ప్రధాని మోదీ కోసం వెయిట్ చేసిన పుతిన్
posted on Sep 1, 2025 @ 8:10PM
ఇండియా-రష్యా సంబంధాలు ఎలా ఉంటాయో.. రెండు దేశాల మధ్య సహకారం ఏ స్థాయిలో ఉంటుందో.. ప్రపంచ దేశాలకు బాగా తెలుసు. దాన్ని మరింత బలంగా చాటేందుకు.. భారత ప్రధాని మోదీ, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ మధ్య ఇంట్రస్టింగ్ మీటింగ్ ఒకటి జరిగింది. షాంఘై సహకార సదస్సు వేదిక నుంచి.. ప్రెసిడెంట్ పుతిన్, పీఎం మోడీ ఇద్దరూ.. ఒకే కారులో ప్రయాణించారు. SCO మీటింగ్ వేదిక నుంచి ద్వైపాక్షిక సమావేశం జరిగే హోటల్‌కి.. మోడీతో కలిసి వెళ్లాలనుకున్నారు పుతిన్.
అంతేకాదు.. ప్రధాని మోడీ వచ్చే దాకా.. పుతిన్ దాదాపు 10 నిమిషాల పాటు వెయిట్ చేశారు. తర్వాత ఇద్దరు నాయకులు కారులో ప్రయాణిస్తూ.. వివిధ అంశాలపై సంభాషించారు. ద్వైపాక్షిక సమావేశం జరిగే హోటల్ దగ్గరకు చేరుకున్న తర్వాత కూడా.. ఇద్దరు నేతలు మరో 45 నిమిషాల పాటు కారులోనే గడిపారు. దీని తర్వాతే.. పుతిన్, మోడీ పూర్తి స్థాయి ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఇదొక.. గంటకు పైగా కొనసాగింది.
అయితే మోడీ కోసం పుతిన్ వెయిట్ చేయడం, తన కారులోనే ఆయన్ని తీసుకెళ్లడమే అందరి అటెన్షన్‌ని గ్రాబ్ చేసింది. పైగా మోడీ, పుతిన్ ఇద్దరూ 45 నిమిషాల పాటు కారులో దేని గురించి చర్చించారన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించాలనే దానిపై.. మోడీ ఏమైనా పుతిన్‌తో మాట్లాడి ఉంటారా? అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయ్. ఎందుకంటే.. ఇటీవలే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. తమ దేశంలో ఉన్న తాజా పరిణామాలపై.. ప్రధాని మోడీతో ఫోన్‌లో మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. శాంతియుత మార్గాల్లోనే.. సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలని.. మరోసారి భారత్ వైఖరిని స్పష్టం చేశారు మోడీ. శాంతి పునరుద్ధరణ ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు.
అందువల్ల.. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించే అంశంపై.. మోడీ ఏమైనా మాట్లాడారా? ఆ 45 నిమిషాల భేటీలో.. ఈ అంశం కూడా చర్చకు వచ్చి ఉంటుందా? అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ అదే గనక జరిగితే.. యుద్ధం ముగించడంలో మోడీది కీలకపాత్రే కాబోతోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. ఇక.. మోడీ, పుతిన్ ఒకే కారులో ప్రయాణించడం.. వాళ్లిద్దరి మధ్య ఉన్న స్నేహానికి, రాజకీయపరమైన సాన్నిహిత్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఇది కేవలం ఓ ప్రయాణం కాదు. భారత్-రష్యా మధ్య నెలకొన్న సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయో చాటిచెప్పే.. బలమైన రాజకీయ ప్రకటనగా చెబుతున్నారు.
కారులో ప్రయాణించిన సమయంలోనే కాదు.. తర్వాత జరిగిన ద్వైపాక్షిక సమావేశంలోనూ.. ఇద్దరు నేతలు కీలక అంశాలపై చర్చించారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు, ఇంధన రంగంలో సహకారం, వాణిజ్య సంబంధాల బలోపేతం లాంటి.. ఆర్థిక అంశాలపై చర్చించారు. అమెరికా విధించిన అదనపు సుంకాలు, అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం గురించి కూడా వీరు చర్చించినట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యం, సాంస్కృతిక సంబంధాలపైనా చర్చలు జరిగాయి. తమ మధ్య ఎప్పుడు ద్వైపాక్షిక చర్చలు జరిగినా.. లోతుగా, ఫలవంతంగా ఉంటాయని.. ప్రధాని మోడీ కూడా ట్వీట్ చేశారు.