శ్రీరామ వైభవం!

రాముడు రాఘవుడు రవికులుడితడు అనే పాటను వింటుంటే మనసు ఎంతో హాయిగా ఉంటుంది. చిన్నప్పుడు పుస్తకాల్లో శ్రీరాముడు పితృవాఖ్య పరిపాలకుడు అనే మాటను విని ఉంటాము. ఇంకా చక్కని నడవడిక కలిగిన అబ్బాయిలను చూస్తే రాముడు అనే టాగ్ వేస్తాము. ఇలా మన జీవితాలలో రాముడు ఒక భాగం. అయోధ్యా నగరాన్ని పాలించిన శ్రీరామచంద్రుడు యావత్ భారతదేశానికి కూడా గర్వకారణం అంటారు. కొన్ని విమర్శలు ఉన్నా వాటి వెనుక కూడా సరైన హేతువులతో ఆలోచిస్తే దశావతారాలలో రాముడి అవతారం ప్రజలకు ఏదో చెప్పడానికే ఈ భూమి మీదకు వచ్చిందని ఖచ్చితంగా నమ్ముతారు. నవమి వైభవం!! నవమి రోజు రాముడు పుట్టాడు. అయితే అన్నిచోట్లా శ్రీరామ నవమి రోజు సీతారాముల కల్యాణం జరుపుతారు. భారతదేశంలో ఉన్న ఎన్నో ప్రసిద్ధ గుడులలో ఇంకా చిన్న చిన్న రాముడి కోవెలలో కూడా సీతారాముల కల్యాణం ఎంతో గొప్పగా నిర్వహిస్తారు. తెలంగాణలో భద్రాచలంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోని ఒంటిమిట్ట లోనూ రాముడి కల్యాణం, శ్రీరాముడి పట్టాభిషేకం ఎంతో బాగా చేస్తారు.  ఏకపత్నీ వ్రతుడు!! ఒకటే మాట, ఒకటే బాణం అనే క్రమంలో సాగే రాముడు జీవితంలో కూడా ఒక భార్యను మాత్రమే కలిగి ఉండటం చక్కని సందేశం. ఆ కాలానికి ఒకటికి పదిమందిని పెళ్లిళ్లు చేసుకుని వందలకొద్ది పిల్లల్ని కలిగిన రాజుల కాలంలో రాముడు సీతకు మాత్రమే జీవితంలో చోటిచ్చాడు. శివదనస్సును విరిచి మరీ సీతను సొంతం చేసుకున్న ఈ కౌసల్యా కుమారుడు తన జీవితంలో ఏ ఇతర ఆడదాని వైపు కన్నెత్తి చూడలేదంటే ఆశ్చర్యమేస్తుంది.  రామాయణం!! భారతీయ సాహిత్య చరిత్రలో ఇదొక అద్భుత గ్రంధం. ఇరవై నాలుగు వేల శ్లోకాలతో కూడిన ఈ రామాయణం ఏడు కాండలతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నతనం నుండి పిల్లలకు రామాయణాన్ని చెబుతూ ఉండటం వల్ల పిల్లల్లో గొప్ప వ్యక్తిత్వం అలవడుతుందని అంటారు. ఇదే నిజం కూడా.  ఇంకా ఇందులో రాముడు మాత్రమే కాకుండా సీత, లక్ష్మణుడు, రాముడి ప్రయాణంలో ఎదురయ్యే ఎందరో గొప్ప వ్యక్తిత్వాలుగా మనకు కనబడతారు.  హనుమంతుడు, జటాయువు, విభీషణుడు, సుగ్రీవుడు, వానర సైన్యం. ఇలా ఎంతోమంది గొప్పవాళ్ళు రామాయణంలో ఉంటారు.  