నాలుగు కొవ్వొత్తులు..

అది ఒక చీకటి గది. చీకటంటే అలాంటి ఇలాంటి చీకటి కాదు... చిమ్మ చీకటి. బయట ఉన్న కిటికీలలోంచి కూడా కారు నలుపు రంగు తప్ప మరేమీ కనిపించడం లేదు. అలాంటి గదిలోకి ఓ కుర్రవాడు ప్రవేశించాడు. తడుముకుంటూ తడుముకుంటూ ఓ నాలుగు కొవ్వొత్తులను పోగేసి వెలిగించాడు. కాసేపు ఆ కాంతిలో ఏదో చదువుకున్నాడు. ఇంకాసేపు ఏదో రాసుకున్నాడు. చివరికి అలా చల్లగాలి పీల్చుకుందామని బయటకు వెళ్లిపోయాడు.

కుర్రవాడు అలా బయటకి వెళ్లాడో లేదో కొవ్వొత్తులన్నీ మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి. మొదటి కొవ్వొత్తి అంది కదా... ‘నేను శాంతికి ప్రతిరూపాన్ని. నన్ను ఎక్కువసేపు నిలిపి ఉంచడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అందుకే నేను త్వరగా వెళ్లిపోతున్నాను. మరో నిమిషంలో ఆరిపోయేందుకు సిద్ధంగా ఉన్నాను,’ అంటూ భగభగా మండిపోవడం మొదలుపెట్టింది. అన్నట్లుగానే మరో నిమిషంలో ఆరిపోయింది.

మొదటి కొవ్వొత్తి అలా ఆరిపోయిందో లేదో, రెండో కొవ్వొత్తి కూడా చిటపటలాడటం మొదలుపెట్టింది. ‘నేను నమ్మకానికి ప్రతిరూపాన్ని. నా అవసరాన్ని ఎవరూ త్వరగా గమనించరు. పైగా శాంతి కూడా లేనిచోట, ఎవరైనా నమ్మకాన్ని ఎలా నిలిపి ఉంచగలరు. అందుకే నేను కూడా ఆరిపోతున్నాను,’ అంటుండగానే వెలుగు తగ్గిపోయి, చివరికి ఆరిపోయింది. రెండో కొవ్వొత్తి ఇలా కొండెక్కిందో లేదో, మూడో కొవ్వొత్తి నసగడం మొదలుపెట్టింది. ‘నేను ప్రేమకు ప్రతిరూపాన్ని. నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం ఎవ్వరూ చేయరు. తమ పక్కనున్న వారితో సైతం ప్రేమగా ఉండేందుకు ఇష్టపడరు. పైగా శాంతి, నమ్మకం లేని చోట నేను మనుగడ సాగించడం చాలా కష్టం. అందుకే నేను కూడా వారి బాటనే అనుసరిస్తాను,’ అంటూ ఏడుస్తూ రెపరెపలాడసాగింది. అలా అటూఇటూ ఊగిసలాడి చివరికి ఆరిపోయింది.

నాలుగో కొవ్వొత్తి మాత్రం నిబ్బరంగా అలాగే నిలిచి ఉంది. కాసేపటికి కుర్రవాడు గది లోపలకి రానే వచ్చాడు. తాను వెలిగించిన మూడు కొవ్వొత్తులూ అలా ఆరిపోవడం చూసి అతనికి బాధ కలిగింది. కానీ నాలుగో కొవ్వొత్తి నిబ్బరం చూసి అంతే ఆశ్చర్యం వేసింది.‘మిగతా కొవ్వొత్తులన్నీ ఆరిపోయినా, నువ్వు మాత్రం ఎలా నిలిచి ఉన్నావు?’ అని నాలుగో కొవ్వొత్తిని అడిగాడు కుర్రవాడు. ‘నేను ఆశకు ప్రతిరూపాన్ని! నేను అంత త్వరగా పరాజయాన్ని ఒప్పుకోను. అసలు పరాజయానికి విరుగుడే నేను కదా! విజయం దక్కేదాకా మీరు పోరాడేందుకు నేను అండగా నిలిచి ఉంటాను. ఇక ఈ చీకటి నాకో లెక్కా! పైగా నన్ను ఉపయోగించి మిగతా కొవ్వొత్తులను కూడా వెలిగించేందుకు సాయపడతాను. నేను ఉన్నంతకాలం శాంతి, నమ్మకం, ప్రేమ అనే గుణాలకు లోటు ఉండదు,’ అని చెప్పింది. కుర్రవాడు ఆ కొవ్వొత్తితో మళ్లీ మిగతా మూడు కొవ్వొత్తులనీ వెలిగించాడు.

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

 

- నిర్జర.