లవ్ లో ఉన్నవారు పొరపాటున కూడా ఈ పనులు చేయ్యకూడదు..!

ప్రేమ ఒక మైకం అంటారు.  ప్రేమలో ఉన్నవారి ప్రపంచం వేరే ఉంటుంది.  అందులో మునిగి తేలుతూ ఉంటారు. ఇద్దరు వ్యక్తులు ప్రేమలో ఉన్నప్పుడు వారి మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేనప్పుడు వారి మధ్య బంధం చాలా లోతుగా ఉంటుంది. ఇలాంటి వారికి ప్రేమ మత్తులో ఉన్నారని అంటుంటారు.  ఇలా ప్రేమ మత్తులో ఉన్నప్పుడు ఏ పని చేయడానికి అయినా సంకోచించరు.  ఈ క్రమంలోనే ప్రేమికులు ప్రేమ మత్తులో కొన్ని పనులు చేసి తరువాత బ్రేకప్ అయ్యాక కుమిలిపోతుంటారు.  లవ్ లో ఉన్నవారు తమ పార్ట్నర్ మీద ఎంత ప్రేమ ఉన్నా సరే..  పొరపాటున కూడా కొన్ని పనులు చెయ్యకూడదని రిలేషన్ షిప్ నిపుణులు అంటున్నారు. ఇంతకీ లవ్ లో ఉన్నవారు చెయ్యకూడని పనులేంటో ఓ లుక్కేస్తే.. ఫొటోస్.. చాలామంది ప్రేమికులు ఇంచుమించు భార్యాభర్తల్లానే బిహేవ్ చేస్తుంటారు. పెళ్లి కాలేదు.. కలసి ఉండలేదు అనే విషయం మినహాయిస్తే అన్ని విధాలా ఓపెన్ అయిపోతుంటారు. కానీ చాలా క్లోజ్ గా ఉన్నాం కదా అని ప్రైవేట్ ఫొటోలను తమ పార్ట్నర్ తో పంచుకోకూడదు. ముఖ్యంగా అబ్బాయిలు నార్సిసిస్టక్ మెంటాలిటీ కలిగి ఉన్నవారు అయితే బ్రేకప్ తరువాత  అమ్మాయిలను బ్లాక్మెయిల్ చెయ్యడం,  వారి మీద ప్రతీకారం తీర్చుకోవడం వంటి వాటికి అమ్మాయిల ప్రైవేట్ ఫొటోలను ఉపయోగించే ప్రమాదం ఉంటుంది.   అంతే కాదు..  ఇలాంటి ఫొటోలు షేర్ చేయడం వల్ల సైబర్ నేరాల బాధితులు అయ్యే అవకాశం ఉంటుంది. ఏవైనా యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు లేదా ఏదైనా సెర్చ్ చేస్తున్నప్పుడు ఫొటో గ్యాలరీకి పర్మిషన్ అడుగుతుంటాయి. ఈ ఫొటోలు సదరు యాప్ కు వెళ్లిపోతాయి. ఈ ఫొటోల ద్వారా కొందరు సైబర్ నేరాలకు పాల్పడుతుంటారు. కాబట్టి ప్రైవేట్ ఫొటోస్ ఎట్టి పరిస్థితులలోనూ ఎవరికీ పంపకూడదు. బ్యాంక్ అకౌంట్.. బ్యాంక్ ఖాతా అనేది ఒక వ్యక్తి వ్యక్తిగత ఆర్ఠిక విషయం.  ప్రేమలో ఉన్నంత మాత్రాన బ్యాంక్ ఖాతా వివరాలు, ఆర్థిక విషయాలు పంచుకోవడం సబబు కాదు.  ప్రేమలో ఉన్నప్పుడు  లవ్ పార్ట్నర్ బ్యాంక్ అకౌంట్ వివరాలు అడిగితే సున్నితంగా అవన్నీ చెప్పడం ఇప్పుడు అంత అవసరం లేదని చెప్పాలి. కానీ కొందరు తమ లవ్ పార్ట్నర్ ఎక్కడ నొచ్చుకుంటారో అనే ఆలోచనతో అన్నీ చెప్పేస్తుంటారు.  లవ్ లో బ్రేకప్ వచ్చి విడిపోతే వ్యక్తిగత వివరాలు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఆర్థిక సమస్యలలో కూడా చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. కుటుంబం.. ప్రేమలో ఉన్నవారు సంతోషం, దుఃఖం, బాధ వంటి విషయాలు అన్నీ ఓపెన్ గా చెప్పుకోవం మంచిదే కానీ కుటుంబం గురించి, కుటుంబంలో ఉన్న గొడవలు, సమస్యలు, కుటుంబ వ్యక్తిగత విషయాలు అన్నీ ఓపెన్ అయ్యి చెప్పుకోవడం మంచిది కాదు. ఇది కుటుంబానికి, కుటుంబంలో వ్యక్తుల గౌరవానికి ఎప్పటికైనా ఇబ్బందే. చనువుతో ఓపెన్ అయ్యి చెప్పుకున్న కొన్ని విషయాలు తరువాత బ్రేకప్ అయినప్పుడు నలుగురికి చాలా సులువుగా చేరిపోతాయి. అప్పుడు ఎవరికి వారు వారి కుటుంబ పరువును, గౌరవాన్ని తగ్గించుకున్నట్టు అవుతుంది. రహస్యాలు.. ఇప్పటి కాలంలో పరిచయాలు చాలా తొందరగా జరిగిపోతాయి. అదే విధంగా దగ్గరితనం కూడా తొందరగా వచ్చేస్తుంది. కానీ ఆ బందం ఏదైనా నిలబడటమే కష్టంగా ఉంటుంది. ఒకరి నుండి విడిపోయాక మళ్ళీ ఇంకొకరితో పరిచయం కావడం, వారితో మళ్ళీ దగ్గరి తనం ఏర్పడటం, అది కాస్తా ప్రేమకు దారితీయడం చాలా వేగంగా జరుగుతాయి.  ఈ క్రమంలో ఎవరితోనూ గతానికి సంబంధించి  విషయాలు ఓపెన్ అయ్యి చెప్పుకోకూడదు.  దీనివల్ల వ్యక్తిత్వం మీద దారుణమైన ముద్రలు, అవమానాలు ఎదురవుతాయి.

మీపై మీరు విజయం సాధిస్తారు ఇలా చేస్తే...

చాలామంది సంకల్పబలం, క్రమశిక్షణల గురించి ఓ అరగంట ప్రసంగించమంటే తడుముకోకుండా మాట్లాడతారు. కానీ వాటిని పాటించే విషయంలోనే వస్తాయి చిక్కులన్నీ. తమ దాకా వచ్చేసరికి అవి అందరికీ సాధ్యం కాదని తేల్చేస్తారు. అది పుట్టుకతోనే రావాలని చల్లగా జారుకుంటారు. అలాంటి వారికి సమాధనమే ఈ కింది విషయాలు.. దృఢనిర్ణయాలు తీసుకోవాలంటే? ...  మీ మానసిక బలాన్ని పరీక్షించుకొని, పెంపొందించుకొనే మార్గాల్లో ముఖ్యంగా ప్రతి నిత్యం జీవితంలో కొన్ని ఇష్టం లేని, కష్టంగా కనిపించే పనుల్ని చేయడం ఒకటి. అలా తరచూ సాధన చేయాలి. వీటి వల్ల ప్రయోజనాలు కలుగుతాయని తెలిసినా మీ మనసు ఆ పనుల్ని ఏదో ఒక వంకతో వ్యతిరేకిస్తూనే ఉంటుంది. అయినా సరే ఆ పనులు చేయాలి. అలా చేయడం ద్వారా మీ మెదడులో నిక్షిప్తమైన వ్యతిరేక భావాలను అధిగమించగలుగుతారు. అంతర్గతంగా ఉన్న వ్యతిరేక శక్తులను అధిగమించడం ద్వారానే మనకు అవసరమైన అంతర్గత శక్తిని మేల్కొల్పగలం. ఉదాహరణకు మీరు బస్సులో ప్రయణిస్తున్నారనప్పుడు సీటు దొరికితే హాయిగా కూర్చుంటారు, లేకపోతే తప్పదు కాబట్టి నిలబడి ప్రయాణిస్తారు. ఒకవేళ మీకు సీటు దొరికినా సరే ఆ సీటును ఇంకొకరికి ఇవ్వండి. ఓ పదిహేను లేదా ఇరవై నిమిషాలు నిలబడి ప్రయాణించండి. ఈ చిన్న విషయంలో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని, మీలోని మానసిక నిరోధ భావాలను గమనించండి. అయినా మనస్సు మాట వినకుండా ఇంకొకరికి ఆ సీటు ఇచ్చి, ప్రయాణం చేయండి. ఆ తరువాత చూడండి. మీరు ఈ నిరోధ భావాల నుంచి బయటపడడానికి చేసిన సంఘర్షణ, చివరికి సాధించడం చూస్తే మీలో మీకే తెలియని ఆత్మవిశ్వాసం, ధైర్యం కలుగుతాయి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు, అర్జునుడితో మానసిక దౌర్బల్యాన్ని జయించాలని చెబుతూ ఎవరికైనా మనస్సును అదుపులో ఉంచుకోవడం దుస్సాధ్యమే, కానీ అభ్యాస, వైరాగ్యాల ద్వారా దాన్ని సాధించవచ్చని బోధిస్తాడు. మీ ఇంట్లోని వారికి వారి పనుల్లో ఎప్పుడైనా సహాయం చేశారా?  ఈసారి ఈ విధంగా ప్రయత్నించండి! నేరుగా వంటింట్లోకి వెళ్ళి అమ్మతో "అమ్మా! నేను ఏదైనా సహాయం చేయనా?” అని అడగండి, ఎప్పుడూ ఆ మాట అడగని మీరు ఈ ప్రశ్న వేసేసరికి ఆవతలివారు కాస్త కంగారు పడి, మిమ్మల్ని కొత్తగా చూడడం సహజమే. అయినా సరే, వంటిల్లు సర్దడంలోనో, కూరలు తరగడంలోనో, గిన్నెలు కడగడంలోనో సహాయం చేయండి. అది చిన్న పనే అయినా, మీకిష్టం లేని పని చేసిన తరువాత ఒక్కసారి వారి కళ్ళలోని ఆ వెలుగును చూడండి. రెండూ మిమ్మల్ని సంకల్ప బలం వైపు నడిపిస్తాయి.  ఒక్కోసారి మీరు అలసిపోయి ఇంటికొస్తారు. రాగానే మీ శరీరాన్ని సోఫాలో పడేసి అందుబాటులో ఉన్న టీవీ రిమోట్ తీసుకొని, అలా ఎంతసేపు ఛానల్స్ మారుస్తూ కూర్చుంటారో మీకే తెలియదు. అప్పుడు స్నానం చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. కానీ బద్దకం మీ కన్నా బలమైంది కాబట్టి, అది అక్కడ నుంచి లేవనీయదు. అయితే ఈ సారి మీ బద్ధకం మాట వినకండి. కష్టమైనా సరే లేచివెళ్ళండి. చేయాలనుకున్న పని వాయిదా వెయ్యకుండా చేయండి. అప్పుడు చూడండి మీపై మీకే తెలియని దృఢత్వం,  ఒక నమ్మకం, ధైర్యం కలుగుతాయి. ప్రయత్నిస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది. ఒకరోజు మీరు కాఫీ, టీ, పాలల్లో చక్కెర లేకుండా తాగేందుకో లేదా కనీసం పెరుగన్నంలో ఉప్పు లేకుండా తినేందుకో ప్రయత్నించండి. మీ కన్నా ముందు మీ నాలుక ఈ ప్రయోగానికి ఒప్పుకోదు. దాన్ని జయించడానికేగా ఈ ప్రయత్నమంతా! అలాగే వేడినీళ్ళ  స్నానం అలవాటున్న వాళ్ళు వరుసగా వారం రోజులు చన్నీటి స్నానం చేసి మీలోని శారీరక, మానసిక నిబ్బరాన్ని పరీక్షించి సాధించండి. చదువుకునేటప్పుడు కష్టమైన సబ్జెక్టుతో వాయిదా వేయకుండా పోరాడండి. కొన్ని మాటలు మాట్లాడే కన్నా మాట్లాడకుండా ఉంటేనే ఎక్కువ ప్రయోజనం ఉన్నప్పుడు మౌనాన్ని ఆశ్రయించండి. మీ ఉద్వేగాన్ని అదుపులో ఉంచుకోండి.  ఇలా అన్నీ ఒక్కొక్కటిగా మీ జీవితంలో ఫాలో అయ్యారంటే మీ మీద మీరు విజయం సాధిస్తారు కచ్చితంగా.                                      ◆నిశ్శబ్ద.

