నాలుగు కొవ్వొత్తులు..

అది ఒక చీకటి గది. చీకటంటే అలాంటి ఇలాంటి చీకటి కాదు... చిమ్మ చీకటి. బయట ఉన్న కిటికీలలోంచి కూడా కారు నలుపు రంగు తప్ప మరేమీ కనిపించడం లేదు. అలాంటి గదిలోకి ఓ కుర్రవాడు ప్రవేశించాడు. తడుముకుంటూ తడుముకుంటూ ఓ నాలుగు కొవ్వొత్తులను పోగేసి వెలిగించాడు. కాసేపు ఆ కాంతిలో ఏదో చదువుకున్నాడు. ఇంకాసేపు ఏదో రాసుకున్నాడు. చివరికి అలా చల్లగాలి పీల్చుకుందామని బయటకు వెళ్లిపోయాడు. కుర్రవాడు అలా బయటకి వెళ్లాడో లేదో కొవ్వొత్తులన్నీ మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి. మొదటి కొవ్వొత్తి అంది కదా... ‘నేను శాంతికి ప్రతిరూపాన్ని. నన్ను ఎక్కువసేపు నిలిపి ఉంచడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అందుకే నేను త్వరగా వెళ్లిపోతున్నాను. మరో నిమిషంలో ఆరిపోయేందుకు సిద్ధంగా ఉన్నాను,’ అంటూ భగభగా మండిపోవడం మొదలుపెట్టింది. అన్నట్లుగానే మరో నిమిషంలో ఆరిపోయింది. మొదటి కొవ్వొత్తి అలా ఆరిపోయిందో లేదో, రెండో కొవ్వొత్తి కూడా చిటపటలాడటం మొదలుపెట్టింది. ‘నేను నమ్మకానికి ప్రతిరూపాన్ని. నా అవసరాన్ని ఎవరూ త్వరగా గమనించరు. పైగా శాంతి కూడా లేనిచోట, ఎవరైనా నమ్మకాన్ని ఎలా నిలిపి ఉంచగలరు. అందుకే నేను కూడా ఆరిపోతున్నాను,’ అంటుండగానే వెలుగు తగ్గిపోయి, చివరికి ఆరిపోయింది. రెండో కొవ్వొత్తి ఇలా కొండెక్కిందో లేదో, మూడో కొవ్వొత్తి నసగడం మొదలుపెట్టింది. ‘నేను ప్రేమకు ప్రతిరూపాన్ని. నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం ఎవ్వరూ చేయరు. తమ పక్కనున్న వారితో సైతం ప్రేమగా ఉండేందుకు ఇష్టపడరు. పైగా శాంతి, నమ్మకం లేని చోట నేను మనుగడ సాగించడం చాలా కష్టం. అందుకే నేను కూడా వారి బాటనే అనుసరిస్తాను,’ అంటూ ఏడుస్తూ రెపరెపలాడసాగింది. అలా అటూఇటూ ఊగిసలాడి చివరికి ఆరిపోయింది. నాలుగో కొవ్వొత్తి మాత్రం నిబ్బరంగా అలాగే నిలిచి ఉంది. కాసేపటికి కుర్రవాడు గది లోపలకి రానే వచ్చాడు. తాను వెలిగించిన మూడు కొవ్వొత్తులూ అలా ఆరిపోవడం చూసి అతనికి బాధ కలిగింది. కానీ నాలుగో కొవ్వొత్తి నిబ్బరం చూసి అంతే ఆశ్చర్యం వేసింది.‘మిగతా కొవ్వొత్తులన్నీ ఆరిపోయినా, నువ్వు మాత్రం ఎలా నిలిచి ఉన్నావు?’ అని నాలుగో కొవ్వొత్తిని అడిగాడు కుర్రవాడు. ‘నేను ఆశకు ప్రతిరూపాన్ని! నేను అంత త్వరగా పరాజయాన్ని ఒప్పుకోను. అసలు పరాజయానికి విరుగుడే నేను కదా! విజయం దక్కేదాకా మీరు పోరాడేందుకు నేను అండగా నిలిచి ఉంటాను. ఇక ఈ చీకటి నాకో లెక్కా! పైగా నన్ను ఉపయోగించి మిగతా కొవ్వొత్తులను కూడా వెలిగించేందుకు సాయపడతాను. నేను ఉన్నంతకాలం శాంతి, నమ్మకం, ప్రేమ అనే గుణాలకు లోటు ఉండదు,’ అని చెప్పింది. కుర్రవాడు ఆ కొవ్వొత్తితో మళ్లీ మిగతా మూడు కొవ్వొత్తులనీ వెలిగించాడు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.

తప్పటడుగులలో విజయాలు!

"బుడిబుడి అడుగులు వేసే పిల్లలు ఎన్నో తప్పటడుగులు వేస్తారు. వాటి నుంచేగా సరిగ్గా నడవడం నేర్చుకునేది".- ఇది పెద్దల మాట.  అడుగు ఎలా? పెద్దలంటే పెద్దలు, జీవితంలో అనుభవం సాదించేసి, జీవిత సారాన్ని ఒడిసిపట్టి, తప్పేది, ఒప్పేది అనేది చిటికెలో చెప్పేసేవాళ్లే కాదు, బాల్య దశ దాటి, యౌవనంలో దూకి, గందగరగోళంలో, ఆవేశాల నిర్ణయాల్లో బోల్తా పడుతూ, మళ్ళీ పైకి లేస్తూ మళ్ళీ అదే ఆవేశంలో మళ్ళీ అదే పడటాలు, లేవడాలతో కుస్తీ పడుతూ  చివరకు ఒక అనుభవం అర్థమయ్యి దానికొక అర్థవంతమైన దారి తెలిసి అప్పుడు అటూఇటూ ఊగకుండా, ఎలాంటి భయం లేకుండా ధీమాగా అడుగేసి, ఆ అడుగు తాలూకూ భయాన్ని కడిగేసి విజయమనే సంతకాన్ని చేస్తారు. కానీ పెద్దలు ఏమి చేస్తున్నారు? తప్పటడుగు  పడగానే దాని అనుభవంతో తదుపరి సరైన అడుగు వేస్తారులే అనుకోవాల్సిన పెద్దలు తప్పు చేసేస్తున్నారు అంటే ఆశ్చర్యం వేస్తుంది. నేటి కాలంలో తమ పిల్లలు తప్పు చేస్తే, వాటిని కవర్ చేసి ఆ పిల్లలను సేవ్ చేసే తల్లిదండ్రులే ఎక్కువ కనబడుతున్నారు. ఫలితంగా ఆ పిల్లలకు తప్పు అంటే ఏమిటో పూర్తిగా అర్థమవడం లేదు. దాని మూలంగానే అదేమీ పెద్ద సమస్య కాదుగా అన్నట్టు తయారవుతున్నారు పిల్లలు. పైగా తాము ఏదైనా తప్పు చేస్తే తమ తల్లిదండ్రులు తమను సేవ్ చేస్తారనే ధీమా వాళ్ళను ఇంకా, ఇంకా తప్పులు చేయిస్తోంది. కానీ పెద్దలు మాత్రం వాటిలో పిల్లల పట్ల ప్రేమను, వారిని కాపాడుకోవాలనే తపనను కనబరుస్తారే తప్ప, వాళ్ళ తప్పును తెలియచేసి, వాళ్ళను బాధ్యాతాయుత పౌరులుగా తయారు చేయడం లేదు. పిల్లలకు ఏమి చెప్పాలి? తప్పులు చేయడం సహజం. అందులో అవగాహన లేని ప్రాయంలో తప్పులు చేయడం మరింత ఎక్కువ. అది ఏ విధమైన తప్పు అనేది అనవసరం కానీ తప్పు చేసిన తరువాత ఆ తప్పుకు గల కారణాలు, దాని పర్యావసనాలు, దాని తాలూకూ ఇబ్బందులు, జీవితం మీద దాని ప్రభావం ఇలాంటివన్నీ పిల్లలకు దగ్గరుండి చెప్పాలి. ఎక్కడ తప్పు జరిగింది?? అది ఎందుకు తప్పుగా పరిగణించబడుతోంది?? వంటి విషయాలను వివరించాలి. దానివల్ల పిల్లల్లో విస్తృత జ్ఞానం పెరుగుతుంది. ఏదైనా చేసేముందు దాని గూర్చి అన్ని కోణాలలో ఆలోచించడం అలవడుతుంది. హద్దులు, ముద్దులు! చాలామంది పిల్లలు ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు వారి తల్లిదండ్రులు వెంటనే వద్దు అంటారు.  కానీ వారు చేయాలి అనుకుంటున్న పని ఎందుకు చేయాలని అనుకుంటున్నారు అనే విషయాన్ని వాళ్ళతోనే చెప్పిస్తూ, దాని తాలూకూ ప్రశ్నలు బయటకు తీస్తూ, ఆ ప్రశ్నలకు సమాధానాలు వాళ్ళతోనే చెప్పిస్తూ ఉండటం వల్ల వాళ్లలో ఎలాంటి పనులు చేయాలనే అవగాహన వస్తుంది.  ఏదో పిల్లల మీద ఇష్టం కొద్ది, ప్రేమ ఎక్కువగా ఉండటం వల్ల వారు అడిగింది సమంజసం కాకపోయినా దానికి సరేనని చెప్పే తల్లిదండ్రులు కూడా బోలెడు మంది ఉన్నారు. వాళ్లకు తాత్కాలిక సంతోషం కనబడుతుంది కానీ భవిష్యత్తు గురించి భయం ఉండదు. పైగా బాగా డబ్బున్న వాళ్ళు అయితే ఇంత డబ్బుంది నా పిల్లల భవిష్యత్తుకు ఇంకేం సమస్య అని అనుకుంటారు. కానీ డబ్బు ఎంత పెట్టినా వ్యక్తిత్వం ఉన్నతంగా అభివృద్ధి చెందదు అనే విషయం అర్ధం చేసుకోరు. మార్గదర్శి… తనను ఒక ఉదాహరణగా చెబుతూ కనువిప్పు కలిగించే వారిని మార్గదర్శి అనవచ్చు. ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఇలాగే ఉండాలి. అలాగని సారూప్యత లేని విషయాల్లో కాదు. కొన్ని ఉదాహరణలు, కొన్ని జీవిత అనుభవాలు, కొన్ని ప్రేరణాత్మక సంఘటనలు, కొన్ని కష్టాలు, కొన్ని కన్నీళ్లు జీవితంలో ఉన్నవి అన్ని పిల్లలకు కొన్ని చిన్న సంఘటనలుగానో, కథలుగానో, అనుభవాలుగానో చెబుతూ ఉండాలి. వాటి వల్ల పిల్లలు తప్పటడుగుల నుండి పాఠాలు నేర్చుకుని, అందులో నుండి విజయాలు సాదించగలుగుతారు!! ◆ వెంకటేష్ పువ్వాడ

అంతర్గత శక్తులను బయటకు తీయడం ఎలా?  నిపుణులు చెప్పిన మార్గాలేంటో తెలుసుకోండి!

