శిలువ మోసిన లోక రక్షకుడు!!

ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశంలో విభిన్న మతాలు ఉన్నాయి. పాశ్చాత్య దేశాలలో అయితే వాళ్లకు క్రైస్తవమొక్కటే ఉంటుంది. అందులోనే వారు తమ సకల జీవితాన్ని గడుపుతారు. భారతదేశంలో క్రైస్తవ మతం మొదలయ్యి మెల్లగా వ్యాప్తి చెందుతూ ఉంది.  ప్రస్తుతం భారతదేశంలో క్రైస్తవుల సంఖ్య కూడా ఎక్కువే ఉంది. అందుకే ప్రతి ఊర్లో ఇప్పుడు చర్చిలు వెలిశాయి. మతం ప్రాతిపదికగా కాకుండా అందులో ఉన్న విషయం మూలంగా చూస్తే ప్రతి మతం ఓ గొప్ప మార్గమే. అలాంటి మార్గాలలో క్రైస్తవం కూడా ఒకటి. ఈ క్రైస్తవ మతానికి జీసస్ దేవుడు. ఈయనను తండ్రిగా భావిస్తారు. అలాంటి క్రైస్తవులు ఎంతో పవిత్రంగా భావించేది, క్రిస్మస్ వేడుకల కంటే ఎంతో పవిత్రమైన సందర్భం గుడ్ ఫ్రైడే. అసలు ఏమిటి గుడ్ ఫ్రైడే?? యేసుక్రీస్తును శిలువ వేసిన రోజును గుడ్ ఫ్రైడే గా చెప్పుకుంటారు. నిజానికి ఇదొక విషాద సంఘటన. అయితే క్రైస్తవ మతస్తులకు ఒక సంస్మరణ దినం లాంటిది. పాశ్చాత్య దేశాలలో దీనిని హొలీ ఫ్రైడే అని, బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే యేసు క్రీస్తును శిలువ వేసిన రోజును గుడ్ ఫ్రైడే గా, ఆ రోజున క్రీస్తును స్మరించుకుంటూ సమస్త క్రైస్తవ పౌరులు గుడ్ ఫ్రైడేను నిర్వహిస్తారు. ఎందుకు పవిత్రమయ్యింది?? ఆ దేవుడి కుమారుడు యేసు ప్రభువు అయ్యాడు. ఆయన ఈ లోకానికి తగిన మార్గనిర్దేశకం చెయ్యడానికి వచ్చాడు. ఆయన భోధనల ద్వారా తన గొంతును వినిపించాడు. అయితే ప్రతి ఒక్కరికి మరణం అనేది అనివార్యం అయినట్టు యేసు ప్రభువుకు కూడా మరణం ఎదురయ్యింది. అయితే అది మరణం కాదు. ఆయన గొంతును అడ్డుకోవడానికి, ఆయన మాటలు రుచించని వాళ్ళు చేసిన మారణహోమం లాంటిది. ఆయన తన పని పూర్తిచేసుకుని మరణానికి లొంగిపోయారు. ఆయన వచ్చిన పని పూర్తయ్యింది అందుకే మరి. ఆయన శిలువ వేయబడిన రోజు లోకులకు పవిత్రదినమయ్యింది. చివరి పలుకులు!! యేసు ప్రభువు మానవాళికి తన సందేశాన్ని వినిపించాలని అనుకున్నారు. అలాగే వినిపించడం మొదలుపెట్టారు. ఈయన దేవుడి కుమారుడిని ఆయన్ను హతం చెయ్యాలని ఎన్నో ప్రయత్నాలు మొదలయ్యాయి. యేసు ప్రభువు శిష్యుడే డబ్బుకు ఆశ పడి, యేసు ప్రభువు ఉనికి తెలిపాడని. అది ముప్పై మూడు వెండి నాణేల కోసమని అందుకే గుడ్ ఫ్రైడే రోజున కొన్ని ప్రాంతాలలో ముప్పై మూడు సార్లు గంట కొట్టడం ఒక సాంప్రదాయంగా కొనసాగుతోందని చెబుతారు. ఇకపోతే యేసు ప్రభువును సజీవంగా శిలువ వేసి, ముళ్ళ కిరీటం పెట్టి, చేతులలో, కాళ్ళలో మేకులు దింపి చేసిన హింస తలచుకుని చర్చిలలో ఆయనకు విషాదగీతాలతో నీరాజనం అందిస్తారు. పాపాలను కడిగివేసే రుధిర పుత్రుడు!! మీ పాపాలను నాయందు వేయండి నేను భరిస్తాను అని అంటారు యేసు ప్రభువు. ఆయన శిలువ వేయబడినప్పుడు చిందిన ప్రతి రక్తపు బొట్టు సకల జనుల పాపాలను కదిగివేసిందని విశ్వశిస్తారు. ఇంకా యేసు ప్రభువు చివరగా చెప్పిన ఏడు మాటలను పదే పదే తలచుకుంటారు. ఈస్టర్!! గుడ్ ఫ్రైడే శుక్రవారం వస్తుంది. ఆరోజు శిలువ వేయబడ్డ యేసు ప్రభువు జరిగి మూడురోజుల తరువాత లేచాడని, అంటే ఆదివారం రోజున ఆయన సజీవంగా కనిపించారని చెబుతారు. ఆ సంతోష సందర్భంగా ఆదివారం రోజున ఈస్టర్ జరుపుకుంటారు. ఎంతో ప్రత్యేకంగా, పవిత్రంగా భావించే గుడ్డును ఈరోజు వీరి ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకుంటారు. ఇంకా గుడ్డు ఆకారంలో బోలెడు అలంకరణలు కూడా చేస్తారు. బైబిల్ లో గుడ్ ఫ్రైడే, ఈస్టర్ గురించి ఎలాంటి ప్రస్థావనలు లేకపోయినా యేసు ప్రభువును స్మరిస్తూ వీటిని ఎన్ని ఏళ్లుగా జరుపుకుంటూనే ఉన్నారు.                                    ◆ వెంకటేష్ పువ్వాడ

ఒంటిమిట్ట కల్యాణ మహోత్సవం!!

కోదండరాముడంట అమ్మలాలా, కౌసల్య పుత్రుడంట అమ్మలాల అని పాడుతుంటే రామభక్తుల మనసు రమణీయంగా ఉంటుంది. చేతిలో కోదండం అనే ధనస్సు పట్టుకుని ఉంటాడు కాబట్టి ఈయన కోదండ రాముడయ్యాడని తెలుస్తుంది.  రామాయణంలో రామలక్ష్మణులు చిన్నగా ఉన్నప్పుడే విశ్వామిత్రుడు యాగరక్షణ కోసం వాళ్లను తీసుకెళ్లడం. యాగరక్షణ తరువాత సీతమ్మ స్వయంవరానికి వెళ్లి అక్కడ శివదనస్సు విరిచి సీతమ్మను పెళ్లాడటం అందరికీ తెలిసిందే. అయితే అదంతా జరిగిపోయిన తరువాత కూడా రామలక్ష్మణులు ఒకసారి యాగరక్షణ కోసం వెళ్లినట్టు ఓ పురాణ కథనం ఉంది. దుష్టశిక్షణకై నడక!! మృకండుడు, శృంగుడు అని ఇద్దరు మహర్షులు ఉండేవాళ్ళు. వాళ్లిద్దరూ ఒక యాగం చేస్తుంటే రాక్షసులు ఆ యాగాన్ని అడ్డుకుంటూ ఆ మహర్షులను బాధపెట్టేవాళ్ళు. ఆ మహర్షులు ఇద్దరూ రాముడి దగ్గరకు వెళ్లి "రామా!! నువ్వు చిన్నతనంలోనే విశ్వామిత్రుడితో వెళ్లి యాగరక్షణ చేసావు కదా!! ఇప్పుడు మాక్కూడా అలాంటి రక్షణ కావాలి. మేము చేసే యాగం ఎలాంటి అడ్డంకులతో ఆగిపోకుండా నువ్వు  వచ్చి కాపాడు" అని అడగగా,  సీతాలక్ష్మణ సమేతుడై వెళ్లిన ఆ రామచంద్రుడు యాగాన్ని రక్షించాడు. దానికి గుర్తుగా మృకండుడు, శృంగుడు ఇద్దరూ ఆ సీతారామ లక్ష్మణులను ఏకశిలలో చెక్కించారు. జాంబవంతుడు ఈ ఆలయంలో విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేసాడు. హనుమంతుడు లేని ఆలయం!! రాముడి బంటు హనుమంతుడు. రామనామం జరిగే ప్రతిచోటా హనుమంతుడు ఉంటాడు. రాముడున్న ప్రతిచోటా హనుమంతుడు ఉంటాడు. కానీ ఈ ఒంటిమిట్టలో సీతారామ లక్ష్మణులు మాత్రమే ఉంటారు. సీతారామ లక్ష్మణులతో పాటు హనుమంతుడు లేని ఆలయం ఇదొక్కటేనని చెబుతారు. కారణం గురించి ఆలోచిస్తే రాముడికి, హనుమంతుడికి పరిచయం జరగకమునుపు ఇదంతా జరిగి ఉంటుందని పెద్దలు, చరిత్రకారులు చెబుతారు. విశేషాలు!! ఒంటిమిట్ట కోదండరామాలయానికి ఎంత చరిత్ర ఉందొ, అంతకు మించి విశేషాలు ఉన్నాయి. ఈ కోదండ రాముడిని స్తుతిస్తూ "అయ్యల తిప్పరాజు" శ్రీ రఘువీర శతకాన్ని రచించి ఈ కోదండరాముడికే అంకితమిచ్చాడు. ఈయన కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే అయ్యలారాజు రామభద్రుడి తాతగారు కావడం గొప్ప అంశం.  బమ్మెరపోతన తను రచించిన భాగవతాన్ని ఈ కోదండరాముడికే అంకితం ఇచ్చాడు. అలాగే వావిలికొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించి దానికి ఈ కోదండరాముడి దగ్గరే మందరం అనే పేరుతో వ్యాఖ్యానం రాసాడు.  ఈయన కొబ్బరి చిప్పలో బిక్షం ఎత్తి వచ్చిన డబ్బుతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడని, దేవతా మూర్తులకు ఆభరణాలు చేయించడానికి, రామసేవ కుటీరాన్ని నిర్మించడానికి ఉపయోగించాడని చెబుతారు. ఇంకా ఎంతోమంది కవులు ఈ ఏకశిలానగరంలో రామునికి తమ కవిత్వంతో అర్చన చేసుకున్నారని చెబుతారు. బ్రహ్మోత్సవాల విశిష్టత!! ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు ఎంతో గొప్పగా జరుగుతాయి. అన్నీకంటే ముఖ్యమైనది సీతారాముల కల్యాణం. పౌర్ణమి నాడు వెన్నెల వెలుగులో ఈ కల్యాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది. పౌర్ణమి రోజు వెన్నెలలో ఎందుకు జరుపుతారు అనే ప్రశ్నకు సమాధానంగా ఒక పురాణం కథనం ఉంది.  సాగర మథనం తరువాత మహాలక్ష్మిని నారాయణుడు భార్యగా స్వీకరించాడు. వీరి కల్యాణం పగటి సమయంలో జరుగుతుండటంతో చంద్రుడు తన బాధను మహాలక్ష్మీకి చేబుతాడట. నేను మీ కల్యాణం చూడలేకపోతున్నాను అని. అపుడు మహాలక్ష్మికి తమ్ముడిని తృప్తి పరచడానికి ఒంటిమిట్ట ఆలయంలో పౌర్ణమి వెలుగులో రాత్రిపూట మా కల్యాణం జరుగుతుంది చూసి ఆనందించు అని చెబుతుందట. అప్పటి నుండి పౌర్ణమి సమయంలో ఎంతో అద్భుతంగా జరుగుతూనే ఉంది ఈ కల్యాణం. రాష్ట్రాలు వేరైపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒంటిమిట్టను ఆంధ్ర భద్రాచలంగా ప్రకటించి ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణంకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తోంది. ఏకాశిలానగరంలో పౌర్ణమి వెన్నెలలో సీతారాముల కల్యాణం, ఆ తరువాత రథోత్సవం చూసిరండి, ఆ రాముడి గురించి ఆలకించినా ఆలపించినా మైమరిచిపోతారు.                                 ◆వెంకటేష్ పువ్వాడ.  

మహావీరుడిని స్మరించుకుందాం!!

