పతకాలకు మీరూ పథకం వేయాలి!!

న్యూస్ ఛానెల్స్ లోనూ, న్యూస్ పేపర్స్ లోనూ ఇంకా సామాజిక మధ్యమాలలోనూ రాష్ట్రానికో, దేశానికో పతకం సాధించిన క్రీడాకారులను చూస్తే శభాష్!! దేశ పరువు నిలబెట్టారు అనే మాట చాలామంది నోటి నుండి వస్తుంది. అంతేనా!! ఇంట్లో ఉన్న తమ పిల్లల్ని చూసి మీరూ ఉన్నారు ఎప్పుడూ దుమ్ములో, బురదలో పందుల్లా దొర్లుతూ ఉంటారు అని విమర్శిస్తారు. నాన్నా నేనూ నా స్కూల్ డేస్ లో ఫలానా క్రీడలో ఫస్ట్ వచ్చాను అంటే, అవునురా నిన్ను అడుక్కుతినమని ఒక బొచ్చె ఇచ్చారులే వాళ్ళు లాంటి ఎగతాళి మాటలు కూడా పుష్కలంగా  వస్తాయి పెద్దల నోటి నుండి. కానీ అలాంటి పెద్దలు తెలుసుకోవలసిన నిజం ఏమిటంటే ఇప్పుడు పథకాలు సాధించినట్టు టీవీ లలో, పేపర్లలో మెరిసే పిల్లల్ని ఆయా పిల్లల తల్లిదండ్రులు ఎంతో ప్రత్సహించారు. వెంట ఉంది పిల్లల్ని కోచింగులకు తీసుకెళ్లి, దగ్గరుండి వాళ్ళతో ప్రాక్టీస్ చేయిస్తూ వాళ్ళను ముందుకు నడిపించారు. కాబట్టే వాళ్లకు దేశ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అంతేనా పిల్లలకు ఆటల పట్ల ఉన్న ఆసక్తిని గమనించి వాళ్ళను వెనక్కు లాగి నిరాశపరచకుండా ప్రోత్సహించడం పిల్లల విషయంలో పెద్దలు తీసుకున్న గొప్ప నిర్ణయంగా ఒప్పుకోవాలి. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే పిల్లల్ని క్రీడల వైపు ప్రోత్సహిస్తే వచ్చే లాభాలు తెలిస్తే ఆటలా వైపు పిల్లల్ని తరుముతారేమో!! గుర్తింపు, శారీరక వ్యాయామం!! చిన్నతనంలో పిల్లలు సరిగ్గా ఎదగాలి అంటే ఆటలకు మించిన గొప్ప మార్గం లేదు. టీవీ యాడ్స్ లో అందరూ చూపించే కాంప్లాన్లు, హార్లిక్స్ ల కంటే క్రీడలు మంచి శరీర సామర్త్యాన్ని,  శారీరక ఎదుగుదలను కూడా పెంపొందిస్తాయి. అంతేకాకుండా క్రీడల్లో ఓటమి, గెలుపులు సహజం కాబట్టి జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు వైఫల్యాలు ఎదురైనప్పుడు స్పోర్టివ్ గా తీసుకోగలుగుతారు పిల్లలు. కాబట్టి క్రీడల ద్వారా మానసిక పరిణితి కూడా పెరుగుతుంది. లక్ష్యాలు, లక్ష్యసాధనలు!! లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవడం, వాటిని సాధించడం తెలిస్తే పిల్లల జీవితం ఎంతో క్రమశిక్షణ బాటలో ప్రయాణిస్తుంది. క్రీడల్లో ఇలాంటి లక్ష్యాలు, లక్ష్యసాధనలు పిల్లల చదువులో కూడా ఉపయోగపడతాయి. ఎప్పుడూ పుస్తకాల మధ్యన నలిగిపోయే పిల్లలకు క్రీడలు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి. ఉద్యోగావకాశాలు!! రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి పోటీలలో క్రీడల్లో రాణించే వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారు. క్రీడాకారుల కోటాలో ఇచ్చే ఇంటి స్థలాలు, ఇల్లు, ఉద్యోగాలు, ఇంకా ప్రోత్సాహక బహుమతిగా లక్షల రూపాయలు కూడా ఇస్తాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు జాతీయస్థాయిలో మెరిసినప్పుడు రాష్ట్రప్రభుత్వాల తరపున ప్రకటించే డబ్బు లక్షల్లో ఉంటుంది.  మినహాయింపు!! రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడల్లో రాణించే వారికి చదువుతున్న కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుండి కూడా మంచి సహకారం ఉంటుంది. నిజానికి ఇలా క్రీడల్లో స్థాయిల వారిగా వెళ్లడం కూడా కళాశాలలు, విశ్వవిద్యాలయాల తరపున జరగడం వల్ల ఒకానొక లీడర్షిప్ క్వాలిటీస్ పెంపొందుతాయి.  ప్రత్యేక గుర్తింపు!! క్రీడల్లో రాణించడం అంటే మంచి శరీర సామర్థ్యము కలిగి ఉండటం కాబట్టి ఆర్మీ, నేవీ వంటి విభాగాల్లో ఎంతో అరుదైన హోదాలు కూడా దక్కుతుంటాయి. ఇవి మాత్రమే కాకుండా ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి పురస్కారాలు కూడా వరిస్తాయి. అందుకే మరి పిల్లలు ఆడుకుంటే పనికిమాలిన చర్యగా భావించి వారిని కట్టడి చేయకుండా హాయిగా ఆటల్లో రాణించేలా ప్రోత్సహించండి. రాజుల్లా, రాణుల్లా మంచి జీవితాన్ని పొందగలరు.                               ◆వెంకటేష్ పువ్వాడ  

ఊహించని ప్రధాని రాజీవ్!

భారతజాతీయ కాంగ్రేస్ గాంధీ-నెహ్రు కుటుంబాల వారసత్వ పార్టీగా అందరికీ తెలిసిందే. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత నుండి ఈ పార్టీనే దేశాన్ని నడిపిస్తూ వచ్చింది. మొదటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రు గారి దగ్గర సహాయకురాలిగా పనిచేసిన ఇందిరాగాంధీ నెహ్రు తరువాత ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకుంది. అప్పుడు ఆమె వయసు 48 సంవత్సరాలు. ఆమెకు పుట్టిన ఇద్దరు కొడుకులలో రాజీవ్ గాంధీ పెద్దవాడు కాగా, సంజయ్ గాంధీ చిన్నవాడు. రాజకీయ కుటుంబంలో పుట్టినా చిన్నతనం నుండి రాజీవ్ గాంధీకి ఎలాంటి ఆసక్తి  లేదని తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది. కానీ అదే నిజం. ఆయన ఏ రోజూ రాజకీయాల్లోకి రావాలని, నాయకుడిగా ఎదగాలని కోరుకోలేదు. అయితే ఎలాంటి ఆసక్తి లేని రాజీవ్ భారతదేశానికి అతి చిన్న వయసు ప్రధానిగా ఎలా ఎంపికయ్యాడు?? ఆయన మరణం ఎలా సంభవించింది?? ఆయన ప్రధానిగా చేసిన కొద్ది కాలంలో దేశంలో చోటుచేసుకున్న మార్పులు ఏమిటి??  బాల్యం, విద్యాభ్యాసం!! రాజీవ్‌గాంధీ 1944 ఆగ‌స్టు 20 బోంబేలో జ‌న్మించారు. భార‌త‌దేశం స్వాతంత్య్రం సాధించేనాటికి ఆయ‌న తాత ప్ర‌ధాన‌మంత్రి అయ్యేనాటికి రాజీవ్ వ‌య‌సు కేవ‌లం 3 సంవ‌త్స‌రాలు. ఆయ‌న త‌ల్లిదండ్రులు ల‌క్నో నుంచి ఢిల్లీకి మ‌కాం మార్చారు. తండ్రి ఫిరోజ్ గాంధీ పార్ల‌మెంటు స‌భ్యుడు అయ్యారు. రాజీవ్ చిన్నతనం ఆయన తాతగారు అయిన నెహ్రూతో గడిచింది. తరువాత డెహ్రాడూన్‌లోని వెల్హామ్ ప్రెప్ స్కూల్‌కు కొద్దికాలంపాటు వెళ్ళిన రాజీవ్‌గాంధీ త‌రువాత రెసిడెన్షియ‌ల్ డూన్ స్కూల్‌కు మారారు. స్కూల్ చ‌దువు పూర్త‌యిన త‌రువాత రాజీవ్‌గాంధీ కేంబ్రిడ్జి ట్రినిటీ క‌ళాశాల‌లో చేరారు. అయితే త్వ‌ర‌లోనే లండ‌న్‌లోని ఇంపీరియ‌ల్ కాలేజ్‌కి మారారు. అక్క‌డ మెకానిక‌ల్ ఇంజినీరింగ్ కోర్సు చేశారు. సైన్సు, ఇంజినీరింగ్‌కు సంబంధించిన ఎన్నో పుస్తకాలు ఆయ‌న బీరువాల నిండా ఉండేవ‌ని ఆయన తోటి విద్యార్థులు  చెబుతారు. ఫిలాస‌ఫీ, రాజ‌కీయాలు లేదా చ‌రిత్ర గురంచి ఆయ‌నకు ఆసక్తి కాదు. అయితే సంగీతాన్ని ఇష్ట‌ప‌డేవారు. వెస్ట్ర‌న్‌, హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంతోపాటు ఆధునిక సంగీతాన్ని కూడా ఇష్ట‌ప‌డేవారు. రాజీవ్ ఆస‌క్తి క‌న‌బ‌బ‌రిచే ఇత‌ర అంశాల్లో ఫొటోగ్ర‌ఫీ, అమెచ్యూర్ రేడియో ముఖ్య‌మైన‌వి. ఈయన ఇంగ్లండ్ నుండి తిరిగి వచ్చిన తరువాత ప్లయింగ్  క్లబ్ లో సభ్యత్వం తీసుకుని ఎంట్రన్స్ ఎక్సమ్ పాసయ్యి కమర్షియల్ ఫైలట్ గా లైసెన్స్ తీసుకోవడానికి వెళ్లి ఇండియన్ ఎయిర్ లైన్స్ లో ఫైలట్ గా ఎంపికయ్యి, ఫైలట్ గా కొత్త జీవితం మొదలుపెట్టారు. పెళ్లి, పిల్లలు!! ఈయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లో చదువుతున్న సమయంలోనే ఇంగ్లీష్ చదివే ఇటాలియ‌న్ మ‌హిళ సోనియా మైనోతో ప‌రిచ‌య‌మ‌యింది. 1968లో ఢిల్లీలో వారు ఇద్ద‌రూ పెళ్ళి చేసుకున్నారు. రాహుల్, ప్రియాంక అనే ఇద్దరు పిల్లలతో ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంట్లోనే ఉండేవారు. రాజకీయ ప్రవేశం!! 1980లో సోద‌రుడు సంజ‌య్‌గాంధీ విమాన ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌డంతో ప‌రిస్థితి మారింది. అప్ప‌ట్లో అంత‌ర్గ‌తంగా, బ‌హిర్గ‌తంగా అనేక స‌వాళ్ళు చుట్టుముట్టిన ప‌రిస్థితుల్లో త‌ల్లికి చేయూతను ఇవ్వ‌డానికి రాజ‌కీయాల్లో చేర‌వ‌ల‌సిందిగా రాజీవ్‌గాంధీపై వ‌త్తిడి పెరిగింది. మొద‌ట్లో వీటిని ప్ర‌తిఘ‌టించిన‌ప్ప‌టికీ త‌రువాత త‌ల వొగ్గ‌క త‌ప్ప‌లేదు. త‌మ్ముని మృతి కార‌ణంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అమేథీ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో రాజీవ్‌గాంధీ గెలుపొందారు. రాజీవ్ పాలనలో ముఖ్య విషయాలు!! 1982 న‌వంబ‌ర్‌లో భార‌త్ ఆసియా క్రీడ‌ల‌కు ఆతిథ్యం ఇచ్చిన‌పుడు అంత‌కు చాలా సంవ‌త్స‌రాల ముందు జ‌రిగిన ఒప్పందానికి క‌ట్టుబ‌డి స్టేడియంలు, ఇత‌ర మౌలిక స‌దుపాయాలు క‌ల్పించే కార్య‌క్ర‌మాన్ని రాజీవ్‌గాంధీ విజ‌య‌వంతంగా పూర్తిచేశారు. ఇది ఆయన సమర్త్యాన్ని బయటకు తెలిసేలా చేసింది.  ప్రధానిగా నిర్ణయాలు!! ఇందిరా గాంధీ మరణం తరువాత ఈయన పాలనలో ప్రధానిగా తీసుకున్న ముఖ్య నిర్ణయాలలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ముఖ్యమైనది. ఎన్నికైన పార్లమెంట్ లేదా శాసనసభ సభ్యులు తరువాత ఎన్నికలు వచ్చేవరకు పార్టీలు మారడానికి వీల్లేకుండా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈయన కాలంలో మైనారిటీలకు అనుగుణంగా, సుప్రీం కోర్టు నిర్ణయాన్ని రద్దు చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. అందుకే ఈయన పాలనలో మైనారిటీలకు పెద్ద పీట వేసినట్టు చెబుతారు. ఇంకా ఆర్థిక విధానం పరంగా రాజీవ్ నిర్ణయాలు కొంచం సంచనాలు అయ్యాయి. ప్రైవేట్ ఉత్పత్తిని లాభదాయకంగా మార్చడానికి ప్రోత్సాహకాలను అందించడం ద్వారా పారిశ్రామిక ఉత్పత్తిని, ముఖ్యంగా మన్నికైన వస్తువులను పెంచడానికి కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇచ్చేలా నిర్ణయాలు జరిగాయి . ఇది ఆర్థిక వృద్ధిని పెంచుతుందని మరియు పెట్టుబడి నాణ్యతను మెరుగుపరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇది ఆర్థిక వ్యవస్థను బాహ్య ఆర్థిక ప్రభావాలకు తెరతీస్తుందని అందరూ భావించారు.  అయితే గ్రామీణ మరియు గిరిజన ప్రజలు వాటిని ధనవంతులకు మరియు నగరాల్లో నివసించేవారికి అనుకూలమైన సంస్కరణలుగా భావించి నిరసన వ్యక్తం చేశారు.  ఈయన  సైన్స్, టెక్నాలజీ మరియు అనుబంధ పరిశ్రమలకు ప్రభుత్వ మద్దతును పెంచారు మరియు టెక్నాలజీ ఆధారిత పరిశ్రమలు, ముఖ్యంగా కంప్యూటర్లు, ఎయిర్‌లైన్స్, రక్షణ మరియు టెలికమ్యూనికేషన్‌లపై దిగుమతి కోటాలు, పన్నులు మరియు సుంకాలను తగ్గించారు. 1986లో, అతను భారతదేశం అంతటా ఉన్నత విద్యా కార్యక్రమాలను ఆధునీకరించడానికి మరియు విస్తరించడానికి జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించాడు. 1986లో జవహర్ నవోదయ విద్యాలయ వ్యవస్థను స్థాపించాడు, ఇది కేంద్ర ప్రభుత్వ ఆధారిత విద్యా సంస్థ, ఇది గ్రామీణ జనాభాకు ఆరు నుండి పన్నెండు తరగతుల వరకు ఉచిత రెసిడెన్షియల్ విద్యను అందిస్తుంది. మరణం!! జూలై 1987లో గాంధీ ఇండో-శ్రీలంక ఒప్పందంపై సంతకం చేశారు . ఈ ఒప్పందం తమిళం-మెజారిటీ ప్రాంతాలకు అధికార వికేంద్రీకరణను ఊహించింది, LTTEని రద్దు చేసింది మరియు తమిళాన్ని శ్రీలంక అధికారిక భాషగా నియమించింది.  ఇండో-శ్రీలంక ఒప్పందంపై సంతకం చేసిన ఒక రోజు తర్వాత, విజిత రోహన అనే గౌరవ గార్డు తన రైఫిల్‌తో రాజీవ్ భుజంపై కాల్చారు. అయితే ఆయన ఇది పసిగట్టి తప్పుకోవడం వల్ల భుజానికి మాత్రమే తగిలింది. నిజానికి అది తలకు పడాల్సింది.  రాజీవ్ గాంధీ చివరి బహిరంగ సభ 21 మే 1991న, శ్రీపెరంబుదూర్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి కోసం ప్రచారం చేస్తున్నప్పుడు జరిగింది.  హత్యకు గురైన మద్రాసు నుండి దాదాపు 40 కిమీ దూరంలో ఇది ఉంది. రాత్రి 10:10 గంటల  తర్వాత తెన్మొళి రాజరత్నంగా గుర్తించబడిన ఒక మహిళ - లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం సభ్యురాలుగా రాజీవ్ వద్దకు వచ్చి ఆయనకు నమస్కరించింది.  అయితే ఆమె కిందకు వంగినప్పుడు ఆమె తన శరీరానికి అమార్చుకున్న బాంబులను పేల్చింది. ఈ సంఘటనలో రాజీవ్, రాజారత్నం అనే మహిళతో సహా  14 మంది మరణించారు. ఇలా అనుకోకుండా ప్రధానిగా మారి మరణం బారిన పడింవారు రాజీవ్ గాంధీ. ◆వెంకటేష్ పువ్వాడ.

