బాబు కోసం బీజేపీ తీర్మానం
posted on Nov 26, 2023 7:38AM
స్కిల్ కేసులో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ సక్రమమేనంటూ ఏపీలో అధికార జగన్ పార్టీ బల్ల గుద్దీ మరీ చెబుతుంటే.. ఆయన అరెస్ట్ అక్రమమంటూ తెలుగుదేశం ఆధారాలతో సహా గట్టిగా చెబుతోంది. సెప్టెంబర్ 9న నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ అయిన నాటి నుంచి ఆయన హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసే దాకా.. అటు అధికార... ఇటు ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య చంద్రబాబు అరెస్ట్ అంశంపై తారస్థాయిలో వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా, ఆయనకు సంఘీభావంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. కోర్టులలో సుదీర్ఘ వాదోపవాదాలు జరిగాయి. ఇక చంద్రబాబు అరెస్టును ఏపీ బీజేపీ అధ్యక్షురాలు వెంటనే ఖండించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని జగన్ సర్కార్ ను నిలదీశారు.
అయితే కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ మాత్రం చంద్రబాబు అరెస్ట్‌పై పార్టీ పరంగా ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవు. అలాంటి వేళ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన దాదాపు 70 రోజుల తర్వాత.. ఇప్పుడు బీజేపీ తాపీగా స్పందించింది. చంద్రబాబు జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసినప్పుడు కిమ్మనని బీజేపీ, రాజమహేంద్రవరం జైల్లో ఆయన ఆనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు మాట్లాడని బీజేపీ, హస్తిన వేదికగా చంద్రబాబు బెయిల్ కోసం ఆయన కుమారుడు, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ న్యాయవాదులతో వరుస చర్చలు జరుపుతున్నప్పుడు మౌనంగా ఉన్నా బీజేపీ.. ఇప్పడు ఇంత హాఠాత్తుగా అది కూడా చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన మరునాడే.. స్పందించడంపై రాజకీయ వర్గాలలో విస్మయం వ్యక్తం కావడమే కాకుండా, విస్తృతంగా చర్చ కూడా జరుగుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ బీజేపీ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.
అయితే చంద్రబాబు అరెస్ట్‌పై కమలం పార్టీ తీర్మానం చేయడం వెనుక కేంద్రంలోని పార్టీ పెద్దల హస్తం ఉందన్న ప్రచారం అయితో జోరుగా సాగుతోంది. ఏపీలో వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకుని పోటీలో దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ పొత్తు విషయాన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ అయిన తర్వాత నారా లోకేశ్, నందమూరి బాలకృష్ణ సమక్షంలో జనసేనాని పవన్ కల్యాణ్ స్వయంగా ప్రకటించారు. అప్పటి నుంచీ ఇరు పార్టీలూ కూడా రాష్ట్రంలో సమన్వయంతో పని చేస్తున్నాయి.
అదలా ఉండగా ఏపీలో తాము జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్తామంటూ ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రకటించారు. ఇదే అంశాన్ని ఆ పార్టీ కీలక నేత సునీల్ దియోధర్ మొదటి నుంచీ చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాబు అరెస్టును ఖండిస్తూ బీజేపీ తీర్మానం చేయడమంటే.. ఏపీ ఎన్నికలలో ఆ పార్టీలతో జతకట్టేందుకే బీజేపీ ఈ తీర్మానం చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అన్నిటి కంటే ముఖ్యంగా తెలంగాణలో అధికారమే తరువాయి అన్న స్థాయి నుంచి బీజేపీ కిందకు దిగజారింది. దీంతో తెలంగాణలో అధికార రేసులో బీజేపీ వెనుకబడి అక్కడ పోటీ అధికార బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య ముఖాముఖీ పోరుగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో కనీసం ఒక శాతం ఓటు స్టేకు కూడా లేని బీజేపీ ఒంటరి పోరుకు సిద్ధపడే పరిస్థితి లేదనీ పరిశీలకులు అంటున్నారు.
ఇక గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్న సమయంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు చేస్తూ బీజేపీ కొద్దో గొప్పో ప్రజాక్షేత్రంలో కనిపించేది. అయితే ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియమితులైన తరువాత రాష్ట్రంలో పార్టీ దాదాపు స్తబ్దుగా మారిపోయింది. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ అధ్యక్షుడి హోదాలో సోము వీర్రాజు ఒక్క మాట మాట్లాడింది లేదు... అలాంటి వేళ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరికి బీజేపీ అధిష్ఠనం పగ్గాలు అప్పగించింది. ఆమె జగన్ పార్టీ అరాచకాలపై, ప్రభుత్వ అవకతకకలపై క్షేత్ర స్థాయిలో పోరాటం చేస్తున్నారు. ఆ క్రమంలో ఆమెనే లక్ష్యంగా చేసుకుని వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా అనుచిత వ్యాఖ్యలతో పోస్టింగులు పెడుతున్నారు. అయితే వాటికి ఏ మాత్రం వెరవక పురందేశ్వరి తనదైన శైలిలో పోరాటం చేస్తున్నారు. అలాగే తెలుగుదేశంలో ఏదో ఒక మేరకు పుంజుకోవాలంటే కూడా చంద్రబాబు అరెస్టును ఖండించకతప్పదని బీజేపీ అగ్రనాయకత్వం భావించింది. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఏపీ బీజేపీ తీర్మానం అటు తెలంగాణలోనూ పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పరిచే అవకాశం ఉందని తలపోసింది. అంతే కాకుండా ఏపీ ఎన్నికలలో తెలుగుదేశం, జనసేనలతో పొత్తుకు కూడా సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుందన్న యోచనతోనే ఒంగోలులో సమావేశం ఏర్పాటు చేసి.. బాబు అరెస్టును ఖండిస్తూ తీర్మానం చేశారనే ఓ చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.
ఇక ఏపీలో తెలుగుదేశం, జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లడం వల్ల 2014 నాటి ఎన్నికల ఫలితాల కంటే మరింత మెరుగైన ఫలితాలు వెలువడే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న భావనతోనే బీజేపీ ఈ మేరకు తీర్మానం చేసిందని అంటున్నారు.