సత్యం, ధర్మం, అహింస వంటి విషయాలను బోధించి హింసాయుతమైన జీవితాలను మార్చాలని కృషిచేసినవారు ఎందరో ఉన్నారు. నిజనికి ఈ మార్గాన్ని చెప్పే మతాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో జైన మతం ఒకటి. ఆధినాధుడు లేదా వృషభనాథుడు స్థాపించిన ఈ జైన మతానికి ఇరవై నాలుగు మంది తీర్థంకరులు ఉన్నారు. వారిలో చివరివాడు, ఇరవై నాలుగవ తీర్థంకరుడు ఈ మహావీరుడు. ఈయన కాలంలోనే జైన మతం వ్యాప్తి చెందింది. వర్థమానుడు….. మహావీరుడు!! వర్థమానుడు మహావీరుడు ఇద్దరూ ఒకటే. బీహార్ లో వైశాలి అనే నగరానికి సమీపంలో కుండ అనే గ్రామంలో క్రీ.పూ 599 సంవత్సరంలో క్షత్రీయ కుటుంబంలో మహారాజు సిద్ధార్థుడుమహారాణి త్రిషలకు  ఒక పిల్లవాడు పుట్టాడు.  ఆ పిల్లవాడికి వర్థమానుడు అని పేరు పెట్టారు. తల్లిదండ్రుల దగ్గర ఎంతో అల్లారుముద్దుగా పెరిగిన వర్తమానుడు తన ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. ఈయన భార్య పేరు యశోధర. ఈయనకు ఒక కూతురు పుట్టిన తరువాత తన ముప్పై ఆరు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అన్నిటినీ వదిలేసి సన్యాసం తీసుకున్నారు.  సుదీర్ఘ తపస్సు!! ఈయన దాదాపు పన్నెండు సంవత్సరాల పాటు తపస్సు చేశారు. ఆ పన్నెండేళ్ల కాలంలో ఆయనలో ఎన్నో రకాల ఆత్మానుభూతులు కలిగాయి.  సాలవృక్షం కింద ఈయన తపస్సు చేసిన ఈయన సర్వవ్యాపకత్వమైన జ్ఞానాన్ని సంపాదించారు. దాదాపు ముప్పై సంవత్సరాల పాటు అందరికీ జ్ఞానాన్ని బోధించారు. అంగ, మిథిల, కోసల, మగధ దేశాలలో ఈయన తన తత్వాలను ప్రచారం చేసాడు. త్రిరత్నాలు!! పంచవ్రతాలు!! సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ జీవనం అనే మూడింటిని త్రిరత్నాలు అని అంటారు. ఈ మూడు మనిషి జీవితం మోక్షం సాధించడానికి మార్గాలు అని వర్తమాన మహావీరుడు ప్రతిపాదించాడు. సరైన విధంగా దేన్నైనా చూడటం(చూడటం అంటే ఇక్కడ దృష్టికోణం అని అర్థం), సరైన జ్ఞానం, సరైన జీవితం ఇవన్నీ మనిషి మోక్షసాధనకు మూలం అని చెప్పారు. ఇకపోతే పార్శ్వనాథుడు ప్రతిపాదించిన అహింస, సత్యం, అపరిగ్రహం, అస్థేయం అనే నాలుగింటికి బ్రహ్మచర్యం అనే దానిని కలిపి పంచవ్రతాలు రూపొందించాడు.  పంచవ్రతాలు మనిషి జీవితంలో పాటించడం ఎంతో ముఖ్యమని, వాటిని పాటిస్తూ త్రిరత్నాలలో జీవిస్తే మనిషి మోక్షానికి పాత్రుడు అవుతాడని వర్తమాన మహావీరుడు చెప్పాడు. అలాగే ఈయన ఆ కాలానికే బ్రాహ్మణ ఆధిక్యతను వ్యతిరేకించాడు. పవిత్రమైన జీవితాన్ని గడుపుతూ, నిష్ఠగా తపస్సు చేస్తే ఎలాంటి వారు అయినా మోక్షాన్ని సాధించవచ్చని తెలియజేసారు. ఆదర్శ మార్గం!! అహింస అనే మార్గాన్ని ఆదర్శప్రాయంగా స్వీకరించి దాన్ని ఆచరించి బానిసత్వంలో ఇరుక్కుపోయిన భారతదేశానికి స్వతంత్ర్యాన్ని తీసుకురావడానికి కృషి చేసిన వారిలో మహాత్మ గాంధీ ఒకరు. ఈయన స్వయంగా వర్తమాన మహావీరుడి భోధనలకు ప్రభావితమై తన జీవితాంతం అహింసా  మార్గాన్ని అనుసరించారు.  ఈయన ఒక్కరే కాదు. వర్థమహా వీరుడి మార్గంలో  గాంధీ గారు, గాంధీ గారి మార్గంలో వెళ్లి ఆంధ్రరాష్ట్రాన్ని సాధించి పెట్టిన మరొకరు పొట్టిశ్రీరాములు గారు.  ఇలా వర్తమాన మహావీరుడి బోధనలను మార్గదర్శకంగా తీసుకుని ధన్యులు అయినవాళ్ళు ఎందరో. అలాంటి వర్తమాన మహావీరుడిని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకోవాలి. ఆయన మార్గాలను వీలున్నంతవరకు పాటించాలి.                                     ◆ వెంకటేష్ పువ్వాడ.

ధర్మరాజ దశమి సందేశం!!

యముడు అంటే అందరికీ భయం. యముడి పేరు వింటే ఇక మరణం దగ్గరకు వచ్చినట్టే అని భావిస్తారు అంతా. అయితే యముడు ఎంతో ధర్మబద్ధమైనవాడు. భూలోకంలో మనుషులు ఎంత తప్పులు చేసినా, దేవుళ్లను పూజించి వాళ్ళ పాపాలు పోయేట్టు ప్రయత్నాలు చేసినా యముడి దగ్గర మాత్రం ఎవరి ఆటలు సాగవు. చేసిన కర్మకు సరైన శిక్షను ఎంపిక చేసేవాడు యముడే. భూలోకంలో ధనిక, పేద వర్గాలు ఉన్నా ఆ యముడి దగ్గర అందరూ మరణించి ఆయన ముందుకు వెళ్లిన జీవులే అవుతారు. అందుకే సమన్యాయం చేయడంలో యముడిని మించినవాడు లేడు. అందుకే యముడిని ధర్మరాజు అని కూడా పిలుస్తారు.  ఏమిటీ ధర్మరాజ దశమి!! చైత్రశుక్ల దశమికే ధర్మరాజ దశమి అని పేరు. ఈ దశమి రోజు యముడిని పూజిస్తే  మరణభయం తొలగిపోతుందని పెద్దలు, మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా నచికేతుడి కథ వినడం ఈ ధర్మరాజ దశమి రోజు జరుగుతుంది.  ఎవరు ఈ నచికేతుడు?? పూర్వం గౌతమ మహర్షి వంశానికి చెందిన వాజశ్రవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఇతడినే ఉద్దాలకుడు అని కూడా అంటారు. ఈయన కొడుకే నచికేతుడు.  ఏమిటీ నచికేతుడి కథ!! వజాశ్రవుడు ఒక యాగం చెయ్యాలి అనుకున్నాడు. ఆ యాగంలో తన దగ్గరున్న సంపదలు అన్నీ దానం చేసేయ్యాలి. కానీ వాజశ్రవుడు యాగం అయిపోయిన తరువాత అక్కడికి వచ్చిన వాళ్లకు తనదగ్గరున్న ఆవులలో పలు ఇవ్వలేని, ఒట్టిపోయిన ఆవులను అందరికీ దానం చేస్తున్నాడు. అది నచికేతుడికి నచ్చలేదు "ఏదైనా దానం చేస్తే ఇతరులకు ఉపయోగపడాలి కానీ ఇలా ఉపయోగపడని వాటిని దానం చేస్తే ప్రయోజనం ఏంటి?? ఒకపని చెయ్యండి నన్ను కూడా ఎవరికైనా దానం చేసేయండి" అన్నాడు నచికేతుడు.  కొడుకు ఏదో పిల్ల చేష్టతో అలా అంటున్నాడనుకుని నన్ను విసిగించద్దు అన్నాడు వాజశ్రవుడు. అయినా కూడా నచికేతుడు అదే మాట పదే పదే అడగడంతో చిరవరకు విసిగిపోయిన వాజశ్రవుడు "నిన్ను యముడికి ఇస్తాను" అన్నాడు. ఆ తరువాత తొందరపాటులో అన్నానని ఆ మాటలు పట్టించుకోవద్దని చెబుతాడు  కానీ యాగం జరిగిన పవిత్ర స్థలంలో అన్నమాట జరగకుంటే మంచిదికాదని నచికేతుడు యముడి దగ్గరకు వెళ్ళాడు. యముడి దర్శనం తొందరగా దొరకలేదు. ఆ తరువాత యముడు నచికేతుడితో విషయం కనుక్కున్నాక "మీ నాన్న ఏదో మాటవరుసకు అంటే నువ్వు వచ్చేసావా వెళ్లిపో. నీకు మూడు వరాలు ఇస్తాను అన్నాడు. నచికేతుడి మూడు వరాలు!! యముడు మూడు వరాలు కోరుకోమని చెప్పగానే నచికేతుడు మొదటగా  1.నేను తిరిగి వెళ్తే మా నాన్న నామీద కోపం చేసుకోకూడదు అని అడుగుతాడు. తరువాత స్వర్గాన్ని చేరుకోవడానికి ఒక యజ్ఞాన్ని చెప్పు. అంటాడు. మూడవ కోరికగా  మరణం తరువాత ఏమి జరుగుతుంది అని అడుగుతాడు. మొదటి దానికి యముడు సరేనంటాడు. రెండవదానికి ఒక యజ్ఞం గురించి చెప్పి దానికి నచికేత యజ్ఞం అనే పేరు పెడతాడు. (స్వర్గం అంటే భయం లేని స్థితి అంటారు ఇందులో) మూడవ ప్రశ్నకు బదులుగా నువ్వు చిన్నవాడివి నీకు అవన్నీ తెలియవు, చెప్పినా అర్థం కావు అంటాడు యముడు. కానీ నచికేతుడు మొండిపట్టు పట్టడంతో  బ్రహ్మజ్ఞానం భోదిస్తాడు. అదే ఆత్మజ్ఞానంగా చెప్పబడుతుంది. ఆత్మజ్ఞానం కలిగినవాడు మరణాన్ని గురించి తొణకడు. ధర్మరాజ దశమి రోజు నచికేత యజ్ఞం చేసినవారికి మరణ భయం ఉండదనేది ఇందుకే. అందుకే ఈ ధర్మరాజ దశమి ఎంతో ప్రాముఖ్యం పొందింది. స్వామి వివేకానంద అంటాడు. నచికేతుడి లాంటి పదిమంది శిష్యులను నాకు ఇస్తే ఈ దేశాన్ని మార్చేస్తాను అని. అంటే నచికేతుడు గుణంలోనూ, పట్టుదలలోనూ ఆలోచనల్లోనూ ప్రశ్నించే గుణంలోనూ ఎంతో గొప్పవాడని ప్రత్యేకంగా చెప్పాలా??                                          ◆వెంకటేష్ పువ్వాడ.  

ఉత్తరాయణ విశిష్టత!! 

సంవత్సరాన్ని ఆరు ఋతువులు, పన్నెండు మాసాలుగా విభిజించినట్టు అందరికీ తెలుసు. అయితే ఉత్తరాయణం, దక్షిణాయణం గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. ఆ కొంతమంది కూడా తెలుగు సంవత్సరాన్ని చక్కగా తెలుసుకుని, దాన్ని పాటించేవాళ్లకే అర్థమవుతుంది. సాధారణంగా మహావిష్ణువు దక్షిణాయణంలో నిద్రపోయి, ఉత్తరాయణంలో నిద్ర నుండి మేల్కొంటాడని, అందుకే ముక్కోటి ఏకాదశి రోజున పెద్ద ఎత్తున భక్తులు  దర్శనానికి వెళ్తారు.ఇక శాస్త్ర పరంగా చూస్తే సూర్యుడు దక్షిణదిక్కుకు దగ్గరలో ఆరు నెలల పాటు, ఉత్తర దిక్కుకు  ఆరు నెలల పాటు ప్రయాణిస్తాడు. ఇదంతా భూమద్యరేఖ, అక్షాoశ, రేఖాoశాల వల్ల కలిగే మార్పుగా అర్ధం చేసుకోవచ్చు. ఉత్తరాయణం తెలుగు సంవత్సర ప్రకారం పుష్యమాసంలో మొదలై ఆషాడ మాసంలో ముగుస్తుంది. ఈ ప్రారంభం పగటి సమయం తక్కువగా ఉండి, రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది కారణం  సూర్యుడు ఉత్తర దిక్కు వైపు ఉండటం వల్ల భూమండలానికి దూరంగా ఉంటాడు. నమ్మకం!! చాలామంది ఉత్తరాయణంలో చనిపోయేవాళ్లకు మళ్ళీ జన్మ ఉండదని, దేవుడు కృపకు పాత్రులయ్యి ఆ దేవుడి సమక్షాన్ని చేరుకుంటారని చెబుతారు. అదే దక్షిణాయణంలో మరణించేవారు మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూ, కర్మలు చేస్తూ, ఆ కర్మల తాలూకూ ఫలితాలను అనుభవిస్తారని చెబుతారు. అయితే గీతలో కృష్ణుడు చెప్పే విషయం ఒకటుంది. వెలుగు- చీకటి, జ్ఞానం-అజ్ఞానం!! ఉత్తరాయణ ప్రారంభం కాసింత చీకటి కాలం ఎక్కువే ఉన్నా క్రమంగా అది తగ్గి వెలుగు పరుచుకుంటూ ఉంటుంది. ఈ వెలుగు అనేది మనిషి జ్ఞానానికి ప్రతీక కాబట్టి ఈ ఉత్తరాయణ కాలాన్ని జ్ఞానవంతమైన కాలంగా పేర్కొంటారు తప్ప వెలుగున్న కాలంలో చస్తే మోక్షం తక్కుతుందని అర్థం కాదు. జ్ఞాని అయిన మనిషి మంచి, చెడు విచక్షణ వంటివి కలిగి ఉంటాడు. ఆలోచనా పరిజ్ఞానం ఎక్కువ ఉంటుంది జ్ఞానిలో. అంటే ఉత్తరాయణం జ్ఞానిని తెలిపితే, దక్షిణాయణం అజ్ఞానిని సూచిస్తుంది. అంటే జ్ఞానిగా మరణించేవాడు ఉత్తమ గతులు పొందుతాడు అని అర్థం. దేవదేవతా నమామ్యహం!! భారతీయ హిందూ సంప్రదాయంలో దేవుళ్ళ ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది. భక్తులు ఎన్నో విధాలుగా దేవతలను సేవిస్తారు. పూజలు, వ్రతాలు, నోములు, దీక్షలు ఇలా ఎన్నో దేవుళ్ళను ప్రసన్నం చేసుకోవడానికి చేస్తారు. అయితే మనుషులకు పగలు, రాత్రి ఎలాగో,దేవుళ్ళకు ఉత్తరాయణం, దక్షిణాయణం అలాంటివేనని కాబట్టి ఉత్తరాయణంలో దేవతలు మెలకువగా ఉంటారని పండితులు చెబుతారు. అంటే ఈ ఉత్తరాయణంలో చేసే పూజలు, వ్రతాలు ఎంతో గొప్ప పలితాన్ని ఇస్తాయనమాట. అందుకే ఈ కాలంలో కోర్కెల నిమిత్తం తలపెట్టే దైవ కార్యాలకు పలితాలు తొందరగా లభిస్తాయని కూడా నమ్ముతారు. ఇకపోతే చీకటి కాలం నుండి వెలుగులోకి సూర్యుడు పయనం అవ్వడం ఇక్కడి ప్రత్యేకత. అదే మకర సంక్రాంతిగా తెలుగువారి పెద్ద పండుగగా చాలా గొప్పగా నిర్వహించుకుంటారు. పంటలు పండి ధాన్యం ఇంటికి చేరి, అవి అమ్మగా చేతులకు డబ్బులొచ్చి రైతులు అందరూ ఎంతో సంతోషంగా ఉండటం దేశానికి మంచిది. రైతు సంతోషంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది. ఇలా ఉత్తరాయణ ప్రారంభమే ఓ గొప్ప ఆశతో మొదలవుతుంది కాబట్టి ఈ ఉత్తరాయణం శాస్త్రపరంగానూ, ఆధ్యాత్మిక పరంగానూ అందరికీ మంచి చేయాలని కోరుకుందాం. ◆ వెంకటేష్ పువ్వాడ

ఆరోగ్యానికొక అవకాశమిద్దాం!!