ప్రపంచంపై జ్ఞానాన్ని పూయించే బుద్దపూర్ణిమ!

దుఃఖం మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే దుఃఖం కలగడానికి కారణాలు ఏమిటి అంటే కోర్కెలు పుట్టడం. కోర్కెలు మనిషి జీవితాన్ని దుఃఖంలోకి నెట్టుతాయి. కోర్కెలను జయించడం మనిషికి ఎంతో కష్టం. కానీ అసాధ్యం మాత్రం కాదు. ప్రపంచాన్ని దుఃఖం నుండి బయటపడమని పిలుపునిచ్చిన వారిలో బుద్ధ భగవానుడు ఒకరు. ఈయన భోధనలు దాదాపు భగవద్గీతను సారానికి దగ్గరగా ఉంటాయి.  బుద్ధుడి జననం, బుద్ధుడికి జ్ఞానోదయం కలగడం, బుద్ధుడు నిర్యాణం చెందడం ఇలా ఎంతో ముఖ్య ఘట్టాలు అయిన మూడు వైశాఖ మాసంలో వచ్చే పూర్ణిమ రోజే జరిగాయని చెబుతారు. అందుకే బుద్ధ పూర్ణిమ ఎంతో ప్రాశస్త్యం పొందింది. సిద్ధార్థుడి నుండి బుద్ధుడు!! పుట్టినప్పుడు ఈయనకు పెట్టిన పేరు సిద్ధార్థుడు. అయితే ఈయన తన పదహారు సంవత్సరాలు తరువాత యశోధరను పెళ్లి చేసుకున్నాడు  రాహులుడు అనే కొడుకు కూడా పుట్టాడు. సుఖాలు అనుభవించడమే జీవితానికి పరమార్థం అని నమ్మి ఎప్పుడూ సుఖసంతోషాలు గడిపేవాడు. అయితే తన ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో కపిలవస్తు నగరంలో విహారానికి వెళ్తున్నప్పుడు కనిపించిన నాలుగు సంఘటనలు అతడిని ఎంతగానో కలచివేశాయి. రోగాలను, మరణాన్ని, ముసలితనాన్ని జయించాలనే సంకల్పంతో సన్యాస జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుని, ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. ఎన్నో సంవత్సరాలు ఎన్నో మార్గాలు అనుసరించి చివరకు గయలో ఒక భోది వృక్షం కింద ఆత్మజ్ఞానం పొందాడు. అప్పటినుండి జీవితంలో ఎన్నో విషయాలను తన భోధనలుగా చెబుతూ ప్రపంచమంతా తిరుగుతూ ప్రపంచానికి బౌద్ధాన్ని పరిచయం చేసినవాడు గౌతమ బుద్ధుడు. మానవుని అజ్ఞానానికి, కష్టాలకు కారణాలను, వాటి నుండి విముక్తి పొందడానికి మార్గాలను తెలుసుకోగలిగాడు. వీటిని 4 పరమ సత్యాలుగా విభజించాడు. దీనినే బౌద్ధ మతంలో నిర్వాణం అని అంటారు. బుద్ధం, ధర్మం, సంఘం అనే మూడు సూత్రాలతో  మొదటి బౌద్ధ మత సంఘం ఏర్పడింది. తరువాత ఈ సంఘంలో చేరిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ బుద్ధుని బోధనలను ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయడంలో ముందుకు కదిలింది. వర్షాకాలంలో వచ్చే వరదలవల్ల అన్ని మతాలకు చెందినసన్యాసులు ఆ కాలంలో తమ ప్రయాణాలను తాత్కాలికంగా నిలిపివేశేవారు. ఈ సమయంలో బౌద్ధ మత సంఘం ఒక ఆశ్రమాన్నిఏర్పాటు చేసుకుని అక్కడ నివసించేది. చుట్టుపక్కల ప్రాంతాలనుండి ప్రజలంతా ఆ సమయంలో ఆశ్రమానికి వచ్చేవారు. దీనినే వస్సాన అని అంటారు. బుద్ధుడు ఐదవ వస్సనలో వైశాలికి దగ్గరలో ఉన్న మహావాసనలో బస చేశాడు. అప్పుడు బుద్ధుని తండ్రి శుద్ధోధనుడు మరణశయ్యపైఉండడంతో, బుద్ధుడు అతని దగ్గరికి వెళ్లి ధర్మాన్ని బోధించడంతో, శుద్ధోధనుడు మరణానికి ముందు బౌద్ధ సన్యాసిగా మారాడు. బుద్ధుని నిర్యాణం!! బుద్ధుడు తన ఎనభై సంవత్సరాల వయసులో తన దేహాన్ని విడిచిపెట్టాడు. ఆయన నిర్యాణం చెందడానికి ముందు తన శిష్యులను పిలిచి వారికి ఏమైనా సందేహాలు ఉంటే అడగమన్నాడు. చివరకు వారు ఎలాంటి సందేహాలు అడగకపోయేసరికి తన జీవితానికి ముగింపు ఇచ్చాడు.  ఈయన నేపాల్ ప్రాంతానికి చెందినవాడు కావడం వల్ల ఆ ప్రాంత వాసులు బుద్ధుడిని తమ దైవంగా భావిస్తారు.  బుద్ధుడు తన జీవితంలో ముఖ్యంగా యోగ, ధ్యానం, సన్యాసం మొదలైన విషయాలను ఎంతో ప్రాముఖ్యమైన వాటిగా భావించాడు. మనిషి అత్యాశతో బ్రతకడం వృథా అని భావించాడు. ఎప్పుడూ నిర్మలమైన ద్యానముద్రలో ఉండే బుద్ధభాగవానుడు ఎంతో గొప్ప శాంతియుత జీవనాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలని అనుకున్నారు. దానిఫలితమే నేడు మానవ జీవితాల్లో  కనిపించే ఒకానొక మౌన ప్రవాహపు తరంగాల జ్ఞాన పరిమళం. ప్రపంచ శాంతి కోసం ఆరాటపడిన వాళ్లలో బుద్ధుడు కూడా ఒకరు. కేవలం ఆ బుద్ధుడి ధ్యాన స్వరూపాన్ని చూస్తూ పరిగెత్తే మనసును ఒకచోట నిలబెట్టచ్చు. ◆వెంకటేష్ పువ్వాడ.

నరసింహావతారం నరులకు ఇచ్చే సందేశం!

మహావిష్ణువు అవతారాలు ఎన్ని అంటే చాలా మంది పది అంటారు. కానీ మహావిష్ణువు పూర్తి అవతల 21. వీటిని ఏకవిశంతి అవాఘారాలు అంటారు. వీటిలో చాలా ప్రముఖమైనవి, కథలుగా ప్రాచుర్యంలో ఉన్నవి పది. ఆ పది అవతారాలు మహావిష్ణువు ఒక్కో యుగంలో ఒకో విధంగా ఆవిర్భవించి ఈ లోకాన్ని దుష్టుల నుండి కాపాడుతూ దుష్ట శిక్షణ, శిష్ఠ రక్షణ అనే విషయాన్ని వ్యాప్తం చేసాడు. అలా  విష్ణుమూర్తి దశావతారాలలో నాలుగవ అవతారం అయిన నరసింహ అవతారం ఎంతో విశిష్టమైనది. పూర్తి మనిషిగా కాకుండా, పూర్తి మృగంలా కాకుండా రెండింటి కలయికతో ఆవిర్భవించిన భీకర స్వరూపం ఈ నరసింహ అవతారం. ఆవిర్భావం వెనుక కథ, వృత్తాంతం!! జయవిజయులు వైకుంఠంలో విష్ణుమూర్తి ద్వారపాలకులు. అర్థమయ్యేలా చెప్పాలంటే లోపలికి ఎవరికీ పంపకుండా కాపలా ఉండటం. ఎవరైనా విష్ణుమూర్తిని కలవడానికి వస్తే మొదట విష్ణుమూర్తికి విషయం చెప్పి ఆయన సరేనంటే వాళ్ళను లోపలికి పంపడం. ఒకరోజు సనకసనందనాది మునులు విష్ణుమూర్తి దర్శనానికి వస్తే "ఇప్పుడు విష్ణుమూర్తిని కలవడానికి కుదరదు" అని చెప్పారు. ఆ మునులకు కోపం వచ్చి "మీరు విష్ణుమూర్తి  దగ్గర ఉంటున్నామని గర్వంతో ఇలా అంటున్నారు కదా, విష్ణులోకం నుండి మీరు దూరమైపోతారు" అని శాపం పెట్టారు.  ఆ జయవిజయులు విష్ణుమూర్తిని అడిగితే "ఏడు జన్మలు నాకు మంచి భక్తుల్లా పుడతారా?? లేక మూడు జన్మలు నాకు శత్రువులుగా పుట్టి నాచేతిలోనే మరణిస్తారా??" అని అడిగాడు విష్ణువు.  ఏడు జన్మలు మేము ఉండలేము, మూడు జన్మలు మీకు శత్రువులుగా పుట్టి మీ చేతిలోనే మరణిస్తాము" అని అన్నారు వాళ్ళు. అలా కృతయుగంలో పుట్టిన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులే ఈ జయవిజయులు. చాలామంది తిట్టుకుంటూ ఇలా గుర్తుచేసుకోవడాన్ని వైరి భక్తి అంటూ ఉండటం వైన్ ఉంటాం. హిరణ్యకశిపుడు బ్రహ్మ నుండి వరం పొందాడు. గాలిలోగాని, ఆకాశంలోగాని, భూమిపైగాని, నీటిలోగాని, అగ్నిలోగాని, రాత్రి గాని, పగలు గాని, దేవదానవమనుష్యుల చేతుల్లో కానీ, జంతువులతో కానీ, ఆయుధములచేత కానీ, ఇంట్లోకాని, బయటకాని మరణము కలగకుండా వరం సంపాదించాడు. అందువల్ల హిరణ్యకశిపుడిని ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ప్రహ్లాదుడు, నృసింహ ఆవిర్భావం!! ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి కొడుకు. యుద్ధం జరిగి హిరణ్యకశిపుడి భార్యను ఇంద్రుడు ఎత్తుకుని పోతే నారదుడు ఇంద్రుడిని మందలించి ఆమెను తన ఆశ్రమానికి తీసుకెళ్లి రక్షణ కల్పిస్తాడు. ఆ సమయంలో నారదుడు చెప్పిన భాగవత విషయాలను విన్న ప్రహ్లాదుడు పుట్టుకతో విష్ణు భక్తుడిగా మారిపోయాడు.  శివుడు, విష్ణువు శత్రువులు కాకపోయినా వీరి భక్తులు మాత్రం ఎప్పుడూ శత్రుత్వంతో రగిలిపోయేవారు. వాళ్లలో హిరణ్యకశిపుడు కూడా ఒకడు. విష్ణువంటే సరిపడదు అందుకే కొడుకును చంపాలని చూసి విఫలమై చివరకు ఎక్కడున్నాడు నీ హరి??" అని ప్రశ్నించగా. స్థంబాన్ని చీల్చుకుని వచ్చిన మనుష్య, మృగ అవతారమూర్తి నరసింహుడు. బ్రహ్మ ఇచ్చిన వరంలో ఉన్న అంశాల ఆధారంగా వాటన్నిటినీ మినహా ఇస్తూ హిరణ్యకశిపుడిని ఇంటి గడప మీద చేతి గొర్లతో కడుపు చీల్చి వధించాడు.  ఇదీ నరసింహావతార కథ. అంతార్థం!! ఆ భగవంతుడు ఈ సృష్టిలో అణువణువు నిండి ఉంటాడు. భగవద్గీత చెప్పే విషయం ఇదే. దాన్నే ప్రహ్లాదుడు తన భక్తితో చెప్పాడు. వైర భక్తి. ప్రపంచంలో మనుషులు శత్రువులు అయినా వారిలో ఖచ్చితంగా ఎదజేటివాడు సరిచేసుకోగలిగిన అంశాలు ఉంటాయనే విషయాన్ని గుర్తుచేస్తూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే ఒక శత్రువు లోపాన్ని ఎత్తి చూపినట్టు, స్నేహితులు, దగ్గరివాళ్ళు చూపించరు. కాబట్టి శత్రువు ఎప్పటికైనా మంచివాడే. మృగ స్వభావం ప్రతి మనిషిలో అంతర్లీనంగా ఉంటుంది. ఆ మృగస్వాభావం వచ్చినప్పుడు మనిషి విచక్షణ కోల్పోతాడు అనే విషయం ఈ నరసింహ అవతారంలో స్పష్టం అవుతుంది. విచక్షణ కోల్పోయిన మనిషి చేసే పనులలో చాలా నష్టాలు ఉంటాయని అంటారు. కాబట్టి మృగ స్వభావం అనేది మనిషిని ఎప్పుడూ దిగజార్చకూడదు. ఇలా నరసింహ అవతారం మనిషికి ఎన్నో విషయాలు బోధిస్తుంది. నరసింహస్వామిని ఆరాధిస్తే అరిశడ్వర్గాలను అదుపులో ఉంచుకునే మానసిక శక్తి, ఇంకా అంతులేని ధైర్యం చేకూరుతాయి. అలాగే భయాలు తొలగిపోయి.  ఒకటి మాత్రం నిజం. లక్ష్మినారాయణుడు అన్నా, లక్ష్మీ నరసింహస్వామి అన్నా ఒకటే, అవతారాలు వేరు.  అన్నింటిలో నిండినది ఆ పరమాత్మే.                           ◆ వెంకటేష్ పువ్వాడ.

