అన్నింటికంటే విలువైనది

అనగనగా ఓ కాకి! దానికి ప్రపంచంలో ఎక్కడ చూసినా తనలాంటి కాకులే కనిపించేవి. తోటి కాకుల కావుకావులతో దాని చెవులు చిల్లులు పడిపోయేవి. అసలు ఆ కాకులను చూడగానే జనమంతా విసుక్కునేవారు. ఏదో కాసిన ఎంగిలి మెతుకులు విదిలించి వాటిని వదిలించుకునేవారు. రోజురోజుకీ ఆ కాకికి తన మీద తనకే అసహ్యం వేయడం మొదలైంది. ‘కావుకావుమంటూ కరుకుగా అరవాలి. సర్వభక్ష్యాలనూ తిని కడుపు నింపుకోవాలి. ఇదీ ఓ బతుకేనా!’ అనుకుంటూ ఓ రోజు దీర్ఘాలోచనలో ఉండగా... దానికి పక్కనే ఉండే మామిడి చెట్టు మీద నుంచి ఒక తీయని గొంతు వినిపించింది.   కాకి పక్కకి తిరిగి చూసేసరికి మామిడి చెట్టు మీద ఒక కోయిల కనిపించింది. ‘మిత్రమా! నీ గొంతు భలే మధురంగా ఉంది సుమా! పైగా నాలాగా నువ్వు నానాచెత్తా తినాల్సిన అవసరం లేదు. హాయిగా ఆ మామిడి చిగురులతో కడుపు నింపుకోవచ్చు. నీ గొంతు విన్న ఈ లోకం ఉగాది వచ్చేసిందని పొంగిపోతుంది. నీదెంత అదృష్టజాతకం’ అని తెగ పొగిడేసింది. ‘ఆ నాదీ ఒక బతుకేనా!’ అంది కోకిల నిట్టూరుస్తూ. ఆపై ‘నా రంగు నీకంటే నలుపు. పైగా వసంత రుతవులో తప్ప కూయలేను. అంతదాకా ఎందుకు! ఆఖరికి నా పిల్లలని కూడా నేను పొదగలేక, నీ గూటిలోకి చేరుస్తుంటాను. నా జాతి ముందుకి సాగుతోందంటే అది నీ చలవే. ఇక అదృష్టం అంటావా! ఆ మాట వస్తే చిలుకే గుర్తుకువస్తుంది. పంచరంగుల వన్నెలు, పంచదార పలుకులు దాని సొంతం కదా’ అని నిట్టూర్చేసింది.   కోకిల మాటలు విన్న కాకికి అందులో నిజం లేకపోలేదనిపించింది. వెంటనే ఓ చిలుకని వెతుక్కుంటూ బయల్దేరింది. కొన్ని గడియలు గడిచేసరికి ఓ జామచెట్టు మీద మాంచి దోరపండుని తింటున్న చిలకమ్మ కనిపించింది. ‘చిలుకా క్షేమమా! ఇప్పటిదాకా నీ అదృష్టం గురించే నేనూ కోకిలా మాట్లాడుకున్నాము. నిన్ను చూస్తుంటే కోకిల చెప్పినదానిలో ఏమాత్రం అతిశయోక్తి లేదనిపిస్తోంది. ఏమి అందం, ఏమి గాత్రం... పైగా కమ్మని జామపళ్లతోనే కడుపు నింపుకునే భాగ్యం. అసలు బతుకంటే నీదే!’ అంటూ పొగడ్తలను వల్లె వేసింది.   ‘ఉష్‌! గట్టిగా అరవబాక. ఏ వేటగాడన్నా వింటే నన్ను పట్టుకుపోయి పంజరంలో బంధించేయగలడు. అయినా నాదీ ఒక అందమేనా? నాదీ ఒక స్వరమేనా? అసలు నువ్వెప్పుడన్నా నెమలి అనే పక్షిని చూశావా? అది పురివిప్పి నాట్యమాడటాన్ని గమనించావా? అదీ అందమంటే! అదీ నాట్యమంటే! అదీ అదృష్టమంటే!’ అంటూ నోరు తెరుకుని ఉండిపోయింది. కాకికి చిలుక మాటలు నిజమే కదా అనిపించాయి. తానెప్పుడూ నెమలి నాట్యం గురించి వినడమే కానీ చూసే అదృష్టం కలుగలేదు. ఈసారి ఆ నాట్యమేదో తను కూడా చూసి తీరాలి. చిలుక చెప్పిన మాటలను పూర్తిగా రూఢిచేసుకోవాలి. నెమలి జీవితమే అన్నింటికంటే అదృష్టజాతకం అని రుజువుపరుచుకోవాలి. అలా అనుకుంటూ నెమళ్లు ఎక్కువగా తిరుగాడే ప్రాంతానికి వెళ్లి కాపువేసింది.   కాకి అదృష్టం ఏమో కానీ, కాసేపట్లోనే ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. గుంపులోని నెమళ్లు కొన్ని పురివిప్పి నాట్యం చేయడం మొదలుపెట్టాయి. ఆ నాట్యాన్ని చూసి కాకి కళ్లు చెదిరిపోయాయి. ఏం అందం! ఏం నాట్యం! ఏం ఈకలు! ఏం హొయలు! అనుకుంటూ ఆశ్చర్యపోయింది. వెంటనే ఓ నెమలి దగ్గర వాలి ‘ఆహా అదృష్టమంటే మీదే కదా! అసలు పక్షిజాతిలో మిమ్మల్ని మించినవారు లేనే లేరు. మీ గాత్రం, మీ నాట్యం, మీ అందం.... ముందర మా బతుకులన్నీ బలాదూర్‌’ అనేసింది.   ఆ మాటలు విన్న నెమలి కళ్లలోంచి కన్నీరు ఒలికింది ‘ఓసి పిచ్చిదానా! నాదీ ఒక బతుకేనా! మబ్బు పట్టినప్పుడు తప్ప నేను నాట్యం చేయలేను. మిగతా సమయాలలో ఈ ఈకలు నాకు బరువు. పైగా ఈ ఈకల కోసమే వేటగాళ్లు నన్ను వేటాడుతూ ఉంటారు. ఈ శరీరాన్ని వండుకు తినేందుకు ఉవ్విళ్లూరుతూ ఉంటారు. ఇక అన్నింటికీ మించిన దౌర్భాగ్యం చెప్పనా! పక్షినన్న మాటే కానీ ఆకాశంలో అంతెత్తున ఎగరగలనా? నా మటుకు నాకైతే నిన్ను చూసినప్పుడల్లా భలే ఈర్ష్యగా ఉంటుంది. ఏది పడితే అది తిని బతికేస్తావు. ఆకాశంలో చక్కుర్లు కొడుతూ తిరిగేస్తావు. నీకు వేటగాళ్ల బాధ లేదు. ఆకలితో ఉండే రోజూ ఉండదు. హాయిగా వేళకింత తింటూ, పిల్లల్ని కంటూ, గూట్లో గువ్వల్లే బతికేస్తావు. అసలు అదృష్టమంటే నీది. అన్నింటికంటూ అమూల్యమైన స్వేచ్ఛ నీ దగ్గర ఉంది. అన్నింటికంటే శాపమైన ఆకలి నీ జోలికి రాదు’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. నెమలి మాటలకు కాకి మనసు ఆకాశంలో తేలిపోయింది. ఆ మనసుతో పాటే తాను కూడా రివ్వున నింగికి ఎగిరిపోయింది. (జానపద కథ ఆధారంగా) - నిర్జర.

బ్రతికుండగా సాధించలేనిది.. చచ్చి ఏం సాధిస్తాం?

ప్రపంచంలో యువతరం నేడు ఆత్మహాత్యలకు పాల్పడుతోంది. ముఖ్యంగా పోటీ తత్వాన్ని అంగీకరించకపోవడం, ఆత్మన్యూనతా భావం వెంటాడుతూ ఉండడంతో ఒక వైపు ఉద్యోగభధ్రత లేకపోవడం ఆర్ధిక సమస్యలు మరోవైపు కరోనా యువతను కుంగ దీస్తూ ఉండడంతో బతుకు పోరాటం చేయలేక భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న నమ్మకం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మానసిక వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిపాటి ఓర్పు సహనం లేని కుర్రకారు యదార్ధ గాధ మీ ముందు ఉంచుతున్నాను. అతను ఒక ప్రైవేటు ఉద్యోగి. చాలీచాలని జీతం అయినా పెళ్ళిచేసుకున్నాడు. భార్య గర్భవతి. ప్రసవం ఎలా చేయించాలి అన్న దగ్గర నుంచి అంతా ఏమౌతుందో అన్న స్ట్రెస్. ఎలాగో ఒకలా బాబు పుట్టాడు అంతా బాగుంది అనుకున్నారు. బారసాలకు ఊరు వెళ్ళారు. పూజా పునస్కారం బాగానే ఉంది. అప్పుడే మొదలైంది అసలు కథ. పిల్లాడికి డాక్టర్ చెప్పిన విధంగానే పాలపొడి డబ్బాలు కొనాలని గట్టిగా చెప్పాడు. అసలు మీరు ఏ డబ్బాలు కొన్నారో నాకు వాట్సాప్ చెయ్యాలంటాడు. రోజూ వీడియో కాల్ చెయ్యాలి అన్నాడని అమ్మాయి అంటుంది. అలాకాకపోతే నాతో మాట్లాడవద్దని అంటూ అత్తామామతో గొడవకు దిగాడు. బావమరిదిని సైతం వదలలేదు నువ్వెంత అంటే నువ్వెంత అన్నాడు. నీ అంతు చూస్తానంటూ అనుకున్నారు. కొద్దిరోజులకు అంతా సద్దుమణిగింది అనుకున్నారు.   ఊరినుంచి వచ్చి ప్రశాంతంగా ఉన్నారు అనుకున్న సమయంలో ఊహించని ఘటన జరిగింది. తన భార్య ఫోన్ మాట్లాడలేదని, మామ తనను అవమానించాడని మనసులో పెట్టుకున్న అతగాడు అంతా నిద్రపోయాక తనదగ్గర ఉన్న సానిటైజర్ తీసుకున్నాడు. మొబైల్ ఫోనులో నా చావుకు అత్త మామ భార్య కారణమంటూ పేస్ బుక్ లో పెట్టాడు. ఆఘమేఘాల మీద వెళ్లిన బావమరిది పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. వెంటనే వచ్చిన పోలీసులను చూసి మరింత రెచ్చిపోయాడు. మళ్ళీ సానిటైజర్ తీసి పోలీసుల ముందు తాగే ప్రయత్నం చేయడంతో, పోలీసులు ఆసుపత్రిలో చికిత్స ఇప్పించి ఇంటికి పంపారు. అసుపత్రి ఫీజ్ 15000 పైమాటే. అసలు సమస్య పక్కకి పోయింది. ఉరిలో పరువుపోయింది, చుట్టాల్లో ఉన్నగౌరవం పోయింది. కేవలం ఒక పట్టుదల మనిషిని చావువరకూ తీసుకెళ్ళింది. అన్నిసమస్యలకి చావు ఒక్కటే పరిస్కారం కాదన్న విషయం ఎందుకు గ్రహించరు. స్త్రీలకంటే ముందు పురుషులే ఆత్మహత్య చేసుకుని తనువు చలిస్తున్న వారి సంఖ్య 3.5% ఎక్కువగా ఉందని ఒక సర్వేలో వెల్లడించింది. నానాటికీ పెరుగుతున్న గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయని, సహజంగా ఇతరులపై ఆధారపడని, సహాయం తీసుకోకపోగా ఇతరుల పట్ల తీవ్రంగా వ్యవహరిస్తూ ఉంటారని మానసిక నిపుణులు అంటున్నారు. దీనికితోడు మొండితనం కూడా తోడవ్వడంతో తను అనుకున్నది జరగలేదన్న సమస్య వీరిని వెంటాడుతూ ఉంటుందని ఆందోళనతోనే ఆత్మాహాత్యలకు పాల్పడుతూ ఉంటారని పరిశోధకులు విశ్లేషించారు. ఈ అంశంపై పరిశోదన చేయడమంటే సవాళ్ళతో కూడుకున్నదని న్యూయార్క్ చెందిన ఫోర్ దానా విశ్వ విద్యాలయం గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ సోషల్ సర్వీస్ కు చెందిన కాల్ మాన్ ఈ విషయం వెల్లడించారు. చావు అన్నింటికీ పరిస్కారం కాదు. బ్రతికుండగా సాధించలేనిది.. చచ్చి ఏం సాధిస్తాం?

ఆగస్ట్ 15 తేదీ వెనుక చాలామందికి తెలియని నిజం!

