తెలంగాణలో వైద్య విద్య అభ్యసించాలంటే స్థానికత తప్పనిసరి.. సుప్రీం

వైద్య విద్యార్థుల స్థానికత అంశంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాష్ట్రంలో వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులకు నాలుగేళ్ల స్థానికత తప్పని సరి అని పేర్కొంది. ఈ మేరకు గతంలో తెలంగాణ హైకోర్టు తీర్పును పక్కన పెట్టేసింది.

  సీజేఐ జస్టిస్ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తెలంగాణలో  వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థుల  స్థానికతపై తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.33 ప్రకారమే రిజర్వేషన్లు అమలు చేయాలని స్పష్టం చేసింది. తెలంగాణలో స్థానిక రిజర్వేషన్లు పొందాలంటే,  కనీసం 9వ తరగతి నుంచి 12 వరకు రాష్ట్రంలో చదవాల్సిందేనని సర్కార్ పెట్టిన నిబంధనను సమర్ధిస్తూనే..  గతేడాది ఇచ్చిన మినహా యింపుతో ప్రయోజనం పొందిన విద్యార్థులను మాత్రం అలాగే కొనసాగించాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది.  
 

వెనుజువెలా.. అసలేం జరుగుతోంది?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జోరుగా జరుగుతున్న హాట్ డిస్కషన్ ఏమిటంటే.. అసలు వెనిజువేలాలో ఏం జరుగుతోంది? ఈ నెల 3న అంటే శనివారం అమెరికన్ ఆర్మీ మెరుపుదాడి జరిపివెనిజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్టు చేసి అమెరికాకు తరలించింది.  ఈ సందర్భంగా వెనిజువేలా  రాజధాని కకరాకస్ లో భారీ పేలుళ్లు జరిగాయి. విద్యుత్ గ్రిడ్ లు ధ్వంసమయ్యాయి. దేశ వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫోన్ చార్జింగ్ కోసం జనం బారులు తీరారు.  అమెరికా అద్యక్షుడు ట్రంప్ దీన్ని అమెరికన్ సైనిక శక్తి అద్భుత ప్రదర్శ నగా అభివర్ణిస్తూ తన భుజాలను తానే చరుచుకున్నారు. ఇక వెనిజువేలాలో అధికార మార్పిడి ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఆ దేశాన్ని అమెరికాయే నడిపిస్తుందని ప్రకటించారు.   అయితే మదురో బదులు తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉపాధ్యక్షురాలు రోడ్రిగ్జ్ బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయని అంటు న్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కొరినా మచాడో తర్వాతి అధ్యక్షురాలయ్యే  చాన్సుందన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. అయితే అదేమీ జరిగేలా కనిపించడం లేదు.. ఎందుకంటే   కొరినా మచాడో నునోబెల్ స్వీకారానికి కూడా అవకాశం దొరకని ఇబ్బందికర  పరిస్థితులను ఎదుర్కు న్నారు. ప్రస్తుతం మదురోను అమెరికా అరెస్టు చేయడం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. భారత్ అయితే వెనుజువెలా వెళ్లే వారు అత్యవసరమైతే తప్ప వెళ్ల వద్దని ట్రావెల్ కాషన్ జారీ చేసింది. అమెరికా స్పెషల్ ఫోర్సెస్ అయిన డెల్టా ఫోర్స్ .. ఆపరేషన్ ఆబ్సల్యూట్ రిజాల్వ్  పేరిట రాజధాని కరాక స్‌లో భారీ సైనిక దాడి చేసింది. ఈ దాడిలో మదురో నివాసంపై హెలికాప్టర్లతో దాడి చేసి, మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను అదుపులోకి తీసుకుంది. మదురో దంపతులను ముందుగా యుఎ స్ఎస్ ఐవో జిమా యుద్ధ నౌకలోకి, ఆ తరువాత న్యూయార్క్‌లోని స్టూవర్ట్ ఎయిర్ నేషనల్ గార్డ్ బేస్‌కు చేర్చారు. ప్రస్తుతం మదురో బ్రూక్లిన్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉన్నారు. మదురోపై 2020 నుంచి అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ ఇండిక్ట్‌మెంట్ ఆధారంగా.. నార్కో-టెర్రరిజం కుట్ర, కొకైన్ దిగుమతి కుట్ర, మెషిన్‌గన్స్ ఇతర డిస్ట్రక్టివ్ డివైసెస్ పొజెషన్ వంటి ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే  మదురోపై  50 మిలియన్ రివార్డ్ ప్రకటించింది అమెరికా. ఇప్పుడు మదురోను మెరిపుదాడి చేసి మరీ అరెస్టు చేసింది.  అరెస్ట్ సమయంలో మదురో ఇంట్లో నిద్రిస్తున్నారని, అతడి నుంచి  ఎలాంటి  ప్రతిఘటన లేకుండానే బంధించారనీ తెలుస్తోంది. అయితే అరెస్టు తర్వాత   మదురో చేతులకు సంకెళ్లతో అమెరికా ఆఫీసర్ల మధ్య నడుస్తున్న దృశ్యాలు ప్రపంచ వ్యాప్తంగా తెగ వైరల్ అ య్యాయి. మదురో అరెస్టును  . చైనా, రష్యా వంటి దేశాలు తీవ్రంగా ఖండించాయిజ అయితే కొన్ని దేశాలు ఈ అరెస్టును స్వాగతించాయి. ఇలా ఉండగా మదురో అరెస్టు అంశంపై  ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించనుంది. 