ఒక కొత్త ప్రవాహం ఈ "వెళ్లిపోవాలి"!

ఇతర భాషల్లో, దేశాల్లో సినిమాకు నిర్వచనం మార్చి, పూర్వం ఊహించి ఎరగని విధానాలలో కథలను తెర మీదికి తీసుకొస్తున్నారనీ, మనవాళ్ళు ఇంకా మూసపద్ధతులనుంచి బయటపడటం లేదనీ విచారపడే,  ప్రత్యేక తెగ తెలుగు ప్రేక్షకుల కోసం ఒక కొత్తగాలి వీచినట్లు వచ్చింది " Camera Stylo" banner నుంచి "వెళ్ళిపోవాలి" సినిమా అనవచ్చు. సినిమా తీయడంలో, రిలీజ్ చేయడం లో కూడా మామూలు పద్ధతులకు పూర్తి భిన్నంగా ప్రయత్నించి, సఫలీకృతం గా బయటికి తీసుకొచ్చిన మొదటి సినిమా బహుశా తెలుగులో ‘‘వెళ్ళిపోవాలి‘‘ మాత్రమే నేమో.  ఏవిధంగా చూచినా ఇదొక విప్లవం లాంటిది సినీ చరిత్రలో. ఒక చెప్పుకోదగ్గ కథా, ఒక ప్రధానపాత్ర, పెద్ద సంఘర్షణ , ఒక క్లైమాక్స్ , ఇవేవీ లేని పూర్తి నిడివి సినిమా ఇది. చాలా మామూలు డిజిటల్ కెమెరాతో, అత్యంత చిన్న పెట్టుబడితో అన్నీ తామే అయి ఒక ముగ్గరు మిత్రులు చెప్పిన తమ కథ ఈ సినిమా విషయం. అలా అని ఇది ఏ డాక్యుమెంటరీ సినిమానో కాదు. ఇలా ప్రయోగాత్మకంగా docufilms genre లో సినిమాలు తీసిన వాళ్ళు వేరే ప్రపంచం సినిమా డైరెక్టర్ లు అబ్బాస్ కియొరస్తమీ, నూరి బెల్గ్ చెయ్లన్ లాంటి కొందరు ఉన్నా, వాళ్ళ అనుభవాలే సినిమాగా తీసినా వాళ్ళు వాళ్ళ పాత్రలను వేరే నటులతో నటింపచేశారు. ఒక్క ఈ ‘‘వెళ్ళిపోవాలి‘‘ సినిమా తీసిన ముగ్గురు, మెహెర్, రాజిరెడ్డి, అజయ్  వాళ్ళ సంగతులనే కథ చేసి, వారి వారి పాత్రలు వాళ్ళే నటించడం బహుశా మొత్తం ప్రపంచ సినీ చరిత్రలో నే తొలిసారి జరిగింది.  రచనలు చేయటం అనే ఒక కామన్ అభిరుచి,  వయసు నలభైలలో ఉన్న, పరిచయస్తులకు ఎక్కువ, మరీ బాల్య ప్రాణస్నేహితులకు తక్కువ అయిన ముగ్గురు మిత్రులు ప్రస్తుతజీవితంలో ఎదుర్కుంటున్న సమస్య, ‘‘స్వంత ఇల్లు ఎక్కడ ఏర్పరుచుకోవాలి?‘‘ పుట్టిపెరిగిన వేరు వేరు ఊర్ల  నుంచి ఉద్యోగాల కోసం హైదరాబాద్ కు వచ్చిన వాళ్ళకు ఇది అంతుచిక్కని ప్రశ్న. జీతం దొరికే ఏదో ఒక పని దొరికిందని తప్ప ఇంకేవిధంగానూ తమకు స్వంతం అనిపించని ఈ నగరం లో ఇల్లు ఏర్పరుచుకోవటం ఆర్థికంగా అసంభవం. ఇక్కడ ఆత్మీయతా దుర్లభమే. అటు ఉండొచ్చిన ఊరూ ఇన్నేళ్ల వలస తరువాత పరాయిగా కనిపిస్తుంది. ఊరితో, అక్కడ మనుషులతో వీరి అనుబంధం కీలుబందు వదులైన కుర్చీకాలులా ఊగుతుంటుంది, ఆసరా నిమ్మళంగా ఇవ్వలేదు అది. ఆ juncture లో మనిషికి ఇల్లు కట్టుకోవడమనే సమస్య రూపాంతరం చెంది అసలు అది తన అస్తిత్వ సమస్యగా ఎలా మారి కలవరపెడుతుందో అనేదే ఈ సినిమా కథ.  జీతానికి, జీవితానికీ, మూలాలకీ, ఉండవలసొచ్చిన నగరాలకు ఒక అర్థం వెతకడం మొదలు పెడుతుంది మనసు. ఒక క్షణం బలంగా మనదంటూ ఒక కుటుంబం, ఊరూ, జీవితం కావాలని, మరుక్షణం వీటివేటికీ అంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరమా ఎలాగూ ‘‘సగాన పడ్డాం జీవితంలో, ఇంకా ఎందుకు ఒక ఇల్లు ఏర్పరుచుకోవడం కోసం తక్కిన సగం జీవితం తాకట్టు పెట్టుకోవడం ‘‘ అని ఒక వైరాగ్యమూ ఆవహిస్తుంది.  అదొక విషాదమైన సందిగ్ధం. కానీ ఆ సందిగ్ధాన్ని ఎవరికి తోచిన రీతిలో, ఎవరికి చేతనైన మార్గంలో వారి వారి జవాబు వెతుక్కోవడంలో తప్పనిసరి సౌందర్యం ఆవిష్కృతమైంది ఈ ముగ్గురి కథలలో. సినిమా చివర్లో వచ్చిన  "మనం సగం సన్యాసులం, సగం సంసారులం" అనే మాట ఈ సినిమాలో కనిపించే ముగ్గురికీ ఉన్న మూలసూత్రం. కానీ ఆ మూడు ముఖ్యమైన పాత్రల్లో, ఆ నిష్పత్తుల లో తేడాలు, ఆ రెండిటినీ ఎంతలో ఎక్కడ నిలబెట్టాలో తెలుసుకోవడంలో తేడాలు ఉన్నాయి. అసలు ఈ "clinging to one's roots, past, desire for belongingness" మనిషి ప్రాథమిక సమస్యా? మౌలిక సమస్యా? మెటఫర్లు, లేటెంట్ అర్థాలు , దృశ్యాల framing లకు significances, అన్ని నెట్టిపారేసి అతి మామూలు ముచ్చట్లోతోనే ప్రస్తుతపు ప్రతిమనిషి అస్తిత్వ వేదనను నింపాదిగా కథలా వ్రాసుకొచ్చింది  ఈ  కెమెరా stylo.  ఆ నెమ్మది కథనంలోనే బోలెడంత agitation feel చేయించింది.  "వెళ్ళిపోవాలి"  చీకట్లనూ వెలుతుర్ల నూ, ఇరుకిరుకు జేగురు గదులనూ,  పచ్చటి వైశాల్యాలను కథకు అవసరమైనప్పుడు అవసరమైనట్లు చూసింది.  అందులో జీవితం మీద కావలసినంత ప్రేమ కనిపించింది, బ్రతుకంటే విరక్తీ కనిపించింది. ఈ సినిమా లెన్స్ లైట్ ను, దాని అన్ని hues తో beautiful గా పట్టుకుంది. Hues, that are beyond just physical also... నగరంలో వానకు తడిసిన నారింజ రంగు రోడ్లు అవి దాటుతున్న అజయ్ మనఃస్థితిని, సగం ఖాళీగా ఉన్న పచ్చటిపొలాలు, పడిపోతున్న జేగురు రంగు ఇల్లు రాజిరెడ్డి ఆలోచనలనూ, చీకటి మేడ, ఎండిన సిమెంట్ రోడ్లు మెహెర్ apparent out look నూ పట్టిచ్చిన్నట్టు ఉంటుంది. ముగ్గురు ఆడవాళ్ల ఉనికి ప్రాణం ఈ మగవాళ్ళ కథలకూ, తెరకూ కూడా. "కత్తిని బేరం చేసేప్పుడు దాని వాదరకు విలువ కట్టాలి, పిడికి కాదు", సినిమా అయినా అంతే. అది ఎంత పదునుగా తను చెప్పదలుచుకున్నది చెపుతున్నదో చూడాలి కానీ కెమెరా సైజూ, బడ్జెట్ బరువూ కాదు లెక్కించాల్సింది. మనిషి ఎప్పుడూ  ఇంకా ఎక్కడికో వెళ్ళేందుకు చూస్తుంటాడు వాకిలికి ఒక కాలు లోపలికి, ఒక కాలు వెలుపలికి వేసి. Congrats to the whole team. (విశ్లేషణాత్మక సమీక్ష అందించిన పద్మజ సూరపురాజు గారికి ధన్యవాదములు.)   ◆వెంకటేష్ పువ్వాడ.

ఆద్యంతం అల‌రించిన‌ లాస్యాంగ 'న‌వ రామాయ‌ణం' న‌ర్త‌నం

లాస్యాంగ కూచిపూడి డాన్స్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాంశాలు  తన్మయత్వం లో ముంచెత్తాయి. కళ్ళకు కట్టేలా 15 నిముషాల్లో నవ రామాయణం  ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. ఉప్పల్ శిల్పారామంలో ప్రముఖ నాట్య గురు రోహిణి కందాల ఆధ్వర్యంలో లాస్యాంగ కూచిపూడి డాన్స్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.  29 మంది రోహిణి కందాల శిష్యులు ఎంతో పరిణతతో నృత్యాంశాలు ప్రదర్శించి వారి క్రమశిక్షణ సాధన అంకితభావాన్ని చాటి చెప్పారు. జేమ్ జెమ్ పుష్పాంజలి లాస్య నర్తన విన్యాసం విశేషంగా ఆకర్షించింది. తాండవ గజానన, రాజశ్రీ శబ్దం తదితర అన్ని అంశాలు అలరించాయి. ఈ సందర్భంగా ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా అందించి స్పూర్తి నిచ్చే లాస్యాంగ నర్తన యువ ప్రతిభ పురస్కారంతో సురేంద్రనాథ్ ను ఘనంగా సత్కరించారు.  ఈ వేడుకలో నాట్య గురువులు కళాకృష్ణ, డాక్టర్ వనజా ఉదయ్, కళ పత్రిక సంపాదకులు డాక్టర్ మహ్మద్ రఫీ, పి. ఉమామహేశ్వరపాత్రుడు, పామ‌ర్తి పద్మావతి పాల్గొని చిన్నారులను అభినందించారు. గురు రోహిణి కందాల నట్టువాంగం చేయగా, గాత్రంతో మంథా శ్రీనివాస్, వయోలిన్ తో కె.అనిల్ కుమార్, మృదంగంతో ఎస్. నాగేశ్వరరావు, వేణువుతో సాయి భరద్వాజ్, ఘటంతో శ్రీహర్ష వాద్య సహకారం అందించి రక్తి కట్టించారు. లాస్యాంగ ఆర్టిస్టిక్ డైరెక్టర్ రోహిణి కందాల, గౌరి పర్యవేక్షించారు.

అయోనిజ సీతమ్మ!!

చాలామందికి కొన్ని పదాల పేర్లు వాటి అర్థాలు అసలు తెలియవు. ముఖ్యంగా ఇప్పటి జనరేషన్ వాళ్లకు చాలా పదాలు కొత్త, వాటి అర్థాలు వింత. అయితే అవన్నీ ఇప్పుడు అనవసరమే. అయోనిజ అనే పేరు చాలా మంది తెలుగు కథలు చదివేవారికి, ఇంకా పురాణాల గురించి తెలిసిన వారికి పరిచయమే. సీతమ్మను అయోనిజ అని అంటారు. యోని ఆడవారి మర్మస్థానం. అదే మరొక ప్రాణికి జన్మస్థానం. కానీ సీతమ్మ ఏ ఆడదాని యోని నుండి జన్మించలేదు. అందుకే ఆమెను అయోనిజ అని అన్నారు. రాముడు పితృవాఖ్య పాలకుడిగా, అసత్యం చెప్పని వాడుగా రాజ్యాన్ని కూడా వదులుకుని అడవులకు వెళ్లి ఎలాగైతే పురాణాలలో పుణ్యపురుషుడిగా పేరు పొందాడో రాముడి వెంట తనూ అడవులకు వెళ్లి రాముడితో పాటు వనవాసం చేసి చివరికి రాక్షసుడి చేతిలో చిక్కి భరించరాని బాధలు పడింది. అంతేనా రామ రావణ యుద్ధం తరువాత తిరిగి రాముడి చెంతకు చేరినా ఎవరో మాట్లాడిన మాటకు గర్భవతిగా మళ్ళీ అడవులకు చేరి అక్కడే లవ కుశలకు జన్మనిచ్చింది. చివరకు జనక మహారాజుకు తను ఎలా భూమిలో దొరికిందో అలాగే తిరిగి వెళ్ళిపోయింది.  చాలా చోట్ల రామయ్య బాల్యం గురించి కథలు కథలుగా చెబుతారు. కానీ సీతమ్మ బాల్యం గురించి ప్రస్తావన తక్కువగా ఉంటుంది. సీతమ్మ జనకమహారాజు ముద్దుల కూతురుగా సకలకళా శాస్త్రాలు అవపోషన పట్టిన బాలిక. ఆమె ఎంతో నెమ్మదితనం కలిగిన వ్యక్తిగా అందరికీ అనిపిస్తారు. ముఖ్యంగా సీతమ్మ అంటే లవకుశలో అంజలీదేవిలా ఉంటుందని అందరికీ అనిపిస్తుందేమో కానీ సీతమ్మ ఎప్పుడూ దుఃఖితురాలిగా ఉండలేదు. సినిమాలలో సెంటిమెంట్ కోసం సీతమ్మ పాత్రకు ఎమోషనల్ టచ్ ను ఎక్కువగా జొప్పించారు దర్శక నిర్మాతలు అంతే.  రామాయణంలో గమనిస్తే సీతాదేవి పరిచయం గురించి చెబుతూ ఆమె ఎలా పుట్టింది అనే విషయం మాత్రమే ప్రస్తావన ఉంటుంది. ఆ తరువాత సీతారాముల పరిణయం అయ్యాక సీతమ్మ కూడా ప్రధాన పాత్రగా సాగుతుంది. సీతమ్మ రహస్యం!! సీతమ్మ గత జన్మలో ఒక ముని కూతురు. ఆమె పేరు వేదవతి.  రావణాసుడి చేతిలో ఘోరంగా అవమానం ఎదుర్కొన్న వేదవతి తగిన ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేస్తుంది. పాలితంగా సీతమ్మగా పుట్టి రాముడి చేత రావణ చేయించింది. లొంగిపోని తత్వం!! అయిదు వేల మంది నీకింద పనిమనుషులుగా పడి ఉంటారు, నువ్వు ఊహించనంత బంగారు, వజ్రం వంటి ఆభరణాలు ఉంటాయి. ఎవరి దగ్గరా లేని పుష్పక విమానం నాదగ్గర ఉంది ఇప్పుడు. జకు భార్యవైపో నిన్ను ఎంతో సంతోషపెడతాను అని అంటాడు రావణాసుడు. సీతమ్మ మాత్రం రావణాసుడి వైపు కన్నెత్తి చూడదు. లొంగిపోని తత్వం ఉండాలంటే ఎంతో ఆత్మస్థైర్యం కలిగి ఉండాలి. స్థిరమైన మనసు కలిగి ఉండాలి. తొణకని వ్యక్తిత్వం!! సీతమ్మ వ్యక్తిత్వం తొణికిపోనిది. రావణుడి యుద్ధం తరువాత రాముడు అగ్నిపరీక్ష పెడితే భయపడకుండా ఒప్పుకుంది. ఎందుకు ఒప్పుకోవాలి అనే వాదన చాలామందిలో ఉండచ్చు. తప్పు చేయనప్పుడు వెనకడుగు వేయకూడదని ఆమె వ్యక్తిత్వం చెబుతుంది. అలాగే రాముడు సీతమ్మను గర్భవతిగా ఉన్నప్పుడు అడవుల్లో వదిలిపెడితే నిస్సహాయురాలిలా పుట్టింటికి వెళ్ళలేదు, అలాగని పిరికిదానిలా భయపడలేదు. మనోనిబ్బరంతో బిడ్డల్ని కని, వాళ్ళను మంచి వ్యక్తిత్వం కలిగినవాళ్లుగా తీర్చిదిద్దింది.  సీతమ్మ వ్యక్తిత్వం ఎంతోమంది ఆడవాళ్లకు స్ఫూర్తి కలిగిస్తూ ఉంటుంది. భర్తను గౌరవించడం అతని అడుగుజాడల్లో వెళ్లడం ఫెమినిజానికి నచ్చకపోవచ్చేమో కానీ భర్తను గౌరవిస్తూ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం అనేది సీత నుండి నేర్చుకోవాల్సిన అంశం. ఎందుకంటే సీత కూడా ఈ భూమ్మీద సగటు మహిళగా బతికింది మరి.                               ◆వెంకటేష్ పువ్వాడ.

