Read more!

ఆధ్యాత్మిక విజయానికి అసలు అర్థం ఇదే..!

ఆధ్యాత్మిక జీవితంలో విజయం సాధించడం గురించి చెప్పుకొనే ముందు అసలు ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలి. భగవత్ దర్శనమే ఆధ్యాత్మిక జీవితమా లేక మానవాతీత శక్తులను సాధించడమా లేక పూజలు, వ్రతాలు, తపస్సు చేసి ప్రాపంచిక జీవితంలో విజయం సాధించడమా? పరమేశ్వరుడి దర్శనమే చాలు అనుకుంటే రావణాసురుడికి ఆ దేవదేవుడు ప్రత్యక్షమయ్యాడు. మన దేశంలో మానవాతీత శక్తులున్నవారు చాలా మందే ఉన్నారు. కొందరు లోహాన్ని బంగారం చెయ్యగలరు, కొందరు గాలిలో ఎగరగలరు, కొందరు ముందు జరగబోయేదాన్ని చెప్పగలరు, మరికొందరు కాయసిద్ధిని సాధించి తమ ఆయుర్దాయాన్ని పొడిగించు కోగలరు. పూజలూ పునస్కారాలూ చేసి సంపద, కీర్తి, అధికారాలను పొందేవారి సంఖ్య చెప్పలేనంత ఉంది.

మరి ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటి? పూజలు చెయ్యొచ్చు, భక్తిని పెంపొందించుకోవచ్చు కానీ భగవంతుణ్ణి ఏమీ అడగకూడదు. "భగవంతుడా! నా కోరిక తీర్చు. నాకు అది ఇవ్వు... ఇది ఇవ్వు... నా కోరిక తీరిస్తే నీకు నేను ఏదో చేస్తాను..." అనడం భక్తి కాదు. అది భగవంతుడితో వ్యాపారం. దీనికి ఉదాహరణగా కింద విషయాన్ని చెప్పుకోవచ్చు.

 పర్షియాను జయించి, ఉత్తర భారత దేశంలో పురుషోత్తముడనే రాజును ఓడించి, దక్షిణాపథం వైపు దూసుకుని వెళుతున్నాడు అలెగ్జాండర్ చక్రవర్తి. అతని రథానికి ఇరువైపులా శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నారు జనం. అతని ఆధిపత్యాన్ని ఎదిరించలేక తల వంచుతున్నారు.

రథంలో పయనిస్తున్న అలెగ్జాండర్ దృష్టి ఒక వ్యక్తి పైన పడింది. అతను తల వంచి నమస్కరించలేదు. అలెగ్జాండర్ వైపు తదేకంగా చూస్తున్నాడు. అది గమనించి వెంటనే ఒక సైనికుడు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి "బతికి ఉండాలంటే తలదించు. లేకపోతే ప్రాణాలతో ఉండవు" అని బెదిరించాడు.

అయితే అతను ఆ సైనికుడి మాటలు వినిపించుకోలేదు. ఇది చూసిన అలెగ్జాండర్ తన రథం ఆపి, ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు. “నేనెవరో తెలుసా" అని గర్జించాడు. అతను బదులు చెప్పకుండా అలెగ్జాండర్నే చూడసాగాడు. అలెగ్జాండర్ కోపంగా తన ఖడ్గం తీసి, "తల వంచక పోతే శిరచ్ఛేదన చేస్తాను" అని హెచ్చరించాడు. అయినా ఆ వ్యక్తి నిశ్చలంగా ఉన్నాడు. అలెగ్జాండర్ అతని మీద పట్టరాని కోపంతో తన చేతిలోని కత్తిని ఎత్తాడు. అయినా అతడు చలించలేదు. అలెగ్జాండర్ నిశ్చేష్టుడయ్యాడు. ధైర్యాన్ని కోల్పోయాడు, మానసికంగా దుర్బలుడయ్యాడు.

"నీకు మరణమంటే భయం లేదా?” అని అలెగ్జాండర్ అడగగా ఆ వ్యక్తి మందహాసంతో “లేదు" అన్నాడు. తన జీవితంలో ఇప్పటి వరకూ ఇలాంటి వ్యక్తిని ఎదుర్కోలేదని గ్రహించాడు అలెగ్జాండర్. ఎదురులేని వీరుడిగా పేరుగాంచిన అలెగ్జాండర్కు ఆ వ్యక్తిని తాను ఎదిరించలేనని తెలిసింది.

“మరణమంటే ఈ వ్యక్తికి భయం లేదెందుకు?" అని మనస్సులో పదే పదే అనుకున్నాడు. "నువ్వెవరు? నీకు మరణమంటే ఎందుకు భయం లేదు?" అని అడిగాడు.

ఆ వ్యక్తి "నేను శరీరాన్ని కాదు, బుద్దిని కాదు, మనస్సును కాదు. నాకు చావు, పుట్టుకలు లేవు. లేని చావుకు భయం ఎందుకు? నువ్వు ప్రపంచ సామ్రాట్ వి కావచ్చు కానీ నిన్ను నువ్వు శరీరమని అనుకుంటున్నావు. ఎంత రాజ్యం ఉంటే ఏమిటి, ఏదో ఒక రోజు మరణిస్తావు. అప్పుడు నీకు కావాల్సింది ఆరడుగుల నేల మాత్రమే. ఆఖరికి నువ్వు సాధించేది అదే" అన్నాడు.

అప్పుడు అలెగ్జాండర్ 'ఆ వ్యక్తి ఒక మహాయోగి' అని గ్రహించాడు. వెంటనే యుద్ధప్రయత్నాన్ని విరమించుకొని, ప్రణామం చేసి వెనక్కి తిరిగాడు.

ఆధ్యాత్మికత అంటే మనోబుద్ధి అహంకారాలను జయించి తాను ఆత్మస్వరూపుడననే జ్ఞానం పొందడమే. ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో అదే 'అసలైన విజయం!'


                                           *నిశ్శబ్ద.