16 ఓవర్లు ముగిసే సరికి టీమ్ ఇండియా మూడు వికెట్ల నష్టానికి 101

టీమ్ ఇండియా 16 ఓవర్లు పూర్తి అయ్యే సరికి మూడు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 34 పరుగులతో, కేఎల్ రాహుల్ 10 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. శుభమన్ గిల్ ఔట్ అయిన తరువాత కూడా టీమ్ ఇండియా జోరు తగ్గలేదు. స్కిప్పర్ రోహిత్ శర్మ అలవోకగా బౌండరీలు బాదేస్తూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. అదే విధంగా విరాట్ కోహ్లీ కూడా దూకుడుగా ఆడాడు. అయితే మరో బంతితో పవర్ ప్లే ముగుస్తుందనగా 47 పరుగుల వద్ద రోహిత్ శర్మ ఔటయ్యాడు. ఆ మూడు బంతులు ఎదుర్కొన్న శ్రేయస్స్ అయ్యర్ నాలుగు పరుగుతు చేసి ఔటయ్యాడు. స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోవడంతో  టీమ్ ఇండియాకు దెబ్బమీద దెబ్బపడినట్లైంది. శ్రేయస్ అయ్యర్ ఔట్ అవ్వడంతో క్రీజ్ లోకి వచ్చిన రాహుల్ తో కలిసి విరాట్ నెమ్మదిగా ఇన్నింగ్స్ నిర్మిస్తున్నాడు.   అయితే టాస్ కోల్పోయి బ్యాటింగ్ చేపట్టిన టీమ్ ఇండియా ప్లాన్ ప్రకారమే ఆడింది. పవర్ ప్లేలో పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేసి వికెట్లు పడగొట్టాలన్న ఆసీస్ వ్యూహం ఫలించలేదు. వికెట్లు పడినా పవర్ ప్లే ముగిసే సరికి టీమ్ ఇండియా రెండు వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. రోహిత్, ఆ వెంటనే అయ్యర్ ఔట్ అవ్వడం, ఫీల్డ్ రిస్ట్రిక్షన్ తొలగిపోవడంతో స్కోరింగ్ రేట్.. అంటు పరుగుల ప్రవాహం కొంత తగ్గింది. కేఎల్ రాహుల్, కింగ్ కోహ్లీలు సంయమనంతో ఆడుతున్నారు.  

రోహిత్‌ శర్మ ఔట్‌.. హాఫ్‌ సెంచరీ మిస్

టీమ్ ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. 47 పరుగులు చేసిన రోహిత్ శర్మ మాక్స్ వెల్ బౌలింగ్ లో హెడ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కేవలం 3 పరుగుల తేడాతో హాఫ్ సెంచరీ మిస్సయ్యాడు. దీంతో పది ఓవర్లు అంటే పవర్ ప్లే పూర్తయ్యే సరికి టీమ్ ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. ఇంత వరకూ జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రన్స్ స్కోర్ చేసిన జట్టు టీమ్ ఇండియానే కావడం గమనార్హం. పవర్ ప్లే పూర్తయ్య సరికి సగటున 8 పరుగులతో టీమ్ ఇండియా 80 పరుగులు చేసింది. రోహిత్ ఔట్ అవ్వడంతో శ్రేయస్ అయ్యర్ క్రీజ్ లోకి వచ్చాడు. మరో వైపు విరాట్ కోహ్లీ కూడా ధాటిగా ఆడుతున్నాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో వరుసగా మూడు బౌండరీలు సాధించాడు. 

క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

 క్రికెట్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వన్డే ప్రపంచకప్‌ 2023   ఫైనల్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచింది. మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ ఫైనల్ లో టీమ్ ఇండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది.  .క్రికెట్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వన్డే ప్రపంచకప్‌ 2023   ఫైనల్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచింది. మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ ఫైనల్ లో టీమ్ ఇండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. రెండు దశాబ్దాల కిందట 2003 వరల్డ్ కప్ ఫైనల్ లో ఎదురైన పరాభవానికి రివెంజ్ తీర్చుకునేందుకు టీమ్ ఇండియా రెడీగా ఉంది.  అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాలలో సూపర్ ఫామ్ లో ఉన్న టీమ్ ఇండియా క్రికెటర్లు ఆసీస్ ను చిత్తు చేసి వరల్డ్ కప్ విజేతగా నిలవాలని పట్టుదలతో ఉన్నారు. 

వాలంటీర్లపైనే జగన్ ఆశలు.. గెలిపించేస్తారనే!

