ధవళేశ్వరం వద్ద ఉగ్రగోదావరి.. లంక గ్రామాలకు ముంపు ముప్పు

ధవళేశ్వరం వద్ద వరద గోదావరి ఉధృత ప్రవాహం లంక గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి వరద నీటితో పోటెత్తుతున్నది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో అధికారులు బ్యారేజి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం ఉదయం ధవళేశ్వరం బ్యారేజీని 10,92 లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్నది. బ్యారేజీ గేట్లు ఎత్తివేసి అధికారులు 10 లక్షల ఒక వేయి 410 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.  వరద ఉధృతి పెరిగే అవకాశం ఉండటంతో ముంపు గ్రామాల ప్రజలు, లోతట్టు ప్రాంతాలలో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. భద్రాచలం వద్ద కూడా గోదావరి వరద ప్రవాహం తీవ్ర స్థాయిలో ఉండటం, నీటి మట్టం 48 అడుగులు దాటి వూయడంతో  అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. 

నిఖిత హత్య కేసులో వెలుగులోకి వచ్చిన సంచలనమైన విషయాలు

  అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మేరీల్యాండ్ రాష్ట్రంలోని ఎలికాట్ సిటీలో జరిగిన ఈ హత్య వెనుక డాలర్ల అప్పు లావాదేవీలు ఉన్నట్టు తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిఖితను హత్య చేసిన వ్యక్తి ఆమె స్నేహితుడు అర్జున్ శర్మేనని హోవార్డ్ కౌంటీ పోలీసులు అధికారికంగా నిర్ధారించారు. అర్జున్ శర్మ నిఖిత వద్ద 4,500 డాలర్లు అప్పుగా తీసుకున్నట్టు గుర్తించారు. ఈ విషయాన్ని నిఖిత కజిన్ సరస్వతి సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టులో వెల్లడించారు. అప్పు తీసుకున్న అర్జున్ శర్మ అందులో 3,500 డాలర్లు మాత్రమే తిరిగి ఇచ్చి, మిగిలిన 1,000 డాలర్లు ఇవ్వకుండా ఆలస్యం చేశాడని తెలుస్తోంది. ఈ విషయమై నిఖిత అతడిని పదే పదే డబ్బులు ఇవ్వాలని అడిగినట్టు సమాచారం. పోలీసుల విచారణలో మరో షాకింగ్ అంశం బయట పడింది. నిఖిత ఖాతా నుంచి 3,500 డాలర్లు అక్రమంగా ట్రాన్స్‌ఫర్ చేసుకున్న అర్జున్ శర్మ, ఆ తర్వాత ఆమెను హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. డబ్బుల విషయంలో తలెత్తిన వివాదమే ఈ దారుణానికి దారి తీసిందని ప్రాథమికంగా తేలింది.డిసెంబర్ 31న డబ్బులు ఇస్తానని చెప్పి నిఖితను తన అపార్ట్‌ మెంట్‌కు పిలిపించిన అర్జున్ శర్మ, అక్కడే ఆమెను హత్య చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. హత్య చేసిన వెంటనే అర్జున్ శర్మ అమెరికా నుంచి పారిపోయి భారత్‌కు వచ్చినట్టు గుర్తించారు.ఈ ఘటనపై నిఖిత తండ్రి ఆనంద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “అర్జున్ శర్మ మా అమ్మాయి స్నేహితుడు మాత్రమే. మాజీ ప్రియుడు అని మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని నిఖిత తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఇస్తానని పిలిపించి మా కూతురిని అతని అపార్ట్‌మెంట్‌లో హత్య చేశాడు. ఏ తండ్రికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు,” అని ఆయన కన్నీళ్లతో చెప్పారు.డిసెంబర్ 31న నిఖిత తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి న్యూ ఇయర్ విషెస్ తెలిపిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో స్నేహితులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో హోవార్డ్ కౌంటీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. జనవరి 2న నిఖిత ఆచూకీని గుర్తించినట్టు హోవార్డ్ కౌంటీ పోలీసులు తెలిపారు. అర్జున్ శర్మ కొలంబియా ప్రాంతం లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నట్టు విచారణలో తేలింది.హత్య అనంతరం భారత్‌కు పారిపోయిన అర్జున్ శర్మను తమిళనాడు లో అదుపులోకి తీసుకు న్నట్టు సమాచారం. ఈ కేసులో అమెరికా, భారత అధికారుల మధ్య సమన్వయంతో చర్యలు కొనసాగుతున్నాయి. భారత రాయబారి కార్యాలయం సమాచారంనిఖిత హత్య జరిగిన విషయాన్ని భారత రాయబారి కార్యాలయం కుటుంబ సభ్యులకు అధికారికంగా తెలియ జేసింది. నిఖిత మృతదేహాన్ని త్వరితగతిన హైదరాబాద్‌కు తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తండ్రి ఆనంద్ విజ్ఞప్తి చేశారు.నిఖిత హత్యకు పాల్పడిన అర్జున్ శర్మకు అమెరికా ప్రభుత్వం కఠినమైన శిక్ష విధించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన ప్రవాస భారతీయులను తీవ్రంగా కలచివేసింది.