అవకాశం జీవితాలను ఎన్నో మలుపులు తిప్పే అద్భుతం అని చెప్పవచ్చు. అది రంగం ఏదైనా, వ్యక్తులు ఎవరైనా, పరిస్థితులు ఎలాంటివైనా అవకాశం అంటే అదృష్టమే. అవన్నీ మనిషి సామాజికంగా ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే మనిషి ఏదైనా సాధించాలంటే మొదట ఆరోగ్యవంతుడిగా ఉండాలి. దురదృష్టవశాత్తు నేటి కాలంలో సంపూర్ణ ఆరోగ్యవంతులు కరువయ్యారు.  కొన్నేళ్ల కిందట పల్లెల్లో కష్టం చేసుకుని బతికే వాళ్లకు ఎలాంటి జబ్బులు రావడం లేదు, వాళ్ళ జీవితకాలం పట్టణాల్లో నివసించేవాళ్ళతో పోలిస్తే ఎక్కువ అని చెప్పుకునేవాళ్ళం. వాళ్ళ కష్టమే కాకుండా వాళ్ళ ఆహారపు అలవాట్లు కూడా వాళ్ళ శారీరక దృఢత్వానికి కారణం. అయితే నూతన ఒరవడికి ఆకర్షించబడని జీవులు అంటూ ఉండరు. ముఖ్యంగా మనుషులు కొత్తవాటి వైపు చాలా తొందరగా అడుగులు వేస్తారు. అది శుభపరిణామమే అయినా వాటిలో ఉన్న నష్టాలు వాటిలో ఉంటాయి అనే విషయాన్ని మొదట తెలుసుకోరు. ఫలితాలే మనుషుల ఆరోగ్యాలు రోజురోజుకు క్షీణించడం.  మనిషి సగటు జీవితకాలం క్రమంగా తగ్గిపోవడం. ఇవన్నీ చూసి కేవలం ఆందోళనతోనే పైకి పోయేంత బలహీనులున్నారంటే మనిషి మానసిక శారీరక స్థాయి నిలకడగా లేకుండా ఎంత కంపనాలకు లోనవుతోందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆరోగ్యానికి ఒక అవకాశం ఇవ్వాలి ఇప్పుడు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా మన ఆరోగ్యానికి మనమే ఒక అవకాశం ఇచ్చుకుందాం. అదేంటి అంటారా……. చూద్దాం మరి. ఆహారం!!  ఆరోగ్యం ముఖ్యంగా ఆహారం మీదనే ఆధారపడి ఉంది. ఆహారం శక్తికి మూలవనరు. శక్తి ద్వారా శరీర సామర్థ్యము పెరుగుతుంది. కాబట్టి తీసుకునే ఆహారం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు. ముఖ్యంగా ఆడవాళ్లు ఆహారం విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వద్దు. ఎముకలు, నరాల బలహీనత వంటి సమస్యలు కొనితెచ్చుకోవద్దు. ఎందుకంటే ఓ దశలో ఆడవాళ్లు బిడ్డల్ని మోయాలి, తమ శరీరంలో ఆ బిడ్డల ఎదుగుదల బాగుండాలి అంటే ఆడవాళ్లు మెజ్నదు బాగుండాలి. అలాగే వయసుకు తగ్గట్టు అందుబాటులో ఉన్న వాటిలోనే సమర్థవంతమైన ఆహారం తీసుకోవాలి. అప్పుడే బాగుంటాము. ఇంకా ముఖ్యంగా బయట ఆహారాన్ని వదిలెయ్యాలి. శుభ్రత!! ఆరోగ్యం విషయంలో శుభ్రత ముఖ్యమైనది. వండుకునే కూరగాయలను శుభ్రంగా కడిగి వండుకోవడం నుండి, వంటగది, ఇల్లు, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వరకు అన్నిరకాలుగా శుభ్రత ఉండాలి. ఒకేసారి పెద్ద మొత్తం వండి వాటిని అలాగే పెట్టి వాటిని మళ్ళీ తినడం బదులు అవసరమైనప్పుడు కొద్దిగా వండుకోవడం ఉత్తమం. సమయం వేస్ట్ అవుతుందనే ఆలోచనతో ఒకేసారి వండుకోవద్దు. తప్పనిసరిగా ఆహారపదార్థాలు కానీ, సరుకులు కానీ నిల్వ చేసుకోవాల్సి వస్తే ఆ ప్రదేశాలను, కంటైనర్లను శుభ్రంగా ఉంచుకోవాలి. జాగ్రత్తలు!! జాగ్రత్తల వల్ల సమస్యలు రాకుండా ఉండవచ్చు, వాటిని దూరంగా ఉంచవచ్చు.  బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తలు పాటించడం. ఎక్కడ ఉమ్మి వేయకుండా ఉండటం, గుంపుగా ఉన్న చోట తినకుండా ఉండటం, ఎక్కడపడితే అక్కడ మూత్రవిసర్జన చేయకుండా ఉండటం. తుమ్ములు వచ్చినప్పుడు కర్చీఫ్ అడ్డు పెట్టుకోవడం. జలుబు, దగ్గు, జ్వరం లాంటివి ఉన్నప్పుడు రద్దీ ప్రాంతాలకు వెల్లకపోవడం మంచిది. మాంసాహారం ఏదో చెడు చేస్తుంది అని చెప్పడం కంటే దాన్ని కూడా జాగ్రత్తగా వాడిస్తాం మంచిది. వీలైతే తాజాగా ఉన్న మాంసం తీసుకోవడం మంచిది. కాసింత ధర ఎక్కువైనా హాస్పిటల్ కు వెళ్లే గోల తప్పుతుంది కదా.  దగ్గరగా దగ్గరగా….. దేనికి దగ్గరగా ఉండాలి అని ప్రశ్న వద్దు. మనిషి శరీరం ఆ ప్రకృతి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. పంచభూతాల కలయిక అయిన ఆ ప్రకృతి, మనిషి శరీరం రెండూ కూడా ఓకేలాంటివి. అందుకే వీలైనంత వరకు ప్రకృతికి దగ్గరగా ఉండేలా అయితే మంచిది. ఇంకా మనిషి శరీరాన్ని పటిష్టం చేసి రోగనిరోధక శక్తిని పెంచే మన ప్రాచీన మార్గాలు అయిన ఆయుర్వేదం, యోగ, ప్రాణాయామం వంటివి ఎంతో గొప్పగా దోహదం చేస్తాయి.  పైన చెప్పుకున్నట్టు అన్నివిధాల ఆలోచించి మన ఆరోగ్యానికి మనమే అవకాశం ఇచ్చుకోవాలి. అప్పుడే మన ఆరోగ్యం పదిలం.                                   ◆వెంకటేష్ పువ్వాడ.

తనదాకా వస్తే కానీ

అది ఓ మారుమూల పల్లెటూర్లోని చిన్న పెంకుటిల్లు. పెద్దగా సంపద లేకపోయినా ఆ ఇంట్లో సంతోషానికి మాత్రం లోటు లేదు. ఓ భార్యాభర్తా, వారికి ఓ కొడుకూ కూతురు... ఇలా నలుగురూ హాయిగా ఆ ఇంట్లో జీవిస్తుండేవారు. వాళ్లు మిగిల్చిన చిన్నా చితకా ఆహారం మీద ఓ ఎలుక బతుకుతూ ఉండేది. ఇలా ఉండగా ఓ రోజు ఆ ఇంటి యజమాని ఏదో కొత్త వస్తువుని తీసుకురావడం ఆ ఎలుక గమనించింది. అదేమిటా అని తన కన్నంలోంచి చూసిన దాని గుండె పగిలిపోయింది. తనని పట్టేసేందుకు యజమాని ఒక బోను తీసుకువచ్చాడు.   ఎలుక లబోదిబోమంటూ పెరట్లోకి పరుగులెత్తింది. ఆ ఇంటి పెరట్లో ఒక కోడి, మేక, పొట్టేలు ఉన్నాయి. ముందుగా కోడి దగ్గరకి వెళ్లి ‘మీ యజమాని నాకోసం ఒక బోను తీసుకువచ్చాడు. అది ఎవరికైనా హాని చేయవచ్చు జాగ్రత్త! వీలైతే దాన్ని నీ కాళ్లతో లాగి అవతల పారేయ్‌,’ అంటూ హెచ్చరించింది ఎలుక.   ఎలుక మాటలకు కోడి నవ్వేస్తూ- ‘నీ కోసం తెచ్చిన బోనుతో నాకు ప్రమాదం ఎలా ఉంటుంది. నేను దాని జోలికే పోను. నువ్వే జాగ్రత్త!’ అంది. అయినా ఎలుక తన పట్టు విడవకుండా పక్కనే ఉన్న మేక, పొట్టేలు దగ్గరకు కూడా వెళ్లి ఇదే హెచ్చరికను చేసింది. కానీ వాటి నుంచి కూడా కోడి చెప్పిన జవాబులాంటి సమాధానమే వినిపించింది.   తన మాటని ఎవ్వరూ వినకపోగా, తనని హేళన చేయడంతో ఎలుక చిన్నబుచ్చుకొని తన కలుగులోకి చేరింది. ఇక మీదట తనే కాస్త జాగ్రత్తగా ఉండేందుకు నిర్ణయించుకుంది. ఆ రోజు రాత్రి బోనులో ఏదో పడిన చప్పుడి వినిపించింది. అదేమిటా అని తెలుసుకునేందుకు ఇంటి యజమానురాలు ఆసక్తిగా బయటకి వచ్చింది. అంతే! బోనులో తోక ఇరుక్కుపోయిన ఓ త్రాచుపాము పడగ మీద ఆమె కాలు పడింది. తన తల మీద కాలు పడితే పాము ఎందుకు ఊరుకుంటుంది. వెంటనే యజమానురాలిని ఒక్క కాటు వేసింది.   యజమానురాలి అరుపులు విన్న యజమాని వెంటనే పాముని చావబాది, భార్యని వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్లాడు. వైద్యుడు ఏదో చికిత్స చేసి పంపాడే కానీ, రోజులు గడిచేకొద్దీ యజమానురాలి ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. భార్యకు నయమయ్యేందుకు భర్త అన్ని ఉపాయాలూ పాటించడం మొదలుపెట్టాడు. అలా ఎవరో అతనికి కోడిమాంసంతో చేసిన కషాయంతో గుణం కనిపిస్తుందని చెప్పగానే వెంటనే పెరట్లోని కోడిని ఒక్క వేటు వేశాడు.   రోజులు గడిచినా యజమానురాలి ఆరోగ్యంలో ఎలాంటి మార్పూ రాలేదు సరికదా మరింత క్షీణించసాగింది. దాంతో ఆమెను ఆఖరిసారి చూసేందుకు దగ్గరి బంధువులంతా తరలి వచ్చారు. మరి వారందరికీ భోజనం ఎలా! అందుకని ఆ రోజు వారికి ఆహారంగా మేకని బలిచ్చారు. ఇక మరో వారం గడిచేసరికి యజమానురాలు కన్నుమూసింది. ఆమె అంత్యక్రియల కోసమని బంధువులతో పాటుగా వీధివీధంతా కదిలి వచ్చింది. ఆ రోజు వారికి ఆహారంగా పొట్టేలు తల తెగిపడింది. ఇదంతా తన కలుగులోంచి చూస్తున్న ఎలుక మాత్రం బతుకుజీవుడా అనుకుంది.   ‘సంఘంలో బతుకుతున్నప్పుడు, ప్రతి ఒక్కరి సమస్యా ఇతరులని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది’ అన్న సూత్రం ఈ కథలో బయటపడుతుంది. కష్టం మనది కాదు కదా! అనుకుని దాన్ని అశ్రద్ధ చేస్తే చివరికి అదే కష్టం మన తలుపు తట్టే రోజు వస్తుంది. అలా కాకుండా తోటివారి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తే, అది మనకి తెలియకుండానే ఏదో లాభాన్ని అందిస్తుంది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.  

 ఏప్రిల్ పూల్ అవ్వకండి ఈసారైనా!!