అంకెలతో మాయాజాలం.. సుడోకు పుట్టుక,చరిత్ర తెలుసా..

ఆడుకోవడం అందరికీ ఇష్టం అయితే ఓ వయసు దాటిన తరువాత పిల్లల్లా ఆడుకోలేం. అయితేనేం ఆడుకోవాల్సినవి ఆడుకోవచ్చు. చక్కగా నెంబర్స్ తో కాలక్షేపం చేయచ్చు. సాధారణంగా దినపత్రికలు,  సండే స్పెషల్ బుక్స్ లో నెంబర్స్ తో మ్యాజిక్ చేసే సుడోకు చూసే ఉంటారు. కొందరికి ఈ సుడోకు పూర్తీ చేయడం ఎంతో ఇష్టం. 1నుండి 9 అంకెలను నిలువుగానూ, అడ్డుగానూ ఎటు కూడినా 9 వచ్చేలా, అంకెలు ఏ వరుసలోనూ రిపీట్ కాకుండా  ఉండటం దీని విశిష్టత. ఇది మెదడును చురుగ్గా మారుస్తుంది. తెలివితేటలు పెంచుతుంది. పిల్లలలో చదువుపట్ల ఏకాగ్రతను పెంచుతుంది. ఇలా ఎన్నో ఉపయోగాలున్న సుడోకుకు ఓ రోజును కేటాయించారు. ఈ రోజున సుడోకు గురించి చర్చిస్తారు.  అయితే ఈ సుడోకు ఎప్పుడు ఎక్కడ పుట్టింది? దీని వెనుక చరిత్ర ఏంటి?  పూర్తీగా తెలుసుకుంటే.. 1892లో ఫ్రెంచ్ వార్తాపత్రిక "La Siecle" సుడోకుకు సమానమైన గేమ్‌ను ముద్రించింది, అందులో ప్రతి అడ్డు వరుస,  నిలువు వరుస అన్ని నిర్దేశిత సంఖ్యలను కలిగి ఉండాలి, కానీ సుడోకులా కాకుండా, ఇది 9 కంటే ఎక్కువ సంఖ్యలను కలిగి ఉంటుంది. ఇందులో ఎన్నో గణితానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ క్లియర్ చెయ్యాల్సి ఉంటుంది.  ఇవి ఎంతో తర్కంతో కూడుకుని ఉంటాయి. ఆ తరువాతి సంవత్సరాల్లో ఇతర ఫ్రెంచ్ పేపర్‌లు ఇలాంటి గేమ్‌లతో ట్రెండ్‌ను వ్యాప్తి చేశాయి. కానీ ఏదీ సుడోకుతో సమానంగా లేదు.  మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే సమయంలో ఆ గేమ్‌ల ప్రజాదరణ క్షీణించింది. 1979లో  ఇండియానా ఆర్కిటెక్ట్ హోవార్డ్ గార్న్స్ "డెల్ మ్యాగజైన్"లో తన స్వంత ఆవిష్కరణ  ద్వారా పజిల్ ను రూపొందించారు. దీన్ని అప్పటిలో "నెంబర్ ప్లేస్" అని పిలిచారు. దాన్నే ఇప్పుడు  సుడోకు అని పిలుస్తున్నారు. అయితే గార్న్స్ తన కనుగొన్న ఆవిష్కరణ అంతర్జాతీయ సంచలనంగా మారడాన్ని చూడకుండానే కన్నుమూశారు.  మిలియన్ల మంది  సుడోకు ఆడే ఆటగాళ్ళతో  మొదటిసారి సుడోకు అనే పేరును పొందింది. 1997లో, హాంకాంగ్ న్యాయమూర్తి వేన్ గౌల్డ్ ప్రత్యేకమైన సుడోకు పజిల్‌లతో కూడిన కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను కనుగొన్నారు. అతను UKలోని వార్తాపత్రికలకు రోజువారీ పజిల్ ఫీచర్‌గా గేమ్‌ను అందించాడు. దీని వల్ల  తొందరలోనే సుడోకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక ఇప్పుడు సుడోకు స్మార్ట్‌ఫోన్ యాప్‌లలో తక్షణమే అందుబాటులో ఉంది.  పేపర్లు మరియు మ్యాగజైన్‌లలో విస్తృతంగా అచ్చవుతోంది. 2013లో వరల్డ్ పజిల్ ఫెడరేషన్ సెప్టెంబరు 9ని అధికారిక అంతర్జాతీయ సుడోకు దినోత్సవంగా ప్రకటించింది.  అప్పటి నుండి  దీనిని జరుపుకుంటున్నారు. బ్రిటీష్ TV స్టేషన్ “ఛానల్ 4” తన టెలిటెక్స్ట్‌లో రోజువారీ సుడోకు పజిల్‌ను చేర్చడం 2005 నుండి ప్రారంభించింది.  ప్రోగ్రామ్ గైడ్ “రేడియో టైమ్స్” వారానికోసారి, 16x16 గ్రిడ్ లతో “సూపర్ సుడోకు”ను ప్రారంభించింది. 2006లో సుడోకు అనే అంశం పై నెంబర్లను చేర్చడం, వరుసలు కూర్చడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ  పీటర్ లెవీ ఒక పాటను క్రియేట్ చేశారు. ఆస్ట్రేలియాలో మిలియన్ డాలర్ల డ్రగ్ ట్రయల్ పన్నెండు మంది జ్యూరీలలో ఐదుగురు సాక్ష్యాలను వినడానికి బదులుగా సుడోకు ఆడుతున్నట్లు కనుగొన్నారు. అప్పుడు ఈ ట్రయల్ రద్దు చేశారు. ఇది 2008లో జరిగింది. 2013లో వరల్డ్ పజిల్ ఫెడరేషన్ సెప్టెంబరు 9ని అంతర్జాతీయ సుడోకు దినోత్సవ వార్షిక తేదీగా నిర్ణయించింది.  ఇందులో  బోలెడు రౌండ్లతో కూడిన ఆన్‌లైన్ పోటీలను నిర్వహిస్తోంది.                                                  *నిశ్శబ్ద.  

నైట్ షిఫ్టులో పనిచేసేవారు ఆరోగ్యంగా, యాక్టీవ్ గా ఉండాలంటే ఇలా చేయండి.!

నేటి వేగవంతమైన ప్రపంచంలో ఉద్యోగ జీవితాలు కూడా అంతే వేగంగా ఉంటాయి. పోటీ దృష్ట్యా ప్రతి సంస్థ 24 గంటలు తమ కార్యకలాపాలు కొనసాగించాలని అనుకుంటుంది. ఈ కారణంగానే సాధారణ పనివేళలు మాత్రమే కాకుండా నైట్ షిఫ్టులు కూడా కొనసాగిస్తుంది.  వేతనం గురించో ఇతర కారణాల వల్లనో చాలామంది నైట్ షిప్టులో పనిచేస్తుంటారు.  అయితే సాధారణ పని వేళల్లో పనిచేసేవారి కంటే నైట్ షిప్టులో పనిచేసేవారిలో చురుకుదనం తక్కువగా ఉంటుంది. అంతేనా సాధారణంగా నిద్రపోవాల్సిన సమయంలో ఉద్యోగాలు చెయ్యడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నైట్ షిఫ్టు డ్యూటీ చేసేవారు  ఆరోగ్యంగా, యాక్టీవ్ గా ఉండటానికి  కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటంటే.. నిద్ర.. నైట్ షిఫ్టు లో పనిచేసేవారు నిద్ర షెడ్యూల్ ను కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి. నిద్రా చక్రమైన సిర్కాడియన్ రిథమ్ కు అంతరాయం కలిగించకుండా చూసుకోవాలి. సిర్కాడియన్ రిథమ్ కు అంతరాయం కలిగితే  నిద్ర ఆటంకాలు, అలసట కలుగుతాయి.  ఈ సిర్కాడియన్ రిథమ్ గడియారాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి సెలవు దినాలలో కూడా ఒకే సమయానికి పడుకోవాలి. ఆహారపు అలవాట్లు.. నైట్ షిఫ్టుల సమయంలో చాలామంది ఎనర్జీగా ఉండటం కోసం ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్స్ తినడం మీద ఆసక్తి చూపిస్తారు. పైపెచ్చు సాధారణ భోజన సమయాలు కాకపోవడం వల్ల రాత్రి పూట ఆకలేసినప్పుడు ఇలాంటి ఆహారానికే ప్రాధాన్యత ఇస్తారు. అయితే వీటికి బదులుగా పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు అధికంగా ఉండే సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. నైట్ షిఫ్ట్ అంతా చిన్న చిన్న మొత్తాలలో ఆహారం తీసుకోవాలి. నీరు బాగా త్రాగాలి. వ్యాయామం.. నైట్ షిప్టులలో పనిచేసేవారు ఉదయం సమయాల్లో పడుకుంటూ ఉంటారు. దీని వల్ల చాలామంది ఉదయం వేళ చెయ్యాల్సిన వ్యాయామాన్ని స్కిప్ చేస్తుంటారు. లేదా పగటి సమయాన్ని లేజీగా గడిపేస్తూ  ఉంటారు. కానీ వ్యాయామాన్ని తప్పనిసరిగా భాగం చేసుకోవాలి. జాకింగ్, వాకింగ్, యోగా, సైక్లింగ్ వంటివి మంచి ఎంపిక. ఒత్తిడి.. పనిచేసే సమయవేళలు మానసిక ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. ఇది ఒత్తిడి, ఒంటరితనం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఒత్తిడి రాకుండా చూడటం కోసం  లోతైన శ్వాస, శ్వాస వ్యాయామాలు,  ధ్యానం,  తీరిక సమయాలలో స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులతో మాట్లాడటం వంటివి చేయాలి.  ఒకవేళ ఒత్తిడి సమస్య ఉంటే మానసిక నిపుణులను కలిసి కౌన్సెలింగ్ తీసుకోవాలి. ప్లానింగ్.. నైట్ షిఫ్టులలో పనిచేసేవారు తమ పనిని చాలా పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. పని చేసేటప్పుడు అలసిపోకుండా పనిని ఏకధాటిగా కాకుండా చిన్నచిన్న భాగాలుగా విభజించుకొని ఫినిష్ చేయాలి. ఇది పక్కాగా అమలుకావడం కోసం కోలీగ్స్,  అధికారులతో సంప్రదించి వారి మద్దతు తీసుకోవాలి.                                     *నిశ్శబ్ద.  

జీవించడమంటే ఇదే..!

