Read more!

స్నేహం, ప్రేమ మధ్య తేడా గుర్తించడం ఎలా.. ఇదిగో ఇలా!

ప్రేమ, స్నేహం రెండు కవలపిల్లల లాంటివి. చూడ్డానికి రెండు ఒకేలా ఉంటాయి. కానీ చాలా సున్నితమైన వ్యత్యాసాలు దాగుంటాయి. స్నేహం ప్రేమ లానూ, ప్రేమ స్నేహం లానూ అనిపించి చాలా మందిని గందరగోళ పెడుతుంది. మరీ ముఖ్యంగా నేటి కాలంలో జెండర్ తో సంబంధం లేకుండా అమ్మాయిలు, అబ్బాయిలు ఫ్రెండ్షిప్ చేస్తుంటారు. అమ్మాయిలు స్నేహం అనుకున్నా. దాన్ని ప్రేమగా భావించే అబ్బాయిలు, అబ్బాయిలు స్నేహం అనుకుంటే దాన్ని ప్రేమగా భ్రమ పడే అమ్మాయిలు బోలెడుమంది ఉన్నారు. నిజానికి ఈ వ్యత్యాసం తెలుసుకోలేక చాలామంది స్నేహాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో తమది స్నేహమా?? లేక ప్రేమా?? అనే విషయం గురించి అమ్మాయిలలో ఉండే సందేహాలు క్లియర్ చేసుకుంటే..

అసూయ చూపిస్తున్నారా?

ఒక వ్యక్తికి చాలా మంది స్నేహితులు ఉండవచ్చు, కానీ మీరు మీ స్నేహితుడికి దగ్గరగా ఉన్న వారిని చూసి మీకు అసూయగా అనిపించినప్పుడు, లేదా మీరు ఇతరులతో చాలా దగ్గరగా ఉన్నప్పుడు మీ స్నేహితుడు అసూయగా ఫీలవుతుంటే మీ మధ్య స్నేహం ప్రేమగా మారుతుందని అర్థం. ఉదాహరణకు  ఇతరులకు దగ్గర ఉండటం, వారితో సినిమాలు, పార్టీలు, మొదలైన వాటికి ఆసక్తి చూపిస్తూ వెళ్ళడం చేస్తే అవన్నీ చూసి స్నేహితుడు లేదా స్నేహితురాలు చిటపటలాడుతున్నా, కోప్పడుతున్నా, అలుగుతున్నా  వారితో స్నేహం కంటే ఎక్కువ అనుభూతి చెందుతున్నారని అర్థం.

ఏకాంతం కోరుకుంటున్నారా?

సాధారణంగా స్నేహితులు అంటే ఒక బ్యాచ్ గా ఉంటారు. వీళ్లలో కొందరు అమ్మయిలు, మరికొందరు అబ్బాయిలు కూడా ఉంటారు. అయితే ఇంతమంది స్నేహితులలో కేవలం ఒక్కరితోనే ఏకాంతంగా ఉండాలని అనిపిస్తుంటే అది స్నేహం కంటే ఎక్కువ భావనను సూచిస్తుంది. 

పదే పదే గుర్తుచేసుకోవడం..

చాలా వరకు స్నేహితులతో సమయం గడిపిన తరువాత ఇంటి పనుల్లోనూ ఇతర కార్యకలాపాలలోను మునిగిపోతుంటారు. కానీ అలా కాకుండా కేవలం ఒకే ఒక్కరి గురించి పదే పదే ఆలోచిస్తున్నా, వారితో మాట్లాడాలని అనిపిస్తున్నా వారు మిగిలిన వారికంటే చాలా స్పెషల్ అని అర్థం. 

ప్రాధాన్యత..

ఎంతమందిలో ఎప్పుడు ఏ విషయం గురించి మాట్లాడుతున్న తమ స్నేహితుడు లేదా స్నేహితురాలి గురించి ప్రస్తావిస్తూ, తమ మధ్య ఉండే సాన్నిత్యన్ని బయటకు గర్వంగా చెప్పుకుంటున్నా, ఇతరులకంటే వారిని ఎక్కువగా పరిచయం చేస్తున్నా, వారికి అందరికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, వారంటే ప్రత్యేక భావన అని అర్థం.

ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిల మధ్య జెండర్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఈ కారణంగా చాలామంది తొందరగా ఫ్రెండ్స్ అయిపోతారు. అయితే ఈ ఆకర్షణ కారణంగా ఏర్పడే స్నేహం, ఆకర్షణ ఉన్నంత వరకు ఉంటుంది. ఈలోపు నిజంగా స్నేహం వెల్లివిరిస్తే.. అది ప్రత్యేక సాన్నిత్యం కోరుకుండా..  కష్టసుఖాలు చెప్పుకోవడానికి, కష్టసమయంలో సాయం చేసుకోవడానికి తోడుగా ఉండేది అయితే స్నేహమే.. ప్రేమకు, స్నేహానికి  మధ్య సన్నని గీతను గుర్తెరగాలి.

                                  *నిశ్శబ్ద.