ప్రస్తుతం భారతదేశం ఎన్నో మతాలకు నిలయం. ఎక్కడినుండో వచ్చిన వారిని అక్కున చేర్చుకుంటుంది. శరణార్థులకు భరోసా ఇస్తుంది, విదేశీ కంపెనీలకు వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించుకోవడానికి వేదిక ఇచ్చింది, పొరుగువారిని ప్రేమించాలి అనే మాటను పాటిస్తుంది. అయితే ప్రపంచదేశాలతో అభివృద్ధి కోసం పరుగులు పెడుతున్న భారతదేశం ఒకప్పుడు బానిసగా మారి ఉక్కు పిడికిళ్లలో చిక్కుకుని ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడి చివరికి ప్రాణత్యాగాలు చేసి తన స్వేచ్ఛను సంపాదించుకుంది.   గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ మహమ్మారి కారణంగా స్వాతంత్ర్య సంబరాలను ఘనంగా జరుపుకున్న దాఖలాలు లేవు. ఈసారి మాత్రం దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన సందర్భంగా దేశం యావత్తు ఘనంగా వజ్రోత్సవాలు జరుపుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట భారత ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటికే దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.    ఎర్రకోట మీద భారతీయ జండాను ఎగురవేసి భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రకటించే ప్రధానమంత్రుల ఆలోచనల్లో నాటి జవాహార్ లాల్ నెహ్రు నుండి నేటి ప్రధాని మోడీ వరకు అందరూ ఆగస్టు 15న కాకుండా జనవరి 26 నే స్వతంత్య్ర దినోత్సవాన్ని ప్రకటించే ఉద్దేశంలోనూ, అదే అసలైన స్వాతంత్ర్య దినమని భావిస్తారట. అయితే దీని వెనుక కారణం ఏమిటనేది పరిశీలిస్తే.   జవహర్ లాల్ నెహ్రు తన తండ్రి మోతీలాల్ నెహ్రు నుండి భారతజాతీయ కాంగ్రెస్ బాధ్యతలను స్వీకరించారు. మోతీలాల్ నెహ్రూకు డొమినియన్ హోదా పట్ల ఆసక్తి ఉండేది. అయితే 40 సంవత్సరాల జవహర్ లాల్ నెహ్రూకు అది నచ్చలేదు ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించారు. బ్రిటిష్ పాలన నుండి పూర్తిగా విడిపోవాలని ప్రతిపాదించారు. అప్పటి జాతీయ కాంగ్రెస్ సభ్యులయిన బాలగంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్, అరబిందో మరియు బిపిన్ చంద్ర పాల్ వంటి ఇతర కాంగ్రెస్ నాయకులు ఆయనకు మద్దతు ఇచ్చారు. ఆ ప్రతిపాదన కాస్తా భారతదేశ స్వతంత్ర్యాన్ని కోరుతూ డిమాండ్ గా ఏర్పడింది. ఆ తీర్మానం ఆమోదించబడిన కారణంగా 1930 జనవరి చివరి వారంను "పూర్ణ స్వరాజ్" గా నిర్ణయించింది.    దీని ఆధారంగానే జనవరి 26 న స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ భారతీయులను కోరింది. అంతకు ముందు 1929, డిసెంబర్ లో లాహోర్ లో రావి ఒడ్డున జాతీయ జెండాను ఎగురవేసిన సందర్భంగా "కాంగ్రెస్ అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటు చేయబోతోంది, స్వాతంత్య్రం కోసం పోరాడండి" అని పిలుపునిచ్చింది. అప్పటి నుండి భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 26 నే స్వతంత్రంగా జరుపుకునేవారు.   అనేక సంవత్సరాల పోరాటం తరువాత బ్రిటిష్ వారు భారతదేశం మీద తమ ఆధిపత్యాన్ని వదులుకోవలసి వచ్చింది. అప్పుడు భారతదేశానికి చివరి బ్రిటిష్ గవర్నర్ గా లార్డ్ మౌంట్ బాటన్ ఉండేవారు. జూన్ 30, 1948 నాటికి భారతదేశానికి అధికారం బదిలీచేయాలని అతనికి ఆదేశాలు వచ్చాయి. అయితే అది ఆలస్యమవుతుందని, పట్టులో ఉన్న భారతదేశ పోరాటాన్ని ఎక్కడ నీరుగారుస్తారో అని భారతదేశ సమరయోధులకు ఈ తతంగం నచ్చలేదు. భారత జాతీయ కాంగ్రెస్ వారు కూడా దానికి అభ్యంతరం వ్యక్తం చేశారు.    ఈ ఒత్తిడుల కారణంగా మౌంట్ బాటన్ బ్రిటిష్ వారికి ఇంత ఆలస్యం చేయడం వల్ల రక్తపాతం, అల్లర్లు పెరుగుతాయని సూచించాడు.    ఆగస్ట్ 15 తేదీ వెనుక తిరకాసు!! రెండవప్రపంచం యుద్ధంలో జపాన్ లొంగిపోయింది. అది కూడా ఆగస్ట్ 15 వ తేదీన లొంగిపోయిన కారణంగా అదేరోజును తాను భారతదేశానికి స్వతంత్ర్యాన్ని ప్రకటించడంలో నిర్ణయించుకున్నట్టు మౌంట్ బాటన్ తన మాటలలో వ్యక్తం చేశారు. అదికూడా మొదట ఆగస్ట్ లేదా సెప్టెంబర్ అనే ఆలోచనలో ఉన్నా కేవలం జపాన్ ప్రపంచ యుద్ధంలో లొంగిపోయి రెండవ వార్షికోత్సవం జరుపుకుంటున్న కారణంగా దానికే మౌంట్ బాటన్ మొగ్గుచూపారు. అంటే భారతదేశం విషయంలో తాము ఓడిపోయినా భారతీయులకు ఇచ్చిన స్వాతంత్ర్య దినోత్సవ తేదీ విషయంలో తమ విజయాన్ని వ్యక్తం చేసుకున్నారు.    బహుశా ఇదొక పైశాచిక ఆనందం కావచ్చు. భారతీయ ప్రజలకు కేవలం స్వేచ్ఛ దొరికిందనే ఆనందంలో ఇలాంటి విషయాలు తెలియకపోవచ్చు. దీనివల్ల భారతీయులకు నష్టమైతే ఏమి లేదు. కానీ తమ ఓటమిలో కూడా తమదే పైచేయి అనిపించుకున్న ఈ బ్రిటిషు వారి ఆలోచన తెలిస్తే మాత్రం అందరూ ఆగస్టును కాదని జనవరికే జైకొడతారేమో!! -నిశ్శబ్ద

ఈ పనులు చేయండి.. అందరూ మీరు చెప్పిన మాట వింటారు..!

  నేటికాలంలో ఎదుటి వ్యక్తిని ఆకట్టుకునేలా చేయడం, తమ మాటను ఎదుటివారు ఆమోదించేలా చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రతి విషయాన్ని ఎంతో లోతుగానూ, అంతకు మించి ఇగో తోనూ డీల్ చేస్తుంటారు.  ముఖ్యంగా కుటుంబ సభ్యుల నుండి ఆఫీసులో కొలీగ్స్,  బాస్  వరకు ప్రతి ఒక్కరిని చాలా విషయాల దగ్గర డీల్ చెయ్యాల్సి ఉంటుంది.   ఏదైనా విషయంలో వాళ్లను ఒప్పించాలంటే  చాలా ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది.  అయితే అలా కాకుండా మీరు మీ అభిప్రాయాన్ని ఇతరులు ఒప్పుకునేలా చేయాలంటే కొన్ని పనులు చేయాలి. అవేంటో తెలుసుకుంటే.. ఏదైనా ఒక విషయం మంచిదే అయినా దాన్ని చెప్పే పద్దతి సరిగా లేకుండా ఆ విషయాన్ని ఎవరూ ఆమోదించరు. కాబట్టి చెప్పాలనుకునే విషయాన్ని అర్థం అయ్యేలా, ఆకట్టుకునేలా,  దాని వెనుక ఉన్న  లాభాలు,  అందులో ఉన్న ప్రత్యేకత, దాని అవసరం అన్ని వివరంగా చెప్పాలి.  ఇలా చెప్తే ఎవరూ దేన్నీ కాదనరు. ఎవరికి అయినా ఏదైనా చెప్పేముందు ఆ చెప్పాల్సిన వ్యక్తి ఎలాంటి వారో అర్థం చేసుకోవాలి.  వారి స్వభావాన్ని బట్టి విషయం చెప్పే విధానం మార్చాలి. ఏదైనా విషయాన్ని చెప్తున్నప్పుడు చెప్తున్న విషయం పట్ల స్పష్టతతో ఉండాలి.  ఆ విషయం నుండి ఇంకొక విషయానికి డైవర్ట్ కాకూడదు.  ఇది చెప్పాలనుకున్న విషయాన్ని దారి మళ్లిస్తుంది. ఎవరికైనా ఏదైనా చెప్పేటప్పుడు సమయం కూడా ప్రదాన పాత్ర పోషిస్తుంది.  ఎదుటి వ్యక్తి ఉన్న మూడ్ ను బట్టి విషయాన్ని వారు అర్థం చేసుకుంటారు. కాబట్టి ఎప్పుడు ఎలాంటి విషయం చెప్పాలో అర్థం చేసుకోవాలి. కొందరికి ఎక్కువ సేపు మాట్లాడితే నచ్చదు. కుటుంబ సభ్యులు అయినా సరే విషయాన్ని సాగదీసి సుత్తి కొట్టినట్టు చెబితే తల ఊపుతారు తప్ప విషయాన్ని బుర్రకు ఎక్కించుకోరు.  కాబట్టి చెప్పాలనుకున్న విషయాన్ని సింపుల్ గా, అర్థం అయ్యేలా,  తక్కువ సమయంలో చెప్పాలి.  చెప్పే విషయం కేవలం మాటల ద్వారానే కాదు కొన్ని సార్లు శరీర హావభావాలు కూడా దానికి మద్దతు ఇస్తాయి. అయితే అతిగా ఎప్పుడూ ప్రవర్తించకూడదు.  ముఖ్యంగా గొడవలకు సంబంధించిన విషయాలు అయితే చెయ్యి చూపించడం, వేలు చూపించడం,  ఎదుటి వ్యక్తిని ఇమిటేట్ చేసి చెప్పడం  లాంటివి చేయకూడదు.  దీని వల్ల చెప్పాలనుకున్న విషయం కూడా మళ్లీ వివాదానికి,  గొడవకు దారితీస్తుంది. చెప్పే విషయం సరైనదేనా అని ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలి.  అది న్యాయబద్దమైనదైనా,  ఇతరులకు ఎలాంటి సమస్య తలపెట్టినది అయినా అప్పడు మాత్రమే దాన్ని ప్రస్తావించాలి. మంచి చెప్పే విషయం లేదా చేసే పని ఇతరులకు మంచి చేయకపోయినా చెడు తలపెట్టకూడదు.                                             *రూపశ్రీ.

అనుమానం!

అనగనగా ఓ రాజుగారు ఉండేవారు. ఆయన అద్భుతమైన, అందమైన కోటలెన్నింటిలో నిర్మించాడు. కానీ ఎందుకనో ఆయనకు తనివి తీరలేదు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఓ చిత్రమైన మహలుని నిర్మించాలనుకున్నాడు. శిల్పులందరూ వచ్చి తలా ఓ నమూనాను చూపించారు కానీ ఏవీ రాజుగారికి నచ్చలేదు. చివరికి ఓ శిల్పి చూపించిన అద్దాలగది నమూనా ఆయనకు నచ్చింది. పని కానియ్యమన్నాడు.   శిల్పి చూపించిన అద్దాల గది, అలాంటి ఇలాంటి గది కాదు. ఆ గదిలోకి ఎవరన్నా ప్రవేశిస్తే వారిని ప్రతిబింబించేలా గదిలో అన్నివైపులా అద్దాలే! గది పైకప్పు, కింద గచ్చు కూడా అద్దాలతోనే తయారుచేశాడు. కంట్లో నలుసు కూడా కనిపించేంత స్పష్టంగా ఉన్నాయా అద్దాలు. లోపలికి ప్రవేశించిన మనిషికి తాను ఎక్కడ నిల్చున్నాడో కూడా తెలియనంతగా నలుదిశలా కమ్ముకుని ఉన్నాయి ఆ అద్దాలు. అంతేకాదు! ఆ అద్దాల గదిలోని శబ్దాలు కూడా ఎంతో స్పష్టంగా ప్రతిధ్వనించేవి. రాజుగారు నిర్మించిన ఈ కొత్త మహలు గురించి రాజ్యమంతా తెలిసిపోయింది. అందులోకి తొంగిచూసే అదృష్టం తమకి ఎప్పుడు వస్తుందా అని ప్రజలు తెగ ఎదురుచూడసాగారు. ఓ రాత్రి అనుకోకుండా రాజుగారి కుక్క అందులోకి ప్రవేశించింది. లోపలికి అడుగుపెట్టగానే దానికి మతి పోయింది. తనలాంటి వందలాది కుక్కలు తనని చుట్టుముట్టి ఉన్నాయి. ఈ మహలులో రాజుగారి చెంతన ఉండే అర్హత తన ఒక్కదానికే ఉందనుకుందది. ఆ కుక్కలను భయపెట్టడానికి ఒక్కసారిగా తన వాడి పళ్లను చూపించింది. చిత్రం! అవి కూడా అలాగే తనని భయపెట్టేందుకు కోరలు చూపించాయి. యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా ఒక్కసారి గట్టిగా మొరిగింది కుక్క! దానికి నాలుగువైపుల నుంచీ భీకరంగా శబ్దాలు ప్రతిధ్వనించాయి. ఇక తన చుట్టూ ఉన్న కుక్కలతో పోరాటం చేయక తప్పలేదు. గాల్లోకి ఎగిరెగిరి పడుతూ, లేని శత్రువులను ఉన్నారనుకుని అద్దాల మీద పడుతూ నానా భీభత్సం సృష్టించింది. ఉదయాన్నే అద్దాల గదిలోకి వచ్చిన భటులకి ఆ కుక్క నిర్జీవంగా కనిపించింది. రాత్రంతా తన ప్రతిబింబాలతో పోరాటం చేసిన ఆ కుక్క ఓడిపోయింది. మన మనసు కూడా అద్దాల గదిలాంటిదే! భయాలు నిజమవకుండానే వాటితో తలపడుతూ ఉంటాము. లేనిపోని అనుమానాలతో మనమీద మనమే పోరాటం చేస్తూ ఉంటాము! కానీ అందులో గెలుపుకి అవకాశం లేదు. ఉండేదల్లా ఓటమే!

