Read more!

ఫ్రెండ్షిప్ డే హంగామా ఇలా చేసేయండి!

ఎన్ని సమస్యలున్నా పక్కన ఫ్రెండ్స్ ఉంటే ఆ భరోసా వేరు. ఇప్పటి జనరేషన్ వారు ప్రతి ఈవెంట్ ను ఎంతో ఇష్టంగా సెలెబ్రెట్ చేసుకుంటారు. వాలెంటైన్స్ డే అంటే అందరికీ ఎంత స్పెషలో ఫ్రెండ్షిప్ డే అంటే అంతకంటే స్పెషల్ అనుకుంటారు. కొందరు చాలా దగ్గరి స్నేహితులు చదువులు, ఉద్యోగాలు, వివాహాలు జరిగిపోవడం వంటి కారణాల వల్ల దూరంగా ఉంటారు. మరికొందరు దగ్గర దగ్గరే ఉంటారు. దూరమున్నా, దగ్గరున్నా ఫ్రెండ్షిప్ డే రోజు కాస్త రచ్చ చేయాలని అది కూడా ఓ తీపి జ్ఞాపకంగా మలచుకోవాలని అనుకుంటారు. 

ఇప్పట్లో స్కూల్ కిడ్స్ కూడా ఇలాంటి ప్రత్యేక రోజులను సీరియస్ గా ఫాలో అయిపోతున్న సందర్భంలో అందరూ ఫ్రెండ్షిప్ డే కి స్పెషల్ గా ఏమి చేయచ్చు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అయి కూర్చుంటుంది. ఏమి ఆలోచించినా ఉహు అలా కాదు వేరెలా ఉండాలి అని ఎక్పెక్టషన్స్ ఇంకా ఎక్కువ పెట్టుకుంటారు. చిన్న పిల్లలు ఎక్కువ డబ్బులు ఖర్చు చేయలేరు కానీ వాళ్లకు కూడా స్వచ్ఛమైన స్నేహాలుంటాయి. అలాంటి వాళ్ళు బెంగ పడకుండా హాయిగా ఫ్రెండ్షిప్ డేని స్పెషల్ గా మలచుకోవడానికి  కొన్ని చిట్కాలు ఇచ్చేస్తున్నాం. 

చిన్నచిన్న బహుమతులు ఇచ్చుకోవడం. బహుమతులు అనగానే మరీ ఖరీదు చూడకూడదు. బిస్కెట్ పాకెట్ లేదా చాక్లెట్ వంటివి చిన్న గిఫ్ట్ ప్యాక్ లో పెట్టి ఇవ్వడం. అదేదో చాక్లెట్ యాడ్ లో చెబుతారుగా తియ్యని వేడుక చేసుకుందాం అని. అదే మరి ఇది.

మీలో కళ ఉంటే మాత్రం దానిని బయటకు తీసే అవకాశం ఇదేనని అనుకోండి. ఫ్రెండ్స్ కోసం ఫ్రెండ్షిప్ బ్యాండ్ లు తయారుచేయండి. వాళ్లకు సర్ప్రైజ్ గా వాటిని కట్టండి.

ఇప్పట్లో ఫ్రెండ్స్ మధ్య ఫొటోస్ అనేవి చాలా కామన్. ఫ్రెండ్స్ తో కలసి దిగిన ఫొటోస్ లేదా ఫ్రెండ్ దిగిన ఫొటోస్ ను సేకరించి ఒక నోట్ బుక్ లో పెట్టి వాటి గురించి చిన్న చిన్న లైన్స్ రాసి ఆ బుక్ ని ఫ్రెండ్స్ కి గిఫ్ట్ ఇవ్వచ్చు. చాలా సంతోషపడతారు.

ఇద్దరి మధ్య ఉన్న స్నేహపు బంధాన్ని ఇంకా పటిష్టం చేసుకోవడానికి అదే గొప్ప వేదిక అనుకోండి. ఇద్దరూ కలసి సమయాన్ని గడుపుతూ ఒకరి గురించి మరొకరు మాట్లాడుకోండి. అప్పుడు ఇద్దరిలో బలాలు బలహీనతలు తెలిసిపోతాయి.

మీకు గనుక సామర్థ్యము ఉంటే చిన్న చిన్న కవితలు, లేదా కథలు రాసి స్నేహితులకు బహుమతిగా ఇవ్వచ్చు.

ఫ్రెండ్ లో ఉన్న మంచి లక్షణాలను గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని విషయాలు రాసి దానికి గ్రీటింగ్ కార్డ్ జతచేసి ఇవ్వచ్చు.

పుస్తకాలను బహుమతిగా ఇవ్వచ్చు. దానివల్ల ఆ పుస్తకం ద్వారా ఫ్రెండ్స్ లో ఏదైనా మంచి చేంజ్ వస్తే దానికి కారణం మీరేనని జీవితాంతం గుర్తుంచుకుంటారు.

ఇలా ఒకటా రెండా బోలెడు మార్గాలున్నాయి స్నేహితులతో ఫ్రెండ్షిప్ డే ను బిందాస్ గా జరుపుకోవడానికి. ఫ్రెండ్స్ తో కనుక కాసేపు గడిపాము అంటే ఫ్రెష్ గాలి పీల్చుకుని సేదతీరినట్టు ఉంటుంది. మీకు మంచి ఫ్రెండ్స్ ఉంటే ఈ విషయాన్ని ఒప్పుకుంటారు మరి.

                            ◆నిశ్శబ్ద.