వీళ్ళు మాత్రమే కాకుండా గుహుడు, శబరి లాంటి గొప్ప రామభక్తులు కూడా కనిపిస్తారు. అందుకే రామాయణం అంత గోపోయా గ్రంథమయ్యింది. కాలంతో పాటు నిలిచే ఉంది. దీని మీద ఎన్ని విమర్శలు వచ్చినా సరే!! అవన్నీ పనిగట్టుకుని పుడుతున్నవి కాబట్టి ఈ రామాయణం ఆ రామ నామం ధర్మబద్ధమైన జీవితం మనిషి మనుగడ ఉన్నంతవరకు ఉంటాయి. రామనామం!! రాముడు గొప్పవాడా రామ నామం గొప్పదా అంటే రామ నామమే గొప్పది అంటారు. ఒక్కసారి రమానామాన్ని జపిస్తే వెయ్యిసార్లు ఇతర దేవుళ్లను జపించినట్టని సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. వారధి కడుతున్న వానరసైన్యం ప్రతి రాయి మీద రామా అని రాసి సముద్రంలో వేస్తే అవి తేలుతున్నాయి. కానీ స్వయంగా రాముడే వాటిని సముద్రంలో వేస్తే అవి మునిగిపోయాయి. దీనిని బట్టి రాముడి కంటే రామ నామమే ఎంతో గొప్పది అని అర్థమవుతుంది. త్యాగరాజు అంటాడు  నిధి చాల సుఖమా రాముని స న్నిధి సేవ సుఖమా నిజముగ బల్కు మనసా అని రామదాసు అంటాడు ఓ రామ నీనామ శ్రీరామ నీనామ మేమి రుచిరా అని ఎన్ని రకాలుగా చూసినా రాముడి వంటి పురుషుడు, రామ నామమంత సులువైన శక్తివంతమైన అద్భుత మార్గం మరొకటి ఉండదు అని నిక్కచ్చిగా చెప్పచ్చు. ఈ శ్రీరామ నవమి నాడు ఆ రామచంద్రుడిని పలుకే బంగారయాయేనా కోదండపాణి అంటూ లాలనగా ప్రార్థిస్తూ పునీతులవుదాం. ఇంకా గుడిలో వడపప్పు, పానకం వేసవిలో కమ్మగా తినేసొద్దాం.  ◆వెంకటేష్ పువ్వాడ.                           

అహల్య వృత్తాంతం మనకు తెలియజేసే నీతి ఏమిటి?

ఒక సాధారణ స్త్రీగా జీవించి ఉంటే ఏనాడో కాలగతిలో ఆమెను మరచిపోయి ఉండేవాళ్ళం ఏమో... కానీ విధివైపరీత్యం ఆమెను పతివ్రతా శిరోమణిగా చేసింది. ఆమె గౌతమ మహర్షి భార్య అయిన అహల్య, ఒక సన్న్యాసికీ, మహర్షికి మధ్య తేడా ఉంది. సన్న్యాసి అంటే గృహసంబంధమైన బాంధవ్యాలు ఉండవు. అన్నింటినీ పరిత్యజిస్తారు. ఋషికి కుటుంబం ఉంటుంది కాని నగరంలో జీవించరు. సమాజానికి దూరంగా జీవిస్తూ ఆధ్యాత్మిక చింతనతో పరమాత్మను తెలుసుకోవడంలో మునిగి ఉంటారు. శిష్యులకి విద్యను బోధిస్తూ తమ జీవనాన్ని సాగిస్తారు. పూర్వం విద్యార్థులు గురువు దగ్గర ఉండి వారితో కలిసి జీవిస్తూ, క్రమశిక్షణతో విద్య నేర్చుకుని విద్యాభ్యాసం పూర్తయ్యాక తిరిగి సమాజంలోకి అడుగు పెట్టేవారు. ఈ విధంగానే గౌతమ మహర్షి కూడా తన భార్యతో కలిసి అడవిలో జీవించేవాడు. అహల్య అంకితభావంతో భర్తకి సేవ చేసేది. అయితే ఆమె ప్రమేయం లేకుండానే అహల్య జీవితంలో ఒక అపశృతి దొర్లింది. తప్పులు అందరూ చేస్తూనే ఉంటారు కాని, ఆ రోజుల్లో చిన్న తప్పుకి కూడా పెద్ద శిక్షలు ఉండేవి. అహల్య తెలిసి చెయ్యకపోయినా జరిగిన తప్పుకి ఆమె బాధ్యురాలయింది. నైతిక విలువలకు ప్రాధాన్యతనిచ్చే గౌతముడు అహల్య తనని మోసం చేసిందనుకుని భ్రమపడి కోపంతో మండిపడ్డాడు. ఒక్క క్షణం ఓర్పు వహించి ఉంటే తన భార్య తప్పిదం ఏమిటో ఆయనకి అర్థమై ఉండేది. కాని తొందరపాటుతో వెంటనే