ఛత్తీస్ ఘడ్ భారీ నక్సల్స్ దాడి కేసు.. ఎన్ఐఏని తోసిపుచ్చిన సుప్రీం!
posted on Nov 23, 2023 5:06AM
ఛత్తీస్ ఘడ్ లోని ఝీరమ్ లోయలో 29 మంది మృ తికి కారణమైన నక్సల్స్ దాడి ఘటనలో విస్తృత కుట్ర కోణంపై దర్యాప్తును తమకు అప్పగించేలా రాష్ట్ర పోలీసులను ఆదేశించాలని కోరుతూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కూడా తోసిపుచ్చింది. ఈ అంశంలో తాము జోక్యం చేసుకోదలచుకోలేదని చీఫ్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో మూడేళ్లుగా ఎన్ఐఏ ఈ కేసు దర్యాప్తు చేసేందుకు చేసిన న్యాయ పోరాటం ఫలించలేదు.
తెలుగు రాష్ట్రాలకు సరిహద్దులో ఉండే ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం నక్సల్స్ ప్రభావిత రాష్ట్రమన్న సంగతి తెలిసిందే. 2009 నుండి ఛత్తీస్ ఘడ్ లో నక్సల్స్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటికి డజనుకు పైగా భారీ దాడులు చేసి వందల మందికి నక్సలైట్లు కారణమయ్యారు. నక్సల్స్ దాడులలో మరణించిన వారిలో రాజకీయ నేతలతో పాటు ఆర్మీ జవాన్లు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సిబ్బంది, భద్రతా సిబ్బంది, పోలీసు అధికారులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఉన్నారు. నక్సల్స్ దాడులలో అన్నిటి కంటే దారుణమైనది 010లో దంతేవాడ మెరుపుదాడిలో 75 మంది జవాన్లు మరణించిన ఘటన ఒకటైతే, ఆ తరువాత 2013లో ఝీరమ్ లోయలో మావోయిస్టుల దాడిలో 29 మంది చనిపోయిన ఎవరూ మరచిపోలేవి. 2013 నాటి దాడిలో రాష్ట్ర మాజీ మంత్రి మహేంద్ర కర్మ, అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నంద్ కుమార్ పటేల్, ఆయన కుమారుడు, సహా 29 మంది మరణించారు. అప్పటి అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచారం జరుగుతున్నప్పుడు బస్తర్ జిల్లాలో పరివర్తన్ ర్యాలీలో పాల్గొని కాంగ్రెస్ నాయకులు తిరిగి వస్తుండగా నక్సల్స్ ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడి కేసు విచారణ అంశంపై చాలా కాలంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర దర్యాప్తు సంస్థల మధ్య పోరాటం జరుగుతుంది.
ఈ కేసును ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దర్యాప్తు జరపగా.. తాజాగా రాష్ట్ర పోలీసులు కూడా కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు. నక్సల్స్ దాడి వెనక విస్తృత కుట్ర కోణం ఉందంటూ ఓ వ్యక్తి 2020లో ఫిర్యాదు చేయగా రాష్ట్ర పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు. దీనిపై ఎన్ఐఏ స్థానిక కోర్టు నుండి సుప్రీంకోర్టు వరకూ వెళ్లినా అనుకూల తీర్పు దక్కలేదు. ఈ కేసును రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేయకుండా తమకి అప్పగించాలని కోర్టులను కోరినా తోసిపుచ్చారు. ఝీరమ్ లోయలో 29 మంది మృతికి కారణమైన నక్సల్స్ దాడి ఘటనలో విస్తృత కుట్ర కోణంపై దర్యాప్తును తమకు అప్పగించేలా రాష్ట్ర పోలీసులను ఆదేశించాలని కోరుతూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తొలుత ట్రయిల్ కోర్టును ఆశ్రయించింది. అక్కడ చుక్కెదురు కావడంతో రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ కూడా వ్యతిరేక తీర్పు రావడంతో సుప్రీం కోర్టు వరకూ వెళ్లింది.
ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం కూడా ఎన్ఐఏ అభ్యర్ధనను తోసిపుచ్చింది. ఈ అంశంలో తాము జోక్యం చేసుకోదలచుకోలేదని ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పు పోలీస్ విచారణకు మార్గం సుగమం చేసిందని పేర్కొన్నారు.xవేదికగా స్పందించిన భూపేష్.. సుప్రీం తీర్పు ఛత్తీస్‌గఢ్‌కు న్యాయం తలుపు తెరిచినట్లే అన్నారు. ప్రపంచ ప్రజాస్వామ్యంలో జీరామ్ ఘటనను అతిపెద్ద రాజకీయ మారణకాండగా అభివర్ణించిన ఆయన ఈ దాడిలో సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు సహా 32 మందిని కోల్పోయామని పేర్కొన్నారు. ఈ కేసును ఎన్‌ఐఏతో పాటు మరో కమిషన్ కూడా దర్యాప్తు చేసినా.. ఈ ఘటన వెనుక ఉన్న విస్తృత రాజకీయ కుట్రను ఎవరూ విచారించలేదని సీఎం అన్నారు. ఛత్తీస్‌గఢ్ పోలీసులు దర్యాప్తు చేస్తుంటే ఎన్‌ఐఎ దానిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తోందని.. ఈ రోజు అది భగ్నమవడంతో ఇక పోలీస్ దర్యాప్తునకు మార్గం సుగమమైనట్లే అన్నారు. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తారు. ఎవరు ఎవరితో ఏమి కుట్ర పన్నారో అంతా తేలిపోతుందని పేర్కొన్నారు.