విడాకులు వెక్కిరిస్తాయ్ జాగ్రత్త!

మామిడాకుల తోరణాల మధ్య, మంగళ వాయిద్యాల మురిపెంలో, మూడుముళ్ళతో ఒక్కటై, జీవితాంతం ఒకరికి ఒకరని ఉండాల్సిన దంపతులు కాస్తా  విడాకులను పంచేసుకుంటున్నారు.  ఈమధ్య కాలంలో విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య చాలా ఎక్కువైపోతొంది. విడాకులకు చెబుతున్న కారణాలకు కోర్ట్ లోని జడ్జ్ లు కూడా విస్తు పోతూ ఉంటారు. ఎందుకంటే చాలా చిన్న సమస్యలను కారణంగా చూపుతూ విడాకులు కావాలని అడగుతున్నందుకు.  ప్రతి మనిషి ప్రతి సమస్యను స్వయానా అనుభవిస్తున్నపుడే ఆ సమస్యలో తీవ్రత అర్థమవుతుంది. అందుకే సమస్యలు చిన్నవి అయినా  అవి వాళ్ళను ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. బయటి వాళ్ళు మాత్రం చాలా తొందరగా విమర్శలు  చేసేస్తారు. అయితే సమస్యలు ఎలాంటివి అయినా మనుషులు బంధాలను అంత సున్నితంగా వదిలేయడం, విడిపోవడం అనేవి కాస్త కలవరపరిచే విషయాలే.  అసలు విడాకులు ఎందుకు? ఒకరితో మరొకరు కలిసి బతకలేం అనే విషయం పూర్తిగా అర్థమైనపుడు అలా విడిపోవడం అనే సందర్భం వస్తుంది. చాలామంది పరువు కారణంగానో, పిల్లల భవిష్యత్తు కారణంగానో, మరీ వేరే ఇతర కారణాల వలనో ఇష్టం లేకపోయినా బతుకు వెళ్లదీస్తుంటారు.  విడాకుల వల్ల నష్టపోయేది అమ్మాయిలే అనే ముఖ్య విషయం చాలా చోట్ల అర్థమవుతూ ఉంటుంది. కారణాలు చాలానే ఉన్నాయి. పిల్లలు అమ్మాయిల దగ్గరే ఉండటం, ఆర్థికంగా మరియు ఉద్యోగ విషయంగా మంచి స్థాయిలో లేకపోవడం.  విడాకుల తర్వాత సమాజం దృష్టిలో చులకన అయిపోతామనే భావం గట్టిగా బలపడి ఉండటం. అటు తల్లిదండ్రుల వైపు నుండి, ఇటు అత్తమామలు వైపు నుండి ఎలాంటి ఆదరణ లేకపోవడం.  మరి అమ్మాయిలు స్ట్రాంగ్ అవ్వడం ఎలా? చాలావరకు విడాకుల విషయంలో నెలనెలా భార్యకు భరణం ఇస్తున్న భర్తలు చాలా తక్కువని చెప్పాలి. కొన్ని ప్రాంతాల్లో మొదట్లోనే కొద్దీ మొత్తం ఇచ్చి పూర్తిగా వదిలించేసుకుంటారు. అలాంటి విషయాలపై ఆధారపడకుండా…. మహిళలు చదువు లేకపోయినా కొన్ని నైపుణ్యాలు నేర్చుకుని ఉండాలి.  కుట్టు పని, అల్లికలు, ఆర్ట్&క్రాఫ్ట్స్, ఇతర చేతి పనులు వంటివి నేర్చుకుని ఉండాలి. విడాకుల విషయంలో అనవసర ఇగో లకు పోకుండా ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరూ కూర్చుని చర్చించుకోవడం అనేది ఎంతో ముఖ్యం. ఒకవేళ ఆ చర్చలో కలిసి ఉండలేం అనే విషయం ఫైనల్ అయినా ఆరోగ్యంగా విడిపోవాలి. ఎవరూ ఎవరిని అనవసర విమర్శలు చేసుకోకూడదు. విడాకుల వల్ల తదుపరి తమ జీవితాలు బాగుంటాయా లేదా అనే విషయం ఆలోచించాలి. లేకపోతే పెనం మీద నుండి పొయ్యిలోకి పడ్డ చందాన తయారవుతాయి జీవితాలు. అమ్మ నాన్నలో, అక్కా తమ్ముల్లో, అన్నా వదినలో లేక స్నేహితులో ఇరుగు పొరుగు వాల్లో ఇలా ఎవరిని జోక్యం చేసుకొనివ్వకూడదు. ఎందుకంటే ముడిపడిన జీవితాలు రెండైనపుడు, ఒకరికొకరు అర్థం చేసుకోవాల్సింది మొదట ఇద్దరే.  ఆర్థిక విషయాల పట్ల ఎలాంటి మోహమాటాలు లేకుండా మాట్లాడుకోవడం ఉత్తమం. ఎందుకంటే జీవించాలంటే డబ్బు కూడా అవసరమే. ఒకవేళ పిల్లలు ఉన్నట్లయితే విడాకుల ప్రభావం పిల్లల మీద పడకుండా ఉండేలా జాగ్రత్త పడాలి. అప్పుడే వ్యక్తి గతంగా ఉత్తమంగా ఉండగలరు. పిల్లల భవిష్యత్తు గందరగోళానికి గురవ్వకుండా ఉంటుంది. ముఖ్యంగా పిల్లల దగ్గర విడిపోయిన భాగస్వామి గురించి చెడుగా మాట్లాడకూడదు.  మంచి ముహుర్తాలు పెట్టుకుని జతకావడం, విడాకుల ద్వారా విడిపోవడం అనేది జీవితాల్లో కచ్చితంగా అలజడి సృష్టిస్తుంది. అయితే ఆలోచించి అడుగు వేయడం ముఖ్యం. ఎందుకంటే  మీరు వేసేది  తప్పటడుగై ఏడడుగులను వెక్కిరించకూడదు మరి. ◆ వెంకటేష్ పువ్వాడ  

మూఢనమ్మకాలు వాటి ప్రభావం!

నమ్మకం అనేది మనిషి ఎదుగుదలకు పునాది లాంటిది. మూఢనమ్మకం అనేది మనిషి ఎదుగుదలకు అడ్డగోడ లాంటిది. ప్రస్తుత సమాజంలో నమ్మకమనే పేరులోనే మూఢనమ్మకాలు పాటించేవారు చాలా మంది ఉన్నారు. దీనివల్ల వారికి మాత్రమే కాదు వారి చుట్టూ ఉన్నవారికి, చుట్టూ ఉన్న వారి జీవితాలకు కూడా ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతుంది.  నమ్మకాన్ని నమ్మచ్చుకాని, మూఢనమ్మకాలను నమ్మకూడదు. మూఢత్వం అనేది అంత మంచిది కాదు. అసలు మూఢ నమ్మకాలు నమ్మడం వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుందా అనే ప్రశ్న వేసుకుంటే అది ఎందుకూ పనికిరాదనే విషయం అర్థమవుతుంది. ఎవరో ఏదో చెప్పారని వాటిని గుడ్డిగా నమ్మటం, ఎప్పుడో ఎవరికో ఏదో జరిగిందని ఆ పని చేస్తే ఇప్పుడు మనకు కూడా అదే జరుగుతుందని నమ్మడం, శాస్త్రీయత, హేతుబద్ధత లేకుండా ఉన్న విషయాలను విశ్లేషించకుండా, ఆలోచించకుండా పిచ్చితనంతో ఫాలో అయిపోవడం మొదలైనవాటిని మూఢనమ్మకాలు అంటారు.  మూఢనమ్మకాలను మన దగ్గరకి రానియ్యకూడదు. ఒకసారి మనం వాటిని నమ్మినట్లయితే అవి మనల్ని వదిలిపెట్టవు. ఏ పని మొదలు పెట్టాలన్నా భయమే. పిల్లి ఎదురొస్తే భయం, విధవరాలు ఎదురొస్తే ఏదో చెడు జరుగుతుందని భయం, ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు తుమ్మితే భయం, ఈ రకంగా మూఢనమ్మకాలను ఎక్కువగా నమ్ముతున్నారు చాలా మంది.  వాటి వల్ల మనకు ప్రయోజనం ఏమీ వుండదు. కొన్ని కొన్నిసార్లు మనకు పిల్లి ఎదురొచ్చినా మంచి జరుగుతుంది. అలాగే విధవరాలు ఎదురొచ్చినా మంచి జరుగుతుంది. తుమ్ము వచ్చినా అదేదో జలుబు వల్ల వచ్చి ఉంటుంది. కానీ అందరూ మాత్రం వాటిని కాదు, జరిగే నష్టాన్ని మాత్రమే కొండంత చేసి చూపిస్తారు. దాన్నే ఇంకొకరికి చెబుతారు కూడా.   కొన్నిసార్లు దేవుణ్ణి తలచుకుని వెళ్ళినా అనుకోకుండా చెడు జరుగుతుంది. ఇవన్నీ కామన్ ఇలా జరుగుతుంటాయి. వాటన్నింటిని పట్టించుకుంటే మనం మనశ్శాంతిగా వుండలేము అని ఎవరూ అనుకోరు. అట్లాగే ఏ పని చెయ్యాలన్నా ముందుకు రాకుండా భయపడుతూ వుంటారు. ఈ మూఢనమ్మకాల వల్ల కొన్ని సార్లు అర్జంటుగా వెళ్ళవలసి వచ్చిన ప్రయాణాలను కూడా వాయిదా వేస్తుంటాము. తద్వారా మనం ఎంతో కొంత నష్టపోవలసి వస్తుంది. కాని మనం నష్టపోయినప్పుడు ఆ నష్టాన్ని మనం గుర్తించము. ఆ నష్టాన్ని గురించి కూడా ఆలోచించము. మనకు మూఢనమ్మకాల పైన వున్న అభిమానాన్ని, నమ్మకాన్ని మరింత పెంచుకుంటాము. వాటి ప్రకారం చేశామా?? లేదా అన్న విషయాన్నే మనం పరిగణనలోకి తీసుకుంటాం...! మనం ఒక పనిచేయాలంటే ఆ పని చేయడం వల్ల జరిగే మంచేమిటి చెడేమిటి అనే విషయం ఆలోచించాలి.  మంచి, చెడులు ఆలోచించుకొని ఆ పని చేయాలో, వద్దో నిర్ణయించుకుంటే సరిపోతుంది. అంతేకాని ఎవరో ఎప్పుడో ఆ పని చేస్తే వారికి నష్టం కలిగిందని ఇప్పుడు మనం చేస్తే కూడా నష్టం జరుగుతుందని చేయవలసిన పనిని చెయ్యకుండా మానేయటం మంచిది కాదు. దానిలో పిరికితనం కూడా పెంపొందుతుంది. అన్ని వేళలా మనం మూఢనమ్మకాలను నమ్ముకుంటూ కూర్చుంటే అది మనకు అడ్డుగోడలుగా వుండి మన ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తాయి. చాలా సందర్భాలలో జరుగుతున్నది ఇదే… అందుకే నమ్మకాలు ఎప్పుడూ మనుషుల్ని బలవంతులుగా మార్చాలి కానీ బలహీనులుగా చేసి అభివృద్ధికి అడ్డు పడకూడదు.                                    ◆నిశ్శబ్ద.