పాక్ ఆర్మీ చీఫ్ ను ఎందుకు అరెస్టు చేయరు?!

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్టు చేసినట్లుగా పాక్ ఆర్మీ చీఫ్ ను ఎందుకు అరెస్టు చేయరంటూ బలోచ్ అమెరికన్ కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ తారాచంద్ డోనాల్డ్ ట్రంప్ ను నిలదీశారు. వెనిజులాలో నియంతృత్వానికి వ్యతిరేకంగా నికోలస్ మదురోను అరెస్టు చేసిన అమెరికా అధ్యక్షుడు  పాక్ ఆర్మీ చీఫ్ విషయంలో ఎందుకు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. నికోలస్ మదురో వెనిజులా నేచురల్ రిసోర్సస్ ను  చైనాకు అప్పగించి దోపిడీకి సహకరిస్తున్నారంటున్న ట్రంప్.. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ కూడా బలోచిస్థాన్ లెని ఖనిజ సంపద, సముద్ర వనరులను చైనాకు తాకట్టు పెడుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని డాక్టర్ తారాచంద్ ప్రశ్నించారు.  పాక్ ఆర్మీ చీఫ్ మునీర్  డబుల్ ఏజెంట్ లా వ్యవహరిస్తూ, ఒకవైపు బలోచ్ వనరులను చైనాకు కట్టబెడుతూనే, మరోవైపు అమెరికాను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. . మదురోపై అమెరికా ఇటీవల  మెరుపు దాడి జరిపి అరెస్టు చేసినట్లుగానే  పాక్ ఆర్మీ చీఫ్‌ను కూడా బంధించాలని ఆయన డిమాండ్ చేశారు.  వనరుల దోపిడీకి తోడు పాక్ ఆర్మీ చీఫ్ నీర్ బలోచిస్థాన్‌లోనూ, సరిహద్దులకు ఆవల కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని డాక్టర్ తారాచంద్ ఆరోపించారు.   వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న బలోచ్ అమెరికన్ కాంగ్రెస్  బలోచిస్థాన్ స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే.బలోచ్ అమెరికన్ కాంగ్రెస్ అధ్యక్షుడు  డాక్టర్ తారా చంద్ గతంలో బలోచిస్థాన్ ప్రభుత్వంలో మంత్రిగా  కూడా పని చేశారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ప్రవాసంలో ఉన్నారు.  అక్కడి నుంచే బలోచిస్థాన్ హక్కుల కోసం పోరాటం జరుపుతున్నారు. 