మండలిలో కవిత కన్నీళ్లు...అవినీతిని ప్రశ్నించినందున సస్పెండ్

  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసన మండలిలో భావోద్వేగానికి గురయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు ఏ బాధ్యత అప్పగించినా అంకితభావంతో, చిత్తశుద్ధితో నిర్వర్తించానని పేర్కొన్నారు. అయితే పార్టీ, ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రశ్నించినందుకే తనను దారుణంగా అవమానించి బయటకు పంపారని కవిత మండలిలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… “2004లో అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి భారత్‌కు వచ్చాను. 2006లో తెలంగాణ ఉద్యమంలోకి అడుగుపెట్టాను. 2013–14లో తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పే కీలక ఘట్టాలు చోటుచేసుకున్నాయి. తెలంగాణపై తుది నిర్ణయం తీసుకుంటారని పిలుపు రావడంతో 2013లో కుటుంబ సమేతంగా ఢిల్లీకి వెళ్లాం. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత రెండు నెలలు గడిచినా కాంగ్రెస్ పెద్ద నాయకుల్లో ఎవరూ మమ్మల్ని పలకరించలేదు. అటువంటి సమయంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి సన్నిహితుడైన ఆస్కార్ ఫెర్నాండెజ్‌తో ఉన్న పరిచయం వల్ల కేసీఆర్‌కు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయగలిగాను. ఆ తర్వాత సోనియా గాంధీ ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ కావడంతో తెలంగాణ సాధన ముందుకు సాగింది” అని కవిత తెలిపారు. 2014లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించామని, ఆ తర్వాత నుంచే తనపై ఆంక్షలు మొదలయ్యాయని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. పార్టీలో అవినీతిని ప్రశ్నించినందుకే తనపై కక్షగట్టారని ఆరోపించారు. ఈడీ, సీబీఐ కేసుల్లో తాను పోరాడుతున్న సమయంలో పార్టీ తనకు అండగా నిలవలేదని, కేసీఆర్‌పై కక్షతో బీజేపీ తనను జైలుకు పంపించినా పార్టీ ఆదుకోలేదని కవిత విమర్శించారు. “అమరవీరుల స్తూపం నుంచి కలెక్టరేట్ల వరకు అన్నిచోట్లా అవినీతి జరిగింది. సిద్ధిపేట, సిరిసిల్ల నిర్మించిన కలెక్టరేట్ ఒక్క వర్షానికే కొట్టుకుపోయింది. అమరవీరులకు తగిన గుర్తింపు ఇవ్వాలని, ఉద్యమకారులకు పింఛన్ ఇవ్వాలని పార్టీ వేదికల్లో ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదు. కేసీఆర్‌ను ప్రశ్నించే ధైర్యం నాకే ఉంది. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని ఎన్నిసార్లు కోరినా ఫలితం లేదు. ఆ పరిశ్రమను తెరిపించలేకపోవడం నాకు అవమానకరం. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్‌పై వచ్చిన ఆరోపణలపై బీఆర్ఎస్‌లో పెద్ద నాయకులమని చెప్పుకునే వారెవరూ స్పందించలేదు. అందుకే ప్రెస్‌మీట్ పెట్టి బలంగా మాట్లాడాను. అవినీతిపరుల పేర్లను మీడియాకు వెల్లడించాను” అని కవిత తెలిపారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చాలన్న నిర్ణయాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకించానని, పార్టీ పేరు మార్పు, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడాన్ని తాను ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. “తెలంగాణలో ఏం సాధించామో చెప్పకుండా జాతీయ రాజకీయాల్లోకి వెళ్తామని చెప్పడం సరైంది కాదు” అంటూ కవిత తన ఆవేదనను వ్యక్తం చేశారు.