ఏ రాష్ట్రంలో లేని వాలంటీర్ వ్యవస్థ ఏపీలో ఉంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తన చేత, తన కొరకు, తానే తీసుకొచ్చిన ఈ వ్యవస్థ వలన తనకూ, తన పార్టీకీ తప్ప ఇంకెవరికీ ఎటువంటి ప్రయోజనం లేని, ఉండని, ఉండకూడని విధంగా జగన్ ఈ వ్యవస్థను తీసుకువచ్చారు. ఇంకా చెప్పాలంటే   వైసీపీ కార్యకర్తలకు లబ్ది చేకూర్చడం,  ప్రజలపై వైసీపీ నేతలు పెత్తనం చేసేందుకు ఈ వ్యవస్థ బాగా ఉపయోగపడుతున్నది.   అప్పుడప్పుడు ఈ వాలంటీర్లు పలుచోట్ల బెదిరింపులు,  అరాచకాలు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. గ్రామ వాలంటీర్లు, పట్టణ, వార్డు వాలంటీర్లు అందరూ కలిసి ఏపీలో సుమారు 2.7 లక్షల మంది ఉన్నారు. ప్రభుత్వం అమలు చేయాలనుకున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ఈ వాలంటీర్ల చేతులే మీదగా ప్రజలకు చేరవేస్తున్నారు. ఏ పథకం లబ్దిదారుడికి అందాలన్నా ఆయా వాలంటీర్ చేతుల మీదగా సచివాలయ ఉద్యోగులు అమలు చేయాల్సి ఉంది. అందుకే సీఎం జగన్   ఇప్పుడు ఈ వాలంటీర్లనే నమ్ముకున్నారని   పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో వాలంటీర్లే తనను గెలిపిస్తారని జగన్ బలంగా నమ్ముతున్నట్లు చెబుతున్నారు. గడప గడపకు కార్యక్రమం నుండి ఇప్పుడు జరుగుతున్న వైసీపీ సామజిక బస్సు యాత్ర, వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాల వరకూ ఎక్కడ చూసినా వాలంటీర్లే కనిపిస్తున్నారు.. వారి ప్రస్తావనే వస్తున్నది తప్ప వైసీపీ క్యాడర్ కానీ, నాయకులు కానీ కనిపించడం లేదు. అసలు ఎన్నికలంటేనే పార్టీలకు, క్యాడర్ నాయకులు ముఖ్యం. వారు లేకుండా ఏ పార్టీ బ్రతికి బట్టకట్టడం అసాధ్యం. ఓ సామాన్య పౌరుడిని కార్యకర్తగా మలచాలన్నా, ఓటరుగా తీసుకురావాలన్న ప్రభావితం చేసే సత్తా వీరికే ఉంటుంది. అందుకే ప్రతి పార్టీ ఎన్నికలనగానే ద్వితీయ శ్రేణి నేతలతో టచ్ లోకి వెళ్లి స్థానిక స్థితి గతుల ఆధారంగా రాజకీయం చేస్తాయి. కానీ అదేంటో వైసీపీ మాత్రం వాలంటీర్ల జపం చేస్తుంది. నేతలు, క్యాడర్ పార్టీ కార్యక్రమాలకు దూరం అయ్యారో.. దూరం పెడుతున్నారో కానీ.. వైసీపీ కార్యక్రమం అంటే వాలంటీర్లే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. కాగడాపెట్టి వెతికినా వైసీపీ కార్యక్రమాలలో ఆ పార్టీ క్యాడర్ కనిపించదు. ద్వితీయ స్థాయి నేతలూ ఉండరు. వాలంటీర్లు పథకాలు దక్కవు సుమా అని బెదరించి జనాలను ఆ కార్యక్రమాలకు రప్పించినా.. వారు ఏదో వచ్చామన్నట్లు వచ్చి వెంటనే తిరిగి వెళ్లిపోతున్నారు. అందుకే అధికార పార్టీ కార్యక్రమాలన్నీ జనం లేక వెలవెలపోతున్నాయి.   జగన్ మాత్రం జనం వస్తే ఎంత, రాకపోతే ఎంత వాలంటీర్లు ఉన్నారుగా ప్రజల చేత వారే ఓట్లు వేయిస్తారు అని నమ్ముతున్నారా? ఆ భ్రమల్లోనే గడిపేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   వైసీపీ పూర్తిగా వాలంటీర్ల మీద ఆధారపడే పరిస్థితి ఎందుకొచ్చింది? అన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. నిజానికి వైసీపీలో ద్వితీయ స్థాయి నేతలు అసంతృప్తితో ఉన్నారని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. నేనాలుగున్నరేళ్లలో తమకు  ఒరిగింది ఏమీ లేదన్న భావన వారిలో బలంగా ఉంది. వైసీపీ సంక్షేమాన్ని నమ్ముకుని అభివృద్ధిని గాలికి వదిలేసిన సంగతి తెలిసిందే. సంక్షేమ పథకాలకు నేతలతో పనిలేకుండా వాలంటీర్లే సర్వం అన్న పరిస్థితి ఉంది.  దీంతో స్థానిక నేతలకు పని లేకుండా పోయింది. పోనీ అభివృద్ధి పనులు ఏమైనా ఉన్నాయా అంటే ఆ ఒక్కటీ అడగొద్దని మంత్రులే తేల్చి చెప్పేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో చిన్నా చితకా పనులు ఏమైనా చేసినా వాటి తాలూకా బిల్లుల కోసం ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోగా, ఆ పనుల కోసం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ ఆర్థికంగా ఇబ్బందుల పాలైన పరిస్థితి. ఆ కారణంగానే పార్టీపై నేతలు అసంతృప్తితో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు గట్టిగానే వెనకేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులు కూడా అక్రమ మట్టి తవ్వకాలు, ఇసుక క్వారీలు, సెటిల్మెంట్లతో అందిన వరకు సర్దుకున్నారన్న విమర్శలూ ఉన్నాయి. కానీ, అభివృద్ధి పనులే లేకపోవడంతో ద్వితీయ శ్రేణి నేతలకు దక్కిందేమీ లేదు. కానీ, పార్టీ కార్యక్రమానికి ఖర్చు పెట్టాల్సింది వాళ్ళే కావడంతో ఇప్పుడు వాళ్ళే మొహం చాటేస్తున్నారు. గత ఎన్నికలకు పెట్టిన ఖర్చే దండగ అనుకుంటుండగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎక్కడ నుండి తేవాలని వాపోతున్నారు. దీంతో నేతలెలాగూ పార్టీ కార్యక్రమాలలో యాక్టివ్ కాలేకపోవడంతో వాలంటీర్లే దిక్కుగా మారారు.  జగన్ కూడా వాలంటీర్లే గెలిపిస్తారన్న ధీమా వ్యక్తం చేస్తూ.. క్యాడర్ ను, నేతలనూ పట్టించుకోవడం లేదు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేంత వరకూ ఫథకాలు అందవు జాగ్రత్త అంటూ వాలంటీర్లు జనాలను బెదరించగలరు కానీ, ఎన్నికలలో ఓటు వేయించగలరా? అంటే అసాధ్యమని పరిశీలకులు అంటున్నారు. 

మంత్రి మల్లారెడ్డికి హైకోర్టులో ఊరట 

తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నికల అఫిడవిట్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. మల్లారెడ్డి అఫిడవిట్ లో తప్పులు ఉన్నాయని... ఆ విషయాన్ని రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని పిటిషన్ లో పిటిషనర్ పేర్కొన్నారు. మల్లారెడ్డి నామినేషన్ ను తిరస్కరించేలా ఆదేశాలను జారీ చేయాలని పిటిషనర్ అంజిరెడ్డి కోర్టును కోరారు. అయితే మల్లారెడ్డి అఫిడవిట్ పై అంజరెడ్డికి రిటర్నింగ్ అధికారి ఇప్పటికే సమాధానమిచ్చారని ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.  

మందు బాబులకు జగన్ బిగ్ షాక్!