ఇండియాకు డోనాల్డ్ ట్రంప్ మరో హెచ్చరిక

అగ్రదేశాధినేత డొనాల్డ్ ట్రంప్ తన భారత వ్యతిరేకతను మరోసారి ప్రదర్శించారు. రష్యా నుంచిచమురు కొనుగోలు విషయంలో తన దారికి రాకపోతే భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్‌లు మరింత పెంచుతామని హెచ్చరించారు.    రష్యా చమురు విషయంలో భారత్  అమెరికాకు సహకరించకుంటే.. ఆ దేశంపై టారిఫ్ లు మరింత పెంచుతామని  ట్రంప్ ఓ బహిరంగ సభలో ప్రకటించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. భారత్ - అమెరికా మధ్య వాణిజ్య   చర్చలతో రష్యా చమురు అంశాన్ని ఆయన ముడిపెట్టినట్లు తెలిపింది. ట్రంప్ ఈ ప్రకటనతో భారత్-రష్యా ఇంధన సంబంధాల చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు మరో సారి తెరపైకి వచ్చినట్లైంది.  గతంలో కూడా రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ ఏకపక్షంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే  ట్రంప్ ప్రకటనను  భారత్ అప్పట్లో నిర్ద్వంద్వంగా ఖండించింది. ఇప్పుడు మరోసారి ట్రంప్ ఇదే అంశాన్ని ప్రస్తావించి టారిఫ్ ల పెంపు అంటూ హెచ్చరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

భోగాపురం ఎయిర్ పోర్టుపై పొలిటికల్ వార్

   ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమవుతోంది. నిర్మాణం తుదిదశకు చేరుకుంది. ఎయిర్ పోర్ట్ లో తొలి విమానం ల్యాండ్ అయింది. జూన్ నుంచి ఎయిర్ పోర్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో చాలా ఏళ్లుగా ఉత్తరాంధ్ర వాసుల కల సాకారమవుతోంది. విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి టెస్ట్ ట్రయల్ చేయడానికి భోగాపురం రన్ వే పై తొలి విమానం ల్యాండ్ అయింది. ఈ క్రమంలో భోగాపురంపై అటు రాజకీయంగానూ కాక రేగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై చర్చ జరుగుతోంది.  భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణంపై క్రెడిట్ తమదంటే తమదేనంటూ అటు వైసీపీ, ఇటు టీడీపీ క్లెయిమ్ చేసుకుంటున్నాయి. 2014-19 మధ్య టీడీపీ ప్ర‌భుత్వం భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏ అనుమ‌తులూ లేకుండా శంకుస్థాప‌న చేసి వదిలేసిందని వైసీపీ ఆరోపిస్తోంది. కానీ వైఎస్ జ‌గ‌న్ అన్ని అనుమతులు వ‌చ్చాకే ఆ ఎయిర్‌పోర్ట్ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసారని వాదిస్తోంది.  2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగానే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన అనుమతుల కోసం నాటి ముఖ్యమంత్రి జగన్‌ ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేశారని ఆ పార్టీ చెబుతోంది.  మరోవైపు క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారని వదిస్తోంది.పరిహారాన్ని భూమి పరిస్థితిని బట్టి ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకూ ప్రకటించారని, డి.పట్టా భూములకూ జిరాయితీ భూమితో సమానంగా పరిహారాన్ని మంజూరు చేశారని వైసీపీ చెబుతోంది. దీంతో రైతులు చాలామంది పిటిషన్లను ఉపసంహరించుకున్నారని, మిగతావాటినీ సర్వోన్నత న్యాయస్థానం పరిష్కరించిందని వైసీపీ చెప్పుకుంటోంది.దానికి టీడీపీ గట్టిగానే కౌంటర్ ఇస్తోంది.  భోగాపురం ఎయిర్ పోర్ట్ చంద్రబాబు దూర దృష్టికి నిదర్శనం అని, వైసీపీ అధికారం లోకి రాక ముందే ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన జరిగిందని వైసీపీని విమర్శిస్తుంది. అలాగే జగన్ భోగాపురం ఎయిర్ పోర్టును వ్యతికించరని దెప్పి పొడుస్తుంది. దానికి తగ్గట్లే సోషల్ మీడియాలో భోగాపురం ఎయిర్ పోర్టుకి చంద్రబాబు శంకుస్థాపన చేసినప్పుడు జగన్ మాట్లాడిన మాటలు ట్రోల్ అవుతున్నాయి. అప్పట్లో జగన్ దీనిపై మాట్లాడుతూ ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్ పోర్టు ఎందుకని విమర్శలు గుప్పించారు. మొత్తానికి ఈ క్రెడిట్ వార్లో వైసీపీ తీరు చర్చల్లో నలుగుతోంది. మరోవైపు  భోగాపురం పోయిర్ పోర్టులో తొలి విమానం ల్యాండింగ్‌పై  మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. భోగాపురం పోయిర్ పోర్టులో తొలి విమానం ల్యాండ్‌కావడం ఏపీ అభివృద్ధికి ఒక మైలురాయి అని తెలిపారు. #VisonVizag లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక అడుగు పడిందని తెలిపారు. తమ పాలనలో వేగవంతమైన అనుమతులతో ఇది సాధ్యమైందని చెప్పారు. భూసేకరణ కోసం రూ.960 కోట్లు ఖర్చు చేయడంతో బలమైన పునాది వేశామన్నారు.   