జీవించడమూ ఒక కళ అని ఎంతోమంది చెబుతూ ఉంటారు. ప్రస్తుత సమాజంలో మనిషి రెండు విధాలుగా బ్రతుకుతున్నాడు. ఒకటి, తనకు తోచిన విధంగా, రెండు ఓ పద్ధతి ప్రకారం. కానీ మూడవ పద్ధతి ఒకటి ఉంది. ఈ పద్ధతిలో అమితమైన స్వేచ్ఛ ఉంటుంది. ఈ పద్ధతిలో బ్రతకడమే జీవించడం అంటే, ఈ పద్ధతినే జీవించే కళ అంటారు. ఇప్పుడు విదేశాలలో క్రొత్తరకం జీవనోపాధి ఒకటి స్వైరవిహారం చేస్తోంది. అదేమిటంటే మంచి వాక్చాతుర్యం కలిగి, జీవితంలో గొప్పగా సాధించిన ఒక వ్యక్తి ఇతరులకు ఎలా జీవించాలో, ఏ విధంగా జీవన పద్ధతి పాటిస్తే నిండైన విలువైన జీవితం దొరుకుతుందో వివరిస్తూ, అందులో శిక్షణా తరగతులూ, ప్రసంగాలూ ఇస్తూ ఎంతో మంచి పాతవైన, భారమైన జీవితాలని అందమైన తీరాలవైపు మళ్ళిస్తున్నారు. ఈ విధంగా జీవించేకళలో శిక్షణ ఇచ్చే మనిషిని లైఫ్ కోచ్ అని అంటున్నారు.  ఇప్పుడు ఈ లైఫ్ కోచ్ ల ఆవశ్యకత మన భారతదేశానికె అవసరం అంటున్నారు. ఎందుకంటే ప్రపంచానికే వెలుగు చూపింది మన భారతదేశం. ఆధ్యాత్మికంగా ప్రపంచ ప్రజలకు తలమానికంగా నిలచింది మన దేశమే. ఇప్పుడు కూడా ఏ దేశానికీ వెళ్ళనంత ఎక్కువ జనాభా, భారతదేశానికి వచ్చి ఆధ్యాత్మిక జీవనం నేర్చుకొని వెళ్తున్నారు. ఇక్కడ నేర్చుకొన్న గొప్ప విద్యను, జ్ఞానాన్ని వారి దేశాల్లో వినియోగిస్తూ, లైఫ్ కోచ్ లుగా, పబ్లిక్ స్పీకర్లుగా, ప్రేరణా రచయితలుగా మారి కోట్లకు కోట్లు సంపాదిస్తూ పదిమంది జీవితాలను ఉన్నతదిశగా మారుస్తూ తృప్తిగా హాయిగా జీవిస్తున్నారు. మన దేశంలో పూస్తున్న మల్లెల సువాసనను మన తుమ్మెదలు గ్రహించలేని స్థితిలో ఉంటే... విదేశాలనుండి వచ్చిన తుమ్మెదలు ఆ అద్భుత సౌరభాలను హాయిగా ఆస్వాదించి... తిరిగి మన తుమ్మెదలకే మల్లెల సువాసనలు గురించి పరిచయం చేస్తున్నాయి. ఈ విషయం ఎంత విచిత్రమో కదా అనిపించడం లేదూ... ఇక్కడ తప్పు మన తుమ్మెదలదా, విదేశీ తుమ్మెదలదా. ఆలోచిస్తే ముమ్మాటికీ మన తుమ్మెదలదే. మన దేశంలో దొరికిన కాసింత జ్ఞానాన్ని వాళ్ళు గ్రహించి దాంతోటే వాళ్ళ దేశంలో అద్భుతాలు సృష్టిస్తుంటే, ఇక్కడ పుట్టి, ఇక్కడే పెరిగి మన భారతీయ విజ్ఞానంపై సర్వహక్కులూ కలిగి ఉండి,  నేర్చుకోగల అవకాశాలు ఉండికూడా భారతీయులు విఫలమవుతున్నారు.  ఈ అపాయకరమైన పరిస్థితిని గమనించి ఎందరో భారతీయ గురువులూ, తత్వవేత్తలూ, ఆధ్యాత్మిక ప్రవచకులూ గొంతు అరిగేలా అరిచి అరిచి చెప్తున్నా... కనీసం కొంచెమైనా పట్టించుకోలేని భయానకమైన స్థితిలో దేశప్రజలు దిగజారిపోతున్నారు. ఎందుకంటే... ప్రజలు తమకు తోచిన విధంగానే బ్రతకాలని నిర్ణయించుకున్నారు. ఎవరైనా జీవించడం గురించి చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచించే విషయం ఒకటే వాళ్ళు మనల్ని మోసం చేస్తారు అందుకే ఇలా చెబుతారు అని.  ప్రతి ఒక్కరూ తమకు నచ్చినట్టు  జీవించే పద్ధతిలో జీవితం వారిని కాలసర్పంలా కాటేస్తున్నా ఆ విషవలయాల మధ్య రొప్పుతూ బ్రతికేస్తున్నారు. విద్యార్థి దశనుండీ... పరీక్షల్లో ర్యాంకులైతే తెచ్చుకోగలరు కానీ జీవితంలో నిరంతరం పరాజయం పొందుతూనే ఉన్నారు. ఎందుకంటే జీవితం గురించిన పాఠాలు ఏ పాఠశాలలోనూ బోధించడం లేదు.  నేర్చుకుంటున్న విద్య  కడుపునిండా తిండి పెట్టగల్గుతోంది. కానీ ప్రశాంతమైన నిద్రను ఇవ్వడం లేదు. కలకాలం హాయిగా జీవించడానికి పనికిరాని విద్య... అసవరమే లేదు. ఆ విషయాన్ని ఎవరూ గ్రహించడం లేదు. అటువంటి విద్యతో బ్రతకగలరేమోగానీ జీవించలేరు. ఎలాగైనా బ్రతికేయడం...  జీవితమవుతుందా?? జీవించడమంటే.... వెయ్యేళ్ళు ప్రజల గుండెల్లో వర్ధిల్లాలి. జీవితమే భావితరాలకు జీవితకళను నేర్పే పాఠం కావాలి. గొప్పగా జీవించలేకపోయినా కనీసం తన కుటుంబంలోని సభ్యులతో ఏ చీకూచింతా లేకుండా, నిండు ఆరోగ్యంతో, నీతిగా, ధర్మబద్దంగా ప్రతిరోజూ ఆనంద పరవశులౌతూ మనసారా తృప్తిగా జీవించగల్గితే చాలు. తమ బిడ్డలకు నైతిక విలువలు నేర్పిస్తూ, దయా, కరుణ, ప్రేమతత్వాన్ని వారికి అమృతంలా అందిస్తూ... వారు సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులుగా తయారయ్యేలా చేస్తూ... కనీసం వెయ్యి మందిలో ఒక్కరైనా నిజంగా జీవించగలుగుతున్నారా?... ఇవన్నీ ప్రశ్నించుకుంటే జీవించడం గురించి ఓ అవగాహన వస్తుంది.                                      ◆నిశ్శబ్ద.

మహిళా న్యాయమూర్తులు కావాలి ఇందుకే..

ఈ ప్రపంచంలో వ్యక్తులకు న్యాయం జరిగేలా చూసేది న్యాయవ్యవస్థ. స్వాతంత్య్రం పొందిన ప్రతి దేశంలో న్యాయవ్యవస్థ ఉంది. ఈ న్యాయ వ్యవస్థ అనేది ఈనాటిది కాదు. ఒకప్పుడు రాజ్యాల పేరుతో ఈ భూమండలాన్ని పాలించిన రాజులు, రాణులు కూడా న్యాయవ్యవస్థను పాటించారు. ఎక్కడో కొందరు నియంతలు మాత్రం తాము చెప్పిందే వేదమనే ధోరణిలో రాజ్యపాలన చేశారు. అయితే ఇదంతా అధికారం చేతిలో ఉన్నవాళ్లకే తప్ప సాధారణ పౌరులు తలవంచుకుని పోయే పరిస్థితులే ఉండేవి.  దేశాలు నాగరిక ప్రపంచంలో అడుగుపెట్టినా, ఎంత అభివృద్ధి సాధించినా మహిళలకు న్యాయం అనేది విభిన్నంగానే ఉండేది, బడుగు బలహీన వర్గాలకు బానిసత్వం తప్ప న్యాయం అనే పదానికి తావుండేది కాదు. ఈక్రమంలో ఎన్నో పోరాటాలు, మరెన్నో నిరసనలు, ప్రపంచం మీద కాలుతున్న కత్తిపై సమ్మెట దెబ్బల్లా మారాయి. ఫలితంగా న్యాయవ్యవస్థలోని వివిధ స్థాయిలలో మహిళలకు సమాన మరియు సంపూర్ణ భాగస్వామ్యం వైపు అడుగులు పడ్డాయి.   ప్రతి సంవత్సరం మార్చి 10న అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. న్యాయస్థానాలు మహిళా న్యాయమూర్తులకు తగిన ప్రాధాన్యత ఇస్తూ.. మగవారితో సమానంగా ఆడవారు ఉండాలని భావించారు. జనాభాకు ప్రాతినిధ్యం వహించడానికి, వారి ఆందోళనలకు ప్రతిస్పందించడానికి, సమర్థ నిర్ణయాలను జారీ చేయడానికి న్యాయవ్యవస్థలో మహిళల పాత్ర చాలా కీలకం. మహిళా న్యాయమూర్తులు తమ విధులకు హాజరు కావడం ద్వారా న్యాయస్థానాల విశ్వసనీయతను పెంచుతారు, వారు బహిరంగంగా న్యాయం కోరుకునే ఎవరికైనా అందుబాటులో ఉంటామనే బలమైన సందేశాన్ని, భరోసాను ఇస్తారు.  సహజంగా ఓ కుటుంబంలో మహిళల నిర్ణయాల కంటే పురుషుల అభిప్రాయాలకు ప్రాధాన్యత, వారి నిర్ణయాలే పైచేయిగా ఉంటాయి. సమాజంలో ఇక మహిళల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. స్త్రీలు ఎప్పుడూ పురుషుల కంటే తక్కువ అని భావించబడుతున్నారు, అందువల్ల జీవితంలోని వివిధ రంగాలలో సమాన ప్రాతినిధ్యం ఇవ్వబడలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి కానీ అవి అలానే కొనసాగుతున్నాయి. గత సంవత్సరం, దోహాలో జరిగిన UNODC గ్లోబల్ జ్యుడీషియల్ ఇంటెగ్రిటీ నెట్‌వర్క్ యొక్క రెండవ ఉన్నత-స్థాయి సమావేశంలో, ప్రెసిడెంట్ వెనెస్సా రూయిజ్, ఖతార్ ప్రధాన న్యాయమూర్తి సంయుక్తంగా మహిళా న్యాయమూర్తుల విజయాలను గౌరవించే అంతర్జాతీయ దినోత్సవ ఆలోచనను ప్రతిపాదించారు.  కోర్టు బెంచ్‌లో సమాన సంఖ్యలో పురుషులు మరియు మహిళలు ఉండటం న్యాయవ్యవస్థ  నిష్పాక్షిక తీర్పుల సామర్థ్యాన్ని పెంచుతుంది. మహిళా న్యాయమూర్తులు ధర్మాసనానికి విభిన్న దృక్కోణాలను అనుభవాలను అందిస్తారు, వారు సేవ చేసే సమాజాన్ని చిత్రీకరిస్తూ మానవ హక్కులు, చట్ట నియమాలను రక్షించే న్యాయవ్యవస్థ సామర్థ్యంపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేస్తారు. నాయకత్వ స్థానాల్లో ఉన్న మహిళలు అవినీతిని ఎదుర్కోవడానికి, కుట్రలను నాశనం చేయడానికి కూడా సహాయపడతారు. మహిళా న్యాయమూర్తులను గతంలో నిషేధించారు కానీ తరువాత వీటిని తిరిగి చేర్చడం ద్వారా న్యాయ వ్యవస్థలను మరింత పారదర్శకంగా వారు తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది. న్యాయ వ్యవస్థలు, నిర్వాహక నాయకత్వ సంస్థలు, ఇతర స్థాయిలలో మహిళల అభివృద్ధి కోసం సంబంధిత విజయవంతమైన జాతీయ విధానాలు, ప్రణాళికలను స్థాపించడానికి మరియు అమలు చేయడానికి నిబద్ధత ఏర్పడింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్క మహిళ చేయాల్సిన కొన్ని పనులను చూస్తే.. •ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కుల కోసం ఒక స్టాండ్ తీసుకోండి మీరు ప్రస్తుతం మహిళల కోసం మాట్లాడటానికి మీ వాయిస్‌ని ఉపయోగించవచ్చు. ఈ రోజున, సోషల్ మీడియాలో లింగసమానత్వం మీకు ఎందుకు ముఖ్యమైనదో షేర్ చేయవచ్చు.   •మహిళా శక్తిని ప్రోత్సహించండి మహిళలు తమ హక్కుల కోసం తమ మద్దతును చూపించడానికి మరిన్ని అవకాశాలను ప్రోత్సహించండి. మహిళా సాధికారతను పెంపొందించడానికి కొన్ని ఆలోచనలు మహిళల కోసం మాత్రమే ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను రూపొందించవచ్చు. •అణగారిన మహిళలకు న్యాయవాది ప్రాథమిక అవసరాలు లేదా హక్కుల విషయానికి వస్తే అందరికీ సమాన హక్కు లేదు. సమాజం ద్వారా వారి ప్రాథమిక అవసరాలు ఏర్పాటయ్యేలా చేయడం, మానవ హక్కులను కోల్పోతున్న మహిళల కోసం మీరు ఎక్కడెక్కడికో వెళ్లి సహాయం చేయలేకపోయినా మీ చుట్టూ  ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నించండి. న్యాయం విస్తృతమవ్వాలంటే.. న్యాయవ్యవస్థలో మహిళల సంఖ్య పెరగాలి. ◆నిశ్శబ్ద.