కోనసీమలో బ్లో ఔట్.. వణికిపోతున్న జనం

కోనసీమలో ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. మలికిపురం మండలం ఇరుసుమండ వద్ద ఈ లేజీజ్ సంభవించింది. భారీ శబ్దంతో గ్యాస్ లీక్ అవుతుండటంతో పరిసర ప్రాంతాల వారు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. భారీ స్థాయిలో గ్యాస్ లీక్ అవుతుండటం, మంటలు ఎగసిపడుతుండటంతో   కోనసీమ వాసులు భయాందోళనలతో వణికి పోతున్నారు.  మూడు దశాబ్దాల కిందటి బ్లో ఔట్ ను తలచుకుని ఆందోళనకు గురౌతున్నారు.  సరిగ్గా 30 ఏళ్ల కిందట.. అంటే 1995 జనవరి 8న ఇదే కోనసీమలో సంభవించిన భారీ బ్లో ఔట్ ను గుర్తు తెచ్చుకుని వణికి పోతున్నారు. అప్పట్లో  కోనసీమ లోని మామిడికుదురు మండలం పాశర్లపూడి గ్రామం వద్ద ఓఎన్జీసీ రిగ్గు లీకై భారీ ఎత్తున మంటలు ఎగసి పడ్డాయి.  ఆ మంటల ధాటికి ఆ పరిసర ప్రాంతాల్లోని పచ్చదనమంతా మాడి మసైపోయింది. కొబ్బరి చెట్లు దగ్ధమైపోయాయి. జనవరి 8న జరిగిన ఆ బ్లోఔన్ మార్చి 15 నాటికి కానీ అదుపులోకి రాలేదు. అప్పట్లో సంభవించిన ఆ బ్లో ఔట్ ప్రపంచ బ్లో ఔట్ ల చరిత్రలోనే రెండో అతి పెద్ద బ్లో ఔట్ గా చరిత్ర సృష్టించింది. ఆ బ్లో ఔట్ కారణంగా భారీ నష్టం సంభవించింది. దాదాపు రెండు నెలలకు పైగా  ఆ మంటల వేడికి పాశర్లపూడి పరిసర గ్రామాల ప్రజలు మగ్గిపోయారు. పొలాలన్నీ ధ్వంసమయ్యాయి. ఇప్పుడు మళ్లీ భారీగా ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతుండటంతో కోనసీమ వాసులు నాటి రోజులను జ్ణప్తికి తెచ్చుకుని భయంతో వణికిపోతున్నారు. ఓఎన్జీసీ అధికారులు తక్షణమే స్పందించి గ్యాస్ లీకేజీని అరికట్టి మంటలను ఆర్పివేయాలని కోరుతున్నారు. 

మైనర్ల సహజీవనం!