2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్యం నిషేధంపై హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.  వైసీపీ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నవరత్నాలలో మద్య నిషేధం కూడా ఒకటి.   రాష్ట్రంలో మద్యం అనేది లేకుండా చేస్తా.. మందు అంటే ఎక్కడో ఫైవ్ స్టార్ హోటల్లో మాత్రమే దొరికేదిగా చేస్తా అంటూ  జగన్ అప్పట్లో ఎన్నికల ప్రచారంలో  ఊదరగొట్టేశారు. మైకు అందుకున్న ప్రతి సభలో ఒక చేత్తో ఫ్యాన్ గుర్తు చూపిస్తూ ఓట్లడిగారు. కానీ  తీరా గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేశాక మద్య నిషేధం సంగతి దేవుడెరుగు.. ప్రభుత్వమే మద్యం అమ్ముతూ.. అదే మద్యాన్ని ఆదాయంగా చేసుకుని పరిపాలన సాగిస్తున్నారు జగన్. వచ్చే పాతికేళ్ల మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరీ అప్పు చేశారు. అంటే మద్య నిషేధం అన్న వాగ్దానానికి తిలోదకాలు వదిలేశారు. నాలుగున్నరేళ్ల పాలనలో తొలి మూడేళ్లు మద్య నిషేధం ఎప్పుడు అంటే విడతల వారీగా అన్నారు. గత ఏడాది నుండి అసలు ఇక ఆ ఊసే ఎత్తడం లేదు.  అంతే కాదు ఎన్నడూ వినని కనని నాసిరకం బ్రాండ్లను తెచ్చారు. ఇష్టారాజ్యంగా చిత్ర విచిత్రమైన పేర్లతో మద్యాన్ని అమ్మేస్తూ ఖజానా నింపుకుంటూ పేదల ప్రాణాలను పొట్టనబెట్టుకుంటున్నారు. ఇక ఇప్పుడు పన్నులు, సవరణల పేరిట ధరలు పెంచేసి జేబులకు చిల్లులు పెట్టేస్తున్నారు. ఔను జగన్ మోహన్ రెడ్డి సర్కార్ మందు బాబులకు మరో  బిగ్‌ షాక్‌ ఇచ్చింది. ఏపీలో కొన్ని బ్రాండ్ ల మద్యం రేట్లు పెంచేయడానికి రంగం సిద్థం చేసింది. పన్నుల సవరణల పేరిట మందుబాబులపై మరో బాంబ్  పేల్చింది. ఆదనపు రిటైల్ ఎక్సైజ్ సుంకాన్ని ఆయా బ్రాండ్ల వారీగా మూల ధరలపై శాతాల రూపంలో  వసూలు చేయాలని డిసైడ్ అయ్యింది. అదుకు తగ్గట్లు వ్యాట్, ఏఈడీని సవరించింది.  ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు.  శనివారం (నవంబర్ 18) నుండే ఈ పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. ఈ నిర్ణయంతో కొన్ని బ్రాండ్ల లిక్కర్ ధరలు క్వార్టర్ బాటిల్ రూ.10నుంచి 40, హాఫ్ రూ.10 నుంచి 50, ఫుల్ రూ.10-90ల వరకు పెరిగాయి. ప్రస్తుతం ఏఆర్‌ఈటీ శ్లాబుల ఆధారంగా రూపాయల్లో ఉన్నందున అన్ని బ్రాండ్లపై పన్నులు సమానంగా లేవని, అన్నీ ఒకేలా ఉండటం కోసం నిర్ణీత ధర నుంచి ఏఆర్‌ఈటీని శాతాల్లోకి మార్చనున్నట్లు తెలిపింది. సరళంగా, సామాన్య ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పాలంటే ఏపీ ప్రభుత్వం పన్నుల సవరణ పేరుతో క్వార్టర్‌ బాటిల్‌పై రూ.10, ఫుల్‌ బాటిల్‌పై రూ.20 పెంచింది.  ఈ పెరిగిన ధరలతో ఐఎంఎఫ్ఎల్‌ కనీస ధర రూ.2,500లోపు ఉంటే దానిపై 250 శాతం, రూ.2,500 దాటితే 150 శాతం, బీరుపై 225 శాతం, వైన్‌పై 200 శాతం, ఫారిన్‌ లిక్కర్‌పై 75 శాతం ఏఆర్‌ఈటీ ఉంటుందని ఉత్తర్వుల్లో  పేర్కొంది. దీని ప్రకారం.. మద్యం ధరల పెరుగుదల ఇలా ఉంది. ఫుల్‌ బాటిల్‌ లిక్కర్ ధర ప్రస్తుతం రూ.570 ఉంటే.. అది  రూ 20 పెరిగి రూ.590కి చేరింది. క్వార్టర్‌ రూ.200 నుంచి రూ.210కి  పెరిగింది. అయితే, అన్ని రకాల బ్రాండ్ల ధరలు ఒకేలా లేవు. మందు బాబులకు బాగా తెలిసిన అరిస్టోక్రాట్ ప్రిమియమ్, సుపీరియర్ విస్కీ, బ్యాగ్ పైపర్, గోల్డ్ రిజర్వ్ విస్కీలపై 750 ఎంఎల్‌కు 90 రూపాయలు వరకూ పెంచారు.   జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏపీలో మద్యం ధరలను విపరీతంగా పెంచేసిన సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో వందకి వంద శాతం ధరలను పెంచేసి మందుబాబుల జేబులు గుల్ల చేశారు. సామాన్య ప్రజలు తాగే క్వార్టర్ వంద రూపాయలు ఉండే మద్యాన్ని రెండు వందలకు  పెంచేశారు. దీంతో ఏపీ సరిహద్దు రాష్ట్రాల నుండి భారీ ఎత్తున మద్యం అక్రమ  సరఫరా పెరిగిపోయింది. పోలీసులు కూడా కట్టడి చేయలేక చేతులెత్తేయడంతో ప్రభుత్వ ఖజానాకు తీవ్రంగా నష్టం వస్తుండడంతో  ధరలను కాస్త తగ్గించారు. అదే సమయంలో కొత్త కొత్త బ్రాండ్లను మార్కెట్లోకి తెచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇప్పుడు మరోసారి ఇలా మద్యం ధరలు పెంచేశారు. అయితే ధరలు పెంచితే పెంచారు కానీ.. మంచి బ్రాండ్ల మద్యం అమ్మితే కనీసం మా ఆరోగ్యాలైనా బాగుంటాయని ఏపీలో మందుబాబులు వాపోతుండటం కొసమెరుపు.

 సొమ్మసిల్లి పడిపోయిన కవిత 

ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సొమ్మసిల్లి  పడిపోయారు.  ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆమె కళ్లు తిరిగి పడిపోయారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలలో ఓపెన్ టాప్ వాహనంలో ప్రచారం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిలబడటానికి ఆమె చాలా ఇబ్బంది పడ్డారు. ఛాతీ భాగాన్ని కూడా రెండు, మూడు సార్లు నొక్కుకున్నారు. అనంతరం ఆమె వాహనంపై పడిపోయారు. వాహనంపైనే ఆమెను పడుకోబెట్టి సపర్యలు చేశారు. కవిత పడిపోవడంతో అక్కడున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కాసేపటికి ఆమె కోలుకున్నారు. అయితే, ఆమె ఎందుకు అస్వస్థతకు గురయ్యారనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.  తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కవిత.. బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ ఫుల్‌ బిజీగా ఉన్నారు. అభ్యర్థుల తరఫున నియోజకవర్గాల్లో పర్యటిస్తూ.. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం నాడు.. కవిత రాయికల్‌ మండలం, ఇటిక్యాలలో పర్యటించారు .  ఇటీవల మంత్రి కెటిఆర్ ఎన్నికల ప్రచార వాహనంపై నుంచి పడిపోయారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో మంత్రి కేటీఆర్ చేపట్టిన ర్యాలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రచార రథంపై ఉన్న మంత్రి కేటీఆర్, ఎంపీ సురేష్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.. వాహనం పైనుంచి పడిపోయారు. ఈ ఘటనలో వారికి గాయాలయ్యాయి. పాత ఆలూరు రోడ్ వద్ద ఈ ఘటన జరిగింది.