ఆత్మహత్య ఆలోచన చాలా అల్పమైనది

ఈరోజుల్లో యువతలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన పెరగడం బాధాకర విషయం. ఇంచుమించు వార్తా పత్రికలలో ప్రతిరోజూ ఆత్మహత్య సంఘటల్ని చూస్తున్నాము. ఆత్మహత్య గురించి ఆలోచించడం చాలా తెలివి తక్కువ పని. మానవ శరీరం దేవుడిచ్చిన విలువైన బహుమతి. చిన్న చిన్న విషయాల కోసం ప్రాణాలను విడవటం మంచిదికాదు. పిరికిపందలు,బలహీన మనష్కులే జీవితపు సవాళ్ళను ఎదుర్కోవడానికి భయపడతారు. అటువంటివారే ఇటువంటి తెలివితక్కువ పనులకు ఒడిగడతారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా సవాళ్లను ఎదుర్కునేవాడు ఎప్పుడూ ఇలాంటి ఆలోచన చేయడు. ఆ సవాళ్లకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తాడు. చాలామంది తమ కోరికలు నెరవేరలేదు అని నిస్పృహ చెంది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ మనకు ఏది ప్రాప్తమో అదే దక్కుతుంది అనే సత్యాన్ని గ్రహించుకోలేరు. చిత్తశుద్ధితో, నిజాయితీతో పనిచేసి మనకు ఆ అర్హత కలిగించే శక్తిని ఎందుకు పెంచుకోకూడదు. ఓ క్షణం ఆలోచిస్తే ప్రాణం తీసుకోవడానికి మించిన ధైర్యం ఈ లోకంలో ఇంకోటి ఉందని నేను భావించను. అలాంటి నీ ధైర్యాన్ని కొంచెం నీ జ్ఞానికి జత చేసి సమస్యపై పోరాటం చేస్తే అసాధ్యమైనా సుసాధ్యం కాగలదు. కష్టాల్లో మన మనసు ఆలోచనా విధానం రాకెట్ వేగంతో ఉండాలి. మన నిర్ణయాలు,కార్యాచరణ మిస్సైల్ లా సాగాలి. మనో నిబ్బరాన్ని మించిన ఆయుధం ఇంకోటి లేదు. అది ఎప్పుడూ కోల్పోకూడదు. కనుక చిన్న చిన్న విషయాలకు ప్రాణాలను త్యజించి ఎంతో విలువైన జీవితాన్ని కోల్పోయి దేవుడు ఇచ్చిన దేహాన్ని హత్య చేసి వెళ్లిపోతే దేవుడు కూడా క్షమించడు. ◆ వెంకటేష్ పువ్వాడ  

వాడకపోతే వృధా!

చాలారోజుల క్రితం ఒక గొప్ప వ్యాపారి ఉండేవాడు. వ్యాపార నిమిత్తం అతను ఓసారి దూరదేశాలకు బయల్దేరాడు. వెళ్తూ వెళ్తూ అతను, తన దగ్గర పని చేసే ముగ్గురు పనివాళ్లని పిలిచాడు. ‘చూడండి! నేను తిరిగి రావడానికి కాస్త సమయం పడుతుంది. ఈలోగా నేను మీకో పని అప్పచెబుతున్నాను. మీ ముగ్గురికీ నేను కొంత డబ్బుని ఇస్తున్నాను,’ అంటూ మొదటి వ్యక్తికి ఐదువేలు, రెండో వ్యక్తికి రెండువేలు, మూడో వ్యక్తికి వేయి రూపాయల డబ్బుని చేతికిచ్చాడు.   అలా యజమాని తన ముగ్గురు పనివాళ్లకీ డబ్బుని అందించి ప్రయాణమైపోయాడు. కొంతకాలం తర్వాత యజమాని తిరిగివచ్చాడు. ‘నేను మీకిచ్చిన డబ్బుని ఏం చేశారు?’ అని ఆ ముగ్గురినీ అడిగాడు.   ‘ప్రభూ! వ్యాపారం చేయడం మీ లక్షణం. డబ్బుని స్థిరంగా ఉంచడం మీకు ఇష్టం ఉండదు. మీ మనస్తత్వం తెలిసినవాడిని కనుక మీరిచ్చిన డబ్బుని పెట్టుబడి పెట్టాను. రాత్రింబగళ్లు కష్టపడ్డాను. ప్రస్తుతానికి మీరు ఇచ్చిన డబ్బు రెట్టింపైంది,’ అని పదివేల రూపాయలని చేతిలో పెట్టాడు మొదటి పనివాడు.   ‘ప్రభూ! వ్యాపారం చేయడం నాకు అలవాటైన విద్య కాదు. కానీ డబ్బుని అలా నిరుపయోగంగా ఉండటం నాకు ఇష్టం లేకపోయింది. అందుకనే నష్టం వచ్చే ప్రమాదం ఉందన్న భయం ఉన్నా కూడా ఆ డబ్బుతో వ్యాపారం చేశాను. ఒళ్లు వంచి పనిచేశాను. అదృష్టవశాత్తూ ఫలితం దక్కింది. రెండు వేలు కాస్తా నాలుగు వేలు అయ్యాయి,’ అని చెప్పుకొచ్చాడు రెండో పనివాడు.   ‘ప్రభూ! మీరు పాపం డబ్బుని ఎంతో కష్టపడి సంపాదిస్తూ ఉంటారు. డబ్బు కోసం ఇల్లు విడిచి ఎక్కడెక్కడో వ్యాపారం చేసి వస్తుంటారు. అలాంటి డబ్బుని ఏదో ఒకటి చేసి పాడు చేయడం నాకు ఇష్టం లేకపోయింది. అందుకే ఓ గొయ్యి తీసి ఎవరికీ కనిపించకుండా ఆ డబ్బుని దాచిపెట్టాను. ఇదిగోండి మీరు ఇచ్చిన సొమ్ముని యథావిధిగా మీ చేతిలో పెడుతున్నాను,’ అంటూ వెయ్యి రూపాయలు ఉన్న మూటని వ్యాపారి చేతిలో పెట్టాడు మూడో పనివాడు.   ‘మూర్ఖుడా! డబ్బయినా, ప్రతిభ అయినా ఒక వరంలాంటిది. దాన్ని ఉపయోగించకపోతే ఎవరికీ పనికిరాకుండా పోతుంది. నీకు ఇచ్చిన అవకాశాన్ని వాడుకోలేకపోయావు. ఆ డబ్బు నీకూ ఉపయోగపడలేదు, నాకూ ఉపయోగపడలేదు. మొదటి ఇద్దరూ నేను ఇచ్చిన డబ్బులతో పాటు, వచ్చిన లాభాలని అట్టిపెట్టుకోండి. కానీ మూడో వ్యక్తికి ఇచ్చిన వేయి రూపాయలని కూడా నేను తిరిగి తీసేసుకుంటున్నాను,’ అన్నాడు వ్యాపారి.   ఇది బైబిల్‌లో Parable of the Talents అనే కథ ఆధారంగా రాయబడింది. ఇందులో వ్యాపారి తన ముగ్గురు పనివాళ్లకీ ఇచ్చిన సొమ్ముని ‘Talent’ అని పిలుస్తాడు. Talent అనేది పూర్వకాలంలో డబ్బుకి ఓ కొలబడ్డగా వాడేవారు (మిలియన్, లక్ష, వేయి లాగా). వ్యాపారి మొదటి పనివాడికి ఎనిమిది టాలెంట్లు, రెండోవాడికి రెండు టాలెంట్లు, మూడోవాడికి ఒక్క టాలెంటు ఇచ్చి వెళ్తాడన్నమాట. కానీ ఇక్కడ టాలెంట్ అంటే ప్రతిభ అన్న అర్థం కూడా వస్తుంది! ప్రకృతి మనలో ప్రతి ఒక్కరికీ కొన్ని టాలెంట్స్ ఇస్తుంది. వాటిని సవ్యంగా వాడుకున్నవాడు జీవితంలో పైకి వస్తాడు. ఉన్న ఒక్క టాలెంటునీ వాడుకోకుండా దాచుకున్నవాడు ఎందుకూ కొరగాకుండా పోతాడు. ఎక్కడ ఏ నష్టం వస్తుందో అని భయపడుతూ తన ప్రతిభని అణచివేసిననాడు జీవితం వృధా అయిపోతుంది. - నిర్జర.  

ఈ  విషయాలు  ఎట్టి పరిస్థితిలో ఎవ్వరికీ చెప్పకూడదు!

  మనసులో ఏదీ దాచుకోలేకపోవడం చాలా మంది బలహీనత. బాధ అయినా, సంతోషం అయినా, దుఃఖం అయినా తనకు తెలిసిన వారికో లేక స్నేహితులు, ఆత్మీయులకో ఏదో ఒక  సందర్భంలో చెప్పుకుని తీరతారు. అయితే ఇలా చెప్పడం తప్పని కాదు కానీ.. కొన్ని విషయాలు మాత్రం ఇతరులతో అస్సలు చెప్పడం మంచిది కాదని అంటున్నారు వ్యక్తిత్వ విశ్లేష నిపుణులు. ఏ వ్యక్తి అయినా ఇతరులతో అస్సలు చెప్పకూడని 5 విషయాలేంటో తెలుసుకుని వాటిని పాటిస్తే  వారి జీవితం చాలా మెరుగ్గా ఉంటుంది. ఆ అయిదు విషయాలేంటో తెలుసుకుంటే.. ఆర్థిక స్థితి.. ఉద్యోగం చేసేవారు అయినా వ్యాపారం చేసేవారు అయినా పొదుపు చేసేవారు అయినా తమ ఆర్థిక స్థితి గురించి మరో వ్యక్తికి చెప్పడం మంచిది కాదు. ప్రతి వ్యక్తి ఆర్థిక స్థితి సామాజిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది. డబ్బును చూసి మనుషులు మసలుకునే కాలమిది. ఎవరిదగ్గరైనా డబ్బు ఎక్కువ ఉందని తెలిసినా, ఎక్కువ సంపాదిస్తున్నారని తెలిసినా అప్పు కోసం, సహాయాల కోసం సులువుగా చుట్టూ చేరతారు. పక్క మనిషి గురించి పట్టించుకోని ఈ కాలంలో ఆర్థిక సహాయాలు చెయ్యడం అంత మంచిది కాదు. అందుకే ఆర్థిక స్థితి గురించి ఎవరికీ చెప్పకూడదు. ఇంటి సమస్యలు.. ప్రతి ఇంట్లోనూ సమస్యలుంటాయి. ఇంటి సమస్యలను ఇంటి వారితో చర్చించి వాటిని చక్కబెట్టుకోవడం శ్రేయస్కరం. అలా కాకుండా సలహాలు, సూచనలు ఇస్తారనో లేదా మనసులో భారం దించుకోవాలనే ఆలోచనతోనో ఇంటి సమస్యలు బయటి వారికి, తెలిసిన వారికి చెప్పడం మంచిది కాదు. రిలేషన్ గొడవలు..  నిజానికి తోబుట్టువులు, చుట్టాలు, బాగా దగ్గరి వారైనా సరే.. భార్యాభర్తల సమస్యలలో జోక్యం చేసుకోవడం, తీర్పులు ఇవ్వడం మంచిది కాదు. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న గొడవలు, సమస్యలు వారే పరిష్కరించుకుంటే వారిద్దరికి ఒకరి మీద మరొకరికి గౌరవం పెరుగుతుంది. ఏ సమస్యకైనా ప్రతి వ్యక్తి స్పందన వేరుగా ఉంటుంది. అనుభవాలు కూడా వేరుగా ఉంటాయి. కాబట్టి సమస్యలను బయటకు, లేదా ఇతరుల దగ్గరకు తీసుకెళ్లడం, చెప్పడం మంచిది కాదు. మూడవ వ్యక్తికి భార్యాభర్తల సమస్యలు చెబితే వారు దాన్ని ఎంటర్టైన్మెంట్ గా చూస్తారు. బలహీనతలు.. ప్రతి వ్యక్తిలోనూ బలాలతో పాటూ బలహీనతలు ఉంటాయి. చాలామంది వ్యక్తులలో లోపాలు, బలహీనతలను వెతుకుతారు. వాటిని వేలెత్తి చూపిస్తారు. విమర్శిస్తారు. అందుకే వ్యక్తులలో బలాలు బయటపెట్టినా సమస్య లేదు కానీ బలహీనతల గురించి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎవరికీ చెప్పకూడదు. ప్రణాళికలు.. పెద్ద పెద్ద విషయాల గురించి నిర్ణయాలు తీసుకునే ముందు, పెద్ద ప్రణాళికలు వేసుకునేటప్పుడు వాటిని మరొక వ్యక్తితో చెప్పకూడదు. జీవితంలో ఇంకా ఎదిగే దశలో వేసుకునే ప్రణాళికలు ఇతరులతో చెప్పకూడదు.                                                      *రూపశ్రీ.  