ఇద్దరు మైనర్లు సహజీవనం చేస్తున్న ఉదంతం హైదరాబాద్ లో  కలకలం సృష్టించింది. ప్రేమ పేరుతో ఇద్దరు మైనర్లు సహజీవనం చేయడం  కలకలం రేపుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కు  చెందిన మైనర్లైన అబ్బాయి, అమ్మాయి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో.. వారు ఆ ఇద్దరినీ మందలించి.. కౌన్సెలింగ్ చేసి..  ముందు చదువు పూర్తి చేసి, ఉద్యోగం తెచ్చుకుంటే, ఆ తరువాత తామే వారిరువురికీ వివాహం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే కుటుంబ సభ్యుల హితవచనాలు రుచించని ఆ మైనర్లిద్దరూ ఇంట్లో వారికి చెప్పకుండా   హైదరాబాద్‌ వచ్చి బంజారా హిల్స్ ప్రాంతంలో  ఇళ్లు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో  వీరి వ్యవహారం  వెలుగులోకి వచ్చింది. పోలీసులు  రంగం లోకి దిగి మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.  ఇద్దరూ మైనర్లు కావడంతో..   నిబంధనల మేరకు వారిని శిశువిహార్‌కు తరలించారు. బాలల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటు న్నామని, మైనర్ల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని పోలీసులు తెలిపారు. కాగా ఇద్దరు మైనర్ల సహజీవనం ఉదంతం నగరంలో కలకలం రేపింది.   తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, సమాజం సమన్వయంతో పిల్లలకు సరైన మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని  మానసిక నిపుణులు అంటున్నారు.  

మదురో కోసం ప్రాణాలొడ్డిన 32 మంది క్యూబన్ కమెండోలు

వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు బంధించిన ఆపరేషన్  32 మంది క్యూబన్ సైనికులు, నిఘా అధికారుల ప్రాణాలు తీసింది. మదురోకు రక్షణగా ఉన్న 32 మంది క్యూబన్ సైనికులు, నిఘా అధికారులు ఆయనను రక్షించేందుకు అమెరికా కమెండోలతో వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయారు. అమెరికా వైమానిక దాడులు, నేల మీద జరిగిన భీకర కాల్పుల వల్ల ఈ మరణాలు సంభవించాయి.  క్యూబన్ సైనికులు, నిఘా అధికారుల మరణాన్ని క్యూబా అధికారికంగా ధృవీకరించింది. ఒక దేశాధినేతను రక్షించే క్రమంలో తమ సైనికులు ప్రాణత్యాగం చేశారని పేర్కొన్న ఆ దేశం సోమ (జనవరి 5; మంగళ(జనవరి 6) వారాలను  దేశవ్యాప్తంగా సంతాప దినాలుగా ప్రకటించింది. మదురోకు రక్షణగా ఉన్న తమ దేశ భద్రతా దళాలు అమెరికా కమెండోలను చివరి వరకు అడ్డుకున్నాయని వెల్లడించిన క్యూబా, వారు తమ బాధ్యతను అత్యంత గౌరవప్రదంగా, వీరోచితంగా నిర్వహించారని,  ఆక్రమణదారులకు వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటంలో, బాంబు దాడుల వల్ల వారు వీరమరణం పొందారని ఒక ప్రకటనలో పేర్కొంది. మదురో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన వ్యక్తిగత భద్రతను క్యూబా పర్యవేక్షిస్తోంది. అయితే దాడి జరిగిన సమయంలో ఎంతమంది క్యూబన్లు అక్కడ ఉన్నారనే దానిపై స్పష్టత లేదు. శనివారం తెల్లవారుజామున వెనిజులా రాజధాని కరాకస్‌లో అమెరికా ప్రత్యేక బలగాలు నిర్వహించిన ఆపరేషన్‌లో 63 ఏళ్ల నికోలస్ మదురోతో పాటు ఆయన భార్య సీలియా ఫ్లోరస్‌ను కూడా బంధించి,  విమానంలో అమెరికాకు తరలించారు. ప్రస్తుతం న్యూయార్క్‌లోని ఒక డిటెన్షన్ సెంటర్‌లో ఉన్న మదురోను.. సోమవారం రోజు మాన్హాటన్ ఫెడరల్ కోర్టులో హాజరు పరచనున్నారు. మదురోపై అమెరికా ప్రధానంగా డ్రగ్స్ స్మగ్లింగ్, ఉగ్రవాదం ఆరోపణలు మోపింది. 2020లో విడుదల చేసిన అభియోగపత్రం ప్రకారం.. మదురో ప్రభుత్వం అమెరికాలోకి వేల టన్నుల కొకైన్‌ను సరఫరా చేసే ముఠాలకు సహకరిస్తోందని అమెరికా వాదిస్తోంది. ఈ నేరాలకు సంబంధించి ఆయనను విచారించేందుకే ఈ అపహరణ ఆపరేషన్ చేపట్టినట్లు ట్రంప్ యంత్రాంగం పేర్కొంది. అయితే మదురో ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూనే ఉన్నారు. దశాబ్ద కాలంగా వెనిజులాను ఏలుతున్న మదురో ఇలా అమెరికా జైలు పాలవ్వడం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు క్యూబన్ల మరణంతో ఈ వివాదం కేవలం అమెరికా-వెనిజులా మధ్యే కాకుండా క్యూబాతో కూడా దౌత్యపరమైన చిక్కులను తెచ్చిపెట్టింది. నిందితుడిగా కోర్టు ముందుకు వెళ్తున్న మదురోకు మద్దతుగా రష్యా, చైనా వంటి దేశాలు ఎలా స్పందించనున్నాన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమౌతోంది. 