తెలంగాణలో అధికారం కాంగ్రెస్ దే.. లోక్ పోల్ సర్వే

తెలంగాణ ఎన్నికలలో హస్తం హవాలో కారు బేజారేనా అంటే లోక్ పోల్ తాజా సర్వే ఔననే అంటోంది. వచ్చే ఎన్నికలలో  కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమని లోక్ పోల్ సర్వే ఫలితం చెబుతోంది. రాష్ట్రంలో కనీసం 74 స్థానాలలో హస్త వాసి అమోఘంగా ఉందని సర్వే ఫలితం పేర్కొంది. ఇక రాష్ట్రంలో వరుసగా రెండు సార్లు అధికారం చేపట్టిన కారు పార్టీ ఈ సారి 29 స్థానాలలోనే విజయం సాధిస్తుందని సర్వే ఫలితం చెబుతోంది.  అయితే గట్టి పోటీని ఎదుర్కొన్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాలలో విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని  పేర్కొంది. ఇక రాష్ట్రంలో అధికారం మాదేనంటూ నిన్నమొన్నటి వరకూ గట్టిగా చెప్పిన బీజేపీ మాత్రం సింగిల్ డిజిట్ స్థానాలతోనే సరిపెట్టుకుంటుందని సర్వే పేర్కొంది. బీజేపీ ఓ తొమ్మది స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇక మజ్లిస్ 6 స్థానాలలో గెలుపొందుతుందని సర్వే తెలిపింది.   ఇక ఖమ్మం జిల్లాలో పది స్థానాలకు గాను పదిస్థానాలనూ కాంగ్రెస్, సీపీఐ కూటమి క్లీన్ స్వీప్ చేసే అవకాశాలున్నాయని లోక్ పోల్ సర్వే ఫలితం తెలిపింది. పొత్తులో భాగంగా ఖమ్మం జిల్లాలో ఒక స్థానంలో సీపీఐ అభ్యర్థి రంగంలో ఉన్న సంగతి విదితమే. అలాగే నల్గొండ జిల్లాలో కూడా హస్తం క్లీన్ స్వీప్ చేస్తుందని పేర్కొంది. గ్రేటర్ విషయానికి వచ్చేసరికి.. ఇక్కడ ప్రధాన పార్టీలు మూడూ కూడా సరి సమానంగా గెలిచే అవకాశాలున్నాయని సర్వే ఫలితం తెలిపింది. బీజేపీ గ్రేటర్ లో మూడు స్థానాలలో గెలుస్తుందనీ, అలాగే కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కూడా మూడేసి స్థానాలలో గెలిచే అవకాశాలున్నాయని లోక్ పోల్ సర్వే ఫలితం వెల్లడించింది. లోక్ పోల్ సర్వే ప్రకారం ఉమ్మడి జిల్లాల వారీగా ఫలితాలు ఇలా ఉండే అవకాశం ఉంది.  జిల్లా             బీఆర్ఎస్     బీజేపీ            కాంగ్రెస్ ఖమ్మం               0                   0             9 ప్లస్ 1 (సీపీఐ) రంగారెడ్డి           5                  2                 7 వరంగల్            3                  0                9 నల్గొండ             0                  0              12 పాలమూరు       3                    0            11 మెదక్                6                  1               6 కరీంనగర్          3                  2              8 నిజామాబాద్     3                 0              3 ఆదిలాబాద్      3                 1              6 హైదరాబాద్     3                 3             3  (మిగిలిన 6 స్థానాలలోనూ ఎంఐఎం విజయం)

జగన్ వెంటే జనం.. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ జగన్ & కో!

వై ఏపీ నీడ్స్ జగన్ (ఏపీకి జగనే ఎందుకు కావాలి) పేరుతో వైసీపీ  కార్యక్రమం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వైసీపీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా  ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రజలు అధికార పార్టీ నేతల మొహం మీదనే తమ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న వైసీపీ సామజిక బస్సు యాత్ర కార్యక్రమం అంతా ఖాళీ కుర్చీలకు నేతల ప్రసంగాలుగా మారిపోయింది. అసలీ బస్సుయాత్రకు పార్టీ కేడరే మోహం చాటేసింది. బలవంతంగా తీసుకువచ్చిన జనం కూడా నేతల ప్రసంగాలు ప్రారంభం కాగానే వెళ్లిపోతున్నారు. నేతలు వారిని కూర్చోమని బతిమలాడుకుంటున్న వైనం సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది.  దీంతో వైసీపీ వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులతో నిర్వహిస్తున్నారు. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం  పూర్తిగా వైసీపీ పార్టీ సొంత కార్యకమం. ఇందులో  అధికారులకు ఎలాంటి పాత్రా లేదు. ఉండకూడదు. కానీ అధికారం ఉంది కదా అని పార్టీ కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులతో  జగన్ సర్కార్ నిర్వహిస్తున్నది.  అధికారులు ప్రజల వద్దకు వెళ్లి బలవంతంగా జగనే కావాలని చెప్పిస్తున్నారు. వలంటీర్లుగా ఎంపికైన వైసీపీ కార్యకర్తలు జగనే కావాలని చెప్పకపోతే పథకాలు ఆగిపోతాయంటూ బెదిరించి మరీ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. ప్రతి ఇంటిపై వైసీపీ జెండా ఎగరాలని ఆదేశాలిస్తూ.. జగన్ పరిపాలన అమోఘం అనేలా మార్కులు వేయాలని హుకుం జారీ చేస్తున్నారు. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని పాతిక   ప్రశ్నలతో కూడిన ఒక బుక్ లెట్  ఇచ్చి అందులోని ప్రశ్నలకు ప్రజల నుండి సమాధానాలు తీసుకొని పొందుపరచేలా డిజైన్ చేశారు. ఈ బుక్ లెట్ లో జగన్ చేపడుతున్న సంక్షేమ పథకాలు బాగున్నాయా? లేకుంటే చంద్రబాబు పథకాలు బాగున్నాయా? వంటి ప్రశ్నలు ఉన్నాయి. అలాగే జగన్ పాలన , చంద్రబాబు పాలన ను కంపేర్ చేసి ఎవరి పాలన బాగుందో చెప్పేలా..     పదికి ఎన్ని మార్కులు ఎవరి పాలనకు ఇస్తారనే ప్రశ్నలు ఉన్నాయి. అయితే  ప్రభుత్వ ఉద్యోగులు ఈ బుక్ లెట్ తో ప్రజల వద్దకు వెళ్లే ముందే వాలంటీర్లు ప్రజలకు ఏం చెప్పాలో ఆదేశిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డికి పదికి పది మార్కులు ఇవ్వాలని, చంద్రబాబుకు 0 మార్కులు వేయాలని ఒత్తిడి చేస్తున్నారు. అలా ఇవ్వకపోతే ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయని బెదరిస్తున్నారు. అలాగే జగన్ తెచ్చిన పథకాలు ఎంతో  ప్రయోజనకరంగా ఉన్నాయని బలవంతంగా చెప్పిస్తున్నారు.  పథకాలు ఆగిపోతాయని బెదరిస్తున్నారు.  మొత్తంగా జగన్ పరిపాలన సుపరిపాలన అంటూ జనం చేత చెప్పిస్తున్నారు. అలా చెప్పించడమే వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం లక్ష్యం అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలా చెప్పిన కాదు కాదు చెప్పించిన వారితో  సెల్ఫీ దిగి వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తున్నారు. అంతేకాదు, ఈ వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో ఓ స్టాంపు మరింత ఆసక్తికరంగా ఉంది. ఆపు బాబు నాటకం.. జగనే మా నమ్మకం అనే అక్షరాలు వచ్చేలా టీడీపీకి వ్యతిరేకంగా రూపొందించిన  స్టాంపుపై తాము జగన్ పాలన భేష్ అని చెప్పించిన వారి సంతకం తీసుకొని సర్వే పూర్తి చేస్తున్నారు.  అలాగే ఇంటింటికి ఒక వైసీపీ జెండా ఇస్తూ ఇష్టం ఉన్నా లేకపోయినా  ఇంటిపై వైసీపీ జెండా కట్టాలని డిమాండ్ చేస్తున్నారు.   ఇలా బెదిరింపులకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా.. ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రజలు జగన్ కావాలనుకుంటే అది వాళ్ళే చెప్పాలి..కానీ  వైసీపీ నేతలు ఇలా బలవంతంగా  చెప్పిస్తే  ప్రయోజనం ఏమిటని నెటిజనులు అంటున్నారు. ఏది ఏమైనా జగన్ ఈగో శాటిస్ ఫై చేయడానికి.. రాష్ట్ర ప్రజలంతా జగనే కావాలని కోరుకుంటున్నారని చెప్పించడానికి అధికారులను పావులుగా వాడుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగనే కావాలని ప్రభుత్వ అధికారులు చెప్పమన్నా.. జగన్ పాలనకు పదికి పది మార్కులేయాలని వాలంటీర్లు బెదిరించినా భరిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఇంకెన్నాళ్ళులే అని మనసు చంపుకొని వాళ్ళు చెప్పినట్లే చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.  ఇలా ఎన్ని సర్వేలు చేసుకున్నా.. జగన్ పాలన సూపర్ అంటూ జబ్బలు చరుచుకోవడానికే తప్ప వాస్తవంగా జగనకు ఆయన పార్టీకీ  ఒరిగేదేమీ ఉండదంటున్నారు. పైగా  జగనే కావాలని చెప్పాలంటూ జనాలను వాలంటీర్లు బెదిరించడం వల్ల మరింత నష్టం జరుగుతుందని విశ్లేషిస్తున్నారు.   

