వైవాహిక జీవితం సంతోషంగా ఉండటానికి గోల్డెన్ రూల్స్ ఇవీ!

ప్రతి వ్యక్తి జీవితాన్ని పెళ్లికి ముందు, పెళ్ళి తర్వాత అని చాలా స్పష్టంగా విభజించి చెప్పవచ్చు.  ఎందుకంటే పెళ్లికి ముందు ఉన్న చాలా విషయాలు పెళ్ళి తర్వాత మారిపోతాయి. మరీ ముఖ్యంగా ఈ జనరేషన్లో  అమ్మాయిలు, అబ్బాయిలు వ్యక్తిత్వం పరంగా చాలా ఆత్మగౌరవం కలిగి ఉంటారు. ఏ చిన్న విషయాల్లోనూ రాజీ పడటానికి సిద్దంగా ఉండరు. ఈ కారణంగా ఇప్పటి కాలంలో పెళ్లవుతున్న వారి మధ్య గొడవలు, విడాకులు ఎక్కువ. పెళ్లయ్యాక భార్యాభర్తలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలన్నా, వారి జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ పెద్ద గొడవలకు దారి తీయకుండా సింపుల్ గా పరిష్కారం కావాలన్నా కొన్ని గోల్డెన్ రూల్స్ ఫాలో అవ్వాలి. రిలేషన్షిప్ నిపుణులు చెప్పిన ఆ గోల్డెన్ రూల్స్ ఏంటో తెలుసుకుంటే.. పెళ్ళి తర్వాత బాధ్యతలు పెరుగుతాయి. అమ్మాయిలకు అయినా, అబ్బాయిలకు అయినా భాద్యతలు పెరుగుతాయి. ఇల్లు, ఉద్యోగం, స్నేహితులు, ఇతర పనులలో భార్యాభర్తలు ఒకరినొకరు నిర్లక్ష్యం చేయకూడదు. ఎన్ని పనులున్నా సరే.. భార్యాభర్తలిద్దరూ కొంతసమయం కేటాయించుకోవాలి.  కలసి మాట్లాడుకోవడం, కలసి భోజనం చేయడం, కలసి చర్చించడం,  ప్రతిరోజూ కనీసం గంటసేపు అయినా మాట్లాడాలనే నియమం పెట్టుకోవాలి. ఇలా చేస్తే వారి మధ్య  ఏ సమస్యలున్నా వాటిని మాట్లాడుకుని పరిష్కరించుకోవచ్చు. అందుకే ఒకరికోసం ఒకరు సమయం కేటాయించుకోవడం ఎంతో ముఖ్యం. పెళ్ళికి ముందు కాబోయే జంట ఒకరి పట్ల మరొకరు చాలా ప్రేమగా ఉంటారు. ఒకరిని మరొకరు బుజ్జగించుకోవడం, ప్రేమ కురిపించడం, చాలా కేరింగ్ గా ఉండటం చేస్తారు. అయితే చాలామంది జీవతాలను గమనిస్తే పెళ్ళి తర్వాత ఈ సీన్ మొత్తం మారిపోతుంది.  కానీ ఇలా చేయడం మంచిది కాదు. పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ ఒకరి పట్ల మరొకరు ప్రేమగా ఉండాలి. ఒకరి మీద మరొకరు అరుచుకోవడం, గొంతు పెంచి మాట్లాడటం వల్ల ఇద్దరి మధ్య  గొడవకు దారితీస్తుంది. భార్య చేసే ఏ పని అయినా భర్తకు నచ్చితే భార్యను మెచ్చుకోవడం అస్సలు మిస్ కాకూడదు.   భార్య వంట నచ్చినా, ఆమె ఇంటి పనిలో చలాకీగా ఉన్నా,  భర్తకు ప్రేమగా వడ్డించినా, ఇంటి పనిని, ఆఫీసు పనిని ఆమె సమర్థవంతంగా  బ్యాలెన్స్ చేస్తున్నా ఇలా ఏం చేసినా సరే భార్యను మెచ్చుకోవడానికి అస్సలు మొహమాటపడకూడదు. అలాగే  భర్త ప్రేమగా ఏం చేసినా భర్త వృత్తి, వ్యక్తిగతంగా ఏం చేసినా దాన్ని భార్య కూడా మెచ్చుకోవాలి. ఇలా చేస్తే భార్యాభర్తలకు ఒకరి మీద మరొకరికి ప్రేమ పెరుగుతుంది. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా మాట్లాడే తీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిని మరొకరు ఎలా మాట్లాడుతున్నారు అనేది వారి మధ్య బంధాన్ని నిర్ణయిస్తుంది. ఒకరితో ఒకరు మాట్లాడటం, ఒకరి మనసులో విషయాలు మరొకరితో షేర్ చేసుకోవడం, ఒకరు చెప్పేది మరొకరు శ్రద్దగా వినడం ఇవన్నీ బంధం పదిలంగా ఉండటానికి అవసరం. భార్యాభర్తల బంధం అంటే ఇక ఒకరి జీవితం మరొకరు చేతుల్లోకి వెళ్లినట్టే అని అనుకుంటారు కొందరు. కానీ భార్యాభర్తలు అలా ఉండకూడదు. స్పేస్ అనేది చాలా ముఖ్యం. స్పేస్ లేకపోతే బంధం కష్టంగా అనిపిస్తుంది. భాగస్వామి జీవితాన్ని మరీ గట్టిగా బంధించినట్టు, తనకు అన్ని విషయాలు తెలియాలి అన్నట్టు ఉండకూడదు. ముఖ్యంగా కంట్రోల్ చేయడం, కమాండ్ చేయడం అస్సలు మంచిది కాదు. ఎవరి సొంత అభిప్రాయాలు, ఆలోచనలు, సంతోషాలు వారికి ఉండటం మంచిది.                                             *రూపశ్రీ. 

ప్రమాదాలను కొనితెచ్చుకునే మనస్తత్వం!

కొంతమందికి ఎప్పుడూ ఏదో ఒక దెబ్బ తగులుతూ ఉంటుంది! ఒంటి మీద ఎప్పుడూ ఏదో ఒక గాయం కనిపిస్తూనే ఉంటుంది. వాళ్లని చూసి పాపం దురదృష్టవంతులు అని మిగతావారు జాలిపడుతూ ఉంటారు. కానీ తరచూ ఏదో ఒక ప్రమాదానికి లోనవ్వడానికీ మన వ్యక్తిత్వానికీ సంబంధం ఉండవచ్చని ఊహిస్తున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. ఇలాంటి మనస్తత్వాన్ని ‘Accident Prone Psychology’ అంటున్నారు. అదేమిటో తెలుసుకుంటే మనకీ కాస్త ఉపయోగపడుతుందేమో... ఓ ఆలోచన! తరచూ కొంతమందే ఎందుకు దెబ్బలు తగిలించుకుంటారన్న అనుమానం 19వ శతాబ్ది మొదటిలోనే వచ్చింది. దీని మీద మరిన్ని పరిశోధనలు చేసిన గ్రీన్‌వుడ్ వంటి నిపుణులు మన ఆలోచనా విధానానికీ, ప్రమాదాలకి సంబంధం ఉండే అవకాశం ఉందని తేల్చారు. ఆ తరువాత వచ్చిన ఎన్నో పరిశోధనల్లో ఓ 20 శాతం మంది వ్యక్తులే అధికశాతం ప్రమాదాలకి కారణం అవుతూ ఉంటారనీ... మొత్తంగా మన చుట్టూ జరిగే ప్రమాదాలలో దాదాపు 75 శాతం ప్రమాదాలు మానవ తప్పిదం వల్లే ఏర్పడతాయని చెబుతూ వస్తున్నాయి. ఈ పరిశోధనల శాస్త్రీయతని చాలామంది కొట్టిపారేసినా, వీటిలో స్పృశించిన చాలా అంశాలు చాలా తార్కికమైనవే! అందుకనే కొన్ని భీమా కంపెనీలు ప్రమాదభీమాను చెల్లించేటప్పుడు, ఉత్పాదక సంస్థలు తమ ఉద్యోగులను హెచ్చరించేందుకూ ఈ పరిశోధనలు ఉపయోగపడుతున్నాయి.   ప్రమాదాన్ని ఆశించే వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం మరీ ఎక్కువగా ఉన్నారు, దూకుడుగా ఉండేవారు, నిరంతరం కోపంతో రగిలిపోయేవారు... పోయి పోయి ఏదో ఒక ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారని తేలింది. మానసిక ఒత్తిడిలో ఉన్నవారు కూడా ప్రమాదాలకి త్వరగా లోనవుతారని చాలా పరిశోధనలు వెల్లడించాయి. ఏదన్నా కుటుంబంలో ఒకరి తరువాత ఒకరు ప్రమాదానికి లోనవడం మనం గమనిస్తూ ఉంటాము. ఆ కుటుంబానికి ఏదో శాపం తగిలిందనో, వారి గ్రహస్థితి బాగోలేదనో అనుకుంటాము. నిజానికి ఇలా కుటుంబంలో ఎవరన్నా ఒకరు తీవ్ర ప్రమాదానికి లోనైతే, ఆ ప్రభావం ఇతరుల మనసు మీద కూడా పడుతుందనీ... ఆ ఒత్తిడిలో మిగతా సభ్యులు కూడా ప్రమాదానికి లోనయ్యే అవకాశం 20 శాతం ఉంటుందనీ ఓ పరిశోధన తేల్చింది. ఎవరైతే ఇతరుల సలహాలను, సహాయాన్నీ స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటారో... వారు త్వరగా ప్రమాదాలకు లోనుకారని తేలింది. అహంకారం లేకుండా, తొందరపడకుండా ఉండేవారికి ప్రమాదాలు కూడా ఆమడదూరంలో ఉంటాయని 2001లో జరిగిన ఒక పరిశోధన రుజువు చేసింది. అంటే నిదానమే ప్రధానం, నోరు మంచిదైతే ఊరు మంచిది లాంటి సామెతలు యాంత్రిక జీవితానికి కూడా వర్తిస్తాయన్నమాట.     ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా తొందరపాటు, దూకుడు, ద్వేషం, అహంకారం... మనిషి విచక్షణను దెబ్బతీస్తాయి. తన మీద తనకి ఉండాల్సిన నియంత్రణను ప్రభావితం చేస్తాయి. దాంతో ఒక అనర్థం జరగడం సహజమే! కానీ ఇలాంటివారు కేవలం తమకి మాత్రమే ప్రమాదాన్ని తెచ్చుకుంటే ఫర్వాలేదు. అలా కాకుండా ఈ ‘Accident Prone Psychology’ ఉన్నవారు ఏ విమానాన్నో నడుపుతుంటే! అందుకే ఈ తరహా వ్యక్తిత్వం గురించి నానాటికీ ప్రచారం పెరుగుతోంది. మీది ప్రమాదాన్ని కొని తెచ్చుకునే వ్యక్తిత్వమేమో గమనించుకోండి అంటూ కొన్ని వెబ్‌సైట్లు పరీక్షలు పెడుతున్నాయి. మున్ముందు ఉద్యోగులకు కూడా ఇలాంటి పరీక్షలను నిర్వహించి విధుల్లోకి తీసుకునే పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు!   - నిర్జర.

అమ్మాయి లవ్ చేస్తోందో లేదో అని డౌటా.. ఈ 7 విషయాలు గమనించి ఇట్టే తెలుసుకోవచ్చు!