2036 ఒలిపింక్ క్రీడల నిర్వహణకు భారత్ సిద్దం : ప్రధాని మోదీ

  2036 ఒలిపింక్ క్రీడల నిర్వహణకు భారత్ పూర్తిస్థాయిలో సన్నద్దమవుతోందని ప్రధాని మోదీ తెలిపారు. 72వ జాతీయ వాలీబాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల ప్రారంభోత్సవంలో ప్రధాని మాట్లాడారు. గత పదేళ్లలో ఫీపా అండర్-17, హాకీ వరల్డ్ కప్ వంటి 20కి పైగా అంతర్జాతీయ ఈవెండ్లను భారత్ విజయవంతంగా నిర్వహించిందని ప్రధాని గుర్తుచేశారు.  భారత్‌ అభివృద్ధి ప్రయాణాన్ని వాలీబాల్‌ ఆటతో ప్రధాని మోదీ పోల్చారు. ఏ విజయం అయినా ఒక్కరి వల్ల సాధ్యం కాదని, సమన్వయం, పరస్పర విశ్వాసం, జట్టు సంసిద్ధత ఉంటేనే విజయం సాధ్యమవుతుందని చెప్పారు. ఈ క్రీడలో ప్రతి ఒక్కరికి బాధ్యత, పాత్ర ఉంటుందని, అవన్నీ సమర్థంగా నిర్వర్తించినప్పుడే గెలుపు సాధ్యమవుతుందన్నారు. జనవరి 4 నుంచి 11 వరకు జరగనున్న ఈ జాతీయ వాలీబాల్‌ ఛాంపియన్‌షిప్‌లో దేశవ్యాప్తంగా 58 జట్లకు చెందిన వెయ్యికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ పోటీలతో వారణాసి నగరం జాతీయ స్థాయి క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రబిందువుగా మారుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.  