అబుదాబీలో రోడ్డు ప్రమాదం.. భారత్ కు చెందిన ముగ్గురు చిన్నారులు మృతి

విదేశీ గడ్డపై ఉపాధి పొందుతూ ఆనందంగా జీవితస్తున్న ఒక భారతీయ కుటుంబంలో   విషాదం చోటు చేసుకుంది.   అబుదాబిలో ఆదివారం (జనవరి 5) తెల్లవారుజామున జరిగిన  ఘోర రోడ్డు ప్రమాదంలో  ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో వారి వారి ఇంటి పని మనిషి ప్రాణాలు కోల్పోయింది. కేరళ  మలప్పురం జిల్లా కిళిస్సేరికి చెందిన అబ్దుల్ లతీఫ్ కుటుంబం దుబాయ్‌లో నివసిస్తోంది. వీరు తమ ఐదుగురు పిల్లలతో కలిసి అబుదాబిలో జరుగుతున్న ప్రసిద్ధ లివా ఫెస్టివల్ కు వెళ్లి తిరిగి దుబాయ్ వస్తుండగా షాహామా సమీపంలో వీరి వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. కారు వేగంగా పల్టీలు కొట్టడంతో లోపల ఉన్న వారు తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా ఈ ప్రమాదంలో లతీఫ్ కుమారులు ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. అందులో 14 ఏళ్ల అషాజ్, 12 ఏళ్ల అమ్మార్, ఐదేళ్ల అయ్యష్‌లతో పాటు వారి ఇంట్లో పని చేస్తున్న బుష్రా అనే మహిళ అక్కడికక్కడే కన్నుమూశారు. అల్లారుముద్దుగా పెరుగుతున్న ముగ్గురు కొడుకులు కళ్ల ముందే ప్రాణాలు విడవడం ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ప్రమాద సమయంలో   అబ్దుల్ లతీఫ్, రుక్సానా, మిగిలిన ఇద్దరు పిల్లలు ఎజ్జా (10), అజ్జామ్ (7)లకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం వారు అబుదాబిలోని షేక్ షక్బౌట్ మెడికల్ సిటీలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో ఒక బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు.