నేటికాలం అనారోగ్యాలకు హేతువు ఇదే!

డిప్రెషన్ అనేది ఒక మానసిక వ్యాధి. జీవితంలో చాలామందికి ఏదో ఒక తెలియని బాధ ఉంటుంది. ప్రపంచ జనాభాలో నూటికి 80% మంది ఏదో ఒక సందర్భంలో డిప్రెషన్కు గురి అవుతుంటారు. ప్రపంచం అభివృద్ధి చెందేకొద్ది, మనుషులు అన్ని రకాల అవసరాలను చాలా సులభంగా తీర్చుకునే కొద్దీ మనుషులకు మానసిక వ్యాధులు ఎక్కువ అవుతూ ఉన్నాయి.  చాలామంది మానసిక సమస్యతో బాధపడుతున్నా సరే అది మానసిక వ్యాధి అని వారు గుర్తించరు. మరీ ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాలలో దీన్ని గుర్తించేవారు లేరు. డిప్రెషన్ తో బాధపడే వారిని పొగరు మనుషులుగా ముద్ర వేస్తుంటారు చాలా మంది. డిప్రెషన్కు గురి అయినవారు ఏదో ఒక బాధతో, దుఃఖంతో బాధపడుతుంటారు. ఈ వ్యాధి లక్షణాలు వున్నవారు మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా ఎప్పుడూ అలసిపోయినట్లు కనిపిస్తారు. ఏదో చిరాకు, ఇష్టమైన వాటి మీద కూడా అయిష్టంగా వుంటారు. అంతేకాకుండా వారు చెయ్యగలిగిన వాటిని చెయ్యలేరు, నా వల్లకాదు అన్న ఆలోచనలు కలిగివుంటారు. అందుకే వారు ఏ పనికి ముందుకు రారు, చేయమని ఎవరైనా చెప్పినా కాదని చెబుతారు. ఎప్పుడూ నెగిటివ్ థింకింగ్ కలిగి ఉంటారు. కానీ ఇదంతా వారి నాటకం అని, పని తప్పించుకోవడానికి వారు అలా చేస్తున్నారని చుట్టూ ఉన్నవారు చెబుతారు.  జీవితానికి అవసరం అయిన ఎన్నో విషయాలపై మనం ఇంట్రస్టును కోల్పోతుంటాము. మనకు ఆనందాన్నిచ్చే విషయాలపై ఆటలు, పాటలు, సినిమాలు, షికార్లు, పిక్నిక్ లు, మొదలైన వాటిపట్ల కూడా ఆసక్తి కోల్పోతారు. ఎప్పుడూ ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. డిప్రెషన్ తో బాధపడుతున్న వారికి నిద్రపట్టకపోవడం, నిద్రపట్టినా కలతనిద్రే తప్ప సుఖనిద్ర లభించదు. అంతేకాకుండా నిద్రలో ఏదో భయంకరమైన కలలు రావటం జరుగుతుంది. మరణం గురించిన ఆలోచనలు తరుచుగా వస్తూ వుంటాయి. జీవితం మీద విరక్తి వస్తుంది. బతకటం కంటే చావటం మేలు అనుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. జీవితాన్ని భారంగా భావిస్తారు.  మార్పు అన్నది జీవితంలో అత్యంత సహజమైన విషయం. కాలానుగుణంగా ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. అయితే అందరూ ఆ మార్పులను తట్టుకోలేరు. జీవితంలో ఎప్పుడూ కూడా అన్ని రోజులు ఒకేలా ఉండవు. జీవితం అన్నాక సుఖదుఃఖాలు రెండూ వుంటాయి. దుఃఖం కలిగినప్పుడు తల్లడిల్లిపోయి డిప్రెషన్లోకి వెళ్లిపోకుండా జరిగిన అనుభవించిన సుఖాల గురించి, మంచిని గురించి ఆలోచించాలి. అప్పుడు మనం దుఃఖం గురించి ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళకుండా వుండేందుకు అవకాశం ఏర్పడుతుంది. మార్పులకు అనుగుణంగా మనం మారాలే తప్ప బాధ పడకూడదు. ఏ మార్పు జరిగినా అది మన మంచికే అన్న భావనను కలిగి ఉండాలి. అప్పుడే మానసికంగా ఎంతో కొంత ఓదార్పు లభిస్తుంది. మనం మనకి సంబంధించిన వారు ఎవరైనా దూరమైపోతున్నప్పుడు చాలా బాధపడుతుంటాం. కొంతమంది ఈ చిన్న విషయానికి డిప్రెషన్ కు గురి కావటం జరుగుతుంది. మనుషులు దూరమైనంత మాత్రాన వారిలో మార్పు సంభవించదు, ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి.  ఎంతదూరంగా ఉంటే అంత ఎక్కువ ప్రేమ పెరుగుతుంది అన్న సత్యాన్ని ఆలోచించినట్లయితే డిప్రెషన్కు టాటా చెప్పవచ్చు.                                        ◆నిశ్శబ్ద.

ఒత్తిడులను అధిగమించకపోతే జరిగే నష్టమిదే...

సమస్య ఎదురవగానే మనస్సు దానిని అసలు గుర్తించదు. అది ఒక గదిలో జంబుఖానా క్రింద దుమ్మును దులపడం లాంటిది. నేలపై బాహ్యంగా ఏమీ కనిపించకపోయినా, జంబుఖానా క్రింద చాలా దుమ్ము ఉంటుంది. కానీ దుమ్మును ఆ విధంగా కప్పి ఉంచడం వల్ల గది అంతా ఎంతో పరిశుభ్రంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అదే విధంగా, సమస్య ఉత్పన్నమైనప్పుడు, శిక్షణ లేని మనస్సు ఆ సమస్యను తనకు తెలియకుండానే చైతన్యయుతమైన మనస్సు నుండి బయటకు త్రోయాలని అనుకుంటుంది. అప్పుడా సమస్య జంబుఖానా క్రింది దుమ్ము లాగా అచేతనమైన మనస్సు పొరలలోకి వెళ్ళి, అక్కడ స్థిరపడుతుంది. ఆ సమస్య తీరిపోదు కానీ, జరిగేది ఏమంటే అది మన కళ్ళ ముందు ఉండదు, కనిపించదు. ఏ సమస్య అయినా సరే పై స్థాయిలో కనిపిస్తూ ఉంటేనే మనం దాన్ని పట్టించుకోగలుగుతాం. కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే.. మనస్సు సమస్యలను ఎదుర్కోలేదు. ఎందుకు ఎదుర్కోలేదు అంటే.. సమస్యలను ఎదుర్కోవడం అంటే బాధాకరం కాబట్టి, సమస్యలు అంటేనే శారీరకంగానో.. మానసికంగానో.. భౌతికంగానో.. ఇబ్బంది పడటం. ఆ ఇబ్బందిని ఓర్చుకోవడం.. చాలామందికి అలా ఓర్చుకోవడంలో కష్టం, బాధ ఎదురవుతాయి. కాబట్టి సమస్యను ఎదుర్కోవడం మనిషికీ.. మనసుకు కూడా అసలు ఇష్టముండదు. కానీ సమస్య అలాగే ఉంటే ఏమి జరుగుతుంది?? అది అట్లాగే ఒక దొంతర కింద దాగిపోయి ఎప్పుడో ఆ దొంతర తొలగ్గానే దుమ్ము మురిగ్గా.. పరిసరాలను అపరిశుభ్రం చేసి, శ్వాసకు ఇబ్బంది కలిగించినట్టు సమస్య కూడా మనిషిని ఇబ్బంది పెడుతుంది.   కానీ మనసు ఏమి చేస్తుంది??  సమస్యల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. వాస్తవిక పరిస్థితులను ఆ విధంగా అణచి వేయడం వల్ల సమస్యల పట్ల మనకున్న భయాలు, అపోహలు మనస్సులోని అచేతనమైన పొరకు త్రోసివేయబడతాయి. అప్పుడు ఈ అచేతనపు పొరలలో ఉన్న అచేతన ప్రేరణలు, శక్తులు మనస్సును నియంత్రించడం ప్రారంభిస్తాయి. అప్పుడది సమస్య పరిష్కారాలను అన్ని రకాల పద్ధతుల ద్వారా వాయిదా వేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ రోజు ఎన్నడూ రాదు. సుదీర్ఘకాలం అట్లాగే దాన్ని పరిష్కరించకుండా ఉంచితే చిన్న సమస్యలు కూడా క్లిష్ట సమస్యలుగా మారతాయనే విషయం మనస్సు మరచిపోతుంది. సమస్యలను పరిష్కరించడం ద్వారానే వాటిని అధిగమించగలం. ఒక సామెతలో చెప్పినట్లు, "సరియైన సమయంలో ఒక కుట్టు వేస్తే, తొమ్మిది కుట్లు వేయాల్సిన అవసరం రాకుండా నివారించవచ్చు" ఒక చిన్న నిప్పురవ్వను ఆర్పకపోతే పెద్ద మంట అవుతుంది. నిప్పురవ్వగా ఉన్నప్పుడు దాన్ని ఆర్పడం తేలిక. కానీ సరైన సమయంలో ఆ పని చేయకపోతే, అది ప్రజ్వరిల్లుతుంది. దీని ఫలితంగా జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సమస్య నుండి పారిపోవడం, అసలు చూడకుండా ఉండడం, లేదంటే వాయిదా వేయడం అనే స్వభావాన్ని మానేయాలి. ఏదో ఒక భయంతో బయటకు చెప్పలేనిదాన్ని మనం తరచూ పూర్తిగా అణచివేసే ప్రయత్నం చేస్తుంటాం. ఉదాహరణకు నలుగురితో చెడుగా ప్రవర్తించడం మర్యాద కాదు కాబట్టి మన కోపాన్ని వ్యక్తపరచం. కానీ అది ఎంతకాలం కొనసాగుతుంది? ఏదో ఒక రోజున అంతా బట్టబయలవుతుంది. ఇతరులపై కోపం చూపలేకపోతే అది మన ఆరోగ్యాన్నే దెబ్బ తీస్తుంది. అది కడుపులో పుండునో, అధిక రక్తపోటునో, లేదంటే గుండె ఆగిపోవడాన్నో, గుండె పోటునో కలగజేస్తుంది. అందుచేత మన లోపల ఉన్న ఈ ఒత్తిళ్ళను అధిగమించడం నేర్చుకోవాలి. అది కూడా ఇతరులను నొప్పించకుండా.. మన అసంతృప్తులు ఇతరుల మీదకు వెళ్లకుండా మన ఒత్తిడులను అధిగమించాలి.                                        ◆నిశ్శబ్ద.

నిబంధనలు మంచివేనా?

