అంతర్గత శక్తులను బయటకు తీయడం ఎలా?  నిపుణులు చెప్పిన మార్గాలేంటో తెలుసుకోండి!

 

సినిమాల్లోని సూపర్‌హీరోల మాదిరిగానే మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ అంతర్నిర్మితమై ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉండటానికి శరీరానికి ఎదురయ్యే అనారోగ్యాలు, గాయాలతో పోరాడుతూ ఉంటుంది.  ఇలా కేవలం శరీరమే కాదు.. మనిషి మనసు కూడా ప్రత్యేక సామర్థ్యాలు కలిగి ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి  మనసు, శరీరం రెండూ కలసి ఎలా పనిచేస్తాయో..  మనిషిలో ఉన్న అంతర్గత శక్తులను బయటకు తీయడం ఎలాగో తెలుసుకుంటే..

బాల్యం..

బాల్యం ప్రతి ఒక్కరి జీవితంలో భాగం. పెద్దయ్యాక ప్రతి ఒక్కరూ బ్యాలంలోకి వెళ్లిపోవాలని అంటుంటారు. అదొక అందమైన దశ. అమాయకత్వం, ప్రేమ, సంతోషం, కల్మషం లేని వ్యక్తిత్వం బాల్యంలో ఉంటుంది. ఒకవేళ ఇలా ప్రేమ, ఆప్యాయతల మధ్య కాకుండా నిర్లక్ష్యం చేయబడటం, హింసకు గురికావడం వంటివి బాల్యంలో జరిగి ఉంటే అవి మానసికంగా చాలా బాధపెడతాయి. బాల్యంలో ఏం జరిగిందో అర్థం చేసుకోవడం వల్ల భవిష్యత్తును ఆశాజనకంగా తీర్చిదిద్దుకోవచ్చు. తప్పులను సరిదిద్దుకోవచ్చు. బాద్యత కలిగిన పెద్దలుగా ఎదగవచ్చు.

ట్రీట్మెంట్..

 చాలామందిలో చిన్నతనంలో జరిగిన ఎన్నో అనుభవాలు మనసులో పాతుకుపోయి ఉంటాయి.  వర్తమానానికి తగినట్టు కాకుండా మనసులో పాతుకుపోయిన విషయాలకు అనుగుణంగా నటిస్తుంటారు. దానికి తగినట్టు ప్రవర్తిస్తుంటారు. అయితే మనసులో ఉన్న ఈ పాత విషయాలను మార్చేయడం ద్వారా మనసులో ఉన్న అంతర్గత శక్తులను బయటకు తీయగలరని అంటున్నారు నిపుణులు. తద్వారా జీవితాన్ని ఉన్నతంగా మార్చుకునే అవకాశం పొందగలం.

చిత్తశుద్ది..

వర్తమానం గురించి తెలుసుకోవడం కోసం సమర్థవంతమైన మార్గాలలో మైండ్‌ఫుల్‌నెస్ ఒకటి. అంటే ప్రస్తుతం జరుగుతున్నవాటిని జడ్జ్ చేయకుండా వాటిని నిశితంగా గమనించడం.  వర్తమానంలో భావాలు, అనుభూతులు, ఆలోచనలు, చుట్టూ జరుగుతున్న విషయాలు మొదలైనవాటిని గమనించాలి. మైండ్‌ఫుల్‌నెస్ పాత బాధలను నయం చేయడంలో సహాయపడుతుంది. ప్రస్తుత క్షణంపై దృష్టి కేంద్రీకరించినప్పుడు పాత విషయాలను బాగా అర్థం చేసుకోవచ్చు. వాటిని అంతే ధీటుగా ఎదుర్కోవచ్చు. తద్వారా మనసుకు చికిత్స చేయవచ్చు.

క్షమాపణ..

క్షమాపణ అడగడం, ధన్యవాదాలు చెప్పడం, ప్రేమను హృదయపూర్వకంగా వ్యక్తం చేయడం వంటివి వ్యక్తిలో ఉండే ప్రతికూల శక్తులను బయటకు విడుదల చేస్తాయి.  ప్రతికూల ప్రభావాలకు బాధ్యత వహించడం, పశ్చాత్తాపాన్ని, కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేయడం ద్వారా వ్యక్తిలో అంతర్గత శాంతి నెలకొంటుంది. ఇది వ్యక్తిగతంగానూ, ఇతరులతోనూ సామరస్యాన్ని నెలకొల్పుతుంది.

శ్వాస ఉపయోగించడం..

గతాన్ని నయం చేయడానికి శ్వాసను ఉపయోగించడం చాలా గొప్ప మార్గం. పాత జ్ఞాపకాలను, మనసులో ఉన్న విషయాలను వదిలించకోవడానికి శ్వాసమీద దృష్టి పెట్టడం, నెమ్మదిగా లోతైన శ్వాస తీసుకోవడం ద్వారా మనస్సును, శరీరాన్ని  శాంతపరచవచ్చు. ఇది గతంలో ముడిపడిన భావోద్వేగాలకు విశ్రాంతి ఇవ్వడానికి, వాటిని విడుదల చేయడానికి సహాయపడుతుంది.

జర్నలింగ్.. రిఫ్లెక్షన్స్..

ఆలోచనలను, భావాలను రాయడం వల్ల గతాలకు సంబధించిన గాయాలను, భావోద్వేగాలను నయం చేయడం సులువుగా ఉంటుంది. వ్యక్తులు తమను తాము అర్థం చేసుకోవడంలో ఇది సహాయపడుతుంది. ప్రతికూల విధానాలను విడిచిపెట్టి, ఆరోగ్యకరమైన మార్గంలోకి మెదడును, ఆలోచనలను  తీసుకెళ్లడంలో ఇది సహాయపడుతుంది.

సపోర్ట్..

ఏ విషయంలో అయినా స్వంతంగా చేసే ప్రయత్నాల కంటే ఒకరి మద్దతుతో చేసే ప్రయత్నాలు ఎప్పుడూ మంచి ఫలితాలు ఇస్తాయి. భావోద్వేగాలకు సంబంధించిన గాయాలు నయం చేయడంలో సామాజిక మద్దతు కీలకపాత్ర పోషిస్తుంది. ప్రతి ఒక్కరికి వ్యక్తి గురించి ఆలోచించేవారు, అన్ని విషయాలలో మద్దతు ఇచ్చే వారుంటే తప్పొప్పుల గురించి చర్చించి మాట్లాడటం, అర్థం చేసుకోవడం, సరైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే గతాన్ని వదిలించుకునే క్రమంలో ఎప్పుడూ ఒంటరితనం వేధించదు. మనస్సు, శరీరం రెండూ ఏకమైనప్పుడు , అవి రెండూ కలిస్తే ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకున్నప్పుడు స్వతహాగానే మనిషిలో అంతర్గత శక్తులు బయటకు వస్తాయి.

                                         * నిశ్శబ్ద.