పులివెందులలో ఘర్షణ వాతావరణం.. అంతటా టెన్షన్ టెన్షన్

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ సాగుతోంది. మంగళవారం (ఆగస్టు 12) ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ కొనసాగుతుంది. పులివెందులలో 15, ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలను ఏరపాటు చేశారు. పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పులివెందులలో 15, ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దాదాపు 1500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాగా పులివెందుల, ఒంటిమిట్ట బరిలో 11 మంది చొప్పున అభ్యర్థులున్నారు. అయితే పోటీ మాత్రం తెలుగుదేశం, వైసీపీల మధ్యే ఉంది.   ముఖ్యంగా పోలింగ్ సందర్భంగా పులివెందులలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. ఎర్రిపల్లిలో గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులకు పాల్పడ్డారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు. కాగా పోలింగ్ ప్రారంభానికి కొద్ది సేపు ముందు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి కడప తరలించారు. అలాగే తెలుగుదేశం, వైసీపీలకు చెందిన కీలక నేతలను హౌస్ అరెస్టు చేశారు. మొత్తం మీద పులివెందులలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడేం జరుగుతుందా అన్నట్లుగా టెన్షన్ వాతావరణం ఉంది.  

తెలంగాణ బీజేపీ చీఫ్ హౌస్ అరెస్ట్.. ఎందుకంటే?

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావును పోలీసులు మంగళవారం (ఆగస్టు 12) హౌస్ అరెస్ట్ చేశారు. అసలింతకీ రామచందర్ రావును పోలీసులు ఎందుకు హౌస్ అరెస్టు చేశారంటే.. ఇటీవల జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద కూల్చివేతలపై హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. ఆ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం (ఆగస్టు 12) పెద్దమ్మగుడి వద్ద కుంకుమార్చనకు హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో మరోసారి ఉద్రిక్తతలు పెచ్చరిల్లే అవకాశం ఉందన్న భావనతో పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యగా ఆ కుంకుమార్చన కార్యక్రమానికి వెళ్లకుండా బీజేపీ తెలంగాణ చీఫ్ రామచందర్ రావును హౌస్ అరెస్టు చేశారు. ఇలా ఉండగా రామచందర్ రావు హౌస్ అరెస్టును బీజేపీ నేతలు ఖండించారు.ఇలా ఉండగా పెద్దమ్మగుడి వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.  

ప్రలోభాలు, బెదరింపులతో వైసీపీ స్వైర విహారం.. బీటెక్ రవి

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో విజయం కోసం వైసీపీ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు దాదాపు వంద కోట్లు ఖర్చు చేసిందని తెలుగుదేశం నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపించారు. వైసీపీ నేతలు ముక్కుపుడకలు, చీరలు పంపిణీ చేశారనీ, పోలింగ్ ప్రారంభమైన తరువాత కూడా ఈ పంపిణీ సాగుతోందని పేర్కొన్న ఆయన.. అవినీతి సొమ్మును జడ్పీటీసీ ఎన్నిక కోసం కుమ్మరిస్తున్నారని విమర్శించారు.   జగన్ మేనమామ, కమలాపురం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి పోలింగ్ సిబ్బందిని బెదిరించారనీ, వైసీపీకి అనుకూలంగా పని చయకపోతే అంతు చూస్తామంటూ హెచ్చరించానీ బీటెక్ రవి చెప్పారు.  ముందు ఓటర్లను ప్రలోభపెట్టారు. ఫలితం కనిపించకపోయే సరికి బెదరింపులకు దిగారని అన్నారు. మూడున్నర దశాబ్దాలలో పులివెందులలో తొలి సారిగా స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరుగుతన్నాయన్న ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే వైసీపీకి ఓట్లు రావన్న భయంతో ఇష్టారీతిగా తెలుగుదేశంపైనా, ప్రభుత్వంపైనా దుష్ప్రచారానికి ఒడిగడుతున్నారన్నారు.  అయితే పులివెందుల ప్రజలు అన్నీ గ్రహించారనీ, తెలుగుదేశంవైపే నిలిచారని బీటెక్ రవి అన్నారు.  

వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అదుపులోనికి తీసుకుని కడపకు తరలించారు.  అలాగే తెలుగుదేశం ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. అదే విధంగా వైసీపీ నేత సతీష్ రెడ్డిని కూడా హౌస్ అరెస్టు చేశారు.  పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా వైసీపీ, తెలుగుదేశం పార్టీలకు చెందిన నేతలను ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు చేశారు. పోలింగ్ ప్రారంభం కావడానికి కొద్ది సేపు ముందు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు ఆయనను కడపకు తరలించారు. అలాగే తెలుగుదేశం, వైసీపీకి చెందిన పలువురు నేతలను కూడా అరెస్టులు, హౌస్ అరెస్టులు చేశారు. పులివెందులలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు 144వ సెక్షన్ విధించారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు, ఓటర్లు తన ఓటు హక్కును నిర్భయంగా, స్వేచ్ఛగా వినియోగించేందుకు అనువైన వాతావరణం కల్పించినట్లు తెలిపారు.  పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నా ప్రధానంగా పులివెందుపైనే ప్రధాన పార్టీలు రెండూ దృష్టి సారించాయి. పులివెందుల మాజీ ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఇక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం కూటమి, వైసీపీ కూడా ఈ జడ్పీటీసీ స్థానాన్ని దక్కించుకోవడం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఇరు పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ప్రచార సమయంలోనే ఉద్రిక్తతలు పెచ్చరిల్లాయి. ఈ ఉప ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థిగా.. పులివెందుల నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి రంగంలో ఉండగా, వైసీపీ అభ్యర్థిగా  హేమంత్ రెడ్డి పోటీలో ఉన్నారు. వీరితో సహా మొత్తం 11 మంది బరిలో ఉన్నప్పటికీ పోటీ ప్రధానంగా తెలుగుదేశం, వైసీపీల మధ్యే ఉంది.  