మార్చ్ ముగింపు వచ్చేసింది. మార్చ్ అవ్వగానే ఏప్రిల్ వస్తుంది. అయితే ఏంటి?? ఏప్రిల్ అవ్వగానే మే వస్తుంది, తరువాత జూన్, మళ్ళీ జులై ఇంతేగా అని అందరూ అంటారేమో. కానీ ఏప్రిల్ నెలకు ఒక తుంటరి తనాన్ని జోడించారు అందరూ. ఆ తుంటరి తనమే ఏప్రిల్ ఫూల్ చెయ్యడం. ఎదో ఒకటి చెప్పి నమ్మించి తీరా గాభరా పడో, నమ్మేయడమో చేయగానే ఏప్రిల్ పూల్ అని అని వెక్కించే వాళ్ళు చాలా మంది. ముఖ్యంగా పిల్లలకు, యూత్ కు ఇదొక పెద్ద సరదా. ఆ సరదా ఏప్రిల్ ఒకటవ తారీఖు మొత్తం హంగామా చేస్తుంది. అయితే సరదాగా సంవత్సరానికి ఒకసారి అయిపోయే ఈ ఫ్యూలిష్ నెస్ జీవితంలో కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది మరి. నిర్ణయాలు!! తీసుకునే నిర్ణయాలు ఆవేశంతో లేకుండా ఆలోచనతో ఉంటే వాటి తాలూకూ ఫలితాలు బానే ఉంటాయి. అలాగే ఎవరికోసమో మీకు ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం కాకుండా మీకు తృప్తి కలిగించేలా తీసుకుంటే తరువాత బాధపడాల్సిన అవసరమే ఉండదు.  ఫూల్స్ ఏమి కాదు!! ఏదో ఏప్రిల్ 1st న ఫూల్ అవ్వగానే ఇక సంవత్సరమంతా ఫూల్ అయిపోయినట్టు ఫీలవుతుంటారు చాలామంది. అయినా మీద రంగు పడిందనో, డ్రెస్సు చిరిగిపోయిందనో చెప్పే మాటలు వినేసి ఫూల్స్ అయిపోయినదానికి, ఎంతో ప్రాముఖ్యత ఉన్న సంవత్సర కాలానికి ఎలా ముడిపెడతారు?? ఆ సంవత్సరమంతా ఫూల్స్ అయిపోయినట్టు ఎందుకు అనుకుంటారు. ఎంత అర్థం లేని విషయం కదా అది. ఎప్పుడూ ఇవి కూడా ఉండవు!! భగవద్గీతలో కృష్ణుడు ఒక మాట చెబుతాడు. మనిషికి దుఃఖం పుడుతుంది, ఆ దుఃఖం పుట్టగానే అది పోయేవరకు మనిషి ఎంతో ఇదైపోతాడు. ఆ తరువాత సుఖం వచ్చాక అది కూడా దుఃఖంలా కొన్నిరోజులు ఉంటుంది అని అర్థం చేసుకోడు, మనిషికి ఎప్పుడూ సుఖమే కావాలి అదే కదా మనిషి అత్యాశ. అందుకే సుఖాలు కూడా ఎప్పుడూ ఉండవని, సుఖం, దుఃఖం ఒకదాని తరువాత మరొకటి వస్తూ వుంటాయని అర్థం చేసుకుంటే ఇక నిశ్చింతనే. అనవసర ఆందోళనలు!! అందరూ చేసే చాలా పెద్ద తప్పు అనవసర విషయాలకు ఆందోళన పడటం. ఏదైనా చేయాలన్నా ఆందోళన, ఏదైనా చెప్పాలన్నా ఆందోళన, నిర్ణయాలు తీసుకోవాలన్న ఆందోళన, ఏదైనా వద్దనుకోవాలన్నా ఆందోళన ఇలా ఆందోళన వలయంలో పడి మనుషులు నిజంగా ఫూల్స్ అయిపోతారు. ఆ ఆందోళనలో చాలా వరకు ఎన్నో రకాల తప్పులు చేసి తరువాత అయ్యో అనుకుంటారు. కాబట్టి ఇలాంటి ఆందోళన, ఖంగారు లాంటివి ఉంటేనే నిజమైన ఫూల్స్ అన్నట్టు మరి. తొక్కి పడేయండి!! ఒత్తిడులు, వేదనలు మనిషిని ఊరికే బాధిస్తాయి. అవన్నీ జీవితం నుండి వెళ్లిపోవాలి. అందుకే మెల్లగా వాటి కోసం ఎక్సిట్ గేట్ వెతకండి. వాటిని కాలికింద తొక్కి బయటకు తన్నేయండి. ఈ ఒక్క పని మనిషిలో ఎన్నో ప్రశ్నలను పటాపంచలు చేస్తుంది.   గెలుపు సూత్రం!! ఒకే ఒక పని మనిషిని అన్ని కాలాలలోనూ స్థిరంగా, ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. అదే అంతా మంచికే అనుకోవడం, నవ్వుతూ ఉండటం. ఎవరేమన్నా పట్టించుకోకుండా చెయ్యాల్సిన పనిని ఏకాగ్రతగా చేసెయ్యడం. ఇంకా ఇంకా చెప్పాలి అంటే మనిషి ఎప్పుడూ ఏ విషయంలో మాట్లాడకూడదు, పని మాత్రమే కనిపించాలి. అలాంటి మనస్తత్వాన్ని తీర్చిదిద్దుకుంటే ఇలాంటి ఏప్రిల్ ఫూల్స్, ఇంకా ఫెయిల్యూర్స్ ఏమీ చేయలేవు మరి. లేదూ వాటిని మనసుకుని ఫీలైపోతే నిజంగా ఏప్రిల్ ఫూల్స్ అయినట్టే మీరు.                                                            ◆వెంకటేష్ పువ్వాడ.  

మీ కోసం....మీరు ఉన్నారా??

ప్రతి మనిషి జీవితంలో బతకడానికి ఎన్నో పనులు చేస్తూ ఉంటాడు. ఇది ఒక వర్గం అయితే చాలామంది కొన్ని లక్ష్యాలు, కొన్ని కలలు అంటూ వాటిలో మునిగి తేలుతూ ఉంటారు. ఇల్లు, పనిచేసే చోటు, ప్రయాణం చేసే చోటు, బంధువులు కలిసే కార్యక్రమాలు, పరిచయస్తులు పార్టీలు, ఫంక్షన్ లు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో జీవితాల్లో భాగంగా ఉంటాయి. అయితే అలాంటివి జరిగే ప్రతిచోటా మనిషి ఎదుటివాళ్లను గమనిస్తూ ఉంటారు. వాళ్లలో ప్రత్యేకత, వాళ్లలో బలహీనత, వాళ్ళ బలం ఇలాంటివన్నీ గమనిస్తూ ఉంటారు. అంటే మనిషి తన జీవితంలో తన రోజువారీ పనులలో మునిగిపోయి, ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలలో ఎదుటివారిని చదువుతూ, ఇంకొకరి గురించి తెలుసుకుంటూ బతికేస్తున్నాడు అనే విషయం గమనిస్తే తప్ప అర్థమవ్వదు. కానీ ప్రతి మనిషి చెయ్యాల్సిన పని ఒకటుంది.  అదే తమ గురించి తాము తెలుసుకోవడం. ఇది ఒకరకంగా ఆత్మ విమర్శ లాంటిదే అనుకోవచ్చు. మరి ఇందులో ఏముంటుంది?? ప్రాధాన్యతలు!! మీరు వేటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు?? అవి మీ ఇష్టాఇష్టాలకు ఎంతమాత్రం సరోపోతున్నాయి. నిజంగానే ప్రాధాన్యతలన్నీ పూర్తి సంతృప్తిగా ఉన్నాయా?? లేక ఆర్థిక కోణం చూసి వాటిని ప్రాధాన్యతలుగా మార్చుకున్నారా?? మనిషి జీవితంలో ఎన్నో ఉండచ్చు కానీ తనకు కాసింత తృప్తినిచ్చే వాటిని వదిలేసుకోకూడదు కదా. చాలామంది అదేదో చిన్నతనం అనే ఫీలింగ్ తో కొన్ని తృప్తికరమైన వాటిని వదిలేసుకుంటారు. బలాలు, బలహీనతలు!! మనిషిలో ఉన్న మానసిక జీవితంలో బలాలు, బలహీనతలే బలగాలు. బలం మనిషి పట్టు అయితే బలహీనత మనిషిని వెనక్కులాగేది అవుతుందని అనుకుంటారు కానీ మీకు తెలుసా బలహీనతలు ఉన్నవాడే గొప్పగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. బలహీనతను బలంగా మార్చుకోవడం, ఆ బలహీనతపై పై చెయ్యి సాధించడం, దానిని అధిగమించడం దీని వల్ల సాధారణ బలం కంటే ఎన్నోరెట్ల ఆత్మవిశ్వాసం సొంతమవుతుంది. ప్రవర్తన!! ఇక్కడ ప్రతి మనిషి తన మెంటాలిటీని బట్టి ప్రవర్తన అంటే ఇలా ఉండాలి అని ఒక వివరణ ఇస్తాడు. అయితే అందరి విషయానికి సరిపోదు ఎందుకంటే ఒక్కొక్కళ్ళ ఆలోచన ఒక్కో విధంగా ఉంటుంది కాబట్టి. అందుకే ప్రవర్తన అనేదానికి ఒక ఖచ్చితమైన నిర్వచనం అంటూ ఇవ్వలేము. ఇంకా దాని మీద విభిన్న వాదనలను కూడా చూస్తుంటాము. కానీ ప్రవర్తన విషయంలో మాత్రం కాసింత సాటిసిఫాక్షన్ ఉండాలి. కారణాలు ఎన్నైనా ఉండచ్చు కానీ ఒకరిని పలకరించడం, ఒకరు పలకరించినపుడు స్పందించడం. నలుగురిలో మాట్లాడినప్పుడు హుందాతనం, పెద్దల విషయంలో కాసింత గౌరవం, చిరునవ్వుతో పలకరించడం. ఇలాంటివన్నీ చాలా సాధారణమైన విషయాలు. మీరు ఒకరిని గమనిస్తున్నట్టు, మిమ్మల్ని వేరే వాళ్ళు గమణిస్తుంటారు అనే విషయాన్ని మరచిపోకూడదు. మీకోసం మీరు!! మీకోసం మీరు కొంచమైనా ఉన్నారా లేదా అనే విషయాన్ని కాస్త ఆలోచించాల్సిందే. ప్రస్తుత కాలంలో మనిషుల్లో frustration  పెరిగిపోవడానికి కారణం ఎవరికి వారు లేకుండా పోవడమే. అంటే మీకోసం మీరు కొంచమైనా ఉండాలి. తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, వృత్తి, బయటకు వెళ్తే స్నేహితులు, సన్నిహితులు వీళ్ళందరి కోసం ఇష్టం లేనివాటిని భరించేస్తూ ఉండటం వల్ల అసహనం ఎక్కువైపోతుంది. కనీసం అలా ఏదైనా చిన్న షాప్ కు వెళ్లి నచ్చిన టీ తాగుదామా అంటే అక్కడే ఎవరో ఒకరు ఆత్మీయులు కనబడి అధోద్దు ఇది బాగుంటుంది అని నచ్చనిది చేతికిచ్చి తాగమన్నట్టు, ఎంతమందికి ఎన్ని సమకూర్చినా మీ విషయంలో మీకు నచ్చిన దేన్నీ మార్చుకోవద్దు. హాయిగా మీదైన ఇష్టాన్ని ఆస్వాదించాలి. అప్పుడే కాసింత తృప్తి లభిస్తుంది. అది చిన్నపుడు తిన్న పుల్లైసులాంటిది.                                                                                                              ◆వెంకటేష్ పువ్వాడ.  

సేంద్రియ సాగుకు జై కొడదాం!!

విద్య, విజ్ఞానం దేశ అభివృద్ధికి అవసరమైనవి అయిన వ్యవసాయం మాత్రం మనిషి మనుగడకు ఖచ్చితంగా ఉండాల్సినది. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత దేశం మనది. దేశానికి వెన్నెముక రైతు అనే మాటలు ఎప్పుడూ వింటూనే ఉంటాము. అయితే రైతు దిగుబడి మీద ఆశతో తెలిసీ తెలియక తప్పులు చేసేస్తూ ఉంటాడు. ఆ తపుల్లో భాగంగానే పంటలకు రసాయనిక ఎరువులు విపరీతంగా వాడటం చేస్తాడు. ఫలితంగా దిగుబడి కూడా రసాయనిక మూలాలు నింపుకుని రుచి తగ్గడమే కాకుండా అందులో ఎంతో అనారోగ్యం కలిగించే విషబీజాలు ఉంటాయి. ఇలాంటి వాటిలో నుండి మళ్ళీ పుట్టింది సేంద్రియ వ్యవసాయం. మళ్లీ పుట్టడం ఏంటి అని ఇప్పటి వాళ్లకు చాలామందికి అనుమానం వస్తుంది. కానీ నిజానికి ఈ సేంద్రియ వ్యవసాయం భారతదేశంలో ఎన్నో ఏళ్ల నుండి వారసత్వంగా వస్తున్నదే. ఒకప్పుడు పంట దిగుబడి వస్తే అందులో కొన్ని విత్తనాలను ఆవు పంచితంలో శుద్దిచేసి ఆ తరువాత వాటిని జాగ్రత్త చేసి తిరిగి మళ్ళీ పంట వేయాల్సి వచ్చినప్పుడు విత్తడానికి వాడేవాళ్ళు. అయితే శాస్త్రవేత్తల పుణ్యమా అని ఎన్నో రకాల రసాయనిక మందులు కనుక్కుని, కృత్రిమ వంగడాలు ఆవిష్కరించడం వల్ల అవి వాడితే గొప్ప దిగుబడి ఉంటుందనే వెర్రిలో ఎడా పెడా కృత్రిమ ఎరువులు వాడి భూమిలో సారాన్ని చేతులారా క్షీణింపజేసుకుంటున్నారు. ఫలితంగానే ఆ కృత్రిమ ఎరువులు వాడిన మొదట్లో దిగుబడి బాగా వచ్చి క్రమంగా ఎలాంటి దిగుబడి లేకుండా వరుస నష్టాలు రైతుల పాలిట శాపాలు అవుతున్నాయి. అవి రైతుల సమస్యలు అయితే క్రమంగా మనిషి ఆరోగ్యం క్షీణించడం కూడా మరొక కారణం. ఈ కారణం వల్ల అందరూ మళ్లీ సేంద్రియ పంటల ద్వారా లభ్యమైన వాటినే కొనుగోలు చేయడానికి తినడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు.  అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్గానిక్స్ హవా కొనసాగుతోంది.  ముఖ్యంగా జీవరసాయనాలు తయారుచేసి, జీవామృతం సహాయంతోనూ, సహజమైన ఎరువులతోనూ పంటలను పండించి రాసి కన్నా వాసి ముఖ్యం అన్నట్టు దిగుబడులు మరీ బీభత్సంగా రాకపోయినా ఆశాజనకంగా వస్తున్నందుకు ఆ తరహా సాగు వైపు వెల్తూ, భూమికి మళ్ళీ జీవాన్ని ఇస్తున్నారు. ఇందులో ముఖ్యంగా అగ్రికల్చర్ వైపు యువత అడుగులు వేస్తూ, సాంకేతికతను, సెంద్రియానికి జోడించి వ్యవసాయ రంగాన్ని కొత్తబాటలు పట్టిస్తున్నారు.  ఆరోగ్యం, సంక్షేమం!! సేంద్రియ వ్యవసాయం వల్ల రోగాలతో చిక్కిపోయిన ఆరోగ్యాలు మళ్లీ నూతనోత్తేజంతో చిగురులు తొడిగిన పచ్చని ఆకుల్లా మారుతున్నాయనేది వాస్తవం. ఎందరో జీవితాలే ఇందుకు నిదర్శనం కూడా. ప్రకృతికి దగ్గర పంటలు సాగడం వల్ల ఆ పంట దిగుబడిలో ఎంతో రుచి కూడా ఉంటుంది, పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటున్నాయి.  అయితే నేటి కాలంలో అన్నిచోట్లా ఈరకమైన సాగు ఉండటం లేదు. ముఖ్యంగా సగటు మధ్యతరగతి రైతు ఈ రకమైన వ్యవసాయం వైపు రావడానికి ధైర్యం చేయలేకపోతున్నాడు. స్వంతంగా జీవామృతాలు తయారుచేసుకోవడం అనేది ఒక అదనపు పని అయితే దిగుబడి రాకపోతే ఎలా అనేది చాలా పెద్ద భయం.  కానీ నేటి వేగవంతమైన ప్రపంచంలో, నూటికి 90% మంది రోగాల బారిన పడినవారే ఉంటున్న రోజుల్లో ఈ సేంద్రియ వ్యవసాయం ఒక ఉద్యమంలా మారాలి. దాని వైపు రైతులను నడిపేలా అందరూ మద్దతు ఇవ్వాలి. ప్రభుత్వాలు ఆర్థిక సహాయం చెయ్యాలి, ప్రజలు వాటిని కొనడానికే ముందడుగు వేయాలి. కాసింత ధర ఎక్కువైనా సేంద్రియ ఉత్పత్తులు వాడటం వల్ల మన ఆరోగ్యాలు బాగుపడతాయి, రైతులు బాగుపడతారు, ముఖ్యంగా పుడమితల్లి మళ్లీ ప్రాణం పోసుకుంటుంది.  అందుకే సేంద్రియ సాగుకు జై కొడదాం!! సేంద్రియ ఉత్పత్తులు కొనడానికి ప్రాధాన్యత ఇద్దాం. వ్యాపిక్అర సామ్రాజ్యాధిపతులకు మేలు చేయడం వదిలి మన చుట్టూ ఉన్న రైతులకు మేలు చేద్దాం!!                                                                                                                                ◆వెంకటేష్ పువ్వాడ.  