భాగస్వామితో బంధం  ఎంత బలంగా ఉందో ఈ 5 ప్రశ్నలు తేల్చేస్తాయ్..!

ప్రతి మనిషి జీవితంలో ఎన్నో బంధాలు ఉంటాయి. తల్లిదండ్రులు, స్నేహితులు, చుట్టాలు, తెలిసిన వారు ఇలా చాలామంది జీవితంలో  ముఖ్య పాత్ర పోషిస్తుంటారు. తల్లిదండ్రులు కన్నవారు కాబట్టి వారు జీవితాంతం పిల్లల విషియంలో పాజిటివ్ గానే ఉంటారు. ఇక స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు ఈ బంధాలన్నీ బయటినుండి వచ్చేవే.. అయితే అన్నింటి కంటే భాగస్వామి పాత్ర మాత్రం చాలా పెద్దది. జీవితంలో ఓ దశలో బంధంలోకి వచ్చి చివరి వరకు కలసి ఉండేవారు జీవిత భాగస్వాములు.  జీవిత భాగస్వాములతో బంధం  ఎంత బలంగా ఉంటే ఇద్దరి జీవితం, ఇద్దరి భవిష్యత్తు  అంతే గొప్పగా ఉంటుంది. ఈ బంధం ఎంత బలంగా ఉందో నిర్ణయించే   5 ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు దొరికే సమాధానాలే బంధం బలాన్ని స్పష్టం చేస్తాయి. అవేంటో తెలుసుకుంటే.. ప్రభావవంతంగా కమ్యూనికేట్ చేస్తున్నారా.. ఒక బంధం బలంగా ఉండాలంటే దానికి ముఖ్యంగా మంచి కమ్యూనికేషన్ అవసరం. మీరు,  మీ భాగస్వామి,  మీ ఆలోచనలు, భావాలు,  అవసరాలను బహిరంగంగా వ్యక్తపరచగలరో లేదో అంచనా వేయాలి.  ఒకరు చెప్పేది మరొకరు శ్రద్దగా వింటున్నారా? ఇద్దరి మధ్య చర్చలు వివాదాలు  వాదనలుగా మారుతున్నాయా? ఇలాంటివి  వివాదాలుగా మారకుండా   పరిష్కరించగలుగుతున్నారా? ఇవన్నీ కమ్యూనికేషన్  సమర్థవంతంగా ఉందా లేదా అనే విషయాన్ని నిర్ణయిస్తాయి.  కమ్యూనికేషన్ బాగుంటే ఇద్దరికి ఒకరి మీద మరొకరికి గౌరవం, నమ్మకం పెరుగుతాయి. ఏకభావం.. బలమైన బంధానికి  భాగస్వాముల విలువలు, ఇద్దరూ ఒకరి పట్ల మరొకరు ఎలా ఉంటున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది . మీరు అయినా,  మీ భాగస్వామి అయినా, ఇద్దరి  ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నారా? ఇద్దరి నిర్ణయాలు  కెరీర్, కుటుంబం, జీవనశైలి లేదా వ్యక్తిగత ఎదుగుదలకు సంబంధించినవా అని ఆలోచించాలి. ఇద్దరూ జీవితంలో ఎలాంటి విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు?  వంటివి ఇద్దరూ భవిష్యత్తు కోసం ఎంత మాత్రం ఏకభావంతో ఉన్నారనే విషయాన్ని స్పష్టం చేస్తుంది.  సంఘర్షణలు.. ఏ సంబంధంలోనైనా సంఘర్షణలు  తప్పనిసరిగా ఉంటాయి. అయితే వాటిని ఎలా డీల్ చేస్తారనే దానిపైనే బంధం ఆధారపడి ఉంటుంది.   భాగస్వామితో కలిగే  విభేదాలు,  సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో, ఎలా ఎదుర్కోవాలో పరిశీలించాలి. గొడవలు జరిగినప్పుడు రాజీ పడటం,  పరిష్కారం కోసం ప్రయత్నించడం వంటివి ఏ మేరకు జరుగుతున్నాయో తరచి చూసుకోవాలి.    వివాదాలు పెరుగుతున్నాయా?  వాటిని పరిష్కరించుకోవడానికి ఎంత సమయం తీసుకుంటున్నారు?  ఆరోగ్యకరమైన  రీతిలో గౌరవం మరియు పరస్పర ప్రయోజనకరమైన పరిష్కారాలను కనుగొనే సుముఖత ఉంటాయి. భావోద్వేగాలు.. భావోద్వేగ సాన్నిహిత్యం భౌతిక సాన్నిహిత్యానికి మించినది.  భాగస్వామితో భావోద్వేగ పరంగా లోతుగా కనెక్ట్  అయితే  ఇద్దరి మధ్య బంధం కూడా బలంగా ఉంటుంది. ఇద్దరి ఆలోచనలు, భయాలు , ఇబ్బందులను ఒకరితో మరొకరు సరిగా ఓపెన్ అయ్యి చెప్పుకుంటున్నారా?  అవసరమైన సందర్భాలలో ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారా?  ఇవన్నీ ఇద్దరి మధ్య బంధం ఎంత గాఢంగా ఉందో తెలియజేస్తుంది.  పెట్టుబడి.. ఏ వ్యాపారానికి అయినా ఎలాగైతే డబ్బు, కష్టం పెట్టుబడిగా పెడతారో.. అదే విధంగా  బంధం బలంగా ఉండటానికి సమయం పెట్టుబడి పెట్టాలి. ఇద్దరూ ఒకరికోసం ఒకరు సమయం ఎలా కేటాయించుకుంటున్నారనే దానిపై బంధం ఆధారపడి ఉంటుంది. ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో చురుకుగా ఉంటున్నారా?. ఇద్దరూ  కలిసి  క్వాలిటీ టైమ్ మెయింటైన్ చేస్తున్నారా?  ఒకరి అవసరాలకు మరొకరు ప్రాధాన్యత ఇస్తున్నారా? ఒకరిని మరొకరు మెచ్చుకోవడం, ప్రోత్సహించడం, సపోర్ట్ ఇవ్వడం  వంటివి చేస్తున్నారా? ఇవన్నీ ఒక బంధం బలపడటానికి పెట్టుబడులే.                                                       *రూపశ్రీ.

పొగడ్తలు ఎలాంటి పాత్ర పోషిస్తాయి?

పొగిడి చెడినవాడు లేడు. సమయోచితంగా పొగడలేని వారు అన్ని చోట్లా చెడిపోతారు. జీవితంలో కొందరికి జ్ఞానం ఒక దశలో వస్తుంది. అంతకు క్రితం నష్టమైపోయిన కాలాన్ని కూడదీసుకోవడానికి అన్నట్లుగా జ్ఞానోదయమైన మరుక్షణం నుండి అవతలివారిని అమితంగా, భరించలేనంతగా పొగడడం నేర్చుకుంటారు. ఇలాంటి వ్యక్తి తాను పొగిడేవాణ్ణి ఆకాశానికి ఎత్తేస్తాడు. 'ది స్కై ఈజ్ ది లిమిట్” అని రుజువు చేస్తాడు. అవతలి వ్యక్తి అలిసిపోయేంత వరకూ, లేక తాను అలిసేంత వరకూ పొగుడుతాడు.  ఒక్కొక్కసారి అక్కడ పొగడడానికి తగినంత విషయం లేనప్పుడు అతడి ఇంట్లో తనకు ఆతిథ్యమిచ్చిన ఆయన సతీమణి అమృతహస్తాన్ని, ఆవిడ వండి వడ్డించిన పదార్థాలు ఎంత రుచికరంగా వుంటాయో ఇలాంటి విషయాలను ఇరికించి మరీ చెప్తాడు. ఇలాంటి సబ్జక్టును గురించి ఎంతైనా చెప్పే వీలుంది. ఆ వంకాయ కూర, ఆ పాయసం, వారింటి నెయ్యి ఘుమఘుమలు, ఇట్లా చెప్పుకుపోతూ వుంటే దీనికి అంతుందా అనిపిస్తుంది. అక్కడ సన్మానంలో సన్మానితుడూ, ఉపన్యాసకుడూ అలసి పోయేలోగా శ్రోతలమైన మనం అలసిపోవడం ఖాయం. ఇలా ప్రసంగించేవాడికి సన్మానితుడు అసలెవరో తెలీని సందర్భాలు కూడా ఎదురావుతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఈ ప్రాసంగికుడు ఏ మాత్రం జంకడు. ఎవర్ని సన్మానిస్తున్నారో వారిని గురించి చీటిమీద మూడు ముక్కలు వ్రాసి ఇలా ఇవ్వండి. మూడునిమిషాల్లో ప్రసంగ పాఠంతో రెడీ అయిపోతాను. మీరు వేదికమీద ఆహ్వానితులు నలుగురికీ పూలమాలలు వేసేలోగా నా చెవిలో నాలుగుముక్కలు ఊదితే దంచి పారేస్తాను. ఎవరిని గురించి చెప్పే వాక్యాలైనా నాకు కంఠస్థమే, తడుము కోవలసిన అవసరముండదు. రాజకీయ, పారిశ్రామిక, విద్యావేత్తలెవరైనా సరే, కళాకారులు, సినిమా స్టారులైనా సరే. ఎవరికి తగిన సన్మాన వాక్యాలు వారికి వప్పజెప్పడానికి ఎప్పటికప్పుడు సిద్ధంగానే వుంటాను. గుటికెడు కాఫీ సేవించి గొంతు సవరించానంటే ఇక ఆ తర్వాత ఉపన్యాసం అనర్గళంగా సాగిపోతుంది" అని హామీ ఇస్తాడు. అన్ని రంగాల్లోనూ స్పెషలైజేషన్ చోటు చేసుకున్న నేటి కాలంలో పొగిడే కళలో కొందర్ని తర్ఫీదు చేసి, వారికి లైసెన్స్ మంజూరు చేయడంలో తప్పేమీ కనిపించదు అనిపిస్తుంది. ఈ లలితకళను శాస్త్రీయంగా ఎక్కడా అభ్యసించకపోయినా, అనేక సంవత్సరాల అలవాటు కొద్దీ దీనిని క్షుణ్ణంగా నేర్చినవారు మన రాష్ట్రంలో ఎందరో వున్నారు. ఇలాంటివి నేర్పటానికి  నెలకొల్పే సంస్థల్లో ప్రస్తుతానికి వీరిని అధ్యాపకులు గానూ, శిక్షకులుగానూ నియమించవచ్చు. ఒక బాచ్ విద్యార్థులు శిక్షణ పొందితే ఇక ఆ తర్వాత కావలసినంత మంది అధ్యాపకులు. సమోవా అనే చిన్న రాజ్యానికి ఒక రాజుండేవాడు. అతడి రాజ్యంలో డాక్టర్ విన్సెంట్ హైనర్ అనే పెద్దమనిషి కొన్నాళ్ళుండి కొంత ప్రజాసేవ చేశాడు. డాక్టరు మహాశయుడు ఆ రాజ్యాన్ని వదలి వెళ్ళే తరుణంలో ఆ రాజుగారు ఆయన గౌరవార్థం విందు ఏర్పాటు చేశాడు. ఆ సందర్భంగా రాజు డాక్టర్ను గురించి నాలుగు వాక్యాలు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. కాని రాజు కుర్చీలో కదలకుండా కూచున్నాడు. రాజు లేచి నుంచోని ప్రసంగించకుండా అలానే కూచోనుండటం డాక్టర్ హైనర్కు ఆశ్చర్యం కలిగించింది. ఈలోగా పొగడ్తనే వృత్తిగా చేసుకున్న ఒక వక్త వచ్చి రాజు తరపున డాక్టర్ హైనర్ గురించి బ్రహ్మాండమైన వాక్యాలతో దంచి పారేశాడు. సుదీర్ఘమైన ఆ ప్రశంసా వాక్యాల తర్వాత హైనర్ కొంత కింధా మీదై. ఉచిత రీతిని సమాధానం చెప్పడానికి లేచి నుంచోబోయాడు. రాజుగారు హైనర్ను వారిస్తూ కూచోమంటూ సౌంజ్ఞ చేశాడు. "మీ తరపున ప్రసంగించటానికి కూడా ఒక వక్తను నియమించాను. ఇక్కడ మా రాజ్యంలో ఇలాంటి ప్రసంగాలు ఆ వృత్తి స్వీకరించిన వారే చేస్తారు. ఔత్సాహికుల్ని ప్రోత్సహించడం మా పద్ధతి కాదు" అని వివరించాడు. ఇది పొగడటానికి కూడా ఎంత ప్రతిభ ఉండాలో తెలియజేస్తుంది. వాక్చాతుర్యం మనిషికి ఎంత ముఖ్యమో స్పష్టపరుస్తుంది.                                    ◆నిశ్శబ్ద.