విశ్వమంత గీతానికి మూలపురుషుడు!!

భారతీయ సాహిత్యంలో మొట్టమొదటగా నోబెల్ బహుమతి అందుకున్నవారు రవీంద్రనాథ్ టాగోర్. ఈయన రచించిన గీతాంజలి కావ్య గ్రంథానికి నోబెల్ బహుమతి లభించింది. ప్రపంచ సాహిత్యాన్ని కూడా శాసించగలిగే గొప్ప కవి, నాటక రచయిత, చిత్రాకారుడు రవీంద్రనాథ్ టాగోర్. ఈయన రెండవ అన్నయ్య ఇండియన్ సివిల్ సర్వీసెస్ లో నియమితుడైన మొట్టమొదటి భారతీయుడిగా పేరు పొందాడు. దీని కారణంగా టాగోర్ గొప్ప కుటుంబానికి చెందినవాడని అర్థమవుతుంది. అయితే టాగోర్ బాల్యం నుండి కాస్త ప్రత్యేకంగానే ఉండేవాడు. ఆయన్ను గొప్ప కవిగా చేసిన సంఘటనలు, ఆయన జీవిత ప్రయాణం తెలిస్తే అందరిలోనూ తెలియని ఉత్సాహం మేల్కొంటుంది. బాల్యం, విద్యాభ్యాసం!! టాగోర్ 1861 సంవత్సరంలో జన్మించాడు. ఈయన చిన్నతనంలో బడికి వెళ్లాలంటే ఆసక్తి చూపించేవాడు కాదు. అలాగని మొద్దబ్బాయి అస్సలు కాదు. ప్రతిరోజు ఉదయాన్నే లేవడం, పెరటిలోకి వెళ్లి ప్రకృతిని చూసి ఆనందపడటం ఇష్టంగా ఉండేది. ఆ తరువాత వ్యాయామం చేయడం. గణితం, చరిత్ర, భూగోళం మొదలైన పాఠ్య పుస్తక విషయాలు నేర్చుకునేవాడు. ఆ తరువాత సాయంత్రం తోటలో తిరుగుతూ ఆంగ్లం నేర్చుకునేవాడు. ఈయనకు చిన్నతనం నుండే కథలు నతే చాలా ఇష్టం ఉండేది. ప్రతి ఆదివారం సంగీతం నేర్చుకునేవాడు. కాళిదాసు, షేక్ష్పియర్ మొదలైన వారి నాటకాలు, గ్రంధాలు ఇష్టంగా చదివేవాడు. ఆయన మాతృభాష అయిన బెంగాలీ మీద ప్రత్యేకంగా ప్రేమను పెంచుకున్నాడు.  ఆంగ్ల సాహిత్యం వైపు ప్రయాణం!! టాగోర్ గారు ఇంగ్లాండ్ లో ఒక పబ్లిక్ స్కూల్ లో చేరి ప్రొఫెసర్ మార్లే ఉపన్యాసాలు వినేవారు. ఇంకా ఎంతోమంది ఉపన్యాసాలు వినేవాడు. ఎంతోమందితో ఆంగ్లంలోనే సంభాషణలు జరిపేవాడు. ఆంగ్లంలో నాటకం, సంగీత కచేరీలు మొదలైన వాటికి వెళ్లి వాటిని ఎంతో శ్రద్ధగా వింటూ ఆంగ్లం మీద ఆంగ్ల సాహిత్యం మీద పట్టు తెచ్చుకున్నాడు. ఈయన బెంగాలిలో రచించిన ఎన్నో కవితలను ఏర్చి కూర్చి గీతాంజలిగా పేరు పెట్టాడు. దీన్ని  ఆంగ్లంలోకి అనువదించిన తరువాత టాగోర్ కు ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చింది. శాంతినికేతన్!! గీతాంజలి మనుషుల మనసుల్లో ప్రేమతత్వాన్ని స్పర్శించి, దాన్ని వెలికి తీసే ఒక అద్భుతం. అయితే టాగోర్ పిల్లలలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి వాళ్ళను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనే ఆశయంతో స్థాపించినదే శాంతినికేతన్ విశ్వవిద్యాలయం. ఇది అయిదు మంది పిల్లలతో మొదలై ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప పేరు సంపాదించుకుంది. అక్కడ విద్యను అభ్యసించిన వారికి ఒకానొక ప్రత్యేక వ్యక్తిత్వం ఏర్పడటం ఎంతో గొప్ప విషయంగా భావించేవారు. గొప్ప క్రమశిక్షణ కలిగిన జీవితం వారికి సొంతమయ్యేది. మరొక కోణం!! టాగోర్ అంటే చాలామందికి కేవలం గీతాంజలి రచయితగా పరిచయం అవుతారు కానీ ఈయన నవలలు, నాటకాలు కూడా రాశారు. ఇంకా ముఖ్యంగా రవీంద్ర సంగీతం అనే ప్రత్యేక వర్గాన్ని సృష్టించిన గొప్ప సంగీత పిపాసి ఈయన. ఈయన రచించిన నవలల్లో గోరా ఈయనకు  ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అలాగే నాటకాలలో చిత్రాంగద నాటకం మంచి పేరు తెచ్చిపెట్టింది. సామాజిక చైతన్యం వైపు!! టాగోర్ కు సామాజిక స్పృహ ఎప్పుడూ ఎక్కువగానే ఉండేది. ఆయన జీతీయభావాలు పుష్కలంగా కలిగి ఉండేవాడు. తిలక్ ను బ్రిటీష్ ప్రభుత్వం బంధించినప్పుడు తీవ్రంగా విమర్శించాడు. బెంగాల్ విభజన సమయంలో ప్రముఖ పాత్ర పోషించాడు. చివరికి ఈయన రచించిన జనగణమన జాతీయగీతంగా మారి ఈ దేశం నిలిచి ఉన్నంత వరకు టాగోర్ ఉనికిని జీతంలో ప్రతిబింబిస్తూ ఉంది, ఉంటుంది. విశ్వకవి బిరుదును సొంతం చేసుకున్న ఈయన విశ్వాన్ని తన కలంతో శాసించాడు.                                   ◆వెంకటేష్ పువ్వాడ.

అమ్మ ప్రేమ అజరామం!!

పెదవే పలికిన మాటల్లోనా తియ్యని మాటే అమ్మ అనే పాట పాడుతూ ఉంటే అమ్మ ప్రేమ అంతా చిన్నతనంలో మనల్ని ముంచెత్తిన పాలబువ్వతో సహా మళ్ళీ ఉయ్యాల ఊపినంత హాయిని కలిగిస్తుంది.  ఎవరు రాయగలరూ అమ్మా అను మాట కన్నా కమ్మని కావ్యం అనే పాట మొత్తం వింటే బ్రహ్మకు కూడా అమ్మ ప్రేమ గొప్ప వరమే అని అర్థమవుతుంది.  సినిమాలలోనూ, కవితల్లోనూ, కథల్లోనూ ఇంకా మనుషుల జీవితలలోనూ ఎక్కడ చూసినా అమ్మ ప్రేమకు అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి, ఉన్నాయి కూడా. కానీ అమ్మకు అందుతున్న బహుమానం ఏమిటి?? ఆలోచిస్తే ఏమీ ఉండదు!! కనీసం అమ్మ కోసం ఏదైనా ఇచ్చినా అదంతా అమ్మ తన పిల్లలకు పంచిన ప్రేమకు సరితూగుతుందా?? ప్రశ్నార్ధకమే!! పైకి అమ్మను ఇంతగా ఆకాశానికి ఎత్తేసే మహామహులు అందరూ లోపల మాత్రం నిజంగా అంత ప్రేమగా, గౌరవంగా చూస్తుంటారా??  కేవలం అమ్మల్నే కాదు నాన్నల్ని కూడా ప్రేమగా చూడని పుత్రులు, పుత్రికలు పుష్కలంగా ఉన్న భారతదేశం ఇది. అయితే అమ్మానాన్నల్లో కూడా లింగవివక్షత ఎదుర్కొనేది, ఇది నాది అని ప్రత్యేకంగా దేనిగురించి చెప్పుకోలేని వ్యక్తి మాత్రం అమ్మే. నిజానికి పెళ్ళైన ప్రతి ఆడదానికి ఇలాంటి పరిస్థితే ఉంటుంది. అయితే పిల్లలు పుట్టి, వలలు పెద్దయ్యి రెక్కలు వచ్చి ఎగిరిపోయాక, మరొక గూడు కట్టుకుని మరో కుటుంబాన్ని వాళ్లకోసం ఏర్పాటు చేసుకున్నాక అక్కడే నిజమైన కష్టాలు కానీ, నిజమైన సంతోషం కానీ ఎదురవుతుందేమో అమ్మలకు.  పిల్లలకు పుట్టిన పిల్లలంటే ప్రేమ, అన్నేళ్ళు కనిపెంచిన పిల్లలు మరొకరితో జీవితం పంచుకుంటూ సరిగ్గా ఉన్నారో లేదో అని బెంగ, కొడుకు కొడలితో ఉంటూ తనని ఎక్కడ మర్చిపోతాడో అనే ఇంసెక్యూరిటీ ఫీలింగ్, మనవళ్లు, మనవరాళ్లు పుట్టిన తరువాత పిల్లల్ని ముసలివాళ్ళ దగ్గరకు పంపలేని కొందరి కోడళ్ల స్వభావం, ఏముంది ఆ ముసలివాళ్ళ దగ్గర అనే చిన్నతనం. జీవితంలో ఎదుగుదలకు అడ్డంకి అనే ఒకానొక మూర్ఖత్వపు ఆలోచన. ఇలా కారణాలు ఏమైనా సరే సమాజంలో ఎన్నో కుటుంబాలలో ఎంతో మంది అమ్మలు మానసికంగా నలిగిపోతున్నారు. ఉద్యోగం చేసే మహిళ అయినా, వంటిట్లో హడావిడి పడే మహిళ అయినా, ప్రతిరోజూ కూలి పనికి వెళ్లి సంపాదించే మహిళ అయినా ఇలా పనులు ఏవైనా అమ్మ మాత్రం మొదట తన పిల్లల గురించి వాళ్ళ బాగోగుల గురించి ఆలోచిస్తుంది. వాళ్ళను తనకు చేతనైనంత గొప్పగా పెంచాలని అనికుంటుంది. తన బిడ్డలు ఎంతో గొప్ప స్థాయికి వెళ్లాలని కలలు కంటుంది. గొప్ప విజయాలు తన బిడ్డలు సాదించినప్పుడు ఆ విజయాలు అన్నీ తనవే అయినట్టు చిన్నపిల్లలా సంతోషపడుతుంది. అలాంటి అమ్మ మాత్రం చివరకు పిల్లల చేతుల్లో నిర్లక్ష్యానికి గురవుతూ వస్తోంది.  మనిషికి కొత్త ప్రపంచాలు పరిచయం అయ్యే కొద్దీ అమ్మ ఒక పాత ప్రపంచం అవుతుందేమో అనిపిస్తుంది కొందరు ప్రవర్తించే తీరు చూస్తే. కానీ అమ్మ లేకుంటే పుట్టుక, చదువులు, గొప్ప విజయాలు ఇవేవీ సాధ్యమయ్యేవి కాదని అందరూ ఎందుకు గుర్తుచేసుకోరో…..  జీవితంలో అందరికీ ఒక్కో దశలో ఒక్కో విధంగా ఎన్నో ప్రపంచాలు పరిచయం అవుతూ ఉన్నా అమ్మను, అమ్మ ప్రేమను, అమ్మ బిడ్డను చూసుకునే బాధ్యతను మాత్రం వేరే ఎవరూ రీప్లేస్ గా చూడలేరు. ఇంకా చెప్పాలంటే జీవితంలో మధ్యలో ఎంట్రీ ఇచ్చే లైఫ్ పార్టనర్ కూడా తనకు బిడ్డ పుట్టగానే భర్త కంటే బిడ్డనే ఎక్కువగా చూస్తుంది. భర్త కోపం నుండి బిడ్డను కాపాడుకుంటుంది. బిడ్డ అలిగితే బుజ్జగిస్తుంది, కోపం పోగొట్టేలా ఎన్నో కథలు చెబుతుంది. చివరకు తన బిడ్డ పెద్దగయ్యి పెళ్లి చేసుకున్నా తన బిడ్డకోసం ఏదైనా చేస్తుంది.  కాబట్టి ఇక్కడ అర్థమయ్యేది ఒకటే. జీవితంలో కొత్త బంధాలతో ఒకటైనా అవన్నీ ఒక ఆడదానికి బిడ్డ పుట్టగానే చిన్నబోతాయి. ఈ ప్రపంచంలో ఎప్పుడూ తల్లీ-బిడ్డల అనుబంధమే మొదలు నుండి చివరి వరకు అలా సాగుతుంది. చాలా వరకు గమనిస్తే ప్రతి ఇంట్లోనూ భర్తల కంటే బిడ్డల్ని ప్రేమించే ఆడవాళ్లే ఎక్కువ.  అమ్మకు బిడ్డలంటే ప్రాణం. ప్రాణం పణంగా పెట్టి కనింది కదా!! మరి అలా కాకుండా ఎలా ఉంటుంది?? పెళ్ళైన వాళ్ళ విషయంలో అయినా ముసలితనంలోకి జారుకున్న వాళ్ళ విషయంలో అయినా అమ్మ, అమ్మ ప్రేమ, అమ్మ ఆరాటం ఉంటూనే ఉంటుంది.  పగలంతా సూర్యుడిలానూ…. రాత్రంతా చంద్రుడిలానూ…. నడిపించే కాలంలానూ….. అమ్మ ఎప్పుడూ ఒక బలంగా వెంట ఉంటుంది. అలాంటి అమ్మకు జోహార్లు….  ◆వెంకటేష్ పువ్వాడ.

