బాబు, పవన్ ఉమ్మడి సభలు.. లోకేష్, భువనేశ్వరి యాత్రలు! వైసీపీ ఇక ఉక్కిరిబిక్కిరే
posted on Nov 25, 2023 @ 1:42PM
ఏపీలో ప్రతిపక్ష తెలుగుదేశం యాక్టివ్ అవుతోంది. అలాగే జనసేన కూడా తెలుగుదేశంతో కలిసి సూపర్ యాక్టివ్ మోడ్ లోకి రాబోతోంది. దాదాపు వంద రోజుల పాటు ప్రజల మధ్యనే ఉంటూ.. ప్రభుత్వంపై దండయాత్రకు తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే రెండు పార్టీలు నియమించుకున్న సమన్వయ కమిటీలు చర్చించి మినీ మ్యానిఫెస్టోను రెడీ చేయగా.. ఇప్పుడు ఆ ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలతో ఉమ్మడి సభలు, యాత్రలకు సిద్ధమవుతున్నాయి. స్కిల్ కేసులో జగన్ ప్రభుత్వం తెలుగుదేశం అధినేత చంద్రబాబును అక్రమ అరెస్టు కారణంగా ఆయన మూడు నెలల నుండి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో ఈ నెలాఖరు నుండి మళ్ళీ ప్రజల మధ్యకు రానున్నారు. మరోవైపు చంద్రబాబు అరెస్టుతో తాత్కాలికంగా ఆగిన యువగళం పాదయాత్రను నారా లోకేష్ మొదలు పెట్టనున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా ఈసారి ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరించనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఒకవైపు వారాహీ యాత్ర చేపడుతూనే మరోవైపు చంద్రబాబుతో కలిసి బహిరంగ సభలలో వేదిక పంచుకోనున్నారు.
మూడు నెలల తర్వాత మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టాలని భావిస్తున్న చంద్రబాబు.. ఈ ఎంట్రీ గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల ఉమ్మడి బహిరంగ సభతో చంద్రబాబు రీఎంట్రీ ఏపీలో రాజకీయ సంచలన వేదిక అవుతుందని చెబుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సహా తెలుగుదేశం ముఖ్యనేతలు, జనసేన ప్రముఖులు కూడా ఈ సభకు హాజరయ్యేలా.. ఈ సభతో రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన వర్గాలు వందకు వంద శాతం కలిసి కట్టుగా పనిచేస్తాయన్న, చేస్తున్నాయన్న సంకేతం ఇవ్వనున్నాయిని ఇరు పార్టీల శ్రేణులూ బలంగా చెబుతున్నాయి. ముందుగా దాదాపు పది లక్షల మందితో ఒక భారీ బహిరంగ సభతో మొదలు పెట్టనున్న ఈ ప్రతిపక్షాల ప్రజా పోరులో మొత్తం మూడు సభలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఈ సభల నుండే ఉమ్మడి మేనిఫెస్టోను కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తుండగా.. సూపర్ టెన్ పథకాలతో మేనిఫెస్టో పై విస్తృత ప్రచారానికి రెండు పార్టీలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం యాక్షన్ ప్లాన్ సిద్దమవుతున్నట్లు చెప్తున్నారు.
మరోవైపు నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఈనెల 27న ప్రారంభం కానుంది. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో కార్తీక సోమవారం పర్వదినాన ఉదయం 10: 27 నిమిషాలకు లోకేష్ యువగళం పాదయాత్రను ఎక్కడ తాత్కాలికంగా ఆగిందో అక్కడి నుంచే ప్రారంభించనున్నారు. డిసెంబర్ నెలాఖరుకు యాత్ర పూర్తి చేయాలని లోకేష్ భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ తయారు చేసే పనిలో టిడిపి నాయకులు ఉన్నారు. అలాగే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా సంఘీభావ యాత్ర పేరుతో డిసెంబర్ మొదటి వారంలో ప్రజాక్షేత్రంలో కి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తున్నది. నిజం గెలవాలి పేరిట చంద్రబాబు అరెస్టు కారణంగా మనస్తాపం చెంది మరణించిన అభిమానుల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారు. ఇప్పటికే ఆమె పర్యటనలకు సంబంధించి రూట్ మ్యాప్ కూడా సిద్ధం అయ్యిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వారానికి మూడు రోజులపాటు భువనేశ్వరి పర్యటనలు కొనసాగే విధంగా ప్రణాళిక సిద్ధమైందని తెలుస్తోంది.
మొత్తంగా తెలుగుదేశం, జనసేన ఉమ్మడి కార్యాచరణకు తోడు టీడీపీ నేతల యాత్రలు కూడా ఆరంభం కానుండటంతో పార్టీ శ్రేణులలో ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తున్నది. ఒకవైపు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే బహిరంగ సభల ద్వారా ఎన్నికల ప్రచారం మొదలు పెట్టడం అన్నది వ్యూహంగా కనిపిస్తోంది. అసలే ప్రభుత్వంపై ప్రజలలో అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉంది. చంద్రబాబు అక్రమ అరెస్టుతొ అది ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగింది. అధికారపార్టీపై ప్రజలలో పెల్లుబుకుతున్న ఆగ్రహం, అసంతృప్తిని తెలుగుదేశంకు రాజకీయంగా బ్రహ్మాస్త్రంగా మలుచుకోవడంతో పాటు జగన్ సర్కార్ పాలనను ఎండగట్టడమే పనిగా ఇప్పుడు ప్రతిపక్షాలు సభలు, యాత్రలతో జనంలోకి రానున్నాయి. ఇక వైపీపీలో ఇప్పుడు తీవ్ర నిరాశా నిస్ఫృహలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ చేపట్టిన కార్యక్రమాలకు జనం సంగతి పక్కన పెడితే కార్యకర్తలే మొహం చాటేస్తున్నారు. ఇప్పటికే పరిస్థితి చేయి దాటిపోయిందన్న సర్వేలతో వైసీపీ పెద్దలలో గాభరా మొదలైంది. ఇలాంటి సమయంలో ప్రతిపక్షాల ఉమ్మడి పోరాటం వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేసి గుక్క తిప్పుకోనీయకుండా చేయడం తథ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.