ముందు చూపు కావాలి
posted on Mar 16, 2024 @ 5:30PM
ఒకానొక సర్వే ప్రకారం విదేశాల్లో ప్రజలు ముఖ్యంగా వృద్ధులు తమ జీవితకాల చివర్లో పిల్లలకు తమ పాత ఇంటిని ఇచ్చి పరమపదిస్తున్నారని, మన భారతదేశంలో మాత్రం దీనికి విరుద్ధంగా జరుగుతుంది.
ఒక వ్యక్తి తన జీవితంలో మొదట పెళ్లి కాగానే సేవింగ్స్ మొదలు పెడతాడు, పిల్లలు అవ్వగానే వారి చదువు, ఖర్చులు గట్రా ఆర్థిక విషయాలలో మునిగిపోయి సేవింగ్స్ ను పిల్లల కోసం ఖర్చు చేస్తూ ఉంటారు. ఇంతా చేసాక పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళ పెళ్లి కోసం మళ్ళీ ఖర్చులు అంటారు. ఇవన్నీ అయ్యాక ఓ సొంతింటి గూర్చి ఆలోచిస్తున్నారు. నిజానికి అప్పటికి ఆ వ్యక్తి వయసు అక్షరాలా అయిదు పదులు దాటిపోయి ఆరు పదులకు చేరువగా ఉంటుంది. మిగిలిన జీవితాన్ని ఓ సొంత ఇంట్లో సెటిల్ అయిపోయి మనుమళ్లను, మనుమరాళ్లను చూసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇదంతా కాస్త కలిగిన కుటుంబాలలో మాత్రమే. మరి మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాల్లో సీన్ ఇలాగేమి ఉండదు.
సంపాదన మొదలైన నాటి నుండి ప్రతి రూపాయిని లెక్క గట్టి ఖర్చు చేస్తున్నా మిగులు మాత్రం శూన్యం అనే చెప్పాలి. ఎందుకంటే చదువుతోనే అన్ని సాధ్యం అని నమ్ముతారు కానీ చదువు కూడా జీవితంలో భాగం అని అనుకోరు మనవాళ్ళు. అక్కడే వచ్చింది సమస్య అంతా. చదువు తప్ప ఏమీ తెలియని వాళ్ళు ఎలాంటి ఇతర పనులలో చేరలేక తల్లిదండ్రులకు భారంగా మిగులుతున్న యువతకు మన దేశంలో కొరత లేదని చెప్పవచ్చు.
బాల కార్మిక వ్యవస్థ నేరం కానీ, ఒక వయసు వచ్చాక పని చేయడం అనేది ఎప్పటికి నేరం కాదు. చాలామంది పనిచేస్తూ చదువుకోవడం అనేది ఒక వయసు పిల్లలకు ఆటంకం అని, వారు తమ లక్ష్యాలను చేరుకోలేరని అనుకుంటూ వుంటారు కానీ అలా పనిచేయడమే వారిని లక్ష్యం వైపుకు వెళ్లేలా చేయగలిగే ఉత్ప్రేరకాలు అని తెలుసుకోరు. విదేశాల్లో స్కూల్ విద్య పూర్తయ్యి కాలేజి విద్య మొదలవ్వగానే తమ పాకెట్ మని కోసం సొంతంగా పనిచేస్తూ చదువుకునేవాళ్ళు 90% మంది ఉంటారు. మనదేశంలో కూడా ఇలా పనిచేస్తూ చదువు సాగించినవారు గొప్ప స్థానంలో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు.
పిల్లలు పుట్టగానే జీవితమంతా వారికసమే కష్టపడి సంపాదిస్తూ, అంతా పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చుపెడుతూ, పిల్లలు పెద్దయ్యి, తల్లిదండ్రులు ముసలివాళ్ళు అయ్యే సమయానికి వాళ్లకు మిగిలేది కేవలం నెరిసిన జుట్టు, జీవితానుభవం మాత్రమే. ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు వృద్ధులయ్యాక పిల్లల చేత గెంటివేయబడటానికి కారణం 90% ఆర్థిక భారం తగ్గుతుందనే అనే విషయం మరచిపోకూడదు. అలాగే పిల్లలు తల్లిదండ్రులను ఉద్దరిస్తారనే ఆలోచనతో సర్వస్వం వాళ్ళ మీద ఆధారపడకూడదు. అందుకే పెద్దవాళ్లకు ఒక పద్దు కావాలి. అదేనండి సంపాదన, ఖర్చు, పొదుపు వంటి విషయాల్లో తమకు కాసింత ప్రాధాన్యత ఇచ్చుకోవాలి. అలాగే పిల్లలకు కూసా సంపాదించడం ఎలాగో నేర్పించాలి. చదువు అనేది సంపాదన కోసం అని భ్రమ పడటం మొదట మనేయాలి. ఎందుకంటే గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు ఎలాంటి పెద్ద చదువులు లేకుండానే జీవితాన్ని మొదలుపెట్టిన విషయం ఎవరూ మరచిపోకూడదు.
ఏ ప్రభుత్వ ఉద్యోగస్తులకో రిటైర్ అయ్యాక పెన్షన్ లు వస్తుంటాయి. మిగిలినవాళ్ళం ఎలా?? అనే సందేహం అసలు అక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడున్న ఎన్నో ఇన్సూరెన్స్ కంపెనీలు 60 ఏళ్ళు దాటిన వారికి పెన్షన్ వచ్చేలా ఎన్నో పాలసీలు అందుబాటులో ఉంచుతున్నాయి. సంపాదన ఉన్నపుడు వాటిలో తమకు కాసింత సేవింగ్స్ చేసుకుని, వృద్ధులయ్యాక నెలకు తగిన గౌరవ ప్రధమైన పెన్షన్ తీసుకుంటూ సంతోషంగా వృద్ధాప్యాన్ని కూడా గడిపేయచ్చు.
జీవితంలో చివరికి వచ్చాక బాధపడటం కంటే ముందు జాగ్రత్త ఎంతో అవసరం కదా! దీన్ని జాగ్రత్త అనడం కంటే తమ జీవితానికి తాము భరోసా ఇచ్చుకోవడం అంటే ఇంకా బాగుంటుంది.
నిజమేగా మరి!
◆వెంకటేష్ పువ్వాడ