ప్రేమ అనేది  ఇప్పట్లో చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు ప్రేమ అంటే అబ్బాయిలు మాత్రమే ధైర్యం చేసి చెప్పేది.. అమ్మాయిలకు అంగీకారం ఉంటే తదుపరి వారి బంధం మరో మలుపు తిరిగేది.. కానీ ఇప్పుడు అట్లా కాదు.. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ ప్రేమ విషయంలో బాగా అడ్వాంటేజ్ గా ఉంటున్నారు. అయితే చిక్కల్లా ఒకమ్మాయి తమకు బాగా తెలిసి, తమతో సన్నిహితంగా ఉంటూ తమను లవ్ చేస్తుందా లేదా  అనే విషయం అర్థం కాక జట్టు  పీక్కునే అబ్బాయిల గురించే..   అయితే దీనికి ఈజీగానే చెక్ పెట్టవచ్చు అమ్మాయిలు తమను ప్రేమిస్తున్నారా లేదా అనే విషయాన్ని అబ్బాయిలు ఈ 7 విషయాల ద్వారా తెలుసుకోవచ్చు. అవేంటంటే.. అమ్మాయిలు తమకు ఎంత పని ఉన్నా, ఎంత ఇబ్బందులు ఉన్నా వారి మనసులో ఒక అబ్బాయి పట్ల ప్రేమ ఉంటే వారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఫోన్ లో అయినా, మెసేజ్ లో అయినా, వ్యక్తిగతంగా కలవడంలో అయినా తను ప్రేమించిన అబ్బాయిని ఎప్పుడూ లైట్ తీసుకోదు. తను ఇష్టపడుతున్న అబ్బాయితో సన్నిహితంగా ఉండటానికి అమ్మాయిలు అబద్దాలు చెప్తారు. మాట్లాడటానికో, కలసి నడుస్తున్నప్పుడో, పక్కపక్కన కూర్చున్నప్పుడో తాకడం, చెయ్యి పట్టుకోవడం, నవ్వడం, నవ్వించడం వంటివి చేస్తారు. ప్రతి అమ్మాయికి తను ఇష్టపడే అబ్బాయి మరొకరితో సన్నిహితంగా మాట్లాడితే కోపం వస్తుంది. అలాగే అసూయ పడుతుంది. ఒకమ్మాయి తను ఇష్టపడుతున్న అబ్బాయి ఇతర అమ్మాయిలతో మాట్లాడుతుంటే అలాగే ఫీలవుతుంది. కొన్నిసార్లు తను ప్రేమించిన అబ్బాయి  ముందు కోపాన్ని కూడా వ్యక్తం చేస్తుంది. అమ్మాయి తను ప్రేమిస్తున్న అబ్బాయి కళ్లలోకి చూసి మాట్లాడాలంటే చాలా ఇష్టపడుతుంది. అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్లలోకి చూస్తూ మాట్లాడుతుంటే ఆమెకు ప్రేమ ఉన్నట్టే. అమ్మాయిలు తాము ప్రేమిస్తున్న అబ్బాయిలు అందుబాటులో కాస్త దూరంగా ఉంటే ఇక చూపులన్నీ తను ప్రేమిస్తున్న అబ్బాయి వైపే ఉంచుతుంది. ఎలాంటి పరిస్థితిలో అయినా సరే.. అమ్మాయి తను ఇష్టపడే అబ్బాయి కదలికలను గమనించడానికి, అతన్ని చూడటానికి ఇష్టపడుతుంది. అబ్బాయికి నచ్చిన పని చేయడానికి, నచ్చిన వస్తువులు, నచ్చిన ఆహారం తీసుకొచ్చి ఇవ్వడానికి అమ్మాయి శ్రద్ద చూపిస్తున్నట్టైతే అది సాధారణ పరిచయం లేదా స్నేహం అనుకోవడానికి వీల్లేదు. ఏ మూలో అమ్మాయికి తప్పకుండా అబ్బాయి మీద ఇష్టముందని అర్థం. అమ్మాయిలు తమకు ఏ చిన్న బాధ కలిగినా, ఇబ్బంది కలిగినా అబ్బాయితో చెబుతుంటే ఆమెకు అతను చాలా స్పెషలని అర్థం. అంతేకాదు తను ఇష్టపడుతున్న అబ్బాయి పక్కన ఉంటే ఆమె తన బాధలన్నీ మర్చిపోతుంది. అమ్మాయి ఇలా చేస్తుంటే ఆమె ప్రేమిస్తోందనే అర్థం.                                                         *నిశ్శబ్ద.  

స్లీపింగ్ డైవొర్స్.. ఇదో కొత్త విడాకుల పోకడ.. భార్యాభర్తలకు దీంతో ఎంత లాస్ అంటే...

మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు అయ్యాయని ఒకప్పుడు చెప్పుకునేవాళ్లం. అది ఇప్పటికీ ఉంది కానీ.. మానవ సంబంధాలు మరికొన్ని కొత్త రూపాలకు దారి మళ్లాయి. ఒకప్పుడు వైవాహిక జీవితంలో ఏ సమస్య వచ్చినా  దాన్ని పరిష్కరించుకోవడం, సర్థుకోవడం చేసేవారు. కానీ ఇప్పుడలా కాదు.. ఏ సమస్య వచ్చినా దాన్ని తెగెవరకు లాగి అదే సమస్యకు పరిష్కారం అని అనుకుంటున్నారు. ప్రస్తుతం చాలా వైరల్ అవుతున్న విషయం స్లీపింగ్ డైవొర్స్.. అసలు స్లీపింగ్ డైవొర్స్ అంటే ఏంటి? దీనివల్ల భార్యాభర్తలకు జరిగే నష్టం ఏంటి తెలుసుకుంటే.. పెళ్లైన భార్యాభర్తలు  ఒకే గదిలో ఉన్నప్పుడు వారు కలిసి నిద్రపోతారు.  ఇద్దరూ విడివిడిగా పడుకోవడం ప్రారంభిస్తే వారి మధ్య ఏదో సరిగ్గా జరగడం లేదనే అనుమానం వస్తుంది.  సాధారణంగా భార్యాభర్తలు ఇక ఇద్దరూ కలిసి జీవించలేమని నిర్ణయించుకున్న తరువాత విడాకులు తీసుకుంటారు. కానీ ఈ స్లీపింగ్ డైవొర్స్ అనేవి బంధాన్ని తెంచుకునే విడాకులు కాదు.. నాణ్యమైన నిద్ర పొందడానికి భాగస్వాములు విడివిడిగా నిద్రపోవడానికి తీసుకునే విడాకులు. సాధారణంగా భాగస్వాములు నిద్రలో చేతులు,  కాళ్లను కదిలించడం వల్ల, గురకకు అలవాటు పడడం వల్ల లేదా ఏదైనా నిద్ర రుగ్మత కారణంగా పక్కవారి నిద్రకు డిస్టర్బ్ కలిగిస్తూ ఉంటారు. కానీ ఈ స్లీపింగ్ డైవొర్స్ కారణంగా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని, ఇద్దరు హాయిగా నిద్రపోతారని  అనుకుంటున్నారు. కానీ  ఇది సమస్యను పరిష్కరించడానికి బదులుగా వారి మధ్య బంధాన్నిబలహీనపరుస్తుంది. నిద్ర కోసం ఈ స్లీపింగ్ డైవొర్స్ తీసుకోవడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం. అయినా సరే ఈ డైవొర్స్ స్లీపింగ్ వల్ల జంట మధ్య బంధం బలహీనపడుతుందని రిలేషన్షిప్ నిపుణులు నొక్కి వక్కాణిస్తున్నారు. ఇద్దరూ విడివిడిగా పడుకోవడం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలున్నా వారిని ఎప్పటికీ కలిపి ఉంచేది వారిద్దరి మధ్య శారీరక స్పర్శే.. అది కూడా వారిమధ్య లేనప్పుడు  ఇక ఇద్దరినీ కలిపి ఉంచే మార్గమేదీ ఉండదు. ఒకే ఇంట్లో ఇద్దరూ అపరిచితుల్లా చాలా  కొద్ది కాలంలోనే మారిపోతారు. మరొక విషయం ఏమిటంటే ఇలా ఇద్దరూ విడివిడిగా పడుకోవడం అనేది దీర్ఘకాలం జరిగితే వైవాహిక బంధాలు విచ్చిన్నమై వాటి విలువ కూడా తగ్గిపోతుంది. ఆరోగ్యకరమైన నిద్రకోసం భార్యాభర్తలు ఇద్దరూ ఆరోగ్యకరమైన పద్దతులు ఎంచుకోవాలి. వైద్యుల సలహా తీసుకుని నిద్రకు బంగం కలిగించే సమస్యలను పరిష్కించుకోవాలి.                                              *రూపశ్రీ.  

సమ్మర్ కి ఇద్దాం షేక్ హ్యాండ్!

వేసవికాలం వచ్చిందంటే వామ్మో అంటాము. మండిపోయే ఎండలు, మగ్గబెట్టే ఉక్కపోత, వీటికి తోడు కరెంట్ కోతలు. ఉదయం, సాయంత్రం తప్ప ఏ మధ్యాహ్నపు ఎండలోనో బయటకు వెళ్లాల్సిన అవసరం వచ్చిందంటే గుండె గుభేలుమంటుంది. అందుకే ఎండ అంటే చెప్పలేనంత మంట అందరికీ. కానీ సమయం గడుస్తూ ఉంటే ఈ కాలాలు అదేనండి వర్షాకాలం, చలికాలం వచ్చినట్టు ఎండాకాలం కూడా రాక తప్పదు. అది తన ప్రతాపం చూపించక తప్పదు. అయితే ఈ వేసవిని చూసి భయపడటానికి ఎన్ని కారణాలు ఉన్నాయో, దీన్ని ఎంజాయ్ చేయడానికి అన్నే మార్గాలు ఉన్నాయి. ఓసారి తెలుసుకుంటే సమ్మర్ మీద హమ్మర్ తో ఓ మోస్తరు సౌండ్ చేయచ్చు. ఒకప్పుడు!! సంవత్సరకాలం అంతా పిల్లలు ఎదురుచూసేరోజులు ఇవే అంటే ఆశ్చర్యమేస్తుంది. నిజంగానే వేసవి కోసం పిల్లలు అర్రులు చాచేవాళ్ళు. ఒక పూట బడి ముగియగానే ఎండను కూడా లెక్కచేయకుండా బావుల వెంట, చేల వెంట వెల్తూ ఎన్నో మధురస్మృతులను మూటగట్టుకునేవాళ్ళు. ఓ ముప్పై సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళను పిలిచి బాల్యం గురించి చెప్పమంటే కళ్ళు మెరవడం, చిరునవ్వు బయటకు రావడం ఎంతో స్పష్టంగా కనిపిస్తాయి.  అందుకే అన్ని కాలలను ఒకేలా పుస్తకాల మధ్య కాకుండా కాసింత ప్రత్యేకంగా గడిపేలా మీ పిల్లలకు ఏర్పాటు చేయండి. అది వాళ్లకు ఆసక్తికరమై, వాళ్ళ సంతోషానికి కారణమయ్యేది అయ్యుండాలి సుమా!! ప్రకృతి ఆతిథ్యం!! నిజంగా నిజమే. వేసవిలో ప్రకృతి ఎంత గొప్ప ఆతిథ్యం ఇస్తుందని. అవన్నీ చాలా వరకు ఇప్పటి తరానికి తెలియకుండా ఉన్నాయి. వాళ్లకు ఓసారి పరిచయం చేసి చూడండి. నాచురల్ లైఫ్ మీద లవ్ లో పడతారు వాళ్ళు. పుల్లని విందు!! బలే బలే పసందు ఈ పుల్లని విందు. అదే అదే ఫలాల రాజు మామిడి గారు ఎంతో ఠీవిగా చెట్లలో పెరిగి అందరినీ పలకరించడానికి ఇంటింటికి వస్తాడు. అందరి నోర్లు జలపాతాలు చేస్తాడు.  చెరకు చరిష్మా!! చిన్నప్పటి దంతాల రహస్యం. నోటితోనే చెరకు పొట్టు తీసి, కొరికి, కసకస నమిలి, రసాన్ని జుర్రుకుంటూ పిప్పిని పడేస్తే ఆహా ఉంటుంది ఆ నాలుగు అదృష్టం ఎంతో అనిపిస్తుంది. ఇప్పట్లో అంత సీన్లు లేకపోయినా ఎంచక్కా రోడ్ సైడ్ దొరికే చెరకు రసం తాగేసి హాయి హాయిగా వెళ్లిపోవచ్చు.  ఇవి మచ్చుకు రెండు మాత్రమే. ఇంకా చింతచిగురు వేరే లెవెల్. తాటి ముంజలు మరొక ఎత్తు, చల్ల చల్లటి మజ్జిగ, శరీర తాపాన్ని తగ్గించే పుదీనా శరబత్ ఇవన్నీ హైలైట్.  అయితే మరొక మ్యాజిక్ కూడా ఉంది. అదే కేవలం రాయలసీమ ప్రాంతంలో లభ్యమయ్యే సుగంధి సిరప్. కేవలం కడప జిల్లాలో అడవులలో మాత్రమే పెరిగే సుగంధ మొక్కల వేర్లను ఉడికించి పంచదార కలిపి సిరప్ చేసి అమ్ముతుంటారు. సువాసన అద్భుతంగా ఉంటుంది. చల్లని నీళ్లు, లేదా షోడాతో ఈ సిరప్ కలిపి తీసుకుంటే వేసవి కాలం వెంట తీసుకొచ్చే వడదెబ్బ వంద కిలోమీటర్లు పరిగెత్తి పరిగెత్తి పారిపోతుంది. శరీర వేడిని తక్షణమే తగ్గిస్తుంది.  వేసవి భయం అసలు వద్దు!! ఎవరు ఎన్ని చెప్పుకున్నా బయటకు వెళ్ళేవాళ్లకు అదొక భయం. సర్రుమని కాలిపోతున్న రోడ్లన్నీ నరకంలో యమధర్మరాజు ఏర్పాటు చేసినట్టు అనుభూతి కలుగుతుంది. అందుకే సులువైన, మరియు అందరూ ఆచరించగల జాగ్రత్తలు. బయటకు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. మరి నీళ్లు అయిపోతే?? ఏముంది ఏకంగా బాటల్  కొనే పని తప్పుతుంది ఎక్కడో ఒక చోట అయిదు రూపాయల్లో బాటల్ నింపుకోవచ్చు. లేదు కాదు అంటే 20 నుండి 30 పెట్టి వాటర్ బాటిల్ కొనేబదులు ఎంచక్కా ఫ్రూట్ జ్యూస్, లేదా నిమ్మ షోడా వంటివి తాగడం హాయి. వేసవి తాపాన్ని తగ్గిస్తాయి ఇవి. ఇవి కాకుండా మరొక సలహా ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కీరా దోస, పుచ్చకాయ వంటి నీరు అధికంగా ఉన్నవి తినడం లేదా జ్యూస్ తాగడం మంచిది. ఉప్పు, కారం, మసాలాలు వంటివి తగ్గించుకోవాలి ఈ కాలంలో. శరీర ఉష్ణోగ్రత మీద అవి ప్రభావం చూపిస్తాయి.  వెంట గొడుగు ఉంచుకోవడం మర్చిపోకండి. లేదంటే టోపి, లేదా స్పార్క్ ఇలా ఎదో ఒకటి నెత్తిని కప్పి ఉంచేలా జాగ్రత్త పడాలి. వీలైనంత వరకు ఉదయం మరియు సాయంత్రం వేళల్లో మాత్రమే బయటకు వెళ్లేలా చూసుకోవాలి. మధ్యలో సమయం అంతా ఇంటి పట్టున లేదా ఉద్యోగాలు చేసే ప్రాంతాలలో ఉండటం మంచిది. ఇలా చెప్పుకుంటూ పోతే వేసవి కోసం బోలెడు మార్గాలు. అయితే మనం ఎంత డాబు చెప్పుకున్నా ఈ ఎండల కొరడా దెబ్బకు ఒళ్ళు చురుక్కుమనడం సాధారణం. అందుకే దాని నుండి జాగ్రత్త మరి. జాగ్రత్తగా షేక్ హాండ్ ఇచ్చి కూల్ గా డీల్ చేసి పంపిద్దాం.                                     ◆వెంకటేష్ పువ్వాడ.

