, ప్రతి ఇంటినీ టచ్ చేసి వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చి వారికి భరోసా కల్పించాలని కేడర్ కు పిలుపునిచ్చారు.
కొత్త రేషను కార్డులు, పింఛన్లు.. వంటి సమస్యల పరిష్కారంపై ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వాలనీ కేడర్ కు కేటీఆర్ సూచించారు. సరిగ్గా ఎన్నికల వేళ ప్రజల నమ్మకాన్ని కోల్పోయామన్న అనుమానం రావడమే ఓటమి భయాన్ని సూచిస్తున్నదని అంటున్నారు. మొత్తం మీద తెలంగాణలో అధికార పార్టీలో ఈ సారి విజయంపై పూర్తి స్థాయి విశ్వాసం కనబడటం లేదని ఆ పార్టీ ప్రచార సరళే తేటతెల్లం చేస్తోందని అంటున్నారు.