శపించాడు. గౌతమ మహర్షి అహల్యని పాషాణంగా మారమని శపించాడు. అహల్య తన దురదృష్టానికి చింతించక శిక్షను ఆహ్వానించింది. చిన్ననాటినుండి ఓర్పుకి మొదటి ఉదాహరణ భూదేవే అని తెలుసుకుంది. అందువలన తెలియక జరిగినా తన పొరపాటు ఉంది కనుక అందుకు శిక్ష అనుభవించడానికి ఆమె సిద్ధపడింది. కోపం శాంతించిన తరువాత గౌతముడికి తన భార్య వల్ల జరిగిన తప్పు అంత పెద్దదేమీ కాదని తెలుసుకున్నాడు. అయినా తను వేసిన శిక్ష పెద్దది అనుకుని పశ్చాత్తాప పడ్డాడు. అయితే ఇచ్చిన శాపాన్ని ఆమె అనుభవించక తప్పదు కదా! గౌతముడు భార్యతో "మనం చేసిన దుష్కర్మలకు ప్రతిఫలం స్వీకరించాలి. పూర్వ జన్మ కర్మ ఫలితంగా భావించి నీవు సహనంతో అనుభవించాల్సిందే! నీవు త్వరలోనే రక్షించబడతావు, శ్రీరామచంద్రుడు ఇటుగా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు అతడి పాదస్పర్శ ద్వారా నీకు శాపవిమోచనం కలుగుతుంది. ఒక ఆదర్శ వనితగా నువ్వు చరిత్రలో గొప్ప ఉదాహరణగా నిలిచిపోతావు" అని ఓదార్చాడు. అహల్య తనకు వచ్చిన ఆపదను అనుభవించడానికి సిద్ధపడింది. ఉలిదెబ్బలు తగలనిదే శిల్పం తయారు కాదు. కష్టం లేనిదే ఘనకార్యాలు సాధించబడవు. జీవితంలో రాయిగా బ్రతకటం కంటే దురదృష్టకరమైన సంఘటన మరొకటి ఉండదేమో! అహల్య ఇప్పుడు ఈ విపత్తునే ఎదుర్కొంటోంది. కానీ ఈ ఆపదను ఒక అవకాశంగా మలుచుకుంది. ఏ మాత్రం కలత చెందక, నిరాశా నిస్పృహలకు గురికాకుండా, తన సమయాన్నంతా భగవత్ ప్రార్ధనలో గడపసాగింది. ఎవ్వరూ వినాశనాన్ని పొందరని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే జరిగినదానికి కోపంగాని, బాధగాని ఆమెకి లేవు. తనకి కలిగిన పరిస్థితికి తలవంచి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ గడుపుతోంది. కర్మఫలాన్ని అనుభవించేటప్పుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మంచి పనులు చేస్తూపోతే కష్టాలు అనుభవిస్తున్నామనే ఆలోచన కలగదు.  విధిని ఎవరూ ఎదిరించలేరు. వేదాంతం మనకు ఈ విధంగా బోధిస్తుంది, దుర్భర పరిస్థితులు ఎల్లకాలం ఉండవు. ఏదో ఒకనాడు అవి తొలగిపోగలవు. పాపాలు తప్పిదాల నుండే ఉద్భవిస్తాయి. గతంలో విషబీజాలు నాటి ఉంటే దాని ఫలితం వచ్చే తీరుతుంది కదా! అయితే ప్రారబ్ధం అనుభవించడం ద్వారా గత కర్మల బీజాలను నాశనం చేయవచ్చు, ఆగామి కర్మలను మొలకెత్తనివ్వని రీతిగా మలుచుకోవచ్చును. లేదా మంచి విత్తనాలను నాటడం ద్వారా చక్కటి ఫలితాలను పొందవచ్చును. ప్రారబ్ధం అనేది బంగారానికి సానపెట్టడం వంటిది. గత కాలపు చేదు అనుభవాలను గుర్తుపెట్టుకుని, వర్తమానంలో గరిక పోచలను కాకుండా మధుర ఫలాలను ఇచ్చే మేలురకపు విత్తనాలను నాటాలి!  