  సినిమాల్లోని సూపర్‌హీరోల మాదిరిగానే మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ అంతర్నిర్మితమై ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉండటానికి శరీరానికి ఎదురయ్యే అనారోగ్యాలు, గాయాలతో పోరాడుతూ ఉంటుంది.  ఇలా కేవలం శరీరమే కాదు.. మనిషి మనసు కూడా ప్రత్యేక సామర్థ్యాలు కలిగి ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి  మనసు, శరీరం రెండూ కలసి ఎలా పనిచేస్తాయో..  మనిషిలో ఉన్న అంతర్గత శక్తులను బయటకు తీయడం ఎలాగో తెలుసుకుంటే.. బాల్యం.. బాల్యం ప్రతి ఒక్కరి జీవితంలో భాగం. పెద్దయ్యాక ప్రతి ఒక్కరూ బ్యాలంలోకి వెళ్లిపోవాలని అంటుంటారు. అదొక అందమైన దశ. అమాయకత్వం, ప్రేమ, సంతోషం, కల్మషం లేని వ్యక్తిత్వం బాల్యంలో ఉంటుంది. ఒకవేళ ఇలా ప్రేమ, ఆప్యాయతల మధ్య కాకుండా నిర్లక్ష్యం చేయబడటం, హింసకు గురికావడం వంటివి బాల్యంలో జరిగి ఉంటే అవి మానసికంగా చాలా బాధపెడతాయి. బాల్యంలో ఏం జరిగిందో అర్థం చేసుకోవడం వల్ల భవిష్యత్తును ఆశాజనకంగా తీర్చిదిద్దుకోవచ్చు. తప్పులను సరిదిద్దుకోవచ్చు. బాద్యత కలిగిన పెద్దలుగా ఎదగవచ్చు. ట్రీట్మెంట్..  చాలామందిలో చిన్నతనంలో జరిగిన ఎన్నో అనుభవాలు మనసులో పాతుకుపోయి ఉంటాయి.  వర్తమానానికి తగినట్టు కాకుండా మనసులో పాతుకుపోయిన విషయాలకు అనుగుణంగా నటిస్తుంటారు. దానికి తగినట్టు ప్రవర్తిస్తుంటారు. అయితే మనసులో ఉన్న ఈ పాత విషయాలను మార్చేయడం ద్వారా మనసులో ఉన్న అంతర్గత శక్తులను బయటకు తీయగలరని అంటున్నారు నిపుణులు. తద్వారా జీవితాన్ని ఉన్నతంగా మార్చుకునే అవకాశం పొందగలం. చిత్తశుద్ది.. వర్తమానం గురించి తెలుసుకోవడం కోసం సమర్థవంతమైన మార్గాలలో మైండ్‌ఫుల్‌నెస్ ఒకటి. అంటే ప్రస్తుతం జరుగుతున్నవాటిని జడ్జ్ చేయకుండా వాటిని నిశితంగా గమనించడం.  వర్తమానంలో భావాలు, అనుభూతులు, ఆలోచనలు, చుట్టూ జరుగుతున్న విషయాలు మొదలైనవాటిని గమనించాలి. మైండ్‌ఫుల్‌నెస్ పాత బాధలను నయం చేయడంలో సహాయపడుతుంది. ప్రస్తుత క్షణంపై దృష్టి కేంద్రీకరించినప్పుడు పాత విషయాలను బాగా అర్థం చేసుకోవచ్చు. వాటిని అంతే ధీటుగా ఎదుర్కోవచ్చు. తద్వారా మనసుకు చికిత్స చేయవచ్చు. క్షమాపణ.. క్షమాపణ అడగడం, ధన్యవాదాలు చెప్పడం, ప్రేమను హృదయపూర్వకంగా వ్యక్తం చేయడం వంటివి వ్యక్తిలో ఉండే ప్రతికూల శక్తులను బయటకు విడుదల చేస్తాయి.  ప్రతికూల ప్రభావాలకు బాధ్యత వహించడం, పశ్చాత్తాపాన్ని, కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేయడం ద్వారా వ్యక్తిలో అంతర్గత శాంతి నెలకొంటుంది. ఇది వ్యక్తిగతంగానూ, ఇతరులతోనూ సామరస్యాన్ని నెలకొల్పుతుంది. శ్వాస ఉపయోగించడం.. గతాన్ని నయం చేయడానికి శ్వాసను ఉపయోగించడం చాలా గొప్ప మార్గం. పాత జ్ఞాపకాలను, మనసులో ఉన్న విషయాలను వదిలించకోవడానికి శ్వాసమీద దృష్టి పెట్టడం, నెమ్మదిగా లోతైన శ్వాస తీసుకోవడం ద్వారా మనస్సును, శరీరాన్ని  శాంతపరచవచ్చు. ఇది గతంలో ముడిపడిన భావోద్వేగాలకు విశ్రాంతి ఇవ్వడానికి, వాటిని విడుదల చేయడానికి సహాయపడుతుంది. జర్నలింగ్.. రిఫ్లెక్షన్స్.. ఆలోచనలను, భావాలను రాయడం వల్ల గతాలకు సంబధించిన గాయాలను, భావోద్వేగాలను నయం చేయడం సులువుగా ఉంటుంది. వ్యక్తులు తమను తాము అర్థం చేసుకోవడంలో ఇది సహాయపడుతుంది. ప్రతికూల విధానాలను విడిచిపెట్టి, ఆరోగ్యకరమైన మార్గంలోకి మెదడును, ఆలోచనలను  తీసుకెళ్లడంలో ఇది సహాయపడుతుంది. సపోర్ట్.. ఏ విషయంలో అయినా స్వంతంగా చేసే ప్రయత్నాల కంటే ఒకరి మద్దతుతో చేసే ప్రయత్నాలు ఎప్పుడూ మంచి ఫలితాలు ఇస్తాయి. భావోద్వేగాలకు సంబంధించిన గాయాలు నయం చేయడంలో సామాజిక మద్దతు కీలకపాత్ర పోషిస్తుంది. ప్రతి ఒక్కరికి వ్యక్తి గురించి ఆలోచించేవారు, అన్ని విషయాలలో మద్దతు ఇచ్చే వారుంటే తప్పొప్పుల గురించి చర్చించి మాట్లాడటం, అర్థం చేసుకోవడం, సరైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే గతాన్ని వదిలించుకునే క్రమంలో ఎప్పుడూ ఒంటరితనం వేధించదు. మనస్సు, శరీరం రెండూ ఏకమైనప్పుడు , అవి రెండూ కలిస్తే ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకున్నప్పుడు స్వతహాగానే మనిషిలో అంతర్గత శక్తులు బయటకు వస్తాయి.                                          * నిశ్శబ్ద.

షాపింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

  షాపింగ్‌పై నియంత్రణ కోల్పోయి అవసరం లేని వస్తువులు కూడా కొనేసి, ఇంటికి వచ్చాక లెక్కలు కట్టి బాధపడేవారు చాలామందే ఉంటారు. ఇలా అవసరాన్ని మించి హ్యాండ్ బ్యాగ్‌లో లేదా ATM లో ఉన్న డబ్బంతా ఖర్చుచేస్తే ఆ నెలంతా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. * ఈ విషయంలో సెల్ఫ్ కంట్రోల్, ముందుచూపు చాలా అవసరం. అందుకే షాపింగ్‌కు వెళ్ళేముందు కావాల్సినంత డబ్బు మాత్రమే తీసుకువెళ్ళండి. ATM కార్డులో పుష్కలంగా బ్యాలెన్సు ఉంది కదా అని ఎడా, పెడా ఉపయోగించకండి. ఈ కార్డులు హ్యాండ్ బ్యాగులో ఉంటే అవసరానికి మించి కొనడానికి ఉత్సాహపడతారు. కాబట్టి వీలయినంతవరకూ వాటిని బైటకు తీయవద్దు. * షాపింగ్‌కు వెళ్ళే ముందే ఇంటి దగ్గర ఒక చిన్న స్లిప్‌మీద ఏమేమి కొనాలి, ఎక్కడ కొనాలి, ఎంత డబ్బు వాటికి అవసరం అవుతుంది అని చిన్న జాబితా తయారుచేసుకోండి. జాబితా తయారుచేసుకున్నాకా మీ వద్ద ఉన్న డబ్బుకు మించి జాబితా తయారైతే అవసరం లేని వస్తువులేమైనా ఉన్నాయో చూసుకుని వాటిని తొలగించండి. ఇంకా వీలైతే అత్యవసరం ఉన్న వాటినే లెక్కలో ఉంచుకోవాలి. షాపింగ్ కు వెళ్ళాక తయారుచేసుకున్న జాబితాలో నుంచే కొనుగోళ్ళు ప్రారంభించాలి. *  వ్యాపార ప్రకటనలు చూసి మోసపోవద్దు. చాలామంది కూడా ప్రకటనలపైనా, ఫ్రీ గిఫ్ట్‌లపైనా దృష్టి పెడుతుంటారు. వీటిని దృష్టిలో పెట్టుకోకుండా కొనుగోళ్ళు చేస్తే తగిన నియంత్రణలో ఉన్నట్లు లెక్క. * కొంతమంది బోర్‌గా ఉందని, ఏం తోచక షాపింగులు చేస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. బోర్ కొట్టేవాళ్ళు కాలక్షేపానికి మరేదైనా పనిమీద మనసు లగ్నం చేస్తే బాగుంటుంది. అంతేకాని షాపింగు చేయడాన్ని ఎంచుకోవద్దు. * నెలంతా అవసరమయ్యే అన్ని ఖర్చులు రాసుకుని ఆ తర్వాతే షాపింగు ఖర్చు తీసి పక్కన పెట్టాలి. ఎందుకంటే వచ్చిన డబ్బంతా షాపింగ్‌కు ఖర్చుపెట్టి ఆ తర్వాత అప్పులు చేయవద్దు. * హైక్లాస్ అయినా మిడిల్, లోయర్ క్లాసుల వాళ్ళయినా షాపింగ్‌లో నియంత్రణ కలిగి ఉండటం చాలా మంచిది.

ప్రతి మనిషిలోనూ ఓ వేటగాడు!

ఈమధ్య కాలంలో ఎక్కడ చూసినా జనం ‘పోకెమాన్‌ గో’ ఆటని ఆడుతూ కనిపిస్తున్నారు. ఇది వేలంవెర్రిగా మారిందని పెద్దలు తిట్టుకుంటున్నా, దీని పర్యవసానాల గురించి పరిశోధనలు జరుగుతున్నా... ఆటలు ఆడేవారు మాత్రం పోకెమాన్ల వెంట పడుతూనే ఉన్నారు. ‘ఇంతకీ మనిషి ఈ ఆటకి ఎందుకింతగా వ్యసనపరుడయ్యాడు?’ అన్న ప్రశ్నకి ఓ స్పష్టమైన జవాబు లభిస్తోంది. తన జీవితమే ఒక పరిశోధన రష్యాలో పుట్టి పెరిగిన ‘వ్లాదిమిర్‌ డినెట్స్’ అనే ఆయన, ప్రస్తుతం అమెరికాలో మనస్తత్వ శాస్త్రంలో ప్రొఫెసరుగా పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన పోకెమాన్‌గో పిచ్చి గురించి వ్లాదిమిర్‌కి కూడా కొన్ని సందేహాలు వచ్చాయి. మనిషిలో స్వతహాగా ఉండే వేటగాడి మనస్తత్వం వల్లే మనం ఈ ఆటని ఇష్టపడుతున్నామా అన్న అనుమానం కలిగింది. దాంతో ఒక్కసారి తన జీవితంలో జరిగిన విషయాలనే ఒక్కొక్కటిగా నెమరువేసుకుంటూ ‘మనిషిలో వేటగాడు’ అనే ఆలోచనకు ఓ రూపం ఇచ్చేందుకు ప్రయత్నించారు. వేటే ఆధారం ఇప్పుడంటే తాజా ఆకుకూరలు, షడ్రసోపేతమైన ఆహారాలు లాగిస్తున్నాం కానీ, ఆదిమానవులుగా ఉన్నప్పుడు మనం వేట మీదే కదా ఆధారపడింది. ఆ వేటతోనే కదా వారి ఆకలి తీరింది. కాబట్టి మిగతా జంతువులలాగానే మనిషిలో ఇంకా ఆ వేట తాలూకు ఛాయలు పోలేదంటారు వ్లాదిమిర్‌. అందుకు తన జీవితమే ఒక ఉదాహరణగా చెప్పుకొస్తున్నారు. వ్లాదిమిర్‌ చిన్నప్పుడు తన తండ్రి సీతాకోక చిలుకల వెంటపడటాన్ని గమనించేవాడు. ఆయన సీతాకోక చిలుకల్ని గమనిస్తూ, వాటి వెంటపడుతూ, వాటిలో అరుదైనవాటిని సేకరిస్తూ ఉండేవారట. వ్లాదిమిర్‌కు ఐదేళ్లు వచ్చేసరికి దగ్గరలో ఉన్న అడవులకు వెళ్లి అక్కడ ఉండే జంతువులని గమనించే అలవాటు మొదలైంది. తరువాత కాలంలో వ్లాదిమిర్‌, మాస్కో మహానగరంలో అడుగుపెట్టాడు. అక్కడ అతను పార్కుల్లో పక్షులనీ, పెరట్లో పురుగులనీ గమనించడం మొదలుపెట్టాడు. ఆ తరువాత అరుదైన జంతువులని గమనించడాన్నే వ్యాపకంగా పెట్టుకొన్నాడు. చివరికి జంతువుల స్వభావాల మీదే డాక్టరేటు పుచ్చుకున్నాడు. అన్నీ వేటగాడి సూచనలే సీతాకోక చిలుకల వెంటపడటం, పక్షులను గమనించడం, జంతువులని పరిశీలించడం, పురుగులను పట్టుకోవడం... ఇవన్నీ మనలో దాగి ఉన్న వేటగాడి చర్యలే అంటారు వ్లాదిమిర్‌. అంతేకాదు పోకెమాన్‌గోలో లేని జంతువులను ఊహించుకుంటూ వాటి వెంటపడటం కూడా మనలోని వేటగాడిని తృప్తి పరుస్తోందని విశ్లేషిస్తున్నారు. అయితే ఈ ‘వేటగాడి’లో ఉండే పోరాటపటిమని లక్ష్యసాధన కోసం ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితాలనిస్తుందని సూచిస్తున్నారు.   -నిర్జర.

ఇవి కూడా రంగుల పండుగలే!