వేసవి తాపం తీర్చుకుందామా??

వేసవి అంటే భయపడే కాలం వచ్చేసింది. ఒకప్పుడు వేసవి అంటే అదొక ఎంజాయ్మెంట్ ఉండేది. అన్ని కాలాలతోపాటు వేసవిని కూడా ఓ రేంజ్ లో ఇష్టపడేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే వేసవి కోసం ఎదురు చూసేవాళ్ళు కూడా. పట్టణాల్లో ఎక్కడెక్కడో కృత్రిమజీవితాలలో పడిపోయిన వాళ్ళు కాస్త హాయిగా ఊపిరి పీల్చుకోవడానికి తాము పుట్టిన ఊర్లకు తమ భార్యా పిల్లలతో కలసి పరుగులు తీసేవారు. అయితే కాలం  మారుతూ పల్లెల రూపాన్ని కూడా మార్చేసింది. పల్లెటూళ్లకే సొంతమైన చెరువులు, బావులు, కాలువలు, తాటి, కొబ్బరి, ఈత, మామిడి మొదలైన చెట్ల సందడి క్రమంగా తగ్గింది. ఉన్న కాసిన్ని దిగుబడులు కూడా అధిక వస్తాయని పట్టణాలకే వెళ్లిపోతాయి.  ఒకప్పుడు!! వేసవి వస్తుంది, కొడుకు లేదా కూతురు తమ పిల్లలతో కలసి వస్తారు అనుకుంటే బుట్టల కొద్దీ మామిడి పళ్లు తెచ్చిపెట్టేవాళ్ళు పెద్దోళ్ళు. కానీ ఇప్పుడు అంతా వ్యాపారమైపోయింది. భూస్వాముల పిల్లలు మాత్రమే అలాంటి జీవితాన్ని కొద్దో గొప్పో చూడగలుగుతారేమో. అయితే కాలం మారిపోయిందని మనుషులు అలాగే ఉండిపోరు కదా!! అందుకే వేసవిలో తీసుకునే ఆహారం మీదనే మనిషి ఈ వేడిని తట్టుకోగలుగుతాడు. మరి ఈ వేసవిలో ఏమి తింటున్నారు?? ఎలా తింటున్నారు?? ఏమి తింటే ఆరోగ్యంగా ఉంటారు?? వేసవి తాపం తీర్చుకోవడానికి సులువైన మార్గాలు. వేడి తగ్గించుకోవాలి అంటే చలువ చేసే పదార్థాలు తీసుకోవాలి. శరీరంలో తేమ తొందరగా ఆవిరైపోయే ఈ కాలంలో ఎప్పుడూ తేమ శాతాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. నీళ్లు!! చాలామందికి నీళ్లు తాగడం నేర్చుకోవాల్సింది ఏముంది అనుకుంటారు. అయితే ఓ పద్దతిలో నీళ్లు తాగితే శరీరంలో తేమ శాతం బాగుంటుంది, ఉదయాన్నే పరగడుపున లీటరు నీళ్లు తాగడం మంచిది. ఇది ఏ కాలంలో అయినా శరీరమనే ఇంజిన్ స్టార్ట్ అవ్వడానికి మంచిగా ఉపయోగపడుతుంది. బాగా దాహం వేసినప్పుడే అని కాకుండా ఈ వేసవిలో కొంచం నీళ్లు తాగుతూ ఉంటే మంచిది. అయితే ఫ్రిజ్ నీళ్లు చల్లగా ఉంటాయని, అవి దాహం తీరుస్తాయని అనుకోవద్దు. అవి ఇంకా శరీరంలో వేడి పెరగడానికి కారణం అవుతాయి. కుండలో నీరు శ్రేష్టం. పండ్లు!! ఈ కాలంలో లభించే పండ్లలో కూడా సాధారణంగా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అలాంటి సీజనల్ పండ్లను తినడం చాలా ముఖ్యం. పుచ్చకాయ నుండి వేడిని తగ్గించే సబ్జా గింజల వరకు అన్నీ హాయిగా తినేయచ్చు, తాగేయచ్చు. ఫ్రూట్ సలాడ్ లూ చేసుకోవచ్చు, ఫ్రూట్ జ్యుస్ లు చేసుకోవచ్చు. అయితే నేరుగా పండు తింటే ఆ పండులో ఉండే అన్ని రకాల పోషకాలు అందుతాయి.  ఉసిరి, నిమ్మ!! ఈ రెండు దాహాన్ని తీర్చడంలో ఎంతో గొప్పగా సహాయపడతాయి. ఆమ్లా జ్యుస్ బయట మార్కెట్లలో దొరుకుతుంది, లేక ఆమ్లా పొడి అయినా తెచ్చుకోవచ్చు. ఈ పొడిని నీళ్లలో వేసి అయిదు నిమిషాలు అలాగే ఉండనిచ్చి, అందులో ఒక స్పూన్ తేనె కలుపుకుని తీసుకోవచ్చు. కేవలం దాహం తీర్చడమే కాదు, జీర్ణసమస్యలకు, రక్తం శుద్ధి చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇంకా నిమ్మ అన్ని చోట్లా ఉపయోగించే సిట్రస్ పండు. అధిక దాహం ఉన్నప్పుడు అరచెక్క నిమ్మరసం ఒక గ్లాసు నీళ్లలో పిండి ఇష్టమైనట్టు పంచదార లేదా ఉప్పు కలుపుకుని తాగచ్చు. పలుచని మజ్జిగ!! ఒక కప్పుడు పెరుగులో ఒక లీటరు నీళ్లు వేసి బాగా చిలికి అందులో కాసింత కొత్తిమీర, అల్లం, జీలకర్ర పొడి, ఉప్పు వేసి తాగితే అద్భుతంగా ఉంటుంది. పెసరపప్పు!! అందరూ పప్పు, చారు వండటానికి కందిపప్పు వాడతారు. అయితే వేసవిలో పెసరపప్పును రీప్లేస్ చేసుకుంటే ఒంటికి చలవ చేస్తుంది.  ఇలా అందరికీ అందుబాటులో ఉన్న వాటితోనే వేసవి తపాన్ని హాయిగా అధిగమించవచ్చు.  ◆వెంకటేష్ పువ్వాడ.

 డబ్బుకు కళ్లెం వేయండి ఇలా…!!

నెల చివరికి వచ్చిందంటే చాలామంది జేబులు కాళీ అవుతాయి. ఇంకా నెల నెలా జీతం తీసుకునే వాళ్ళ ఇళ్లలో అయితే పది రూపాయలు కావాలన్నా వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.  ఏవైన అత్యవసర ఖర్చులు వచ్చాయంటే నెల చివరలో సతమతమైపోతారు. అప్పులు చేయాల్సిన పరిస్థితులు వచ్చేది అలాగే. కానీ వీటి గూర్చి ఎవరూ పెద్దగా ఆలోచన చేయరు. ఫలితంగా నెల చివర్లో ఆర్థిక ఇబ్బంది. నెల మొదట్లో, నెల మధ్యలో పిల్లల ఇష్టాలు, అవసరాలు తీర్చినట్టు, కుటుంబం గడిపినట్టు నెల చివర గడపలేము. అయితే వీటన్నిటికీ సులువైన మార్గాలున్నాయి. పక్కా ప్లానింగ్ వేసుకుంటే నెల మొత్తం ఓకేలాగా 100%  కాకపోయినా తృప్తి పడేలాగా గడిపేయచ్చు. సాలరీ రాగానే కట్టాల్సివన్నీ కట్టేస్తాం. ఆ తరువాత మిగిలేది కాస్తో కూస్తో. అయితే దేనికి ఎంత ఖర్చు చేస్తున్నాం అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. కొన్నిసార్లు పెద్దగా ప్రాధాన్యత లేకున్నా చేతిలో డబ్బులున్నాయని షాపింగ్ కు వెళ్లడం, బయట రెస్టారెంట్లకు వెళ్లడం. ఏదో నచ్చిందని, మరేదో తక్కువ ధరకు ఆఫర్ లో వస్తుందని. ఇలా కారణాల వల్ల కొనేవాళ్ళు చాలామంది ఉంటారు. నిజానికి వీళ్లే నెలచివర్లో ఇబ్బంది పడుతుంటారు కూడా. కట్టడి కాదు కట్టుబడి!! నిజమే!! చాలామంది ఖర్చుల విషయంలో కట్టడి చేసుకోవాలి అనుకుంటారు. అయితే కట్టడి కాదు చేయాల్సింది. కట్టుబడి ఉండటం. ప్రణాళికలో భాగంగా దేనికి ఎంత పెట్టాలి?? ఎంత అవసరం?? ఎంత ఖర్చుపెడుతున్నాం ఇలాంటివి ఆలోచించుకోవాలి. చేతిలో పైసా ఉంటే ఏదో ఒకటి కొనేయలని అనిపిస్తుంది. ఆన్లైన్ తో పడుతూ లేస్తూ!! ఆన్లైన్ లో  నగదు చెల్లింపులు వచ్చాక అంతా సులభం అయిపోయింది, సమయం ఆదా అయింది. కానీ డబ్బును మాత్రం చాలా సులువుగా ఖర్చుపెట్టేస్తున్నారు. ఒకప్పుడు డబ్బు అవసరం అయితే నాన్న బ్యాంక్ కు వెళ్ళాలి, క్యూలో నిలబడాలి, డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాలి. అప్పుడు దాన్ని అమ్మ ఏ డబ్బాలోనో, లేక బీరువాలోనో దాచి రూపాయి రూపాయి లెక్కబెట్టి మరీ బయటకు తీసేస్తుంది. అపుడు నెల చివర వచ్చినా ఇంత ఇబ్బంది ఉండేది కాదు. ముఖ్యంగా అమ్మ పోపుల డబ్బాకు ఉన్న పవర్ అదేమో అనుకునేవాళ్ళం కూడా. కానీ అదంతా మనుషుల జాగ్రత్త కదా!! సేవింగ్స్ సర్వింగ్స్!! ప్రతి నెల సంపాదనలో సేవింగ్స్ అంటూ కొన్ని ఉంటాయి. వాటిని కూడా నేల నెల కట్టేస్తారు. అయితే వచ్చే తిరకాసు ఒకటే. నెల నెలా సేవింగ్స్ కంటే ఆరు నెలలకు, సంవత్సరానికి ఒకసారి పెద్ద మొత్తంలో కట్టాల్సి ఇన్సూరెన్స్ పాలసిలు  సినిమా చూపిస్తాయి.  అందుకే వాటికోసం ప్రతినెలా కొంత మొత్తం పక్కనపెట్టాలి. తద్వారా అవి భారం అవ్వవు. పొదుపు మంత్రం భవిత బంగారం!! పొదుపు పొదుపు అని తల తినేస్తున్నారేంటి అనిపిస్తుంది. కానీ పొదుపు అనేది పెద్దలకు కాదు పిల్లలకు కూడా. ఇంట్లో పిల్లలకు ఓ పిగ్గి బ్యాంక్ ఇచ్చి చూడండి. వాళ్ళ అనవసర ఖర్చులు పోయి సేవింగ్స్ లోకి జర్నీ స్టార్ట్ చేస్తారు. నిజం చెప్పాలంటే అలా పిల్లల సేవింగ్స్ ఏ పెద్దలను ఎన్నో సందర్భాలలో రక్షిస్తుంది కూడా. పొదుపు గురించి కొంత అవగాహన దాని రుచి తెలిసాక అనవసర ఖర్చులు చేయకుండా ఎంతో జాగ్రత్త పడతారు. పొదుపంటే పిసినారితనం కాదని, అది కూడా ఒక కళ అని తొందరలోనే గుర్తిస్తారు. లోకమంతా డబ్బులో కొట్టుమిట్టాడుతున్నపుడు, డబ్బుకు ఈ లోకమే దాసోహం అయినపుడు డబ్బు విషయంలో జాగ్రత్త ఉంటూ దాన్ని ఎలా వాడాలో, మనకు కష్టం రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో ఆలోచిస్తే తప్పేమీ లేదు, మనం, ముఖ్న పిల్లలు దాన్ని ఆచరణలో పెడితే అస్సలు తప్పు లేదు!!   ◆ వెంకటేష్ పువ్వాడ    

అక్షయతృతీయలో అంతరార్థం!!