సక్సెస్ నిధి తాళాలు ఇవిగో....

ఎవరైనా తమ వ్యక్తిగత ఎదుగుదలపై దృష్టి పెట్టాలి అనుకున్నప్పుడు మనల్ని మనం కొంత మెరుగుపరచుకోవాల్సి వుంటుంది. ఒక పద్ధతిలో ప్రయత్నిస్తే అది అసాధ్యమేమీ కాదు. ‘కష్టపడటం’ ఒక్కటే కాదు.. ఒక క్రమపద్ధతిలో ప్రయత్నించడం అవసరం. అందుకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఆ సూచనల్లో మొట్టమొదటి సూచన... సమాచార సేకరణ. కేవలం చదువుకునే విద్యార్థులు, ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికే ‘సమాచారాన్నిసేకరించే’ అవసరం వుంటుంది అనుకోవటం పొరపాటు అంటున్నారు నిపుణులు. పత్రికలు, ఇంటర్నెట్ వంటివి ‘విశ్వవ్యాప్త సమాచారాన్ని’ మన ముందు వుంచుతున్నాయి. ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని తెలుసుకుంటూ అప్‌డేట్‌గా వుంటటం మనల్ని, మన వ్యక్తిత్వాన్ని, మన అవకాశాలని మెరుగుపరిచే మొట్టమొదటి అంశం అట. ‘అసాధ్యాలు’ అంటూ ప్రపంచం ముద్రవేసి వదిలేసిన వాటిని కూడా ఛాలెంజ్ చేసి సాధించినవారి కోసం వింటూంటాం. ఏంటి వాళ్ళ ధైర్యం అనిపిస్తుంది. వాళ్ళ ధైర్యమల్లా వారి బలాలని వారు  కరక్టుగా అంచనా వేయటమే. ఎప్పుడూ మన బలాలు, బలహీనతల గురించి సరైన అవగాహన కలిగి వుండాలన్నది నిపుణులు చేస్తున్న రెండో సూచన. ఓ పేపర్ పైన మన బలం, సామర్థ్యం వంటి వాటిని రాసిపెట్టుకోవాలి. అలాగే మన బలహీనతలు, భయాలు వంటి వాటిని ఇంకో కాగితం మీద రాసి పెట్టుకోవాలి. దగ్గరి వ్యక్తులకి ఈ రెండు కాగితాలనీ చూపించి వారి సూచనలు అడగండి. అప్పుడు బలాలు, బలహీనలతని సమీక్షించుకుని... ఏం చేయొచ్చో.. ఏం చేయగలమో నిర్ణయించుకోవడం సులువవుతుంది. మనల్ని మనం మెరుగుపరచుకోవటానికి పెద్ద అడ్డంకి మన ‘భయాలు’. కొత్త వ్యక్తులతో మాట్లాడటమన్నా, నలుగురిలో తిరగడమన్నా, కొత్తపని మొదలుపెట్టడమన్నా భయపడేవాళ్ళు వుంటారు. ఆ భయాలని వదిలించుకోవటం ఏమాత్రం ఇష్టంలేదన్నట్టు పట్టుకుంటారు. అయితే మనల్ని మనం గెలవలేనప్పుడు ప్రపంచాన్ని ఏం గెలవగలం చెప్పండి? అందుకే ముందు మీలోని ఒక భయాన్ని గుర్తించి దాన్ని ఎదుర్కోవటం మొదలుపెట్టండి. నలుగురిలో తిరగటం భయమనుకోండి.. కష్టంగా అనిపించినా నలుగురిలో కలవటం మొదలుపెట్టాలి. కొన్ని రోజులపాటు ఇబ్బంది అనిపిస్తుంది. పారిపోవాలనిపిస్తుంది. అయినా వెనక్కి తగ్గక ప్రయత్నిస్తే ఒకరోజున అది అలవాటుగా మారిపోతుంది. ఒక భయాన్ని దాటగలిగినా చాలు- ఆ అనుభం, దాని నుంచి లభించిన ఆత్మవిశ్వాసం మిగిలిన భయాలని సులువుగా దాటేలా చేస్తాయి. మన మాటలు సూటిగా, స్పష్టంగా వుండాలి. అవి సూటిగా, స్పష్టంగా వుండాలంటే మన ఆలోచనలు కూడా స్పష్టంగా వుండాలి. మన ఆలోచనలు గజిబిజిగా వున్నప్పుడు సూటిగా మాట్లాడలేం. సూటిగా మాట్లాడని వ్యక్తుల మాటలకు సమాజంలో గౌరవం వుండదు. అందుకే మన పరిసరాలని శుభ్రం చేసుకున్నట్టు మన ఆలోచనలనీ క్లియర్‌గా పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు. అలాగే మన పనితీరు కూడా గజిబిజిగా కాకుండా ఒక పద్ధతిగా వుండాలి. అది మనల్ని రిలాక్స్‌గా వుంచుతుంది. అలాగే చూసేవారికీ మనపట్ల మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. నమ్మకం కుదురుతుంది. ఒత్తిడిని దూరంగా ఉంచగలిగితే చాలు... మన సామర్థ్యం రెండురెట్లు పెరుగుతుందట. అలా ఒత్తిడికి దూరంగా వుండాలంటే పనితీరు, సమయపాలన, పని విభజన వంటి వాటి పట్ల దృష్టి పెట్టాలి. అప్పుడు మన సామర్థ్యాన్ని వందశాతం వినియోగించుకోగలుగుతాం. అలాగే ఏ సమయంలోనైనా ఆత్మవిశ్వాసంతో, చెరగని చిరునవ్వుతో కనిపించే వ్యక్తులని ఇష్టపడని వారుండరు. చుట్టూ మనల్ని ఇష్టపడేవారి సంఖ్య పెరిగినకొద్దీ మన జీవితం ఆనందంగా మారిపోతుంది. కాబట్టి మనల్ని మనం ‘సరికొత్తగా’ ఆవిష్కరించుకోవడం అసాధ్యమేమీ కాదు. దీనికోసం నిపుణులు చేసిన సూచనలని తెలుసుకున్నారుగా.. ఇక ప్రయత్నించడమే మిగిలి వుంది. .....రమ  

నిస్సహాయులకు చెయ్యిద్దామా?

నిస్సహాయత ఏమీ చేయలేని, చేయాలనే ఆరాటం ఉన్నా చేయడానికి అవకాశం లేని ఒకానొక ఒంటరి స్థితి. మనిషిని నిలువునా ఒత్తిడిలోకి తోసి, ఆత్మన్యూనతా భావాన్ని పెంచే పరిస్థితి. ప్రపంచంలో ఇలాంటి నిస్సహాయులు ఎందరో ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ తిండి కోసం, ఉండటానికి నీడ కోసం ఎవరిని అడగాలో తెలియక, తమకు ఏమీ చేసే అవకాశాలు లేక అలా శూన్యం నిండిపోయినట్టు ఉండే స్థితి నిస్సహాయత. ఎందుకీ నిస్సహాయత?? ప్రపంచంలో మనిషి చేసుకుంటే ఎన్ని పనులు ఉండవు అని అనుకుంటారంతా. కానీ కొన్ని సార్లు అన్ని వైపుల నుండి తలుపులు మూసుకుపోయి చీకటిలో పడిపోయినట్టు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏదో ఒక చెయ్యి కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఆ తలుపులు ఎక్కడున్నాయో కనబడక, ఎవరైనా ఆ తలుపులు తీస్తారేమో అనే ఆశతో ఉంటారు. అందుకే ఏమీ చేతకానితనంతో అట్లా ఉండిపోతారు.  ఎక్కడెక్కడ?? నిస్సహాయతకు చోటు లేని ప్రదేశమంటూ లేదు. చోటివ్వని మనిషంటూ లేడు. చిన్న పిల్లాడి నుండి పెద్దవాళ్ళ దాకా ఎంతోమంది ఉంటారు. అయితే చాలా వరకు యూత్ లోనూ, మహిళల్లోనూ ఈ నిస్సహాయత బాధితులు ఎక్కువగా ఉంటున్నారు అనేది నమ్మితీరాల్సిన నిజం. మరీ ముఖ్యంగా కట్టుబాట్ల కంచెల మధ్య నలిగిపోతున్న ఎంతో మంది మహిళలు ఏదో చెయ్యాలని, తమ జీవితాలను మార్చుకోవాలని ఉన్నా అందరికీ పైపైన కనబడే విషయాలు వీళ్ళకేం బాగున్నారులే అనిపించేలా చేస్తున్నాయి. కానీ పైకి కనిపించేది వేరు, లోపల వాళ్ళ సంఘర్షణ వేరు. చేయూత!! నిస్సహాయంగా ఉన్న ఇలాంటి వాళ్ళ సంఘర్షణను గుర్తించే కొన్ని మహిళా స్వచ్చంధ చేయూత సంస్థలు ఆవిర్భవిస్తున్నాయి. అయితే ఇలాంటివి అందరికీ అందుబాటులో ఉండటం లేదు. కొన్ని మహానగరాలకు పరిమితమైతే మరికొన్ని దూరప్రాంతాలలో ఉండటం వల్ల ఎంతోమంది ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. నిజం చెప్పాలంటే దిగువ తరగతి  కులాల మహిళల కంటే, ఉన్నత కులాల మహిళలలో ఇలాంటి నిస్సహాయులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ పరువు, సమాజం, గౌరవం అనే గీతల వెనుక నిస్సహాయంగా నిలబడుకుని శూన్యపు చూపులు చూస్తుంటారు. మధ్యలోనే చదువు ఆగిపోయి, సంప్రదాయాలలో చిక్కుకుపోయి, గడప దాటి బయటకు వెళ్లే స్వేచ్ఛ లేని స్త్రీ సమాజం ఎంతో ఉంది. ఒక్క తలుపు తెరవండి!! ఇలాంటి సమస్యలో చిక్కుకుని మానసికంగా నలిగిపోయేవాళ్లకు సొంత ఆలోచన క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఏమి చేయలేకపోతున్నామనే చేతగాని తనమే అలాంటి అజ్ఞానపు వృత్తంలో పడిపోవడానికి కారణం అవుతుంది. అయితే నీ చుట్టూ బోలెడు ప్రపంచం ఉందని, అవకాశాలు ఉన్నాయని, దారి కూడా ఉందని చెబుతూ నువ్వున్నది ఓ చిన్న గది  మాత్రమే ఒక్కసారి మొత్తం తరచిచూస్తే ఎక్కడో ఒకచోట తలుపులు చేతికి దొరుకుతాయి అని మాటలతో భరోసా నింపితే ఆంజనేయుడికి  గుర్తుచేయగానే శరీరం పెరిగినట్టు వీళ్లకు కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలా మెల్లిగా మీ మాటలతోనే ఒక తలుపు తెరిచి వాళ్లకు చూపించినట్టవుతుంది కూడా.  ప్రపంచం పెద్దది!! మనుషులే చిన్నతనంతో ఉన్నారు!! ఆలోచిస్తే ఇదే నిజమని అనిపిస్తుంది. నిజానికి ఒకమనిషి బాగుపడితే చూసి సంతోషించేవాళ్ళు ఎక్కువ లేరు ఈ ప్రపంచంలో. ఎప్పుడూ అవతలి వాడిని ఎలా ముంచుదామా, వాడిది ఎలా లాక్కుందామా అనే ఆలోచనే తప్ప  అయ్యో ఇలా చేస్తే దారి కనబడుతుంది కదా వెళ్లి చెబుదాం అనుకునేవాళ్ళు ఎవరూ ఉండటం లేదు. ఎక్కడో, ఎవరో నూటికి ఒక్కరు ఉన్నా వాళ్ళ సాయం అందుకునే వాళ్ళు ఏ కొద్దీ మందో అంతే. మిగిలినవాళ్లకు పైన చెప్పుకున్నట్టు సంఘర్షణే మిగుల్తోంది. అందుకే మనుషులు తమ మనసును కాసింత పెద్దగా చేసుకోవాలి. అందులో ఎన్నో హృదయాలకు ప్రేమను పంచాలి. ఆ ప్రేమను అందుకున్న వాళ్ళు నిస్సహాయత నుండి బయటకొస్తారు నేస్తాల్లారా!! ◆వెంకటేష్ పువ్వాడ.