రాములమ్మకు ప్రచార కమిటీ చీఫ్ కోఆర్డినేటర్ పదవి

బీజేపీని  వీడి కాంగ్రెస్ గూటికి చేరగానే  విజయశాంతికి ఆ పార్టీ కీలక పదవిని కట్టబెట్టింది. ఎన్నికల ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీలకు చీఫ్ కోఆర్డినేటర్ గా నియమించింది. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ కు ఇప్పుడు రాములమ్మ వాగ్ధాటి అదనంగా తోడు కానున్నది. ఆరు గ్యారంటీలు, డిక్లరేషన్లు, మేనిఫెస్టోతో ఇప్పటికే  తెలంగాణలో కాంగ్రెస్ ప్రచారం  హోరెత్తింది. బీఆర్ఎస్ పై ప్రజావ్యతిరేకత, బీజేపీతో అధికార పార్టీ  రహస్య ఒప్పందం ఆరోపణలకు కాంగ్రెస్ లో కొత్త జోష్ ను నింపాయి. వరుస సర్వేలలో కాంగ్రెస్ ముందంజలో ఉందన్న నివేదికలు రావడంతో క్యాడర్ కూడా ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. కాంగ్రెస్ కు ప్రతి ఎన్నికలోనూ కాళ్లకు అడ్డంపడేలా ఉండే గ్రూపు తగాదాలు, అంతర్గత విభేదాలు, అసమ్మతి  రాగాలూ ఈ సారి పెద్దగా వినబడటం లేదు. అన్ని గ్రూపులనూ, అందరు నాయకులను కలుపుకుని పోయేలా అధిష్ఠానం రాష్ట్రంపై ప్రత్యేక ఫోకస్ పెట్టి కార్యాచరణను రూపొందించడంతో  ఆ పార్టీ  ఎన్నికల ప్రచారంలో అవాంతరాలు, అడ్డంకులూ లేకుండా దూసుకుపోతున్నది. ఇక తాజాగా ఏర్పాటు చేసిన కమిటీల విషయానికి  వస్తే.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో  విజయశాంతి  శుక్రవారం  (నవంబర్ 17) కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ వెంటనే ఆమెకు ఎన్నికల ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీలకు చీఫ్ కోఆర్డినేటర్ పదవిని కట్టబెట్టారు.  ఆ 

ఉన్న ఓట్లు పోయి.. దొంగ ఓట్లు వచ్చె.. ఏపీ ఓటరు జాబితాలో చిత్ర విచిత్రాలు!

