రోడ్లు కావాలంటే పింఛన్ వదిలేయాలా?.. వైసీపీ అదే చెబుతోందా?
posted on Nov 25, 2023 @ 12:51PM
ఏపీలో రహదారులపై తిరిగితే వాహనాలు షెడ్డుకి వెళ్లడమే కాదు.. ప్రజలు కూడా ఆసుపత్రుల పాలవుతున్నారు. అసలు రోడ్డు ఏదో కాలువ ఏదో తెలియని చందంగా తయారైన రోడ్లతో నిత్యం ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఆ రోడ్లపై తిరిగి ఒళ్లు హూనం చేసుకోవడమే కాకుండా, తమ వాహనాలు పాడైపోతూ జేబుకు చిల్లులు పడుతున్నాయనీ, ఆ రోడ్లపై ప్రయాణం దినదిన గండంగా మారిందనీ ప్రజలంతా కోడై కూస్తున్నా జగన్ సర్కార్ పట్టించుకోవడం లేదు. అద్దంలా మెరిసిపోయే రోడ్లు త్వరలోనే వస్తాయంటూ ప్రకటనలు మాత్రం గత నాలుగున్నరేళ్లుగా ఇస్తూనే ఉంది. ఆ ప్రకటనలు ప్రకటనలుగానే ఉండిపోతున్నారు.
గత నాలుగున్నరేళ్లలో సీఎం జగన్ ఇదే అంశంపై డజనుకు పైగా సమావేశాలు నిర్వహించారు. సమావేశం నిర్వహించిన ప్రతిసారి రోడ్ల మరమత్తుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయా శాఖలకు ఆదేశాలిచ్చేస్తారు. ఆయన ఇచ్చిన ఆదేశాలు ఉత్తుత్తివేనని అధికారులకు ముందే తెలుసా, లేక జగన్ ఆదేశాలను పట్టించుకోనవసరం లేదని భావిస్తున్నారా తెలియదు కానీ రోడ్ల పరిస్థితి మాత్రం ఇసుమంతైనా మారలేదు. ప్రతిపక్షాలు ఇదే అంశంపై గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చెరువులను తలపిస్తున్న రోడ్లపై వరినాట్లు వేసి ప్రజలు నిరసనలు తెలిపినా ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టలేదు.
అయితే ఇప్పుడు ఏపీలో ఎన్నికలకు సమయం. విశ్వసనీయ సమాచారం మేరకు వచ్చే ఏడాది మార్చి 6న ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరిలోనే వెలువడుతుందంటున్నారు. అంటే నిండా నాలుగు నెలల సమయం కూడా పూర్తిగా లేదు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు మళ్ళీ ప్రజల మధ్యకి వెళ్లాల్సిన అనివార్య పరిస్థితి. అలా వెడితే ఎక్కడికక్కడ ప్రజల నుండి రోడ్ల దుస్థితిపై నిరసన వ్యక్తమవుతుంది. ఇప్పటికే వైసీపీ నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం, సామాజిక సాధికార యాత్రలలో కూడా ప్రజలు ఈ విషయంపైనే అధికార పార్టీ నేతలను నిలదీస్తున్నారు. ఎక్కడ ఏ మంత్రి కనిపించినా, వైసీపీ ఎమ్మెల్యే కనిపించినా ప్రజలు అసలు తమ రోడ్లను బాగు చేయరెందకని ప్రశ్నిస్తున్నారు. దీంతో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలపైనే ఎదురు దాడి చేస్తున్నారు. అన్నీ కావాలంటే ఎలా.. ఏదో ఒక పథకం పేరుతో మీ ఖాతాలలో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తున్నది కదా.. మళ్ళీ రోడ్లు కావాలంటే డబ్బులు ఎక్కడ నుండి తేవాలని తిరిగి ప్రజలనే ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఓ వైసీపీ ఎమ్మెల్యే కూడా తమ గ్రామానికి రోడ్లు మరమ్మతులు చేయాలని కోరిన ప్రజలకు షాక్ ఇచ్చేలా సమాధానం చెప్పారు. మీకు రోడ్డు కావాలంటే మీ గ్రామానికి వచ్చే పింఛన్ వదిలేయండి.. ఆ డబ్బుతో మరమ్మతులు చేస్తామని ప్రజలు అవాక్కయ్యేలా సమాధానం చెప్పారు.
తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి తమ నియోజకవర్గ ప్రజలు రోడ్లు మరమ్మతు చేయాలని అడిగారని ప్రజలపైనే మాటలతో ఎదరు దాడి చేశారు. అధ్వానంగా మారిన తమ గ్రామ రహదారిని బాగు చేయాలని తనకల్లు మండలం చిన్నరామన్న గారిపల్లి వాసులు ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీరు అడిగిన రోడ్లు అలానే వేస్తాం కానీ.. నేను ఒకటి చెప్తా చేస్తారా అంటూ ఆయన చెప్పిన మాటలు విని గ్రామస్థులు అవాక్కయ్యారు. మన కదిరి నియోజకవర్గంలో ప్రతినెల పింఛన్ల కోసం రూ.15 కోట్లు పంపిణీ చేస్తున్నాం.. వాటిని ఆపేస్తే రోడ్లన్నీ అద్దంలా చేయొచ్చన్నారు. మరి మీరంతా పింఛన్లు తీసుకోవడం మానేస్తారా? మీరు అడిగినట్లే రోడ్లు వేయిస్తానని వ్యాఖ్యానించారు. దీంతో రోడ్డు కావాలని వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన గ్రామస్తులు నివ్వెరపోయారు. పింఛన్ కావాలా.. రోడ్లు కావాలా తేల్చుకోవాలని ఎమ్మెల్యే చెప్పడంతో చేసేదేమీ లేక ప్రజలు వెనుదిరిగారు.
ఇప్పుడు ఈ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ఒక్కరే కాదు.. ఇంతకు ముందు ఇలాగే చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అయితే ఏకంగా ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఫైర్ అయ్యారు. ప్రజలకు ఓట్లకు డబ్బులిచ్చా.. ఇప్పుడు అది కావాలి ఇది కావాలి అంటే మా పెళ్ళాల పుస్తెల తాడు తాకట్టు పెట్టి మీకు చేయాలా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలే కాదు మంత్రులు సైతం ఇదే విధంగా మాట్లాడుతున్నారు. సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ పథకాలపైనే మా దృష్టంతా అందని.. అందుకే అభివృద్ధి పనులు ఆలస్యమ వుతున్నాయని కుండబద్దలు కొట్టేశారు. ఇక ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అయితే ఏకంగా అసెంబ్లీలోనే మా ప్రభుత్వ ప్రాధాన్యత సంక్షేమం మాత్రమేనని, అభివృద్ధి మా అజెండాలోనే లేదన్న ట్లుగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను బట్టిచూస్తే జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కేవలం బటన్ నొక్కుడుకి మాత్రమే పరిమితమైందని.. రోడ్లు, కంపెనీలు, ఉద్యోగాలు, ఉపాధి, అభివృద్ధి లాంటివి ప్రభుత్వం పట్టించుకోదనీ చెప్పేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు రోడ్లు అడిగిన ప్రజలనే తప్పు బట్టడానికి కారణమదేనని అంటున్నారు.