ప్రియాంకసభలో ‘దేశం’ జెండాలు
posted on Nov 25, 2023 @ 2:35PM
ఖమ్మం రూరల్ మండలం పెద్దతండ వద్ద ప్రియాంక గాంధీ రోడ్ షో విజయవంతంగా జరిగింది. అశేష ప్రజానీకం ప్రియాంకకు ఘనస్వాగతం పలికింది. పాలేరు నియోజకవర్గం పెద్ద తండా వద్ద జరిగిన బహిరంగ సభలో ప్రియాంక తెలుగులో మాట్లాడారు. మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలి అంటూ పదే పదే తెలుగులో ప్రసంగించారు. జై తెలంగాణ అంటూ తెలుగులో నినదించారు.
ప్రియాంక స్పీచ్ ఇదే...
‘‘మీరు చూపించిన అభిమానానికి ధన్యవాదాలు. కేసీఆర్ మీకు ఉద్యోగాలు ఇచ్చాడా. కేసీఆర్ కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చాయి. మీకు ఉద్యోగాలు కావాలా?. బీఆర్‌ఎస్‌ను తప్పించండి మీకు ఉద్యోగాలు కావాలంటే కాంగ్రెస్‌ను గెలిపించండి. తెలంగాణ రాష్ట్ర రైతులు, ఆడబిడ్డలు, యువత ఈ రాష్ట్రాన్ని తెచ్చుకుంది. మీ అందరికీ ఒక కల ఉంది ఆ కల నెరవేరాలంటే కాంగ్రెస్‌ను గెలిపించండి. 10 సంవత్సరాల నుంచి బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణను భ్రష్టు పట్టించింది. ఎక్కడెక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అక్కడ ఉద్యోగాలు వచ్చాయి... ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారు. మీరందరూ ఎలాంటి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలంటే అందరికీ ఉద్యోగాలు, ఇళ్ళు, వచ్చే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి. అలాంటి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటే రైతుల రుణాలు మాఫీ అవుతాయి. శక్తివంతమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మిమ్మల్ని కోరుతున్నా. భారీ మెజారిటీతో వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి. పొంగులేటి శ్రీనివాస రెడ్డిని , తుమ్మల నాగేశ్వరరావును, భట్టి విక్రమార్కను భారీ మెజారిటీతో గెలిపించండి’’ అని ప్రజలను ప్రియాంక కోరారు.
ఇదిలా వుండగా కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆమె ప్రచారానికి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు తరలివచ్చాయి. అదేదో నాలుగైదు జెండాలు కాదు… కాంగ్రెస్ జెండాలను డామినేట్ చేసేలా పసుపు జెండాలు ప్రత్యక్షమయ్యాయి. డ్యాన్సులు వేస్తూ టిడిపి శ్రేణులు సందడి చేశాయి. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు నామినేషన్ వేసిన రోజు నుంచే బహిరంగంగానే టీడీపీ మద్దతు కోరుతున్నారు. టిడిపి ఆవిర్బావం నుంచి ఉన్న తుమ్మల ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష నెరవేరడానికి కెసీఆర్ వెంటే ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు కాకుండా అవకాశవాదులకు బిఆర్ఎస్ టికెట్లు ఇవ్వడంతో ఆయన ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి ఆయన మద్దత్తుదారులు తనకు రాజకీయ జన్మనిచ్చింది ఎన్టీఆర్ అని.. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను అని స్టేట్ మెంట్ ఇస్తున్నారు. కాగా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని టీడీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా కానీ టీడీపీ శ్రేణులు మాత్రం పలు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దుతుగా ర్యాలీలు, సభల్లో పాల్గొంటున్నారు. ఒకప్పుడు టిడిపిలో క్రియాశీలకంగా పని చేసిన తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కామారెడ్డి, కొడంగల్ నియోజక వర్గాల్లో కూడా టిడిపి శ్రేణులు రేవంత్ కు సపోర్ట్ చేస్తూ ప్రచారం చేస్తున్నాయి.