లేని వారికి ఓట్లు.. ఉన్న వారికి తొలగింపులు.. ఒకే అడ్రస్ లో  ఒకే వ్యక్తికి పదుల సంఖ్యలో  ఓట్లు.. ఒకే పేరు..ఒకే ఫొటోతో పెద్ద సంఖ్యలో ఓట్లు ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితాలో వింతలు, విశేషాలకు కొదవే లేదు. జగన్ చేత,  జగన్ కొరకు, జగనే ఏర్పాటు చేసుకున్న వాలంటీర్ల వ్యవస్థ ద్వారా మొత్తం ఓట్ల నమోదు కార్యక్రమాన్ని ఒక ప్రహసనంగా మార్చేశారు. ఏపీలో ఉన్న వారు తమ ఓటు నమోదు చేసుకోవాలంటే కోర్టుల వరకూ వెళ్లాల్సిందే.  రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పని చేసిన నిమ్మగడ్డ రమేష్ కోల్పోయిన  తన ఓటును పునరుద్ధరించుకునేందుకు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. అదే ఆంధ్రప్రదేశ్ లో బతికి ఉన్న వందల మంది ఓట్లు గల్లంతు.. అసలు లేని వారికి వేల సంఖ్యలో ఓట్లు ఉన్న విచిత్ర పరిస్థితి ఉంది.  ఒటర్ల  జాబితా తనిఖీలలో ఎన్నో ఎన్నెన్లో చిత్ర విచిత్రాలు బయటపడుతున్నాయి. ఉమ్మడి కృష్ణా మైలవరం గ్రామంలో ఒకే వ్యక్తికి 12 ఓట్లు ఉన్న చిత్రం వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి పేరు బండారు  యుగంధర్ . బండారు యుగంధర్ అనే వ్యక్తికి మైలవరంలోని బూత్ నంబర్ 1లో, అలాగే బూత్ నంబర్ 2, బూత్ నంబర్ 178లో నాలుగేసి ఓట్లు ఉన్నాయి. అదే ఫొటో, అదే ఇళ్లు, అదే డేట్ ఆప్ బర్త్ తో అదే చిరునామాతో ఆయనకు 12 ఓట్లు ఉన్నాయి. తల్లిదండ్రులూ వాళ్లే. మరి ఒకే ఇంట్లో, ఒకే జంటకు, ఒకే సమయంలో బండారు యుగంధర్ డజను సార్లు ఎలా జన్మించారో ఆయన ఓటును అన్ని సార్లు నమోదు చేసిన ఎన్నికల సిబ్బందికే తెలియాలి. బండారు యుగంధర్ 12 ఓట్ల  బాగోతం ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ ట్రోల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో అధికార జగన్ పార్టీ కేవలం దొంగ ఓట్ల నమోదు, ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా ఉన్న వారి ఓట్ల తొలగింపు ద్వారానే వచ్చే ఎన్నికలలో విజయం సాధించేయగలమన్న ధీమాతో ఉంది. అందుకే క్షేత్ర స్థాయిలో ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతున్న సంగతి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నా వైనాట్ 175 అన్న ధీమానే వ్యక్తం చేస్తున్నది.  ఏపీలో  ఓటర్ల నమోదు, తొలగింపు అడ్డగోలుగా జరుగుతున్నాయనీ, తమ సానుభూతి పరుల ఓట్లు తొలగించేస్తున్నారనీ, దొంగ ఓట్ల నమోదును ఒక మహోద్యమంలా చేపట్టారనీ, తెలుగుదేశం, జనసేనలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులూ చేశారు. అలా ఫిర్యాదులు చేయడంతో కదిలిన కేంద్ర ఎన్నికల సంఘం తనిఖీలకు ఆదేశించింది. ఆ తనిఖీలలో చిత్ర విచిత్రాలు బయటపడుతున్నాయి. ఓటర్ల జాబితాను ట్యాంపర్ చేయడం ఇంత సులువా.. అధికారులను బెదరించో, బెల్లించో, బతిమాలో, బామాలో ఓటరు జాబితాలో ఎవరి ఓట్లు ఉండాలో, ఎవరి ఓట్లు తొలగించాలో అధికార పార్టీ నాయకులు నిర్ణయించేస్తారా  అనిపించేలా ఈ అక్రమాలు ఉన్నాయి.   అసలు వైసీపీ వైనాట్ 175 ధీమాకు   ఓటర్ల జాబితా తమకు అనుకూలంగా రూపొందుతోందన్న కారణమని ఏపీలో ఓటర్ల జాబితా తనిఖీలను చూస్తే అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పరాజయం తరువాత జగన్ సర్కార్ సలహాదారు, సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి తమ ఓటర్లు వేరే ఉన్నారని చెప్పిన దానికి కూడా అర్ధం ఏమిటో బోధపడుతోంది. ఒక అంచనా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం నుంచీ కనీసం పది వేల తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లు తొలగించేయడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకున్నదనీ, ఆ దిశగానే ఆ పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లు అడుగులు వేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించి పక్కా ప్రణాళిక రూపొందించి, పకడ్బందీగా అములు చేయిస్తున్నది సజ్జల రామకృష్ణారెడ్డేనని తెలుగుదేశం ఆరోపిస్తున్నది.  అందుకే  ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారుల బదిలీలపై ఎన్నికల కమిషన్ నిషేధం విధించినా కూడా బదలీలు యథేచ్ఛగా సాగుతున్నాయని చెబుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గాలలో  ఈ ఓట్ల తొలగింపు భారీగా ఉంటోందనీ,  అక్కడి తెలుగుదేశం నేతలు ఆందోళనలు వ్యక్తం చేయడంతో పాటు ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   సజ్జల నేతృత్వంలో ఏర్పాటైన ఓ టీమ్.. వాలంటీర్ల ద్వారా ఓటర్ల సమాచారం సేకరించి ఎన్నికల వ్యూహాలను రచించే ఐ ప్యాక్ టీంకి అందించిందనీ,  ఎక్కడెక్కడ ఓట్లు తీసేయాలో ఐప్యాక్ టీం ఒక ప్లాన్ సిద్ధం చేసి వైసీపీకి అందించిందనీ అంటున్నారు. అందుకు అనుగుణంగా  వైసీపీ నేతలు ఫామ్ 7లతో దరఖాస్తులు ఇవ్వడం.. వాటిని అధికారులు ధృవీకరించి తొలగించడం జరిగిందని తెలుగుదేశం ఆరోపిస్తున్నది. పలు నియోజకవర్గాలలో ఈ ఓట్ల గల్లంతు వ్యవహారం బయటపడడంతో  రంగంలోకి దిగిన కేంద్ర ఎన్నికల సంఘం దర్యాప్తు చేసి అధికారులపై వేటు వేసింది. బదిలీలను నిలిపివేసింది. అయినా ఈసీ ఆదేశాలను ఖాతరు చేయకుండా ఎడాపెడా బదిలీలు సాగుతున్నాయి. మరోవైపు సమయం చూసి ఇప్పుడు మరోసారి ఓట్ల గల్లంతు వ్యవహారాన్ని వైసీపీ ఆచరణలోకి పెట్టిందని తెలుగుదేశం, జనసేనలు ఆరోపిస్తున్నాయి. ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదుపై తెలుగుదేశం సీరియస్ గా దృష్టి పెట్టడంతో ఒకింత నెమ్మదించిన ఈ ప్రక్రియ.. చంద్రబాబు అక్రమ అరెస్టు తరువాత జోరందుకుందని అంటున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరులు అందరూ ఆ అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ ఆందోళనలు, ఉద్యమ బాట పట్టిన పరిస్థితిని అనువుగా చేసుకుని వైసీపీ మళ్లీ ఓట్ల తొలగింపు, నమోదు ప్రక్రయిను వేగవంతం చేసిందని అంటున్నారు.   ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదు విషయంలో  వైసీపీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా ఈసీ కేవలం ఆదేశాలకు మాత్రమే పరిమితమవుతున్నది తప్ప చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

ఆస్ట్రేలియాపై రివెంజ్ కు టీమ్ ఇండియా రెడీ!