హోళీ అంటే భారతీయులకి మాత్రమే ప్రత్యేకమైన పండుగ. ఎక్కడో ఈశాన్యంలోని మణిపూర్లో ఉన్నా, ఖండాలు దాటుకుని ఏ అమెరికాలో ఉన్నా.... హోళీనాడు రంగు చేతపట్టని భారతీయుడు ఉండదు. ఇందులో ఒకో ప్రాంతానిదీ ఒకో ప్రత్యేకత. ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకోవడం ప్రపంచంలో బహుశా మన హోళీ సందర్భంలో మాత్రమే కనిపిస్తుంది. కానీ జీవితాన్ని రంగులమయం చేసుకునే ప్రయత్నం మాత్రం చాలా దేశాల్లో ఉంది... టమాటాల పండుగ స్పెయిన్‌లోని వలెన్‌సియాన్ నగరంలో ఏటా ఈ పండుగ చేసుకుంటారు. ఆగస్టు చివరి బుధవారం  జరుపుకొనే ఈ పండుగలో ఒకరి మీద ఒకరు టమోటాలు విసురుకుంటారు. 1945 నుంచి మొదలైన ఈ పండుగ రాన్రానూ ప్రచారాన్ని అందుకుంటోంది. నిజానికి ఈ సంప్రదాయం ఎలా మొదలైందో ఎవరికీ తెలియదు. కొందరు కుర్రకారు టమాటాలతో కొట్టుకున్న గొడవ ఇలా మారిందనీ, ఓ టమాటా లారీ బోల్తా పడటంతో ఈ సంప్రదాయం మొదలైందనీ, ఊళ్లో కౌన్సిల్‌ సభ్యుల మీద కోపం వచ్చిన పౌరులు టమాటాలను విసరడంతో ఈ ఆచారానికి పునాది ఏర్పడిందనీ రకరకాల వాదనలు ఉన్నాయి. కారణం ఏదైనా ఆ రోజు సంబరం మాత్రం అంబరాన్ని అంటుతుంది. ఆ సందర్భంగా ఎవ్వరికీ ఎలాంటి గాయం జరగకుండా చాలా నియమాలనూ పాటించాల్సి ఉంటుంది. ఒకటే రంగు నెదర్లాండ్‌ రాజుగారైనా విలియం అలగ్జాండర్ పుట్టినరోజు సందర్భంగా ఆ దేశంలో జరుపుకొనే సంబరాలే ‘Koningsdag’. ఈ రోజున నెదర్లాండ్స్ యావత్తూ ఆ దేశపు రంగైన నారింజరంగుతో నిండిపోతుంది. గోడల మీద నారింజ రంగు కనిపిస్తుంది. జనమంతా నారింజరంగు బట్టలు వేసుకుని తిరుగుతారు. ఆఖరికి జుట్టుకి కూడా నారింజ రంగు వేసుకుంటారు. ద్రాక్ష ఎరుపులో మందుప్రియులందరి నోరూరేలాంటి ఓ పండుగ ఉంది. అదే స్పెయిన్‌లో జరిగే ‘హారో వైన్‌ ఫెస్టివల్‌’. ఏటా జూన్‌ 29న ఆ దేశంలోని క్రైస్తవ సన్యాసి ‘శాన్‌ పెడ్రో’ జ్ఞాపకార్థం ఈ పండుగ జరుగుతుంది. హారో అనే ఊరిలో జరిగే ఈ పండుగలో ఊరి జనమంతా ఉదయం నుంచే ద్రాక్షసారాయి నిండిన పాత్రలతో బయల్దేరతారు. దారిలో తమకు ఎదురుపడినవారందరి మీదా ఈ సారాయిని ఒంపుతూ ముందకుసాగుతారు. సాయంత్రం అయ్యేసరికి ఊరంతా ద్రాక్షమయంగా మారిపోతుందన్నమాట. ఇక ద్రాక్షసారాని ఒంపుకోవడమే కాదు... దానిని తాగడంలో కూడా బోలెడు పోటీలు జరుగుతాయి. నారింజ యుద్ధం ఇటలీలోని ఇవ్రియా అనే పట్నంలో జరిగే పండుగ ఇది. దీని మూలాలు ఎప్పుడో 13వ శతాబ్దంలో ఉన్నాయని చెబతారు. అప్పట్లో రాజవంశానికి చెందిన వ్యక్తి, ఓ పల్లెటూరి పిల్లని బలాత్కారం చేయబోయాడట. దానికి తిప్పికొట్టిన ఆ అమ్మాయి, ఏకంగా ఆ వ్యక్తి తలని నరికేసిందని చెబుతారు. అంతేకాదు! విషయం తెలుసుకున్న పౌరులంతా కలిసి రాజవంశం మీద తిరగబడ్డారట. ఆనాటి ప్రతిఘటనకు గుర్తుగా ఇవ్రియావాసులు నారింజపండ్లని ఒకరిమీద ఒకరికి విసురుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా హోళీని తలపిస్తూ రంగులతో నిండే ఇలాంటి పండుగలు చాలానే ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి మాత్రం పైన పేర్కొన్నవే!   - నిర్జర.

బంధాన్ని పదిలంగా మార్చే సరికొత్త సిద్దాంతం.. లెట్ దెమ్!

జీవితంలో బంధాలు చాలా అపురూపమైనవి. ముఖ్యంగా జీవిత భాగస్వాముల మధ్య బంధం బలంగా ఉంటేనే జీవితం సంతోషంగా ఉంటుంది.  అయితే బంధంలో సంతోషం కంటే కలతలు, గొడవలు ఎక్కువగా ఉన్న జంటలే ఎక్కువగా ఉంటున్నాయి ఈ కాలంలో. దీనికి కారణం జీవిత భాగస్వాములు ఒకరినొకరు నియంత్రించాలని, ఒకరు చెప్పిందనే జరగాలని, ఒకరి మాటే నెగ్గాలని అనుకోవడం. దీనివల్ల ఇద్దరి జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి. ఇద్దరి జీవితాలు ప్రశాంతతను కోల్పోతాయి. స్పష్టత లేకుండా తయారవుతాయి.   వీటిని పరిష్కరించి జీవితం సంతోషంగా ఉండటానికి సరికొత్త సిద్దాంతాన్ని పరిచయం చేస్తున్నారు మానవ సంబంధాల నిపుణులు.   లెట్ దెమ్ అనే ఈ సరికొత్త సిద్దాంతం వల్ల  జీవిత భాగస్వాములు ఒకరిని మరొకరు నియంత్రించాలనే ఆలోచన విడిచిపెట్టి స్వీయ నియంత్రణ పాటించడం జరుగుతుందని అంటున్నారు. అసలింతకూ ఈ లెట్ దెమ్ అనే సిద్దాంతం పాటించడం వల్ల కలిగే  ఇతర ప్రయోజనాలేంటో తెలుసుకుంటే.. గౌరవం.. స్వీయ నియంత్రణ, స్వీయ విమర్శ, స్వీయ ప్రోత్సాహం వంటివి ఎప్పుడూ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తాయి.  ఇది జీవితభాగస్వామి దృష్టిలో వ్యక్తిత్వాన్ని మరింత గొప్పగా మారుస్తాయి. ఇద్దరి మధ్య సరిహద్దులు, ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవించడం వంటి విషయాలలో ఎప్పుడూ సంతృప్తికర ఫలితాలను ఇస్తాయి. అందుకే లెట్ దెమ్ సిద్దాంతాన్ని పాటించే వ్యక్తులు తమ గౌరవాన్ని పెంచుకుంటారు. ఎక్స్పెక్టేషన్స్.. లెట్ దెమ్ ను స్వీకరించడం వల్ల వ్యక్తి జీవితం నుండి అంచనాలు, ఆశించడాలు, ఇతరుల విషయంలో ఒత్తిడికి లోనుకావడం వంటివి తగ్గుతాయి. ఇది వ్యక్తిని రిలాక్స్ గా మారుస్తుంది.  భాగస్వాములు ఇద్దరూ లెట్ దెమ్ సిద్దాంతాన్ని పాటిస్తే వారిద్దరి మధ్య ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి.  ఇది ఇద్దరి మధ్య సంతృప్తికరమైన జీవితానికి దారితీస్తుంది. సరిహద్దులు.. లెట్ దెమ్ సిద్దాంతాన్ని భాగస్వాములు పాటిస్తే వారిద్దరి మధ్య ఆరోగ్యకమైన సరిహద్దులు ఏర్పరుచుకోవడానికి, వాటిని నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది.  ఇది ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పాటుచేసుకోవడానికి సహరకరిస్తుంది. యాక్సెప్ట్ చేయడం.. డిమాండ్ ఉన్నప్పుడు తనకు నచ్చింది మాత్రమే జరగాలనే పట్టుదల, మొండితనం ఉంటుంది. కానీ డిమాండ్ లేకుండా స్వీయ నియంత్రణ ఉన్నప్పుడు భాగస్వామి కోణంలో ఆలోచించడం, భాగస్వామికి సంబధించిన అన్ని విషయాలను స్వీకరించడం, ఇద్దరి మధ్య అంగీకారం  మొదలైనవి సులువు అవుతాయి. కంట్రోల్.. కోపం, ద్వేషం, ఆవేశం వంటి భావోద్వేగాలు ఎక్కువైనప్పుడు చాలావరకు భాగస్వాముల మధ్య గొడవలు, అపార్థాలు వస్తుంటాయి. కానీ ఈ ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోవడం, స్వీయ నియంత్రణ, స్వీయ విమర్శ, ఆత్మ పరిశీలన మొదలైనవాటి వల్ల భావోద్వేగాలు చాలావరకు నియంత్రణలో ఉంటాయి. ఇవి నియంత్రణలో ఉంటే చాలు.. సహజంగానే ఇద్దరిమధ్య అపార్థాలు తొలగిపోతాయి.  బంధం పదిలంగా ఉంటుంది.                                       *నిశ్శబ్ద.

నైపుణ్యంతో నయా జీవితం!

ఒక్కో మనిషిలో ఒకో విధమైన ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకత కాస్తా మనిషిని కూడా ప్రత్యేకంగా ఉంచుతుంది. అయితే దాన్ని మనిషి తన జీవితం కోసం ఎలా ఉపయోగించుకుంటాడు అనేదాని మీద మనిషి జీవితం ఎంత బాగా ఉంటుంది అనేది ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎన్నో రంగాలు. అన్ని రంగాలలో కూడా ఇంత ప్రతిభ ఉన్న వాళ్ళకే అవకాశాలు. ఇందులో వింత ఏముంది?? ప్రతిభ ఉన్నవాళ్లకే కదా అవకాశాలు అని అందరికీ అనిపిస్తుంది కానీ ప్రతిభ ఉన్నా అందులో నైపుణ్యం లేకపోతే అందరి మధ్యన నిలబడి గెలవడం కష్టమే.  తేడా ఏంటి? ప్రతిభకు, నైపుణ్యతకు తేడా ఏంటి?? అని ప్రశ్నించుకున్నప్పుడు రెండూ ఒకటే అనిపిస్తాయి చాలామందికి. అయితే రెండింటికీ మధ్య ఒక సన్నని గీతను చూస్తాయి అవకాశాలు ఇచ్చే అధికార పీఠాలు. అంటే ప్రతిభలో కూడా తక్కువ ఎక్కువలను ప్రమాణికాలు ఉంటాయనమాట. మరైతే అవేంటి?? ఈ ఎక్కువ తక్కువల వృత్తం నుండి బయటకొచ్చి అవకాశాలు పొందటం ఎలా అంటే ప్రతిభకు పదునుపెట్టడమే. అలా పదును తెలినప్పుడే నైపుణ్యాలు మరొకరిని ఆకర్షిస్తాయి. నిజాయితీ! చేసే పనిని ఎంత నిజాయితీగా చేస్తున్నామన్నది మొదటి సూత్రం. ప్రతి చోట ఈ నిజాయితీని చూస్తారు. అంతేకానీ నిర్లక్ష్యపు ఆలోచనలతో చేసేపనిని అంత సీరియస్ గా తీసుకోకపోతే ఎంత ప్రతిభ ఉన్నవాడిని అయినా మూడురోజుల ముచ్చటగా పరికించి చూసి నాలుగవ రోజున బయటకు వెళ్లమంటూ తలుపులు తెరిచేస్తారు. కాబట్టి ప్రతిభ ఉన్నవాడు నిజాయితీ అనే గుణాన్ని తప్పనిసరిగా కలిగి ఉండాలి. వేగం! నీకు ఎంత బాగా పని చేయడం వచ్చు అనేది మంచి విషయమే, అయితే ఆ బాగా రావడంతో బాగా చేయడంలో వేగం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ కాలంలో టైమ్ సేవ్ చేయగలిగే నేర్పు ఉంటే వేతనం ఎక్కువ ఇచ్చి అయినా అవకాశం ఇస్తారు. తరువాత తమ నుండి ఎప్పటికీ దూరం చేసుకోరు.  అందుకే మహాభారతంలో కూడా "సాధనాత్ సాధ్యతే సర్వం" అని ఉంది. అంటే సాధన చేస్తూ ఉంటే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. వచ్చిన పనిని పదే పదే చేస్తూ ఉంటే అందులో వేగం అందుకోవడం కష్టమైన పని ఏమీ కాదు. క్రమశిక్షణ! క్రమశిక్షణ పాటించే వాళ్ళు అన్నివిధాలుగా మిగిలిన వారికంటే మెరుగ్గా ఉంటారు అనేది ఒప్పుకోవలసిన నిజం. సమయానికి తగు సేవలు అందించే వాళ్లంటే అధికారులకు ప్రత్యేక ఆసక్తి కూడా. పని చేసే చోటుకు చేరుకోవడం నుండి, అప్పగించిన పనిని పూర్తి చేసే వరకు సమర్థవంతంగా ఉండాలి కోరుకుంటారు.  ఇంటి సమస్యలు, మానసిక ఒత్తిడులు, వ్యక్తిగత సమస్యలను పనిలోకి జొప్పించి, అసహనంతో, అసంబద్ధంగా నిర్లక్ష్యంగా ఉండేవాళ్లంటే డబ్బులిచ్చి పనిచేయించుకునే ఎవరు మాత్రం ఆసక్తి చూపిస్తారు?? అప్ డేట్ అవ్వాలి! నిజంగా ఇది చాలా ముఖ్యమైనది. ప్రతిభ ఉంటే సరిపోదు. ప్రస్తుత వేగవంతమైన ప్రపంచంలో ఆ ప్రతిభ తాలూకూ రంగంలో కలుగుతున్న మార్పులను తెలుసుకోవాలి. ఆ మార్పులకు తగ్గట్టు ప్రతిభను అందులో వేగాన్ని, విభిన్నత్వాన్ని పెంపోందించుకోవాలి. ప్రస్తుతం విభిన్నత్వం కూడా ఒక పరిగణించాల్సిన అంశమే. ఎప్పుడైతే చేసేపనిలో కొత్తదనం, ఆకర్షణ కనబడతాయో అప్పుడు అందరూ ఆసక్తి చూపుతారు. అవకాశాలు బోలెడు! భారతదేశంలో నిరుద్యోగులు ఎక్కువ. అయితే వాళ్ళందరూ ఎందుకు నిరుద్యోగులుగా ఉన్నారు అంటే, చదువుకుని ప్రభుత్వ రంగాలలోనే ఉద్యోగం సాధించాలని ఎంతో విలువైన వయసు కాలాన్ని కేవలం ప్రయత్నాలలోనే గడిపేస్తుండటం వల్ల. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించకూడదు అనేది ఇక్కడి మాటల్లోని అర్థం కాదు. అది తప్ప వేరే ఇంకేమీ లేవని అనుకోవడం తప్పు అని చెప్పడం ఇక్కడి ఉద్దేశ్యం.  అవకాశాల కోసం వెతుకులాడటం, పాకులాడటం కంటే అవకాశాలను సృష్టించడం తెలిస్తే ఇక జీవితంలో గొప్ప దశ ప్రారంభమైనట్టే.  ముఖ్యంగా మనిషి తనలో ఉన్న ప్రత్యేకతను ఎంత మెరుగుపెట్టుకుంటూ వెళ్తే అంత నైపుణ్యం ఆ వ్యక్తిలో చేరుతుంది. ఆ నైపుణ్యాల ఫలితమే కొత్త జీవితానికి నాంది. ◆ వెంకటేష్ పువ్వాడ.

