ఆయారాం గయారాంలతో పార్టీలకే కాదు.. ప్రజలకూ కన్ఫ్యూజనే!
posted on Nov 22, 2023 @ 4:28PM
ఐదు రాష్ట్రాల ఎన్నికల సంరంభం ఆరంభమైపోయింది. ఛత్తీస్ గఢ్, మిజోరం, రాజస్థాన్న, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో పార్టీలన్నీ తమతమ అభ్యర్థులను ప్రకటించి ప్రచార యుద్ధం మొదలెట్టేశాయి. అయితే అన్ని పార్టీలనూ ఫిరాయింపుల బెడద వెన్నాడుతూనే ఉంది. నిన్నటి వరకూ ఈ పార్టీలో ఉన్న వ్యక్తి ఇప్పుడు మరో పార్టీ అభ్యర్థిగా దర్శనమిస్తున్న వైచిత్రి దాదాపు ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలలోనూ నెలకొని ఉంది. పార్టీ టికెట్ రాలేదనో, కోరిన స్థానం దక్కలేదనో.. కారణం ఏదైతేనేం.. పార్టీలలో కప్పదాట్లు తారస్థాయిలో జరుగుతున్నాయి.
సరే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన, నోటిఫికేషన్ విడుదల, అభ్యర్థుల ఎంపిక, ప్రచారాలు ఇవి ఎటూ తప్పవు. దీంతో అసమ్మతులను బుజ్జగించే పనికి చుక్క పెట్టి పార్టీలన్నీ ప్రచారంలో మునిగిపోయాయి. కానీ తాము ఏ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్నామో, ఆ వ్యక్తే నిన్న మొన్నటి వరకూ ప్రత్యర్థి పార్టీలో కీలకనేతగా ఉండి తనను విమర్శించిన సంగతిని విస్మరించలేక పలు పార్టీల నేతలు ప్రచారంలో తడబడుతున్నారు. మిగిలిన రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా తెలంగాణలో మాత్రం ఈ పరిస్థితి చాలా చాలా అధికంగా ఉంది. మరీ ముఖ్యంగా జంపింగుల బెడదతో అధికార బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలకు ఈ ఇబ్బంది మరీ ఎక్కువగా ఉంది. అవును అన్ని పార్టీలలోనూ ఇదే పరిస్థితి. ఇలా అభ్యర్థుల ప్రకటన పూర్తయ్యిందో లేదో అలా పార్టీలలో ఫిరాయింపుల పర్వానికి తెరలేచింది.
పార్టీ సిద్ధాంతాలకు నిబద్ధులుగా ఉండే వారిని అభ్యర్థులుగా ఎంపిక చేసే సంప్రదాయానికి పార్టీలు ఎప్పుడో తిలోదకాలిచ్చేశాయి. కేవలం పార్టీ అగ్రనాయకత్వం ఇష్టాయిష్టాల మీద, వారి ప్రాపకం మీదా, అలాగే ఖర్చుచేయగలిగే స్తోమత మీదా ఆధారపడి పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. అందుకే ఎన్నికల సమయంలో పార్టీ టికెట్ ఇచ్చే పార్టీలోకి జంప్ చేయడానికి అన్ని పార్టీల నేతలూ రెడీగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ కారణంగానే తెలంగాణ లో ఎన్నికలు రోజుల వ్యవధిలోకి వచ్చిన తరువాత కూడా ఫిరాయింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. పోటీకి అవకాశం లేకపోయినా.. ఎన్నికల తరువాత ఏదో విధంగా లబ్ధి చేకూర్చేలా ఒప్పందాలు కుదుర్చుకుని మరీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తున్నది.
ఇటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యానికి ఎంత మాత్రం మేలు కాదు. ప్రజలే రాజకీయ కప్పదాట్లను అడ్డుకోవాలి. ఫిరాయింపు దారులను ఎన్నికలలో తిరస్కరించడం ద్వారానే నిబద్ధత ఉన్న రాజకీయ వాతావరణం ఏర్పడుతుందని పరిశీలకులు అంటున్నారు. జనం ఫిరాయింపుదారుల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.