స్విమ్మింగ్ పూల్‌లో పడి మూడేళ్ల బాలుడు మృతి

  హైదరాబాద్ నగరంలోని కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్‌నగర్ ప్రాంతంలో జరిగిన విషాదకరమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఓ గేటెడ్ కమ్యూనిటీలోని స్విమ్మింగ్ పూల్‌లో పడి అర్జున్ కుమార్ (3) అనే మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన పలువురి కంటతడి పట్టించింది. హైదర్‌నగర్‌లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటున్న అర్జున్ కుమార్ అనే బాలుడు ఈరోజు ఆదివారం మధ్యాహ్నం సమయంలో తన తల్లిదండ్రుల సమీపంలో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అర్జున్ ఆడుకుంటూ ఆడుకుంటూ ఈత కొలను వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు.  ఆ సమయం లో స్విమ్మింగ్ పూల్ వద్ద ఎవరు లేరు..కొంతసేపటి తర్వాత బాలుడు కనిపిం చకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. చివరకు స్విమ్మింగ్ పూల్‌లో బాలుడు నీటిలో మునిగిపోయి ఉన్నట్టు గుర్తించారు. వెంటనే అతడిని బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో అర్జున్ తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపో యారు. ఒక్కసారిగా జరిగిన ఈ దుర్ఘటనతో కుటుంబంలో శోకసంద్రం నెలకొంది. గేటెడ్ కమ్యూనిటీలో చిన్నారుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈత కొలను ప్రాంతంలో తగిన పర్యవేక్షణ లేకపోవడం, సేఫ్టీ ఏర్పాట్లు సరిగా లేకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకున్నదని గ్రేటర్ కమ్యూనిటీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.  సమాచారం అందుకున్న వెంటనే కె.పి.హెచ్.బి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదవశాత్తు మృతి కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈత కొలను వద్ద భద్రతా నిబంధనలు పాటించారా? పర్యవేక్షణ లోపం ఉందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.ఈ విషాద ఘటన గేటెడ్ కమ్యూనిటీల్లో చిన్నారుల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. స్విమ్మింగ్ పూల్‌ల వద్ద తగిన రక్షణ చర్యలు, పర్యవేక్షణ తప్పనిసరి అన్న విషయం ఈ ఘటనతో స్పష్టమవుతోంది.

మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత

  చంద్ర గ్రహణం కారణంగా మార్చి 03న తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం 10 గంటలకు పైగా మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. మార్చి 03 ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు క్లోజ్ చేయనున్నాట్లు తెలిపింది. గ్రహణమాసానికి ఆరు గంటల ముందు ఆలయ తలుపులు మూసివేయడం ఆచారం.   మార్చి 03న రాత్రి 8:30 గంటల తర్వాత శుద్ధి మరియు ఇతర శుద్ధి కర్మల తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. చంద్రగ్రహణం కారణంగా, ఆ భక్తులపై అష్టదళ పాదపద్మారాధన సేవ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలకర సేవను టిటిడి రద్దు చేసింది. భక్తులు గమనించాలని టీటీడీ కోరింది  

చట్ట విరుద్దమైన పోస్టులపై ‘ఎక్స్’ కీలక నిర్ణయం

   ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ కంటెంట్ గురించి కీలక ప్రకటన చేసింది. 'ఎక్స్‌'లో పోస్ట్ చేసే చట్ట విరుద్ధమైన కంటెంట్‌ను పూర్తిగా తొలగిస్తామని, అలాంటి కంటెంట్‌ను పోస్ట్ చేసిన అకౌంట్లను శాశ్వతంగా సస్పెండ్ చేస్తామని వెల్లడించింది. అందుకోసం అవసరమైతే స్థానిక ప్రభుత్వాలతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. 'ఎక్స్ గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్' ఖాతా ద్వారా ఈ ప్రకటన వెలువడింది.  తమ ఏఐ ప్లాట్‌ఫామ్ 'గ్రోక్‌'ను ఉపయోగించి అశ్లీల కంటెంట్‌ను సృష్టించిన వారిపై, వాటిని నేరుగా అప్‌లోడ్ చేసిన వారిపై ఒకే రకమైన చర్యలు తీసుకుంటామని ఎలన్ మస్క్ హెచ్చరించారు. మస్క్ ప్రకటన అనంతరం 'ఎక్స్ గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్' కూడా అదే తరహా ప్రకటన చేసింది. 'ఎక్స్' నియమాలకు సంబంధించిన ఒక లింక్‌ను కూడా షేర్ చేసింది.  స్థానిక చట్టాలకు, నియమాలకు విరుద్ధంగా అశ్లీల, అసభ్య కంటెంట్ పెరుగుతున్నట్టు భారత ప్రభుత్వం గుర్తించి 'ఎక్స్‌'కు జనవరి రెండో తేదీన నోటీసులు జారీ చేసింది. 'గ్రోక్' ఉపయోగించి మహిళల అసభ్యకర చిత్రాలు సృష్టించి 'ఎక్స్‌'లో పోస్ట్‌లు చేయడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. 'గ్రోక్' ఉపయోగించి రూపొందించిన అశ్లీల కంటెంట్‌ను తొలగించాలని, ఈ మొత్తం ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో 'ఎక్స్' తగిన చర్యలు చేపట్టింది.