అనుమానాస్పద స్థితిలో ఐఏఎస్ జీకే కిషోర్ కుమార్ సతీమణి మృతి

  ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి జీకే కిషోర్ కుమార్ భార్య సత్య దీపిక అనుమానాస్పద స్థితిలో నిన్న అర్ధరాత్రి  మరణించారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆమెకు గొంతు ఇన్ఫెక్షన్ కూడా రావడంతో ఆసుపత్రిలో చేరారు.  విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో సత్య దీపిక చికిత్స తీసుకుంటున్నారు. నిన్న అర్ధరాత్రి సమయంలో ఆమె కన్నుమూశారు. ఆ సమయంలో ఆమె భర్త  ఒక్కరే ఆమె పక్కన ఉన్నారు.   ఈమె ఆకస్మిక మృతి పట్ల ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వా సుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత ఆ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇలా ఉండగా ఐఏఎస్ అధికార జీకే కిషోర్ కుమార్ ప్రస్తుతం ఏపీ మిషన్ ఫర్ క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన.. ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించడానికీ, పర్యవేక్షిం చడానికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ ప్రాజెక్టును సందర్శించనున్నారు.   . ఈ నెల 7 ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్‌ ద్వారా పోలవరం బయలుదేరనున్నారు. అక్కడ ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రత్యక్షంగా  పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిం చనున్నారు. ప్రాజెక్టు పనుల వేగం, నాణ్యత, గడువులపై  అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.   చంద్రబాబు  పర్యటనతో ప్రాజెక్టు పనులకు మరింత వేగం పుంజుకోవడం ఖాయమని   అధికారులు అంటున్నారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం అక్కడ నుంచి బయలుదేరి  ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు. అనంతరం సాయంత్రం   విజయవాడలోని సిద్దార్థ కాలేజీ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో చంద్రబాబు పాల్గొంటారు. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలవరం పనులు పరుగులు పెట్టాయి. అప్పట్లో ఆయన సోమవారం కు పోలవారం అని నామకరణం చేసి మరీ క్రమం తప్పకుండా ప్రాజెక్టు పనులను పరిశీలించేవారు. అయితే ఆ తరువాత 2019లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ సీఎం అయిన తరువాత పోలవరం పనులు పడకేశాయి. మళ్లీ 2024లో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాతనే పోలవరం పనులు వేగం పుంజుకున్నాయి.

బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో మారిషస్ అధ్యక్షుడు

బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న  కనకదుర్గ అమ్మవారిని  మారిషష్ దేశాధ్యక్షులు ధర్మబీర్ గోఖూల్ దంపతులు ఈ ఉదయం దర్శించుకున్నారు.  ధర్మబీర్ గోఖూల్ దంపతులకు దేవాలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు   ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్, ఆలయ ఈవో వీకే శీనానాయక్, దుర్గ గుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ పాల్గొన్నారు. దర్శనం అనంతరం మారిషష్ దేశాధ్యక్షుల దంపతులకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి-గుంటూరు వేదికగా జరుగుతోన్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు మారిషస్ అధ్యక్షుడు ధర్మబీర్ గోఖూల్ ముఖ్య అతిథిగా విచ్చేసిన విషయం విదితమే.   

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు దంపతులు దుర్మరణం

అమెరికా లో  జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన దంపతులు దుర్మరణం పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన పాలకొల్లు వాసులు కొటికల పూడి కృష్ణ కిషోర్, ఆశ దంపతులు గత దశాబ్ద కాలంగా అమెరికాలో నివసిస్తున్నారు. కృష్ణ కిషోర్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరంతా కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఆ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కృష్ణకిషోర్, ఆశ దంపతులు అక్కడికక్కడే మరణించగా, వారి పిల్లలు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలే భారత్ కు వచ్చి, తిరిగి అమెరికాకు వెళ్లిన వీరు.. అక్కడ రోడ్డు ప్రమాదానికి గురి కావడం వారి స్వగ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.