కాలుష్యంపై పచ్చని మందు!!

పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా ఇప్పుడు ఎక్కడ చూసినా కాలుష్యం చాలా పెరిగిపోయింది, పెరిగిపోతూ ఉంది కూడా. అయినా మనుషులు మాత్రం ఏమీ మారడం లేదు, ప్రకృతికి కలిగించాల్సినంత నష్టం కలిగిస్తూనే ఉన్నారు. కొంతమంది మాత్రం పర్యావరణం గురించి ఆందోళన పడిపోతూ సంరక్షణా చర్యలు చేపడుతూ ఉంటారు. అయితే అదంతా బాగా తాపం పెరిగిపోయిన భూమి మీద చెంబుడు నీళ్లు చల్లినట్టే అవుతోంది. క్షీణిస్తున్న పర్యావరణానికి ఆ కొద్ది సంరక్షణా చర్యలు ఏ మూలకు సరిపోవడం లేదు. ఫలితంగా నష్టం పెరుగుతూ పోతోంది.  ఎలా పెరుగుతోంది ఈ కాలుష్యం!! ఆలోచించాల్సిన అవసరం లేకుండా అందరికీ ఈ పర్యావరణం కాలుష్యం అవుతున్నందుకు కారణాలు ఏంటి అనేది తెలుస్తూనే ఉంటుంది. ఒకటో ఎక్కం అప్పజెప్పినంత వేగంగా పర్యావరణం కాలుష్యం అవ్వడానికి గల కారణాలను వివరించి చెప్పగలరు ఈ మనుషులు. కానీ మనిషిలో ఉన్న స్వార్థపు బీజాలు మెల్లిగా పెరుగుతూ ఇంకా ఇంకా నష్టాన్ని పెంచుతూ పోతారు.  నివారణే కాదు సరిచేయడమూ తెలియాలి. నిజం చెప్పాలంటే కొంతమంది పర్యావరణ స్పృహతో మొక్కలు నాటడం చేస్తారు అందరికీ మొదట గుర్తొచ్చేది కూడా మొక్కలు నాటడమనే ప్రక్రియనే. అయితే ఇందులో చాలామంది మొక్కను నాటడం చేస్తారు కానీ దాన్ని చెట్టుగా మార్చే అంత ఓపిక తెచ్చిపెట్టుకోరు. అంతా తాత్కాలిక ఉద్ధరించడాలు. దారెంటా వెళ్తున్నప్పుడు ఏ చెట్టుకో ఒక పండు కనబడితే దాన్ని కోసుకోవడానికి చూపించినంత ఆసక్తి అదే దారిలో ఎండిపోతున్న ఓ మొక్కకు కొన్ని నీళ్లు తెచ్చి పోయాలనే విషయంలో మాత్రం ఉండదు మనిషికి. ఇలా మనిషి ఎన్నో విధాలుగా ఎన్నో కోణాలలో తప్పులు చేస్తూ సమాజం ముందు మాత్రం ఉద్దరిస్తున్నట్టు ఫోజులు కొడతాడు.  అరికట్టడానికి కట్టుబడి ఉండాలి!! పర్యావరణ కాలుష్యం అరికట్టడం అంటే ఓ పది స్లోగన్ లు రాసిన బోర్డ్ లు పట్టుకుని, నాలుగు ర్యాలీలు చేసి, గొంతు చించుకుని అరచి, కార్యక్రమం ముగియగానే ఆ సమావేశ ప్రాంగణం అంతా కూల్డ్రింకులు, నీళ్లు తాగి పడేసిన ప్లాస్టిక్ గ్లాసులతోనూ, పులిహోర, చిరుతిండ్లు తినేసి పడేసిన ప్లాస్టిక్ కవర్లతోనూ నింపేసి చాలా గొప్ప మేలే వెలగబెడుతుంటారు. ఇలాంటి వాళ్ళ వల్ల కలిగే ప్రయోజనం ఏమీ ఉండకపోగా జరిగే నష్టమే ఎక్కువ.  భూటాన్ దేశంలో ప్రజలు వీధుల గుండా ఇంకా దారిలో   పోతున్నప్పుడు గమనిస్తే వాళ్ళు 99% నడుచుకుంటూ వెళ్లి తమ పనులు చక్కబెట్టుకుంటారు. ఇంకా వాళ్ళు పర్యావరణానికి హాని కలిగించే పనులు ఏమి చెయ్యరు. కాలుష్యాన్ని తన్ని తరిమేశారు.  వాళ్ళ రాజ్యాంగంలో పర్యావరణాన్ని రక్షించడం అనేది చాలా ముఖ్యమైన విషయం కూడా. ఇక ఇంకో విషయం ఏమిటంటే వాళ్లు తమదేశంలో ఉన్న విహారాయాత్రకు ప్రముఖమైన ప్రాంతాలలో కొన్ని నియమాలు విధించుకున్నారు. పర్యాటకుల వల్ల ఆయా ప్రాంతాల నుండి ఆదాయం వస్తోంది కదా అని ఎలా పడితే అలా అనుమతులు ఇవ్వలేదు. ఆ విధంగా తమ ప్రాంత సహజత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు.  పైవన్నీ గమనిస్తే మన దేశంలో కాలుష్యానికి, పర్యావరణం కలుషితం అవ్వడానికి కారణం ముమ్మాటికీ సాంకేతిక మరియు పారిశ్రామిక అభివృద్ధి. వాటి ముసుగులో కావలసినట్టు ప్రకృతిని నాశనం చేస్తూ పోతున్నారు. వాటి ఫలితమే ఆకారణ భీభత్సాలు.  మన ప్రకృతిని మనం బాగుచేసుకోవాలి అంటే కృతిమ జీవితానికి దూరంగా ఉండాలి, సంపాదనల వెంట పరిగెత్తకుండా తృప్తితో బతకడం నేర్చుకోవాలి. పచ్చదనాన్ని సృష్టించాలి, ఉన్న పచ్చదనాన్ని కాపాడుకోవాలి. నష్టం కలిగించే పనులు మానేయాలి. ఇలా చేస్తుంటేనే అందరూ కాసింత స్వచ్ఛమైన గాలి పీల్చుకోగలుగుతారు. లేకపోతే నగరాలలో ఎగురుతూ కనిపించే నల్లని గాలి కెరటాలే మనుషుల శ్వాస కేంద్రకాలు అవుతాయి.                                                                                                                                ◆వెంకటేష్ పువ్వాడ.  

లోకానికి రంగులు జల్లేద్దామా??

ఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అందాలు అంటాడు ఒక సినీగేయ రచయిత. నల్లానల్లాని కళ్ళ పిల్లా అంటాడు మరొక రచయిత. ఎర్రని జాంపండు అని ఊరిస్తారు అందరూ. ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయా అని ముద్దుగుమ్మలు అందాన్ని, సంప్రదాయాన్ని కలిపి అలరిస్తారు. పచ్చని ప్రకృతి అంటూ ప్రకృతి ప్రేమికులు నినదిస్తారు. పిండారబోసినట్టు వెన్నెలా, సముద్రం మీద తెల్లని కలువపువ్వాలా చందమామా అంటూ చమత్కారాలు కురిపిస్తారు. కేంజాయ రంగు సూరీడు ఆకాశమంత నోటితో నవ్వుతాడన్నట్టు అంతా నారింజ వర్ణమే.  ఇట్లా అన్నింటిలో రంగుల హొయలు, రంగేళి పాటలా ప్రపంచాన్ని కనువిందు చేస్తూ ఉంటుంది. ఆకులోనూ, పువ్వులోనూ, మట్టిలోనే కాక నీటిలోనూ, గాలిలోనూ రంగుల్ని చూసే మనసును, సృజనాత్మక వర్ణనను ఆ రంగులే కొందరికి ఇచ్చేసాయేమో అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడిదంతా ఎందుకూ అంటే!! ప్రపంచమంతా రంగులతోనూ, రంగులలో ఉన్న ఆనందంతోనూ నిండిపోయి అందరినీ ఆనందంలో ఉంచుతున్నా రంగుల పండగ ప్రత్యేకంగా ఉంది మనకు. తెల్లని మల్లెపూవుల్లాంటి బట్టలు వేసుకుని రంగులు జల్లుకుని సప్తవర్ణ హరివిల్లులా ఒక్కొక్కరూ మెరిసిపోతూ ఉంటే ఎంతో సంబరంగా ఉంటుంది.  వసంతఋతువులో అందరిని పలకరించే రంగుల పండగ వర్ణశోభిత వికసిత మాలిక అయిన హొలీ పండుగ భారతదేశమంతా ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ. ముఖ్యంగా కృష్ణుడి ఆరాధకులు వ్రేపల్లె కన్నయ్యను తలచుకుంటూ గోధూళి పాటలు పాడుకుంటూ ఆనంద పరవశంలో మునిగి తేలుతూ ఉంటారు. రంగులు జల్లుకోవడాలు, ఉట్టి కొట్టడాలు, బృందావనంలో రాధాకృష్ణులను తలపించే దాండియా నృత్యాలు ఇలా హొలీ పండుగ హడావిడి అంతా ఇంతా కాదు. ఇవన్నీ ఒకెత్తు అయితే హొలీ పిండివంటల హాంగామా వేరే లెవెల్ అనుకోవచ్చు. ముఖ్యంగా తీపి పదార్థాలదే ఇక్కడ పైచెయ్యి. పాలతో చేసే పదార్థాలకు పెద్ద పీట వేస్తారు. ప్రతి ఇంట్లో నేతి వాసనలు గుబాలిస్తూ ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాలలో హొలీ సందడి తక్కువే అయినా ముంబయ్, బెంగాల్, గుజరాత్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో హొలీ పండుగ, దాని తాలూకూ హంగామా ఆకాశాన్నంటుతుంది. పిల్లలు పెద్దలు తారతమ్యం లేకుండా రంగులలో తడిసి ముద్దవుతూ ఉంటుంది.  సంబరంతో జాగ్రత్తలు!! అయితే సంబరాలలో అపశ్రుతులు జరుగుతూ ఉంటాయి. వాటి గురించి తెలిసిన ప్రజలు ముందుజాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని విషయం కూడా మరచిపోకూడదు. రంగులు జల్లుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కళ్ళలోకి రంగులు పడకుండా సంబరాన్ని ఆస్వాదించాలి. అలాగే కృత్రిమ రంగులకు దూరంగా ఉండాలి. ఎలాగైతే వినాయకచవితి సంబరాలలో కాలుష్యం పెరగకూడదని మట్టి గణపతిని ప్రోత్సహిస్తున్నామో అలాగే రంగుల విషయంలో కూడా సహజమైన పదార్థాలను ఎంచుకోవాలి. నిజానికి ఇలా సహజమైన రంగులు తయారు చేసుకోవడం వల్ల ఖర్చు తగ్గడం మాత్రమే కాకుండా కాసింత ఓపిక పెరుగుతుంది. మనుషుల్లో సృజనాత్మకత బయటకు వస్తుంది. ఇంకా చెప్పాలంటే బోలెడంత ఆత్మసంతృప్తి మిగులుతుంది.  ఇంకా శరీరానికి కొబ్బరి నూనె, బాడీ లోషన్ వంటివి ముందుగానే పూసుకోవడం వల్ల రంగుల ప్రభావం చర్మం మీద పడకుండా ఉంటుంది. ఇంకా ఫస్ట్ ఎయిడ్ కిట్ దగ్గరలో ఉంచుకోవడం మంచిదే. ఇబ్బంది పెట్టని సంబరాలు ఆనందాలు!! కొందరికి రంగులు చల్లుకుని హంగామా చేయడం ఇష్టం లేకపోవచ్చు. ఏవో కారణాల వల్ల హొలీ మూడ్ ను ఎంజాయ్ చేయలేకపోవచ్చు. మరేవో కారణాల వల్ల దూరంగా ఉండాలని అనుకోవచ్చు. స్నేహితులు, చుట్టాలు, పక్కాలు, కొలీగ్స్ ఇలా అందరిలోనూ ఎవరో కొందరు ఇలాంటి వాళ్ళు ఉండచ్చు. అలాంటి వాళ్ళ మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి కానీ బలవంతంగా రంగులు పూయడం అల్లరి చేయడం వంటివి చేస్తే అవతలి వాళ్లకి అది గోలగానూ, సాడిజంగానూ అనిపిస్తుంది. అందుకే వీలైనంత వరకు ఎదుటి వారిని, వారి అభిప్రాయాలను గౌరవించాలి. పంచభూతాలూ, ప్రకృతి, మనుషులూ, ఆనందాలు, అల్లర్లు, సంతోషాలు, అలకలు, ఆటపట్టించడాలు ఇలా అన్ని రంగులలో కలసి వసంతఋతువులో లోకానికి మరింత కొత్తశోభను అద్దుతాయి.  ఎలాంటి అపశ్రుతులు ఎదురుకాకుండా లోకం మీద  హొలీ రంగులు జల్లేద్దాం!! ◆వెంకటేష్ పువ్వాడ.