స్నేహం, ప్రేమ మధ్య తేడా గుర్తించడం ఎలా.. ఇదిగో ఇలా!

ప్రేమ, స్నేహం రెండు కవలపిల్లల లాంటివి. చూడ్డానికి రెండు ఒకేలా ఉంటాయి. కానీ చాలా సున్నితమైన వ్యత్యాసాలు దాగుంటాయి. స్నేహం ప్రేమ లానూ, ప్రేమ స్నేహం లానూ అనిపించి చాలా మందిని గందరగోళ పెడుతుంది. మరీ ముఖ్యంగా నేటి కాలంలో జెండర్ తో సంబంధం లేకుండా అమ్మాయిలు, అబ్బాయిలు ఫ్రెండ్షిప్ చేస్తుంటారు. అమ్మాయిలు స్నేహం అనుకున్నా. దాన్ని ప్రేమగా భావించే అబ్బాయిలు, అబ్బాయిలు స్నేహం అనుకుంటే దాన్ని ప్రేమగా భ్రమ పడే అమ్మాయిలు బోలెడుమంది ఉన్నారు. నిజానికి ఈ వ్యత్యాసం తెలుసుకోలేక చాలామంది స్నేహాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో తమది స్నేహమా?? లేక ప్రేమా?? అనే విషయం గురించి అమ్మాయిలలో ఉండే సందేహాలు క్లియర్ చేసుకుంటే.. అసూయ చూపిస్తున్నారా? ఒక వ్యక్తికి చాలా మంది స్నేహితులు ఉండవచ్చు, కానీ మీరు మీ స్నేహితుడికి దగ్గరగా ఉన్న వారిని చూసి మీకు అసూయగా అనిపించినప్పుడు, లేదా మీరు ఇతరులతో చాలా దగ్గరగా ఉన్నప్పుడు మీ స్నేహితుడు అసూయగా ఫీలవుతుంటే మీ మధ్య స్నేహం ప్రేమగా మారుతుందని అర్థం. ఉదాహరణకు  ఇతరులకు దగ్గర ఉండటం, వారితో సినిమాలు, పార్టీలు, మొదలైన వాటికి ఆసక్తి చూపిస్తూ వెళ్ళడం చేస్తే అవన్నీ చూసి స్నేహితుడు లేదా స్నేహితురాలు చిటపటలాడుతున్నా, కోప్పడుతున్నా, అలుగుతున్నా  వారితో స్నేహం కంటే ఎక్కువ అనుభూతి చెందుతున్నారని అర్థం. ఏకాంతం కోరుకుంటున్నారా? సాధారణంగా స్నేహితులు అంటే ఒక బ్యాచ్ గా ఉంటారు. వీళ్లలో కొందరు అమ్మయిలు, మరికొందరు అబ్బాయిలు కూడా ఉంటారు. అయితే ఇంతమంది స్నేహితులలో కేవలం ఒక్కరితోనే ఏకాంతంగా ఉండాలని అనిపిస్తుంటే అది స్నేహం కంటే ఎక్కువ భావనను సూచిస్తుంది.  పదే పదే గుర్తుచేసుకోవడం.. చాలా వరకు స్నేహితులతో సమయం గడిపిన తరువాత ఇంటి పనుల్లోనూ ఇతర కార్యకలాపాలలోను మునిగిపోతుంటారు. కానీ అలా కాకుండా కేవలం ఒకే ఒక్కరి గురించి పదే పదే ఆలోచిస్తున్నా, వారితో మాట్లాడాలని అనిపిస్తున్నా వారు మిగిలిన వారికంటే చాలా స్పెషల్ అని అర్థం.  ప్రాధాన్యత.. ఎంతమందిలో ఎప్పుడు ఏ విషయం గురించి మాట్లాడుతున్న తమ స్నేహితుడు లేదా స్నేహితురాలి గురించి ప్రస్తావిస్తూ, తమ మధ్య ఉండే సాన్నిత్యన్ని బయటకు గర్వంగా చెప్పుకుంటున్నా, ఇతరులకంటే వారిని ఎక్కువగా పరిచయం చేస్తున్నా, వారికి అందరికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, వారంటే ప్రత్యేక భావన అని అర్థం. ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిల మధ్య జెండర్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఈ కారణంగా చాలామంది తొందరగా ఫ్రెండ్స్ అయిపోతారు. అయితే ఈ ఆకర్షణ కారణంగా ఏర్పడే స్నేహం, ఆకర్షణ ఉన్నంత వరకు ఉంటుంది. ఈలోపు నిజంగా స్నేహం వెల్లివిరిస్తే.. అది ప్రత్యేక సాన్నిత్యం కోరుకుండా..  కష్టసుఖాలు చెప్పుకోవడానికి, కష్టసమయంలో సాయం చేసుకోవడానికి తోడుగా ఉండేది అయితే స్నేహమే.. ప్రేమకు, స్నేహానికి  మధ్య సన్నని గీతను గుర్తెరగాలి.                                   *నిశ్శబ్ద.

భార్యలు భర్తల నుండి ఏం కోరుకుంటారు...బంధం దృఢంగా ఉండటానికి ఏది ముఖ్యం?

విజయవంతమైన,  సంతోషకరమైన వివాహా బంధానికి ప్రేమ మాత్రమే ముఖ్యం  కాదు. బంధంలో  భార్యను సంతోషంగా ఉంచడం కూడా చాలా ముఖ్యం.  ప్రతి భార్యకు తన భర్త నుండి కొన్ని అంచనాలు ఉంటాయి.  అవి నెరవేరితే బంధంలో తగాదాలు తగ్గుతాయి.   బంధం కూడా బలపడుతుంది. అవి నేరవేరకపోతే మాత్రం బంధం బలహీనంగా మారుతుంది. చిన్న ప్రయత్నాలు మానవ సంబంధాలలో దేనినైనా బలోపేతం చేయగలవు.  భార్యాభర్తల సంబంధం విషయానికి వస్తే అది మరింత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. వివాహం అనేది ఒక పవిత్ర బంధం. దీనిలో ప్రేమ, గౌరవం,  అవగాహన అనే పునాదిపై కలిసి జీవితాన్నిగడపాల్సి ఉంటుంది.   ఇది పరస్పర అవగాహనతోనూ, బంధంలో పలు విషయాల పట్ల సహనంతో ఉండటం ద్వారా జరుగుతుంది. స్త్రీలు తమ భర్తల గురించి కొన్ని అంచనాలను కలిగి ఉంటారు. వాటిని నెరవేర్చడం ద్వారా ఏ భర్త అయినా తన భార్యను సంతోషంగా ఉంచగలడు. భార్యలు భర్తల నుంచి ఏమి ఆశిస్తారో తెలుసుకుంటే.. ప్రేమ.. ప్రతి స్త్రీ తన భర్త నుండి ప్రేమ,  ఎమోషనల్ సపోర్ట్ ఆశిస్తుంది. ఉద్యోగం చేసే మహిళ అయినా లేదా గృహిణి అయినా.. ఇద్దరూ తమ జీవిత భాగస్వామి అడుగడుగునా తమకు తోడ్పాటు అందించాలని కోరుకుంటారు. ప్రేమను వ్యక్తపరచడం కూడా వారికి ఆనందాన్ని ఇస్తుంది. ప్రేమను వ్యక్తం చేయడం ద్వారా భార్యాభర్తల బంధం లోతుగా, దృఢంగా మారుతుంది. శ్రద్ద..  ఒకరిని ఎంతగా ప్రేమిస్తున్నారో వ్యక్తం చేయడానికి ఉత్తమ మార్గం వారి పట్ల శ్రద్ధ వహించడం.  భార్యకు ఇంటి పనిలో సహాయం చేయడం, ఆమె మానసిక స్థితి సరిగా లేకుంటే ఆమె ముఖంలో చిరునవ్వు తీసుకురావడానికి ప్రయత్నించడం, ఆమె అనారోగ్యంతో లేదా ఇతర పనులలో బాగా బిజీగా ఉన్నట్లయితే ఆమెకు ఇష్టమైన ఆహారాన్ని వండడం లేదా ఆర్డర్ చేయడం,  ఆమెకు తినిపించడం, ఆమె చెప్పేది శ్రద్ధగా వినడం, ఆమె కోసం సమయం కేటాయించడం..  ఇవన్నీ చిన్నవి కానీ శ్రద్ధ చూపిస్తున్నామని చెప్పడానికి ఇవి చాలా మంచి మార్గాలు. గౌరవం.. ఏదైనా సంబంధానికి పునాది గౌరవం మీద ఆధారపడి ఉంటుంది. భార్యలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వని భర్తలు ఎందరో ఉన్నారు. వివాహిత సంబంధంలో దీనిని పొందడానికి భార్యలు ఎక్కువగా పోరాడవలసి ఉంటుంది. భార్యలు తమ భర్తలను ప్రేమించడమే కాకుండా వారి అభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని, వారి నిర్ణయాలకు మద్దతు ఇవ్వాలని, సమానంగా చూడాలని,  తమ ఆత్మగౌరవాన్ని తమకు ఇష్టమైనవారి దగ్గర   దెబ్బతీయకూడదని భార్యలు కోరుకుంటారు. భర్త ఇవన్నీ చేస్తే భార్యలు తమను ఎంతగా గౌరవిస్తారో గ్రహించగలుగుతారు కమ్యూనికేషన్.. భార్యాభర్తల మధ్య ఎలాంటి సంకోచం లేకుండా ఓపెన్ కమ్యూనికేషన్ ఉండటం చాలా ముఖ్యం. భార్య తన భర్త తనతో ప్రతిదీ పంచుకోవాలని,  జడ్జ్ చేయకుండా జాగ్రత్తగా వినాలని కోరుకుంటుంది. భార్యాభర్తల బంధంలో  ఒకరికొకరు నిజాయితీగా,  మంచి  నమ్మకంతో  కలిగి ఉండటం చాలా ముఖ్యం. కానీ ఫలానా వ్యక్తి వల్ల భార్య అభద్రతా భావంతో బాధపడుతుంటే, భర్త ఆమెను పట్టించుకోకుండా ఉండటం సరికాదు.  ఈ భావాన్ని తొలగించడానికి భర్త ప్రయత్నించాలి. తద్వారా వారి మధ్య నమ్మకం బలపడుతుంది. అవగాహన.. భార్యాభర్తల మధ్య సంబంధాలలో పరస్పర అవగాహన చాలా ముఖ్యం. చాలా మంది మహిళలు తమ భర్తలు తమను అర్థం చేసుకోవడం లేదని భార్యలను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని మనస్తత్వంతో ఉంటారని ఫిర్యాదు చేస్తారు. కానీ ప్రతి భర్త తన భార్య ఇష్టాలు,  అభిరుచులను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇదే వారి బంధానికి శ్రీరామ రక్ష.                                                             *నిశ్శబ్ద.

