పీకేతో కేసీఆర్ మంతనాలు.. చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న చందమేనా?
posted on Nov 23, 2023 @ 11:00AM
కేసీఆర్.. ఆయన మాటే శాసనం.. అవును, బీఆర్ఎస్ లో కేసీఆర్ మాటే శాసనం, కాదన్న ధిక్కార స్వరం వినిపిస్తే అలా వినిపించిన వారు ఎంతటి వారైనా... అంతే సంగతులు. వెంటనే వేటు పడుతుంది. ఎవరికైనా ఆయన సలహాలూ, ఆదేశాలూ ఇవ్వడమే కానీ, ఎదుటి వారి నుంచి స్వీకరించడం ఉండదు. అటు ఉద్యమంలో ఇటు ప్రభుత్వంలో కేసీఆర్ కు కుడి భుజంగా ఉన్న ఈటల రాజేందర్ ఉదంతమే అందుకు నిదర్శనం. ఒక సందర్భంలో గులాబీ జెండాకు అసలు ఓనర్లం మేమే అంటూ బడుగుల తరపున ఆయన చేసిన ఒకే ఒక్క ప్రకటనే కేసీఆర్ ఆగ్రహానికి కారణం ఈటల ఆ ధిక్కార స్వరం వినిపించిన తరువాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అటువంటి కేసీఆర్ ఇప్పుడు వ్యూహాల కోసం, సలహాలూ, సూచనల కోసం ఎన్నికల వ్యూహకర్త పీకేను శరణు జొచ్చారు. ముచ్చటగా మూడో సారి కూడా అధికార అందలం అందుకోవాలని ఆశపడుతున్న కేసీఆర్ ఇప్పుడు మారిన మనిషి అంటున్నారు. తొమ్మిదేళ్ల అధికారం తరువాత ఆయనకు ఇప్పుడు తెలంగాణలో కేక్ వాక్ పరిస్థితి లేదంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, పుంజుకున్న కాంగ్రెస్, గెలుపుపై సర్వేల ద్వారా తెప్పించుకున్న నివేదికలు చేస్తున్న హెచ్చరికలు, పరిశీలకుల విశ్లేషణలు, అన్నిటికీ మించి పార్టీలో పెరుగుతున్న అసమ్మతి, కన్నెర్ర చేస్తే కారు దిగి వెళ్లిపోతున్న నేతలు ఇలా ఎటు చూసినా గతంలోలా తన మాట చెల్లుబాటయ్యే పరిస్థితి లేదన్న వాస్తవం గ్రహించిన కేసీఆర్ తన స్టైల్ మార్చుకున్నారు.
నినమొన్నటి దాకా, ముఖ్య నేతలు, మంత్రులకే దొరకని ముఖ్యమంత్రి అప్పాయింట్మెంట్ ఇప్పడు అడగకుండానే ద్వితీయశ్రేణి, తృతీయ శ్రేణి నాయకులకు దొరికేస్తోంది. అప్పాయింట్ మెంట్ దొరకడం కాదు.. ప్రగతి భవన్ నుంచే ఆహ్వానాలు అందుతున్నాయి. ఈ మార్పునకు రాష్టంలో మారిన రాజకీయ పరిణామాలే ప్రధాన కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ శ్రేణులు కూడా అదే అంటున్నాయి. ఎన్నికల పబ్బం గడవగానే పరిస్థితి మళ్లీ మామూలైపోవడం ఖాయమని చెబుతున్నాయి.
