Read more!

కుటుంబంలో బంధాలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకునేవారు తెలుసుకోవలసిన విషయమిది!

నాలుగు గదుల మధ్య... నలుగురు మనుషులు యాంత్రికంగా కలిసున్నంత మాత్రాన అది ఇల్లనిపించుకోదు. మాయని మమతలు మనసుల మధ్య లతల్లా అల్లుకుపోవాలి. బంధాలు బలోపేతం కావాలి. అందుకే ఆంగ్లకవి ఎమర్సన్ అంటాడు 'The relationship between two members in a family should be like fish and water. It should not be like fish and fisherman'.. 

కుటుంబంలో ఒకరితో ఒకరికి అనుబంధం చేపకి, నీటికి ఉన్నంత సహజంగా, సౌకర్యంగా ఉండాలే కానీ... చేపకి జాలరికి మాదిరి తప్పించుకోలేని, తప్పనిసరి పరిస్థితిలా సాగిపోకూడదు. ఈ రోజుల్లో ఇళ్లన్నీ ఆధునిక సౌకర్యాలతో శోభిల్లుతున్నాయే కానీ ఆత్మీయతలతో కాదు. తమని తాము పిల్లలకు ఆదర్శంగా మలచుకోలేక, బిడ్డలు మాత్రం తమ చెప్పుచేతల్లో ఉండాలని తల్లిదండ్రులు... తాము ఎలా ఎదగాలో, ఎవరిలా ఉండాలో తేల్చుకోలేక పిల్లలు... అయోమయంతో సతమతమవుతున్నారు. ఫలితం ఎక్కడ చూసినా అంతస్తులు, ఆడంబరాలే తప్పా ఆదర్శాలు, ఆనందాలు తెలీని కుటుంబాలే కనిపిస్తున్నాయి. అన్నింటినీ మించి కుటుంబసభ్యుల్ని మాలలో పూలలా కట్టిపడేసే సాన్నిహిత్య సూత్రమే నానాటికీ సున్నితమవుతోంది. 

కుటుంబమంటే ఇలా ఉండాలని పెద్దలు చెబుతున్నారు..

శ్రీరాముని చరిత్ర ఈనాటికీ చర్వితచరణమేనంటే, కారణం అది కుటుంబ విలువలకు కుదురుగా నిలిచింది. కలతలు, కల్లోలాలు ఎన్ని పొడచూపినా కుటుంబ పెద్దగా కోదండరాముడు కష్టాల్ని తనే ముందు భరించాడు... సుఖాలను అనుంగు సోదరులకు, అనుచరులకు పంచిపెట్టాడు. తన మహోన్నత వ్యక్తిత్వంతో కుటుంబాన్నే ప్రభావితం చేశాడు. అయోధ్యను ఏలాల్సినవాడు రాత్రికి రాత్రే అడవులకు పయనం కావాల్సి వచ్చింది. అందుకు కించిత్తయినా కుంగిపోలేదు. ప్రసన్న వదనంతోనే ప్రయాణమయ్యాడు. ఆయనతో అడవి కూడా అయోధ్యే అనుకుని అర్థాంగి వెంట నడిచింది... అన్నావదినల సేవే భాగ్యమనుకొని తమ్ముడూ తోడు నడిచాడు... 

చివరికి ఎవరి కోసమైతే తాను రాజ్యం వదులుకున్నాడో ఆ తమ్ముడూ, అన్న పాదుకలకే పట్టాభిషేకం చేశాడు. ఆ శ్రీరాముడు తన ధర్మస్వరూపంతో ఎంత ప్రభావితం చేయకపోతే ఆ పరిగణమంతా అంత త్యాగపూరి తమవుతుంది.! అందుకే తానే కాదు తన శ్రీమతిని, సోదరుల్ని, చివరికి తన సేవకులను కూడా తనతో సమంగా దైవస్వరూపులను చేశాడు. ప్రతీ తండ్రీ ఆ రామచంద్రునిలా ధర్మాన్నే ఆచరిస్తే, ప్రతీ తల్లి సీతాదేవిలా నారీశిరోమణే అయితే... పుట్టే పిల్లలు లవకుశలు కాక  ఇంకేమవుతారు. ఆ ఇల్లు రామాలయం కాక మరేమవుతుంది.!' అంటారు.

కాబట్టి ఇల్లు బాగుండాలన్నా, పిల్లలు ధర్మబద్ధంగా ఉండాలన్నా తల్లిదండ్రులు మొదట తమ దారి సరిచేసుకోవాలి..

                                       ◆నిశ్శబ్ద.