భార్యాభర్తలలో ఉండే ఈ అలవాట్లు ఏకంగా విడిపోవడానికి దారితీస్తాయ్!

  ఈ ప్రపంచంలో భార్యభర్తల బంధం చాలా గొప్పది. ఈ బంధాన్ని పదిలంగా ఉంచుకోవాల్సిన బాధ్యత భార్యాభర్తల మీదనే  ఆధారపడి ఉంటుంది.  సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడపడానికి, పరస్పర అవగాహన, ప్రేమ,  నమ్మకం వంటివి అవసరం. సహజంగానే విభిన్న స్వభావం గల ఇద్దరు వ్యక్తులు ఒకచోట ఉన్నప్పుడు  అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. కానీ వాటిని పరిష్కరించడానికి భార్యాభర్తలిద్దరూ కూర్చుని అవగాహనతో నెమ్మదిగా మాట్లాడుకోవడం ముఖ్యం.  సంబంధాలలో చిన్న చిన్న తగాదాలు సాధారణం. కానీ ఇవి  ఎప్పుడో ఒకసారి జరిగితే పర్లేదు. కానీ ఎప్పుడూ ఇద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉంటే మాత్రం దీని గురించి ఆలోచించాల్సిందే.. ముఖ్యంగా భార్యాభర్తలలో ఉండే కొన్ని అలవాట్ల కారణంగా గొడవలు ఎక్కువగా అవుతుంటాయి. వీటి గురించి భార్యాభర్తలు జాగ్రత్త తీసుకుంటే వారి బంధం పదిలంగా ఉంటుంది. కమ్యూనికేషన్ లేకపోవడం.. ఏదైనా సమస్యను పరిష్కరించడానికి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అవసరం. ఇద్దరి మధ్య  తగాదాలు ఉన్నా  దాన్ని ఆపకుండా   ఉంటే లేదా  సమస్యను వదిలి అప్పటికే ముందుగా ఉన్న తగాదా గురించే మాటిమాటికి మాట్లాడుతూ ఉంటే అది బంధం విచ్చిన్నం కావడానికి దారితీస్తుంది. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బాగుంటేనే సమస్యలు ఏవైనా పరిష్కారం అవుతాయి. బాధ్యతల నుండి తప్పించుకోవడం.. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసినా లేదా ఒకరే ఉద్యోగం చేసినా ఇంటిపని, బయటి పని అనే బాధ్యతలను విభజించుకోవాలి. పనిని ఎగ్గొట్టడం, తప్పించుకోవడం, పని లేకుండా ప్లాన్ చేయడం వంటివి   ఇద్దరి మధ్య గొడవకు దారితీస్తుంది. దీని కారణంగా  చాలా గొడవలు జరుగుతాయి. గౌరవించకపోవడం..  వైవాహిక జీవితం అనే బండి  సజావుగా నడవడానికి అవసరమైన మరొక విషయం ఒకరినొకరు గౌరవించడం. ఒకరి పనిని మెచ్చుకోండి,  ఇద్దరి బంధంలో ఒకరి ప్రాధాన్యతను మరొకరు గుర్తించాలి.  భాగస్వామిలో లోపాలను వెతుకుతూ, వారిలో మంచి విషయాన్ని గ్రహించకుండా ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటే వైవాహిక బంధం నాశనం అవుతుంది. అనవసర కోపాలు.. కొందరికి చిన్న విషయాలకు చటుక్కున కోపం వస్తుంది. చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవడం, అనవసరంగా కోపం తెచ్చుకోవడం... ఇవి  భార్యాభర్తల బంధంలో   గొడవలకు కారణం కావచ్చు. ఎప్పుడూ  కోపంగా ఉండే భాగస్వామితో మాట్లాడటం  కష్టం.  కోపం ఎెందుకు వస్తుందనే విషయం గురించి ఓపెన్ గా మాట్లాడాలి తప్పితే భాగస్వామి ముందు అనవసరంగా కోపం తెచ్చుకుంటే బంధం నిలవదు.                                           *రూపశ్రీ.  

పిల్లలు బాగా ఎమోషన్ అవుతున్నారా? ఇలా హ్యాండిల్ చేయండి!

పిల్లలు ఎదిగే కొద్దీ తమ చుట్టూ ఉన్న పరిస్థితులకు అణుగుణంగా తామూ కనెక్ట్ అవుతారు. ఈ కారణంగా వారు భావోద్వేగాలకు లోను కావడం జరుగుతుంది.  పిల్లల ముఖంలో సంతోషమైనా, సరదా అయినా అందరూ ఎంజాయ్ చేస్తారు. కానీ వారు బాధపడినా, ఏడ్చినా, కోపాన్ని వ్యక్తం చేసినా, బయటకు చెప్పుకోలేని బాధకు లోనైనా అవి తల్లిదండ్రులు భరించలేరు. మరొక విషయం ఏమిటంటే ఈ భావోద్వేగాలు ఒక పరిధి వరకు ఉంటే పర్వాలేదు. కానీ పరిధికి మించిన భావోద్వేగాలు ఉంటే వాటిని హ్యండిల్ చేయడం తల్లిదండ్రుల కర్తవ్యం.  బాగా ఎమోషన్ అయ్యే పిల్లలను ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకుంటే..  పిల్లల భావోద్వేగాలను నియంత్రించడానికి ముందు తల్లిదండ్రులు  స్వంతంగా తమ భావోద్వేగాలను  నియంత్రించుకోవాలి. లోతైన శ్వాస తీసుకోవాలి. తమ మీద తాము దృష్టి కేంద్రీకరించుకోవాలి.  సహనం,  అవగాహనతో పరిస్థితిని అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని  ప్రశాంతంగా ఉన్నప్పుడు పిల్లలే తమ బాధను ఓపెన్ గా చెప్పుకోవడానికి తల్లిదండ్రులే బెస్ట్ అని అర్థం చేసుకుంటారు. తల్లిదండ్రులు బ్యాలెన్స్డ్  గా ఉన్నప్పుడు పిల్లలను కూడా బ్యాలెన్స్ చెయ్యగలుగుతారు. పిల్లలు భావోద్వేగానికి లోనవుతున్నప్పుడు పిల్లలకు బాధపడద్దని, ఇదేమంత పెద్ద వియం కాదు ఎందుకు బాధపడుతున్నావని  చెప్పకూడదు. ఇలా చెప్తే వారిలో నిరుత్సాహం కలుగుతుంది. నా బాధ నా తల్లిదండ్రులకు అర్థం కావడం లేదు అని వారు ఫీలవుతారు. అలా కాకుండా పిల్లలు బాధపడుతున్నప్పుడు దాని వెనుక విషయాన్ని నెమ్మదిగా అడిగి అది ఎంత వరకు బాధపడాల్సిన సందర్భమో వారికి వివరించి చెప్తే వారి ఎమోషన్ ఎంతవరకు కరెక్టో వారికి అర్థమవుతుంది. చిన్నపిల్లలకు భావోద్వేగాలను మాటల్లో వ్యక్తం చెయ్యడం రాదు. వారికి తెలిసిందల్లా ఏడవడం, దిగులుగా కూర్చోవడం మాత్రమే. అలా కాకుండా పిల్లలకు భావోద్వేగాలను ఎలా వ్యక్తం చెయ్యలో.. భావోద్వేగాలను వ్యక్తం చెయ్యడానికి ఎలాంటి మాటలు ఉపయోగిస్తారో అవి మెల్లిగా నేర్పించాలి.దీనివల్ల పిల్లల భావోద్వేగం, వారి బాధ ఎంత స్థాయిలో ఉందో అందరికీ అర్థమవుతుంది.  దాన్ని బట్టి తల్లిదండ్రులు పిల్లలను ఊరడించవచ్చు. పిల్లల భావోద్వేగాలకు గల కారణాలను గుర్తించడం, వాటి పరిష్కార దిశగా ఆలోచించడం, ఎలా పరిష్కరించాలో పిల్లలకే నేర్పించడం తల్లిదండ్రులు చెయ్యాలి. దీనివల్ల పిల్లలు భవిష్యత్తులో వారి సమస్యలను వారే పరిష్కరించుకునే దిశగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. పిల్లల మనసులో భావోద్వేగాలు ఏమున్నా వాటిని స్వంతంగా ఎలాంటి ఎమోషన్స్ ఉపయోగించకుండా చాలా సాధారణంగా వాటిని వ్యక్తం చేసేలా చూడాలి. అలా చేస్తే పిల్లలు వారి భావోద్వేగాలను కూడా నియంత్రణలో ఉంచుకుంటారు. భావోద్వేగాలను ఎక్కడ బయటపెట్టాలి?  ఎక్కడ బయటపెట్టకూడదు? వంటి విషయాలను పిల్లలు తెలుసుకుంటారు.                                              *రూపశ్రీ.  

లక్ష్యానికి అండర్ లైన్ చేసుకోండి...