మనిషికి జీవితంలో కొన్ని నిబంధనలు ఉంటాయి. వాటి వల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. ముఖ్యంగా కుటుంబాలలో, సమాజంలో నిబంధనలు తప్పనిసరి. కొందరికి కొన్ని నియమాలు చాలా కటినంగా అనిపిస్తూ ఉంటాయి, మరికొందరికి అవే మంచి చేస్తుంటాయి. మన చుట్టూ ఉన్న చాలామందితో మాట్లాడేటప్పుడు అలా కనుక లేకపోతే ఇంకేదో అయిపోయి ఉండేవాన్ని/ఉండేదాన్ని అంటూ ఉంటారు. ఇంకేదో అంటే ఇక్కడ ఉన్న స్థాయి కంటే మరోలా ఉండేవాళ్ళమని వాళ్ళ అభిప్రాయం. అంటే ఇక్కడ ఇంకా ఉన్నతంగా వెళ్ళడానికి సరైన దారులు కొరవడ్డాయని(లభ్యం కాలేకపోవడం లేదా అందుబాటులో లేకపోవడం) వాళ్ళ అభిప్రాయం. చిన్నప్పటి నుండి కొన్ని నిబంధనల చుట్టూ పెరిగి, కాస్త ఊహ వచ్చాక, ఆ తరువాత మరికొంత ఎదిగాక ఒకానొక స్వేచ్ఛను కోరుకోవడం మొదలుపెట్టినప్పుడు నిబంధనలు అన్నీ పెద్ద గుదిబండలులా అనిపిస్తాయి అందరికీ. అయితే అవన్నీ మనిషిని ఒక గీత దాటకుండా నియంత్రిస్తూ ఉంటాయి. పెద్దల అజమాయిషీ కాదు అతిజాగ్రత్త!! ప్రతి ఇంట్లో ఇంకా కొన్ని చోట్ల పిల్లల మీద పెద్దలు ఎప్పుడూ నిఘా వేసి ఉంచుతూ ఉంటారు. వాళ్ళు కొన్ని నిబంధనలు విధిస్తారు. ఆ నిబంధనలు దాటి పిల్లలు ఎక్కడ తప్పటడుగులు వేస్తారోననే భయం వాళ్లలో ఉంటుంది. ఆ భయం నుండే పెద్దలకు తమ పిల్లలు తమ కనుసన్నల్లో మెలగాలని అలాగే వాళ్ళను డిమాండ్ చేయాలని ప్రేరేపిస్తూ ఉంటాయి. అయితే ఇదంతా స్వేచ్ఛను ఎక్కువగా కోరుకునే వయసు వాళ్లకు చాలా విసుగు తెప్పిస్తుంది. ఆ విసుగు నుండే ఒత్తిడి ఎక్కువై ఒకానొక వ్యతిరేక భావం ఏర్పడుతుంది.  ఆ వ్యతిరేక భావంలో నుండే పెద్దలు అది చేయద్దు అంటే అదేపనిగా దాన్ని చేసే బుద్ధి పుడుతుంది.  కాబట్టి పెద్దలు పిల్లలకు విధిస్తున్న నిబంధనలు ఏవి ఎందుకోసం అనే విషయాన్ని పక్కన కూర్చోబెట్టుకుని వివరంగా చెబుతుంటే వాళ్ళు కూడా ఆ నిబంధనలను గౌరవిస్తారు. వాటిని పాటిస్తారు. వాటితో పాటు పెద్దలను కూడా ప్రేమిస్తారు. మనకు మనం విధించుకోవాల్సినవి!! చెప్పుకుంటే ఆశ్చర్యం వేస్తుంది కానీ మనకు మనం కొన్ని నిబంధనలు విధించుకోవడం వల్ల  మనకంటూ ఓ ప్రత్యేక జీవితాన్ని సృష్టించుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేకత అనేది అందరికీ విభిన్నంగా ఉండాలనే ఆలోచనతో అనుకుంటే పొరపాటు. మనకున్న ఇష్టాలు, అభిరుచులు అనేవి మనలో ఉన్న ప్రత్యేకతలు, మనకున్న ఆసక్తులు ఇతరుల కంటే బిన్నంగానే ఉంటాయి. ఒకే ఇంట్లో ఉండే వాళ్లకు కూడా వేరు వేరు అభిప్రాయాలు, ఆసక్తులు ఉండేటప్పుడు ఎవరికి వారు కొన్ని నిబంధనలు విధించుకోవడం వల్ల తమకు నచ్చినట్టు ఉండే అవకాశం చేకూరుతుంది. అంతే కాదు ఆ నిబంధనలు ఎదుటి వారు మన జీవితాన్ని ప్రభావితం చెయ్యకుండా ఉండేలా చేస్తాయి కూడా. ఆలోచనా విస్తరణ, ఆత్మవిశ్వాసపు వీక్షణ!! పెట్టుకునే నిబంధనలు ఎప్పుడూ ఆలోచనా పరిధిని పెంచుకునేలా ఉండాలి. ముఖ్యంగా ఈ ప్రపంచాన్ని ఒక చిన్న స్పూన్ లో పట్టుకున్నట్టు ఫీలైపోవడం మానుకుని అన్నిటినీ తెలుసుకునేలా ఉండాలి. దీని ఉద్దేశ్యం ఏమిటంటే ఎంతో పరిధి ఉన్న ఈ ప్రపంచంతో పాటు ఆలోచనా పరిధి కూడా పెరుగుతూ పోతుంది. నిబంధన అంటారు విస్తరణ అంటారు ఎలా సాధ్యం అని అందరికీ అనిపించవచ్చు. అయితే ఇక్కడే ఒక విషయం అర్ధం చేసుకోవాలి. భోజనం చేసేటప్పుడు బిపి పేషెంట్ ఉప్పు తక్కువే తినాలి. అలా తినాలని డాక్టర్ చెప్పినా సమస్య ఉన్న వ్యక్తి తనకు తాను నియంత్రించుకుంటూ నిబంధనలు పెట్టుకోకపోతే అతనికి నష్టం కాబట్టి. ఆలోచనా పరిధి పెంచుకునే దారిలో కూడా కొన్ని అనవసర విషయాలను పట్టించుకోకుండా ఉండేలా నిబంధనలు పెట్టుకోవాలన్నది దీని ఉద్దేశ్యం.  ఆరోగ్యవంతమైన జీవితం!! తినే పదార్థాలు కావచ్చు, రోజువారీ అలవాట్లు కావచ్చు, సంపాదించే మార్గాలు కావచ్చు, చదివే విషయం కావచ్చు, ఇతరుల జీవితాలు కావచ్చు. జీవితానికి సంబంధించి తీసుకునే నిర్ణయాలు కావచ్చు. ఇలా ప్రతి దాంట్లో కూడా మనిషి కొన్ని నిబంధనలు పెట్టుకుంటే గనుక అనవసర విషయాలు జీవితాల్లో నుండి వాటికవే తొలగిపోతాయి.  లేకపోతే అవి అప్రయత్నంగా వచ్చి చేరడం, వాటిని తొలగించుకోవడానికి సమయాన్ని వృధా చేసుకోవాల్సి వస్తుంది.                                     ◆వెంకటేష్ పువ్వాడ  

కాన్ఫిడెన్స్‌ పెరగాలా... నిటారుగా కూర్చోండి చాలు!

ఆత్మవిశ్వాసం పెరగడానికి చాలా చిట్కాలే వినిపిస్తూ ఉంటాయి. వినడానికి అవన్నీ బాగానే ఉంటాయి కానీ, పాటించడం దగ్గరకి వచ్చేసరికి తాతలు దిగి వస్తారు. దాంతో చిట్కాలన్నింటినీ మూటగట్టి... ఉసూరుమంటూ పనిచేసుకుపోతాం. కానీ ఇప్పుడు మనం వినబోయే చిట్కా పాటించడానికి తేలికే కాదు, దీంతో అద్భుతాలు జరుగుతాయని అంటున్నారు పరిశోధకులు. కొంతమందిని చూడండి... వాళ్లు నిటారుగా నడుస్తారు, కూర్చున్నా కూడా నిటారుగానే కూర్చుంటారు. వాళ్లని చూసి- ‘అబ్బో వీళ్ల మీద వీళ్లకి ఎంత నమ్మకమో’ అన్న ఫీలింగ్‌ తెలియకుండానే కలుగుతుంది. నిటారుగా కూర్చుంటే ఎవరిలో అయినా ఆత్మవిశ్వాసం పెరుగుతుందా! అనే అనుమానం వచ్చింది అమెరికాలో కొంతమంది పరిశోధకులకి. దాంతో వాళ్లు ఓ ప్రయోగం చేసి చూశారు.ఈ ప్రయోగంలో భాగంగా 71 మందిని ఎన్నుకొన్నారు. ‘ఒక ఉద్యోగం చేసేందుకు మీలో ఉన్న మూడు పాజిటివ్‌ లక్షణాలు, మూడు నెగెటివ్‌ లక్షణాలు ఒక పేపరు మీద రాయండి,’ అని అడిగారు. అయితే ఇలా రాసే సమయంలో ఓ సగం మంది నిటారుగా కూర్చుని రాయాలనీ, మిగతావాళ్లు చేరగిలబడి రాయాలనీ సూచించారు. నిటారుగా కూర్చుని రాసినవాళ్లు తమలో ఉన్న పాజిటివ్‌ లక్షణాలను చాలా బాగా ప్రజెంట్‌ చేయగలిగారు. అదే సమయంలో నెగెటివ్‌ లక్షణాలు అసలు పెద్ద విషయమే కాదన్న అభిప్రాయం కలిగేలా రాసుకొచ్చారు. ఇక చేరగిలబడి కూర్చున్నవారి పద్ధతి ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. తమలో ఉన్న పాజిటివ్ లక్షణాలను కూడా చాలా సాధారణంగా రాసుకొచ్చారు. ఇక నెగెటివ్‌ లక్షణాలను గొప్ప సమస్యలుగా చిత్రీకరించారు. విచిత్రం ఏమిటంటే... నిటారుగా కూర్చున్నప్పుడు తమ కాన్ఫిడెన్స్‌లో మార్పు వచ్చిన విషయం వాళ్లకి కూడా తెలియలేదు. కానీ వాళ్ల చేతల్లో మాత్రం గొప్ప మార్పు కనిపించింది. అదండీ విషయం! ఈ చిన్న చిట్కా కనుక పాటిస్తే... పరీక్షలు రాయడం దగ్గర నుంచి ఇంటర్వ్యూలో జవాబులు చెప్పడం వరకూ ఎలాంటి సందర్భంలో అయినా మనలో కాన్ఫిడెన్స్‌ రెట్టింపు అవుతుందని భరోసా ఇస్తున్నారు పరిశోధకులు. నిటారుగా కూర్చోవడం, నడవడం వల్ల... మన ఆలోచనల్లో స్పష్టత వస్తుందనీ, అదే కాన్ఫిడెన్సుకి దారితీస్తుందనీ చెబుతున్నారు. - నిర్జర.

సెల్ఫ్ కాన్పిడెన్స్ పెరగాలంటే ఈ పనులు చేయండి..!

సెల్ఫ్ కాన్పిడెన్స్.. ఏ పనిలో అయినా విజయం సాధించడానికి మొదటి సూత్రం ఇదే..  ఒక వక్తికి తన మీద తనకు స్పష్టమైన నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ వ్యక్తి విజయాన్ని చాలా సులువుగా సాధించగలుగుతాడు. అయితే ఈ సెల్ఫ్ కాన్పిడెన్స్ అనేది అనుకోగానే వచ్చేది.  ఇది జీవితంలో అలవాట్ల ద్వారా, వ్యక్తిత్వం ద్వారా ఏర్పడేది.  కానీ కొన్ని పనులు చేయడం ద్వారా ప్రతి వ్యక్తి తమ సెల్ఫ్ కాన్పిడెన్స్ ను పెంచుకోవచ్చు.  అవేంటో తెలుసుకుంటే.. పాజిటివ్ ఆలోచనలు.. మంచి అయినా, చెడు అయినా మొదట ఆలోచనలే మనిషి మీద ప్రభావం చూపిస్తాయి.  పాజిటివ్ ఆలోచనలు ఉన్నవారికి వారి జీవితంలో తాము చేసే పనులలో కూడా పాజిటివ్ వైఖరి ఉంటుంది. తమ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉండేలా వారి ఆలోచనలే ప్రేరేపిస్తాయి. సెల్ఫ్ కాన్పిడెన్స్ పెరగాలంటే పాజిటివ్ ఆలోచనలు కలిగి ఉండాలి. లక్ష్యాలు.. పెద్ద  పెద్ద లక్ష్యాలు నిర్థేశించుకుంటేనే గొప్పవాళ్లు కాగలం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు.  కొందరు మోటివేషన్ స్పీచ్ ఇచ్చేటప్పుడు కూడా అదే చెప్తుంటారు. అయితే గొప్ప కలలు కనడంలో, గొప్ప స్థాయికి వెళ్లాలని అనుకోవడంలో తప్పు లేదు.. కానీ చిన్న చిన్న లక్ష్యాలను నిర్థేశించుకుని వాటిని సాధిస్తూ వెళితే తమ మీద తమకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యం.. ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నా సరే లక్ష్యాలు సాధించాల్సిందే.. అనుకున్న పనులు చేయాల్సిందే అనే మొండితనం ఎప్పటికైనా తీవ్ర నష్టం కలిగిస్తుంది.  అందుకే ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి.  ఆరోగ్యం బాగుంటే ఎంత కష్టమైన పనులైనా ఉత్సాహంగా చేయగలుగుతారు. నేర్చుకోవాలి.. అంతా తెలుసు అనేది అహంకారం అవుతుంది.  ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అనుకున్నప్పుడే ప్రయత్నాలు మెరుగ్గా ఉంటాయి. విషయాన్ని కూడా ఇంకా బాగా నేర్చుకుంటారు. ఇది లక్ష్యాల పట్ల ఆత్మవిశ్వాసంతో ఉండేలా చేస్తుంది. బలహీనతలు.. బలహీనతలు కప్పిపుచ్చుకోవడం చాలా మంది చేసే పని. కానీ బలహీనతలపై దృష్టి పెట్టాలి. వాటిని అధిగమించాలి. అలాగే బలాలను కూడా గుర్తు  చేసుకోవాలి.  బలాల ద్వారా సాధించిన విజయాలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఓటమి.. జీవితంలో ఓటమి ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఎదురవుతుంది.  విజయమే కావాలి అనే మెంటాలిటీ మనిషిని సెక్యురిటీ జోన్ లో ఉంచుతుంది.  కానీ ఓటమిని కూడా అంగీకరించగలిగేవారికి జీవితంలో  కాన్పిడెన్స్ లెవల్స్ పెరుగుతాయి. ప్రతి వైఫల్యం గొప్ప అనుభవాన్ని ఇస్తుంది.  వ్యక్తిత్వ పరంగా బలంగా మార్చుతుంది. పరిచయాలు.. సెల్ఫ్ కాన్సిడెన్స్ మెరుగ్గా ఉండాలంటే నెగిటివ్ గా ఆలోచించకుండా ఉండటమే కాదు.. నెగిటివ్ మాటలు మాట్లాడే వ్యక్తులకు కూడా దూరంగా ఉండాలి.  నెగిటివ్ గా మాట్లాడేవారు ప్రతి ప్రయత్నంలో వెనక్కు లాగే మాటలే మాట్లాడతారు.  ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు. భయం.. దేనికీ భయపడకూడదు. సమస్యలు ఏవైనా వాటికి పరిష్కారాలు కూడా ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎలాంటి పరిస్థితి ఎదురైనా వాటిని ఎదుర్కోగలం అనే నమ్మకాన్ని పెంచుకోవాలి.   ఇదే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.                                      *రూపశ్రీ.