క్రికెట్ లో విశ్వ విజేత ఎవరో తేలిపోవడానికి మరొక్క రోజు వ్యవధి ఉంది. టోర్నీ ఆసాంతం అనితర సాధ్యమైన ఆధిక్యత కనబరిచి ఆడిన పది మ్యాచ్ లలోనూ అపజయమనేదే లేకుండా ఫైనల్ కు క్వాలిఫై అయిన టీమ్ ఇండియా.. తడబడుతూ టోర్నీని ఆరంభించి.. అనూహ్యంగా పుంజుకుని చివరికి తుదిపోరుకు సిద్ధమైన ఆస్ట్రేలియా ఆదివారం (నవంబర్ 19) ఆహ్మదాబాద్ నరేంద్రమోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ లో  తలబడనున్నాయి. ఆస్ట్రేలియా అత్యధిక వరల్డ్ కప్ టోర్నీలలో విజేతగా నిలిస్తే.. టీమ్ ఇండియా ఇప్పటి వరకూ 1983, 2011లలో  విశ్వవిజేతగా నిలిచింది. ఇక వరల్డ్ కప్ 2023 అనూహ్య మలుపులతో ఉత్కంఠ భరితంగా సాగింది. నెదర్ ల్యాండ్స్  , ఆప్ఘనిస్థాన్ వంటి జట్లు పెద్ద జట్లకు షాక్ ఇచ్చి సత్తా చాటాయి. 2019 వరల్డ్ కప్ విజేత అయిన ఇంగ్లాండ్ ఈ సారి కూడా.. హాట్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా టోర్నీలో అడుగుపెట్టినా.. అనూహ్యంగా సెమీస్ కు కూడా చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. న్యూజిలాండ్, సౌతాఫ్రికాలు కూడా సత్తా చాటినా సెమీస్ దాటలేకపోయాయి.  ఇక ఫైనల్ మ్యాచ్ కు ముందు ఈ టోర్నీలో ప్రదర్శన ఆధారంగా ప్లేయర్ ఆఫ్ దీ టోర్నీ అవార్డు రేసులో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లో  టీమ్ ఇండియా ప్లేయర్సే ముందున్నారని చెప్పాలి.   ఐసీసీ ప్రకటన మేరకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కోసం రేసులో మొత్తం 9 మంది ఉండగా... వీరిలో నలుగురు టీమ్ ఇండియా ప్లేర్లే కావడం విశేషం. ఈ అవార్డు కోసం నలుగురు టీమ్ ఇండియా ప్లేయర్లు రేసులో ఉండగా, ఆస్ట్రేలియా ,    దక్షిణాఫ్రికా నుంచి ఒకరు చొప్పున  రేస్ లో ఉన్నారు. వారిలో టీమ్ ఇండియా బ్యాటర్ కింగ్ కోహ్లీ ముందువరుసలో ఉన్నారు. కోహ్లీ ఇప్పటి వరకూ జరిగిన పది మ్యాచ్ లలో మూడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలతో మొత్తం 711 పరుగులు సాధించి ముందంజలో ఉండగా,  దక్షిణాఫ్రికా   స్టార్ బ్యాటర్ డికాక్ 594 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తరువాతి స్థానాలలో  వరుసగా రచిన్ రవీంద్ర (578), డిరిల్ మిచెల్ (552), ఉన్నారు. పరుగుల పరంగా చూస్తే టీమ్ ఇండియా స్కిప్పర్ రోహిత్ శర్మ ఐదో స్థానంలో నిలిచాడు.  ఇక బౌలర్ల విషయానికి వస్తే బుమ్రా, షమీ, జంపా  పోటీ పడుతున్నారు. టీమ్ ఇండియా షమీ ప్రదర్శనతో వరల్డ్ కప్ సెమీ ఫైనల్ షమీఫైనల్ గా మారిపోయిందని క్రిడా పండితులు అభివర్ణించారు. టోర్నీలో తొలి నాలుగు మ్యాచ్ లకూ దూరంగా ఉన్న షమీ.. ఆ తరువాత ఆడిన ఆరు మ్యాచ్ లలో మొత్తం 23 వికెట్లు పడగొట్టి టోర్నీలోనే అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా నిలిచాడు. ఆ తరువాతి స్థానాలలో 22 వికెట్లతో జంపా, 18 వికెట్లతో బుమ్రా రేసులో ఉన్నారు.  ఇక మ్యాన్ ఆఫ్ ది టోర్నీ ఎవరన్నది పక్కన పెడితే.. ఆదివారం (నవంబర్ 19) జరిగే ఫైనల్ కు ముందు ఆస్ట్రేలియా మైండ్ గేమ్ ప్రారంభించేసింది. ప్రత్యర్థి జట్టు పై మైదానంలో ఆటలో పై చేయి సాధించడం కంటే ముందుగా మానసికంగా ప్రత్యర్థి జట్టును బలహీనం చేయడం  కోసం నోటికి పని చెప్పింది. ఆసీస్ ప్లేయర్ లు ఆన్ ఫీల్డ్ గేమ్ తో సమానంగా ఆఫ్ ఫీల్డ్ లో మైండ్ గేమ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్న సంగతి తెలిసిందే. ఇప్పుడూ అదే చేస్తున్నారు. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ఫైనల్ కు ముందు నోటికి బాగా పని చెప్పినట్లు కనిపిస్తోంది. ఫైనల్ లో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్  చేస్తే రెండు వికెట్ల నష్టానికి 450 పరుగులు సాధిస్తుందని జోస్యం చెప్పాడు. ప్రతిగా ఇండియా 65 పరుగులకు ఆలౌట్ ఔతుందని పేర్కొన్నాడు. ఇప్పుడు మార్ష్ వ్యాఖ్యలపై టీమ్ ఇండియా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిచెల్ మార్ష్ వ్యాఖ్యలను నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.  మార్ష్ వ్యాఖ్యలు ఇప్పటివి కాకపోయినా సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తూ టీమ్ ఇండియా అభిమానులను ఒకింత కంగారు పెడుతున్నాయి. ఇప్పటి వరకూ ఐదు సార్లు వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా ఫైనల్ కు చేరకూడదని సగటు భారత అభిమాని కోరుకున్నాడు. అందుకే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన సెమీ ఫైనల్ లో భారత అభిమానులంతా దక్షిణాఫ్రికాకు ఔట్ రైట్ మద్దతు ఇచ్చారు. సరే ఆ సెమీ ఫైనల్ లో దక్షిణాఫ్రికా పరాజయం పాలై ఆస్ట్రేలియా ఫైనల్ లో భారత్ తో తలపడడానికి రెడీ  అయిపోయింది. ప్రస్తుతం ఇరు జట్ల బలాబలాలూ, ఆటగాళ్ల ఫామ్ చూస్తే రెండు జట్ల మధ్యా పోరు హోరాహోరీ గా ఉండటం తథ్యమని, అయితే  టోర్నీ ఆద్యంతం భారత్ బ్యాటింగ్, బౌలింగ్ గమనిస్తే.. హాట్ ఫేవరెట్ భారత్ అనే ఎవరైనా చెబుతారు.  కానీ 2003 వరల్డ్ కప్ ఫైనల్ లో టీమ్ ఇండియా ఓటమి ఇప్పటికీ భారత అభిమానులను ఓ పీడకలలా వెంటాడుతూనే ఉంది. ఆ ఫైనల్ లో రికీపాంటింగ్ సారథ్యంలోని కంగారుల   జట్ల టీమ్ ఇండియా   125 పరుగుల తేడాతో ఓడించి.. విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఆస్ట్రేలియా పప్పులు ఉడకవనీ, మైండ్ గేమ్ తో భారత ఆటగాళ్ల మనోస్థైర్యాన్ని ఆ జట్టు దెబ్బతీయలేదని టీమ్ ఇండియా మాజీలు ధీమాగా చెబుతున్నారు. సెమీస్ లో న్యూజిలాండ్ పై గత ఓటములను పూర్తిగా మరచిపోయేలా టీమ్ ఇండియా ప్రదర్శన ఉందని వారు చెబుతున్నారు.  కూడా 2003 లో వరల్డ్ కప్  ఫైనల్ లో ఓటమికి 2023 వరల్డ్ కప్ ఫైనల్ లో టీమ్ ఇండియా అద్భుత విజయంతో రివెంజ్ తీర్చుకోవడం ఖాయమని అంటున్నారు.  2003లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత్.. రికీ పాంటింగ్ సారథ్యంలోని ఆస్ట్రేలియాతో తలపడింది. అప్పట్లో ఏకంగా 125 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. అయితే, ఈసారి భారత్ తనని తాను దుర్భేద్యమైన జట్టుగా నిరూపించుకుంది. ఆడిన మ్యాచ్‌లన్నీ గెలిచిన టీమిండియా చెన్నైలో జరిగిన మ్యాచ్‌లోనూ కమ్మింగ్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియాను 6 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. కాబట్టి, ఈసారి ఆసిస్ ఆటలు సాగవని అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు.