వాతావరణ వీరులు!!

  బంగాళాఖాతంలో అల్పపీడనం మరో వారం రోజుల పాటు కొనసాగనున్న వర్షాలు. చెన్నై తీరం దాటనున్న తుఫాను. ఆ సమయంలో వేగంగా గాలులు ఉంటాయని, వర్షాపాతం ఉధృతంగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఎక్కువ ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన వాతావరణ శాఖ. మారుతున్న ఋతుపవనాల దిశ.  గాలిలో తేమశాతం తగ్గుతోందని సమాచారం. పైవన్నీ వాతావరణ నివేదికల్లాంటివి కానీ అవన్నీ ప్రస్తుతానికి అసలు ఆంబంధం లేనివి. మరిప్పుడెందుకు  ఇవన్నీ అంటే….. భారతదేశంలో  ఎన్నో రంగాలు ఉన్నాయి. రైల్వే, వైమానిక, జల, సైనిక వంటి రంగాలు అన్నీ  ప్రజలకు సేవలు అందిస్తున్నవే. అయితే ప్రజలకు ఎప్పుడూ తక్షణ సమాచారాలు అందిస్తూ, విరామం లేకుండా సాగే మరొక రంగం వాతవారణ శాఖ. Indian meteorological department ద్వారానే అన్ని రంగాలు సవ్యంగా సాగుతున్నాయనేది అక్షరసత్యం. ఆకాశంలో విమానాలు సరైన దిశలో ప్రయాణం చేయడానికి అందించే తోడ్పాటు నుండి సాధారణ వర్షపాతాలు, రోజువారీ వాతావరణ నివేదికలు, రైల్వే రంగాలకు, సముద్ర ప్రయాణాలకు ఇలా అన్ని విధాలుగా తమ సేవలను అందిస్తున్నది వాతావరణ శాఖ. ఇంకా ముఖ్యంగా ప్రకృతీ విపత్తులు సంభవించినప్పుడు వారు అందించే అత్యవసర సేవలు, నిమిష నిమిషానికి అందించే నివేదికలు, వాటి ఆధారంగా తీసుకునే జాగ్రత్తలు ఎన్నో ప్రాంతాలను, ఆ ప్రాంతాలలో నివసించే ప్రజలను కాపాడుతూ వస్తున్నాయి. అలుపెరుగని సేవలు!! స్కూళ్ళు, బ్యాంకులు, మండల, జిల్లా ప్రభుత్వ కార్యాలయాలకు ఆదివారం, పండుగ, ప్రభుత్వం ప్రకటించిన ఇతర ప్రత్యేక దినాలలో సెలవులు ఉంటాయి. కానీ ఈ వాతావరణ శాఖకు సెలవు అంటూ లేదు. సూర్యుడికి, చంద్రుడికి, పవనాలకు విరామం లేనట్టే ఈ శాఖ కూడా నిరంతరం గడియంరంలో ముల్లుతోపాటు పనిచేస్తూనే ఉంటుంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా వాతావరణంలోని తేమ, గాలుల దిశ ఆధారంగా రోజువారీ నివేదికలు అందిస్తూనే ఉంటుంది. నైటౌట్లతో మెలకువగానే ఉంటుంది. అన్నిటికీ ఆధారం!! మనిషి మనుగడకు ఈ ప్రకృతి ఎంత ముఖ్యమైనదో, మనిషి కార్యకలాపాలకు ప్రకృతి స్థితి గతులు అంతే ముఖ్యమైనవి. ముఖ్యంగా భారతీయ ముఖ్య రంగం అయిన వ్యవసాయం పూర్తిగా వాతావరణ హెచ్చరికల ఆధారంగా జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తుంది. వ్యవసాయానికి, వర్షపాతానికి, వాతావరణ శాఖకు ఉన్న అవినాభావ సంబంధం మాటల్లో చెప్పలేనిది. అలాగే ప్రయాణాల విషయంలో వాయు మార్గాలైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్, జలమార్గాలు అయిన ఇండియన్ నేవీ వంటివి వాతావరణ శాఖ సహాయంతో భారతీయ సైనిక దళం అయిన ఇండియన్ ఆర్మీ తో సమానమైన సేవల్ని అందిస్తోందని అనడంలో అతిశయోక్తి లేదు. చిన్నప్పుడు పుస్తకాలలో వాతావరణం, నీరు, తేమ, ఆర్థ్రత, ఉష్ణోగ్రత, గాలులు, పవనాలు, దిశలు, తుఫానులు, వర్షాపాతం వంటి వాటిని అనుసంధానం చేసుకుని, మానవ మనుగడకు అవసరమైన ఎన్నో రంగాలతో అనుసంధానమైన వాతావరణ శాఖ గురించి అందులో ఉద్యోగాల గురించి తెలిసినవాళ్ళు చాలా తక్కువ. ప్రస్తుతం యువత ఎక్కడ చూసినా ఇంజనీర్లు, డాక్టర్లు, బ్యాంక్ ఆఫీసర్లు వంటి వాటివైపే దృష్టి పెడుతున్న తరుణంతో ఇతర రంగాల మీద కూడా ఒకసారి దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది.                                                                                                                ◆వెంకటేష్ పువ్వాడ.  

నీటిబొట్టుకు కొత్త గొంతు!!

ప్రయాణాలు చేస్తూ ఉంటాం. అంతా హైవే రహదారి, ఎక్కడా హోటళ్లు ఉండవు, చిన్న బడ్డీ కొట్టు కూడా కనిపించదు. ఒకవైపు దాహం పట్టిపీడుస్తూ ఉంటుంది. వెంట తెచ్చుకున్న బాటల్ లో నీళ్లు కూడా అయిపోయి ఉంటాయి. నోరంతా పిడచకట్టుకుని పోతూ ఉంటుంది. శరీరం క్రమంగా తేమను కోల్పోయి స్వాధీనం తప్పేంత డైలమాలో పడిపోతుంది. ఏదో చెయ్యాలని అనుకుంటాం. ఎవరైనా మనకు ఎదురైతే బాగుండు, కాసిన్ని నీళ్లిచ్చి దాహం తీరిస్తే బాగుండు అనుకుంటాం. కానీ అలా జరగదు, ఒక్కసారిగా దుఃఖం పొంగుకొస్తుంది. ఇంట్లో ఉంటే గనుక ఇలాంటి నరకం ఉండేది కాదు కదా అనిపిస్తుంది.  చాలామందికి పైన అనుభవం జీవితంలో ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సందర్భంలో(ప్రయాణాలు అనే కాదు వేరే ఏదైనా సందర్భం కావచ్చు) ఎదురయ్యి తీరుతుంది. కొందరు పైన చెప్పుకున్నవరకే తమ ఆలోచనలు సాగిస్తారు. మరికొందరు దాంతోపాటు ఇంకొంచెం ముందుకు సాగుతారు. బాత్రూమ్లోనూ, బట్టలు ఉతకడం లోనూ, ఇంటి పనులలోనూ, బయటకు వెళ్లినప్పుడూ, అతిశుభ్రత పేరుతోనూ ఎన్నెన్ని నీళ్లను కాలువలపాలు చేసామా అని కొందరు పశ్చాత్తాపపడతారు. బాత్రూమ్లో దూకే కుళాయి నీళ్లు కూడా అత్యంత విలువైనవిగా అనిపిస్తాయి అప్పుడు.  ఇది ఒకమనిషి ఆవేదన అయితే గ్రామాలు, మండలాలు, జిల్లాలు అందులో నివసించే వేలు, లక్షల ప్రజానీకం ఏళ్లకేళ్ళుగా నీటి తళతళలు తమ నేలల మీద కనబడక ఎంతెంత ఆవేదన చెందుతూ ఉండి ఉండాలి. మినరల్ వాటర్ సృష్టించి వాటర్ వార్ లకు కారణమైన వ్యాపార సామ్రాజ్యాలు కూడా ఉన్న నేటి అభివృద్ధి ప్రపంచంలో  కనీస అవసరాల కోసం నీటి సరఫరా లేని జనావాస ప్రాంతాలు ఉన్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది. గంధపుచెక్కల చెట్లు సమృద్ధిగా ఉన్నవాడికి ఆ గందపుచెట్టు పెద్ద విలువైనదిగా ఎట్లా అనిపించదో, అలాగే అన్ని సౌకర్యాల మధ్యా కుళాయి తిప్పి నీటిని వాడేసేవాళ్లకు దాహం గొంతుల ఆవేదన అర్థం కాదని అనిపిస్తుంది. కానీ….. ప్రపంచంలో, ముఖ్యంగా భారతదేశంలో నీటి ఆవరణా ప్రాంతాల శాతం, అడవుల విస్తరణ శాతం తగ్గిపోతూ ప్రజల అవాస ప్రాంతాలు అభివృద్ధిలో భాగంగా పెరిగిపోతుంటే కరువు ప్రాంతాల శాతం పెరుగుతూ వస్తోంది. చెట్ల నరికివేత విచ్చలవిడిగా జరుగుతూ ఉండటం వల్ల ప్రతి నీటి బొట్టూ ప్రశ్నార్థకంగానే మారుతోంది. మనుషులను మినహాయిస్తే మూగజీవుల ఆవేదన వర్ణించని విధంగా మారిపోతోంది. వృక్షో రక్షతి రక్షితః!! చెట్టును మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అన్నట్టు, భూగర్భజలాలు పెరగాలి అంటే చెట్లు నాటడమే సరైన మార్గమని అందరికీ తెలుసు. కానీ నష్టం మనవరకు రాలేదులే అనే దారుణమైన నిర్లక్ష్యపు ఆలోచనల వల్ల ఎంతో స్వార్థం వల్ల మనుషులు తగిన మూల్యం చెల్లించుకునే దిశగా నడుస్తున్నారు. వాటి ఫలితాలే అసందర్బపు ప్రళయాలు.  మరోవైపు!! శరీర ఆరోగ్యానికి నీరు ఎంత అవసరమో అందరికీ తెలిసినదే. కానీ చాలామంది నీటిని సరిపడినంత తాగకపోవడం వల్ల శరీరంలో తేమశాతం తక్కువై కిడ్నీ సమస్యలు మొదలుకుని శరీరాన్ని ఇబ్బంది పెట్టే ఎన్నో అనారోగ్యాలు చుట్టుముడతాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కారణం బయటకు వెళ్లే మహిళలు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, దారి మధ్యలోనూ, పనుల మధ్యలోనూ మూత్రవిసర్జనకు దారిదొరక్క మగవాళ్ళలాగా రోడ్డుపక్కన కానిచ్చేయలేక మూత్రాన్ని బిగించడం లేదా, నీళ్లు సరిగ్గా తాగకపోవడం వల్ల చాలా తొందరగా కిడ్నీలు పాడైపోతూ ఉంటాయి.  శరీరానికి ఇంధనమైన నీటిని మనం తగుతున్నంత బాద్యతగానే నీటి సంరక్షణ చర్యలు కూడా చేపట్టాలి. భూగర్భజలాలు పెరగడానికి ఉత్తమమార్గం అయిన చెట్ల పెంపకాన్ని కూడా బాధ్యతగా చేపట్టాలి. ఇంటి అవసరాలలో నీటిని ఎంతో పొదుపుగా వాడుకోవాలి. సామాన్లు కడిగిన, బట్టలు ఉతికిన నీటిని సింకుల్లో, కాలువల్లో తోసేయకుండా వాటిని మొక్కలకు, చెట్లకు మళ్లించాలి. అన్నిటికీ మించి పిల్లలకు నీటి విలువ తెలియజెప్పాలి.  శరీరానికి నీరు ఎంత అవసరమో చెబుతూనే, నీటిని వృధా చేయడం ఎంత తప్పో చెప్పాలి. మనం చేతయాల్సింది అంత చేస్తే, ప్రకృతి నీటి గొంతును వినిపిస్తుంది.                                                                                     ◆వెంకటేష్ పువ్వాడ.  

అమరజీవి జయంతి!!