అదృష్టం- దురదృష్టం

అదృష్టం, దురదృష్టం అన్న మాటలను తరచూ వాడేస్తూ ఉంటాం. కానీ ఇంత చిన్న జీవితంలో ఏది అదృష్టమో, ఏది కాదో ఎలా చెప్పగలం. అందుకే మన పని మనం చేసుకుపోవడం, దాని ఫలితం తలకిందులైనప్పుడు కుంగిపోకుండా సాగిపోవడం విచక్షణ ఉన్న మనిషి లక్షణం. కావాలంటే ఈ చిన్న కథను చదివి చూడండి. దాదాపు వందేళ్ల క్రితం మాట ఇది. స్కాట్లాండులో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబ పెద్ద పేరు క్లార్క్. కుటుంబం అంటే అందులో ఓ నలుగురో, ఐదుగురో ఉంటారనుకునేరు. క్లార్క్‌, అతని భార్యా... వారి తొమ్మిదిమంది పిల్లలు. ఆ తొమ్మిదిమంది పిల్లలతో బతుకు బండిని లాగడం భార్యాభర్తలకు చాలా కష్టంగా ఉండేది. అందుకని మంచి అవకాశాల కోసం అమెరికాకు చేరుకోవాలనుకున్నారు. మరి విదేశంలో స్థిరపడాలంటే మాటలా! అందుకోసం తగిన గుర్తింపు పత్రాలు, అనుమతి పత్రాలూ కావాలి. అన్నింటికీ మించి కుటుంబంలోని పదకొండు మందీ ప్రయాణించేందుకు టికెట్లు కొనుగోలు చేసుకోవాలి. వీటి కోసం భార్యాభర్తలు తెగ కష్టపడేవారు. వాళ్ల కాళ్లూ వీళ్ల కాళ్లూ పట్టుకుని కావల్సిన పత్రాలను సంపాదించారు. రాత్రింబగళ్లూ పనిచేసి టికెట్లకు అవసరమైన డబ్బుని సంపాదించారు. తిండీతిప్పలూ మానేసి ఏళ్లకి ఏళ్లు కష్టపడితే కానీ ఇదంతా సాధ్యం కాలేదు. చివరికి ఫలానా రోజున అమెరికాకి ప్రయాణం అవ్వబోతున్నామన్న తీపి కబురుని తన కుటుంబానికి వినిపించాడు క్లార్క్‌. ఈ వార్త విన్న కుటుంబం సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోయింది. కానీ... మరో వారం రోజుల్లో ప్రయాణం ఉందనగా ఆ కుటుంబంలో అందరికంటే చిన్నపిల్లవాడిని కుక్క కరిచింది. వారుండే చోట ర్యాబిస్‌ మందు ఇంకా అందుబాటులో లేకపోవడంతో గాయానికి కుట్లు మాత్రమే వేసి వదిలేశాడు ప్రభుత్వ వైద్యుడు. పైగా అప్పటి నిబంధనల ప్రకారం, ర్యాబిస్ ప్రబలకుండా ఉండేందుకు మరో రెండువారాల పాటు ఆ కుటుంబం ఎక్కడికీ కదలడానికి వీల్లేదంటూ ఆజ్ఞలు జారీచేశాడు. ఇంకేముంది! ఆ కుటుంబం బిక్కుబిక్కుమంటూ ఇంట్లోనే ఉండిపోయింది. తమ టికెట్లని తిరిగి అమ్ముకునే అవకాశం కూడా లేకపోయింది. ఇంటిల్లపాదీ ఆ పిల్లవాడిని తిట్టుకుంటూ ఉండిపోయారు. ఈ రెండువారాల్లో ఆ పిల్లవాడికి కానీ, అతని నుంచి కుటుంబానికి కానీ ర్యాబిస్‌ అయితే సోకలేదు. కానీ నౌక, ఆ నౌకతో పాటు తమ టికెట్టు డబ్బులు తీరం దాటి వెళ్లిపోయాయి.రెండువారాలు గడిచాయి.... ఇంటిల్లపాదీ చిన్నబోయిన మొహోలతో ఊళ్లోకి వచ్చారు. కానీ తనకి ఎదురొచ్చిన ప్రతిఒక్కరూ శుభాకాంక్షలు చెప్పడం చూసి ఆశ్చర్యపోయాడు క్లార్క్‌. తమని వెక్కిరించేందుకే వారలా చేస్తున్నారని మొదట అనుకున్నాడు. కానీ అసలు విషయం తెలిసేసరికి అతని ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయాయి. తాము ఎక్కుదామనుకున్న నౌక నడిసముద్రంలో మునిగిపోయిందనీ... అందులో దిగువ తరగతుల్లో ప్రయాణిస్తున్నవారు చాలామంది చనిపోయారనీ తెలిసింది. ఆ నౌక మరేదో కాదు... 1,500 మంది ప్రాణాలను బలిగొన్న టైటానిక్‌! ఇప్పుడు కార్ల్క్ దురదృష్టం కాస్తా అదృష్టంగా మారిపోయింది. క్లార్క్ పరుగుపరుగున వెళ్లి తన చిన్న కొడుకుని కావలించుకుని ఏడ్చేశాడు. తన కుటుంబం యావత్తునీ కాపాడావంటూ ముద్దులతో ముంచెత్తాడు. పాశ్చాత్య దేశాలలో క్లార్క్‌ కథ విస్తృత ప్రచారంలో ఉంది. ఇది నిజమా అబద్ధమా అని చెప్పేవారెవ్వరూ లేరు. కానీ ఇలా జరిగే అవకాశాన్ని మాత్రం ఎవ్వరూ కొట్టిపారేయలేరు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండటం, సజీవంగా ఉండటాన్ని మించిన అదృష్టం ఉందన్న విషయాన్ని ఎవరు మాత్రం నిరాకరించగలరు! - నిర్జర.

మాటలొస్తే చాలు రాజ్యం నీదే!

మనిషిని ఆకట్టుకునేది మాట! మనిషి వ్యక్తిత్వాన్ని సుస్పష్టం చేసేది మాట! మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దేది మాట! ఇట్లా మాట మనిషిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. అయితే అదే మాట తూటా లాగా ఇతరులను గాయపరుస్తుంది! ఆవేశంలో బయటకు వచ్చేమాట ఆయుధం కన్నా పదునైనది. అందుకే కోపం, ఆవేశం ఉన్నపుడు మౌనంగా ఉండటం ఎంతో ఉత్తమం. చాలామంది కొన్ని సార్లు ఎంతో ఆత్మీయులు, మరెంతో కావలసినవాళ్ళ దగ్గర ఏదైనా చిన్న తగాదా వచ్చినప్పుడు ఆవేశంలో ఏదో ఒకటి అనేస్తారు, ఆవేశం కాస్తా చల్లారిపోయాక తాము ఏమి మాట్లాడాము అనేది మరోసారి విశ్లేషించుకున్నాక అప్పుడు తెలుస్తుంది ఎంత అవివేకమైన పని చేశామో అని. కానీ అప్పుడు ఆ తప్పును తిరిగి ఒప్పుకున్నా, అవతల మనిషి మనసుకు అయిన గాయం అంత తొందరగా మానిపోదు. బహుశా కొందరిని ఆ మాటల తాలూకూ గుర్తులు జీవింతాంతం వెంటాడి మీకు దూరంగా ఉండేలా నిర్ణయం తీసుకునేందుకు ప్రేరేపించవవచ్చు కూడా. మాట మనిషికి ఆభరణం! నిజంగా నిజమే! మనిషి మాట్లాడే మాట ఆ మనిషి ఏంటి అనేది తెలుపుతుంది. ఆవేశం, కోపం, అసహనం చిరాకు ఇలాంటివన్నీ దరిదాపులకు రానివ్వకుండా మాట్లాడగలగడం కొందరికే సాధ్యమని అనుకుంటారు కానీ ప్రయత్నిస్తే ఎవరైనా వీటిని సాదించగలరు. ఎన్నో కంపెనీలు ఈ రకమైన క్వాలిటీస్ ఉన్న అభ్యర్గులకె ఉద్యోగాలు ఇవ్వడం గమనిస్తూనే ఉన్నాం కూడా.  మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి కేవలం ఉద్యోగ సంస్థలలో పనిచేసేవాళ్లకు మాత్రమే కాదు, జీవిత ప్రయాణంలో ప్రతి మనిషి ఉత్తమంగా ఉండేందుకు కూడా అవసరం.  మనం ప్రతిరోజు ఎన్నో పనుల దృష్ట్యా కొత్త వాళ్ళతో మాట్లాడాల్సి రావచ్చు, కొందరిని కాంప్రమైజ్ చేయాల్సి రావచ్చు, అందరి దగ్గరా ఓకేవిధంగా మాట్లాడలేం కదా! అన్ని తెలుసుకుని అడుగేసేవాడు ఉత్తముడని పెద్దల మాట. కాబట్టే మాట్లాడటం అనేది కూడా ఒక కళ అన్నారు. మాటకు మెరుగులు దిద్దేది మనిషి ముఖంలో సన్నని చిరునవ్వు. నవ్వుతూ పలకరించడం అవతలి వ్యక్తిని పర్ఫెక్ట్ గా రిసీవ్ చేసుకోవడమే. అయితే ఇది అన్ని చోట్లా, అన్ని వేళలా పనికిరాదు.  సందర్భాలు, సంఘటనలు, అవతలి వ్యక్తి మూడ్ ని బట్టి మాట్లాడాలి. చాలామంది చేసే పని ఏమిటంటే తమ మూడ్ ని బట్టి మాట్లాడుతుంటారు కానీ అది వంద శాతం తప్పు. మన మూడ్స్ ను ఇతరుల మీద చూపించకూడదు. మాటలో వినయం ఉండాలి. ఎదుటివారు చిన్న వాళ్ళు అయినా పెద్దవాళ్ళు అయినా గౌరవించి మాట్లాడాలి. పిచ్చిపిచ్చిగా దిక్కులు చూస్తూ, గట్టిగా నవ్వుతూ ఎప్పుడూ మాట్లాడకూడదు. సన్నని నవ్వుతో, మాట్లాడేటప్పుడు విషయాన్ని వీలైనంత వరకు సాగతీయకుండా తొందరగా ముగించాలి. ముఖ్యంగా కొత్తవాళ్ళ దగ్గర ఎప్పుడూ పిచ్చాపాటి కబుర్లు చెప్పకూడదు. మరొకరిని తక్కువ చేసి మాట్లాడటం ఎంత తప్పో, అనవసరంగా పనిపెట్టుకుని పొగడటం కూడా అంతే తప్పు.  పార్టీలలో తింటూ తాగుతూ మాట్లాడుకోవడం కామన్. అయితే నోట్లో ఏదైనా ఆహారపదార్థం ఉన్నపుడు, లేదా ఏదైనా తాగుతూ నోట్లో ఉన్నపుడు మాట్లాడకూడదు. దీనివల్ల నోట్లో లాలాజలం ఎదుటివారి మీద పడే అవకాశాలు ఉంటాయి. నోరు కాళీ చేసుకున్నప్పుడు మాత్రమే మాట్లాడాలి. అలాగే పూర్తిగా పళ్ళు ఇకిలించి నవ్వుతూ మాట్లాడకూడదు. సన్నని నవ్వుతో మాట్లాడాలి. అలాగని మరీ చిన్న గొంతుతో మాట్లాడటం వల్ల ఎదుటివారు కాస్త అర్థం చేసుకోవడానికి ఇబ్బంది కావచ్చు. కాబట్టి స్పష్టంగా, మధ్యస్థ గొంతుతో, చెప్పాలనుకునే విషయాన్ని చెప్పాలి. హుందాగా ఉండాలి. అడ్డదిడ్డంగా, వంకర్లు తిరిగిపోతూ మాట్లాడకూడదు. మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తిని మాత్రమే చూస్తూ మాట్లాడాలి. అపుడపుడు తల అటు ఇటు కదిలించినా పర్లేదు కానీ అసలు ఎదుటి వ్యక్తికంటే చుట్టూ పరిసరాలను గమనించుకుంటూ ఉండటానికి ఎక్కువ సమయం కేటాయించకూడదు. అలా చేస్తే ఎదుటి వాళ్ళను అవమానించినట్టు అవుతుంది. ఏదేమైనా మాట్లాడటం కూడా ఒక కళ. దాన్ని ఆచరణలో పెట్టేవాళ్లు నలుగురిని తమవైపు చాలా సులువుగా ఆకట్టుకోగలరు. ◆ వెంకటేష్ పువ్వాడ  