అమ్మతో మన హీరోలు

ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకే అంటారు. అందుకే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే అంటూ పాటను రాశారు రచయితలు. బ్రహ్మకు మారు పేరు అమ్మ. మనకు దెబ్బ తగిలినా వెంటనే అమ్మా అని అంటాము. అంటే మనకు ఆనందం కలిగినా..బాధ కలిగినా వెంటనే అమ్మ గుర్తొస్తుంది. రెండు గంటల పాలు మనల్ని వినోదంలో ముంచెత్తే మన తారలైనా అమ్మకు ముద్దుల బిడ్డలే. మన తెరవేల్పుల్లో చాలా మంది అమ్మతో అనుబంధం గురించి వేదికలపైనో ప్రెస్ మీట్‌లలోనో చెబుతూ ఉంటారు. మన హీరోలు వాళ్ల అమ్మతో దిగిన చిత్రమాలిక మీ కోసం..   అమ్మ రమాబాయితో  రజనీకాంత్ అమ్మ అంజనాదేవితో  చిరంజీవి, నాగబాబు    అమ్మ అంజనాదేవితో  పవన్ కళ్యాణ్  అమ్మ ఇందిరాదేవితో  మహేశ్  అమ్మ షాలినితో ఎన్టీఆర్ అమ్మ రాజ్యలక్ష్మీతో  రవితేజ అమ్మ శివకుమారితో  ప్రభాస్  అమ్మ సురేఖతో రామ్‌చరణ్ అమ్మ నిర్మలతో అల్లు అర్జున్, అల్లు శిరీష్ అమ్మ విజయలక్ష్మీతో నాని

ఇది చదివితే ఉద్యోగం గ్యారెంటీ!

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించడం కాస్త కష్టమైన పనే. చదివిన చదువుకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షించేవారు ప్రస్తుతం తక్కువే. పట్టణాలలో మంచి మంచి కంపెనీలలో గౌరవప్రదమైన వేతనంతో, హుందాగా ఉండే ఉద్యోగాలు చాలానే ఉన్నాయి. చాలామంది ఆ ఉద్యోగాల విషయంలో కూడా గందరగోళానికి గురవుతూ ఉంటారు. కారణం ఇంటర్వ్యూ లో సక్సెస్ కాకపోవడం. ఎంతో బాగా చదివి, మంచి ర్యాంక్ లు సాధించిన వారు కూడా ఇంటర్వ్యూ దగ్గరకు వచ్చేసరికి ఫెయిల్ అవుతూ ఉంటారు. మరి ఇంటర్వ్యూ లో సక్సెస్ కావాలంటే ఏమి చేయాలి??  ఎంపిక: కొంతమంది ఖాళీగా ఉన్నాం ఏదో ఒక జాబ్ తొందరగా చూసుకోవాలి, ఏదో ఒకటి క్లిక్ అవ్వకపోతుందా అనే ఆలోచనతో వరుసపెట్టి అన్నిటికి అప్లై చేసేస్తూ ఉంటారు. దీనివల్ల నెలకొనేదే పెద్ద గందరగోళం. కాన్ఫిడెంట్ లేకుండా పది కంపెనీలలో ఇంటర్వ్యూ కు వెళ్లడం కంటే కాన్ఫిడెంట్ తో ఒక్కదానికి అటెండ్ అవ్వడం మంచిదనే విషయం మర్చిపోకండి.  నాట్ ఓన్లీ దట్: ఇంటర్వ్యూ కాల్ వచ్చినప్పటి నుండి అందరూ చేసే పని, తాము అప్లై చేసిన జాబ్ కు సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మననం చేసుకుంటూ వాటిని బట్టి పట్టడం. దీనివల్ల ఒనగూరేది ఏమి ఉండదు. ఎందుకంటే వాటిని మననం చేసుకుంటూ మిగిలిన వాటిని ఎంతో సులువుగా మర్చిపోయే అవకాశం ఉంటుంది. పైపెచ్చు ఇంటర్వ్యూ లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేది సంస్థకు సంబంధించిన వారి ఇష్టం. వారు పూర్తి జాబ్ కు సంబంధం లేని విషయం అయినా అడగవచ్చు. ఎందుకంటే వాళ్లకు కావలసింది పని చేయడం మాత్రమే కాదు అనే విషయం గుర్తుంచుకోవాలి. కాబట్టి వర్క్ కు సంబంధించిన విషయాలు ఒక అంశం మాత్రమే. మరింకేం కావాలి?? నమ్మకం ఇవ్వగలగాలి. బాధ్యతాయుతంగా ఉండగలరు అనే నమ్మకాన్ని ఇవ్వగలగాలి. చాలా సంస్థల్లో మొదట ప్రాధాన్యత ఇచ్చే విషయం కూడా ఇదే.  పని చేయబోయే సంస్థ  విషయంలో, చేయబోయే వృత్తి విషయంలో ఎంత బాధ్యతాయుతంగా ఉండగలరు అనే విషయం మీదనే ఎంపిక ఎక్కువగా జరుగుతుంది. అలాగే పని పట్ల నిబద్ధత ఎంతో అవసరం. పనికి ప్రాధాన్యత ఇచ్చేవారి వైపు కంపెనీ మొగ్గు చూపుతుంది. కాబట్టి పని విషయంలో భరోసా ఇవ్వగలగాలి. స్పృహ కలిగి ఉండాలి: ఇంటర్వ్యూకు వెళ్ళినప్పుడు కంపెనీ భవంతిలో అడుగుపెట్టినప్పటి నుండి చుట్టుపక్కల వాతావరణం ను గమనించుకుంటూ వెళ్ళాలి. కంపెనీలలో ప్రతిచోటా సీసీ కెమెరాల నిఘా ఉంటుందనే విషయం మరువకూడదు. మనిషి కదలిక నుండి ఆహార్యం వరకు ప్రతి విషయంలో ఒక నిజాయితీ కనిపించాలి. నటించాలని చూస్తే ఖాళీ చేతులతో బయటకు రావడం ఖాయం. తన పని మాత్రమే చూసుకుని పోయే వాళ్లకు ప్రాధాన్యత తక్కువగానే ఉంటుంది. ఇంటర్వ్యూ రూమ్ దగ్గరకు వెళ్లే మార్గంలో ఉన్న క్యాబిన్ లలో ఎవరు లేకుండా ఉండి, ఫ్యాన్ లు, లైట్ లు వంటివి ఆన్ లో ఉంటే వాటిని ఆఫ్ చేయడం. నీటిని వృథా చేయకపోవడం, లిఫ్ట్ సౌకర్యం ఉన్నా మెట్లెక్కి వెళ్లడం. మంచినీళ్లు వంటివి ఇచ్చే బాయ్ ని నవ్వుతూ పలకరించడం, థాంక్స్ చెప్పడం. ముఖ్యంగా సంస్థ గూర్చి ఇంటర్వ్యూ కు వచ్చిన తోటి వ్యక్తులతో ఎలాంటి చర్చా చేయకుండా ఉండటం. సంస్థ గురించి ముందుగానే వివరంగా తెలుసుకోవడం. అంటే సంస్థ స్థాపన నుండి ప్రస్తుతం అధికారుల వరకు అన్నిటి గూర్చి వారి కృషి గురించి కూడా అధ్యయనం చేసి తెలుసుకోవడం. స్కిల్స్ ఎప్పుడు కిల్ చేయకూడదు: కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇంటర్వ్యూ లో అధికారులతో మాట్లాడేటపుడు కావాలని వారిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించకూడదు. లేకపోతే మీ స్కిల్స్ ను మీరే కిల్ చేసుకున్నట్టు అవుతుంది.  ముందుగా మరింత ఉత్సాహంగా: ఇక చివరగా చెప్పుకున్నా అన్నిటికంటే ముందు చేయవలసిన పని. ఇంటర్వ్యూ కు హడావిడిగా చివరి నిమిషంలో వెళ్లకుండా, వీలైనంత ముందుగా వెళ్లడం. దీనివల్ల కంపెనీని అక్కడి వాతావరణాన్ని, పని విధానాన్ని అంతో ఇంతో గమనించే వెసులుబాటు ఉంటుంది. తద్వారా సహజంగానే గందరగోళం తగ్గిపోతుంది.  ట్రస్ట్ యువర్ కాన్ఫిడెన్స్: మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు నమ్మండి. ఎవరో ఏదో భయపెట్టేలా చెప్పే మాటలు, విషయాలు ఏవి పరిగణలోకి తీసుకోవలసిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా ఉన్నట్లయితే, మీ వ్యక్తిత్వం నుండి, పని విషయం వరకు మీ అభిప్రాయాలు నచ్చాయంటే ఏ కంపెనీ ఎం.డి కూడా మిమ్మల్ని వదులుకోడు.  సక్సెస్ మీ చేతుల్లోనే ఉంది సుమా!! ◆ వెంకటేష్ పువ్వాడ

టీవీ చూస్తే బాసూ... మెమరీ లాసు...

ఎక్కువసేపు టీవీ చూస్తున్నారా? అయితే మిమ్మల్ని త్వరలోనే మతిమరుపు పలకరిస్తుంది అంటున్నారు ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు. రోజుకి గంటకన్నా తక్కువ సమయం మాత్రమే టీవీ చూస్తున్న వారికి మధ్య జ్ఞాపకశక్తి విషయంలో చాలా తేడా వుందని వీరి పరిశోధనలో తేలింది. కొన్ని వేలమందిపై రకరకాల పరీక్షలు నిర్వహించి తేల్చిన విషయమిది. చిన్న చిన్న విషయాలని కూడా టీవీని అతిగా చూసేవారు మర్చిపోతుండటం గమనించారట వీరు. ముఖ్యంగా పిల్లల జ్ఞాపకశక్తిపై టీవీ చాలా ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్నారు వీరు. స్కూలుకి వెళ్ళేముందు లేదా చదువుకోవటానికి కూర్చునే ముందు టీవీ చూస్తే వారి ఏకాగ్రత, జ్ఞాపకశక్తిపై ప్రభావం ఖాయమని గట్టిగా చెబుతున్నారు. మరి జ్ఞాపకశక్తి పెరగడానికి ఏం చేయమంటారు అని వీరిని అడిగితే అందుకు చాలా మార్గాలున్నాయ్. అయితే టీవీ చూడటం తగ్గించమంటున్నాం కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మిమ్మల్ని ఆహ్లాదపరిచే మరో మార్గం ఉంది. దానివల్ల మానసిక, శారీరక ఆరోగ్యం కూడా స్వంతమవుతుంది జ్ఞాపకశక్తి పెరగడంతోపాటు అంటున్నారు. ‘కాల్పనిక సాహిత్యం’ చదివితే మెదడు పదునెక్కుతుంది. జ్ఞాపకశక్తి పెరగుతుంది. మతిమరుపు తగ్గుతుంది. మానసిక ఉల్లాసం సొంతమవుతుంది. నమ్మకం లేకపోతే ఓ 20 రోజులపాటు మేం చెప్పింది పాటించి చూడండి అని చెబుతున్నారు ఈ ఆస్ట్రేలియా పరిశోధకులు. మరి టీవీ చూడటం తగ్గించి చదవటం మొదలుపెడదామా!? -రమ

ఫ్యాన్ సెట్టింగ్ లో ఈ 5 మార్పులు చేస్తే ఏసీ కూడా పనికిరాదు..!