ఆంధ్రరాష్ట్రం ఏర్పడి తెలుగు నేల కొత్త అడుగులు వేయడానికి కారణమైన నాయకుడు పొట్టిశ్రీరాములు. ఈయన ప్రాణత్యాగం ఫలితంగా ఎంతో క్లిష్టమైన తెలుగు రాష్ట్రం ఏర్పాటు జరిగింది.  బాల్యం!! ఎక్కడో మద్రాసులో 1901 సంవత్సరంలో పుట్టిన శ్రీరాములు గారు తెలుగు రాష్ట్రం కోసం మరణించడం అనే విషయం వింటే ఆశ్చర్యం వేస్తుంది. మనుషులకు మనుషులకు మధ్యా, మనుషులకు ప్రాంతాలకు మధ్య ఇంత గొప్ప అనుబంధాలు ఉంటాయా అనిపిస్తుంది. ఇరవై సంవత్సరాల వరకు మద్రాసులోనే చదువుకున్న శ్రీరాములు గారు తన విద్యను పూర్తి చేసుకుని చక్కగా ఉద్యోగం సంపాదించారు.   విషాదం, జీవితంలో పెద్ద మలుపు!! మనిషి జీవితం ఎప్పుడు ప్రభావానికి లోనవుతుంది అంటే అనుకోని విధంగా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు. పొట్టి శ్రీరాములు గారి జీవితంలోనూ అలాంటిదే జరిగింది. చదువు పూర్తి చేసి, ఉద్యోగం సంపాదించి, పెళ్లి చేసుకుని చక్కగా ఉన్న జీవితంలో పెద్ద కుదుపు పుట్టిన బిడ్డ చనిపోవడం, ఆ తరువాత కొన్ని రోజులకే భార్య కూడా మరణించడం. వెంట వెంట రెండు చావులను చూడటంతో వైరాగ్యానికి లోనైన శ్రీరాములు గారు ఉద్యోగానికి రాజీనామా చేసి, ఆస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టేసి గాంధీ స్థాపించిన సబర్మతి ఆశ్రమంలో చేరిపోయాడు.  అదే ఆయన జీవితంలో పెద్ద మలుపుగా చెప్పవచ్చు. గాంధీ మాటలకు ప్రభావితుడై సత్యాన్ని, సత్య మార్గాన్ని నమ్మి, అహింసాయుత జీవితాన్ని గడిపిన గొప్ప వ్యక్తి అయ్యాడు. సత్యాగ్రహాలు, ఉద్యమాలు!! గాంధీ వెంటే ఉండటం వల్ల పొట్టి శ్రీరాములు గారిలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా దేశం కోసం దేశ స్వాతంత్య్రం కోసం జరుగుతున్న పోరటాలలో తనదైన పాత్ర పోషించారు. ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించాడు. క్విట్ ఇండియా ఉద్యమం వల్ల మూడు సార్లు జైలుకు వెళ్ళాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే హరిజనుల కోసం పాటు పడిన గొప్ప వ్యక్తి శ్రీరాములు గారు అన్న విషయం చాలామందికి తెలియదు. హరిజనుల ఆలయ రవేశం కోసం ఎన్నో దీక్షలు చేపట్టి హరిజనోద్ధరణ శాసనాలను మద్రాసు ప్రభుత్వం చేత ఆమోధింపజేశాడు. గురు శిష్యుల అనుబంధం!! గాంధీని గురువుగా భావించి ఆయన అడుగుజాడల్లో నడిచినవాడు శ్రీరాములు గారు. కాకపోతే ఈయనలో మొండితనం ఎక్కువ ఉండేదని గాంధీ చెబుతూ ఉండేవారు. ఒకోసారి ఆ విషయంలో గాంధీ చిరాకు పడేవారు కూడా. సబర్మతి ఆశ్రమంలో శ్రీరాములు గారు ఎంతో క్రమశిక్షణతో మరెంతో ప్రేమతో అందరిని పలకరిస్తూ ఉండేవారు. ఆంధ్రరాష్ట్ర ఉద్యమం!! తెలుగు భాషా ప్రయుక్త ప్రాంతాలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావాలని చర్చలు మొదలుపెట్టింది ఎంతో మంది ఆంధ్రరాష్ట్రం కోసం గొంతులు విప్పారు. అయితే చూసి చూడనట్టు కాలం ముందుకు సాగిపోతూ ఉంది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆంధ్రరాష్ట్రం కోసం ఎన్ని అభ్యర్థనలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించక పోవడం ఇంకా ఇంకా నిరుత్సాహాన్ని నింపి కొందరిని వెనక్కు లాగేసింది కూడా.  అయితే పొట్టి శ్రీరాములు గారు అమరనిరాహారదీక్ష మొదలుపెట్టినప్పుడు అందరూ ఎగతాళి చేసినవారే!! కానీ క్రమంగా ఆయనే ఒక మహాశక్తిగా ఎదిగిపోయి కృశించిపోతున్న తన శరీరాన్ని లెక్కచేయకుండా దీక్ష విరమించకుండా ప్రాణాన్ని కూడా వదులుకున్నారు.  మహాత్మా గాంధీ గనుక బతికి ఉంటే శ్రీరాములు గారు దీక్షలో అలా మరణం కౌగిట్లోకి వెళ్లిపోయేవారు కాదని ఎందరో అభిప్రాయ పడ్డారు. కానీ చరిత్ర మాత్రం తన రాత తాను రాసుకున్నట్టు అందులో శ్రీరాములు గారి ప్రాణత్యాగాన్ని విషాదాక్షరాలతో లిఖించుకుంది. ప్రాణత్యాగమే నేటి సంతోషాల పలితం!! శ్రీరాములు గారి ప్రాణత్యాగం వల్లనే ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది అనేది అందరికీ తెలిసిన నిజం. కానీ ఆయన మరణించినప్పుడు ఆయన మృతదేహాన్ని తాకడానికి కూడా వెనకడుగు వేసిన ఈ మనుషుల వారసత్వాలే నేడు ఆయన ప్రాణత్యాగం వల్ల లభించిన స్వేచ్ఛయుత ఆంధ్రరాష్ట్రంలో బతుకుతున్నాయి. ఆనాటి తప్పిదాలు వదిలినా నేటి తరాలకు, రేపటి తరాలకు  అమరజీవి పొట్టిశ్రీరాములు గారి గురించి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ◆వెంకటేష్ పువ్వాడ  

సర్వమతాల అధ్యయన స్వరూపం పరమహంస!!

భారతీయ ఆధ్యాత్మిక గురువుల చిట్టా విప్పితే అందులో రామకృష్ణ పరమహంస తప్పక ఉంటారు. రామకృష్ణ మిషన్ ద్వారానూ, ఆయన ఆధ్యాత్మిక భోధనల ద్వారానూ ఆదిశంకరాచార్యుల తరువాత ఆధ్యాత్మికతను, హిందూ మతంలో ఉన్న విశిష్టతను ముస్లిం మరియు క్రైస్తవ మతాలకు ధీటుగా నిలబెట్టిన వారు రామకృష్ణ పరమహంసనే. బాల్యంలో….. 1836 ఫిబ్రవరి 18 న పశ్చిమబెంగాల్ లోని హుగ్లీ జిల్లాలోని కామార్పుకూర్ అనే చిన్న గ్రామంలో జన్మించారు ఈయన. ఈయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధరుడు. పేదబ్రాహ్మణ కుటుంబానికి చెందిన వీళ్ళు ఎంతో విశాలమైన హృదయం కలిగినవాళ్ళు.  ఈయనలో  సృజనాత్మకత ఎక్కువ. చదువు మీద ఆసక్తి తక్కువ. అందుకే పెద్దగా చదువుకోలేదు. ఎంతోమంది సాధువులు వీళ్ళ గ్రామం మీదుగా పూరీ జగన్నాథుడి దర్శనానికి వెళ్ళేవాళ్ళు. అలా వెల్తూ వీళ్ళ గ్రామంలో ఆగినప్పుడు ఆ గ్రామంలో ప్రజలకు హిందూ మతం గురించి, హిందూ దేవుళ్ళ గురించి ఎంతో గొప్పగా ప్రవచనాలు చెప్పేవాళ్ళు. వాటిని ఎంతో ఆసక్తిగా వినేవారు. అలా ఈయనకు భారతీయ ఆధ్యాత్మికత మీద ఒకానొక ఆసక్తి ఏర్పడింది. వృత్తిలో అన్వేషణ!! రామకృష్ణుల వారి అన్న ఒక అమ్మవారి గుడిలో పనిచేసేవారు. ఆయన చనిపోయిన తరువాత కుటుంబం కగడవడం కోసం రామకృష్ణులు ఆ గుడిలో పూజరిగా చేరారు. అమ్మవారి విగ్రహంతో మాట్లాడేవారు. అమ్మవారు తనతో మాట్లాడాలని ఎంతో అడిగేవారు. అడవిలోకి వెళ్లి ఒంటరిగా కూర్చుని ప్రశ్నలు వేసుకునేవారు. ఎప్పుడూ అమ్మవారి ఆలోచనల్లో మునిగిపోయి ఉండేవారు. ఫలితంగా ఒకసారి అమ్మవారి ప్రత్యక్ష దర్శనం పొందారు. అప్పటి నుండి తరచుగా అమ్మవారితో మాట్లాడుతూ ఉండేవారు ఈయన.  అంతేకాదు మిగిలిన మతాలు ఎందుకున్నాయి?? వాటి ప్రత్యేకత ఏమిటి అని విషయం తెలుసుకోవడానికి ముస్లిం మరియు క్రైస్తవ మతాలను అందులో నియమాలను కూడా స్వయంగా ఆచరించి ఆ మతాలను కూడా అధ్యయనం చేసాడు రామకృష్ణులు. ఆ అన్వేషణ ఫలితంగా ఆయన చెప్పింది ఒక్కటే. మతం అనేది ఆ దేవుడిని తెలుసుకోవడానికి చేరుకోవడానికి మార్గం మాత్రమే అని. అది మనుషుల మధ్య హింసాత్మక విభేదాలు సృష్టించడానికి కాదని నొక్కి వక్కాణించారు. వివాహం ఆధ్యాత్మిక బంధం!! ఈయన పెళ్లి చేసుకున్నప్పుడు శారదాదేవి గారి వయసు కేవలం అయిదు సంవత్సరాలు మాత్రమే. కానీ రామకృష్ణుల వారు తనకు తెలిసిన ఆధ్యాత్మిక విషయాలను అన్నిటినీ ఆమెకు నేర్పించారు. నిజానికి ఆయన మొదటి శిష్యురాలు కూడా ఆయన భార్యే. శారదాదేవి గారు ఎంతో బాగా సులువుగా అర్థం చేసుకునేవారు. అందుకని ఆమెను త్రిపురసుందరీ దేవి ప్రతిరూపంగా భావించి ఆమెను ఎంతో భక్తిగా పూజించేవాడు. ఇలా వాళ్ళిద్దరిమధ్య ఆధ్యాత్మిక బంధమే కొనసాగింది. గురుశిష్యుల ప్రయాణం!! రామకృష్ణుల వారి శిష్యులలో ప్రసిద్ధి చెందినవాడు స్వామి వివేకానంద. ఈయన ఎందరో గురువులను ఆశ్రయించి విఫలమై చివరికి  రామకృష్ణులను చేరి సార్థకత పొందాడు. రామకృష్ణుల ఉపన్యాసాలను విదేశాలకు వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా యువతను ఆకర్షించాడు. విదేశాలలో హిందూధర్మం గురించి దైర్యంగానూ గొప్పగానూ చాటి చెప్పాడు. రామకృష్ణుల వారి శిష్యులు అందరూ కూడా ఎంతో ఉన్నత విద్యావంతులు. వీళ్ళు ఎవరూ దేన్నీ ఆధారం లేకుండా కారణం లేకుండా సమ్మతించేవారు కాదు. ఆ విధంగా రామకృష్ణులు చెపినా విషయాలు ఎంతో వాస్తవికతను నిండుకుని ఉన్నవే  అయ్యాయి. అంతిమ దశ!! ఎందరో గురువులను చూస్తే ఆఖరి దశలో తమ శరీరాన్ని ఏదో మొండి రోగానికి అర్పించి మరణించిన ఆనవాళ్లు కనబడతాయి. రామకృష్ణుల విషయంలోనూ అదే జరిగింది. ఈయన కాన్సర్ బారిన పడి, ఆరోగ్యపరంగా ఎంతో నలిగినా మానసికంగా ఎంతో దృఢచిత్తంతో ఉండేవారు. తనలో ఉన్న ఆధ్యాత్మిక సంపదను మొత్తం స్వామి వివేకానందకు ధారపోసి 1886 ఆగష్టు 16 వ తేదీన మహాసమాధిని పొందాడు. ఈయన హిందూసంప్రదయంలో పేరుకుపోయిన మూఢనమ్మకాలు తొలగించడంలో కృషి చేసారు. ఈయనవల్లనే అరభిందో ప్రభావితం అయ్యారు. అలాగే భక్తి ఉద్యమం కూడా ప్రభావితమయ్యింది. సృష్టిలో ఏకత్వాన్ని, జీవులలో దైవత్వాన్ని, అన్ని మతాలలో ఉన్న మార్గ ముఖ్య ఉద్దేశం దేవుడిని తెలుసుకోవడం చేరడం, మతాలు ఆ మార్గాలు మాత్రమే అనేది ఈయన చెప్పిన గొప్ప సత్యం.

ఫోబియాలపై యుద్ధమిలా చేయండి!!