ఎదుటివారిలో ఈ గుణాన్ని గుర్తిస్తున్నారా?

జీవితం చాలా విలువైనది. చాలా అందమైనది. ఇటువంటి విలువైన నీ జీవితం పట్ల సమాజానికి మంచి సదభిప్రాయం వుండాలి. మనం మన వ్యక్తిగత విషయాల పట్ల ఎదుటివారి దృష్టిలో విలువలు సంపాదించాలి. జీవితంలో కష్టసుఖాలు లాభనష్టాలు అల్లుకుపోయి వుంటాయి. వాటిని అందుకుని తీరకతప్పదు. మన జీవితంలో వచ్చిన కష్టనష్టాలకు గల కారణాలను వాస్తవాలను గ్రహించాలి. మనకు వచ్చిన కష్టనష్టాలకు ఇతరులు బాధ్యులు అని వారిని నిందించకూడదు. వారే నీ కష్టాలకు బాధ్యులు అని నీవు వారి పట్ల అంచనా వేయకూడదు. ఒకప్పుడు ఒక వ్యక్తి చాలా సంపన్నుడు. అతనికి చాలా డబ్బు వుండేది. ఆ డబ్బంతా ఏమి చేయాలో అతనికి తోచక తన స్నేహితుడిని ఈ డబ్బంతా ఏమి చేయాలో తెలియడం లేదు. ఏదైనా సలహా ఇవ్వమని కోరతాడు. అప్పుడు ఆ స్నేహితుడు ఒక సలహా ఇస్తాడు. నాకు తెలిసిన ఒక వ్యక్తి కష్టాలలో వున్నాడు. అతనికి నీవు డబ్బులు ఇస్తే అతను తన కష్టాలు తీరిన తరువాత వడ్డీతో సహా నీ డబ్బులు నీకు ఇస్తాడు. నీకు నీ డబ్బు ఇంకా రెట్టింపు అవుతుంది. తరువాత రాబోయే తరాలకు కూడా నీ డబ్బు ఉపయోగపడుతుంది. అని సలహా ఇచ్చి నీవు కూడా ఆలోచించు నేను చెప్పిన సలహా సరి అయినది అని అనిపిస్తేనే నీవు ఈ పని చేయి అని చెబుతాడు.  స్నేహితుడు చెప్పిన సలహా సరైనది అని తన మనసుకు తోచింది. స్నేహితుడు చెప్పినట్లుగా అతను కష్టాల్లో వున్న ఆ వ్యక్తికి డబ్బును ఇచ్చాడు. కొన్ని రోజుల తరువాత స్నేహితుడు చెప్పినట్లుగా ఆ వ్యక్తి ఇతనికి వడ్డీతో సహా డబ్బులను తెచ్చి ఇచ్చాడు. స్నేహితుడు చెప్పినట్లుగా అతనికి డబ్బు రెట్టింపు అయ్యింది. అపుడు అతను స్నేహితుడిని మెచ్చుకుంటాడు. కొన్ని రోజుల తరువాత ఇతనికి బిజినెస్ చేయాలని అనిపించింది. అపుడు మరల స్నేహితుడి సలహాను కోరతాడు. అప్పుడు స్నేహితుడు రొయ్యల బిజినెస్ పెట్టమని సలహా ఇస్తాడు. కొన్ని రోజులు ఆ రొయ్యల బిజినెస్ మంచిలాభం వచ్చింది. ఇలా లాభం రావడానికి కారణం తన స్నేహితుడే అని అతడిని బాగా అభినందించాడు.  తరువాత కొన్ని రోజులకి, ఆ రొయ్యల బిజినెస్ కి సరైన సదుపాయం లేక నష్టం వచ్చింది. ఆ స్నేహితుడు వల్ల అతను చాలా లాభాలు పొందాడు. కానీ నష్టం వచ్చేటప్పటికీ, నా స్నేహితుడు వలన నేను ఈ రొయ్యల బిజినెస్ పెట్టాను. దీనికి కారణం నా స్నేహితుడే అని అతడిని నిందిస్తాడు, అవమానపరుస్తాడు. అప్పుడు ఆ స్నేహితుడు తనకు లాభాలు వచ్చినప్పుడు మెచ్చుకున్నాడు. తనకు నష్టం వచ్చినప్పుడు మరల నన్ను నిందిస్తున్నాడు. ఎప్పుడూ ఈ వ్యక్తికి సలహా ఇవ్వకూడదు. ఇతను డబ్బుకు విలువ ఇస్తున్నాడు. మనిషికి మనిషిగా విలువను ఇవ్వడంలేదు. అని తన మనస్సులో అనుకుని అతని నుండి దూరంగా వెళ్ళిపోయాడు.  ఇప్పుడు అతనికి సలహాలు ఇచ్చే వ్యక్తులు లేరు. నేను నిందించడం వల్లే నా స్నేహితుడు నా నుండి వెళ్ళిపోయాడు అని బాధపడి అతనిలో వున్న చెడు అభిప్రాయాలను తొలగించుకుని మనిషిగా మానవతా విలువలను పెంచుకున్నాడు. ఎప్పుడైనా మనం ఎవరి సలహా అయినా తీసుకున్నప్పుడు ఆ మనిషి చేసిన సహాయాన్ని మరిచిపోకూడదు. అలాగే ఆ మనిషి వలనే నీకు కష్టం వచ్చింది అంటే అందుకు నీవే బాధ్యుడవు. అతని వల్ల పొందిన లాభాన్ని గ్రహించాలి. అతని వల్ల వచ్చిన కష్టాన్ని నిందించకూడదు, మీలోని ఆలోచనా విధానాన్ని గ్రహించాలి, దాన్ని సరిచేసుకోవాలి.  ఎదుటివారు చెప్పారు కదా అని మీరు ఆలోచించకుండా, సరైన నిర్ణయం తీసుకోకుండా వారు చెప్పినట్లుగానే చేసి, అందువల్ల ఏదైనా కష్టం వస్తే వారే బాధ్యులు అని ఎలా నిందించగలరు? మీరే ఆలోచించండి..... మనం మనిషిగా మానవత్వపు విలువలను సంపాదించాలంటే మొదట మనం ఎదుటివారిలో వున్న మంచిని గ్రహించాలి.                                          ◆నిశ్శబ్ద.

ముందు చూపు కావాలి

ఒకానొక సర్వే ప్రకారం విదేశాల్లో ప్రజలు ముఖ్యంగా వృద్ధులు తమ జీవితకాల చివర్లో పిల్లలకు తమ పాత ఇంటిని ఇచ్చి పరమపదిస్తున్నారని, మన భారతదేశంలో మాత్రం దీనికి విరుద్ధంగా జరుగుతుంది. ఒక వ్యక్తి తన జీవితంలో మొదట పెళ్లి కాగానే సేవింగ్స్ మొదలు పెడతాడు, పిల్లలు అవ్వగానే వారి చదువు, ఖర్చులు గట్రా ఆర్థిక విషయాలలో మునిగిపోయి సేవింగ్స్ ను పిల్లల కోసం ఖర్చు చేస్తూ ఉంటారు. ఇంతా చేసాక పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళ పెళ్లి కోసం మళ్ళీ ఖర్చులు అంటారు. ఇవన్నీ అయ్యాక ఓ సొంతింటి గూర్చి ఆలోచిస్తున్నారు. నిజానికి అప్పటికి ఆ వ్యక్తి వయసు అక్షరాలా అయిదు పదులు దాటిపోయి ఆరు పదులకు చేరువగా ఉంటుంది. మిగిలిన జీవితాన్ని ఓ సొంత ఇంట్లో సెటిల్ అయిపోయి మనుమళ్లను, మనుమరాళ్లను చూసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇదంతా కాస్త కలిగిన కుటుంబాలలో మాత్రమే. మరి మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాల్లో సీన్ ఇలాగేమి ఉండదు.  సంపాదన మొదలైన నాటి నుండి ప్రతి రూపాయిని లెక్క గట్టి ఖర్చు చేస్తున్నా మిగులు మాత్రం శూన్యం అనే చెప్పాలి. ఎందుకంటే చదువుతోనే అన్ని సాధ్యం అని నమ్ముతారు కానీ చదువు కూడా జీవితంలో భాగం అని అనుకోరు మనవాళ్ళు. అక్కడే వచ్చింది సమస్య అంతా. చదువు తప్ప ఏమీ తెలియని వాళ్ళు ఎలాంటి ఇతర పనులలో చేరలేక తల్లిదండ్రులకు భారంగా మిగులుతున్న యువతకు మన దేశంలో కొరత లేదని చెప్పవచ్చు.  బాల కార్మిక వ్యవస్థ నేరం కానీ, ఒక వయసు వచ్చాక పని చేయడం అనేది ఎప్పటికి నేరం కాదు. చాలామంది పనిచేస్తూ చదువుకోవడం అనేది ఒక వయసు పిల్లలకు ఆటంకం అని, వారు తమ లక్ష్యాలను చేరుకోలేరని అనుకుంటూ వుంటారు కానీ అలా పనిచేయడమే వారిని లక్ష్యం వైపుకు వెళ్లేలా చేయగలిగే ఉత్ప్రేరకాలు అని తెలుసుకోరు. విదేశాల్లో స్కూల్ విద్య పూర్తయ్యి కాలేజి విద్య మొదలవ్వగానే తమ పాకెట్ మని కోసం సొంతంగా పనిచేస్తూ చదువుకునేవాళ్ళు 90% మంది ఉంటారు. మనదేశంలో కూడా ఇలా పనిచేస్తూ చదువు సాగించినవారు గొప్ప స్థానంలో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. పిల్లలు పుట్టగానే  జీవితమంతా వారికసమే కష్టపడి సంపాదిస్తూ, అంతా పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చుపెడుతూ, పిల్లలు పెద్దయ్యి, తల్లిదండ్రులు ముసలివాళ్ళు అయ్యే సమయానికి వాళ్లకు మిగిలేది కేవలం నెరిసిన జుట్టు, జీవితానుభవం మాత్రమే. ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు వృద్ధులయ్యాక పిల్లల చేత గెంటివేయబడటానికి కారణం 90% ఆర్థిక భారం తగ్గుతుందనే అనే విషయం మరచిపోకూడదు. అలాగే పిల్లలు తల్లిదండ్రులను ఉద్దరిస్తారనే ఆలోచనతో సర్వస్వం వాళ్ళ మీద ఆధారపడకూడదు.  అందుకే పెద్దవాళ్లకు ఒక పద్దు కావాలి. అదేనండి సంపాదన, ఖర్చు, పొదుపు వంటి విషయాల్లో తమకు కాసింత ప్రాధాన్యత ఇచ్చుకోవాలి. అలాగే పిల్లలకు కూసా సంపాదించడం ఎలాగో నేర్పించాలి. చదువు అనేది సంపాదన కోసం అని భ్రమ పడటం మొదట మనేయాలి. ఎందుకంటే గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు ఎలాంటి పెద్ద చదువులు లేకుండానే జీవితాన్ని మొదలుపెట్టిన విషయం ఎవరూ మరచిపోకూడదు.  ఏ ప్రభుత్వ ఉద్యోగస్తులకో రిటైర్ అయ్యాక పెన్షన్ లు వస్తుంటాయి. మిగిలినవాళ్ళం ఎలా?? అనే సందేహం అసలు అక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడున్న ఎన్నో ఇన్సూరెన్స్ కంపెనీలు 60 ఏళ్ళు దాటిన వారికి పెన్షన్ వచ్చేలా ఎన్నో పాలసీలు అందుబాటులో ఉంచుతున్నాయి. సంపాదన ఉన్నపుడు వాటిలో తమకు కాసింత సేవింగ్స్ చేసుకుని, వృద్ధులయ్యాక నెలకు తగిన గౌరవ ప్రధమైన పెన్షన్  తీసుకుంటూ సంతోషంగా వృద్ధాప్యాన్ని కూడా గడిపేయచ్చు.  జీవితంలో చివరికి వచ్చాక బాధపడటం కంటే ముందు జాగ్రత్త ఎంతో అవసరం కదా! దీన్ని జాగ్రత్త అనడం కంటే తమ జీవితానికి తాము భరోసా ఇచ్చుకోవడం అంటే ఇంకా బాగుంటుంది. నిజమేగా మరి! ◆వెంకటేష్ పువ్వాడ

డబ్బు లోకానికి వైద్యం!