చాలా మంది యువత తమ లక్ష్యం పట్ల స్పష్టమైన, కచ్చితమైన అభిప్రాయం ఉండదు. ప్రాథమిక పాఠశాలనుంచి యూనివర్సటీ వరకూ అభిప్రాయాలు మార్చుకుంటారు. చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో ఉపాధ్యాయుడు "నువ్వు భవిష్యత్ లో ఏమవుతావు" అని అడిగినప్పుడు మనం ఇచ్చిన సమాధానం ఆరేడేళ్ల తర్వాత హైస్కూల్ కి వచ్చేసరికి మన సమాధానం మారిపోతుంది. హైస్కూల్ నుంచి కాలేజ్ కి వచ్చేసరికి కూడా మన అభిప్రాయం మారిపోతుంది. అయితే ఈ క్రమంలో ఎక్కడో ఒక చోట కచ్చితమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి. గమ్యాన్ని నిర్ణయించుకుంటే కదా ప్రయాణం సాగించగలం. పదునైన ఏకాగ్రత మాత్రమే మనలో గొప్ప ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించగలదు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని అదే ఆలోచనతో, అదే వ్యాపాకంతో ఉండాలి. అది తప్ప వేరే ఇతర వ్యవహారాల జోలికి వెళ్లకుండా కృషి చేస్తే ఎంత అసాధ్యమైన లక్ష్యం అయినా సుసాధ్యం కాగలదు. లక్ష్య సాధనకు సూత్రం ఇదే! ఒకే సమయంలో పలు రకాల పనులు చెయ్యానుకుంటాము. మన ఆదర్శవంతమైన లక్ష్యం అయినా శ్రద్ధా ఏకాగ్రత లేకుండా గొప్ప పని సాధ్యం కాదు. హర్యానాలో చిన్న మారుమూల గ్రామంలో పుట్టిన కల్పనా చావ్లా రోదసీలో ప్రయాణించిన మొట్టమొదటి భారతీయ యువతి. ఆమె తన చిన్నతనంలోనే ఒక స్థిరమైన గమ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆమె జీవిత కథ రాసిన రచయిత " వేసవి రాత్రుల్లో కల్పన వెళ్లికలా పడుకొని ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ ఉండేది. బహుశా రోదసీలో ప్రయాణించాలి అనే కలను అదే కలిగించి ఉండొచ్చు" అంటారు. ఆమె అంతరిక్షావిజ్ఞాన శాస్త్రం (ఏరోనాటికల్ ఇంజనీరింగ్) చదువుకోవాలి అన్నప్పుడు, ఆమె తల్లిదండ్రులు , స్నేహితులు,శ్రేయోభిలాషులు చివరకు కాలేజ్ ప్రిన్సిపాల్ కూడా ఆ శాస్త్రానికి బదులు మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ విభాగాలలో చదువుకోమని సలహా ఇచ్చాడు. కానీ కల్పన మనసు మార్చుకోలేదు. అన్నీ అడ్డంకులను అధిగమించి తన గమ్యాన్ని సాధించింది. తన గమ్యం పట్ల తనకి ఉన్న ఏకాగ్రత భక్తితోనే ఆమె తన జీవితంలో విజయం సాధించడానికి కావలసిన ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ◆వెంకటేష్ పువ్వాడ    

కుటుంబంలో బంధాలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకునేవారు తెలుసుకోవలసిన విషయమిది!

నాలుగు గదుల మధ్య... నలుగురు మనుషులు యాంత్రికంగా కలిసున్నంత మాత్రాన అది ఇల్లనిపించుకోదు. మాయని మమతలు మనసుల మధ్య లతల్లా అల్లుకుపోవాలి. బంధాలు బలోపేతం కావాలి. అందుకే ఆంగ్లకవి ఎమర్సన్ అంటాడు 'The relationship between two members in a family should be like fish and water. It should not be like fish and fisherman'..  కుటుంబంలో ఒకరితో ఒకరికి అనుబంధం చేపకి, నీటికి ఉన్నంత సహజంగా, సౌకర్యంగా ఉండాలే కానీ... చేపకి జాలరికి మాదిరి తప్పించుకోలేని, తప్పనిసరి పరిస్థితిలా సాగిపోకూడదు. ఈ రోజుల్లో ఇళ్లన్నీ ఆధునిక సౌకర్యాలతో శోభిల్లుతున్నాయే కానీ ఆత్మీయతలతో కాదు. తమని తాము పిల్లలకు ఆదర్శంగా మలచుకోలేక, బిడ్డలు మాత్రం తమ చెప్పుచేతల్లో ఉండాలని తల్లిదండ్రులు... తాము ఎలా ఎదగాలో, ఎవరిలా ఉండాలో తేల్చుకోలేక పిల్లలు... అయోమయంతో సతమతమవుతున్నారు. ఫలితం ఎక్కడ చూసినా అంతస్తులు, ఆడంబరాలే తప్పా ఆదర్శాలు, ఆనందాలు తెలీని కుటుంబాలే కనిపిస్తున్నాయి. అన్నింటినీ మించి కుటుంబసభ్యుల్ని మాలలో పూలలా కట్టిపడేసే సాన్నిహిత్య సూత్రమే నానాటికీ సున్నితమవుతోంది.  కుటుంబమంటే ఇలా ఉండాలని పెద్దలు చెబుతున్నారు.. శ్రీరాముని చరిత్ర ఈనాటికీ చర్వితచరణమేనంటే, కారణం అది కుటుంబ విలువలకు కుదురుగా నిలిచింది. కలతలు, కల్లోలాలు ఎన్ని పొడచూపినా కుటుంబ పెద్దగా కోదండరాముడు కష్టాల్ని తనే ముందు భరించాడు... సుఖాలను అనుంగు సోదరులకు, అనుచరులకు పంచిపెట్టాడు. తన మహోన్నత వ్యక్తిత్వంతో కుటుంబాన్నే ప్రభావితం చేశాడు. అయోధ్యను ఏలాల్సినవాడు రాత్రికి రాత్రే అడవులకు పయనం కావాల్సి వచ్చింది. అందుకు కించిత్తయినా కుంగిపోలేదు. ప్రసన్న వదనంతోనే ప్రయాణమయ్యాడు. ఆయనతో అడవి కూడా అయోధ్యే అనుకుని అర్థాంగి వెంట నడిచింది... అన్నావదినల సేవే భాగ్యమనుకొని తమ్ముడూ తోడు నడిచాడు...  చివరికి ఎవరి కోసమైతే తాను రాజ్యం వదులుకున్నాడో ఆ తమ్ముడూ, అన్న పాదుకలకే పట్టాభిషేకం చేశాడు. ఆ శ్రీరాముడు తన ధర్మస్వరూపంతో ఎంత ప్రభావితం చేయకపోతే ఆ పరిగణమంతా అంత త్యాగపూరి తమవుతుంది.! అందుకే తానే కాదు తన శ్రీమతిని, సోదరుల్ని, చివరికి తన సేవకులను కూడా తనతో సమంగా దైవస్వరూపులను చేశాడు. ప్రతీ తండ్రీ ఆ రామచంద్రునిలా ధర్మాన్నే ఆచరిస్తే, ప్రతీ తల్లి సీతాదేవిలా నారీశిరోమణే అయితే... పుట్టే పిల్లలు లవకుశలు కాక  ఇంకేమవుతారు. ఆ ఇల్లు రామాలయం కాక మరేమవుతుంది.!' అంటారు. కాబట్టి ఇల్లు బాగుండాలన్నా, పిల్లలు ధర్మబద్ధంగా ఉండాలన్నా తల్లిదండ్రులు మొదట తమ దారి సరిచేసుకోవాలి..                                        ◆నిశ్శబ్ద.

వివేకం లేని విద్య ఎవ్వరికీ ఉపయోగం?

సమాజంలో విద్య పాత్ర చాలా గొప్పది. విద్య కలిగినవాడి మార్గం వేరుగా ఉంటుంది. జీవితంలో గొప్ప ఉద్యోగ అవకాశాలను పొందాలి అంటే విద్య కూడా గొప్పగానే ఉండాలి.  మనిషి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి విద్య చాలా అవసరం. విటువలులేని విద్య వల్ల వచ్చే ప్రయోజనం శూన్యం! విజ్ఞానం ద్వారా మానవాళికి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుత సమాజంలో విలువలతో కూడిన విద్య సమాజానికి చాలా అవసరం. కానీ ఎక్కడా విలువలు అనేవి విద్యలో అంతగా కనిపించడం లేదు. కారణం విద్యను ఒక వ్యాపారంగా మార్చేయడం. విద్య అనేది ప్రగతిశీలకంగా చైతన్యంగా ఉన్నప్పుడే విద్యకు విలువ అనేది ఉంటుంది. భవిష్యత్ కార్యక్రమాలకు కూడా విద్య ద్వారా అందే ఫలాలు అందరికీ చేరతాయి. కొంతమంది విద్యాలయాల్లో కాకుండా స్వతంత్రంగా చదివి పైకి వచ్చినవారు ఉన్నారు. దూరవిద్య, ఓపెన్ యూనివర్శిటీల ద్వారా ముందుకు సాగుతూ ఉన్నారు కొందరు. విద్య అనేది వివేకాన్ని ఇవ్వాలి. వివేకం లేని విద్య ఎవ్వరికీ ఉపయోగపడదు. ఎందుకంటే అందరూ విద్యా వంతులైతేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. విద్యారంగం విస్తరింపబడుతుంది. దేశ ప్రగతికి, సమాజ శ్రేయస్సుకూ సాంకేతిక వృత్తి, వైద్య విద్యా రంగాలకు ప్రాధాన్యం ఇవ్వ వలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందరూ దీనిని ముక్త కంఠంతో ఆమోదిస్తున్నా అమలుచేయడంలో మాత్రం అలసత్వమే ఎదురవుతోంది. అర్హతలు లేనివారు అందలం ఎక్కటం, విలువలు తక్కువైన విద్య, గుర్తింపు లేని విద్యాలయాలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి.  మేధావులు సలహాలూ సంప్రదింపులూ లేకుండా, కేవలం కార్యనిర్వాహక పదవులలో ఉన్నవారు. చేసే నిర్ణయాల వల్ల హాని జరుగుతుందని గుర్తించే నాటికి జరగవలసిన హాని జరిగిపోతుంది. అందుకే ఎక్కడ చూసినా అర్హత లేనివాళ్ళు ఉంటున్నారు. ప్రభుత్వనేతల రాజకీయాల ప్రాతిపదికతో కాకుండా ప్రతిభ ఆధారంగా, సమర్థులను ఈ రంగంలోకి తీసుకువస్తే విద్యా వ్యవస్థలో మార్పులకు అవకాశం ఉ ఉంటుంది. పాఠశాలలు, కళాశాలల్లో జరిగే బోధనా కార్యక్రమంతోనే విద్య యొక్క పరమావధి పూర్తిగా నెరవేరింది అనుకోవటానికి వీలు లేదు. ఎందుకంటే వ్యక్తిగత అనుభవాల ద్వారా, ప్రపంచ జ్ఞానం ద్వారా, అలవాట్ల ద్వారా కూడా విద్య సమకూరుతుంది. ప్రపంచాన్ని అర్ధం చేసుకోవటానికి, ఆలోచనా పరిధిని పెంచుకోవటానికి విద్య ఉపయోగపడాలి. విద్య మనకు వినయాన్ని, సంస్కారాన్ని ఇవ్వాలి. విద్య ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్, నిర్వహణా సమర్ధ్యం, నాయకత్వ పటిమ పెంపొందాలి. విద్య అనేది సమగ్ర వ్యక్తిత్వానికి పునాదిగా నిలవాలి. విలువలు లేని విద్య నిరర్ధకము. విద్యతో పాటు విలువలు కూడా నేర్చుకోవాలి. విద్యావంతులైన యువతీ యువకులు విశ్వమానవ సౌభ్రాతృత్వానికి, విశ్వశాంతికి, సమాజ వికాసానికి, దేశాభివృద్ధికి కృషి చేస్తూ  తమ ఉన్నత విద్య ద్వారా విదేశాలలో సైతం గౌరవం, ఆదరణ పొందాలి. విద్య ద్వారా సంస్కారవంతులు, గుణవంతులైన వారు తయారౌతారు విద్య జీవనోపాధిగా ఉండటమే కాక, జీవన పరమావధిగానూ ఉండాలి. అందుకే విద్య వస్తే సరిపోదు. దానికి విలువలు ముఖ్యం.                                         ◆నిశ్శబ్ద.

అహల్య వృత్తాంతం మనకు తెలియజేసే నీతి ఏమిటి?