  చీకటంటే కొందసరికి భయం, వెలుగంటే మరికొందరికి భయం, పురుగులను చూస్తే కొందరికి భయం, తినే పదార్థాలు కొన్ని చూస్తే భయం, ఎత్తైన ప్రదేశాలు అంటే భయం, రక్తం చూసినా ఆ రంగు అన్నా భయం, ఎక్కువ నీళ్లు చూస్తే భయం ఇలా మనిషి బుర్రలో ఎన్నో భయాలు. వైద్యరంగంలో డాక్టర్లు ఈ భయాలకు ఒక్కో దానికి ఒక్కో పేరు పెట్టి, వాటికి ఫలానా ఫలానా మందులు కనుగొన్నామని వైద్యం చేస్తామని చెబుతూ ఉంటారు ప్రజలు కూడా డాక్టర్ల దగ్గరకు పరిగెత్తుకుంటూ పోతుంటారు.  ఇలా మనిషిలో ఉన్న అతి భయానికి ఫోబియా అనే పేరు పెట్టి దానికి వైద్యం గట్రా కనిపెట్టి మనుషుల మానసిక బలహీనతలను డబ్బు చేసుకుంటున్నారు వైద్యరంగంలో జబ్బుల ఆవిష్కర్తలు. ఫోబియాలు ఎందుకు?? అవునూ నిజానికి ఫోబియాలు ఎందుకు కలుగుతున్నాయి మనిషికి అని ఆలోచిస్తే అదొక మానసిక బలహీనత అని ఆ బలహీనత చాలా పెరిగిపోతే దానికి ఫోబియా అనే పేరు పెడుతున్నారని అర్థమవుతోంది. కాలక్రమేణా మనిషి మెదడుపై వేస్తున్న భారమే మనిషిలో ఆలోచనలు పెరగడం లేదా అతిగా రూపాంతరం చెందడం జరుగుతూ వస్తోంది. అది మాత్రమే కాకుండా జీవితంలో ఎదురయ్యే కొన్ని అనుకోని సంఘటనలు ఒత్తిడిలోకి నెట్టి అవి క్రమేణా భయాలకు దారి తీసే, ఆ భయాలు కాస్తా ఫోబియాలుగా ఎదిగి మనిషిని ప్రశాంతతకు దూరం చేస్తాయి. ఇలా ఫోబియాలు మనిషి జీవితాల్లో భాగం అవుతూ వస్తున్నాయి. తప్పు ఎక్కడుంది?? నిజానికి ప్రతి భయం మనిషి మానసిక స్థితిని దెబ్బతీసేదే అయితే ఆ మానసిక స్థితి దెబ్బ తింటూ ఉన్నపుడు మానసిక స్థితిని మెరుగుపరుచుకోకపోగా…. దానికోసం లేనిపోని మందులు వాడుతూ శరీరాన్ని మత్తులోకి నెడుతూ శరీర ఆరోగ్యాన్ని కూడా నాశనం చేసుకుంటున్నారు.   ఒకరి భయం మరొకరి వ్యాపారం!! ప్రపంచం అన్ని కోణాల లోనూ వ్యాపారం చేస్తుంది. ముఖ్యంగా ఒకరి బలహీనతే మరొకరికి వ్యాపారం. ఈ సూత్రాన్ని పాటించని రంగం కూడా లేదు. వైద్యరంగంలో ఇది మరీ ఎక్కువగా కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే చాలా చిన్న విషయాలను భూతద్దమంత చూపెట్టి ప్రజలను ఆ భయంలోకి నెట్టి, ఉన్న మానసిక సమస్యని ఎన్నో రెట్లు పెంచేది వైద్యరంగాలే. ఈ విధంగా చూస్తే మనుషుల్లో ఫోబియాలు, రోగాలు సృష్టిస్తున్నది తరువాత మనుషుల నుండి ఆర్జిస్తున్నది పూర్తిగా వైద్యరంగంలో రహస్య చర్యలే. ఫోబియకు మందు!! జీవితానికి పరిష్కారం!! ఫోబియాలు ఎన్నైనా ఉండనివ్వండి అవన్నీ మనిషిని మానసికంగా దెబ్బతీసేవే, ప్రశాంతతను దూరం చేసేవే. ఇలాటి ఫోబియాలకు డాక్టర్లు రాసిచ్చే మందులు వాడితే తగ్గిపోతుందా??  డాక్టర్లు నెలల వారిగా కోర్సుల పేరిట మందులు రాసిచ్చి వాటిని వాడమని చెబుతారు. ఆ ఫోబియా బాధితులు కూడా మందులు వాడుతూ ఆ మందులలో ఉన్న ప్రభావం వల్ల కాస్త మత్తులోకి జోగుతూ రాత్రిళ్ళు చక్కగా నిద్రపోతూ ఉద్యోగాల పనులలో పడిపోయి ఆ అతి ఆలోచనలకు దూరంగా ఉంటూ మందుల వల్ల తమకు బాగవుతోంది అనే భ్రమలో ఉంటారు.  ఒకవేళ అదే నిజమైతే ఆ మందుల వాడకం పూర్తయ్యాక సమస్య పరిష్కారం అవ్వాలి కదా కానీ మళ్ళీ సమస్య మొదటికి వచ్చినట్టు మందులు అపగానే మళ్ళీ ఆలోచనలు, భయం మొదలయ్యి నిద్ర దూరమయ్యి మళ్ళీ ముందులాగా మారిపోతుంటారు.  ఇలాంటి వాళ్ళు కేవలం తాత్కాలిక పరిష్కారం కోసం మందులు వాడేస్తారు కానీ శాశ్వత పరిష్కారం కోసం ఎప్పుడూ కృషి చెయ్యరు. శాశ్వత పరిష్కారముందా?? అవును ప్రతి సమస్యకూ ఓ శాశ్వత పరిష్కారం అంటూ ఉండనే ఉంటుంది. అయితే అదంతా మనిషి మానసిక స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. మనిషి ఎప్పుడైతే మానసిక స్థాయిని మెరుగుపరుచుకుంటాడో అప్పుడు శారీరక సమస్యలు, లోపాలు కూడా ఎక్కువ భాదించవు. ఎంతోమంది శారీరక లోపాలు కలిగిన వాళ్ళు జీవితాలలో ఎన్నో విజయాలకు చేరువ అవుతున్నారు. వాటన్నిటికీ  కారణం ఏమి అని తరచి చూస్తే వాళ్ళ మానసిక స్థాయి సాధారణ మనుషుల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. తమలో లోపాన్ని మరచి మరీ విజయంవైపు అడుగులు వేస్తూ ఉంటారు. అలాంటిది మానసిక సమస్య ఉన్న శారీరక ఆరోగ్యవంతులు మానసిక సమస్యను అధిగమించడం అసాధ్యమేమి కాదు. మన భారతీయ ఆయుర్వేదం మరియు మన సనాతన ధర్మం మన మహర్షులు ప్రసాదించిన ధ్యానం, ప్రాణాయామం, యోగ వంటివి జీవితంలో భాగం చేసుకుని పాటిస్తే కేవలం నెల రోజులలో ఎంతో గొప్ప పరిష్కారం లభిస్తుంది. ◆వెంకటేష్ పువ్వాడ◆  

కూతురిని కోల్పోయినా... 800 ఆడపిల్లలకు ఆసరా!

చాలామంది జీవితంలో కష్టాలు వస్తాయి. కలలా సాగిపోతున్న జీవితం కాస్తా తలకిందులైపోతుంది. అలా తారుమారైన జీవితాన్ని తల్చుకుని తల్చుకుని వారు కుమిలిపోతుంటారు. కానీ కొందరు మాత్రం తాము పడిన కష్టానికి ఉపశమనంగా, అలాంటి కష్టంలో ఉన్న తోటివారందరికీ ఓదార్పుగా..... ఓ భిన్నమైన మార్గాన్ని ఎన్నుకొంటారు. తన కష్టాన్ని సమాజానికి ఓ వరంగా అందిస్తారు. అలాంటి ఓ వ్యక్తే సరోజనీ అగర్వాల్‌!   లక్నోలో ఉండే సరోజనీది ఓ అందమైన కుటుంబం. చక్కగా చూసుకునే భర్త, రత్నాల్లాంటి పిల్లలు... అంతా బాగుంది. హిందీలో పీ.హెచ్‌.డీ చేసిన సరోజనీకి కథలన్నా, కవితలన్నా చాలా ఇష్టం. ఆ ఇష్టంతో స్వయంగా ఎన్నో రచనలు చేశారు. ఓ రోజు సరోజనీ తన కూతురుతో కలిసి ప్రయాణిస్తుండగా... అనుకోని ఉపద్రవం ఎదురైంది. ఆమె నడుపుతున్న బండి ప్రమాదానికి లోనై, ఆమె కళ్ల ముందే కూతురు చనిపోయింది.   కళ్లముందే కూతురు చనిపోవడం, అది కూడా తను నడుపుతున్న బండి వల్లే చనిపోవడంతో సరోజనీ తేరుకోలేకపోయింది. కానీ అందరిలా ఆమె ఆవేదనతో మిగిలిపోలేదు. తన కూతురు జ్ఞాపకాలకు విలువనిచ్చేలా ఏదన్నా చేయాలనుకున్నారు. అలా 1985లో తన ఇంట్లోనే ఆడపిల్లల కోసం ఓ అనాథ శరణాలయాన్ని నెలకొల్పారు. ఆ శరణాలయానికి తన కూతురు పేరు మీదుగా ‘మనీషా మందిర్‌’ అని పేరు పెట్టారు. తన రచనల మీద వచ్చే రాయల్టీలతో దాన్ని నడపసాగారు.   మనీషా మందిర్‌ను మొదలుపెట్టడమే ఆలస్యం... ఎందరో పిల్లలకి అది ఆసరాగా మారింది. వికలాంగులుగా ఉన్నారనో, పెంచే ఆర్థిక స్తోమత లేదనో... వదిలేసే ఆడపిల్లలకు మనీషా మందిర్‌ నీడనిచ్చింది. రోడ్ల మీద తనకు అనాథలా కనిపించినవారినీ, వేశ్యాగృహాలలో పుట్టినవారినీ కూడా సరోజనీ అక్కున చేర్చుకునేవారు. మనీషా మందిర్లో అనాథలను చేర్చేందుకు ఆ ఇంటి ముంగిట ఒక ఊయల కట్టి ఉండేదంటే... ఆమె నిశ్చయం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.   మనీషా మందిర్‌లో ఇప్పటివరకూ 800 మందికి పైగా ఆడపిల్లలకు ఆశ్రయం లభించింది. అలాగని వారిని కేవలం అనాథలుగా చూడలేదావిడ. వారందరిలోనూ దూరమైన తన కూతురిని చూసుకుని మురుసుకునేవారు. ఒక కూతురి కోసం ఎలాంటి సుదాపాయాలు కల్పించాలని తల్లి తాపత్రయపడుతుందో... తన ఆశ్రమంలో ఉన్నవారికి అలాంటి సౌకర్యాలన్నీ కల్పిస్తారు సరోజని. లైబ్రరీ, కంప్యూటర్‌ లాబ్‌, బాడ్మింటన్ కోర్ట్‌... లాంటివన్నీ మనీషా మందిర్‌లో కనిపిస్తాయి. ఇక అందులోని పిల్లలకు విద్య, వృత్తి నైపుణ్యాలని అందించడం సరేసరి!   మనీషా మందర్‌లో రోజుల వయసులో చేరిన పిల్లలు, తమ కాళ్ల మీద తాము నిలబడేవరకూ చేయూతగా నిలుస్తారు సరోజనీ. అలా మనీషా మందిర్‌లో ఎదిగిన ఎందరో పిల్లలు బ్యాంక్‌ మేనేజర్లుగా, టీచర్లుగా, ప్రభుత్వోద్యోగులుగా గౌరవప్రదమైన స్థానాలకు ఎదిగారు. మరికొందరు పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడ్డారు. ‘‘ఇంతమందికి సాయపడేందుకే భగవంతుడు నా కూతురిని తీసుకువెళ్లిపోయాడేమో! ఇన్ని వందల మందిలో నా కూతురిని పదిలంగా చూసుకునే అవకాశం కల్పించినందుకు ఆయనకి నేను రుణపడిపోయాను,’’ అంటారు సరోజనీ. మనీషా మందిర్‌ ముంగిట ఉన్న మనీష విగ్రహంలోని చిరునవ్వుని గమనిస్తే... ఆమె ఈ మాటలను వింటున్నట్లుగానే తోస్తుంది.   - నిర్జర.

ఉద్యోగాలలో విజయం మహిళలదే

మహిళలకి ఉన్న ఉద్యోగ ప్రజ్ణకి సాటి లేదు అంటున్నారు పరిశోధకులు .ఇక భవిష్యత్తు వారిదే అని కూడా గట్టిగా చెబుతున్నారు. నిన్నటి దాకా మేధస్సు, అనుభవం , మాత్రమే కార్పొరేట్ కార్యాలయాలలో మంచి స్తితి లో ఉండటానికి ఉపయోగ పడతాయి అని నమ్మేవారు . అయితే ఈ మధ్య అమెరికాకు చెందిన " ఈగన్ జెండర్ " అనే సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో ఆ రెండింటి కన్నా , ఉద్యోగంలో ప్రజ్న ఉన్నవారే గొప్ప విజయాలు సాధించగలరని తేలింది. సుమారు అయిదు వందల మందికి పైగా సీనియర్ ఎగ్సిక్యుటివ్ ల పనితీరుని పరిశీలించి న మీదట ఈ విషయం తెలిసింది.  ఓ బృందంగా పని చేసేటప్పుడు పరస్పర సహకారం, కోప తాపాల నియంత్రణ , స్నేహంగా వుండటం, మొదలైన లక్షణాలు వున్నవారు ఉద్యోగం లో చక చకా పైకి ఎక్కుతున్నారుట.     అలా కాకుండా కేవలం ప్రతిభ , అనుభవాన్నే నమ్ముకున్నవారు వెనకపడుతున్నారుట. సో మహిళల సహజ లక్షణాలు అయిన స్నేహశీలత ,సహనం వంటివి వారి బలాలు గా మారి , వారిని ఉన్నత స్తాయికి చేరుస్తున్నాయి అని వీరు పరిశీలించి, పరిశోధించి , చెబుతున్నారు . అయితే వీరు ఒక సలహా కూడా చెబుతున్నారు ..వీరి అద్యయనం లో అమ్మాయిలలో ఆత్మవిశ్వాసం ఆశించిన స్తాయిలో లేకపోవటం, స్వతంత్రం గా వ్యవహరించటం లో తడబాటులని కూడా గమనించారుట. ఈ విషయాల మీద కాస్త ఫోకస్ పెట్టండి చాలు ..మీకు తిరుగు లేదు అని గట్టిగా చెబుతున్నారు. మరి ఆ రెండు అస్త్రాలని కూడా మన అమ్ముల పొదిలో చేర్చు కుంటే సరి ...