ఈ ప్రపంచంలో మనిషి బతకడానికి డబ్బు ఎంతో అవసరం. ఒకప్పటి కాలంలో మనిషి జీవితానికి ఇప్పటి మనిషి జీవితానికి తేడా గమనిస్తే కాలానుక్రమంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. వాటిలో కొన్ని ప్రాధాన్యతలు పెరిగాయి. మరికొన్ని తగ్గిపోయాయి. అలాంటి వాటిలో ప్రథమ స్థానంలో ఉండేది డబ్బు. ఒకప్పుడు డబ్బు మనిషి అవసరం. అంతకు ముందు కాలంలో డబ్బు అనేది అంతగా అవసరం లేకుండా ఉండేది. అన్నీ వస్తుమార్పిడి ద్వారా జరిగిపోయేవి. ఆ తరువాత కొన్నిటి విలువ పెరుగుతూ  ఉన్నప్పుడు, చాలా వస్తువులు అరుదుగా మారిపోయినప్పుడు వాటిని డబ్బుకు అమ్మడం ఆ డబ్బుతో అవసరం అయిన వేరేవి కనుక్కోవడం చేసేవారు. ఆ డబ్బును క్రమంగా పొదుపు చేయడం మొదలుపెట్టాకా వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతుండగా డబ్బు ప్రాముఖ్యత పెరుగుతూ వచ్చింది. అలా మొదలైన డబ్బు ప్రస్థానం నేడు డబ్బే లోకంగా బతుకుతున్న మనుషులను తయారుచేసింది. డబ్బుకు లోకం దాసోహం అన్నా, డబ్బెవరికి చేదు అన్నా అదంతా డబ్బును మనుషులు చూస్తున్న కోణం ఆధారంగా చెప్పిందే. అసలు ఎందుకింత ప్రాధాన్యత! మనుషులు కరెన్సీ కాగితాలలో తమ జీవితాలను మెరుగ్గా చూసుకోవడం మొదలుపెట్టాకా ఆ కాగితాల హవా పెరిగిపోయింది. క్రమంగా మనిషి కష్టాన్ని కూడా ఆ కాగితాలు శాసించే స్థాయికి చేరాయి. ఫలితంగా  శ్రమదోపిడి వ్యవస్థ అంతకంతకూ పెరుగుతూ పోయింది. ఇక ప్రస్తుతం గురించి చెబితే కాగితాల వల్లనే మర్యాద, గౌరవం కూడా పొందుతున్న వాళ్ళు, ఆ డబ్బు వల్లనే గౌరవం, మర్యాద ఇస్తున్నవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఫలితంగా డబ్బు చుట్టూ లోకం తిరుగుతూ ఉంది,  చేస్తున్న తప్పులు? మనుషులు ఒక తప్పుకు అలవాటు పడిపోయారు. అదేంటంటే మనిషిలో ఆలోచనను విజ్ఞానాన్ని పెంపొందించే విద్యను ఆదాయవనరుగా మార్చడం ఒకటైతే, ఆ చదువుతోనే డబ్బు సంపాదన సాధ్యం అనుకునే ఆలోచన కూడా మరొకటి. నిజానికి పెరుగుతున్న అభివృద్ధి దృష్ట్యా మనిషి ఎన్నో రకాల రంగాలలో ఎన్నో విధాలైన శిక్షణలు తీసుకోవడం వల్ల ఆయా రంగాలలో అవకాశాలు పొందగలుగుతున్నారు. అయితే ఎటు తిరిగి దాన్ని వృత్తిగా కాకుండా మనిషి జీవితాలకూ, ముఖ్యంగా మానసిక బంధాలను కూడా డబ్బుతో పోల్చి చూడటం మాత్రం ఎంతో దారుణమైన విషయం. ఇప్పటి కాలంలో అక్క, చెల్లి, తమ్ముడు, అమ్మ, నాన్న  ఇలాంటి రక్తసంబంధాలు కూడా డబ్బు ముందు వెలసిపోతున్నాయంటే అది డబ్బు తప్పు కాదు మనిషి తప్పు అని అందరికీ తెలుసు.  మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి అని చెప్పే కొందరు కూడా ఆ డబ్బు ఉన్నపుడు ఒకలా అది లేనప్పుడు మరొకలా ఉండటం చూస్తే నవ్వొస్తుంది కూడా. సుమతీ శతకకర్త బద్దెన అంటాడు…. సిరి దా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరి దా బోయిన బోవును కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ!! సిరి అంటే డబ్బు. ఆ లక్ష్మీదేవి స్వరూపంగా చూస్తాం. ఆ డబ్బు కొబ్బరికాయలో నీళ్లు వచ్చి చేరినట్టు ఎంతో నిశ్శబ్దంగా వస్తుంది. ఆ తరువాత ఏనుగు వెలగపండు నోట్లో వేసుకుని లోపలి గుజ్జు ఎలా మాయం చేస్తుందో అలాగే డబ్బు కూడా వెళ్ళిపోతుంది.  డబ్బు వచ్చేవరకు ఎవరికీ ఎలాంటి ఆర్భాటాలు ఉండవు. కానీ ఆ డబ్బు చప్పుడు అవ్వగానే బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టే అవుతుంది పరిస్థితి. ఆ తరువాత డబ్బు అయిపోయాక కాళీ వెలగపండులా ఏమిలేకుండా అయిపోతుంది పరిస్థితి. మరి అలా వచ్చి మనిషిని వ్యామోహాలకు లోను చేసి ఆ తరువాత విసిరేసినట్టు చేసే డబ్బుకు మనుషులు ఇంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరమా?? అని ఆలోచిస్తే తమ పిల్లలకు డబ్బే లోకం కాదు ఈ లోకం ఎంతో ఉంది అని అనుభవపూర్వకంగా తెలియజేప్తు ఉంటే కుటుంబాలు బాగుంటాయి. డబ్బుకు కూడా విలువ ఇచ్చినట్టే.  నిజం!! డబ్బును ఆశించడం తప్పు కాదు కానీ, దాన్ని ఎలా వాడాలో అలా వాడుకున్న వాడికి ఆ డబ్బు కూడా  తన పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తూ ఉంటుంది. ◆ వెంకటేష్ పువ్వాడ.

జీవితంలో విజయం సాధించాలంటే విదురుడు చెప్పిన ఐదు నియమాలు ఇవే..!

మహాభారతంలో విదురుడు చాలా గొప్పవాడు.  ఆయన బుద్ది, తీక్షణత, ఆయన చెప్పిన నీతి  ప్రతి వ్యక్తి జీవితానికి గొప్ప మార్గనిర్దేశాన్ని ఇవ్వగలవు.  జీవితంలో ఎన్నో కఠినమైన సమస్యలను పరిష్కరించగలవు.  ఒక రాజుకు ఉండాల్సిన అన్ని యోగ్యతలున్నా విదురుడు రాజు కాలేకపోయాడు. మంత్రిగా, అన్నింటికి మించి శాస్త్రాలను,  నియమాలను, విలువలను ఒడిసిపట్టిన, వాటిని ఇతరులకు ఎలాంటి పక్షపాతం లేకుండా బోధించినవాడు విదురుడే.. విదురుడు చెప్పిన ఐదు నియమాలు పాటిస్తే జీవితంలో విజయానికి ఢోకా ఉండదు.. అవేంటో తెలుసుకుంటే.. మతాన్ని ఉల్లంగించే పనిని, శత్రువు ముందు తల వంచడం లాంటి పనిని ఎప్పుడూ చేయకూడదు. మరీ ముఖ్యంగా డబ్బు సంపాదించడం కోసం ఈ పనులను ఎప్పుడూ  చేయకూడదని విదురుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. ఇతరులను ద్వేషించేవాడు, కోపంగా ఉండేవాడు  తన జీవితం పట్ల ఎప్పుడూ  అసంతృప్తిగా ఉంటాడు.  ఎల్లప్పుడూ సందేహాస్పదంగా ఉంటాడు. అలాంటి వ్యక్తి జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండలేడు. అందువల్ల ఈ చెడు అలవాట్లను వీలైనంత త్వరగా వదిలివేయాలి. ఇతరులను  గౌరవించడం,  తిరిగి గౌరవాన్ని  పొందడంలో ఉత్సాహంగా లేని వ్యక్తి ఏ విషయాన్ని అంగీకరించేందుకు సుముఖంగా ఉండడు. అదే విధంగా అన్ని విషయాలలో  చాలా కోపంగా ఉంటాడు.  కానీ ఇతరులను గౌరవించడం, తను తిరిగి గౌరవాన్ని పొందే వ్యక్తి గంగానదిలా ప్రశాంతంగా ఉంటాడు. ఇతడినే విదురుడు  జ్ఞానవంతుడు అని నిర్వచించాడు. జ్ఞానవంతుల మాదిరిగానే విదురుడు మూర్ఖుల గురించి కూడా తన నిర్వచనం ఇచ్చాడు. ఇతరులు ఆహ్వానించకుండా లోపలికి వెళ్లేవాడు, అడగకుండానే మాట్లాడేవాడు మూర్ఖుడని, అతను నమ్మదగినవాడు కాదని కూడా విదురుడు చెప్పాడు. ఇలాంటివారు పెద్ద మూర్ఖులని పేర్కొన్నాడు. మోహము, క్రోధము, లోభము అనే మూడు విషయాలు  ఒక వ్యక్తికి నరకంతో కూడిన  బాధను  కలిగిస్తాయి. అంతేకాకుండా  ఇవి మూడు  వ్యక్తి నాశనానికి కూడా కారణం కావచ్చు. అందువల్ల, వీలైనంత వరకు ఈ మూడింటికి దూరంగా ఉండాలి.                       *నిశ్శబ్ద.  

ప్రపంచానికి పరిచయమైన ఓ కొత్త పాత్ర బార్బీ..!