నిష్కామసేవ చేస్తూ మంచితనాన్ని కలిగి ఉండాలి. వ్యతిరేకపు ఆలోచనలను రానివ్వక మంచి భావాలను కలిగి ఉండాలి. గతం ఎంతటి చేదుదైనా, భవిష్యత్తుని రూపొందించుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఇది అహల్య వృత్తాంతం మనకు చెప్పకనే చెబుతుంది.                                     ◆నిశ్శబ్ద.

కష్టసమయాల్లో పాటించాల్సిన ఐదు నియమాలు ఇవే!

కొందరు సమస్యలకు అంతగా టెన్షన్ పడరు. తేలికగా తీసుకుని పరిష్కరించుకుంటారు. కొందరైతే భయాందోళనకు గురవుతారు. ప్రతివ్యక్తి జీవితంలో ఏదొక సమయంలో కష్టాలను ఎదుర్కొవల్సి ఉంటుంది. అలాంటి సమయాల్లో ప్రతి వ్యక్తి కూడా తనదైన శైలిలో సమస్యలను పరిష్కరించుకునేందుకు సిద్ధమవుతాడు. కష్టాలను ఎదుర్కొనలేక తమను తాము అసమర్థులుగా భావిస్తుంటారు. అలాంటివారు ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ 5 విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించుకోవాలి: ఏవ్యక్తినైనా సంక్షోభాలు చుట్టుముట్టినప్పుడు..అతను పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించుకోవాలి. ఎందుకంటే మీరు సంక్షోభం నుంచి బయటపడేందుకు సిద్ధంగా ఉన్న వ్యూహాన్ని కలిగి ఉన్నట్లయితే..ఆ సమస్య నుంచి తేలికగా బయటపడతారు. ముందుగానే సిద్ధంగా ఉండాలి: ఆచార్య చాణక్యుడు తెలిపిన ప్రకారం..ఒక వ్యక్తికి కష్టాలు వచ్చినప్పుడు అతను చాలా జాగ్రత్తగా ఉండాలి. కష్టాలు చుట్టిముట్టినప్పుడు ఎన్నో సవాళ్లను ఎదుర్కొవల్సి వస్తుందని ముందే ఊహించాలి. అందుకు తగ్గట్లుగానే సిద్ధపడాలి. సమస్య నుంచి పారిపోవడం కంటేనూ దానిని ఎదుర్కొనేలా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. ఓపిక పట్టాలి: చాణక్య విధానం ప్రకారం...ఒక వ్యక్తి తన ప్రతికూల పరిస్థితుల్లో ఎప్పుడూ సహనంకోల్పోకూడదు. ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉండాలి. మరీ ముఖ్యంగా పరిస్థితి ఏమైనప్పటికీ ఆ సమయంలో సహనం కోల్పోకూడదు. మీకు మంచి రోజులు వచ్చేంత వరకు ప్రశాంతంగా వేచి ఉండాలి. కుటుంబ సభ్యులతో బాధ్యతగా: చాణక్య నీతి ప్రకారం, సంక్షోభ సమయాల్లో కుటుంబం పట్ల బాధ్యతను నెరవేర్చడం కూడా వ్యక్తి మొదటి కర్తవ్యం. కుటుంబ సభ్యులను సంక్షోభం నుంచి బయటపడేసేందుకు చర్యలు తీసుకోవాలి. డబ్బు ఆదా చేయాలి: ఎప్పుడూ డబ్బు ఆదా చేయాలి. ఆపద సమయాల్లో డబ్బు మిమ్మల్ని ఆదుకుంటుంది. సమస్యల్లో చిక్కుకున్నప్పుడు డబ్బు లేనట్లయితే ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది.  

పిల్లల కారణంగా తల్లిదండ్రులలో కోపమా? ప్రశాంతంగా ఎలా ఉండొచ్చంటే...

  ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే అదొక సందడి అంటారంతా.. కానీ ఆ పిల్లల అల్లరిని భరిస్తూ వారిని ఓ కంట కనిపెట్టుకుని ఉండే  తల్లిదండ్రులకు మాత్రం అదొక పెద్ద టాస్క్ లాగే అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా  రెండేళ్లు పైబడిన పిల్లలు అయితే అల్లరి విషయంలో మరీ దారుణంగా ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ బొమ్మలు గీయడం, ఇల్లంతా చిందరవందర చేయడం, నీళ్లు పారబోయడం, వస్తువులు విరగ్గొట్టడం చేస్తుంటారు. ఇవన్నీ చూస్తూ చాలామటుకు తల్లులు పిల్లల మీద అరిచేస్తుంటారు. కోపంతో రెండు దెబ్బలు కూడా వేస్తారు. ఆ తరువాత తమ పిల్లల్ని కొట్టినందుకు, తిట్టినందుకు బాధపడతారు కూడా. అయితే తల్లులు పిల్లల మీద అరవడానికి, కొట్టడానికి బదులు పిల్లలు అల్లరి చేసినా ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. విశ్రాంతి.. విశ్రాంతి లేకపోవడం తొందరగా కోపం రావడానికి  కారణమవుతుంది.  పూర్తి లేదా తగినంత విశ్రాంతి తీసుకోకపోతే ప్రతి చిన్న,  పెద్ద విషయానికి చిరాకుగా  కోపంగా ఫీలైపోతారు. అందుకే ఒక్కోసారి మీ కోసం సమయాన్ని వెచ్చించాలి.  ఇష్టమైన ఆహారం లేదా ఏదైనా తినడం,  త్రాగడం మొదలైనవి మనస్పూర్తిగా చెయ్యాలి. కాసింత వాకింగ్ చేయడం లేదా రిలాక్స్ గా పడుకవడం చేయాలి.  వీపును నిటారుగా ఉంచి దీర్ఘంగా శ్వాస తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అర్థం చేసుకోవాలి.. అకస్మాత్తుగా  విరిగిన పాత్రతో పిల్లవాడు ప్రత్యక్షం అవ్వగానే మొదట చాలమందికి కోపమే వస్తుంది. వెంటనే గట్టిగా అరిచేస్తారు కూడా. అయితే పిల్లాడిపై కోపం తెచ్చుకునే ముందు పిల్లాడు చెప్పేది వినాలి.  అసలు వస్తువు కానీ వేరే ఇతరం ఏదైనా కానీ ఎలా పోయింది, ఎలా పగిలిపోయింది అనేది మొదట తెలుసుకోవాలి.  అది పిల్లాడే పగలగొట్టాడు అనే విషయం స్పష్టంగా తెలియకుండా పిల్లాడి మీద కోప్పడటం మాత్రం కరెక్ట్ కాదు. అరవకండి.. చాలా సార్లు పిల్లలు  ఏదైనా పనిని చెప్తే దాన్ని సరిగ్గా చేయరు. లేదంటే  చెప్పిన పనిని చెడగొడుతుంటారు. దీనివల్ల  తల్లికి పిల్లాడి మీద చెప్పలేనంత కోపం వస్తుంది.  తల్లి తన కోపాన్ని పిల్లలపై అరుస్తూ వెళ్లగక్కుతుంది. కానీ అరవడం కాకుండా, పిల్లవాడు చేసిన తప్పుపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించాలి.  పిల్లవాడు తనకు తెలియకుండా కూడా తప్పు చేయవచ్చు కదా.. కోపం పరిణామాలు.. చాలా సార్లు తల్లి కోపం పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఒక పిల్లవాడు ఎక్కడికో స్నేహితుడి పార్టీకి వెళ్ళడానికి ఆనందంగా సిద్ధమవుతున్నాడు కానీ ఆలస్యం అవుతోంది అనుకుందాం. తల్లి కోపం,  అరుపుల కారణంగా  పిల్లల రోజంతా చెడిపోవచ్చు. అందుకే ముందు కోపం కారణంగా  వచ్చే పరిణామాల గురించి ఆలోచించండి.                                           *నిశ్శబ్ద.