ఈ ప్రదేశంలో ఉంటే కష్టాలు తప్పవు!

గొప్ప తత్వవేత్త చాణక్యుడి నీతి గురించి చాలా మందికి తెలుసు. ఇప్పటికీ ఆయన విధానాలను ప్రజలు అనుసరిస్తున్నారు. కొన్ని ప్రదేశాలలో నివసించడం ఇబ్బందులను ఆహ్వానిస్తుంది అని చాణక్యుడు తన నీతిలో వివరించాడు.ఎలాంటి ప్రదేశాల్లో ఉంటే కష్టాలు ఎదుర్కొవల్సి వస్తుందని చాణక్యుడు చెప్పాడు. ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశ చరిత్ర పుటల్లో గొప్ప తత్వవేత్త చాణక్యుడి పేరు అందరికీ తెలుసు.  చాలా మంది విజయవంతమైన వ్యక్తులు చాణక్యుడి సూత్రాల రహస్యాన్ని అర్థం చేసుకున్నారు లేదా ఆ సూత్రాలతో తమ జీవితాలను గడుపుతున్నారు. చాణక్యుడు ఏకంగా మొత్తం మౌర్య వంశాన్ని స్థాపించాడు. గొప్ప నాయకులు కూడా ఆయన దౌత్యాన్ని అనుసరిస్తారు.చాణక్యుడు తన విధానాల నుండి చాలా విషయాలు చెప్పాడు. అందులో తాను నివసించాల్సిన ప్రదేశం గురించి చెప్పాడు. ఏదో ఒక ప్రదేశాన్ని ముందుగానే విడిచిపెట్టడం మంచిదని, దానిని విడిచిపెట్టడంలోనే జీవితంలో విజయానికి మూల మంత్రం ఉందని చాణక్యుడు సూచించాడు. జీవితంలో విజయం సాధించడానికి ఏ ప్రదేశం నుండి వెంటనే బయలుదేరాలి. ఏ ప్రదేశంలో నివసించాలి అనే దాని గురించి చాణక్యుడి తత్వం ఏమి చెబుతుందో తెలుసుకుందాం. చాణక్య విధానం: యస్మిన్దేశే న సమ్మనో న వృత్తిర్న చ బాన్ధవః । న చ విద్యాగమః కశ్చిత్తం దేశం పరివర్జయేత్ చాణక్యుడి విధానం ప్రకారం గౌరవం లేని చోట నిలబడకూడదని చెప్పాడు. ఉద్యోగం లేని, స్నేహితులు, సహోద్యోగులు లేదా కుటుంబ సభ్యులు నివసించని ప్రదేశాన్ని వదిలివేయండి.చాణక్యుడు ఈ విషయాన్ని మరింత విశదీకరించాడు. జ్ఞానాన్ని పొందడానికి వనరు లేని చోట స్థిరపడకూడదని, ఆ స్థలాన్ని కూడా త్యాగం చేయాలని చెప్పాడు. ఉద్యోగం లేదా వ్యాపారం కోసం ఎటువంటి ఏర్పాట్లు లేని ప్రదేశంలో స్థిరపడకూడదని చాణక్యుడి తత్వం చెబుతుంది . కాబట్టి ఎవరైనా ఈ వ్యవస్థలు ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోవాలి, ఎందుకంటే ఒకరు తమ స్వంత జీవితాన్ని గడపడం లేదా ఒకరిని పోషించడం, ఒకరి కుటుంబాన్ని పోషించుకోవడం ఇక్కడ మాత్రమే సాధ్యమవుతుంది. ఒక స్నేహితుడు, బంధువు లేదా సహాయకుడు జీవించి ఉండకపోతే, విపత్తు సంభవించినప్పుడు మీరు ఎవరి నుండి సహాయం తీసుకోలేరు. ఎందుకంటే మీకు సహాయం చేయడానికి ఎవరూ లేరు. విద్య విషయానికొస్తే, మంచి విద్య ఒక వ్యక్తి యొక్క మంచి ప్రవర్తన, పిల్లల భవిష్యత్తును రూపొందిస్తుంది. చదువులేనప్పుడు ఆ ఊళ్లో పిల్లల చదువులు ఎలా పూర్తిచేస్తాం? అలాంటి చోట నివసిస్తూ పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. అందుకే ఈ వనరులన్నీ లేని ప్రదేశంలో నివసించడం మంచిది కాదని చాణక్యుడు చెప్పారు.

ప్రస్తుత సమాజాన్ని తప్పుదోవలో నడుపుతున్నది ఎవరు?

ప్రస్తుతసమాజాన్ని వ్యాపారసంస్కృతి నిర్దేశిస్తున్నది. వ్యాపారంలో ప్రచారం అత్యంత ప్రాధాన్యాన్ని వహిస్తుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందిందంటే ప్రస్తుతం వ్యాపార ప్రచారం ఇరవై నాలుగు గంటలూ ప్రతి నట్టింటా వికృతరూపంలో నర్తనమాడుతోంది. పుట్టినప్పటి నుంచీ జీవితంలో అనుభవించగల సౌఖ్యాలు ప్రతివాడికీ ప్రతి వయసు నుంచీ తెలుస్తున్నాయి. ఆ సౌఖ్యాల సాధనకు ఏకైక మార్గం డబ్బు సంపాదన. దాంతో వ్యక్తి అభివృద్ధిని డబ్బు సంపాదనతో కొలవటం తప్పనిసరి అయింది. తమ పిల్లవాడు డబ్బు సంపాదించకపోతే పనికి రానివాడన్న అభిప్రాయం స్థిరపడిపోయింది. దాంతో ప్రతివాడి జీవితలక్ష్యం ఎలాగోలాగ, వీలైన రీతిలో డబ్బు సంపాదించటమే అన్నది స్థిరమైపోయింది. సమాజం అవినీతిమయమై విలువలు తరగటంలో ప్రధానంగా తోడ్పడిన అంశం ఇది. డబ్బు మీద ఆశను కల్పించి, పెంచటంలో పాశ్చాత్య ప్రచారసంస్థలు గణనీయమైన విజయాన్ని సాధించాయని చెప్పవచ్చు. ప్రేమప్రచారం సమర్థంగా జరిగింది. యువతీ యువకులు కలిస్తే ప్రేమించి తీరాలన్న అభిప్రాయం ఏర్పడింది. కాలేజీలకు వెళ్ళేది ప్రేమించటం కోసమేనన్న అభిప్రాయం విస్తృతంగా ప్రచారమైంది. టూత్ పేస్టుతో పళ్ళు తోముకుంటే అమ్మాయి వచ్చి ఒళ్ళో వాలుతుంది. ఓ మోటర్ సైకిల్ కొంటే, ఇతరుడితో ఉన్న అమ్మాయి, వాడిని వదిలి వీడి దగ్గరకు వచ్చేస్తుంది. ఓ షేవింగ్ లోషన్ వాడగానే అమ్మాయి ప్రత్యక్షమైపోతుంది. ఇంకో మౌత్ ఫ్రెష్నర్ ఉపయోగిస్తే అమ్మాయిలు ఎగురుకుంటూ వచ్చి పడిపోతారు. ఇంకేదో సువాసన ద్రవ్యం వాడితే అమ్మాయిలు వెర్రెక్కి వెంటపడతారు. మరింకేదో కంపెనీ కళ్ళద్దాలు పెట్టుకుంటే, అమ్మాయిలు నిజంగానే పడిపోతుంటారు. ఈ ప్రచారం వల్ల, అబ్బాయిలకు అమ్మాయిలంటే ఎంతగా చులకన అభిప్రాయం కలుగుతుందో ఆలోచిస్తే, ఈ తరానికి మనం చేస్తున్న అన్యాయం అర్థమౌతుంది. అలాగే, ఓ అమ్మాయి "మిస్ యూనివర్స్" గా ఎన్నికై, సినిమాల్లోకి వెళ్ళి డబ్బు సంపాదించింది. ఆమె మిగతావారందరికీ ఆదర్శమైంది. ప్రతి వారూ అందంగా ఉండాలని పోటీలు మొదలుపెట్టారు. విదేశీ కాస్మెటిక్ కంపెనీలకు లాభం. విదేశీ ఎక్సర్ సైజ్ పరికరాల తయారీదారులకు లాభాలు. ఇక అమ్మాయిలు ఉన్నది అబ్బాయిలను ఆకర్షించేందుకే అన్న ప్రచారం పుట్టినప్పటి నుంచీ ఉగ్గు పాలతో అబ్బాయిలు నేర్చుకుంటున్నారు. ఓ అమ్మాయి ఓ క్రీమ్ వాడగానే అబ్బాయిలు వెంటపడతారు. ఓ హెయిర్ షాంపూ వాడితే ముగ్ధులైపోతారు. కంపెనీ ఐస్ క్రీమ్ అసభ్యంగా తింటూంటే కుర్రాళ్ళు సర్వం మరచిపోతారు.  ముఖం మీద మొటిమలు ఉంటే అబ్బాయిలు మెచ్చరు. కాబట్టి ఓ కంపెనీ మొటిమల మందు వాడితే ఇక అబ్బాయిలు క్యూలు కడతారు. ఇంకేదో పౌడరు, మరింకేదో అందాన్ని పెంచే వస్తువు.... కానీ అన్నీ అబ్బాయిలను ఆకర్షించేందుకే. ఐతే వీటన్నిటికీ డబ్బు కావాలి. డబ్బు కావాలంటే పరీక్షల్లో పాసవాలి. మార్కులు రావాలి. అప్పుడు కార్లు కొనవచ్చు, అమ్మాయిల్ని వెంట తిప్పుకోవచ్చు. ఇదీ ప్రస్తుతసమాజం ఆలోచిస్తున్న దిశ.  పైన చెప్పుకున్నవి అన్ని గమనిస్తే వ్యాపార సామ్రాజ్యాలు చాలావరకు ప్రస్తుత సమాజానికి నష్టం చేకూరుస్తున్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.                                     ◆నిశ్శబ్ద.

ఈ భారతీయ మహారాణికి భయపడి మొఘలులు తమ ముక్కులు తామే కోసుకున్నారు..!

మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్.  1504లో కాబూల్ లో రాజ్యాన్ని స్థాపించాడు. భారతీయ చరిత్రలో మొఘలుల పాత్ర చాలానే ఉంది.  ఈ మొఘల్ వంశానికి చెందిన  షాజహాన్ మొఘల్ రాజుగా కాకుండా తాజ్మహాల్ స్థాపకుడిగా అందరికీ సుపరిచితుడు.  అయితే షాజహాన్ కాలంలో మొఘలులను మట్టికరిపించి వారి ముక్కులు వారే కోసుకునేలా చేసిన మహారాణి ఒకరు ఉన్నారు.  ఆమె రాణి కర్ణావతి.  భారతదేశంలో ఎంతో మంది రాణులు తమ శౌర్యంతో, యుద్ద నైపుణ్యంతో చరిత్రలో తమకంటూ పేరు చిరస్మరణీయం చేసుకున్నారు. కానీ చాలామందికి తెలియని వారు రాణి కర్ణావతి.  మొఘలులకు ముచ్చెమటలు పట్టించి, వారిని మోకాళ్ల మీద నిలబెట్టించి  వారి ముక్కు వారే కోసుకునేలా చేసిన రాణి కర్ణావతి గురించి తెలుసుకుంటే.. రాణి కర్ణావతి గర్వ్హాల్ రాజ్యానికి చెందినవారు.   ఈమె గర్వ్హాల్ రాజపుత్ర రాజు అయిన మహిపతి షా భార్య.  మహిపతి షా గర్వ్హాల్ రాజ్యాన్ని పాలించేవాడు.  గర్వ్హాల్ రాజ్యం బంగారు,  వజ్రాల గనులతో నిండి ఉండేది.  దీంతో అప్పటి మొఘల్ రాజు అయిన షాజహాన్ దృష్టి గర్వ్హాల్ రాజ్యం మీద పడింది. కానీ మహిపతి షా మీద దాడికి వెళ్లలేక పోయాడు. అయితే కొద్దికాలానికే మహిపతి షా మరణించాడు. అప్పటికి  మహిపతి షా,  రాణి కర్ణావతిల కుమారుడు పృధ్వీపతి షా కు  7 ఏళ్లు. ఆ పిల్లాడినే రాజుగా చేసి తానే రాజ్యాన్ని నడిపిస్తుండేవారు కర్ణావతి.  అయితే  ఓ మహిళ రాజ్యాన్ని పాలిస్తోందనే విషయం తెలుసుకుని గర్వ్హాల్ రాజ్యాన్ని తమ కింద విలీనం చేసి బ్రతకమని షాజహాన్ కబురు పంపాడు.  దీనికి రాణి కర్ణావతి ఒప్పుకోలేదు. దీంతో షాజహాన్ గర్వ్హాల్ రాజ్యం మీదకు తన సైన్యాన్ని పంపాడు. 1640లో చక్రవర్తి  షాజహాన్ ఆదేశాల మేరకు నజబత్ ఖాన్ నేతృత్వంలో మొఘల్ సైన్యం గర్వ్హాల్ పై దాడి చేసింది.  ఈ దాడిని ఎదుర్కోవడానికి రాణి కర్ణావతి నడుం బిగించింది. షాజహాన్ సైన్యం మీద తిరగబడింది. రాణి కర్ణావతి యుద్ద కౌశలం,  ఆమె శౌర్యం ముందు మొఘలులు చేతులెత్తేశారు.  రాణి కర్ణావతి ముందు లొంగిపోయారు.  చాలామంది మొఘల్ సైన్యం ఆమెకు బందీలుగా చిక్కారు. రాణి కర్ణావతి తనకు చిక్కిన మొఘలు సైన్యాన్ని తేలిగ్గా వదల్లేదు.  తమ ముక్కులను తామే కోసుకోవాలని ఆదేశించారు. లేకపోతే వారి తలలు నరికేస్తానని చెప్పారు. ప్రాణాలు అయినా దక్కుతాయనే ఆశతో మొఘలు సైనికులు తమ కత్తులతో తామే తమ ముక్కులు కోసుకున్నారు. మొఘల్ సేనాపతి నజబత్ ఖాన్ కూడా ముక్కు కోసుకున్నాడు. కానీ తిరుగు ప్రయాణంలో జరిగిన అవమానం భరించలేక విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. షాజహాన్ ఇదంతా భరించలేక ఉత్తరాఖండ్ పై దాడి ప్రకటించాడు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా మొఘలులు రాణి కర్ణావతిని ఓడించలేకపోయారు. చివరకు రెండు సైన్యాల మధ్య ఒప్పందం జరగడంతో ఈ గొడవ ముగిసిందని చరిత్ర చెబుతోంది. ఇలా శత్రువుల ముక్కులు కోసుకునే చేయడంలో రాణి కర్ణావతి ముక్కలు కత్తిరించే రాణిగా చరిత్రలో చెప్పబడింది.                                                   *రూపశ్రీ.

మనిషి ఎలా జీవించాలంటే...

మనిషి జీవించే విధానం ఎలా ఉండాలో మనిషే నిర్ణయించుకోవాలి. పూలు ఎక్కడున్నా సువాసన వ్యాపించినట్లు  మనం ఎక్కడ ఉన్నా మన వ్యక్తిత్వం పరిమళిస్తూ ఉండాలి. మన మాట, మన ప్రవర్తన, మన పనులు అన్నీ సువాసన సంభరితంగా ఉండాలి. ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, రోడ్డుపై నడుస్తున్నా, తరగతి గదిలో కూచొన్నా, మన కింద పని చేస్తున్న వారికి ఆజ్ఞలు ఇస్తున్నా.. మనపై అధికారుల ఆజ్ఞల్ని వింటున్నా... అసలు మనం ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా - బతికి ఉన్నంత కాలం... తోటివారు మన గురించి, మన వ్యక్తిత్వం గురించి, మన విశాల హృదయం గురించి 'భేష్' అనుకోవాలి. అలా ప్రవర్తించాలి. గర్వం లేకుండా, ఇతరులను హీనంగా చూడకుండా నలుగురికీ తలలో నాలుకలా... నలుగురితో కలగలిసి పోతూ... ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ... మన కర్తవ్యం నిర్వహణ చేస్తూ... ముందుకు సాగడమే మానవ జీవిత సార్థకత అంటే! కమ్మని మామిడి చిగుళ్ళు తినే కోకిలకు ఏ మిడిసిపాటూ ఉండదు. కానీ బురదనీళ్ళు తాగే కప్ప మాత్రం బెకబెకమంటూ ఒకటే గొడవ చేస్తుంది. "కాకః కృష్ణః పికః కృష్ణః, కో భేదః పిక కాకయోః వసంతకాలే సంప్రాప్తే, కాకః కాకః పికః పికః"  అంటే… 'కాకి నల్లగా ఉంటుంది. మరి కోకిల? అది కూడా నల్లగానే ఉంటుంది. మరి ఏమిటి రెండింటికి తేడా? వసంతకాలం రానీయండి అవి రెండూ గొంతు విప్పితే - కాకి కాకేనని, కోకిల కోకిలేనని తేలిపోతుంది! అదే విధంగా  మనమంతా... మనుష్యులమంతా... పైకి ఒక్కలాగే ఉంటాం. కానీ కాలం గడిచేకొద్దీ... పుట్టి పెరిగే కొద్దీ... పెరిగి ఎదిగే కొద్దీ మరణం సమీపించే కొద్దీ... మనం సుమధుర సంగీతాన్ని అందించామా, బెకబెకమంటూ అరుస్తున్నామా... అన్నది మనమే తేల్చుకోవాలి. ఒకసారి ఒక కొంగా, హంసా మాట్లాడుకుంటున్నాయి. హంసను చూసి కొంగ ఇలా అడిగింది: "కళ్ళు, కాళ్ళు, ముక్కు ఎర్రగా ఉన్నాయ్ ఎవరోయ్ నువ్వు?” "నేను హంసను”. “ఎక్కడి నుండి వస్తున్నావు" "మానససరోవరం నుంచి” “అక్కడ ఏమేం ఉంటాయేమిటి?” "స్వర్ణ కమలాలు, అమృతం, రత్నాలు, పారిజాతాలు... ఇంకా ఎన్నో మనోహరమైనవి, లోకానికి ఉపకరించేవి. ఉంటాయి" "ఇంతేనా! నత్తగుల్లలు ఉండవా?". "ఉండవు" అందట హంస అది విన్న కొంగ వేళాకోళంగా నవ్వుకొంటూ వెళ్ళి పోయిందట. ఇప్పుడు మనకు మనమే నిర్ధారించుకోవాలి - హంసలా బతకాలనుకొంటున్నామా? కొంగలా ఇతరుల్ని వేళాకోళమాడి.. నత్తగుల్లలే గొప్పవని భ్రమపడాలనుకొంటున్నామా!                                          *నిశ్శబ్ద. 

సొంతింటి కోసం స్కెచ్ ఇలా!! 

  ప్రతి ఒక్కరికి సొంతం ఇల్లు అనేది ఒక కలలాగా ఉంటుంది. దాన్ని నిజం చేసుకోవడానికి జీవితకాలం కష్టడేవాళ్ళు చాలామంది ఉంటారు. వెనుక తరాల ఆస్తిపాస్తులు, పెద్ద పెద్ద సంపాదన ఏమాత్రం లేనివాళ్లకు అయితే సొంతిల్లు అనేది అందని ద్రాక్షలాగా ఉంటుంది. ఏళ్లకేళ్ళు అద్దె ఇళ్లలో బ్రతికేస్తూ అసంతృప్తిని భరిస్తున్నవాళ్ళు ఎంతోమంది ఉందనే ఉంటారు. నిజానికి పేద, బడుగు వర్గాల వారికి ప్రభుత్వాలు భూములు మంజూరు చేసినా, ఇళ్ల నిర్మాణం కోసం లోన్లు ఇచ్చినా అవన్ని కూడా అందుకుంటున్న జనాభా శాతం చాలా తక్కువ. అందువల్ల సొంతింటి కల మీద ఆశలు వదిలేసుకుంటూ కొందరు, మనసులో బాధపడుతూ మరికొందరూ అసంతృప్తిగా బ్రతికేస్తున్నారు.కాసింత మెరుగైన సంపాదన ఉంటే సొంతం ఇల్లు అనేది పెద్ద ఘనకార్యం కాదని, అందులోనూ పట్టణాల్లో ఇలాంటి కల తీర్చుకోవడం కష్టమని అసలు అనిపించదు. కావాల్సిందల్లా కాస్త ప్రణాళిక మాత్రమే. పొదుపు సూత్రంలో ప్రణాళిక!! కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోవాలి అనేది అందరికీ తెలిసిన విషయమే!! అయితే ప్రతి నెలా సంపాదన, పొదుపుగా ఇల్లు ఎలా నెట్టుకురావచ్చు?? ఖర్చులు, మిగులు ఇవన్నీ చక్కగా అర్థం చేసుకుని, అనవసరమైన ఖర్చుల వెంట వెళ్లకపోతే పొదుపు కూడా బాగానే చేయచ్చు.  పెళ్లి తరువాత?? చాలామందికి పెళ్లి తరువాత చిన్నగా బాధ్యతలు పెరుగుతాయి. ఆ బాధ్యతలతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. రెండు చేతుల సంపాదన ఉంటే పర్లేదు కానీ ఒక్కరి సంపాదనతో నగరాల్లో నెట్టుకురావడం కష్టమే. ఇద్దరి సంపాదన ఉన్నవాళ్లు అయితే చక్కగా లోన్ తీసుకుని  ప్లాట్ కొనేసి సెటిల్ అయిపోతారు. అయితే ఇక్కడ కూడా ఒక సమస్య వస్తుంది. అదే పిల్లల బాధ్యత. పెళ్లయ్యాక చాలామంది మొదట సెటిల్ అయ్యాక పిల్లలు అనేది ఇందుకే. పిల్లలు పుట్టుకొచ్చాక వాళ్ళ ఖర్చులు, ఆ తరువాత చదువులు, ఫీజ్ లు ఇలా చాలా అవసరాలు ఉంటాయి కాబట్టి వీలైనంతవరకు ఇంటికి పునాది వేసినట్టు ఇంటి కలకు కూడా పెళ్లికి ముందే ఓ ప్రణాళిక వేయడం ఉత్తమం. బ్యాంక్ లతో భళా!! ఇప్పట్లో చాలావరకు బ్యాంక్ లు లోన్లు ఇచ్చేస్తున్నాయి. వాళ్లకు కావాల్సిందల్లా ఉద్యోగం సరిగ్గా ఉందా?? లేదా?? నెలసరి ఆదాయం పెట్టుకున్న లోన్ కు తగ్గట్టు కట్టేలా ఉందా లేదా అన్నది మాత్రమే. ఇలా లోన్ తీసుకోవడం నుండి నెలవారీ చెల్లింపులు సక్రమంగా కట్టేస్తూ ఉంటే ఎలాంటి సమస్యా ఈ లోన్ల వల్ల రాదు. చాలామందికి లోన్ అప్లై చేసుకోవడం ఇల్లు కొనుక్కోవడం తెలుస్తూనే ఉంటుంది కానీ  నెలసరి చెల్లింపులు సక్రమంగా కట్టకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అభిరుచితో కొత్తగా!! చాలమందికి  ఉద్యోగ వేతనం సరిపడినంత ఉండదు. అయినా వాళ్ళు అందులో కొనసాగుతూ ఉంటారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ప్రస్తుత కాలంలో కేవలం ఆ ఉద్యోగంతో సంపాదిస్తూనే తృప్తిపడిపోయి ఆగిపోకుండా అభిరుచిని బట్టి పార్ట్ టైమ్ లేదా స్వీయ అభిరుచితో తమదైన సంపాదనను ఎలాంటి సమస్య లేకుండా చేతుల్లో అందుకోవచ్చు. కేవలం రెండు లేదా మూడు గంటల పనితో సుమారు పదివేల రూపాయల వరకు స్అంపడించే అవకాశాలు బోలెడు ఉంటున్నాయి. ఇవి మాత్రమే కాకుండా స్వంతంగా ఉద్యోగం లేని సమయాల్లో తమలో ఉన్న నైపుణ్యంతో వ్యాపారాలు చేస్తూ షేర్ మార్కెట్ మీద అవగాహనతో పెట్టుబడులు పెడుతూ కూడా గొప్పగా సంపాదించేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి మార్గాలు అనుసరిస్తే ఎవరితో ఉన్న అభిరుచే వారికి బోలెడు అవకాశాలు తెచ్చిపెడుతుంది. మీ నిర్ణయం మీ చేతుల్లో!! చాలామంది ఇల్లు, స్థలం వంటివి కొనుగోలు చేయాలి అంటే ఎంతో మంది అభిప్రాయాలు తెలుసుకుంటూ ఉంటారు. నిజానికి ప్రాంతాన్ని బట్టి ఉండే ధరల విషయంలో ఈ అభిప్రాయాలు తెలుసుకోవడం మంచిదే అయితే ఇల్లు తీసుకోవాలా వద్దా అనే నిర్ణయం మాత్రం వేరే ఎవరి చేతుల్లో పెట్టకూడదు. ఈ కాలంలో అయితే అపార్ట్మెంట్లు ఎంతో సులువుగానే లభిస్తున్నాయి కూడా. ముఖ్యంగా కాసింత ఓపిక ఉంటే యూట్యూబ్ లాంటి చోట్ల ఉన్న ఆసక్తిని అప్లోడ్ చేస్తూ కూడా బోలెడు సంపాదించవచ్చు.  కాబట్టి ఇన్ని విధాలుగా ఆలోచిస్తే ఇన్ని ఆలోచనల్ని ఒక ప్రణాళికలో చేరిస్తే సొంతిల్లు నిజం కానిదేమీ కాదు. ◆ వెంకటేష్ పువ్వాడ  

పదే పదే ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారా? దాని వల్ల కలిగే నష్టాలు తెలిస్తే షాకవుతారు!!

టెక్నాలజీ మనిషి జీవితాన్ని చాలా రకాలుగా సులభతరం చేసిందనడంలో సందేహం లేదు. ఎక్కడికైనా ప్రయాణం చెయ్యాలంటే  ఆటో లేదా టాక్సీ కోసం ఎక్కువసేపు  వెయిట్ చెయ్యాల్సిన అవసరం లేదు. వివిధ రకాల యాప్స్ నుండి క్యాబ్ బుక్ చేసుకుని సౌకర్యవంతంగా గమ్యాన్ని చేరుకోవచ్చు. షాపింగ్ చేయడానికి చేతిలో క్యాష్ లేకపోయినా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. టెక్నాలజీ మాయ వల్ల చాలా మంది కాలం మొత్తం బిజీ బిజీగా గడుపుతారు. ఈ కారణంగా కనీసం వంట చేసుకోవాలన్నా కష్టంగానే ఉంటుంది చాలామందికి. ఈ కారణంగా నగరాలలో, ఓ మోస్తరు పట్టణాలలో  ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ పెట్టేస్తుంటారు.  బిజీ జీవితాలకు ఆన్లైన్ ఫుడ్ అనేది శ్రమ తగ్గించి రుచికరమైన ఆహారాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు. దీని వల్ల  ఇంట్లో కూర్చొని  ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. కానీ ఇంతకు ముందు  ఈ సౌకర్యాన్ని అయిష్టంగా  ఉపయోగించుకునేవారు. ఆన్లైన్ ఆర్డర్ అంటే ఖర్చు నుండి బోలెడు ఆలోచనలు చుట్టుముట్టేవి. కాస్త వంట వస్తే ఎంతో సులువుగా అయిపోయే భోజనం వందలాది రూపాయలు ఖర్చుపెట్టి కొనాలా అనుకునేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది.  సమయాన్ని సంపాదించడానికి వెచ్చించేవారు  వంట చేసుకునే సమయంలో డబ్బు సంపాదించి అందులో కొంత ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతుందిలే అనే వింత ఆలోచనకు అలవాటు పడ్డారు. ఇక పెద్దవాళ్లు ఇంట్లో లేక అడిగేవారు లేకపోతే ఈ తరం దంపతుల నుండి బ్యాచ్లర్స్ వరకు అందరిదీ ఇదే పంధానే.  తోచినప్పుడల్లా ఫోన్ తీసుకుని ఆర్డర్ పెట్టేయడమే.  నిమిషాల్లో వేడివేడిగా ఆహారం డోర్ డెలివరీ అవుతుంది. ఈ వ్యసనం చాలా దారుణంగా తయారవుతోంది.  ఇది మనిషి శారీరక మానసిక ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.  ఆన్లైన్ ఫుడ్ తినడం వల్ల జరుగుతున్న సమస్యలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. చాలా వరకు  ఫుడ్ డెలివరీ ఎంపికలలో ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన స్నాక్స్, అలాగే అధిక క్యాలరీలు, తక్కువ పోషకాలు ఉన్న ఆహారాలే ఉంటాయి. కాలక్రమేణా వీటిపై  ఆధారపడటం అసమతుల్య ఆహారం  తీసుకోవడానికి దారితీస్తుంది.  ఇది శరీరంలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పోషకాల లోపానికి దారితీస్తుంది. నేటి కాలంలో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్న ఉబకాయం, అధికబరువు, మధుమేహం వంటి సమస్యకు ఇదిగో ఈ ఆన్లైన్ ఫుడ్ లే కారణమవుతాయి. క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు, ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. బరువు పెరగడానికి, ఊబకాయానికి దారితీస్తాయి. ఈ రకమైన ఆహారంలో అధిక మొత్తంలో అనారోగ్యకరమైన కొవ్వులు, చక్కెరలు,  సోడియం ఉంటాయి, ఇది జీవక్రియను దెబ్బతీస్తుంది.  శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది. ఆన్లైన్ ఫుడ్ కు అలవాటు పడేవారిలో బయటపడిన మరొక దారుణ నిజం ఏమిటంటే చిన్నవయసులోనే వస్తున్న గుండె సంబంధ సమస్యలు. అనారోగ్యకరమైన ఆహారాలు అధిక రక్తపోటు, గుండె జబ్బులు,  స్ట్రోక్‌తో సహా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. అధికంగా వేయించిన,  ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది.  ఇది ధమనులలో  పేరుకుపోతుంది. ఫైబర్  పోషకాలు లేని  ఆహారాలు మలబద్ధకం, కడుపులో వికారం,  పేగుల పనితీరు దెబ్బతినడం వంటి సమస్యలకు కారణమవుతాయి.  అలాగే వీటిలో అధిక చక్కెర,  అధిక కార్బోహైడ్రేట్ ఉంటాయి. ఇలాంటి ఆహారాలను  తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఊహించనివిధంగా పెరుగుతాయి.  ఇది క్రమంగా  టైప్-2 డయాబెటిస్,  ఇతర జీవక్రియ సమస్యలకు దారితీస్తుంది . ఆహారాన్ని ఆర్డర్ చేసే వ్యసనం మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. అంటే సాధారణ ఆహారం ఆరోగ్యానికి అలాగే మనస్సుకు కూడా మంచిది. కానీ  వేయించిన, అధిక కొవ్వులు ఉన్న ఆహారాన్ని తినడం వల్ల  అనేక వ్యాధులకు గురి కావాల్సి ఉంటుంది. ఇది  ఒత్తిడి, ఆందోళన,  నిరాశకు  కారణమవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. పదే పదే బయటి నుంచి ఫుడ్ ఆర్డర్ చేయడం ఖర్చుతో కూడుకున్నది.  ఇది  బడ్జెట్‌ను పాడుచేస్తుంది ఆహారంపై అధికంగా ఖర్చు చేయడం వల్ల కలిగే ఆర్థిక ఒత్తిడి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే ప్యాకేజింగ్,  వ్యర్థాలు తరచుగా ఆహార పంపిణీతో ముడిపడి ఉంటాయి, ప్లాస్టిక్ కాలుష్యం వంటి పర్యావరణ సమస్యలకు ఇది  దారి తీస్తుంది.                                                       *నిశ్శబ్ద.

వర్షాకాలంలో దోమల బెడద తగ్గాలంటే ఈ టిప్స్ పాటించాలి..!

వర్షాకాలం ఇంటి పరిసరాలు చాలా చిత్తడిగా ఉంటాయి.  ఇలాంటి ప్రాంతాలు దోమలు పెరగడానికి అనువుగా ఉంటాయి.  విపరీతమైన దోమల కారణంగా వర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు,  మలేరియా,  చికెన్ గున్యా వంటి జ్వరాలు వస్తాయి.  అయితే ఇంటి పరిసరాలలో అసలు దోమలు ఉండకూడదంటే ఈ కింద చెప్పుకునే చిట్కాలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఫాలో అవ్వాలి.  ఇలా చేస్తేనే ఈ వర్షాకాలంలో జ్వరాల బారిన పడకుండా తమను తాము మాత్రమే కాకుండా కుటుంబాలను కూడా కాపాడుకోవచ్చు. ఇంటి పరిసరాలలో ఉండే పూల కుండీలు,  బకెట్లు,  పాత టైర్లు వంటి వాటిలో వర్షం నీరు చేరుతూ ఉంటుంది.  ఇలాంటి వాటిలో నీటిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. నీరు అలాగే నిల్వ ఉంటే దోమలు గుడ్లు పెట్టి తమ సంతతిని వృద్ధి చేసుకుంటాయి. వర్షాకాలం పూర్తయ్యేలోపు ఈ దోమల ఉదృతి పెరుగుతుంది.  కాబట్టి ఇంటి పరిసరాలు పొడిగా, నీటితో లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో  ఉన్న నీటి కాలువలు,  డ్రైనేజీ సిస్టం, నీరు నిల్వ చేసే సొంపు వంటివి శుభ్రంగా ఉంచుకోవాలి.  వర్షం కారణంగా వీటిలో కాగితాలు, ప్లాస్టిక్ కవర్లు అడ్డు పడి నీరు నిలుస్తూ ఉంటుంది.  ఇవి కూడా దోమలకు ఆవాసాలుగా మారతాయి. నీటి కాలువలు, డ్రైనేజీ సిస్టమ్ ఎప్పుడూ నీరు పారుతూ ఉండేలా చూసుకోవాలి. తప్పనిసరి పరిస్థితిలో బయటకు వెళ్లినా,  ఇంటి చుట్టుప్రక్కల దోమల ఉదృతి ఎక్కువగా ఉన్నా దోమ కాటుకు గురి కాకుండా, చర్మాన్ని సంరక్షించగల లోషన్ లు, క్రీములు, స్ప్రే లు  ఉపయోగించాలి. ఇవే కాదు నిమ్మ, యూకలిప్టస్ నూనె వంటి సారాలతో కూడిన స్ప్రే లు దోమలను దరిదాపుల్లోకి రానివ్వవు. వీటిని వినియోగించాలి. ఇంట్లో నీలగిరి తైలం లేదా యూకలిప్టస్ నూనె, నిమ్మ,  టీట్రీ వంటి నూనెలను ఉపయోగించాలి. ఆయిల్ డిఫ్యూజర్ లను ఉపయోగించాలి.  ఇవి దోమలను ఇంట్లో నుండి తరిమికొట్టడంలో సహాయపడతాయి. పైపెచ్చు ఇల్లంతా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. సాయంత్రం సమయాల్లోనే దోమలు ఎక్కువగా వస్తుంటాయి.   ఈ సమయంలో ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ లు ఆన్ లో ఉంచాలి.  గాలి ఉదృతి కారణంగా దోమలు సరిగా ఎగరలేక ఇంట్లో నుండి వెళ్లిపోతాయి. ముఖ్యంగా పడకగదులలో ఫ్యాన్లు ఆన్ లో ఉంచితే పడుకునే సమయానికి దోమలు అక్కడి నుండి వెళ్లిపోతాయి. దోమల బెడద తప్పించుకోవడానికి ఇంట్లో వేప,  సాంబ్రాణి వంటి హానికరం కాని వాటితో ఇంట్లో ధూపం వెయ్యాలి.  ఇవి ఒకవైపు దోమలను తరిమికొట్టడంలోనూ, మరొకవైపు వాటి వాసన కారణంగా ఇంట్లో వారికి ఆరోగ్యాన్ని చేకూర్చడంలోనూ సహాయపడతాయి. ఇంటి బాల్కనీ,  ఇంటి ఆరుబయట ప్రాంతంలో సిట్రోనెల్లా,  లావెండర్,  బంతి పువ్వులు, నిమ్మగడ్డి వంటి మొక్కలను పెంచాలి.  ఈ మొక్కల సువాసన కారణంగా దోమలు ఆ దరిదాపుల్లో ఉండవు. ముఖ్యంగా ఇంటి తలుపులకు,  కిటికీలకు నెట్ కర్టెన్లు ఏర్పాటు చేసుకోవాలి.  దీనివల్ల ఇంట్లోకి తాజా గాలి వస్తూనే దోమలు రాకుండా ఉంటాయి.                                         *రూపశ్రీ.