ప్రతి మనిషిలోనూ ఓ వేటగాడు!

ఈమధ్య కాలంలో ఎక్కడ చూసినా జనం ‘పోకెమాన్‌ గో’ ఆటని ఆడుతూ కనిపిస్తున్నారు. ఇది వేలంవెర్రిగా మారిందని పెద్దలు తిట్టుకుంటున్నా, దీని పర్యవసానాల గురించి పరిశోధనలు జరుగుతున్నా... ఆటలు ఆడేవారు మాత్రం పోకెమాన్ల వెంట పడుతూనే ఉన్నారు. ‘ఇంతకీ మనిషి ఈ ఆటకి ఎందుకింతగా వ్యసనపరుడయ్యాడు?’ అన్న ప్రశ్నకి ఓ స్పష్టమైన జవాబు లభిస్తోంది.

తన జీవితమే ఒక పరిశోధన

రష్యాలో పుట్టి పెరిగిన ‘వ్లాదిమిర్‌ డినెట్స్’ అనే ఆయన, ప్రస్తుతం అమెరికాలో మనస్తత్వ శాస్త్రంలో ప్రొఫెసరుగా పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన పోకెమాన్‌గో పిచ్చి గురించి వ్లాదిమిర్‌కి కూడా కొన్ని సందేహాలు వచ్చాయి. మనిషిలో స్వతహాగా ఉండే వేటగాడి మనస్తత్వం వల్లే మనం ఈ ఆటని ఇష్టపడుతున్నామా అన్న అనుమానం కలిగింది. దాంతో ఒక్కసారి తన జీవితంలో జరిగిన విషయాలనే ఒక్కొక్కటిగా నెమరువేసుకుంటూ ‘మనిషిలో వేటగాడు’ అనే ఆలోచనకు ఓ రూపం ఇచ్చేందుకు ప్రయత్నించారు.

వేటే ఆధారం

ఇప్పుడంటే తాజా ఆకుకూరలు, షడ్రసోపేతమైన ఆహారాలు లాగిస్తున్నాం కానీ, ఆదిమానవులుగా ఉన్నప్పుడు మనం వేట మీదే కదా ఆధారపడింది. ఆ వేటతోనే కదా వారి ఆకలి తీరింది. కాబట్టి మిగతా జంతువులలాగానే మనిషిలో ఇంకా ఆ వేట తాలూకు ఛాయలు పోలేదంటారు వ్లాదిమిర్‌. అందుకు తన జీవితమే ఒక ఉదాహరణగా చెప్పుకొస్తున్నారు. వ్లాదిమిర్‌ చిన్నప్పుడు తన తండ్రి సీతాకోక చిలుకల వెంటపడటాన్ని గమనించేవాడు. ఆయన సీతాకోక చిలుకల్ని గమనిస్తూ, వాటి వెంటపడుతూ, వాటిలో అరుదైనవాటిని సేకరిస్తూ ఉండేవారట. వ్లాదిమిర్‌కు ఐదేళ్లు వచ్చేసరికి దగ్గరలో ఉన్న అడవులకు వెళ్లి అక్కడ ఉండే జంతువులని గమనించే అలవాటు మొదలైంది. తరువాత కాలంలో వ్లాదిమిర్‌, మాస్కో మహానగరంలో అడుగుపెట్టాడు. అక్కడ అతను పార్కుల్లో పక్షులనీ, పెరట్లో పురుగులనీ గమనించడం మొదలుపెట్టాడు. ఆ తరువాత అరుదైన జంతువులని గమనించడాన్నే వ్యాపకంగా పెట్టుకొన్నాడు. చివరికి జంతువుల స్వభావాల మీదే డాక్టరేటు పుచ్చుకున్నాడు.

అన్నీ వేటగాడి సూచనలే

సీతాకోక చిలుకల వెంటపడటం, పక్షులను గమనించడం, జంతువులని పరిశీలించడం, పురుగులను పట్టుకోవడం... ఇవన్నీ మనలో దాగి ఉన్న వేటగాడి చర్యలే అంటారు వ్లాదిమిర్‌. అంతేకాదు పోకెమాన్‌గోలో లేని జంతువులను ఊహించుకుంటూ వాటి వెంటపడటం కూడా మనలోని వేటగాడిని తృప్తి పరుస్తోందని విశ్లేషిస్తున్నారు. అయితే ఈ ‘వేటగాడి’లో ఉండే పోరాటపటిమని లక్ష్యసాధన కోసం ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితాలనిస్తుందని సూచిస్తున్నారు.

 

-నిర్జర.