పులివెందుల జడ్పీటీసీ ఉపపోరు ముందు వైసీపీకి బిగ్ షాక్

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్న పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ బూత్‌ల మార్పుపై జోక్యం చేసుకోవాలంటూ వైసీపీ నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం(ఆగస్టు 11) ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే.. ఈ ఉప ఎన్నికల్లో పోలింగ్ బూత్‌ల మార్పు విషయంలో జోక్యం చేసుకోబోమంటూ స్పష్టం చేసి వైసీపీకి షాక్ ఇచ్చింది.    జడ్పీటీసీ ఉప ఎన్నికలో  ఆరు పోలింగ్ బూత్‌లు మార్చాలంటూ గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తన పిటిషన్‌లో కోరారు. అయితే మరి కొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కానున్నదనీ, ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందంటూ ఈసీ తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు.  ఇరు పక్షాల వాదనలూ విన్న ఏపీ హైకోర్టు.. ప్రస్తుతం పోలింగ్ బూత్ ల మార్పు విషయంలో జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది. దీంతొ హైకోర్టులో వైసీపీకి చుక్కెదురైనట్లైంది.   ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందుల్లో జరగనున్న జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు జిల్లా ఉన్నతాధికారులు వెల్లడించారు. మండల కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లుతోపాటు ఇతర పోలింగ్ సామాగ్రి చేరుకుందని పేర్కొన్నారు.  మంగళవారం పులివెందుల జడ్పీటీసీ పరిధిలోని ఆరు గ్రామ పంచాయతీల పరిధిలోని 15 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది.  మొత్తం 10,601 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.  ఇక పులివెందుల జడ్పీటీసీ పరిథిలోని గ్రామాలు సమస్యాత్మకం కావడంతో.. దాదాపు 700 మందితో భద్రతా ఏర్పాట్లు చేసింది.  

పన్నులు తెలంగాణకు.. సమస్యల తలనొప్పులు ఏపీకీనా?

తెలుగు చిత్రపరిశ్రమ తీరు పట్ల ఏపీలో ఆగ్రహం  మీ ఇంటికొస్తే ఏమిస్తావ్.. మాయింటి కొస్తే ఏం తెస్తావ్ అన్నట్లుగా ఉంది తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దల తీరు. ఔను తెలుగు సినీ పరిశ్రమ తీరు అడ్డగోలుగా ఉంది. పన్నులన్నీ తెలంగాణ ప్రభుత్వానికి కడతాం.. మా సమస్యలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిష్కరించాలంటూ దబాయిస్తున్నట్లుగా కనిపిస్తోంది.  . ఉండేది తెలంగాణ రాజధానిలో ... టాక్స్ లు  కట్టేది అక్కడి ప్రభుత్వానికి, ఎనభై శాతం షూటింగ్ లు జరిపేది కూడా అక్కడే.  పనిచేసే కార్మికులు కూడా80 శాతం మంది తెలంగాణ వారే.  అక్కడ కార్మికులకు కడుపు కాలి ధర్నాలు చేస్తే.. ఏపీ సర్కార్ చర్చలు జరిపి పరిష్కరించాలని కోరుకుంటున్నారు.  అసలు తెలంగాణలో సినీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఏపీకి సండంధం ఏమిటి; ఆ తలనొప్పి ఏపీ ప్రభుత్వానికి ఎందుకు అంట గట్టాలని చూస్తున్నారు? అన్నది అర్థం కాని పరిస్థితి.   వాస్తవంలోకి వెళ్తే సినీ పరిశ్రమ మొత్తం హైదరాబాద్ లోనే ఉంది. సినిమా వాళ్ళంతా ఉండేది ,జూబ్లీహిల్స్ , బంజారాహిల్స్, మణికొండ తదితర ప్రాంతాల్లోనే.  నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు ,క్యారెక్టర్ ఆర్టిస్టులు  మొత్తం హైదరాబాద్ లోనే మకాం వేసి ఉన్నారు. కట్టే టాక్స్ లు కూడా ఎనభై శాతానికి పైగా  తెలంగాణ ప్రభుత్వానికే కడతారు. కానీ ఏదైనా సమస్య వస్తే మాత్రం పరిష్కారం కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వైపు చూస్తారు. అక్కడి సినీ పరిశ్రమకు కష్టం వస్తే..  హైదరాబాదులో సినీ కార్మికులు ధర్నాలు చేస్తుంటే..  ఏపీ ఈ వ్యవహారం పై  ఏపీ ప్రభుత్వం ఒకసారి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.  తాజాగా  సినీ పరిశ్రమంలో సంక్షోభాన్ని ఏపీ ప్రభుత్వానికి అంటగట్టాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే అంతా బాగున్నప్పుడు తెలంగాణలో  మకాం వేసి ఉంటారు?  ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రం ,ఏపీలోకి వచ్చి  హడావుడి చేసి వెళ్ళిపోతుంటారు.  ఇలాంటి వ్యవహార శైలి ఇటీవల కాలంలో సినీ పరిశ్రమ పెద్దలకు ఎక్కువైపోయింది. తాజాగా ఏపీ ప్రభుత్వం దగ్గరకు నిర్మాతల బృందం వచ్చింది. ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కావాలి..   మా సమస్యలు మొత్తం ఏకరువు పెట్టి తెలంగాణలో వచ్చిన సమస్య పరిష్కరించమని  కోరుకుంటామంటూ ఏపీ సినీమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్ ను కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.  తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తలెత్తిన సమస్య గురించి సీఎం దృష్టికీ, డిప్యూటీ సీఎం దృష్టికీ తీసుకువెడతానని హామీ ఇచ్చారు. అయితే అసలు ఎక్కడో హైదరాబాదులో జరుగుతున్న ధర్నాలు,సమ్మెల వ్యవహారానికి ఏపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తారు? అసలు ఏదైనా సరే ఎందుకు చేయాలి? అన్న ప్రశ్న తలెత్తుతోంది. అసలు తెలుగు సినీ పరిశ్రమ ఎప్పుడో ఒక సారి వారి అవసరాల కోసం విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రాంతాలలో షూటింగ్ లు జరుపుకుని వెళ్లిపోడం వినా.. ఇక్కడ మకాం వేయడం కానీ, ఇక్కడ స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు ఏమైనా నిర్మించడానికి కనీసం ప్రతిపాదలైనా చేశారా? అగ్ర హీరోల దగ్గర నుండి ,నిర్మాతల వరకూ మొత్తం హైదరాబాద్ లోనే..  సినిమా రీలీజుల సమయంలో మాత్రం  టికెట్ల రేట్లు పెంచి..  ఏపీ ప్రేక్షకుల జేబులకు చిల్లు పెడతాం అనుమతించండి అంటూ ఏపీ ప్రభుత్వాన్ని కోరడం వినా, వీరు ఏపీకి చేసిందేమిటి?  తమ నివాసాల దగ్గర నుంచి సినీమా వ్యవహారాలు, వ్యాపారాలూ అన్ని హైదరాబాద్ లో చేసుకుంటూ.. టాక్సులు కూడా అక్కడి ప్రభుత్వానికే కడుతూ.. మస్య రాగానే ఏపీ సర్కార్ వద్దకు పరుగులెత్తుకుంటూ వస్తారు.  సమస్య రాగానే ఏపీ, ఏపీ ముఖ్యమంత్రి గుర్తుకు వస్తారు.  . అటువంటి వారి పట్ల ఏపీ ప్రభుత్వం ఎందుకు సానుకూలతతో, సానుభూతితో ఉండాలి? ఎందుకు బాధ్యత తీసుకోవాలి అన్నదే ఇప్పుడు సగటు ఆంధ్రుడి ప్రశ్న. ఏదన్నా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు విరాళాలు ప్రకటించి... మొత్తం ఆంధ్రప్రదేశ్ ను ఆదుకున్నట్లు బిల్డప్ లు ఇవ్వడం తప్ప,  తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించినంత వరకూ ఏపీకి నయాపైసా ప్రయోజనం ఏముందని సగటు ఆంధ్రుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.   ఇలాంటి పరిస్థితుల్లో.. ఇప్పుడు సినీ పరిశ్రమలో తలెత్తిన సమస్య పరిష్కారం కోసం జోక్యం చేసుకునే విషయంలో  ఏపీ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేయాలి.    , సినీ పరిశ్రమ ఏపీకి  వచ్చే విధంగా,  ఏపీలో స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు నెలకొల్పే విధంగా షరతు విధించాలి. అలా కాకుండా పన్నులు కట్టేది తెలంగాణలో.. సమస్యలు పరిష్కారం అయ్యేది ఆంధ్రప్రదేశ్ లో అన్నట్లుగా వ్యవహరిస్తామంటే మాత్రం పరిశ్రమ సమస్యల విషయంలో ఏపీ ప్రభుత్వం  జోక్యం చేసుకోకుండా దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