ఎపికి తుఫాను గండం తప్పినట్టే

 బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. దీనికి మిధిలీ అని నామకరణం చేశారు. మాల్దీవులు సూచించిన మేరకు ఈ పేరు పెట్టారు. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఈ తుపాను ఒడిశాలోని పరదీప్ కు దక్షిణ ఆగ్నేయంగా 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఏమాత్రం ఉండబోదని ఐఎండీ తెలిపింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ల వైపు మళ్లడంతో రాష్ట్రానికి తుపాను ముప్పు తప్పినట్టయింది. అయితే రానున్న రెండు రోజులు సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు మరో ద్రోణి కొనసాగుతోంది. దీని ఫలితంగా రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు గాని, జల్లులు గాని కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ  తెలిపింది.గంటకు 20 కి.మీ వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఈ తుపాను రేపు (నవంబరు 18) తెల్లవారుజామున బంగ్లాదేశ్ తీరంలోని ఖెపుపారా వద్ద తీరం దాటనుంది. ఇది భూభాగంపైకి ప్రవేశించే సమయంలో బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో గంటకు 80 కి.మీ పైగా వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 

నీకో దణ్ణం.. నీ పార్టీకో దణ్ణం..తానేటి వనితకు నిరసన సెగ

ఏపీ హోం మంత్రి తానేటి వనితను ప్రజలు, సొంత పార్టీ కార్యకర్తలే అడ్డుకున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మంత్రిని గంటన్నర పాటు నడిరోడ్డుపైనే నిలబెట్టి వెనుదిరిగి వెళ్లిపొమ్మన్నారు. హోంమంత్రి కదా.. భారీ సంఖ్యలో పోలీసులను రప్పించుకుని  లైన్ క్లియర్ చేయించుకున్నారు. దీంతో  ఆమె తీరు పట్ల మరింత ఆగ్రహం వ్యక్తం అయ్యింది. మా ఊరికి వచ్చి మమ్మల్నే అడ్డుకుంటారా అంటూ ప్రజలు తిరగబడ్డారు. చివరికి వైసీపీ మండల స్థాయి నేతలు, గ్రామ నేతలు ప్రజలకు నచ్చజెప్పడంతో మంత్రి వనిత బాధితుడిని పరామర్శించి సాయం చెక్కును అందించి, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం హామీ ఇచ్చి అక్కడ నుండి వెనుదిరిగారు. బాధితుడి చావుకు ప్రభుత్వం, పోలీసులే కావడం, స్వయంగా హోంమంత్రి అలసత్వం కారణంగానే బాధితుడు మరణించడంతో సొంత పార్టీ కార్యకర్తలలో కూడా ఆగ్రహం పెల్లుబికింది. ప్రజలైతే ఏకంగా మంత్రిపై తిరగబడ్డారు. మీ పరామర్శ మాకు అవసరం లేదంటూ గో బ్యాక్ నినాదాలిచ్చారు. మనుషుల్ని చంపేసి ఓదార్పు యాత్రకు వచ్చారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  మీరూ వద్దు.. మీ ప్రభుత్వం వద్దు.. మీకో నమస్కారం.. మీ పార్టీకో నమస్కారం అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల ఆరున  కొవ్వూరు నియోజకవర్గం దొమ్మేరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. నిర్వహించారు. దీనికి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమం సందర్భంగా స్థానిక వైసీపీ నేతలు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఒక దానిలో స్థానిక నాయకుల ఫోటోల్ని చించేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు అందగా.. మహేందర్ అనే దళిత యువకుడిని అరెస్ట్ చేసి పోలీసులు హింసించారు. మహేందర్ వైసీపీ కార్యకర్త అవ్వడమే కాకుండా హోంమంత్రి తానేటి వనిత కోసం కూడా  పనిచేశాడు. కానీ, ఫ్లెక్సీల గొడవ వ్యవహారంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అతన్ని చితకబాదారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసిన సమయంలోనే మహేందర్ తానేటి వనితకు ఫోన్ చేయగా.. నిన్నేం చేయరు పంపించేస్తార్లే అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారట. చిత్రహింసల అనంతరం పోలీసులు అతడ్ని విడిచి పెట్టారు. స్టేషన్ నుండి ఇంటికి వచ్చిన మహేందర్ అవమానభారంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఇది ఒకరకంగా పోలీసుల హత్యే,  ముఖ్యంగా హోంమంత్రి విజయం కోసం పనిచేసి, హోంమంత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషిచేసిన దళిత సామజిక వర్గానికి చెందిన కార్యకర్తను పోలీసులే చిత్రహింసలు పెట్టి చంపేశారు. తనకు సాయం చేయాలని కోరుతూ మంత్రికి ఫోన్ చేసినా ఆమె నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఓ నిండు ప్రాణం పోయింది.  దీనిని స్థానిక ప్రజలు, వైసీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. స్థానికంగా పార్టీలో ఉన్న ఆధిపత్య పోరు ఫ్లెక్సీల వివాదానికి దారితీయడం..  పోలీసులు అత్యుత్సాహంతో ఓ కార్యకర్త కన్నుమూశాడు. హోంమంత్రి సొంత నియోజకవర్గం కావడంతో ఈ విషయం రాష్ట్రస్థాయిలో  సంచలనం సృష్టించింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించి పరిహారం చెక్కులు అందించేందుకు మంత్రి వెళ్లడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రజలు మంత్రిని రానివ్వకుండా అడ్డుకోవడంతో మంత్రి రోడ్డుపైనే గంటన్నర వేచిచూడాల్సి వచ్చింది.  మంత్రి ఏది ఏమైనా పరామర్శించే వెళ్తానని భీష్మించుకోవడంతో స్థానిక ప్రజలు మంత్రిని చుట్టుముట్టి ముందుకు కదలనీయకుండా చేశారు. అదే సమయంలో స్థానిక తెలుగుదేశం దళిత నేతలతో పాటు నియోజకవర్గం వ్యాప్తంగా పలువురు టీడీపీ నేతలను  హౌస్ అరెస్ట్ చేశారు. అనంతరం భారీ ఎత్తున పోలీసులు రంగంలోకి దిగడం, స్థానిక వైసీపీ నేతలు కల్పించుకొని బాధిత కుటుంబాన్ని ఒప్పించి మంత్రిని కలిసేలా చేశారు. దీంతో తాను తీసుకొచ్చిన పరిహారం చెక్కు  బాధితుడి కుటుంబానికి అందజేసి.. వారి ఫ్యామిలీలో ఒకరికి ఉద్యోగం ఇస్తానన్న హామీ ఇచ్చి వెనుదిరిగారు. దీంతో ఈ వ్యవహారం ఉభయగోదావరి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. దళిత యువకుడిని పోలీసులే హింసపెట్టి చంపడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతుండగా.. ప్రశ్నిస్తున్న వారిని ఎక్కడిక్కడ నిర్బంధించడం వివాదాస్పదమౌతోంది.