పిల్లలకు బొమ్మలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా భారతదేశంలో బొమ్మల సాంప్రదాయం,  వాటి ఉనికి ఈనాటిదేం కాదు. దసరా పండుగలో బొమ్మల కొలువు ఒక ఎత్తైతే.. పిల్లలకు గొప్ప కాలక్షేపంగా బొమ్మల హవా అంతా ఇంతా కాదు. అయితే.. బొమ్మల  విషయంలో ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపినది మాత్రం బార్బీ డాల్  అని సందేహం లేకుండా చెప్పవచ్చు. సాధారణ బొమ్మలు ఎన్నున్నా సరే.. బార్బీ డాల్ ఎవరిదగ్గరైనా ఉందంటే ఆ గొప్పదనమే వేరు. ప్రతి ఆవిష్కరణ వెనుకా ఓ  కథ, కాసింత చరిత్ర  ఉన్నట్టు బార్బీ డాల్ పుట్టుక వెనుక కూడా చరిత్రలో కొన్ని  పేజీలున్నాయి. అందులో ఉన్న విషయమేంటో తెలుసుకుంటే.. ఆడపిల్లల దగ్గర బొమ్మలంటూ ఉంటే వారిదగ్గర ఖచ్చితంగా బార్బీ డాల్ ఉంటుంది.  అయితే ఈ బార్బీ డాల్ చరిత్ర మాత్రం చాలా  ఆసక్తికరమైంది.  రూత్ హ్యాండ్లర్  బార్బీని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆడవారికే ఈర్ష్య పుట్టేలా, అందరినీ ఆకర్షించేలా బార్బీ డాల్ రూపుగదిద్దుకుంది. పొడవాటి కాళ్లు, చేతులు, ఇట్టే ఆకర్షించే కళ్లు, ఒత్తేన జుట్టు.. ఇలా ఒక ప్రత్యేకమైన జర్మన్ బొమ్మను మొదటిసారి రూత్ హ్యాండ్లర్ చూశారు. దీన్ని చూసిన తరువాత దాన్ని ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాలనే ఆలోచన పుట్టింది. అలాగే కేవలం బార్బీని  మాత్రమే కాకుండా 1961లో బార్బీకి జోడీగా  కేన్ అనే ఒక బాయ్ ఫ్రేండ్ ను కూడా ప్రపంచానికి పరిచయం చేశారు.  బార్బీని ప్రపంచానికి పరిచయం చేశాక పిల్లల నుండి యువతుల వరకు ప్రతి ఒక్కరికీ బార్బీ వ్యక్తిగత స్నేహితురాలిగా మారిపోయింది.  ప్రతి ఒక్కరి దగ్గరగా బార్బీ తమతో ఉంటే బాగుండనే కోరిక కూడా బలపడింది.  ఇలా సంవత్సరాలుగా బార్బీ డాల్ ప్రజల మనసులను తన చుట్టూ తిప్పుకుంటోంది.  కాలంతో పాటూ బార్బీ కూడా కొత్తకొత్తగా తన రూపాలు మార్చుకుంది. రంగురంగుల దుస్తులు, వాటిని తలదన్నే జుట్టు, బోలెడు అలంకరణ వస్తువులతో మరెంతో కొత్తగా, అద్బుతంగా ముస్తాబై ప్రపంచం మీద తనకంటూ ఓ స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకుంది. ఈ ప్రత్యేకతకు గుర్తుగానే బార్బీ డాల్ ప్రపంచానికి పరిచయం అయిన రోజు గుర్తుగా ప్రతి ఏడాది మార్చి 9వ తేదీన నేషనల్ బార్బీ డాల్ డే ని జరుపుకుంటున్నారు. ఇది విదేశాల నుండి పరిచయం అయినదైనా భారతీయులకు కూడా ఎంతో దగ్గరైన బొమ్మ. భారతీయ సంస్కృతిని కూడా ఇముడ్చుకుని పిల్లలు, పెద్దలలో భాగమైపోయింది.  ఇక ఈ బార్బీ డే ప్రత్యేకంగా పిల్లలు ఈరోజున బార్బీ డాల్ ను బహుమతిగా ఇవ్వొచ్చు. పిల్లలకు బార్బీ డాల్ చరిత్రను వివరించి చెప్పవచ్చు. కేవలం ఒక బొమ్మగా పరిచయమైన బార్బీ ప్రపంచానికి ఎంత స్పెషలో తెలియజెప్పి  వినూత్న ఆలోచనలు, సృజనాత్మకత ప్రపంచాన్ని కొత్తగా ఎలా మారుస్తాయో ఉదాహరణగా బార్బీని వారికి పరిచయం చెయ్యవచ్చు.                          *నిశ్శబ్ద.  

నేటి యువత తెలుసుకోవలసిన ముఖ్య విషయమిదే!

శాంతి సమాజ సౌధానికి పునాదిరాళ్ళు నేటి యువతీ యువకులే! అలాంటి యువతరం నేడు మానసిక ఉద్రేకాలకు లోనై హింసా ప్రవృత్తి మార్గాన్ని అనుసరించడం బాధాకరం! ఈ రోజు సమాజంలో పాశ్చాత్య పోకడలు, భౌతిక ఆకర్షణలతో పాటు మరెన్నో పరిస్థితులు యువతను దారుణాలకు ఉసిగొల్పుతున్నాయి. ఇదే భావనతో కురుక్షేత్ర సమరంలో అర్జునుడు...  అథ కేన ప్రయుక్తో యం పాపం చరతి పూరుషః | అనిచ్ఛన్నపి వార్డేయ బలాదివ నియోజితః ॥  'పరమాత్మా! మానవుడు పాపమాచరించేందుకు అసలు హేతువేమిటి? ఇష్టం లేకున్నా కూడా మనుష్యులు ఎవరో బలవంతంగా ప్రోత్సహించినట్లు పాపం ఎందుకు చేస్తున్నారు? పాపాచరణకు కారణం బాహ్యమా? ఆంతరంగికమా? అని శ్రీకృష్ణభగవానుడిని ప్రశ్నిస్తాడు అర్జునుడు. దీనికి సార్వకాలికమైన, సార్వజనికమైన విశ్లేషణతో ఆ జగదేకనాయకుడు అద్భుతమైన వివరణనిస్తాడు. రజోగుణం నుంచి పుట్టిన కోరిక, అది తీరనప్పుడు కలిగే క్రోధమే పాపం చేయటానికి ప్రధాన కారణాలని స్పష్టం చేస్తాడు భగవానుడు. ఈ రోజు కూడా మనం పరిశీలిస్తే 'తీరని కోరికలు; తీరకపోతే కలిగే కోపాలే' యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ రెండింటి వలన కలిగే పరిణామాలు, మనిషిని రాక్షసుడిగా మార్చేస్తున్నాయి. అందుకే మన సనాతన ధర్మం మనిషిలోనే ఉండి, మనిషికి శత్రువుగా మారి అతనిని నేరప్రవృత్తి వైపునకు మరలించే ఆరుగుణాలను 'షడ్-రిపు'గా అభివర్ణించాయి. అవి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు! ఇవన్నీ మానవుడు పుట్టినప్పటి నుంచీ మనస్సును ఆవరించి అల్లకల్లోల పరుస్తున్నా, వాటి నుంచి బయటపడే మార్గాన్ని కూడా మన సనాతన ధర్మంలో విపులంగా సూచించారు. మనిషి తలచుకుంటే ఈ కామక్రోధాలను తన అదుపులో పెట్టుకోగలడు. ఇతర జీవజాతులకు ఆ అవకాశమే లేదు.  దురదృష్టవశాత్తూ ఆధునిక నాగరకతలో యువతీయువకులు మనస్సుకు ఈ రకమైన శిక్షణనివ్వటంలో ఘోరంగా విఫలమవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కింది నాలుగు అంశాల్లో తమ మానసిక సమతౌల్యాన్ని కోల్పోవటం వల్లే యథేచ్ఛగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎంతటి నేరాలకైనా ఒడిగడుతున్నారు. అవి... మానసిక ఉద్వేగం (emotionality)  క్రియాశీలత (activity) ప్రచోదనం (impulsivity) సాంఘికంగా సర్దుబాటు (sociability)  ఒక కోరికవైపు మనస్సు మొగ్గుచూపగానే వెంటనే అది 'ఎమోషనల్' అయిపోతోంది. దానిని ఎలాగైనా తీర్చుకోవాలన్న తపన పెరుగుతోంది. ఈ సమయంలోనే ఆ కోరిక సక్రమమైందా? కాదా? అని ఒకటికి పదిసార్లు ప్రశ్నించుకోవాలి. తరువాతే మన క్రియాశీల, ప్రచోదక శక్తులను వినియోగించుకోవాలి. అప్పుడే మనస్సు సరైన దిశలో పయనించటం అలవరచుకుంటుంది. లేనట్లయితే, కనిపించిన ప్రతి కోరికనూ మనస్సు తీర్చుకోమంటుంది. ప్రలోభాలతో ప్రమాదంలోకి పడవేస్తుంది. ముఖ్యంగా మన నడవడిక, కామ, క్రోధాలు సమాజంపై ఏ విధమైన ప్రభావాన్ని చూపుతాయో ఆలోచించుకోవాలి.  పుట్టే  ప్రతి కోరికను తీర్చుకుంటూ దాన్ని సంతృప్తిపరచాలని ప్రయత్నించటాన్ని మించిన అమాయకత్వం మరోటి లేదు. అవి ఎంత తీర్చితే, అంతకు వందరెట్లు ఆవురావురుమంటూ వెంట పడతాయి. చివరకు మన పతనానికే కారణమవుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే విశృంఖల ఇంద్రియవాంఛలే (unrestrained sensual desires) సభ్యసమాజంలో నేరధోరణికి ప్రధాన కారణం. అందుకే ఎక్కడో ఒక దగ్గర వాటికి భరతవాక్యం పలకాలి. అందుకే భగవద్గీతలాంటి ధార్మిక సారస్వతం 'వాంఛలను అణచుకోమని' చెప్పటం లేదు. వాటిని అధిగమించి ఉన్నతమైన అంశాలపైకి మనస్సును తీసుకువెళ్ళమంటోంది.                                     ◆నిశ్శబ్ద.

ప్రపంచం మీద మహిళల పతాకం.. మహిళా దినోత్సవం!

మహిళ లేకపోతే ఈ భూమి మీద ప్రాణిని నవమాసాలు మోసి  కనే మార్గం లేదు. ఆడవారికే ప్రత్యేకతను తీసుకొచ్చే అంశం ఇది. ఈ సృష్టిలో ఆడ, మగ అంటూ రెండు వర్గాలున్నా.. ఏ వర్గానికి ఆ వర్గం ప్రత్యేకం. కానీ పితృస్వామ్య వ్యవస్థ కలిగిన భారతదేశంలో తరతరాలుగా స్త్రీని ఒక శ్రామికురాలిగా చూస్తున్నారు. ఆడది అంటే భర్తకు సేవ చేయడం, పిల్లల్ని కనడం, ఇంటి పనులు చేయడం, భర్తకు కోపం వచ్చినప్పుడు ఆ కోపం తీరడానికి తనొక మార్గమన్నట్టు, భర్తకు శారీరక అవసరం తీర్చే వస్తువు అయినట్టు ఇలా మహిళను ఎంతో దారుణంగా చూసేవారు. దీన్ని అధిగమించి మహిళలు ఈ ప్రపంచంలో తమకంటూ గుర్తింపు కోసం ఎంతో పోరాటం చేశారు. దీని ఫలితమే మహిళా దినోత్సవం.  ప్రతి సంవత్సరం, మార్చి నెల మహిళల చరిత్రను ఈ ప్రపంచమంతా గొంతువిప్పి చెబుతుంది. ఈ చరిత్ర  సమకాలీన సమాజంలోని సంఘటనలను మహిళల సహకారాన్ని అందరికీ తెలుపుతుంది.  మార్చి 8న ప్రజలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజున వివిధ రంగాలలో మహిళలు సాధించిన సాంస్కృతిక, రాజకీయ, సామాజిక - ఆర్థిక విజయాలను గురించి ప్రపంచానికి పరిచయం చేస్తుంది.   పక్షపాతం, వివక్ష లేని లింగ-సమాన ప్రపంచం కోసం మహిళా దినోత్సవం  పిలుపునిస్తుంది.  ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఒక్కో థీమ్ ను ఏర్పాటు చేస్తారు. ఈ ఏడాది థీమ్ ఎంబ్రేస్ ఈక్విటీ లేదా #ఎంబ్రేస్ ఈక్విటీ. "ఈక్విటీ అనేది కేవలం మాటల్లో కాదు, అది మహిళల జీవితాల్లో తప్పనిసరిగా ఉండాలి. లింగ సమానత్వం సమాజంలో భాగం కావాలి. IWD 2023 #EmbraceEquity ప్రకారం 'సమాన అవకాశాలు ఎందుకు సరిపోవు' అనే విషయం  గురించి ప్రపంచం మొత్తం మాట్లాడేలా చేయడమే ముఖ్య ఉద్దేశం. మహిళా దినోత్సవ చరిత్ర.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మొదట ఉత్తర అమెరికా మరియు ఐరోపాలో జరుపుకునేవారు.  ఐక్యరాజ్యసమితి పేర్కొన్న విషయాలు పరిశీలిస్తే.. "మొదటి జాతీయ మహిళా దినోత్సవం ఫిబ్రవరి 28, 1909న యునైటెడ్ స్టేట్స్‌లో నిర్వహించబడింది.  దీనిని సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా 1908లో న్యూయార్క్‌లో గార్మెంట్ కార్మికుల సమ్మె గౌరవార్థం అంకితం చేసింది.  మహిళలు కఠినమైన పని, అక్కడి పరిస్థితులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. 1917లో, రష్యాలోని మహిళలు ఫిబ్రవరిలో చివరి ఆదివారం (గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి 8న) "బ్రెడ్ అండ్ పీస్" నినాదంతో నిరసన, సమ్మెను చేశారు. వారి ఉద్యమం చివరికి రష్యాలో మహిళల ఓటుహక్కు చట్టానికి దారితీసింది. 1945లో ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన చట్టం స్త్రీ పురుషుల మధ్య సమానత్వాన్ని  ధృవీకరించే మొదటి అంతర్జాతీయ ఒప్పందంగా ప్రకటించింది, అయితే 1975లో అంతర్జాతీయ మహిళా సంవత్సరంలో మార్చి 8న మాత్రమే ఐక్యరాజ్యసమితి మొదటిసారిగా అధికారికంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంది. తరువాత డిసెంబర్ 1977లో, జనరల్ అసెంబ్లీ మహిళా హక్కులు, అంతర్జాతీయ శాంతి కోసం మహిళా దినోత్సవాన్ని సభ్యదేశాలు సంవత్సరంలో ఏ రోజునైనా పాటించాలని ఒక తీర్మానాన్ని ఆమోదించింది. చివరగా, 1977లోనే ఐక్యరాజ్యసమితి దీనిని ఆమోదించిన తరువాత, అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న మహిళా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవాలని ఆమోదించింది. ఇలా పలు మార్పులు చెందుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రూపుదిద్దుకుంది. మహిళా దినోత్సవం కేవలం సంవత్సరంలో ఒకసారి జరుపుకునే ముచ్చటగా, కేవలం ఆరోజు మాత్రమే మహిళలను గౌరవించే సందర్భంగా కాకుండా ప్రతిరోజూ మహిళకు తగిన గౌరవం, మహిళల పనికి తగిన గుర్తింపు కల్పించడం ఎంతో ముఖ్యం. మీ ఇంటి ఆడవారిని మీరు గౌరవించడం మొదలుపెడితే సమాజం ఆడవారిని గౌరవిస్తుంది. అలా ఒక బాధ్యతాయుతమైన ప్రపంచం ఆడవారి చుట్టూ పెనవేసుకుపోతుంది. ఈ ప్రపంచమంతా ఆడవారి సంకల్పశక్తి అనే పతాకం రెపరెపలాడుతుంది. మగవాడి విజయం వెనుక ఆడది ఉన్నట్టే.. ఆడదాని విజయం వెనుక మగవారి అర్థం చేసుకునే మనసు ఉండటం ప్రధానం. సమకాలీన ప్రపంచంలో ప్రతి మహిళ జీవితం యుద్ధమే.. అలాంటి మహిళలకు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలకు అండగా నిలబడే పురుషులకు ఆనందోత్సవ శుభాకాంక్షలు.. మీ ఆడవారి విజయం మీకు ఆనందమేగా..                                       ◆నిశ్శబ్ద.