పులివెందుల సమరం.. పీక్స్ కు చేరిన టెన్షన్లు

 పులివెందుల తీర్పు పై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం కావడానికి ఇక కొన్ని గంటలే ఉంది. ఈ నేపథ్యంలో పులివెందులలో పోలింగ్ హీట్ పీక్స్ కు చేరింది. పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉప ఎన్నిక ఫలితంపై పులివెందుల, కడప జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, ఆ మాటకొస్తే దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. ఏదో ఒక మండలానికి చెందిన ఎన్నికలా కాకుండా ఈ ఉప ఎన్నిక యుద్ధ వాతావరణాన్ని తలపించేంత ఉద్రిక్తత, ఉత్కంఠ రేపుతోంది. మంగళవారం (ఆగస్టు 12)   జరగనున్న ఈ ఉప పోరును తెలుగుదేశం కూటమి ,వైసీపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో రాజకీయం వేడెక్కింది.  ఇప్పటికే ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా దాడులు, ప్రతిదాడులు జరగడంతో ఇక పోలింగ్ ఇప్పటికే ప్రచార సందర్భంగా పోలింగ్ దాడులు జరగడం తో పోలింగ్ రోజున పరిస్థితి ఎలా ఉంటుందో అన్న భయాందోళనలు  వ్యక్తమౌతున్నాయి. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీస్ సైన్యం దిగితే... తమ ప్రాబల్యాన్ని చాటుకోవడానికి పార్టీలు ప్రైవేటు సైన్యాన్ని  దించారన్న ప్రచారం   ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో పులివెందులలో దౌర్జన్యానికి పై చేయి అవుతుందా? ప్రజాస్వామ్యానిదా? అన్న పరిస్థితి కనిపిస్తోంది.   ఇప్పటికే తెలుగుదేశం కూటమి, వైసిపి నేతలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.  ప్రచార ఘట్టంలోనే హింసాత్మక ఘటనలు జరగడంతో  పోలింగ్ ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  ఇదిలా ఉంటే పోలింగ్ రోజు తమకు అనుకూలంగా ఓటింగ్  జరుపుకునేందుకు బయట వ్యక్తులు పులివెందులకు చేరుకున్నారన్న ప్రచారంతో స్థానికులలో ఆందోళన వ్యక్తం అవుతోంది. పోలీసులు పోలింగ్ ముందు రోజు నుంచే కొత్త వ్యక్తులు పోలింగ్ జరిగే పులివెందులలో కానీ ఒంటిమిట్టలో కానీ ఉండకూడదని   హెచ్చరించారు.  ఇక ప్రలోభాల పర్వం కూడా పెద్ద ఎత్తున  సాగుతోందంటున్నారు.  పోటాపోటీగా, ప్రతిష్టాత్మకంగా మారిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నకలో ఓటు చాలా కాస్టీగా మారిపోయిందని పరిశీలకులు చెబుతున్నారు.  ఓటుకు పది వేల చొప్పున ఇస్తున్నారంటూ తెలుగుదేశం కూటమి, వైసీపీలు పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. ఒంటిమిట్టలో కూడా జడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ కూడా పులివెందుల స్థానం అంత కాకపోయినా.. ఓటుకు నోటు భారీగానే ఇస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తం రెండు  జట్పీసీలకు కలిపి..దాదాపు పాతిక కోట్ల పంపిణీ జరుగుతోందని అంచనా వేస్తున్నారు. జడ్పీటీసీ ఉప ఎన్నికలు ఇంత కాస్టీగా మారడం ఇదే ప్రథమం అంటున్నారు.  ఇక పులివెందుల బరిలో స్థానానికి వై.ఎస్.ఆర్.సి.పి అభ్యర్థిగా తుమ్మల హేమంత్ రెడ్డి, తెలుగుదేశంపార్టీ అభ్యర్థిగా  బిటెక్ రవి సతీమణి  లతారెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున అభ్యర్ధి రంగంలో ఉన్నారు. మరి కొందరు స్వతంత్రులు కూడా రంగంలో ఉన్నప్పటికీ పోటీ ప్రధానంగా తెలుగుదేశం, వైసీపీ అభ్యర్థుల మధ్యే ఉంది.  ఇక   ఒంటిమిట్ట జడ్.పి.టి.సి అభ్యర్థిగా వైసీపీ తరఫున ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, తెలుగుదేశంపార్టీ అభ్యర్థిగా ముద్దు కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయభాస్కర్ తో పాటు మరో 8 మంది స్వంతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక్కడా పోటీ ప్రధానంగా తెలుగుదేశం, వైసీపీల మధ్యే ఉంది.  

రాజధాని నిర్మాణానికి రూ. 2లక్షల 116లు విరాళం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఓ  వృద్దురాలు తన వంతుగా విరాళం అందజేశారు. నరసరావుపేటకు చెందిన కాసా నాగేంద్రమ్మ అనే వృద్ధురాలు రాజధాని అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకోవాలని ఆకాంక్షిస్తూ రెండు లక్షల నూట పదహారు రాపాయల విరాళం ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో సోమవారం (ఆగస్టు 11)న స్వయంగా కలిసి ఈ విరాళం చెక్కును అందించారు.  రాజధాని నిర్మాణానికి విరాళం అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సచివాలయంలో కలిసి రూ.2,00,116 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా నాగేంద్రమ్మకు   కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు ఆమెను అభినందించారు. రాష్ట్ర రాజధాని అత్యంత గొప్పగా చరిత్రలో నిలిచిపోయేలా నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో ఆబాట గోపాలం రాజధాని నిర్మాణం పట్ల ఎంతో ఉత్సాహంతో ఉన్నారనడానికి కాసా నాగేంధ్రమ్మ తన వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా సచివాలయం వరకూ వచ్చి విరాళం అందించడమే నిదర్శనమని చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు తదితరులు పాల్గొన్నారు.  