ఢిల్లీ ఎయిర్ పోర్టులో రూ. 21 కోట్ల విలువైన కోకైన్ సీజ్

  మాదకద్రవ్యాలను పూర్తిగా రూపుమాపేందుకు అన్ని శాఖల అధికారులు ఉక్కు పాదం మోపుతున్న కూడా కొందరు స్మగ్లర్లు పుష్ప సినిమా తరహాలో కొత్త కొత్త పద్ధతుల్లో డ్రగ్స్ ని రవాణా చేసేందుకు ప్రయత్నం చేస్తూ అధికారుల చేతికి చిక్కు తున్నారు...ఢిల్లీ అంతర్జా తీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల చేతికి ముగ్గురు కేటుగాళ్లు దొరికారు. వారి వద్ద నుండి సుమారు రూ.21 కోట్ల విలువ చేసే 2.1 కిలోల కోకైన్ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  డ్రగ్స్ స్మగ్లింగ్‌కు పాల్పడిన ముగ్గురు కేటుగాళ్లు కోకైన్‌ను అత్యంత పకడ్బందీగా సిలర్ కవర్‌లో చుట్టి, దానిపై మరలా పాలితిన్ కవర్లతో ప్యాకింగ్ చేసి ట్రాలీ బ్యాగ్‌లో దాచారు. స్కానింగ్‌కు చిక్కకుండా ఉండేందుకు అత్యాధునిక పద్ధతులు ఉపయోగించారు. ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కకుండా తగు జాగ్రత్తలు తీసుకుని బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి వచ్చిన ముగ్గురు ప్రయాణీకులు గ్రీన్ చానల్ దాటే క్రమంలో అనుమా నాస్పదంగా ప్రవర్తించడంతో కస్టమ్స్ అధికారులు వారిని ఆపి తనిఖీ చేపట్టారు. ట్రాలీ బ్యాగ్‌లను స్కానింగ్ మిషన్‌లో పరీక్షించగా డ్రగ్స్ ఉన్నట్లుగా స్పష్టమైంది. వెంటనే బ్యాగ్‌లను తెరిచి పరిశీలించగా భారీ మొత్తం లో కోకైన్ బయటపడింది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన కస్టమ్స్ అధికారులు, వారి నుంచి మొత్తం 2.1 కిలోల కోకైన్‌ను సీజ్ చేశారు. ఈ డ్రగ్స్ అంతర్జాతీయ మార్కెట్‌లో విలువ సుమారు రూ.21 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితులపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. ఈ డ్రగ్స్ వెనుక ఉన్న అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా, దేశంలో సరఫరా చేయాల్సిన నెట్‌వర్క్‌పై లోతైన విచారణ చేపట్టినట్లు సమాచారం.ఇటీవలి కాలంలో విమానాశ్రయాల ద్వారా డ్రగ్స్ అక్రమ రవాణా పెరుగుతుండటంపై కస్టమ్స్ అధికారులు అప్రమత్తంగా ఉండి, నిఘా మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు