Read more!

విద్యార్థులు విజయం సాధించాలి అంటే.. ఈ పనులు చెయ్యాలి!

ప్రతీ విద్యార్థి సర్వసాధారణంగా ఎదుర్కొంటున్న సమస్య పట్టుదల కోల్పోవడం. సాధారణంగా విద్యార్థి మనస్తత్వం ఎలా ఉంటుందంటే 'సినిమాకు వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు వర్షం కురిస్తే దాన్ని ఆటంకంగా భావించడు. అదే వర్షం కళాశాలకు బయలుదేరుతున్నప్పుడు పడితే దాన్ని మాత్రం పెద్ద ఆటంకంగా భావిస్తాడు'. అందుకు కారణం అతడి అభిరుచి చదువుపై కన్నా సినిమాపైనే అధికంగా ఉండడమని మనకు అర్థమవుతుంది.

అభిరుచి - ఉత్సాహం - మనోబలం = లక్ష్యసిద్ధి. 

ముందు మనం చేసే పని మీద అభిరుచి కలిగి ఉండాలి. ఎప్పుడైతే పని పట్ల అభిరుచి ఏర్పడుతుందో అప్పుడు దాన్ని సాధించేందుకు ఉత్సాహం పెరుగుతుంది. అలాంటి ఉత్సాహం ఎన్ని అవరోధాలనైనా ఎదుర్కొనే మనోబలాన్ని సమకూరుస్తుంది. ఆ మనోబలంతో లక్ష్యాన్ని సాధించవచ్చు. విద్యార్థి అయినా, వ్యాపారవేత్త అయినా, శాస్త్రవేత్త అయినా, ఏ ఇతర రంగానికి చెందినవారైనా తమ లక్ష్యసిద్ధికి పైన తెలిపిన సూత్రమే అనుసరణీయం. మానవుని ప్రగతి సౌధానికి ఉత్సాహమే పునాది. ఉత్సాహం ఉంటే ఏదైనా సాధించవచ్చనే మనోబలం చేకూరుతుంది. అది లేకపోతే అంతా అసాధ్యంగా తోస్తుంది.

 Enthusiasm is at the bottom of all progress. With it there is accomplishment. Without it there is only disappointment. Mary Mc Carthy

ఉత్సాహం గమ్యాన్ని చేర్చే వాహనమైతే, దాన్ని నడిపించే ఇంధనమే మనోబలం. జీవితంలో అన్నీ ఉన్నా ఏమీ సాధించ లేకపోవడానికి కారణం మనోబలం లేకపోవడం. ఏమీ లేకపోయినా దేనినైనా సాధించడానికి కారణం మనోబలం కలిగి ఉండడం. కాళ్ళు, చేతులు లేని అవిటివారైనా, చూపు లేని అంధులైనా, మాటరాని మూగవారైనా, కటిక దారిద్య్రం కబళించినా మనోబలంతో దేనినైనా సాధించవచ్చని నిరూపించిన మహాత్ములెందరో ఉన్నారు. అలాంటి మహాత్ముల గురించి తెలుసుకుంటే మన లక్ష్యసిద్ధికి కావాల్సిన అభిరుచి, ఉత్సాహం, మనోబలం పెంపొందుతాయి.

అంధత్వం, మూగతనం, చెవుడు - మూడూ కలిసి పరిహాసం చేసినా దిగులుచెందక అంతరిక్షంలో తొలిసారిగా పయనించిన మహిళ తెరిస్కోవా. చెవిటివాడైనా సంగీత సామ్రాజ్యానికి సామ్రాట్గా నిలిచాడు బెతోవెన్. కటిక దారిద్య్రం కాఠిన్యం  ప్రదర్శించినప్పటికీ విద్యావంతులై భారత ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి, అమెరికా అధ్యక్షునిగా అబ్రహం లింకన్లు ఖ్యాతి గడించారు. ఆగని కెరటాలలా ఒకదాని తరువాత ఒకటి వచ్చే అపజయాలకు నిరాశ చెందకుండా ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తగా ఎదిగారు థామస్ ఆల్వా ఎడిసన్. ఇలాంటి స్ఫూర్తి దాతలు ఎంతోమంది ఉన్నారు. వీరందరినీ చరిత్ర పుటల్లో చిరస్మరణీయులుగా చేసిన ఒకే ఒక్క మహత్తరశక్తి 'మనోబలం'. అలాంటి మనోబలం, ఆత్మశక్తి మనలో కూడా వృద్ధి చెందాలంటే… మనోబలం పెంపొందడానికి  స్వామి వివేకానంద ఇచ్చిన సందేశాలు ప్రతి నిత్యం మననం చేయాలి.

To succeed, you must have tremen- dous perseverance, tremendous will. "I will drink the ocean," says the perse- vering soul, "At my will mountains will crumble up". Have that sort of energy, that sort of will, work hard, and you will reach the goal. - Swami Vivekananda

మనోబలానికి మారుపేరుగా నిలిచిన మారుతి వజ్రాసనంలో కూర్చొని ఉండడాన్ని చిత్రపటాల్లో మనం గమనించవచ్చు. వజ్రాసనం మనోబలాన్ని పెంచుతుంది. కాబట్టి ప్రతిరోజూ కనీసం ఐదు నిమిషాల పాటు 'వజ్రాసనం' అభ్యసించాలి. ఆత్మశక్తికి ప్రతీకలుగా నిలిచిన వీరహనుమాన్, ధీర వివేకానందలను ఆదర్శంగా తీసుకొని ఈ రెండు సూచనల్ని క్రమం తప్పకుండా అభ్యసిస్తే, మనోబలం తప్పక పెంపొందుతుంది. అప్పుడు మనం అనుకున్న లక్ష్యాన్ని సునాయాసంగా సాధించవచ్చు. ఇది విద్యార్థులందరికీ ఎంతగానో తోడ్పడుతుంది.

                                       *నిశ్శబ్ద.