ఉభయ తెలుగు రాష్ట్రాల మంత్రులతో నిర్మాతల భేటీ.. ఎందుకంటే?

గత కొన్ని రోజులుగా చిత్ర పరిశ్రమలో అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. ఫిలిం ఛాంబర్‌, ఫిలిం ఫెడరేషన్‌ మధ్య వేతనాల సమస్య రోజురోజుకీ జటిలం అవుతోంది. పీట ముడులు పడుతోంది. దీనికి పరిష్కారం కోసం పలుమార్లు చర్చలు జరిగినా ఫలితం లేకపోయింది. దీంతో సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలను, రాజకీయనేతలను శరణుజొచ్చుతున్నారు నిర్మాతలు. ఉభయ తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫి మంత్రులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. సినీ పరిశ్రమ సమస్యలు, కార్మిలకు డిమాండ్ లు, ఆందోళనకు సంబంధించి వినతి పత్రాలు అందజేశారు. తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేష్ను నిర్మాతలు కలిశారు.   కాగా నిర్మాతలతో భేటీపై ఏపీ సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్  సినీ పరిశ్రమలో ప్రస్తుత పరిస్థితిని తెలియజేయడానికి కలుస్తామంటూ కొందరు నిర్మాతలు చెబితే రమ్మన్నాం.. అంతే తప్ప ఈ భేటీకి ప్రత్యేకమైన అజెండా ఏమీ లేదని తేల్చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సమస్యలకు సంబం ధించి నిర్మాతలు, కార్మికులు చెప్పే అంశాలను విని, వాటిని సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకు వెడతాం. వారి స్థాయిలోనే ఏం చేయాలన్న నిర్ణయం ఉంటుందని కందుల  చెప్పారు. అంతే కాకుండా   ఆంధ్రప్రదేశ్‌లో చలన చిత్ర పరిశ్రమ అభివృద్దికి కట్టుబడి ఉన్నాం. సినిమా నిర్మాణానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పనకు  కృషి చేస్తాం, రాష్ట్రంలో స్టూడియోలు, రీరికార్డింగ్‌ థియేటర్లు, డబ్బింగ్‌ థియేటర్లు నిర్మించేందుకు ముందుకు వస్తే ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని చెప్పారు. కాగా కందుల దుర్గేష్‌ను నిర్మాతలు బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కె.ఎల్‌.నారాయణ, డి.వి.వి.దానయ్య, రవిశంకర్‌, నాగవంశీ, భరత్‌, విశ్వప్రసాద్‌, చెర్రీ, సాహు గారపాటి, యువి క్రియేషన్స్‌ వంశీ, బన్నీ వాసు, వివేక్‌ కూచిభొట్ల తదితరులు  కలిశారు. ఇక తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని  ఎఫ్‌డిసి ఛైర్మన్‌ దిల్‌ రాజు, బాపినీడు, ఫిలిం ఛాంబర్‌ కార్యదర్శి దామోదర ప్రసాద్‌, సుప్రియ, జెమినీ కిరణ్‌ తదితరులు కలిశారు. 

ఎన్నికల జాప్యం.. పంచాయతీలకు శాపం !

ఆలస్యం అమృతం విషం ఈ నానుడి అతికినట్లు సరిపోయే సందర్భం ఏదైనా ఉందంటే  అది ఇదే.  తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఆలస్యం అయ్యే కొద్దీ..   కేంద్రం నుంచి పంచాయతీలకు రావసిన  కేంద్ర నిధులు  రాకుండా ఆగి పోతాయి. అంతే కాదు..  నిర్దిష్ట గడువు ముగిస్తే అవి మురిగి  పోతాయి కూడా.   అవును..  రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1992లో తెచ్చిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం.. ప్రజలచే ఎన్నుకోబడిన పంచాయతీలు కొలువు తీరి ఉన్నప్పడు మాత్రమే  పంచాయతీలకు  కేంద్ర నిధులు అందుతాయి. అయితే తెలంగాణలో గ్రామ పంచాయతీల గడువు 2024 జనవరిలోనే ముగిసింది. ఇక అక్కడి నుంచి  కారాణాలు ఏవైనా పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ముడి పడలేదు. ఈ కారణంగా ఇప్పటికే, కేంద్ర ప్రభుత్వం  2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రావలసిన రూ.1,550 కోట్లను రిలీజ్ చేయకుండా  విత్ హెల్డ్  లో పెట్టింది. అంటే..  నిధుల విడుదలను నిలుపుదల  చేసింది. అలాగే ప్రస్తుత   ఆర్థిక సంవత్సరానికి సంబందించి   రూ.1,450 కోట్లు కూడా విడుదల కాలేదు.  అంటే..  పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించక పోవడం వలన రాష్ట్రంలోని గ్రామ  పంచాయతీలు ఇంచుమించుగా రూ.3000 కోట్లు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.  మరో వంక నిధుల కొరతతో అల్లాడుతున్న గ్రామ పంచాయతీలకు ప్రాణప్రదంగా భావించే  కేంద్ర నిధుల విడుదల కావాలంటే..   స్థానిక సంస్థల ఎన్నికలు తక్షణం నిర్వహించడం మినహా మరో మార్గంలేదన్నది పంచాయతీరాజ్ శాఖ అధికారుల సమాచారం. మరోవంక..  స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30లోగా నిర్వహించాలని   హై కోర్టు గడువు విధించింది. ఈ అన్నిటినీ మించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్  కల్పించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని  బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే .. అంటూ రాజకీయ హెచ్చరికలు చేస్తున్నాయి. దీంతో  గండం నుంచి గట్టెక్కేదారి కనిపించక రేవంత్ రెడ్డి ప్రభుత్వం తికమక పడుతోంది. ఇతర అంశాలు ఎలా ఉన్నా..  రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు ఫేస్  చేస్తున్న తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా ముందు కేంద్ర గ్రాంట్స్ తెచ్చుకోవడం పై దృష్టి పెట్టాలి,  లేదంటే,  పంచాయతీల పరిస్థితి మరింత అధ్వాన స్థితికి దిగజారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినా, గత ఆర్థిక సంవత్సరానికి సంబందించిన రూ.1,550 కోట్లు విడుదల అవుతాయనే నమ్మకం లేదనీ, గడువు ముగిసిన గత సంవత్సరం నిదుల విడుదల పూర్తిగా కేంద్ర ప్రభుత్వం విచక్షణాదికార పరిధిలోకే వస్తుందనీ,  సో ..గత ఆర్థిక సంవత్సరానికి సంబందించిన రూ.1,550 కోట్లు విడుదల కేంద్రం దయ .. మన ప్రాప్తం అన్నట్లుగానే ఉంటుందని అధికారులు అంటున్నారు. అయితే..  గతంలో   ఎన్నికలు నిర్వహించిన వెంటనే విత్ హెల్డ్  లో పెట్టిన నిధులను విడుదల చేసిన అనుభవాల ఉన్నాయి కాబట్టి  ఎన్నికలు జరిగితే గత, ప్రస్తుత సంవత్సరాలకు సంబందించిన రూ. 3000 కోట్లు విడుదలవుతాయనే విశ్వాసాన్ని పంచాయతీ శాఖ అధికారాలు వ్యక్తం చేస్తున్నారు.   అలాగే.. ఈలోగా ఎన్నికలు జాప్యానికి కారణాలను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రనికి లేఖ రాస్తే, కేంద్ర నిధులు  విడుదల అవుతాయని  కొందరు అధికారులు అంటున్నారు  అయితే..  స్థానిక సంస్థల ఎన్నికల్లో  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశం రోజురోజుకూ మరింత జటిలం అవుతున్న నేపధ్యంలో, ఈ చిక్కు ముళ్ళు వీడి, పంచాయతీ ఎన్నికల జరగడం  ప్రస్తుత పరిస్థితిలో సాధ్యమేనా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

పాక్ అణుబాంబులు భ‌య‌పెట్ట‌డానికేనా?

సింధూన‌ది పై ప్రాజెక్టు క‌డితే అణుబాంబులేస్తానంటోంది పాక్. మొన్న‌టికి మొన్న ఇదే అణు బాంబుల విష‌యంలో భారీ ఎత్తున భ‌య‌ప‌డ‌బ‌ట్టే క‌దా?  కాళ్లు పట్టుకుని మ‌రీ ఇండియాతో కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి వ‌చ్చింది? ఈ విష‌యం పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మ‌ర‌చిపోతే ఎలా? మొన్న‌టి యుద్ధంలో భార‌త్ పాక్ ని భ‌య‌పెట్ట‌కుండా ఏకంగా ఆ దేశ అణు నిల్వ‌లున్న ప్రాంతంలో బాంబులు జార విడిచి ఉండాల్సింది.  జ‌స్ట్ ఆ నూర్ ఖాన్ బేస్ పై బ్ర‌హ్మోస్ లు వ‌దిలినందుకే త‌ల్ల‌డిల్లిపోయింది పాక్.  ఈ ఎయిర్ బేస్ కి ద‌గ్గ‌ర్లో ఇటు ఆర్మీ చీఫ్ హెడ్ క్వార్ట‌ర్ తో పాటు అటు అణు నిర్వ‌హ‌ణ చేసే నేష‌న‌ల్ క‌మాండ్ ఆఫీసు కూడా ఉంటుంది. ఇక్క‌డ భార‌త్ బాంబులు ప‌డ్డంత‌నే.. ఇదే పాక్ ఆర్మీ చీఫ్‌.. జ‌డుసుకుని బంక‌ర్లో దాక్కున్నాడు. అలాంటి బీరువు ఇప్పుడు మ‌ళ్లీ బీరాలు ప‌లుకుతున్నాడు. సింధూన‌ది మీద ప్రాజెక్టు క‌డుతున్నందుకే ఇలా అంటుంటే మ‌రి బ్ర‌హ్మ‌పుత్రా న‌ది మీద చైనా క‌డుతున్న ప్రాజెక్టు ప‌రిస్థితి ఏంటి? సింధూన‌ది ఎలా కుటుంబ ఆస్తి కాదో అదీ అంతేగా? మ‌రి చైనాపై కూడా భార‌త్ అణు బాంబులు వేయాలా? మొన్న ప‌హెల్గాం దాడి త‌ర్వాత ఇదే సింధూజ‌లాల‌ విష‌యం వెలుగులోకి వ‌స్తే మేం అణుబాంబులు వేస్తామ‌ని అన్నారు పాక్ దేశ నాయ‌కులు. తీరా భార‌త్ యుద్ధానికి దిగితే వేయాల్సిన బాంబులు వేయ‌డం మానేసి.. బంక‌ర్ల‌లో దాక్కున్నారు. ఇరాన్ ద‌గ్గ‌ర అణుబాంబులు ఉంటే..  ప్ర‌పంచానికే అతి పెద్ద విప‌త్తుగా భావించిన అమెరికా.. పాక్ విష‌యంలో ఎందుకో వెన‌క‌డుగు వేస్తూనే ఉంటుంది. అంటే పాక్ ద్వారా భార‌త్ ని భ‌య‌పెట్టి ఆయుధాలు కొనిపించాల‌న్న యోచ‌న అమెరికాది. అందుకే ఆ దేశ గ‌డ్డ‌పై నుంచి ఇలాంటి బీరాలు ప‌లికిస్తోంద‌న్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెలువ‌డుతున్నాయ్.  మేం పోతే స‌గం ప్ర‌పంచాన్ని లాక్కెళ్లిపోతామ‌ని మీరు భ‌య‌పెడ‌తారేమో.. కానీ భార‌త్ మొన్న‌టిలా చేసి చూపిస్తుంది.  అయినా యుద్ధం జ‌రుగుతుంటే మ‌న ద‌గ్గ‌ర ప్లాన్స్ లేవు ప్రేయ‌ర్సే అన్న మునీర్ కూడా .. ఇలా భార‌త్ ను భ‌య‌పెట్టేందుకు ప్రయత్నించడం  ఆశ్చ‌ర్యంగా ఉంది. ట్రంప్ కుటుంబానికి అమ్ముడుపోయి పాకిస్థాన్ని తాక‌ట్టి పెట్టి బ‌తుకుతున్న మునీర్  సైన్యాధ్య‌క్షుడంటే ఆసియాకే అవ‌మాన క‌రంగా ఉందని అంటున్నారు దౌత్య నిపుణులు.

ఓట్ల చోరీ.. రాహుల్ ఆరోపణలు.. ఈసీ ఖండనలు!

