స్వేచ్ఛ మనిషి మీద చూపే ప్రభావం ఎలా ఉంటుంది?
posted on Apr 7, 2024 @ 9:30AM
ప్రతి మనిషి తన జీవితంలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చేది గట్టిగా మాట్లాడేది స్వేచ్ఛ గురించే.. ఒకప్పుడు స్వేచ్ఛ లేని జీవితాలు చాలా ఉండటం వల్ల స్వేచ్ఛ స్ఫహించుకోవడం లక్ష్యమని, అది హక్కు అని సమాజంలో పౌరులు గట్టిగా నిర్ణయించుకున్నారు. అయితే.. స్వే చ్ఛకు సంబంధించి పలువురిలో ముఖ్యంగా నేటి యువతరంలో చాలా దురభిప్రాయలు వున్నాయి. స్వేచ్ఛకు వారు ఇచ్చుకునే నిర్వచనాలు పూర్తిగా వేరుగా ఉంటున్నాయి. కేవలం డబ్బు ఉండటాన్ని, భౌతికంగా నచ్చినట్టు జీవించడాన్ని, ముఖ్యంగా విచ్చలవిడితనాన్ని మాత్రమే స్వేచ్ఛగా భావించే పరిస్థితి ప్రస్తుత సమాజంలో నెలకొని వుంది.
ఈ కంజ్యూమరిస్ట్ ధోరణి తాలూకు స్వేచ్ఛ వాస్తవానికి మనిషిని మానసికంగా ఎదగనీయదు. ఇదంతా కేవలం పైకి కనిపించే ఆడంబరం మాత్రమే. ఇలా ఉండటం వల్ల మనిషిలో కలిగే మార్పులు ఏమీ లేకపోగా ఇంకా వ్యక్తిత్వ పరంగా దిగజారిపోతాడు. తమ అస్థిత్వంలో భద్రతా రాహిత్యానికి లోనయ్యే వ్యక్తులు, తమ చుట్టూ సిరి సంపదలను, వస్తు సముదాయాన్ని పోగు చేసుకోవటం ద్వారా ఈ అభద్రతా భావాన్ని అధిగమించాలని చూస్తున్నారు. అయితే ఈ పోటీ ప్రపంచంలో శృతిమించిన భౌతిక సంపదలను సంపాదించడం. వాటి వల్ల సుకెబాన్ని పొందాలనే తాపత్రయం మనిషిని విముక్తి చేయలేదు.
కాలంతో పాటు ఈ సంపాదన… సుఖాల దారులు క్రమంగా మరొకరితో పోల్చుకుంటూ పెరుగుతూ ఉంటాయే తప్ప తృప్తితో ఆగిపోయేవి కాదు. ఇలా పోటీగా ఇతరులతో పోల్చుకునే మనస్థత్వం వ్యక్తిని మరింత అభద్రతా భావానికి గురిచేస్తుంది. ఇది వ్యక్తిగత స్వేచ్ఛ తాలూకు నిజమయిన సారం యొక్క వక్రీకరణ.
దీనికి ఒక ఉదాహరణ చెప్పవచ్చు. ఇద్దరు స్నేహితులు ట్రెక్కింగుకు వెళ్లి ఒక కారడవిలో చిక్కుకు పోయారు. ఆ అడవి నుంచి ఎలా బయటపడాలో తెలియని పరిస్థితిలో వారు ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో వీరిలో ఒకరు తాను స్వేచ్ఛా మానవుడినని, తన యిష్టమైన రీతిగా అడవినుంచి బయటపడే మార్గాన్ని ఎంచుకోగలనని భావించాడు. కాగా రెండో వ్యక్తి ప్రకృతిలో కొన్ని నియమ నిబంధనలు సూత్రాలు వున్నాయని భావించి ఆ అడవినుంచి బయట పడేందుకు సూర్యచంద్రుల స్థానాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని అనుకొన్నాడు. అంటే అతను ప్రకృతి నియమాలకు లోబడి తన మార్గాన్ని ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకొన్నాడు.
ఇద్దరిలో ఎవరు ఖచ్చితంగా అడవినుంచి బయట పడేందుకు ఎక్కువ అవకాశాలున్నాయో మనం వేరే ఆలోచించనవసరం లేదు. ప్రకృతి నియమాలకు లోబడి ప్రవర్తించిన వ్యక్తికే ఆ కారడవినుంచి సజీవంగా బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉదాహరణ మనం ప్రజల మధ్య నివసిస్తున్న తీరుకు కూడా వర్తిస్తుంది. మన నాగరిక సమాజంలో విజయవంతంగా జీవితంలో ముందుకు దూసుకు వెళ్ళాలంటే, ఈ సమాజానికి కూడా కొన్ని నియమనిబంధనలు, సూత్రాలు వర్తిస్తాయని గుర్తించిన వారికే అది సాధ్యమవుతుంది. అలా కాకుండా వ్యక్తిగత స్వేచ్ఛ భ్రమలో విశృంఖలంగా ప్రవర్తించే వ్యక్తి స్వేచ్ఛారహితుడిగానూ, చివరకు వైఫల్యం చెందే వాడిగానే మిగిలిపోతాడు.
◆నిశ్శబ్ద.