ఒక సాధారణ స్త్రీగా జీవించి ఉంటే ఏనాడో కాలగతిలో ఆమెను మరచిపోయి ఉండేవాళ్ళం ఏమో... కానీ విధివైపరీత్యం ఆమెను పతివ్రతా శిరోమణిగా చేసింది. ఆమె గౌతమ మహర్షి భార్య అయిన అహల్య, ఒక సన్న్యాసికీ, మహర్షికి మధ్య తేడా ఉంది. సన్న్యాసి అంటే గృహసంబంధమైన బాంధవ్యాలు ఉండవు. అన్నింటినీ పరిత్యజిస్తారు. ఋషికి కుటుంబం ఉంటుంది కాని నగరంలో జీవించరు. సమాజానికి దూరంగా జీవిస్తూ ఆధ్యాత్మిక చింతనతో పరమాత్మను తెలుసుకోవడంలో మునిగి ఉంటారు. శిష్యులకి విద్యను బోధిస్తూ తమ జీవనాన్ని సాగిస్తారు. పూర్వం విద్యార్థులు గురువు దగ్గర ఉండి వారితో కలిసి జీవిస్తూ, క్రమశిక్షణతో విద్య నేర్చుకుని విద్యాభ్యాసం పూర్తయ్యాక తిరిగి సమాజంలోకి అడుగు పెట్టేవారు. ఈ విధంగానే గౌతమ మహర్షి కూడా తన భార్యతో కలిసి అడవిలో జీవించేవాడు. అహల్య అంకితభావంతో భర్తకి సేవ చేసేది. అయితే ఆమె ప్రమేయం లేకుండానే అహల్య జీవితంలో ఒక అపశృతి దొర్లింది. తప్పులు అందరూ చేస్తూనే ఉంటారు కాని, ఆ రోజుల్లో చిన్న తప్పుకి కూడా పెద్ద శిక్షలు ఉండేవి. అహల్య తెలిసి చెయ్యకపోయినా జరిగిన తప్పుకి ఆమె బాధ్యురాలయింది. నైతిక విలువలకు ప్రాధాన్యతనిచ్చే గౌతముడు అహల్య తనని మోసం చేసిందనుకుని భ్రమపడి కోపంతో మండిపడ్డాడు. ఒక్క క్షణం ఓర్పు వహించి ఉంటే తన భార్య తప్పిదం ఏమిటో ఆయనకి అర్థమై ఉండేది. కాని తొందరపాటుతో వెంటనే శపించాడు. గౌతమ మహర్షి అహల్యని పాషాణంగా మారమని శపించాడు. అహల్య తన దురదృష్టానికి చింతించక శిక్షను ఆహ్వానించింది. చిన్ననాటినుండి ఓర్పుకి మొదటి ఉదాహరణ భూదేవే అని తెలుసుకుంది. అందువలన తెలియక జరిగినా తన పొరపాటు ఉంది కనుక అందుకు శిక్ష అనుభవించడానికి ఆమె సిద్ధపడింది. కోపం శాంతించిన తరువాత గౌతముడికి తన భార్య వల్ల జరిగిన తప్పు అంత పెద్దదేమీ కాదని తెలుసుకున్నాడు. అయినా తను వేసిన శిక్ష పెద్దది అనుకుని పశ్చాత్తాప పడ్డాడు. అయితే ఇచ్చిన శాపాన్ని ఆమె అనుభవించక తప్పదు కదా! గౌతముడు భార్యతో "మనం చేసిన దుష్కర్మలకు ప్రతిఫలం స్వీకరించాలి. పూర్వ జన్మ కర్మ ఫలితంగా భావించి నీవు సహనంతో అనుభవించాల్సిందే! నీవు త్వరలోనే రక్షించబడతావు, శ్రీరామచంద్రుడు ఇటుగా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు అతడి పాదస్పర్శ ద్వారా నీకు శాపవిమోచనం కలుగుతుంది. ఒక ఆదర్శ వనితగా నువ్వు చరిత్రలో గొప్ప ఉదాహరణగా నిలిచిపోతావు" అని ఓదార్చాడు. అహల్య తనకు వచ్చిన ఆపదను అనుభవించడానికి సిద్ధపడింది. ఉలిదెబ్బలు తగలనిదే శిల్పం తయారు కాదు. కష్టం లేనిదే ఘనకార్యాలు సాధించబడవు. జీవితంలో రాయిగా బ్రతకటం కంటే దురదృష్టకరమైన సంఘటన మరొకటి ఉండదేమో! అహల్య ఇప్పుడు ఈ విపత్తునే ఎదుర్కొంటోంది. కానీ ఈ ఆపదను ఒక అవకాశంగా మలుచుకుంది. ఏ మాత్రం కలత చెందక, నిరాశా నిస్పృహలకు గురికాకుండా, తన సమయాన్నంతా భగవత్ ప్రార్ధనలో గడపసాగింది. ఎవ్వరూ వినాశనాన్ని పొందరని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే జరిగినదానికి కోపంగాని, బాధగాని ఆమెకి లేవు. తనకి కలిగిన పరిస్థితికి తలవంచి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ గడుపుతోంది. కర్మఫలాన్ని అనుభవించేటప్పుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మంచి పనులు చేస్తూపోతే కష్టాలు అనుభవిస్తున్నామనే ఆలోచన కలగదు.  విధిని ఎవరూ ఎదిరించలేరు. వేదాంతం మనకు ఈ విధంగా బోధిస్తుంది, దుర్భర పరిస్థితులు ఎల్లకాలం ఉండవు. ఏదో ఒకనాడు అవి తొలగిపోగలవు. పాపాలు తప్పిదాల నుండే ఉద్భవిస్తాయి. గతంలో విషబీజాలు నాటి ఉంటే దాని ఫలితం వచ్చే తీరుతుంది కదా! అయితే ప్రారబ్ధం అనుభవించడం ద్వారా గత కర్మల బీజాలను నాశనం చేయవచ్చు, ఆగామి కర్మలను మొలకెత్తనివ్వని రీతిగా మలుచుకోవచ్చును. లేదా మంచి విత్తనాలను నాటడం ద్వారా చక్కటి ఫలితాలను పొందవచ్చును. ప్రారబ్ధం అనేది బంగారానికి సానపెట్టడం వంటిది. గత కాలపు చేదు అనుభవాలను గుర్తుపెట్టుకుని, వర్తమానంలో గరిక పోచలను కాకుండా మధుర ఫలాలను ఇచ్చే మేలురకపు విత్తనాలను నాటాలి!  నిష్కామసేవ చేస్తూ మంచితనాన్ని కలిగి ఉండాలి. వ్యతిరేకపు ఆలోచనలను రానివ్వక మంచి భావాలను కలిగి ఉండాలి. గతం ఎంతటి చేదుదైనా, భవిష్యత్తుని రూపొందించుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఇది అహల్య వృత్తాంతం మనకు చెప్పకనే చెబుతుంది.                                     ◆నిశ్శబ్ద.

పిల్లల కారణంగా తల్లిదండ్రులలో కోపమా? ప్రశాంతంగా ఎలా ఉండొచ్చంటే...

  ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే అదొక సందడి అంటారంతా.. కానీ ఆ పిల్లల అల్లరిని భరిస్తూ వారిని ఓ కంట కనిపెట్టుకుని ఉండే  తల్లిదండ్రులకు మాత్రం అదొక పెద్ద టాస్క్ లాగే అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా  రెండేళ్లు పైబడిన పిల్లలు అయితే అల్లరి విషయంలో మరీ దారుణంగా ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ బొమ్మలు గీయడం, ఇల్లంతా చిందరవందర చేయడం, నీళ్లు పారబోయడం, వస్తువులు విరగ్గొట్టడం చేస్తుంటారు. ఇవన్నీ చూస్తూ చాలామటుకు తల్లులు పిల్లల మీద అరిచేస్తుంటారు. కోపంతో రెండు దెబ్బలు కూడా వేస్తారు. ఆ తరువాత తమ పిల్లల్ని కొట్టినందుకు, తిట్టినందుకు బాధపడతారు కూడా. అయితే తల్లులు పిల్లల మీద అరవడానికి, కొట్టడానికి బదులు పిల్లలు అల్లరి చేసినా ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. విశ్రాంతి.. విశ్రాంతి లేకపోవడం తొందరగా కోపం రావడానికి  కారణమవుతుంది.  పూర్తి లేదా తగినంత విశ్రాంతి తీసుకోకపోతే ప్రతి చిన్న,  పెద్ద విషయానికి చిరాకుగా  కోపంగా ఫీలైపోతారు. అందుకే ఒక్కోసారి మీ కోసం సమయాన్ని వెచ్చించాలి.  ఇష్టమైన ఆహారం లేదా ఏదైనా తినడం,  త్రాగడం మొదలైనవి మనస్పూర్తిగా చెయ్యాలి. కాసింత వాకింగ్ చేయడం లేదా రిలాక్స్ గా పడుకవడం చేయాలి.  వీపును నిటారుగా ఉంచి దీర్ఘంగా శ్వాస తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అర్థం చేసుకోవాలి.. అకస్మాత్తుగా  విరిగిన పాత్రతో పిల్లవాడు ప్రత్యక్షం అవ్వగానే మొదట చాలమందికి కోపమే వస్తుంది. వెంటనే గట్టిగా అరిచేస్తారు కూడా. అయితే పిల్లాడిపై కోపం తెచ్చుకునే ముందు పిల్లాడు చెప్పేది వినాలి.  అసలు వస్తువు కానీ వేరే ఇతరం ఏదైనా కానీ ఎలా పోయింది, ఎలా పగిలిపోయింది అనేది మొదట తెలుసుకోవాలి.  అది పిల్లాడే పగలగొట్టాడు అనే విషయం స్పష్టంగా తెలియకుండా పిల్లాడి మీద కోప్పడటం మాత్రం కరెక్ట్ కాదు. అరవకండి.. చాలా సార్లు పిల్లలు  ఏదైనా పనిని చెప్తే దాన్ని సరిగ్గా చేయరు. లేదంటే  చెప్పిన పనిని చెడగొడుతుంటారు. దీనివల్ల  తల్లికి పిల్లాడి మీద చెప్పలేనంత కోపం వస్తుంది.  తల్లి తన కోపాన్ని పిల్లలపై అరుస్తూ వెళ్లగక్కుతుంది. కానీ అరవడం కాకుండా, పిల్లవాడు చేసిన తప్పుపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించాలి.  పిల్లవాడు తనకు తెలియకుండా కూడా తప్పు చేయవచ్చు కదా.. కోపం పరిణామాలు.. చాలా సార్లు తల్లి కోపం పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఒక పిల్లవాడు ఎక్కడికో స్నేహితుడి పార్టీకి వెళ్ళడానికి ఆనందంగా సిద్ధమవుతున్నాడు కానీ ఆలస్యం అవుతోంది అనుకుందాం. తల్లి కోపం,  అరుపుల కారణంగా  పిల్లల రోజంతా చెడిపోవచ్చు. అందుకే ముందు కోపం కారణంగా  వచ్చే పరిణామాల గురించి ఆలోచించండి.                                           *నిశ్శబ్ద.

భర్త ప్రతి రాత్రి ఇంటర్నెట్ లో ఈ పని చేస్తున్నాడా...భార్యలు అలెర్ట్ కావాల్సిందే!

స్మార్ట్‌ఫోన్‌లు,  ఇంటర్నెట్‌లు అనే ఈ రెండు  జీవితంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి సంబంధ స్వభావం మారిపోయింది. మనుషులు ఎదురెదురుగా ఉన్నప్పటికీ   ఎదురుగా ఉన్న మనుషుల మీద కాకుండా  మొబైల్ ఫోన్‌లలో బిజీగా ఉండటానికే ఇష్టపడతారు చాలామంది. మరీ ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఇలాంటివి జరిగితే వారి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతుంది.  ఇది ఇద్దరి మధ్య దూరం పెరిగేలా చేస్తుంది. అయితే భర్త ఇంటర్నెట్ లో ఏ విషయాలు సెర్చ్ చేస్తున్నాడు? అనే విషయం మీద భార్యలు ఎంత అలెర్ట్ గా ఉండాలనే విషయం ఆధారపడి ఉంటుంది. మరీ ముఖ్యంగా చాలామంది మగవాళ్లు రాత్రి పూట  మొబైల్ లో ఆడవాళ్ల ప్రోఫైల్ లు, వారి ఫొటోలు చూడటానికి చాలా  ఆసక్తి చూపిస్తుంటారు. ఇంతకీ ఈ అలవాటు ఎందుకంత మంచిది కాదు.. ఈ అలవాటును భార్యలు ఎలా ఎదుర్కోవాలి?  తెలుసుకుంటే.. ఇతర మహిళల ప్రోఫైల్ లు..   చాలామంది భర్తలు రాత్రి సమయంలో భార్య పనులు చేసుకుంటున్నప్పుడో, భార్య పడుకున్న తర్వాతో ఇంటర్నెట్ లో ఇతర మహిళల ప్రొఫైల్ లు సెర్చ్ చేసి, వారి ఫొటోలు చూస్తుంటారు. సాధారణంగా కొంతమంది మహిళలు ఫేవరెట్ హీరోయిన్ లేదా సెలెబ్రిటీ ఫొటోస్ చూస్తున్నాడు ఏం అవుతుందిలే అని కాంప్రమైజ్ అయిపోతారు. కానీ ఇది అక్కడితో ఆగకుండా ఇతర మహిళల వరకు వెళితే మాత్రం ఆడవాళ్లు అలెర్ట్ కావాల్సిందే. దీని కారణంగా భర్తలు భార్యలను బాడీ షేమింగ్ చేయడం, ఇతర మహిళల అందంతో భార్యలను పోల్చడం వంటి ఎన్నింటికో దారితీస్తుంది. అభ్యంతరం.. భర్తలు ఇలా ఇతర మహిళల ప్రొఫైల్స్ సెర్చ్ చేస్తుంటే.. భార్యలు ఆభ్యంతరం చెప్పాలి. నా భర్త పరాయి మహిళల ఫొటోలు చూస్తున్నాడు అని మనసులో ఫీలవ్వడం కంటే నేరుగా భర్తతో అలా చూడద్దని చెప్పడం మంచిది. అలా చెప్పిన తరువాత వారు అదే పని కంటిన్యూ చేస్తుంటే సింపుల్ వారితో మాట్లాడటం తగ్గిస్తే సరి..  వారు నెట్ లో ఇతర మహిళల ఫొటోలు చూడాలని అనుకున్నప్పుడల్లా తాము తప్పు పని చేస్తున్నామేమో అనే ఫీలింగ్ వారికే కలుగుతుంది. క్రమంగా ఆ అలవాటు కూడా తగ్గుతుంది. తప్పు ఎక్కడుందంటే.. చాలా వరకు మగాళ్లు ఇతర మహిళల పట్ల, ఇతర మహిళల ఫ్రొఫైల్స్, ఫోటోస్ చూడటం పట్ల ఆసక్తి కనబరుస్తున్నారంటే దానికి పెద్ద కారణం వారికి భార్య నుండి అసంతృప్తి ఎదురవుతున్నట్టు. చాలా వరకు భార్యలు ఇంటి పని, ఉద్యోగాల కారణంగా తమ పట్ల తాము చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ మహిళలు తమ పట్ల తాము కేర్ గా ఉంటూ, అందంగా ముస్తాబవుతుంటే భర్త కూడా ఇతర మహిళల వైపు కన్నెత్తి చూడడు. కాబట్టి భర్తలను మార్చుకునే మార్గం భార్యల చేతుల్లోనే ఉంది.                                                 *నిశ్శబ్ద.

మన ఉగాది!!

నిజమే ఉగాది పండుగ మనదే. తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది తోనే ప్రారంభమవుతుంది.  మన కొత్త సంవత్సరం అంతా ఎంతో కళను నింపుకుని ఉంటుంది. సాంప్రదాయంగా ఉంటుంది. ముఖ్యంగా కృత్రిమత్వంలో పడిపోతున్న మనిషిని బయటకు తీసుకొచ్చి కాసింత ప్రకృతి మధ్య నిలబెడుతుంది. ఇంతకూ మన ఉగాది మనకు మాత్రమే తెలుసా!! మనకు తెలిసిన ఉగాది ఏంటి?? మనం రేపటి తరానికి ఉగాది గురించి చెబుతున్నది ఏంటి??  ఉగాది వెనుక కథ!! సోమకుడు అనేవాడు వేదాలను హరించాడు(దొంగిలించాడు). అలా వేదాలను దొంగిలించిన సోమకుడిని  మత్స్యవతారంలో ఉన్న  విష్ణువు వధించి(సంహరించి, చంపి) వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభదినంను పురస్కరించుకుని విష్ణువు ప్రీత్యర్ధం 'ఉగాది' ఆచరణలోకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.  అయితే చైత్రశుక్లపాడ్యమినాడు ఈ విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కాబట్టి, సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుతుందని కూడా చెప్పబడుతుంది. శాలివాహన చక్రవర్తి చైత్రశుక్లపాడ్యమినాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా మారిన కారణంతో ఆ యోధుడిని స్మరించుకుంటూ ఉగాది జరుపుకుంటారని చారిత్రక వృత్తాంతం. ఇలా కారణాలు ఎన్ని ఉన్నా ఉగాది అనేది ఓ కొత్తదనానికి సూచిక.  ఆశను మొలిపించే తరుణం!! మనిషి తరతరాలుగా ఓ నమ్మకంతో ఉన్నాడు. అదే కొత్తదనంలో జీవితం కొత్తగా మారుతుందని. అది చాలా మంచి ఆశావహదృక్పథం కలిగి ఉంటుంది. ఆకురాల్చు కాలంలో చెట్ల ఆకులు అన్నీ పోయాక, మోడువారి ఏమీలేనితనంతో ఉన్నప్పుడు, వసంతం వస్తుంది, మెల్లిగా చివురులు తొడుగుతాయి చెట్లు. అవన్నీ పచ్చని ఆశల చివురులు, ఉగాదిలో దాగున్నది అదే అంటారు అందరూ. షడ్రుచులు-జీవితసారం!! ఉగాది రోజు అందరి ఇళ్లలో ఉండే ప్రత్యేక విందు ఉగాది పచ్చడి. నిజానికి జీవితమంతా ఆ పచ్చడిలోనే ఉందని చెబుతారు పెద్దలు. కష్టాలు, సుఖాలు, బాధలు, ఇబ్బందులు, ప్రేమలు, పొట్లాటలు ఇలా అన్నీ ఉగాది పచ్చడిలో ఉండే ఆరు రుచులలో కలిసిపోయి ఉంటాయని చెబుతారు. అందుకే ఉగాది రోజు ఉగాది పచ్చడికి నత ప్రత్యేకత వచ్చి పడింది. అలాగే మరొక విషయం కూడా. ఉగాది సమయంలోనే కొత్త బెల్లం దొరుకుతుంది, మామిడికాయల గురించి ప్రత్యేకంగా చెప్పాలా?? ఈ సమయానికి కాస్త చిన్న చిన్నగా ఉన్న వగరుతో ఉన్న కాయలు వస్తాయి. ఇంకా ఎంతో గొప్ప ఔషధ మూలాలు కలిగిన వేపచెట్లకు పువ్వులు పూస్తాయి, కొత్త చింతపండు ఎర్రెర్రగా నిగానిగలాడుతూ అందరి ముందుకూ వస్తుంది.  వీటన్నింటి కలయిక అయిన వేపపచ్చడి ఆరు రుచులతో కనువిందు చేస్తుంది. సంప్రదాయపు గీతిక!! ఉగాది రోజు మగవాళ్ళు అందరూ పంచెకట్టులోనూ, ఆడవాళ్లు పట్టుచీరల్లోనూ, పిల్లలు కొత్త బట్టల్లోనూ మెరిసిపోతూ ఉంటారు. ఆ వస్త్రధారణలో అసలైన తెలుగుదనం ఉట్టిపడుతూ ఉంటుంది. నగరాలలో కృత్రిమత్వంలో మునిగిపోయిన యువత ఎంతో అందంగా, పద్దతిగా, బుద్దిగా ఇలా తయారైతే ఇంటిల్లిపాదికీ ఎంత సంతోషమో!! ఇంకా పంచాంగ శ్రవణం మరొక వేడుక, పిండి వంటల సంబరం మరొక ఎత్తు. ఇలా అన్ని విధాలుగా ఉగాది మనిషి జీవితంతో ముడిపడి ఉంటుంది. మనిషి జీవితానికి అసలైన నిర్వచనాన్ని ఉగాది చెబుతుంది. అభివృద్ధి వేగంలో మనిషి మర్చిపోతున్న అసలైన నడవడికను మన ఉగాది మనకు తిరిగి అందిస్తుంది. అందుకే ఇది మన తెలుగుసంవత్సరం అని గొప్పగా జరుపుకోవాలి.                                    ◆ వెంకటేష్ పువ్వాడ.

స్వేచ్ఛ మనిషి మీద చూపే ప్రభావం ఎలా ఉంటుంది?

ప్రతి మనిషి తన జీవితంలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చేది గట్టిగా మాట్లాడేది స్వేచ్ఛ గురించే.. ఒకప్పుడు స్వేచ్ఛ లేని జీవితాలు చాలా ఉండటం వల్ల స్వేచ్ఛ స్ఫహించుకోవడం లక్ష్యమని, అది హక్కు అని సమాజంలో పౌరులు గట్టిగా నిర్ణయించుకున్నారు. అయితే..  స్వే చ్ఛకు సంబంధించి పలువురిలో ముఖ్యంగా నేటి యువతరంలో చాలా దురభిప్రాయలు వున్నాయి. స్వేచ్ఛకు వారు ఇచ్చుకునే నిర్వచనాలు పూర్తిగా వేరుగా ఉంటున్నాయి. కేవలం డబ్బు ఉండటాన్ని, భౌతికంగా నచ్చినట్టు జీవించడాన్ని, ముఖ్యంగా విచ్చలవిడితనాన్ని మాత్రమే స్వేచ్ఛగా భావించే  పరిస్థితి ప్రస్తుత సమాజంలో నెలకొని వుంది.  ఈ కంజ్యూమరిస్ట్ ధోరణి తాలూకు స్వేచ్ఛ వాస్తవానికి మనిషిని మానసికంగా ఎదగనీయదు. ఇదంతా కేవలం పైకి కనిపించే ఆడంబరం మాత్రమే. ఇలా ఉండటం వల్ల మనిషిలో కలిగే మార్పులు ఏమీ లేకపోగా ఇంకా వ్యక్తిత్వ పరంగా దిగజారిపోతాడు.  తమ అస్థిత్వంలో భద్రతా రాహిత్యానికి లోనయ్యే వ్యక్తులు, తమ చుట్టూ సిరి సంపదలను, వస్తు సముదాయాన్ని పోగు చేసుకోవటం ద్వారా ఈ అభద్రతా భావాన్ని అధిగమించాలని చూస్తున్నారు. అయితే ఈ పోటీ ప్రపంచంలో శృతిమించిన భౌతిక సంపదలను సంపాదించడం. వాటి వల్ల సుకెబాన్ని పొందాలనే తాపత్రయం మనిషిని విముక్తి చేయలేదు.  కాలంతో పాటు ఈ సంపాదన… సుఖాల దారులు క్రమంగా మరొకరితో పోల్చుకుంటూ పెరుగుతూ ఉంటాయే తప్ప తృప్తితో ఆగిపోయేవి కాదు. ఇలా పోటీగా ఇతరులతో పోల్చుకునే మనస్థత్వం వ్యక్తిని మరింత అభద్రతా భావానికి గురిచేస్తుంది. ఇది వ్యక్తిగత స్వేచ్ఛ తాలూకు నిజమయిన సారం యొక్క వక్రీకరణ. దీనికి ఒక ఉదాహరణ చెప్పవచ్చు.  ఇద్దరు స్నేహితులు ట్రెక్కింగుకు వెళ్లి ఒక కారడవిలో చిక్కుకు పోయారు. ఆ అడవి నుంచి ఎలా బయటపడాలో తెలియని పరిస్థితిలో వారు ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో వీరిలో ఒకరు తాను స్వేచ్ఛా మానవుడినని, తన యిష్టమైన రీతిగా అడవినుంచి బయటపడే మార్గాన్ని ఎంచుకోగలనని భావించాడు. కాగా రెండో వ్యక్తి ప్రకృతిలో కొన్ని నియమ నిబంధనలు సూత్రాలు వున్నాయని భావించి ఆ అడవినుంచి బయట పడేందుకు సూర్యచంద్రుల స్థానాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని అనుకొన్నాడు. అంటే అతను ప్రకృతి నియమాలకు లోబడి తన మార్గాన్ని ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకొన్నాడు.  ఇద్దరిలో ఎవరు ఖచ్చితంగా అడవినుంచి బయట పడేందుకు ఎక్కువ అవకాశాలున్నాయో మనం వేరే ఆలోచించనవసరం లేదు. ప్రకృతి నియమాలకు లోబడి ప్రవర్తించిన వ్యక్తికే ఆ కారడవినుంచి సజీవంగా బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉదాహరణ మనం ప్రజల మధ్య నివసిస్తున్న తీరుకు కూడా వర్తిస్తుంది. మన నాగరిక సమాజంలో విజయవంతంగా జీవితంలో ముందుకు దూసుకు వెళ్ళాలంటే, ఈ సమాజానికి కూడా కొన్ని నియమనిబంధనలు, సూత్రాలు వర్తిస్తాయని గుర్తించిన వారికే అది సాధ్యమవుతుంది. అలా కాకుండా వ్యక్తిగత స్వేచ్ఛ భ్రమలో విశృంఖలంగా ప్రవర్తించే వ్యక్తి స్వేచ్ఛారహితుడిగానూ, చివరకు వైఫల్యం చెందే వాడిగానే మిగిలిపోతాడు.                                          ◆నిశ్శబ్ద.

సుధామూర్తి గారి సలహా.. పిల్లల్ని ఇలా పెంచితే డాక్టర్లు, ఐఏఎస్ లు కావడం ఖాయమట!

ఇంజనీర్, సామాజిక కార్యకర్త,  రచయిత సుధా మూర్తి పిల్లల కోసం కథలు వ్రాస్తారు. ఆమె మానవతావాద సమస్యల గురించి,  సామాజిక సమస్యలపై  మాట్లాడటంలోనూ ఎప్పుడూ ముందుంటారు.  భారతదేశంలో విద్య, గ్రామాల అభివృద్ధి,  మహిళల అభ్యున్నతిలో ఆమె చాలా దోహదపడింది. ఆమె  జీవితమంతా ఒక ప్రేరణ కంటే తక్కువ కాదు. ఆమె జీవితంలో వివిధ సందర్భాలలో పేర్కొన్న ఎన్నో స్పూర్తిదాయక విషయాలు పిల్లలను ముందుకు సాగడానికి ప్రేరేపిస్తాయి. మీ పిల్లలు ఆత్మవిశ్వాసం,  ధైర్యం కోల్పోకూడదని తల్లిదండ్రులుగా మీరు కోరుకుంటే, సుధా మూర్తి చెప్పిన స్పూర్తిదాయకమైన విషయాలను తప్పక పిల్లలకు చెప్పాలి. ఇవి చెబితే ఏ పిల్లవాడు అయినా ఆత్మవిశ్వాసాన్ని పోగుచేసుకుంటాడు. జీవితంలో గొప్ప విజయాలు సాధిస్తాడు. ఐఏఎస్, డాక్టర్ లాంటివి కూడా వారికి చిన్న లక్ష్యాలుగా అనిపిస్తాయి.  కలలను ఎప్పటికీ వదులుకోవద్దు.. జీవితంలో  కలలను ఎప్పటికీ వదులుకోకూడదని సుధా మూర్తి అన్నారు. మొదలుపెట్టిన పని ఎంత కష్టమైనా పూర్తి చేయాలి. కష్టపడి పనిచేయడం వల్ల కలలు నెరవేరుతాయి. పిల్లలు దీన్ని అర్థం చేసుకుంటే వారు చిన్న వైఫల్యాలకు భయపడటం మానేస్తారు. ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి.. జీవితంలో నేర్చుకోవడం ఏ సందర్భంలోనూ  ఆపకూడదని సుధా మూర్తి అన్నారు. ప్రపంచంలోకి ఎప్పుడూ కొత్త విషయాలు వస్తూనే ఉంటాయి.  సాంకేతికతతో ఎంత చురుగ్గా, ఎంత అవగాహనతో  ఉంటే, జీవితంలో  ముందుకు వెళ్లడం అంత సులభం అవుతుంది. నేర్చుకోవడం మెదడు అప్రమత్తంగా ఉండటానికి సహాయపడుతుంది. అపజయానికి భయపడవద్దు.. సుధా మూర్తి చెప్పిన మాటల ప్రకారం  అపజయానికి భయపడకూడదు.  వైఫల్యాల నుండి నేర్చుకుని మళ్లీ ప్రయత్నించాలి. విజయానికి మార్గంలో వైఫల్యం తప్పనిసరి. పిల్లలు వారి వైఫల్యం నుండి నేర్చుకుంటే వారు జీవితంలో ముందుకు సాగకుండా ఎవరూ ఆపలేరు. ఇతరులకు ప్రాముఖ్యత ఇవ్వాలి..  ఎవరి జీవితం  గురించి వారు ఆలోచించడం  సరికాదు.  సమాజంలో జీవిస్తున్నాము కాబట్టి ఇతరుల భావాలను, వారి  అవసరాలను గౌరవించడం ముఖ్యం. తనకే పరిమితమైన మనిషి ఎప్పటికీ ముందుకు వెళ్లలేడు. పిల్లలు చిన్నతనం నుండే ఇతరుల భావాలను గౌరవించడం నేర్చుకోవాలి. పిల్లలు ఈ మూడు విషయాలను అర్థం చేసుకున్నా, పిల్లలకు అర్థమయ్యేలా తల్లిదండ్రులు చెప్పినా.. ఆ పిల్లలు జీవితంలో తప్పకుండా గొప్ప స్థాయికి ఎదుగుతారు.                                             *నిశ్శబ్ద.

ఆధ్యాత్మిక విజయానికి అసలు అర్థం ఇదే..!

ఆధ్యాత్మిక జీవితంలో విజయం సాధించడం గురించి చెప్పుకొనే ముందు అసలు ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలి. భగవత్ దర్శనమే ఆధ్యాత్మిక జీవితమా లేక మానవాతీత శక్తులను సాధించడమా లేక పూజలు, వ్రతాలు, తపస్సు చేసి ప్రాపంచిక జీవితంలో విజయం సాధించడమా? పరమేశ్వరుడి దర్శనమే చాలు అనుకుంటే రావణాసురుడికి ఆ దేవదేవుడు ప్రత్యక్షమయ్యాడు. మన దేశంలో మానవాతీత శక్తులున్నవారు చాలా మందే ఉన్నారు. కొందరు లోహాన్ని బంగారం చెయ్యగలరు, కొందరు గాలిలో ఎగరగలరు, కొందరు ముందు జరగబోయేదాన్ని చెప్పగలరు, మరికొందరు కాయసిద్ధిని సాధించి తమ ఆయుర్దాయాన్ని పొడిగించు కోగలరు. పూజలూ పునస్కారాలూ చేసి సంపద, కీర్తి, అధికారాలను పొందేవారి సంఖ్య చెప్పలేనంత ఉంది. మరి ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటి? పూజలు చెయ్యొచ్చు, భక్తిని పెంపొందించుకోవచ్చు కానీ భగవంతుణ్ణి ఏమీ అడగకూడదు. "భగవంతుడా! నా కోరిక తీర్చు. నాకు అది ఇవ్వు... ఇది ఇవ్వు... నా కోరిక తీరిస్తే నీకు నేను ఏదో చేస్తాను..." అనడం భక్తి కాదు. అది భగవంతుడితో వ్యాపారం. దీనికి ఉదాహరణగా కింద విషయాన్ని చెప్పుకోవచ్చు.  పర్షియాను జయించి, ఉత్తర భారత దేశంలో పురుషోత్తముడనే రాజును ఓడించి, దక్షిణాపథం వైపు దూసుకుని వెళుతున్నాడు అలెగ్జాండర్ చక్రవర్తి. అతని రథానికి ఇరువైపులా శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నారు జనం. అతని ఆధిపత్యాన్ని ఎదిరించలేక తల వంచుతున్నారు. రథంలో పయనిస్తున్న అలెగ్జాండర్ దృష్టి ఒక వ్యక్తి పైన పడింది. అతను తల వంచి నమస్కరించలేదు. అలెగ్జాండర్ వైపు తదేకంగా చూస్తున్నాడు. అది గమనించి వెంటనే ఒక సైనికుడు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి "బతికి ఉండాలంటే తలదించు. లేకపోతే ప్రాణాలతో ఉండవు" అని బెదిరించాడు. అయితే అతను ఆ సైనికుడి మాటలు వినిపించుకోలేదు. ఇది చూసిన అలెగ్జాండర్ తన రథం ఆపి, ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు. “నేనెవరో తెలుసా" అని గర్జించాడు. అతను బదులు చెప్పకుండా అలెగ్జాండర్నే చూడసాగాడు. అలెగ్జాండర్ కోపంగా తన ఖడ్గం తీసి, "తల వంచక పోతే శిరచ్ఛేదన చేస్తాను" అని హెచ్చరించాడు. అయినా ఆ వ్యక్తి నిశ్చలంగా ఉన్నాడు. అలెగ్జాండర్ అతని మీద పట్టరాని కోపంతో తన చేతిలోని కత్తిని ఎత్తాడు. అయినా అతడు చలించలేదు. అలెగ్జాండర్ నిశ్చేష్టుడయ్యాడు. ధైర్యాన్ని కోల్పోయాడు, మానసికంగా దుర్బలుడయ్యాడు. "నీకు మరణమంటే భయం లేదా?” అని అలెగ్జాండర్ అడగగా ఆ వ్యక్తి మందహాసంతో “లేదు" అన్నాడు. తన జీవితంలో ఇప్పటి వరకూ ఇలాంటి వ్యక్తిని ఎదుర్కోలేదని గ్రహించాడు అలెగ్జాండర్. ఎదురులేని వీరుడిగా పేరుగాంచిన అలెగ్జాండర్కు ఆ వ్యక్తిని తాను ఎదిరించలేనని తెలిసింది. “మరణమంటే ఈ వ్యక్తికి భయం లేదెందుకు?" అని మనస్సులో పదే పదే అనుకున్నాడు. "నువ్వెవరు? నీకు మరణమంటే ఎందుకు భయం లేదు?" అని అడిగాడు. ఆ వ్యక్తి "నేను శరీరాన్ని కాదు, బుద్దిని కాదు, మనస్సును కాదు. నాకు చావు, పుట్టుకలు లేవు. లేని చావుకు భయం ఎందుకు? నువ్వు ప్రపంచ సామ్రాట్ వి కావచ్చు కానీ నిన్ను నువ్వు శరీరమని అనుకుంటున్నావు. ఎంత రాజ్యం ఉంటే ఏమిటి, ఏదో ఒక రోజు మరణిస్తావు. అప్పుడు నీకు కావాల్సింది ఆరడుగుల నేల మాత్రమే. ఆఖరికి నువ్వు సాధించేది అదే" అన్నాడు. అప్పుడు అలెగ్జాండర్ 'ఆ వ్యక్తి ఒక మహాయోగి' అని గ్రహించాడు. వెంటనే యుద్ధప్రయత్నాన్ని విరమించుకొని, ప్రణామం చేసి వెనక్కి తిరిగాడు. ఆధ్యాత్మికత అంటే మనోబుద్ధి అహంకారాలను జయించి తాను ఆత్మస్వరూపుడననే జ్ఞానం పొందడమే. ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో అదే 'అసలైన విజయం!'                                            *నిశ్శబ్ద.