తాజాగా రాహుల్ గాంధీ మీడియా ముందుకు వచ్చి ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడ్డారు. ఈసీ తప్పులకుప్పగా  మారిందంటూ ఏకంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. తాను చేసే ఆరోపణలన్నిటికీ ఆధారాలున్నాయనీ, తాను, తన ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎంతో శ్రమించి శోధించి ఈ వివరాలను సేకరించామని చెప్పుకున్నారు. అయితే ఆయన ఆరోపణలను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంతే సాధికారికంగా ఖండించింది.  తన పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో రాహుల్ చేసిన కొన్ని ఆరోపణలు, వాటికి ఈసీ ఖండనలూ ఇలా ఉన్నాయి..    బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ  స్థానంలో ఒక్కటి వినా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్ విజయం సాధించినా, కేవలం ఒక్కటంటే ఒక్క నియోజకవర్గంలో  ఓట్ల చోరీ కారణంగా సెంట్రల్ లోక్ సభ స్థానాన్ని కాంగ్రెస్ కోల్పోయిందని పేర్కొన్నారు. అయితే రాహుల్ ఆరోపణను ఈసీ ఆధారాలను చూపుతూ ఖండించింది.  బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఏడింటిలో మెజారిటీ సాధించిందన్నది అవాస్తవం.  ఆ లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్ నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించింది. రాహుల్ పేర్కొన్నట్లుగా బీజేపీ ఒకే ఒక అసెంబ్లీ సెగ్మెంట్ లో మెజారిటీతో లోక్ సభ స్థానాన్ని గెలుచిందనడం పూర్తిగా అవాస్తవం అని ఈసీ పేర్కొంది.  అదే విధంగా నకిలీ ఓట్ల గురించి రాహుల్ గాంధీ తన పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో   శ్రీవాస్తవ అనే వ్యక్తికి ఏకంగా మూడు రాష్ట్రాలలో  ఓటర్ ఐడీ ఉంది. ఆ మూడు రాష్ట్రాలూ ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక. ఈ మూడు రాష్ట్రాలలోనూ శ్రీవాస్తవ ఓటు వేశాడు. ఆయన తన ఓటును బీజేపీకే వేశారంటూ ఉదాహరణగా చూపారు. అయితే ఈ ఆరోపణను కూడా ఈసీ నిర్ద్వంద్వంగా ఖండించింది. శ్రీవాస్తవ అనే వ్యక్తి మూడు రాష్ట్రాలలోనూ ఓటు వేశారనడం అబద్ధమని సాక్ష్యాలతో సహా పేర్కొంది. అయినా శ్రీవస్తవ అనే వ్యక్తి బీజేపీకే ఓటు వేశారని రాహుల్ ఎలా చెప్పగలరని నిలదీసింది. వాస్తవానికి శ్రీవాస్తవక 2011లో యూపీలో, 2016లో మహారాష్ట్రలో నివశించారనీ, ప్రస్తుతం కర్నాటకలో ఉంటున్నారనీ పేర్కొన్న ఈసీ.. ప్రతి సారీ కూడా ఆయన చట్టబద్ధంగా తన ఓటర్ ఐడీని మార్చుకున్నారని, ఒకే సారి మూడు రాష్ట్రాలలో ఓటు వేయలేదనీ ఈసీ విస్పష్టంగా తేల్చేసింది. ఇక ఒకే చిరునామాలో 80 మంది ఓటర్లు నమోదయ్యారన్న ఆరోపణకు కూడా ఈసీ స్పష్టమైన వివరణతో సమాధానం ఇచ్చింది.  వాస్తవానికి రాహుల్ చెప్పిన చిరునామాలో ఉన్నవి అద్దెకు ఇచ్చే సత్రాలుఆ చిరునామాలో ఉన్నవి అద్దెకు ఇచ్చే చావళ్లు. అంటే సత్రాలలాంటివన్న మాట.  అక్కడ పనివాళ్లు, సెక్యూరిటీ గార్డులు  తాత్కాలికంగా వచ్చి ఉంటారు. తర్వాత అక్కడ నుంచి మారిపోతారు. అలాంటి చావళ్లను  అడ్రస్ ప్రూఫ్‌గా   ఉపయోగించుకుని ఓటరు ఐడిలు  పొందారు కానీ అక్కడ వారు నివసించడంలేదు. అంత మాత్రాన అవన్నీ నకిలీ ఓట్లు ఎలా అవుతాయని ఈసీ నిలదీస్తోంది. అంతే కాకుండా వారంతా బీజేపీకే ఓటు వేశారని రాహుల్ ఎలా ధృవీకరిస్తారని ప్రశ్నిస్తోంది.  మొత్తం మీద ఓట్ల చోరీ అంటూ రాహుల్ చేపట్టిన ఆందోళన, ఉద్యమం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. మొత్తం మీద రాహుల్ ఆరోపణలు, ఈసీ ఖండనలు నోటీసులతో దేశంలో రాజకీయ వేడి పెరిగింది. 

నీతా అంబానీ గ్యారేజ్‌లో దేశంలోనే ఖరీదైన రూ.100 కోట్ల కారు

అంబానీ గ్యారేజ్‌లో ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి. అయితే తాజాగా నీతా అంబానీ ఖరీదైన కారు గురించి ఆసక్తికర విషయాలు  బయటకు వచ్చాయి. ఆ కారు ఖరీదు, దానిలోని ఫీచర్స్ గురించి వింటే మాత్రం కళ్లు బైర్లు కమ్మాల్సిందే.  ప్రపంచ కుబేరుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ  గ్యారేజ్‌లో ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నప్పటికీ   ఓ  కారు మాత్రం వార్తల్లో నిలుస్తోంది.  దాదాపు వంద కోట్ల రూపాయల విలువైన ఆ కారు ఖరీదు, అందులోని ఫీచర్ల గురించి ఆసక్తికర సమాచారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ కారు దేశంలోనే అత్యంత ఖరీదైనదని అంటున్నారు.  ఆ కారు పేరు ఆడీ ఏ9 చమేలియన్ . ఈ కారు ఖరీదు అక్షరాలా వంద కోట్ల రూపాయలు. ఈ కారులో ఎన్నో ప్రత్యేకమైన ఫీచర్స్ ఉన్నాయట. వాటిల్లో ముఖ్యమైనది ఏంటంటే,  ఈ కారు ఊసరవెల్లిలా రంగులు మార్చుకోగలదట.  ఈ కారు ఎప్పటికప్పుడు తన రంగులను మార్చుకుంటుందట. ఒక్క బటన్ నొక్కితే చాలు,  కారు రంగు మారిపోతుందట. ఈ కారు పెయింటింగ్ పూర్తిగా ఎలక్ట్రిక్‌గా జరుగుతుందట. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కార్లు కేవలం 11 మాత్రమే ఉన్నాయట.ఈ కారు సింగిల్-పీస్ విండ్‌స్క్రీన్, రూఫ్‌తో స్పేష్ షిప్‌లా కనిపిస్తుంది. అల్ట్రా-ఎక్స్‌క్లూజివ్ కారు అయిన ఈ ఆడి ఏ9 చమేలియన్ రెండు-డోర్ల కాన్ఫిగరేషన్‌తో ఉంటుంది. ఈ కారులో 4.0-లీటర్ V8 ఇంజిన్‌ అమర్చారు. ఇది  600 సీసీ హార్స్‌పవర్‌ కారు. కేవలం మూడున్నర సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల   వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. అందుకే నీతా అంబానీకి ఇప్పటికే ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నప్పటికీ ఈ కారు ప్రత్యేకంగా నిలుస్తోంది.

హిమాలయాల్లో దొరికే మూలికల భస్మంతో బంగారం తయారీ అంటూ చీటింగ్..నిందితులు అరెస్ట్

బంగారం తయారు చేస్తామంటూ జనాలను మోసం చేస్తున్న నిందితుల ముఠాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.   హిమాలయాల్లో దొరికే మూలికలతో బంగారం తయారు చేసి ఇస్తామంటూ నాగపూర్ కు చెందిన ఓ ముఠా హైదరాబాద్ లో మోసాలకు పాల్పడుతోంది. అమాయకుల నుంచి  లక్షల్లో డబ్బు చోరీ చేస్తున్న ముఠాలోని ముగ్గురిని ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు  అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి. నాగపూర్ కు చెందిన గ్యాంగ్ హైదరాబాద్ లోకి ప్రవేశించి స్వామీజీ వేషధారణలో కష్టాలు తొలగిపోయేలా రెండు కేజీల బంగారం తయారుచేసి ఇస్తామంటూ అమాయక  జనాలను బురిడీ కొట్టిస్తూ వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు ఈ క్రమంలోనే బంజారాహిల్స్ కి చెందిన గోపాల్ సింగ్ అనే వ్యక్తి ఈ గ్యాంగ్ మాయలో పడ్డాడు.  హిమాలయాల్లో దొరికే మూలికలతో , భస్మంతో తయారు చేసిన బంగారాన్ని మీ ఇంట్లో పెట్టుకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయని, ప్రతి పనిలో విజయం సాధిస్తారంటూ నమ్మించి ...గోపాల్ సింగ్ వద్దనుండి 10 లక్షల రూపాయలు తీసుకొని... అతని అతని ఇంటికి వెళ్లి నెల రోజుల పాటు పూజలు చేసి అనంతరం ఒక ఎర్ర  బట్టలో రెండు కేజీల బంగారం ఉందంటూ వారి చేతికి ఇచ్చారు. వారం రోజులు పూజ గదిలో ఉంచిన అనంతరం దీనిని తెరిచి చూడాలని సూచించారు. అయితే గోపాల్ సింగ్ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ఐదు రోజుల తర్వాత ఆ బట్ట తెరిచి చూడగా బంగారపు రంగులో ఉన్న ఇనుప ముక్కలు కనిపించాయి. స్వామీజీలమంటూ తమకు ఆ ఇనుపముక్కలను అంటగట్టిన వారికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ రావడంతో మోసపోయినట్లు గ్రహించి జూబ్లీహిల్స్ పోలీసులకు  ఫిర్యాదు చేశారు.   కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ముఠాలోని ముగ్గు రిని అరెస్టు చేశారు. అయితే ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలిస్తున్నారు.  ఈ ముఠా నిజాంపేట్ లోని గద్వాల్ ఆయుర్వేదిక్ సెంటర్, నాగోల్ లోని మహాలక్ష్మి ఆయుర్వేదిక్ సెంటర్లలో ఏజెంట్లుగా పని చేస్తున్నారు. వీరు హిమాలయాల్లో నుండి భస్మం తీసుకువచ్చి... జనాలను నమ్మించి... మోసాలకు పాల్పడుతూ...    లక్షల్లో నగదు దోచేస్తున్నారు.  ఇప్పుడు నిందితులను అరెస్టు చేయడంతో మరిన్ని ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.  

ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం.. జీవో విడుదల చేసిన ఏపీ సర్కార్

ఏపీలో కూటమి సర్కార్ కీలక ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం స్త్రీశక్తికి సంబంధించి ప్రభుత్వం సోమవారం (ఆగస్టు 10) మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ పథకం ఏయే బస్సుల్లో అమలవుతుంది, టికెట్ల జారీ ఎలా ఉంటుంది వంటి అన్ని వివరాలతో కూడిన జీవోను   ప్రభుత్వం విడుదల చేసింది.  ఈ జీవోలో ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించే స్త్రీశక్తి పథకం ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి వస్తుందన్ని స్పష్టం చేసింది.  ఈ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్ధానికులైన మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే ఇందుకు తగిన గుర్తింపు కార్డులను చూపించాల్సి ఉంటుంది. ఇక ట్రాన్స్ జండర్లకు సైతం ఈ పథకం వర్తిస్తుంది.  స్త్రీ శక్తి పథకం కింద   మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సు ల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. బాలికలు, మహిళలు, ట్రాన్ జెండర్ లు ఈ ఉచిత ప్రయాణానికి అర్హులు. అయితే పల్లెవెలుగు, ఆర్డినరీ, సిటీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఈ పథకం కింద ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది.  సప్తగిరి ఎక్స్ ప్రెస్ , సూపర్ లగ్జరీ , నాన్ స్టాప్ సర్వీసులు, అంతర్రాష్ట్ర సర్వీసులు, ఎసీ సర్వీసుల్లో ఉచిత ప్రయాణానికి  అవకాశం ఉండదు. 

వన్డే వరల్డ్ కప్ 2027కు కోహ్లీ, రోహిత్‌లు అనుమానమేనా?

టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మలు రెండేళ్ల తర్వాత జరగనున్న వన్డే ప్రపంచ కప్ లో ఆడటం అనుమానంగానే కనిపిస్తోంది.  గతేడాది టీ-20 ప్రపంచకప్ తర్వాత ఇద్దరూ ఒకేసారి అంతర్జాతీయ టీ-20లకు వీడ్కోలు పలికారు. ఇక, ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత ఇద్దరూ ఒకేసారి టెస్ట్ ఫార్మాట్‌ నుంచి వైదొలిగారు. ప్రస్తుతం వీరిద్దరూ వన్డేల్లో మాత్రం టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైట్ బాల్ క్రికెట్‌లో గొప్ప ఆటగాళ్లుగా పేరు తెచ్చుకున్న కోహ్లీ, రోహిత్ త్వరలోనే వన్డే క్రికెట్ నుంచి కూడా వైదొలగబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో టీమిండియా వన్డే సిరీస్ ఆడబోతోంది. ఆ సిరీస్ తర్వాత రోహిత్, కోహ్లీ ఒకేసారి వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించవచ్చని తెలుస్తోంది.  నిజానికి వీరిద్దరూ 2027 వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగాలని భావిస్తున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రపంచకప్ ఆడాలంటే బీసీసీఐ నిబంధనల ప్రకారం వీరిద్దరూ ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే దేశీయ వన్డే సిరీస్ అయిన విజయ్ హజారే ట్రోఫీ ఆడవలసి ఉంటుంది. 2007 ప్రపంచ కప్‌లో రోహిత్, కోహ్లీ ఆడాలంటే అప్పటి వరకు వారిద్దరు ఫిట్‌నెస్‌ కాపాడుకోవడంతో పాటు ఫామ్‌లో ఉండటం అవసరం. ఈ నేపధ్యంలో వారిద్దరనీ ఎంపిక చేయడానికి బీసీసీఐ ఓ కండీషన్ పెట్టిందంట. ఈ ఏడాది డిసెంబరులో ప్రారంభమయ్యే విజయ్ హజారే ట్రోఫీలో వారిద్దూ పాల్గొంటేనే ప్రపంచకప్ స్క్వాడ్ కోసం వీరిని పరిగణనలోనికి తీసుకుంటామన్నదే ఆ కండీషన్ గా చెబుతున్నారు. అంటే విజయ్ హజారే ట్రోఫీలో  వీరు ఆడకపోతే వరల్డ్ కప్ దారులు మూసుకుపోయినట్టే.  ఇక టీమ్ ఇండియా కోచ్  యువ ఆటగాళ్లవైపే మొగ్గు చేపుతాడన్నది తెలిసిందే.  టెస్టుల విషయంలోనూ అదే జరిగిందనీ,  గిల్‌కు సారథ్యం ఇవ్వడం వెనుక కారణం అదే అంటున్నారు.  ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో ఆడాలనే తొలుత  రోహిత్, కోహ్లీ భావించారంట. కానీ భవిష్యత్తు అవసరాలు దృష్య్టా ఎంపిక కష్టమని బీసీసీఐ వర్గాలు చెప్పడంతోనే  వారు టెస్టులకు గుడ్ బై చెప్పారట. ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో బీసీసీఐ, గంభీర్ వ్యూహాలు ఫలించి భారత్ యువ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శనతో సిరీస్‌ను డ్రాగా ముగించారు.  ఆ క్రమంలో రోహిత్, కోహ్లీ భవితవ్వం ఏంటో మరో రెండు నెలల్లో వచ్చే ఆస్ట్రేలియా వన్టే సిరీస్‌లో తేలనుంది. ప్రస్తుతం టీమ్ ఇండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మే ఉన్నాడు.  ఇటీవలే చాంపియన్స్ ట్రోఫీని రోహిత్ సారథ్యంలో ఇండియా నెగ్గింది.  అయితే  ఆస్ట్రేలియా వన్టే సిరీస్‌కి శుభమన్‌గిల్‌కే జట్టు పగ్గాలు అప్పగిస్తారని గట్టిగా వినిపిస్తోంది. ఇక పోతే కోహ్లీ, రోహిత్ లు వచ్చే వరల్డ్ కప్ లో ఆడతారా లేదా అన్నది విజయ్ హజారే ట్రోఫీ తేల్చేస్తుంది. ఆ  ట్రోఫీలో ఆడితేనే రోహిత్, కోహ్లీ పేర్లను ప్రపంచకప్ కోసం పరిశీలిస్తారు. ఒక వేళ ఆ ట్రోఫీలో వీరిరువురూ ఆడినా, అందులో వారు రాణించడంపైనే వరల్డ్ కప్ జట్టకు ఎంపక ఆధారపడి ఉంటుందని క్రీడా పండితులు అంటున్నారు. కాగా ఈ పరిస్థితుల నేపథ్యంలో యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో వీరిద్దరూ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ తరువాత  తమ రిటైర్మెంట్ ప్రకటిస్తారని ఊహాగానాలు కూడా వినబడుతున్నాయి. ఆస్ట్రేలియాలో ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే వన్డే సిరీస్ ముగిసిన తర్వాత 2027 ప్రపంచకప్ లోపు టీమిండియా మరో ఆరు వన్డే సిరీస్‌లు ఆడనుంది.

రాహుల్ గాంధీ అరెస్టు

కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు అరెస్టు చేశారు.  గత కొద్ది రోజులుగా ఓట్ల చోరీపై కాంగ్రస్ పార్టీ, ఆ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి  ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.  బీహార్‌లో అధికార పార్టీకి తొత్తుగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందంటూ పార్లమెంట్ వేదికగా నిరసనలు తెలుపుతున్న విపక్షాలు  లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం కార్యాలయం ముట్టడికి బయల్దేరాయి. తాజాగా  సోమ వారం పార్లమెంట్ భవనం నుంచి ఈసీ  కార్యాలయానికి ప్లకార్డులు ప్రదర్శిస్తూ మార్చ్ నిర్వహించ తలపెట్టాయి.  అయితే విపక్షాల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. సంసద్ మార్గ్ కు వెళ్లే మార్గంలో బారికేడ్లు అడ్డుగా పెట్టారు. అయితే విపక్ష ఎంపీలు వాటిని దాటుకుని వేళ్లే ప్రయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  ఈ సందర్భంగా పోలీసులు రాహుల్ గాంధీ సహా విపక్ష ఎంపీలను  అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు. 

జగన్ మేనమామపై కేసు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేనమామ, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై   విజిలెన్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.  నిబంధనలను ఉల్లంఘించి తిరుమలలో రాజకీయ ప్రసంగాలు, వ్యాఖ్యలు చేసినందుకు ఈ కేసు నమోదు చేశారు. తిరుమలలో రాజకీయ ప్రసంగాలు నిషేధిస్తూ ఇటీవల పాలకమండలి తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే  రవీంద్రనాథ్ రెడ్డిపై టీటీడీ విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆదివారం (ఆగస్టు 10) ఉదయం మాజీ ఎమ్మెల్యే  రవీంద్రనాథ్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం  ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన రాజకీయ వ్యాఖ్యలూ, విమర్శలూ చేశారు.  పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలలో వైసీపీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు.  తాము జగన్ వెంటే ఉన్నామని చెప్పేందుకు పులివెందుల ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. కూటమి ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోందంటూ విమర్శలు గుప్పించారు. పులివెందులలో  వైసీపీ కార్యకర్తలపై విచ్చలవిడిగా దాడికి పాల్పడుతూ తెలుగుదేశం ఇష్టారీతిగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో  శ్రీవారి ఆలయ ప్రాంగణంలో రాజకీయ ఆరోపణలు చేశారంటూ టీటీడీ విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు రవీంద్రనాథ్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.