రాజకీయ జీవితంలో ఏనాడూ రెస్ట్ తీసుకోలేదు: సీఎం చంద్రబాబు
posted on Sep 1, 2025 @ 5:30PM
రాజకీయ జీవితంలో తాను ఏనాడు రెస్ట్ తీసుకోలేదని సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం మునక్కాయలవారిపల్లెలో దివ్యాంగురాలు యడవల్లి సుమిత్రమ్మ అనే మహిళకు పింఛను అందించారు. అక్కడ విధుల్లో ఉన్న రజకులతో కాసేపు ముచ్చటించారు. పనిలో కష్టాలు, సౌకర్యాల కల్పన గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఎవరైనా పింఛను తీసుకోకున్నా తర్వాతి నెల అందిస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి.. ఆదాయం పెరగాలని చెప్పారు. ప్రజలు ఆశీర్వదీస్తే తాను కొండలనైనా పిండి చేస్తానని ముఖ్యమంత్రి అన్నారు. నదుల అనుసంధానంతోనే రైతుల అభివృద్ధి సాధ్యం. గంగా నది నుంచి కావేరి నది వరకు అనుసంధానం జరగాలి అని ఆయన అన్నారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండేందుకు సంజీవని ప్రాజెక్టు తీసకొస్తున్నామన్నారు.
రాష్ట్రంలో ఆదాయం పెంచుకున్నప్పుడే జీవితాల్లో మార్పు సాధ్యమన్నారు. రాష్ట్ర విభజన తర్వాత మనకు అనేక కష్టాలు వచ్చాయి. 2014-19 మధ్య దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధిని చేసి చూపించాం. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు మళ్లీ స్వేచ్ఛ వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు కూడా ఎంతో విజ్ఞత చూపించారు. దేశాభివృద్ధికి ప్రధాని మోదీ అనేక సంస్కరణలు తెస్తున్నారు. దేశాభివృద్ధిలో మన రాష్ట్రం కీలక పాత్ర పోషించాలని సీఎం తెలిపారు