కాంగ్రెస్ జోరు పెరిగి, కమలం రేకులు రాలిపోతున్న నేపథ్యంలో కారు పార్టీ అధినేత కేసీఆర్ కు ధీమా స్థానంలో బేజారు మొదలైందని విశ్లేషిస్తున్నారు. నిజానికి కాంగ్రెస్ లో జోష్ పెరగడానికి బీజేపీ, కేసీఆర్ వ్యూహం కారణంగా ఎంత వేగంగా రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అన్న స్థాయికి ఎదిగిందో.. అంత కంటే వేగంగా యథాపూర్వ స్థితికి జారిపోవడమే కారణమని చెబుతున్నారు. బీజేపీ గ్రాఫ్ అంత అకస్మాత్తుగా పతనం కావడానికి బీజేపీ, బీఆర్ఎస్ రహస్య బంధాన్ని జనం అర్ధం చేసుకోవడమేనని అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఈ తొమ్మిదేళ్లుగా విజయాలకు మొహం వాచిపోయి ఉండడానికి కారణం క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి కార్యకర్తల బలం, ప్రజాభిమానం, ఆదరణ లేకపోవడం కాదనీ, నేతల సఖ్యత లేమి, గ్రూపు తగాదాలే కారణమని విశ్లేషకులు తొలి నుంచీ చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు అంటే టీపీసీసీ పగ్గాలు రేవంత్ చేపట్టిన తరువాత.. క్రమంగా తెలంగాణ కాంగ్రెస్ లో ఆధిపత్య పోరుకు చుక్క పడింది. పార్టీ అధిష్ఠానం కూడా ప్రత్యేకంగా తెలంగాణపై దృష్టి పెట్టి.. ధిక్కార స్వరాలకు చెక్ పెట్టింది. రేవంత్ కు పరిమితంగానైనా స్వేచ్ఛ నిచ్చింది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత రెండు దఫాలుగా రాష్ట్రంలో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ నేతలలో కూడా తెలంగాణలో అధికారం అందని ద్రాక్ష కాదని అర్ధమైంది. దీంతో సమష్టిగా కాంగ్రెస్ అడుగులు వేస్తున్నది. ఈ పరిస్థితే అధికార బీఆర్ఎస్ కు ఒకింత ఆందోళన కలిగిస్తున్నది. ఇన్నాళ్లూ తెలంగాణ తెచ్చిన పార్టీగా ప్రచారం చేసుకున్న బీఆర్ఎస్ కు ఇప్పుడు కాంగ్రెస్ ను జనం తెలంగాణ ఇచ్చిన పార్టీగా చూడటం ఒకింత ఇబ్బందికరంగానే మారింది.
ఆ ఇబ్బందిని అధిగమించేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా మిగిలిన పార్టీల కంటే ముందుగానే అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ముందుగా ప్రకటించేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకుండానే అభ్యర్థుల జాబితా ప్రకటించి కేసీఆర్ చేసిన ప్రయోగం పెద్దగా ఫలించ లేదు. అసంతృప్తి, అసమ్మతి భగ్గుమన్నాయి. ఆ అసమ్మతి జ్వాలల తీవ్రతే బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ఎంత థ్రెట్ గా మారిందన్నది ఎత్తి చూపింది. ఇక అప్పటి నుంచీ కేసీఆర్ వ్యూహాలు ఒక్కటొక్కటిగా బెడిసి కొడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే కేసీఆర్ అసమ్మతులకు పదవుల పందేరం చేశారనీ, ఏళ్ల తరబడి భర్తీ చేయని పదవులను కూడా యుద్ధ ప్రాతిపదికన అసమ్మతులతో భర్తీ చేసేశారనీ అంటున్నారు. ఇన్ని చేసినా ఎన్నికల తేదీ రోజుల వ్యవధిలోకి వచ్చిసిన తరువాత కూడా కారు జోరు పెరగలేదని పార్టీ అధినేత భావిస్తున్నారనడానికి ఎన్నికల ప్రచార గడువు ముగింపు దశకు వస్తున్న తరుణంగా గతంలో తాను దగ్గరకు చేర్చి ఆ తరువాత అవసరం లేదు పొమ్మన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకేను శరణుజొచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ పీకేను ప్రగతి భవన్ కు పిలిపించుకుని గంటల తరబడి చర్చించారన్న సంగతి గురురాజ్ అంజన్ ట్వీట్ తో వెలుగులోనికి వచ్చింది. ఈ భేటీలో కేసీఆర్, పీకేలు చర్చించిన, చర్చింకున్న విషయాలు ఏమిటన్నది వెల్లడి కాకపోయినప్పటికీ ఖచ్చితంగా తెలంగాణ ఎన్నికలలో బీఆర్ఎస్ గెలుపు బాట పట్టడానికి అనుసరించాల్సిన వ్యూహాలపైనే చర్చ జరిగిందని అంటున్నారు.
అయితే పీకే మాత్రం ఇప్పటికే ఆలస్యం అయ్యిందనీ, ఈ పరిస్థితుల్లో తాను చేయగలిగే సహాయం ఏమీ లేదనీ తన నిస్సహాయతను వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. అయితే కేసీఆర్ మాత్రం ఈ ఐదారు రోజులలో పటిష్ట వ్యూహాన్ని అనుసరించి.. వ్యతిరేకతను అధిగమించడానికి అవసరమైన సలహాలూ, సూచనలూ ఇవ్వాలని పీకేను కోరినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలింగ్ కు ముందు వరకూ బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలపై పీకే కేసీఆర్ వివరించినట్లు చెబుతున్నారు. పీకే వ్యూహాలంటే కొత్తగా చెప్పుకోవలసిన పనిలేదన్న సంగతి తెలిసిందే. ఇక మిగిలిన కొద్ది రోజుల ప్రచారంలో బీఆర్ఎస్ పీకే ప్రచార వ్యూహాలను అమలులో పెడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.
ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయమేమిటంటే.. గతేడాది పీకే సారథ్యంలోని ఐ-ప్యాక్ టీమ్‌తో బీఆర్ఎస్ అవగాహన కుదుర్చుకుంది. అయితే ఆ ఓప్పందం నుంచి బీఆర్ఎస్ అర్ధంతరంగా వైదొలగింది. కేసీఆర్ కంటే పీకే గొప్ప స్ట్రాటజిస్ట్ ఏమీ కాదనీ, అందుకే ఐ ప్యాక్ తో ఒప్పందాన్ని వదులుకున్నామనీ బీఆర్ఎస్ నేతలు అప్పట్లో గొప్పగా చెప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో కాంగ్రెస్ కోసం కూడా పీకే పని చేయడం రుచించకే కేసీఆర్ పీకేను దూరం పెట్టారని పరిశీలకులు అప్పట్లో విశ్లేషించారు. ఇక ఇప్పుడు వరుసగా పార్టీ సొంతంగా నిర్వహించుకున్న సర్వేలలోనూ, వివిధ సంస్థలు చేసిన సర్వేలలోనూ కూడా బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నదని తేలడంతో దింపుడు కళ్లెం ఆశగా పీకేను కేసీఆర్ ఆశ్రయించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా ఆఖరి నిముషంలో పీకే వ్యూహాలు ఫలిస్తాయా అంటే అనుమానమేనని అంటున్నారు.
ఇప్పటికే కేసీఆర్ నోట ఓటమి మాట రావడం, ఈ సారి గెలిపిస్తే.. ఇకపై ప్రతి నెలా మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటానంటూ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల క్యాడర్ కు వీడియో కాన్ఫరెన్స్ లో హామీ ఇవ్వడం.. ప్రజలతో గ్యాప్ వచ్చిందనీ, వారికి దూరమైన మాట వాస్తవమేననీ అంగీకరిస్తూ ఆయన క్యాడర్ తో టెలికాన్ఫరెన్స్ తో మాట్లాడిన మాటలు లీక్ కావడం చూస్తుంటే.. బీఆర్ఎస్ లో ఆల్ ఈజ్ నాట్ వెల్ పరిస్థితి ఉందన్నది అవగతమౌతోందని అంటున్నారు.