భారతీయ మహిళ తళుక్కున మెరిస్తే, మెరుపంతా అందరి కళ్ళను ఇట్టే తనవైపు తిప్పేసుకుంటే, ఇంకా అందంగా, ఆకర్షణగా ఉన్న అమ్మాయి కనబడితే పుత్తడి బొమ్మ అనే పేరుతో పిలిచి మురిసిపోతారు.  పండుగ, ప్రత్యేక వేడుక వంటి వాటిలో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళు వరకు ప్రఝీ ఒక్కరు కనీసం ఒక్క అభారం అయినా పెట్టుకోకుండా ఉండరు. ఇంకా పెళ్లి కూతురో, ఆభరణాల కలెక్షన్ మీద ఎప్పుడూ హై క్లాస్ జీవితాలను గడిపేవాళ్లను గమనిస్తే ఎప్పుడూ బంగారం ఒంటి మీద పెట్టుకుని, బంగారం మెరిసినట్టే మెరుస్తూ ఉంటారు. ఇలా బంగారానికి బంగారం లాంటి మహిళలకు మధ్య ఉన్న సంబంధం అంతా ఇంతా కాదు. మగవాళ్ళు కూడా ఉంగరాలు, బ్రేస్లేట్లు, మెడ గొలుసులు ధరించి తమ హుందాతనాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు.  ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఆషాఢమాసం, అక్షయ తృతీయ వంటి సందర్బాలలోనూ, శ్రావణ మాసపు పెళ్లి వేడుకల ముందు బంగారం కొనుగోళ్లు ఎక్కువ. నిజం చెప్పాలంటే ఈ బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు భారదేశంలో. కార్లు, విలువైన వస్తువులు కొనడం వల్ల కాలక్రమేణా అవి పాతబడేకొద్ది వాటి విలువ క్రమంగా తగ్గుతుంది కానీ పెరగదు. కయితే బంగారం మాత్రం కాలంతో పాటు తప్పకుండా రెక్కలు పెంచుకుని ధరల పరంగా పెరుగుతూనే ఉంది, ఉంటుంది కూడా.  ఈ కారణంగా భారతీయ మహిళలు డబ్బును బంగారానికి వెచ్చించడానికే ఎక్కువ ఇష్టపడతారు. భారతదేశంలో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరిగే రోజుల్లో అక్షయతృతీయ కూడా ఒకటి. ఎంతోమంది అక్షయతృతీయ రోజు బంగారం కొనడం ఒక సాంప్రదాయంగా కొనసాగిస్తూ ఉంటారు కూడా. ధగధగధగ మెరిసిపోయే బంగారం ఇంటికి లక్ష్మీకళ తెచ్చిపెడుతుందని సగటు భారతీయ మహిళ నమ్మకం.  అక్షయ తృతీయ ప్రత్యేకత!! చాలామందికి అక్షయతృతీయ అంటే బంగారం కొనడం, లక్ష్మీదేవిని పూజించడం ఇవే తెలుసు. నిజానికి వ్యాపార ప్రకటనలు కూడా అక్షయ తృతీయ అంటే బంగారం కొనడమని, ఆరోజు బంగారం కొంటె ఐశ్వర్యం అభివృద్ధి చెందుతుందని చెబుతారు. ప్రజలకు ఆశ ఎక్కువ. నేటి కాలంలో ధనవంతులు కావాలనే ఆశ ఉండనిది ఎవరికి?? అందుకే అక్షయతృతీయ రోజు బంగారం కొనడానికి చాలా కష్టాలు కూడా పడతారు.  కానీ అక్షయ తృతీయలో ఉండే అంతరార్థం ఏమిటో తెలుసా?? వైశాఖ శుద్ధ తదియ రోజు చేసే ఏ పూజ అయిన, యగమైనా, దానము అయినా ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఇంకా చెప్పాలనంటే ఆరోజు చేసే ఏ పని అయినా ఐశ్వర్యం పెంపొందెలా చేస్తుంది. ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు. అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు. ఈ రోజు అక్షతోదకముతో స్నానం చేసి, అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి, అర్చించి, తరువాత ఆ బియ్యమును చక్కగా మరోసారి ఏరి బ్రాహ్మణులకు దానమిచ్చి, మిగిలిన వాటిని దైవోచ్చిష్టంగా, బ్రాహ్మణోచ్చిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుంది అని పురాణంలో ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు.  ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదియనాడు పైన చెప్పిన విధంగా నియమంతో అక్షయ తృతీయా వ్రతాన్ని ఆచరించిన తరువాత వచ్చే 12 మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవాసం చేసి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగము చేసిన ఫలితము కలిగి అంత్యమున ముక్తిని పొందగలుగుతారు. ఇదీ నిజమైన అక్షయతృతీయ వెనుక ఉన్న రహస్యం. కాబట్టి కెవలం బంగారం, వెండి వంటి వస్తువులు కొనడానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా మొదట ఆ మహావిష్ణువును పూజించి ఆయన కృపకు పాత్రులవ్వాలి.                                  ◆వెంకటేష్ పువ్వాడ.

అతి విశ్వాసం వద్దు- ఆత్మ విశ్వాసం చాలు

మనుషులలో రెండు రకాలు ఉంటారు. ఆదర్శవంతులు, పనిమంతులు. సమాజ పురోభివృద్ధికి ఇద్దరూ అవసరమే. ఆదర్శవంతులైన వారికి ఆచరణాత్మకత ఉంటే మారుతున్న పరిస్థితుకకు అనుగుణంగా వారి ఆలోచనలకు కార్యరూపాన్ని ఇవ్వగలుగుతారు. తద్వారా కార్యరంగంలో తమ ప్రణాళికలను విజయవంతంగా అమలుపరచగలరు. కానీ పనిచేయడానికి అవసరమైన సాధ్యా సాధ్యాలను గమనించుకోకుండా తమ ఆదర్శాలనే అంటిపెట్టుకొని ,ఆయా రంగాలిలో అనుభవన్నీ పొంది వారి సలహాను వినకుండా,ఇతరల నుండి ఎటువంటి సలహాను తీసుకోవడానికి ఇష్టపడకుండా, మొండితనాన్ని చూపే వారిని అతివిశ్వాసం గలిగినవారిగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు జీవితంలో ఎప్పుడూ విమానం ఎక్కనివాడు తానే విమానం నడుపుతానుఅని అంటే ఎలా ఉంటుందో, ఎప్పుడూ చేతిలో తుపాకీ పట్టనివాడు యుద్ధానికి సిద్ధపడితే ఎలా ఉంటుందో, నీరు అంటేనే బయపడేవాడు సముద్రాన్ని ఈదుతాను అంటే ఎలా ఉంటుందో అతి విశ్వాసం కలిగినవాడు ప్రవర్తన కూడా అలా ఉంటుంది. మహా పరాక్రము శక్తి కలిగిన అభిమాన్యుణ్ణి చూడండి. అతను శక్తివంతుడే కానీ పద్మవ్యూహంలోకి వెళ్లడం తెలుసు, తిరిగి రావడం తెలీదు. ఇది అభిమాన్యుడికి కూడా తెలుసు కానీ అతి విశ్వాసంతో ఎలాగోలా తిరిగి రావచ్చు అని వెళ్లి ప్రాణాలు త్యాగం చేసాడు. దుర్యోధనుడు కూడా ఇదే తప్పు చేసాడు. శ్రీ కృష్ణుడే పాండవుల వైపు ఉన్నాడు. వారి శక్తి తెలుసు. అయినా ఫలితాన్ని అంచనా వేయక గుడ్డిగా కర్ణుణ్ణి నమ్మి సర్వం కోల్పోయాడు. కొంతమంది అద్భుతాలు చేయగల శక్తి కలిగినవాళ్లు ఉంటారు. అలాంటివాళ్లు తమ శక్తి తెలియక సామర్ధ్యాన్ని తక్కువ అంచనా వేసుకొని పని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. వారికి కొంచెం ప్రేరణ కలిగించి ఉత్తేజం కలిగించి,వారి శక్తిని వాళ్లకి గుర్తు చేయగలడం అవసరం. ఆ మరుక్షణమే  వాళ్లు అసాధ్యం అని అనుకున్న వాటిని కూడా సుసాధ్యం చేసి చూపిస్తారు. మహా బలవంతుడైన హనుమంతుడి సముద్రాన్ని దాటడానికి కావాల్సిన బలం శక్తి తనకు ఉన్నాయని తెలీదు. జాంబవంతుడు తన శక్తిని గుర్తు చేయగానే అతడిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఒక్క దూకులో సముద్రాన్ని దాటి వెళ్లి సీతమ్మని చూసి లంకను కాల్చి వచ్చాడు. ◆స్వామి వివేకానంద "నేను బలహీనుణ్ణి అని ఎప్పుడూ చెప్పకూడదు. దిగజారుడుతనంలా కనిపించే ఆ పై పొర కింద ఎటువంటి గొప్ప శక్తులు దాగున్నాయో ఎవరికి తెలుసు? నీలో ఉన్న అపారమైన శక్తిని గురించి నీకు తెలిసింది చాలా తక్కువ. నీవెనుక అనంత శక్తి సముద్రం, ఆనంద సాగరం ఉంది" అంటారు వివేకానంద. కనుక ఆత్మ విశ్వాసానికి అతి విశ్వాసానికి మధ్య ఉన్న సన్నని గీతను గమనంలో ఉంచుకొని మనం ముందుకు నడవాలి. అదే సమయంలో నీ శక్తిని నీవు గ్రహించక నిరాశ నిస్పృహలకు లోనుకాకు. ఆత్మ విశ్వాసమే మహాబలము. ◆ వెంకటేష్ పువ్వాడ  

డాన్స్ రాజా డాన్స్!!

ఇప్పుడు డాన్స్ ఏంటి అనే అనుమానం అందరికీ వస్తుంది. కానీ డాన్స్ అంటేనే ఉత్సాహం, డాన్స్ అంటే ఒక సందడి, ఇంకా కొందరికి డాన్స్ అంటే ఒక ఎమోషన్. డాన్స్ తో మనిషికి ఉన్న అవినాభావ సంబంధం ఇప్పటిదేమీ కాదు. డాన్స్ కు చాలా ప్రాచీన చరిత్ర ఉంది. చతుష్షష్టి కళలలో  డాన్స్ కూడా ఒకటి.  అర్థమయ్యేలా  చెప్పాలంటే అరవైనాలుగు కళలలో డాన్స్ కూడా ఒకటి మరి. ఇంకా లలిత కళలలో డాన్స్ అమ్మాయిల సొగసును అబ్బురంగా మార్చేస్తుంది. ఇప్పుడు డాన్స్ గురించి ఎందుకనే విషయానికి వస్తే  డాన్స్ కు కూడా ఒక రోజును కేటాయించేసింది ఇంగ్లీష్ క్యాలెండర్.  దాని ప్రకారం మన ఏప్రిల్ నెలలో 29 వ తేదీన వరల్డ్ డాన్స్ డే ను జరుపుకుంటారట. ప్రత్యేకంగా ఒకరోజున ఇట్లా కేటాయించడం మనకు ఎలాగో నచ్చదు కానీ గుర్తు చేసుకుంటే మాత్రం బాగుంటుంది కదా!! నిర్లక్ష్యం!! ఒకప్పుడు కొన్ని కుటుంబాలలో సంప్రదాయం కింద సంగీతం, నాట్యం, చిత్రలేఖనం వంటి లలిత కళలు అమ్మాయిలకు, అబ్బాయిలకు చక్కగా నేర్పించేవారు. అయితే కాలం మారి ఉద్యోగాల గోలలు వచ్చి పడ్డాక చదవడం, ఉద్యోగం సంపాదించడం, ఉద్యోగానికి వెళ్లి రావడంతోనే జీవితం కూడా గడిచిపోతుంది. చిన్నప్పటి నుండి పిల్లలకు చదువుకోమని చావగొడుతూ ఇతర యాక్టివిటీస్ గురించి ఏమాత్రం ప్రోత్సాహం అదించకుండా ఉండటం వల్ల పెరిగేకొద్ది ఒకానొక కృత్రిమత్వం లో పడిపోయి పెద్దయ్యాక వాళ్లకు ఏమాత్రం జాలి, ప్రేమ, దయ వంటి గుణాలు కూడా లేకుండా తయారవుతున్నారు.  డాన్స్ మంత్రం!! ప్రస్తుతకాలంలో టీవీ లలో ఎక్కడ చూసినా డాన్స్ షో లు పిచ్చపాటిగా టెలికాస్ట్ అవుతుంటాయి. ఈమధ్య కొందరు అభిప్రాయం ఏమిటంటే అవి డాన్స్ షోలా లేక, సర్కస్ షోలా అని. టీనేజ్ లో ఉన్నవాళ్లు అయితే స్టేజి మీద చేసే రొమాన్సులు, చిన్నపిల్లలకు కూడా టూ పీసెస్ డ్రెస్ లు వేసి డాన్స్ చేయిస్తూ ఉంటే అందరూ వాళ్ళను ఎన్నో రకాలుగా ఏదోఏదో అనేస్తారు. అయితే ప్రతి ఒక్కరిలో కూడా ఒకానొక అభిరుచి అనేది ఉంటుంది. అలాంటిదే ఈ డాన్స్ కూడా. సినిమాల్లో హీరోలు, హీరోయిన్లు వేస్తున్న డాన్స్ లకు ఏ మాత్రం తగ్గకుండా, ఇంకొందరు ముందడుగు వేసి అలాంటి దుస్తులే వెతికి తీసుకుని డాన్స్ ఇరగదీస్తుంటారు. ఇదంతా ఒక ఫాషన్ అయిపోయింది. సంప్రదాయం!! నిజానికి లలిత కళలలో డాన్స్ ఒకటి అయి ప్రాచీన వారసత్వ సంపదగా కొనసాగుతూ వస్తోంది. నాటి నాట్య రూపకాలను చూసి ముచ్చటపడి, విదేశీయులు కూడా భారతీయ నాట్యాలను నేర్చుకుంటున్నారు. మన దేశంలో ఎంతోమంది కళాకారులు నాట్యానికి అంకితమై, నాట్యంలోనే జీవించారు. నాట్యానికి ఉన్న గొప్పదనం అందులో ఎన్నో కథలను సృజియించడం. పురాణాలు, ఇతిహాసాలు, సంస్కృతి, జీవన విధానాలు వీటన్నింటినీ నృత్య రూపంకంలో ప్రదర్శించడం ఎంతో అద్భుతంగా ఉంటుంది. పైగా అందులో ఎంతో కళను బతికించే ఉద్దేశం, కళకు గుర్తింపు తీసుకురావడం కూడా ఉంటుంది. ఉపయోగాలు!! ఇట్లా ప్రాచీన నృత్యం అయినా, ప్రస్తుతం బీట్స్ మధ్య గంతులు వేసినా మొత్తం మీద మనిషి ఆరోగ్యానికి మాత్రం బోలెడు లాభం చేకూరుతుంది. పరిగెత్తడం, ఎగరడం నడుము తిప్పడం, వేగవంతమైన కదలికలు, స్లో మోషన్ లో వెలిబుచ్చే హవాభావాలు, దానికి తగిన భంగిమలు ఇలా అన్ని విధాలుగా శరీరం ఏకకాలంలో వ్యాయామం పొందుతుంది. ప్రతిరోజూ డాన్స్ ను ప్రాక్టీస్ చేసేవాళ్లకు ప్రత్యేకంగా వ్యాయామం అక్కర్లేదు. ఉల్లాసం, ఉత్సాహం!! డాన్స్ వేయడానికి మంచి సంగీతం కావాలి. మనిషి మూడ్ ను మార్చే శక్తి సంగీతానికి ఉంటుంది. ఆ సంగీతానికి శరీర కదలికలు కూడా తోడైతే మనుషుల్లో ఉన్న ఎన్నో రకాల ఒత్తిడులు ఇట్టే మాయమవుతాయి.  శరీరం అలసిపోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది.  శరీరంలో కొవ్వు శాతం ఉన్నవాళ్లు డాన్స్ మెల్లగా ప్రయత్నిస్తే ఎంతో ఫ్లెక్సిబుల్ బాడీ సొంతమవుతుంది. మిగతా అన్ని పనులలో ఎంతో చురుగ్గా ఉండగలుగుతారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇష్టమైన పని చేశామనే తృప్తి లభిస్తుంది.                      ◆ వెంకటేష్ పువ్వాడ.  

అంతర్జాతీయ భాష - అవకాశాల దిశ!!

