Read more!

15 ఏళ్లకే 33 లక్షల ఉద్యోగం సాధించిన అబ్బాయి!

కొన్నిసార్లు కొన్ని విషయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. ఈ ప్రపంచంలో మనిషి మేధస్సు, అది చేస్తున్న అద్భుతాలు అలాంటివే. సాధారణంగా గడుస్తున్న కాలంలో అక్కడక్కడా కొంతమంది తమ ప్రతిభతో, తాము చేసే పనులతో వైరల్ అవుతుంటారు. ఈమధ్య కాలంలో ఒక అబ్బాయి ఇలాగే వైరల్ అయిపోయాడు.

ఇంతకు అతడు ఎందుకంత వైరల్ అయ్యాడు?? అతడు ఎవరు?? ఏంటి?? అనే విషయాలు తెలుసుకుంటే మన భారతదేశ భవిష్యత్తు ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది.

వేదాంత్ డియోకెట్ అనే భారతదేశానికి చెందిన అబ్బాయి వాళ్ళ అమ్మ పాత లాప్టాప్ తీసుకుని అప్పుడప్పుడు వాడుకునేవాడు. ఒకరోజు అందులో ఇన్స్టాగ్రామ్ చూస్తూ స్క్రోల్ చేస్తున్నప్పుడు అతనికి ఒక అనౌన్స్మెంట్ చాలా ఆసక్తిగా కనిపించింది. దాన్ని పరిశీలనగా చూస్తే వెబ్సైట్ డవలప్మెంట్ కాంపిటిషన్స్ జరుగుతున్నట్టు అర్థమయ్యింది. వెంటనే ఆ పోటీలో పాల్గొనాలని డిసైడ్ అయ్యాడు.  దానికోసం దాదాపు 2000 కంటే ఎక్కువ కోడ్ లను రాసి రెడి చేసుకున్నాడు.  వాటితో ఆ వెబ్సైట్ పోటీలో పాల్గొన్నాడు.

కట్ చేస్తే!

ఆ పోటీలో అతడు గెలిచి ఆ వెబ్సైట్ డవలప్మెంట్ పోటీలు పెట్టిన వాళ్ళ దగ్గర సంవత్సరానికి 33 లక్షల సాలరీతో జాబ్ కు ఎంపికయ్యాడు. న్యూజెర్సీకి చెందిన హెచ్ఆర్‌డి సంస్థలో వారి టీమ్ లో వేదాంత్ కు స్థానం దొరికేసింది. అతను చెయ్యాల్సిన కోడింగ్ పనిని ఆ సంస్థ వాళ్ళు చెప్పడం, దానిమీదఆ వేదాంత్ పనిచేయడం ఒక్కటే మిగులుంది అన్నప్పుడు ఆ సంస్థ వాళ్లకు ఒక షాకింగ్ నిజం తెలిసింది. అదే వేదాంత్ వయసు. 

దాదాపు వెయ్యి మంది వెబ్సైట్ డవలప్మెంట్ పోటీలలో పాల్గొంటే అందులో వేదాంత్ గెలిచాడు. ఉద్యోగమూ సంపాదించాడు. కానీ అతడి వయసు కేవలం 15 సంవత్సరాలు అని తెలిసినప్పుడు ఆ సంస్థ వాళ్ళు అయోమయంలో పడిపోయారు. 15 సంవత్సరాల అబ్బాయికి ఉద్యోగం ఇవ్వడం అంటే అది వారి నియమ నిబంధనలకు విరుద్ధం అనుకున్నారో లేక ఆ అబ్బాయి ఇంకా చదువుకోవాలి కాబట్టి ఉద్యోగం ఇవ్వకూడదు అనుకున్నారో కానీ మొత్తానికి వేదాంత్ కు ఇచ్చిన ఆఫర్ ను వాళ్ళు రద్దు చేసేసుకున్నారు. 

ఆ విషయం తెలియగానే వేదాంత్ బాగా నిరాశపడిపోకూడదని "నువ్వు నిరాశ పడకు, నీ చదువు పూర్తయిన తరువాత తిరిగి మా సంస్థను సంప్రదిస్తే నీకు ఉద్యోగం ఇస్తాం. ప్రస్తుతం నీ చదువు కొనసాగించు" అని ఎంతో ఊరడించే మాటలు చెప్పారు.

వేదాంత్ animeeditor.com అనే వెబ్సైట్ ను డవలప్ చేసాడు. అందులో వ్లాగ్ లు బ్లాగ్ లు చాట్ బాక్స్, వీడియోస్ చూసేలా డవలప్ చేసాడు. అది మాత్రమే కాకుండా యూట్యూబ్ వీడియోస్ లాంటివి అప్లోడ్ చేయడానికి కూడా ఆప్షన్స్ పెట్టారు. ఖచ్చితంగా చెప్పాలంటే చాలామంచి ఫీచర్స్ తో వెబ్సైట్ కు రూపం ఇచ్చాడు.

వేదాంత్ వథోడాలో నారాయణ ఇ-టెక్నో పాఠశాలలో చదువుతున్నాడు. సైన్స్ ఎగ్జిబిషన్ లో భాగంగా రాడార్ సిస్టమ్ మోడల్ ని రూపొందించడం ద్వారా గోల్డ్ మెడల్ కూడా గెలుచుకున్నాడు.

ఇంత ఆసక్తికరమైన వేదాంత్ విషయం చదివాక వాళ్ళ అమ్మానాన్నలు ఏమి చేస్తారో అనే ఆలోచన అందరికీ వస్తుంది. వేదాంత్ తల్లిదండ్రులు అసిస్టెంట్ ప్రొఫెసర్ లుగా పనిచేస్తున్నారు. విద్యార్థులకు చదువు  విషయంలో క్రమశిక్షణ ఉండాలంటే మొబైల్, లాప్టాప్ లాంటి వస్తువులు ఇవ్వకూడదు అనే భావన కలిగిన ఆ తల్లిదండ్రులు ఇప్పటికీ తమ పిల్లాడికి లాప్టాప్ ఎక్కువగా ఇవ్వరట. వేదాంత్ కు జాబ్ ఆఫర్ వచ్చిన విషయం పాఠశాల వారికి తెలిసి వాళ్లే వేదాంత్ కోసం ఓ మంచి లాప్టాప్ కొనే పనిలో ఉన్నారట. పాఠశాల అడ్మిషన్లు పెంచుకునే వారి ఆలోచన వారిది అయితే పిల్లలు నేర్చుకోవలసినవి మాత్రమే నేర్చుకుంటే ఈ మొబైల్స్, లాప్టాప్స్ వల్ల టెక్నాలజీ యుగంలో దూసుకెళ్తారని స్పష్టంగా అర్థమైపోతుంది కదా!

మీరు పిల్లలకు మంచి విషయాల కోసం మీ మొబైల్ లాప్టాప్ ఇవ్వచ్చు. కాకపోతే జబర్దస్త్ లు, కామెడీ కింగులు లాంటి వల్గర్ కంటెంట్ చూడనివ్వకుండా ఆ వస్తువులకు ఒక టైమ్ లిమిట్ పెట్టాలి.

                                 ◆వెంకటేష్ పువ్వాడ.