నమ్మకం ఎందుకు ముఖ్యం?

మనిషి జీవితంలో నమ్మకమనేది ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చాలా విషయాలు నమ్మకంతో ముడిపడి ఉంటాయి. అయితే జీవితంలో లక్ష్యాలు సాధించే క్రమంలో నమ్మకం ఎందుకు అవసరం?అది ఎంత వరకు ముఖ్యం? దాని పాత్ర ఏమిటి? నమ్మకం అనేది మనమీద మనతో ప్రారంభం కావాలి. మనం చేసే పనులపై మనకు నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటే కొండల్ని సైతం పిండి చేయవచ్చు. మనం చేసే పనిపై పూర్తి నమ్మకం, శ్రమ, ఆలోచన అనేవి లేకుండా విజయాల్ని సాధించలేము. ప్రతి ఒక్కరు వారు చేసే పని చిన్నదైనా, పెద్దదైనా పరిపూర్ణతకోసం తపించాలి. ప్రతికష్టంలోనూ ఆనందం ఉంటుంది. ఉదాహరణకు నవమాసాలు మోసి ప్రసవవేదన తరువాత పుట్టిన బిడ్డను చూసి ఆ తల్లి ఎంతో ఆనందపడుతుంది. తన కష్టాన్ని బాధల్ని పూర్తిగా మరచిపోతుంది. అదేవిధంగా ఏ పనిచెయ్యడానికైనా కష్టం తరువాత ఆనందం వస్తుందనే నమ్మకాన్ని కలిగి ఉంటే మనం మన జీవితంలో దేనినైనా జయించవచ్చు. నమ్మకం అనేది లేకపోతే మనం ఏ పనిని ప్రారంభించలేము. విజయాల్ని సాధించలేము. చీకటి వెనకాల వెలుగు ఎలాగైతే వుంటుందో అలాగే కష్టం వెనకాల ఆనందం, ఫలితం ఉంటాయని తెలుసుకోవాలి. మనకు ఇష్టమైన పనిని ఎంత కష్టమైనా చేయగలం కాబట్టి మనకి ఇష్టమైన రంగాన్ని ఎంచుకోవాలి. ఏ పని చేస్తున్నా దానిలోని కష్టాన్ని, నష్టాన్ని కాక దానివల్ల లభించే ఫలితాలను గురించి ఆలోచించాలి. ఎప్పుడైతే కష్టం, నష్టం గురించి ఆలోచిస్తామో అప్పుడే మనసు నిరాశలోకి జారుకుంటుంది. అదే మనిషిని లక్ష్యం నుండి వెనక్కి లాగుతుంది. కానీ అవేవి పట్టించుకోకుండా నమ్మకంతో పనిచేస్తే రాబోయే ఫలితం యొక్క ఆనందం కష్టాన్ని మరిపిస్తుంది. నేటికష్టం రేపటి ఆనందానికి పెట్టుబడి. అవుతుంది. సాధించగలమనే నమ్మకం ఉన్నప్పుడే ఆనందంగా కష్టపడగలం. సరైన ఆలోచనా విధానం కలిగి ఉండటం ప్రధానం మరి!! "ఏ లక్ష్యం లేకుండా తింటూ జీవించడం కంటే ఏదో ఒక లక్ష్యం కోసం చనిపోయినా ఫర్వాలేదు" అన్నారు ప్రముఖ కార్ల కంపెనీ తయారుదారు హెన్రీఫోర్ట్.  మనిషి తలచుకుంటే ఏ పని అయినా చెయ్యగలడు. అదేవిధంగా ఒక పనిని చెయ్యలేము అనుకుంటే ఆ పనిని ఎప్పటికీ చేయలేము. ఈ మాటలలో వైరుధ్యం ఏమీ లేదు. చెయ్యగలము, చెయ్య లేము రెండూ కరక్టే. ఒక లక్ష్యంతో విజయం సాధించిన వారు విజయం సాధించడానికి కారణం తాము అనుకున్న పనిని చేయగలమనే నమ్మకం, విశ్వాసం కలిగి వుండటమే! లక్ష్యాన్ని చేరుకోవటంలో విఫలం కావడానికి కారణం వారిలో విజయం సాధిస్తామనే నమ్మకం లేకపోవడమే తప్ప వారిలో సమర్ధత లేకపోవడం కాదు.చాలామంది  అంటారు మేము కష్టపడ్డాము అని, మేము ప్రయత్నం చేసాము అని. కానీ నిజానికి ప్రయత్నం చేయడంలో, కష్టపడటంలో కాదు మనం గెలవగలమో లేదో, సాధించగలమో లేదో అనే భావాన్ని మనసులో ఏ మూలనో ఉంచుకోవడం వల్ల విఫలం అవుతుంటారు. మనమీద మనకు నమ్మకం ఉండాలి. మనని మనమే నమ్మకపోతే ఇతరులు మనల్ని ఎందుకు నమ్ముతారు? అందుకే మనని మనం పూర్తిగా పరిపూర్ణంగా నమ్మాలి. జీవితంలో నమ్మకమనేది ఉంటే ఏదైనా సాధించగలం. మనం చేసే ప్రతిపనిలో నమ్మకమనేది ఉండాలి. నమ్మకమనేది వుంటే విజయాల్ని మనం సొంతం చేసుకోవచ్చు. నమ్మకం వెంటే విజయాలు వుంటాయి. నమ్మకం కలిగి ఉండటమే మన తొలి విజయం. ఇది నమ్మండి.                                          ◆నిశ్శబ్ద.

నేటి యువత రేపటి సూత్రధారి!

ఈ ప్రపంచంలో రేపు ఎలా ఉంటుంది అనేది యువత మీదనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే యువతలో ఉత్సాహం, వారి ఆలోచనలు, వారి ప్రణాళికలే రేపటిని గొప్పగా ఉంచాలన్నా, అధఃపాతాళంలోకి నెట్టివేయలన్నా మూలకారణం అవుతాయి.  నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు, నేటి యువత రేపటిని నడిపించే బాధ్యతాయుత సూత్రధారులు  అవుతారు. ప్రపంచం మొత్తం మీద జనాభాలో యువత శాతం ఎక్కువగా ఉంటుంది. అయితే యువత ఈ ప్రపంచంలో ఎదుర్కొంటున్న సమస్యలు చాలానే ఉన్నాయి. వాటిలో నిరుద్యోగం ఎంతో ముఖ్యమైనది. డిగ్రీ పట్టాలు చేతిలో ఉన్నా, ఉన్నత విద్యలు చదివినా ఉద్యోగ అవకాశాలు సరైనవిధంగా లేక మిగిలిపోతున్న యువత ఎందరో ఉన్నారు. అయితే యువతకు సరైన మార్గం చూపేందుకు ఈ ప్రపంచం కూడా కృషి చేస్తోంది. అంతర్జాతీయ యువ దినోత్సవ కర్తవ్యం అదే. తేడా!! చాలామంది యువ దినోత్సవం అని వినగానే అది వివకానందుడి జన్మదిన సందర్భంగా నిర్వహించుకునే జాతీయ యువజన దినోత్సవం అని అనుకుంటారు. అయితే జాతీయ యువజన దినోత్సవానికి, అంతర్జాతీయ యువ దినోత్సవానికి మధ్య బేధాన్ని గుర్తించడం అవసరం. అంతర్జాతీయ యువ దినోత్సవం!! ఈ ప్రపంచంలో ఉన్న యువతకు సరైన మార్గనిర్దేశకత్వం  అవసరమని, వారికి సరైన సలహాలు, సూచనలు దొరికితే ఈ ప్రపంచాన్ని ఎంతో అభివృద్ధి చేస్తారని ప్రపంచదేశాల అభిప్రాయం. దానికి అనుగుణంగానే 1999లో 54/120 అనుసరణ ద్వారా ప్రతి సంవత్సరం ఆగస్టు 12 న అంతర్జాతీయ యువ దినోత్సవం జరుపుకోవాలని తీర్మానించారు. కార్యక్రమాలు!! ప్రతి రోజుకూ ఒక ప్రత్యేకత ఉన్నట్టు, ఆ ప్రత్యేకమైన రోజు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం సహజం. అంతర్జాతీయ యువ దినోత్సవం రోజున యువతకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచనలు చేయడం, ఆచరణ విషయంలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలు, వాటిని అధిగమించేందుకు పరిష్కారాలు, యువత తమ ఆలోచనలను, నైపుణ్యాలను పెంచుకునేందుకు అవగాహన కల్పించడం. ప్రపంచ అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేయడం, వర్క్ షాపులు, సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు ఏర్పాటు చేసి యువతలో ఉన్న నైపుణ్యాలు బయటకు తీయడం చేస్తారు. యువత కోసం కొన్ని మాటలు!! స్వేచ్ఛ అనేది అడగాల్సినది కాదు అది ఎవరికి వారు తీసుకునేది అంటారు సుభాష్ చంద్రబోస్. యువతకు లభించే స్వేచ్ఛ వారిని అభివృద్ధి చేసేదిగా ఉండాలి. ఆ అభివృద్ధి దేశాన్ని కూడా ముందుకు నడిపించగలగాలి. యువతలో ఉండే విభిన్న ఆలోచనలను నిరుత్సాహ పరచకుండా వారిని ప్రోత్సహించాలి. యువత గట్టిగా ఏదైనా నమ్మితే దాన్ని సాధించే ఆవేశం, కసి, పట్టుదల వారిలో ఉంటాయి కాబట్టి సాధించగలరు. కావాల్సిందల్లా వారిని ప్రోత్సహించడమే. భారంగా మారిన నాలుగు మేఘాలు ఆకాశంలో పక్కపక్కనే చేరితే కుండపోతగా వర్షం ఎలా కురుస్తుందో, మెండైన ఆలోచనలు కలిగిన యువకులు ఒకచోట చేరితే ఎంతో గొప్ప ఆలోచనలు కలుగుతాయి. ఎన్నో గొప్ప అద్బుతాలు ఈ ప్రపంచానికి పరిచయం అవుతాయి.  చట్టపరంగానూ, సమాజికంగానూ, ఆర్థిక, కుల, మత బేధాలతో ఎన్నో అవకాశాలు అందుకోలేకపోతున్న యువతకు తెలియాల్సిన విషయం ఒకటుంది. తమ ప్రతిభే తమా భవిష్యత్తుకు, తమ జీవితానికి పెట్టుబడి అనే విషయం గ్రహించడం. కాబట్టి యువత తమ జీవితాన్ని దురదృష్టం పేరుతోనో, నమ్మకాల పేరుతోనో, సోమరితనంతోనో, ఇంకా అవకాశాలు లేవని చెబుతూనో చేజార్చుకోకుండా అవకాశాలను సృష్టించుకుంటే అది యువత శక్తి అవుతుంది.                                     ◆ నిశ్శబ్ద.