ఫ్యాన్.. ప్రతి ఇంట్లో చాలా సాధారణంగా ఉండే ఎలక్ట్రిక్ పరికరం.  బయట నుండి ఇంటికి రాగానే ఫ్యాన్ వేసుకుని దాని కింద కూర్చుని రిలాక్స్  అవుతుంటాం. అయితే వేసవి కాలంలో ఫ్యాన్ వేగం తగ్గినట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఫ్యాన్ వేసినా అసలు వేయనట్టే అనిపిస్తుంది. అందుకే చాలా మంది ధర ఎక్కువైనా ఏసీ వైపు మొగ్గు చూపుతారు. కానీ ఫ్యాన్ సెట్టింగ్ లో 5 మార్పులు చేయడం వల్ల ఫ్యాన్ స్పీడ్ గా తిరుగుతుంది. దాని వేగం.. అది ఇచ్చే చల్లదనం ముందు ఏసీ కూడా బలాదూర్ అంటున్నారు టెక్నాలజీ నిపుణులు. ఇంతకీ ఆ సెట్టింగ్స్ ఏంటో తెలుసుకుంటే.. కెపాసిటర్.. సీలింగ్ ఫ్యాన్‌లో అమర్చిన కెపాసిటర్ మోటార్‌కు అవసరమైన విద్యుత్‌ను అందించడానికి పనిచేస్తుంది. కెపాసిటర్ల పనితీరు మందగించినట్టైతే  90% కంటే ఎక్కువ సీలింగ్ ఫ్యాన్ సమస్యలు ఎదురవుతాయి. కెపాసిటర్ పని చేయడం ఆపివేసినప్పుడు మోటారుకు విద్యుత్ సరిగా అందదు.  దీంతో ఫ్యాన్ వేగం తగ్గుతుంది.  70 నుండి 80 రూపాయల కెపాసిటర్‌ను తిరిగి అమర్చితే  ఫ్యాన్ వేగం పెరుగుతుంది.   బ్లేడ్.. కొన్ని సార్లు ఫ్యాన్ బ్లేడ్ వంగడం వల్ల కూడా ఫ్యాన్ వేగం తగ్గుతుంది. అలాంటి పరిస్థితిలో ఫ్యాన్ బ్లేడును మార్చాలి.  దీనివల్ల కూడా సీలింగ్ ఫ్యాన్ వేగం పెరుగుతుంది. బాల్ బేరింగ్ ఫెయిల్యూర్.. సీలింగ్ ఫ్యాన్లు కాలం గడిచేకొద్దీ వాటిలో బాల్ బేరింగ్స్ లో ధూళి పేరుకుపోతుంది. దీని కారణంగా సీలింగ్ ఫ్యాన్ వేగం తగ్గుతుంది.  దాన్ని మరమ్మత్తు చేయడం ద్వారా ఫ్యాన్ వేగం పెంచవచ్చు. స్క్రూలు.. ఫ్యాన్ లో స్క్రూలు వదులైతే ఫ్యాన్ వేగాన్ని దెబ్బతీస్తాయి. అందుకే ఫ్యాన్ స్క్రూలు సరిగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి. సరళత. సరళత లేకపోవడం కూడా ఫ్యాన్ వేగాన్ని దెబ్బతీస్తుంది. దీన్ని కూడా రిపేర్ చేయించడం ద్వారా ఫ్యాన్ వేగాన్ని పెంచవచ్చు.                                                *రూపశ్రీ.

నవ్వుల  చిత్రాలు ఎన్నెన్నో..!

నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత అయిన జంధ్యాల. ఈయన నవ్వు గురించి చెప్పినప్పుడు ఆ నవ్వు ప్రాముఖ్యత ప్రజలకు అంతగా తెలియలేదు. కానీ ఇప్పుడూ లాఫింగ్ క్లబ్బులు పెట్టుకుని మరీ నవ్వేస్తున్నారు. నవ్వు ఓ గొప్ప ఔషధం అని వైద్యులు కూడా క్లీన్ చిట్ ఇచ్చేస్తున్నారు. ఒక చిన్న నవ్వుతో ఎలాంటి వారిని అయినా గెలవచ్చు, ఎంత కఠిన హృదయం గలవారిని అయినా మార్చేయచ్చు అంటారు. అసలు నవ్వుకు ఇంత గొప్ప శక్తి ఉందంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. నవ్వుకున్న గొప్పదనాన్ని గుర్తుచేసుకుంటూ, నవ్వుతో ప్రపంచాన్ని కాస్తో కూస్తూ మార్చాలనే తపనతో ప్రతి ఏడాది నవ్వుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు కూడా. ఒక మనిషి జీవితంలో నవ్వు ఎంత మార్పు తెస్తుందో.. ఎలాంటి మార్పు తెస్తుందో కాసింత వివరంగా తెలుసుకుంటే ఔషధం.. నవ్వును ఔషధం అంటుంటే చాలామందికి కామెడీగా అనిపిస్తుంది కానీ ఇది అక్షరాలా నిజం. సైన్సే కూడా ఇదే నిజమని చెప్పింది. నవ్వినప్పుడు శరీరంలో విడుదల అయ్యే హ్యాపీ హార్మోన్లు మనిషికి ఉన్న ఆందోళన, ఒత్తిడి, నిరాశ వంటి మానసిక రుగ్మతలను సులువుగా తగ్గిస్తుంది. అందుకే నవ్వును ఔషధం అన్నారు. ప్రతి రోజూ ఉదయాన్నే ఎలాంటి సంకోచం లేకుండా కొన్ని సెకెన్ల నుండి నిమిషాల పాటూ  అలా పెదవులు సాగదీసి నవ్వితే ఇక ఆ రోజంతా చాలా హ్యాపీ మూమెంట్లోనే గడిచిపోతుంది. పాజిటివ్.. మనిషి జీవితంలో పాజిటివ్, నెగిటివ్ అంటూ రెండూ ఉన్నాయి. పాజిటివ్ ఆలోచనలు మనిషి జీవితంలో ఉన్నతికి తోడ్పడతాయి. నెగిటివ్ ఆలోచనలు ఉంటే మనిషి పతనానికి కారణం అవుతాయి. పాజిటివ్ వైబ్రేషన్ ను కలిగించడంలో నవ్వుదే కీలక  పాత్ర. ఎవరితోనైనా బాగా గొడవ పడినప్పుడు వారితో విభేదాలు వచ్చినప్పుడు ఇక వారితో మాట్లాడకుండా ఉండిపోతారు. కానీ వారు ఎప్పుడైనా తారసపడినప్పుడు ఒక చిన్న నవ్వు నవ్వి చూడండి. పాత గొడవలు, కలహాలు అన్నీ మర్చిపోయి వారు కూడా తిరిగి నవ్వుతారు. మళ్ళీ బంధం చిగురిస్తుంది. విజయానికి మెట్టు.. నవ్వు విజయానికి తొలిమెట్టు అవుతుంది. నవ్వు వల్ల జీవితంలో ఎంత కష్టాన్ని అయినా సునాయాసంగా అధిగమించగలుగుతారు. ఎక్కడలేని ఓర్పు, సహనం, నవ్వుతో వచ్చేస్తాయి. నవ్వుతూ ఇంకొకరిని ఎంకరేజ్ చేస్తే ఇంకొకరు విజయంలో భాగస్వాములు కూడా అవుతారు. సంబంధాలు.. పైన చెప్పుకున్నట్టు.. మనుషుల మధ్య ఎలాంటి సమస్యలున్నా నవ్వు పరిష్కరిస్తుంది. ఎంత గొడవ వచ్చినా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నవ్వుతూ సర్థి చెప్పడం వల్ల పెద్దగా మారాల్సిన గొడవలను చిన్నగా ఉండగానే పరిష్కరించుకోవచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇతరులు, ఆఫీసులో కొలీగ్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే నవ్వు వల్ల బలంగా ఉండే బంధాలు బోలెడు.                                                   *నిశ్శబ్ద.

వ్యక్తిత్వానికి అనుగుణంగా కెరీర్

మీ ఆసక్తి, వ్యక్తిత్వానికి సరిపోయే వృత్తిని ఎంచుకోవడం వ్యక్తిగత వృద్ధికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. జీవితంలో చాలా సార్లు డబ్బు కంటే ఆనందం, శాంతి ముఖ్యం. కాబట్టి, మీ అభిరుచులు, లక్షణాలను సరిగ్గా తెలుసుకుని కెరీర్‌ను ఎంచుకోండి. అందరూ ఇంజినీరింగ్ చేయలేరు. అందరూ డాక్టర్, లాయర్, సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ కాలేరు. ప్రతి ఒక్కరూ బికామ్ లాగా కనీసం బ్యాచిలర్ డిగ్రీని కామర్స్‌లో పూర్తి చేయలేరు. మీరు ఏది చదివినా...అది జీవనోపాధి కోసమే పని చేయాలి. చాలామంది కొన్ని మంచి కోర్సులు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. చదువు తర్వాత ఉపాధిపరంగా కొన్ని కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. ఉద్యోగం పొందడం సులభతరం చేసే అనేక విద్యా కోర్సులు ఉన్నాయి. కానీ, ఉద్యోగ సంతృప్తి కోసమే కాదు, వ్యక్తిత్వాన్ని కూడా వికసించాలి. చేసే పనిలో శాంతి ఉండాలి. అలా ఉండాలంటే మన వ్యక్తిత్వం, గుణం, స్వభావం, అభిరుచికి తగ్గట్టుగా ఉద్యోగం చేయాలి. ఈమధ్య ఈ కాన్సెప్ట్ బాగా పాపులర్ అయినప్పటికీ ఉద్యోగం సంపాదించాలనే కోరికతో ఏదో ఒకటి చేసేవాళ్ళు ఎక్కువ. దాంతో మనశ్శాంతిని కోల్పోతున్నారు. ఏ వృత్తిని ఎంచుకున్నా మంచి వ్యక్తిత్వం ఉండాలి. అప్పుడే విజయం సాధ్యమవుతుంది. కానీ, ప్రస్తుతం అన్ని చోట్లా పోటీ నెలకొంది. అందువల్ల, చాలా మంది యువకులకు కెరీర్‌ను ఎంచుకోవడం డైలమాగా మారింది. అయితే ఉద్యోగం వస్తే చాలు అని ఆలోచించడం కంటే మీ అభిరుచికి, వ్యక్తిత్వానికి అనుగుణంగా ఉద్యోగాన్ని ఎంచుకోవడం సరైనది. దీని కోసం చేయవలసిన మొదటి విషయం ఏమిటంటే మీ ఆసక్తుల గురించి స్పష్టంగా తెలుసుకోవడం. మీ సామర్థ్యాలను తెలుసుకోండి. మీరు మీ విలువలు, వ్యక్తిత్వానికి సరిపోయే ఉద్యోగాన్ని ఎంచుకుంటే విజయం సులభం అవుతుంది. ఏది నచ్చదు? మీకు నచ్చని వాటిని గుర్తించడం ఎంత ముఖ్యమో, మీకు ఏది ఇష్టమో గుర్తించడం కూడా అంతే ముఖ్యం. నలుగురితో కాలక్షేపం చేయనివారు మార్కెటింగ్ ఉద్యోగానికి సరిపోరు. నేడు సాధారణ విద్యను అభ్యసించిన వారికి అనేక రకాల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వాటిలో ఏది మీరు ఆనందించగలరో ఆలోచించండి. ఏది కష్టమో గ్రహించండి. బలహీనతలు ఏమిటి? ఒక వ్యక్తి ఎంత అవగాహన పెంచుకున్నా, కొన్ని స్వాభావిక గుణాలు పోవు. ఉదాహరణకు..మీది ఒంటరిగా ఉండే మనసతత్వం అయితే...ఒంటరిగా నిర్వహించగల ఉద్యోగం సరిపోతుంది. గ్రూప్ వర్క్ కు దూరంగా ఉండటం మంచిది. మీరు ఏ స్వభావాన్ని మార్చుకోలేరు అనేది మీ బలహీనత అని చెప్పవచ్చు. వాటిని గుర్తించండి. కార్యాలయంలో వారితో ఎలా వ్యవహరించాలో తెలుసుకోండి. ఇలా చేయడం వల్ల లక్ష్యాన్ని చేరుకోవడం సులభం అవుతుంది. ఎక్కడ ఫిట్‌గా ఉంది..  కేవలం జీతం కోసం  ఇష్టం లేని ఉద్యోగం చేయనక్కర్లేదు. జీతం తక్కువే అయినా.. వేరే ఉద్యోగంలో ఆసక్తి ఉంటే.. ఆనందంగా అనిపిస్తే అక్కడికి షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేయవచ్చు. అయితే, ఎవరైనా ఆసక్తిని పదేపదే మార్చకూడదు. ఇది కాదు. ఒక నిర్దిష్ట వృత్తిలో ఒక సముచిత స్థానాన్ని కనుగొనాలి. అప్పుడే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు.