పిల్లల కారణంగా తల్లిదండ్రులలో కోపమా? ప్రశాంతంగా ఎలా ఉండొచ్చంటే...

 

ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే అదొక సందడి అంటారంతా.. కానీ ఆ పిల్లల అల్లరిని భరిస్తూ వారిని ఓ కంట కనిపెట్టుకుని ఉండే  తల్లిదండ్రులకు మాత్రం అదొక పెద్ద టాస్క్ లాగే అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా  రెండేళ్లు పైబడిన పిల్లలు అయితే అల్లరి విషయంలో మరీ దారుణంగా ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ బొమ్మలు గీయడం, ఇల్లంతా చిందరవందర చేయడం, నీళ్లు పారబోయడం, వస్తువులు విరగ్గొట్టడం చేస్తుంటారు. ఇవన్నీ చూస్తూ చాలామటుకు తల్లులు పిల్లల మీద అరిచేస్తుంటారు. కోపంతో రెండు దెబ్బలు కూడా వేస్తారు. ఆ తరువాత తమ పిల్లల్ని కొట్టినందుకు, తిట్టినందుకు బాధపడతారు కూడా. అయితే తల్లులు పిల్లల మీద అరవడానికి, కొట్టడానికి బదులు పిల్లలు అల్లరి చేసినా ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.

విశ్రాంతి..

విశ్రాంతి లేకపోవడం తొందరగా కోపం రావడానికి  కారణమవుతుంది.  పూర్తి లేదా తగినంత విశ్రాంతి తీసుకోకపోతే ప్రతి చిన్న,  పెద్ద విషయానికి చిరాకుగా  కోపంగా ఫీలైపోతారు. అందుకే ఒక్కోసారి మీ కోసం సమయాన్ని వెచ్చించాలి.  ఇష్టమైన ఆహారం లేదా ఏదైనా తినడం,  త్రాగడం మొదలైనవి మనస్పూర్తిగా చెయ్యాలి. కాసింత వాకింగ్ చేయడం లేదా రిలాక్స్ గా పడుకవడం చేయాలి.  వీపును నిటారుగా ఉంచి దీర్ఘంగా శ్వాస తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి.

అర్థం చేసుకోవాలి..

అకస్మాత్తుగా  విరిగిన పాత్రతో పిల్లవాడు ప్రత్యక్షం అవ్వగానే మొదట చాలమందికి కోపమే వస్తుంది. వెంటనే గట్టిగా అరిచేస్తారు కూడా. అయితే పిల్లాడిపై కోపం తెచ్చుకునే ముందు పిల్లాడు చెప్పేది వినాలి.  అసలు వస్తువు కానీ వేరే ఇతరం ఏదైనా కానీ ఎలా పోయింది, ఎలా పగిలిపోయింది అనేది మొదట తెలుసుకోవాలి.  అది పిల్లాడే పగలగొట్టాడు అనే విషయం స్పష్టంగా తెలియకుండా పిల్లాడి మీద కోప్పడటం మాత్రం కరెక్ట్ కాదు.

అరవకండి..

చాలా సార్లు పిల్లలు  ఏదైనా పనిని చెప్తే దాన్ని సరిగ్గా చేయరు. లేదంటే  చెప్పిన పనిని చెడగొడుతుంటారు. దీనివల్ల  తల్లికి పిల్లాడి మీద చెప్పలేనంత కోపం వస్తుంది.  తల్లి తన కోపాన్ని పిల్లలపై అరుస్తూ వెళ్లగక్కుతుంది. కానీ అరవడం కాకుండా, పిల్లవాడు చేసిన తప్పుపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించాలి.  పిల్లవాడు తనకు తెలియకుండా కూడా తప్పు చేయవచ్చు కదా..

కోపం పరిణామాలు..

చాలా సార్లు తల్లి కోపం పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఒక పిల్లవాడు ఎక్కడికో స్నేహితుడి పార్టీకి వెళ్ళడానికి ఆనందంగా సిద్ధమవుతున్నాడు కానీ ఆలస్యం అవుతోంది అనుకుందాం. తల్లి కోపం,  అరుపుల కారణంగా  పిల్లల రోజంతా చెడిపోవచ్చు. అందుకే ముందు కోపం కారణంగా  వచ్చే పరిణామాల గురించి ఆలోచించండి.

                                          *నిశ్శబ్ద.