సొంత చెల్లికి అన్యాయం చేసి.. అక్కచెల్లెమ్మలకు శుభాకాంక్షలా?
posted on Aug 9, 2025 @ 4:02PM
రాఖీ పూర్ణిమ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజలకు, మరీ ముఖ్యంగా అక్క చెల్లెమ్మలకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే రాఖీ పండుగ సందర్భంగా జగన్ రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలకు శుభాకాంక్షలు తెలపడాన్ని నెటి జనులు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలందరికీ శుభాకాంక్షలు అన్న జగన్ ట్వీట్ పై నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు. సొంత చెల్లెమ్మకు న్యాయం చేయలేని వాడు రాష్ట్రంలోని చెల్లెమ్మలకు శుభాకాంక్షలు చెప్పడమేంటంటూ ఎద్దేవా చేస్తున్నారు.
జగన్ అధికారం కోసం, అలాగే దోచుకున్న సొత్తు దాచుకోవడం కోసం చేస్తున్న మోసం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ తన సోదరి షర్మిలను దూరం పెట్టి, ఆమెకు రావలసిన ఆస్తులను ఇవ్వకుండా వేధిస్తున్నారని నెటిజనులు దుయ్యబడుతున్నారు. ఆస్తుల కోసం, వాటాల కోసం సొంత తల్లి, చెల్లిపైనే కేసు వేసిన మాజీ ముఖ్యమంత్రి రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలంతా సుఖంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు చెప్పడం విడ్డూరంగా ఉందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.