ప్రస్తుత కాలంలో ఉద్యోగాల కోసం పోటీ విపరీతంగా ఉంటుంది. ముఖ్యముగా అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెడుతూ, పరిశ్రమలు స్థాపిస్తూ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. అయితే వచ్చిన చిక్కంతా భాష దగ్గరే. ఆ విదేశీ కంపెళలో పనిచేయడానికి ఆంగ్ల భాషలో ఎంతో నైపుణ్యం కలిగి ఉండాలి. అయితే మన దేశంలో ఎంతోమంది ఇంగ్లీష్ సరిగా రాక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రతిభ ఉన్నా భాష సరిగ్గా రాని కారణాన కమ్యూనికేషన్ సరిగ్గా చేయలేక ఉద్యోగ అవకాశాల దగ్గర వెల్లకిలా పడుతున్నారు.  ఆంగ్లమంటే భయమా?? ఇంగ్లీష్ అనగానే చాలామంది తల కొట్టుకుంటారు. నిజానికి దానిని సబ్జెక్ట్ గా చూడకుండా మనం మాట్లాడే తెలుగులాంటి భాష అది కూడా అనే ఆలోచనతో దాని మీద కాస్త ఏకాగ్రత పెడితే ఇంగ్లీష్ పెద్ద కష్టమైనది కాదని ఎంతోమంది అంటారు. అంటే ఇంగ్లీష్ అంటే భయం వద్దు అని పరోక్షంగానే చెబుతున్నారు.  అవకాశాలు!! ఇంగ్లీష్ అంతర్జాతీయ భాష. మాతృభాష ఏదైనా సరే కానీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు కానీ, ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు కానీ, అందరినీ అదుకునేది ఇంగ్లీష్ ఏ. ఇంగ్లీష్ అంతగా మనుషుల జీవితాలలో బాగమైపోయింది. పాశ్చాత్యుల భాషకు ఎందుకింత ప్రాధాన్యత ఇవ్వాలని అందరూ అనుకుంటారు. కానీ నిజానికి మనుషులకు ఎన్నో అవకాశాలు కలిగేలా చేస్తున్నది ఇప్పుడు ఈ ఇంగ్లీష్ భాషనే. ఇంకా చెప్పాలంటే సాధారణ పాఠశాలలో పిల్లలకు బోధించడం దగ్గర నుండి, పెద్ద పెద్ద ఐటి సంస్థల వరకు ఇంగ్లీష్ ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.  కాబట్టి మెరుగైన అవకాశాలు అందుకోవాలి అంటే తప్పనిసరిగా ఇంగ్లీష్ భాషను కూడా మోయాల్సిందే. మెరుగు పడే జీవనశైలి!! అందరూ ఒక విషయం అర్ధం చేసుకోవాలి. భారతీయుల జీవితం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వారి జీవితమే ఉత్తమమైనది అనుకోడానికి  వీల్లేదు. ఎందుకంటే ప్రతి ప్రాంతంలో నివసించే వారి జీవితాలు వారికి అత్యుత్తమంగా అనిపిస్తాయి. కాబట్టి మనుషులు అవకాశాల పరంగా ప్రాంతాలు మారుతూ ఉంటే అక్కడి జీవనవిధానం, అక్కడి మనుషుల పరిచయాలు చూస్తుంటే మన జీవనసరలి ఎంతో మెరుగవుతుంది.  ప్రతి ఒక్క చోటా మనుషులను అనుసంధానం చేయగలిగేది భాష మాత్రమే. అందుకే మాతృభాషతో పాటు అంతర్జాతీయ భాష అయిన ఆంగ్లాన్ని నేర్చుకోవాలని చెబుతున్నారు. పొరపాటు ఎక్కడ?? నిజానికి  ఈ భాష గురించి అందరూ చేస్తున్న పొరపాటు. దాన్ని మార్కులు ఇచ్చే సబ్జెక్ట్ గా చూడటం. తెలుగులాగా  ఇంగ్లీష్ ను కూడా లైఫ్ స్టైల్ లో భాగం చెయ్యకుండా, దాన్ని సరైన విధంగా నేర్పించకుండా ఉండటం. వ్యక్తీకరణకు అవకాశం ఇవ్వకపోవడం. బహుశా దీన్ని గుర్తించి కార్పోరేట్ పాఠశాలల్లో పూర్తిగా తెలుగు నిషిద్ధం చేసి ఇంగ్లీష్ నే అలవాటు చేస్తున్నట్టున్నారు. కానీ తెలుగు, ఇంగ్లీష్ రెండింటిని పిల్లలకు అలవాటు చేస్తే వారి భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. నిజం చెప్పాలంటే అత్యుత్తమ మార్కులు లేకపోయినా కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల జీవితాల్లో బాగుపడినవాళ్ళు చాలా మంది ఉన్నారు.  మార్గం!! ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ముఖ్యంగా చేయాల్సిన పని ఒకటి ఉంది. భయం తగ్గించుకోవడం, తప్పులు మాట్లాడతామేమో అని, వ్యాకరణ దోషాలు ఉంటాయని, ఎవరైనా నవ్వుతారని, ఎగతాళి చేస్తారని భయపడుతూ దానికి దూరంగా ఉంటే, ఆ ఇంగ్లీష్ కూడా అలాగే సమస్యగా కనిపిస్తుంది.  ఇంగ్లీష్ లో ఉన్న చిన్న ఆర్టికల్స్, న్యూస్ పేపర్స్, పోయెమ్స్, మొదలైనవి చదువుతూ, ఇంగ్లీష్-తెలుగు నిఘంటువులో పదాలు సందర్భానుసారంగా మారుతున్న అర్థాలను గమనించుకుంటూ అర్థం చేసుకుంటే చాలా తొందరగా ఇంగ్లీష్ వచ్చేస్తుంది. కాబట్టి భాషను చూసి భయపడద్దు!! దాన్ని లొంగదీసుకుంటే, అవకాశాలు మనకు లోబడుతాయి.                                ◆ వెంకటేష్ పువ్వాడ.  

భూమి ఏడుస్తోంది!!

ఈ ప్రపంచం పంచభూతాలతో నిండి ఉంది. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి. ఇవన్నీ పంచభూతాలు. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఈ ప్రపంచం ఎలా ఉండేదో!! ఆలోచిస్తే ఏమీ తోచదు. కాసింత ఉలికిపాటు కలుగుతుంది కూడా. మరి ఈ పంచభూతాలు లేకపోతే మనిషి మనుగడ ఈ భూ గ్రహం మీద ఉండేది కాదేమో. ఈ పంచభూతాలో మనుషుల్ని మోస్తున్న భూమి మహా ఓపిక కలిగినది. ఈ గ్రహం అవిర్భవించినప్పటి నుండి ఎన్నో కోట్ల జీవరాశులను మోస్తూనే ఉంది. కానీ మనిషి మాత్రం తనను మోస్తున్న భూమిని హింసకు గురిచేస్తున్నాడు. రోజురోజుకూ భూమిలో ఉన్న సారాన్ని తగ్గించేస్తున్నాడు. అలా చేసి భూమిని నిర్జీవంగా, ప్రాణమొదిలేసిన మనిషిలా మారుస్తున్నాడు.  కానీ భూమి మనిషిలాంటిది కాదు. బిడ్డ ఎన్ని తప్పులు చేసినా తల్లి క్షమంచినట్టు భూమి కూడా మనుషుల్ని మన్నించేస్తోంది. కానీ….. తల్లి లోపల కుమిలిపోయినట్టు భూమి కూడా లోపల ఏడుస్తోంది. ఇదే నిజం మరి. మనుషులు చేస్తున్న తప్పులు!! అభివృద్ధి అనే పేరు వెంట తోకలా పట్టుకుని మనిషి భూమిని ఎన్ని విధాలుగా కావాలో అన్ని విధాలుగా నాశనం చేస్తున్నాడు.  వాటిలో మొదటిది చెట్ల నరికివేత. చెట్లను నరికివేయడం, సాగు భూములుగా మార్చడం మనిషి చేసిన మొదటి తప్పు. పోనీ దానివల్ల మనవాళికి ఆహారం లభిస్తోంది అనుకుంటే, సేంద్రియ వ్యవసాయం వల్ల భూమి బాగానే ఉంది అనుకున్నా సంతోషంగానే ఉండేవాళ్ళం ఏమో కానీ  ఆ వ్యవసాయం కూడా రసాయనికం అయిపోయి భూమిని పూర్తిగా దాని సహజత్వాన్ని కోల్పోయి నిర్జీవంగా మార్చేస్తోంది. మనిషి రసాయనికత వైపు వెళ్లి భూమికి అన్యాయం చేస్తున్నాడు. అదే కోవలోకి వచ్చే మరొక అంశం రియల్ ఎస్టేట్. కళ్ళు చెదిరే భవంతుల స్థానంలో పచ్చని వనాలు, తిండి గింజలు ఇచ్చే పంట పొలాలు అన్ని నిర్వీర్యమైపోయి ఉంటాయి. ఇంకా అవన్నీ పెకిలించి చదును చేసిన ఆ భూములు కూడా అంత పటిష్టంగా ఉండవు. అదే ప్రాంతాలలో అడ్డు అదుపు లేకుండా అడుగుల కొద్దీ బోర్లు వేయడం వల్ల భూమిలోపల ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.  పారిశ్రామికత, రసాయనికత!! పారిశ్రామిక విప్లవం. అబ్బో ఫ్యాక్టరీలు మాయాజాలం అంతా ఇంతా కాదు. అందులో వెలువడే వ్యర్థాలు అన్నీ నీటిలోకి వెళ్లి, భూమిలోకి ఇంకి భూమిని విషపూరితం చేయడం అన్ని చోట్లా జరుగుతూ ఉంది.  తప్పు దిద్దుకోవాలి!! నిజంగా చేస్తున్న తప్పులను సరిదిద్దుకోవాలి. మొదట చేయాల్సింది మనిషికి కనిపించినంత మేర నేలను సిమెంట్ తో నింపేయకుండా సహజమైన మట్టితో ఉండనివ్వడం.  చెట్లను పెంచాలి. నిజానికి చెట్లను పెంచడం వల్ల ఆ చెట్ల ద్వారా భూమి సారవంతం అవ్వడమే కాదు, ఆ చెట్లు రాల్చే ఆకులు, ఆ చెట్ల మీద నివసించే పక్షుల మల, మూత్రాలు, రాలిపడే కాయలు, పండ్లు ఇట్లా అన్నీ నేలకు సహజమైన పోషకాలను సంధిస్తాయి. నిజానికి ఈ సహజమైన ఎరువులను ఉపయోగించి చేసే సేంద్రియ వ్యవసాయం వల్ల భూమి బాగుండటమే కాకుండా వాటి ద్వారా పండే పంటలు కూడా మనిషి ఆరోగ్యానికి మంచి చేస్తాయి.  ప్రకృతికి హాని చెయ్యని భూమిలో తొందరగా కలిసిపోయి భూమికి హాని చెయ్యని వాటిని ఉపయోగించాలి. ముఖ్యంగా భూమిలో ఎన్నేళ్లయినా కరగని ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టాలి. భూమికి సారాన్ని పెంచే సహజసిద్ద ఎరువులకు నిలయమైన ఆవులను పెంచాలి. ఆవు ఉన్న భూమి ఎప్పటికీ గొడ్రాలవ్వదు. బుట్టల్లోనూ, ప్లాస్టిక్ బకెట్ల లోనూ, డ్రమ్ములలోనూ మొక్కల్ని పెంచి మురిసిపోయే బదులు నేరుగా నేలలో ఓ చెట్టును పెంచినా మంచిదే.  ఒకటి మాత్రం నిజం. మనం ఎప్పుడైతే మన ఆలోచనలను మంచి దారిలో మళ్లించామో అప్పుడే భూమి నవ్వడం మొదలుపెడుతుంది. మన పనులను బట్టి పచ్చని పసిరిక మొలకలు మన దోసిట్లో పెడుతుంది.                                   ◆వెంకటేష్ పువ్వాడ.  

సృజనాత్మక లోకం - ఆవిష్కరణల ప్రపంచం!!

ప్రపంచంలో మనిషి ఎప్పుడూ భిన్నమైన వాడే. ఏదో ఒక భిన్నత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉంటాడు. ఆ భిన్నత్వంతోనే ప్రపంచాన్ని భిన్నంగా మార్చేస్తాడు. దానినే నేడు అందరూ అభివృద్ధి అంటున్నారు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఈ మంచిచెడుల గురించి కాదిప్పుడు ప్రస్తావిస్తున్నది. మనం చెప్పుకుంటున్న అభివృద్ధి మానవాభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశంలో కూడా సృజనాత్మకత మరియు ఆవిష్కరణ అనేవి ముఖ్యపాత్ర పోషిస్తాయి. వాటినే కదా భిన్నత్వం అని చెప్పుకున్నాము. ఎప్పుడైతే ఎవరూ చూడనిది, ఎవరికీ తెలియనిది, సులువైన మార్గాన్ని ముందుకు తెచ్చేవి. ఇలా అన్నీ కూడా సృజనాత్మకత, ఆవిష్కరణ అనే అంశాల మీద ఆధారపడి ఉంటాయి.  అలాంటి వాటి ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి ఏప్రిల్ 21న ప్రపంచ సృజనాత్మకత మరియు ఆవిష్కరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు.  ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే, కొత్త ఆలోచనలను ఉపయోగించమని, కొత్త నిర్ణయాలు తీసుకునేలా మరియు సృజనాత్మకంగా ఆలోచించేలా ప్రజలను ప్రోత్సహించడం. అసలు ఏమిటి సృజనాత్మక మరియు ఆవిష్కరణ దినోత్సవ ప్రత్యేకత?? ఇది ఎప్పటి నుండి ఉంది?? మనకు ఇంతకుముందు పరిచయం ఉందా?? అని ప్రశ్నించుకుంటే చాలామందికి దీని గురించి తెలియదు.  మరి ఏమిటి ఈ దినోత్సవం??  ప్రపంచ సృజనాత్మక మరియు ఆవిష్కరణ దినోత్సవం మే 25, 2001న కెనడాలోని టొరంటోలో స్థాపించబడింది.  1977లో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ క్రియేటివిటీలో సృజనాత్మకతను అభ్యసిస్తున్న కెనడియన్ మార్సి సెగల్ అనే వ్యక్తి ఈ దినోత్సవ వ్యవస్థాపకురాలు.   ఈరోజును ఎందుకు ఎలా స్థాపించారు?? కెనెడియన్ మార్సి సెగల్ అనే ఆమె నేషనల్ పోస్ట్‌లో 'కెనడా ఇన్ క్రియేటివిటీ క్రైసిస్' అనే హెడ్‌లైన్‌ని చదివిన మరుసటి రోజు ఈ దినోత్సవాన్ని రూపొందించాలని ఆమె నిర్ణయించుకుంది.  ఆమె ఆలోచన ప్రకారం, ప్రజలు కొత్త ఆలోచనలను రూపొందించడానికి మరియు కొత్త చర్యలు తీసుకోవడానికి మరియు ఫలితాలను సాధించడానికి వారి సహజ సామర్థ్యాన్ని ఉపయోగించడం ప్రారంభిస్తే, అది ప్రపంచాన్ని, ప్రపంచంలో జీవిస్తున్న మనుషుల జీవితాలను మెరుగురుస్తుందని అభిప్రాయపడింది. ఆమె తన సహోద్యోగుల సహాయంతో ఏప్రిల్ 2002లో మొదటి క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ డేని నిర్వహించి,  సృజనాత్మకతను బయటపెట్టమని ప్రజలను ప్రోత్సహించింది. మొదటి నిర్వహణ ఎంతో మంచి విజయం సాధించడంతో దాన్ని అనుసరించి, అనేక సంఘాలు, ప్రపంచం నలుమూలల నుండి ఎన్నో దేశాలు దీనిని జరుపుకోవడంలో చేరాయి.  యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఏప్రిల్ 21, 2017న వరల్డ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ డేని జరుపుకోవాలని తీర్మానాన్ని ఆమోదించింది. ప్రపంచవ్యాప్తంగా 50 కంటే ఎక్కువ దేశాల్లోని పౌరులు మరియు సంస్థలు సృజనాత్మకత మరియు ఆవిష్కరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు కూడా.  ప్రపంచ ఆమోదం పొందిన తరువాత  మొదటి ప్రపంచ సృజనాత్మకత మరియు ఆవిష్కరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి 2018లో జరుపుకుంది. దీని ప్రాముఖ్యత ఏమిటి?? సమాజంలోని ప్రతి వర్గాన్ని దృష్టిలో ఉంచుకుని ఆవిష్కరణలు జరగాలని ఐక్యరాజ్యసమితి చెబుతోంది.  ఇది సృజనాత్మకత మరియు సంస్కృతికి ప్రాధాన్యతనిస్తుంది, ఎందుకంటే ఇది ఆర్థిక విలువను అందించడమే కాకుండా, సమగ్ర సామాజిక అభివృద్ధికి దోహదపడే గణనీయమైన ద్రవ్యేతర విలువను కలిగి ఉంటుంది. మాస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, సృజనాత్మకత మరియు ఆవిష్కరణలు ఉపాధిని సృష్టించడంలో సహాయపడతాయని మరియు దేశం యొక్క ఆర్థిక సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి వేగాన్ని అందించగలవని కూడా పేర్కొంది. ఇంకా చెప్పాలంటే  ప్రపంచం మొత్తం కరోనావైరస్ మహమ్మారితో పోరాడి ఆర్థికంగా, మానసికంగా ఎన్నో నష్టాలు ఎదుర్కొన్న ఈ సమయంలో మన అంతర్గత సృజనాత్మకతను బయటకు తీసి మానసికంగా మరియు ఆర్థికంగా దృఢపడటానికి వినియోగించుకోవాలి. ఇవి మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులలో ఈ సృజనాత్మక విప్లవం మొదలైతే దేశం కూడా ఆర్థిక మాంద్యం నుండి తొందరగా బయటపడగలదు.   కాబట్టి భిన్నత్వంలో ఏకత్వంగా చెప్పుకునే మన భారతదేశంలో విభిన్నంగా ఆలోచించి ఆవిష్కరణలు చేయడం, సృజనాత్మకతలో భారతాన్ని నింపడం తప్పేమి కాదు.                             ◆వెంకటేష్ పువ్వాడ.

కళయా... నిజమా..??

ఏదైనా పనిని ప్రత్యేకంగానో, ఆకర్షణగానో, కొత్తగానే చేస్తే ఎంతో బాగుంటుంది. మనం చేసే విధానం ఆ పనిని ఇంకా ఇంకా ఉన్నతంగా చూపెడుతూ ఉంటే ఖచ్చితంగా కళ తొంగిచూస్తోంది అనో లేక కళ తిష్ఠ వేసుకుంది అనో అంటాము. కాబట్టి కళ అంటే అందం, ఆ అందంతో పాటు సహజత్వం, సహజత్వంతో పాటు ఆకర్షణ, ఆకర్షణతో పాటు ప్రత్యేకత ఇలా ఒకదానికొకటి తోడయి దాన్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి. అందుకే కళ అంటే ఒకానొక ప్రత్యేక విభాగం అయిపోతుంది.  కొందరికి ఈ కళల విషయంలో ప్రత్యేక అభిరుచి ఉంటుంది. మరికొందరు ఆ కళల సంగత్యంలో బతికేస్తూ ఉంటారు. అలాంటివాళ్ళు కాసింత కృత్రిమత్వం నుండి వేరైపోయి ఉంటారు కూడా. ఈ కళలు మనుషులను ప్రత్యేకంగా నిలబెడతాయి కూడా. అలాంటి కళల కోసం కలలు కనేవాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే మనిషిని కదిలించే గుణం కళకు ఉంది మరి. కళయా… నిజమా…..?? అరవై నాలుగు కళలు ఉన్నాయి. వీటినే చతుష్షష్టి కళలు అని అంటారు. వీటిలో సామాన్యమైన కళలు ఉన్నాయి, లలిత కళలు ఉన్నాయి.  ముఖ్యంగా లలిత కళలు ఎంతో ప్రత్యేకమైనవి. బొమ్మలు వేయడం, పాటలు పాడటం, సాహిత్యం, నాట్యం ఇవి మాత్రమే కాకుండా శిల్ప కళ మొదలైనవి భారతీయ వారసత్వ కళలుగా వస్తున్నాయి. అయితే కొందరు ఈ కళలలో గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో శ్రమిస్తూ ఉంటారు. మరికొంతమంది తమలో ఉన్న అసంబద్ధమైన విద్యను కళగా అందరి ముందు ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే కళ మీద ఉన్న కలను తీర్చుకోవడం ఎలా?? సాధన!! సాధనములు పనులు సమకూరు ధరలోన అంటాడు యోగి వేమన. అంటే దేనికైనా సాధన అవసరం అని అర్థం. కాబట్టి కళ అంటే నాలుగు రోజులు దాని వెంట పడి ఊగులాడటం కాదు. ఏళ్లకేళ్ళు సాధన అవసరం. అంతేకాదు ఎప్పటికప్పుడు దాన్ని కొత్తగా వ్యక్తం చేయగలుగుతూ ఉండాలి. దానికి ఎలాంటి అగౌరవం తీసుకురాకూడదు. ప్రేమ!! ప్రతి కళ మనిషికి గుర్తింపు తెచ్చేది మాత్రమే కాదు, డబ్బు సంపాదించే ఆదాయ వనరు కూడా. అయితే ఈమధ్య కాలంలో ప్రతి కళను కేవలం ఆద్య వనరుగా మార్చేసుకుంటూ దాన్ని కృత్రిమంగా ఒంటబట్టించేసుకుంటున్నారు. అందుకే కళను ప్రేమిస్తే ఆ కళ మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. అందుకే కళను ప్రేమించేవారికే ఆ కళ కూడా దగ్గరవుతుంది అంటారు.  విలువ!! విలువ తెలిసినప్పుడు దేనికి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇస్తారు. కాబట్టి కళకు ఉన్న విలువ తెలుసుకోవాలి మొదట. కళను కళగా కాక ఏదో టైమ్ పాస్ పనిగానో, గౌరవం లేనిచోటనో ప్రదర్శించి ఆ కళను అవమానించకూడదు. అప్పుడే ఆ కళలో ఉండే హుందాతనం మనిషిలో కూడా ప్రస్ఫుటం అవుతుంది. ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే కళ ఒక అద్భుతమైతే దాన్ని అంతే అద్భుతంగా అవిష్కరించేవాడు కళాకారుడు అవుతాడు. కళ కోసం జీవితాన్ని ధారబోసిన ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో. అలాంటి గొప్ప కళాకారులకు, అలాంటి కళాకారులను ప్రపంచానికి అందించిన కళకు వేల వేల కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కళను ప్రేమించండి, కళ మిమ్మల్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్తుంది.                                ◆వెంకటేష్ పువ్వాడ.  

సుందర చిరంజీవుడు హనుమంతుడు!!

  భారతదేశంలోనే కాక విదేశాలలో కూడా ఎక్కువగా పూజలు అందుకునే దైవం, చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఆయన పేరునే ఒక శక్తిగా భావించి తలచుకునే వైనం, ప్రతి హిందువు ఎంతో భక్తిగానూ, మరెంతో సన్నిహిత భావంతోనూ కొలిచే దేవుడు హనుమంతుడు.  అంజనాసుతుడు లేదా అంజనాపుత్రుడు, ఆంజనేయుడు, హనుమంతుడు, మారుతి, భజరంగబలి ఇలా పేర్లు ఎన్నైనా మహా బలసంపన్నుడు, గొప్ప శక్తిశాలి అయిన హనుమంతుడి గురించి తెలియని వాళ్ళు ఉండరు. రామాయణంలో రాముడు అందరికీ ఎంత బాగా తెలుసో, ఆంజనేయుడు కూడా అందరికి అంతేబాగా తెలుసు.  పిల్లలు భయపడితేనో, చీకట్లో నడవాల్సి వస్తేనో, కష్టాలు ఉన్నప్పుడో, మానసిక సమస్యలు వేధిస్తూ ఉన్నప్పుడో ఇలా ఒక్కటనేమి మనిషికి నిత్యజీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు "జై భజరంగబలి" అనే ఒక్క మంత్రం ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది.  హనుమంతుడి జననం!! హనుమంతుడు ఆ ఈశ్వర పుత్రుడని అంటారు. ఈశ్వరుడి తేజస్సు అంజనాదేవి గర్భంలో పెరిగి వైశాఖ బహుళ దశమి నాడు జన్మించాడు. అంజనాదేవి గారాల పట్టిగా పెరిగాడు. ఈయనకు అంజనాదేవి మొదట పెట్టిన పేరు సుందర అని. సుందర అంటే అందమైన అని. నిజానికి ఈ సుందరుడు పుట్టినప్పుడు చందమామ లాగా అందంగా ఉన్నవాడే. కానీ అల్లరిచేష్ట వల్ల ముఖంలో అపశ్రుతి వచ్చిపడింది. సుందరుడు హనుమంతుడు ఎలా అయ్యాడు?? అంజనాదేవి సుందరుడిని పడుకోబెట్టి పండ్లు తేవడానికి వెళ్ళింది. ఆమె వచ్చేలోపు నిద్రలేచి ఆకలి వేయడంతో ఆకాశంలో ఎరుపురంగులో ఉన్న సూర్యుడిని చూసి ఎర్రగా ఉన్న పండు అనుకుని ఎంతో వేగంతో ఆకాశంలోకి ఎగిరాడు, అది చూసిన సకల ప్రాణులు, దేవతా లోకలు ఆశ్చర్యపోయాయి. అప్పుడే ఇంద్రుడు ఐరావతం మీద వస్తుంటే ఐరావతం తెల్లని పండులాగా కనిపించింది. హనుమంతుడు అటువైపు తిరిగి ఐరావతం పట్టుకోబోయాడు, ఇంద్రుడికి కోపం వచ్చి వజ్రాయుధం ప్రయోగించాడు. అది హనుమంతుడికి తగిలి పడిపోయాడు. వాయుదేవుడు కోపించి గాలి స్తంభింపజేశాడు. సకలదేవతలు బ్రహ్మతో సహా వెళ్లి హనుమంతుడిని చిరాజీవిని చేసి, ఎన్నో వరాలు ఇచ్చారు. వజ్రాయుధం వల్ల గాయపడి హనుమన్తడు అయ్యాడు. కానీ హనుమంతుడు మునుల భార్యల చీరలు చింపేయడం, లారీ చేయడం వంటివి చేస్తుంటే ఇక ఆగలేని మునులు నీ శక్తి నీకే తెలియకుండాపోతుంది. ఒకరు గుర్తుచేస్తే తప్ప నీకు నీ శక్తి తెలియదు అని శాపం పెడతారు. అప్పటి నుండి హనుమంతుడు సాధారణ వానరుడిలాగే పెరిగాడు.  అమోఘమైన విద్యాభ్యాసం!! ఈయన సూర్యుడి దగ్గర చదువుకున్నాడు. గొప్ప పండితుడిగా మారాడు. ఇంకా చెప్పాలంటే హనుమంతుడికి రాని విద్య లేదు. కానీ ఇంత తెలిసినా ఏమి తెలియనట్టే ఉండటం జ్ఞానుల లక్షణం అన్నట్టు. ఈయన కూడా అలాగే ఉండేవాడు. సుందరకాండ!! ఆంజనేయుడికి రాముడికి పరిచయం తరువాత సీతమ్మను వెతకడానికి సాగిన ఆంజనేయుడు ప్రయాణమే సుందరకాండగా పిలవబడుతుంది. ఇది మొత్తం ఎంతో అద్భుతంగా ఉంటుంది. సుందరకాండ చదివిన వాళ్లకు విన్న వాళ్లకు ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెబుతారు.  ఏమి చెబుతుంది హనుమంతుని జీవితం!! హనుమంతుడు మహా బల సంపన్నుడు. గుర్తుచేస్తే తప్ప తన బలం తాను తెలుసుకోలేడు. చాలామంది సాధారణ మనుషులు కూడా ఇంతే. తమలో ఉన్న నైపుణ్యాన్ని తెలుసుకోలేరు.  హనుమంతుడు కార్యసాధకుడు. ఆయన ఎంత కష్టమైన పనిని అయినా చేసి తీరతాడు. అలాంటి గుణం మనుషుల్లో చాలా తక్కువ ఉంటుంది. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని దాన్ని పెంచుకోవాలి. ఈయన గొప్ప వ్యాకరణ పండితుడు. వాచికం అద్భుతంగా ఉంటుంది. వాచికం అంటే మాట్లాడే గుణం, వ్యాకరణం అంటే భాషలో ఉన్న సకల విషయాలు అని అర్థం. అన్నిటి మీద ఈయనకు పట్టు ఉంది. ఎవరిదగ్గర ఎలా మాట్లాడాలి అనేది స్పష్టంగా తెలిసి ఉంటుంది. అలాంటివాడు కాకపోతే రావణాసురుడిని ఆకర్షించగలిగాడు. వాచికం గొప్పగా ఉన్నవాళ్లు ఎదుటివారిని తొందరగా ఆకర్షించగలుగుతారు. తమ మాటలతో ఎదుగువారిని ఒప్పించగలుగుతారు. ఈయన గొప్ప బుద్ధిశాలి. చిన్నతనం అంతా అల్లరిగా సాగినా హనుమంతుడు ఎంతో గొప్ప మేధస్సు కలిగినవాడు. సుగ్రీవుడికి మంత్రిగా ఉంటూ తన కర్తవ్యం నిర్వహించాడు. అంతేకాదు సుందరకాండలో లంకలో ప్రవేశించినప్పుడు హనుమంతుడి ప్రతిభ అడుగడుగునా కనబడుతుంది.  ఈయన చిరంజీవిగా వర్ధిల్లడం వల్ల రాముని అవతారం తరువాత రామ జపం చేస్తూ తపస్సులో మునిగిపోయాడని అంటారు. మనిషికి ఒకదశలో ఇలాంటి స్థితి అవసరమని చెప్పకనే చెబుతాడు. అష్టసిద్ధులకు ఈయన అధిపతిగా ఉంటాడు. అష్టసిద్ధులకు తొమ్మిదిరకాల వ్యాకరణాలను ధారబోసేది ఈయనే.  ఈవిధంగా చూస్తే హనుమంతుడి గురించి చెప్పుకున్నది తక్కువే. కానీ నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. జై భజరంగబళి అని ఆయన్ను తలచుకుని కార్యరంగాలలోకి ఉరకడమే ఇక.                                   ◆ వెంకటేష్ పువ్వాడ.