భర్త ప్రతి రాత్రి ఇంటర్నెట్ లో ఈ పని చేస్తున్నాడా...భార్యలు అలెర్ట్ కావాల్సిందే!

స్మార్ట్‌ఫోన్‌లు,  ఇంటర్నెట్‌లు అనే ఈ రెండు  జీవితంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి సంబంధ స్వభావం మారిపోయింది. మనుషులు ఎదురెదురుగా ఉన్నప్పటికీ   ఎదురుగా ఉన్న మనుషుల మీద కాకుండా  మొబైల్ ఫోన్‌లలో బిజీగా ఉండటానికే ఇష్టపడతారు చాలామంది. మరీ ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఇలాంటివి జరిగితే వారి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతుంది.  ఇది ఇద్దరి మధ్య దూరం పెరిగేలా చేస్తుంది. అయితే భర్త ఇంటర్నెట్ లో ఏ విషయాలు సెర్చ్ చేస్తున్నాడు? అనే విషయం మీద భార్యలు ఎంత అలెర్ట్ గా ఉండాలనే విషయం ఆధారపడి ఉంటుంది. మరీ ముఖ్యంగా చాలామంది మగవాళ్లు రాత్రి పూట  మొబైల్ లో ఆడవాళ్ల ప్రోఫైల్ లు, వారి ఫొటోలు చూడటానికి చాలా  ఆసక్తి చూపిస్తుంటారు. ఇంతకీ ఈ అలవాటు ఎందుకంత మంచిది కాదు.. ఈ అలవాటును భార్యలు ఎలా ఎదుర్కోవాలి?  తెలుసుకుంటే.. ఇతర మహిళల ప్రోఫైల్ లు..   చాలామంది భర్తలు రాత్రి సమయంలో భార్య పనులు చేసుకుంటున్నప్పుడో, భార్య పడుకున్న తర్వాతో ఇంటర్నెట్ లో ఇతర మహిళల ప్రొఫైల్ లు సెర్చ్ చేసి, వారి ఫొటోలు చూస్తుంటారు. సాధారణంగా కొంతమంది మహిళలు ఫేవరెట్ హీరోయిన్ లేదా సెలెబ్రిటీ ఫొటోస్ చూస్తున్నాడు ఏం అవుతుందిలే అని కాంప్రమైజ్ అయిపోతారు. కానీ ఇది అక్కడితో ఆగకుండా ఇతర మహిళల వరకు వెళితే మాత్రం ఆడవాళ్లు అలెర్ట్ కావాల్సిందే. దీని కారణంగా భర్తలు భార్యలను బాడీ షేమింగ్ చేయడం, ఇతర మహిళల అందంతో భార్యలను పోల్చడం వంటి ఎన్నింటికో దారితీస్తుంది. అభ్యంతరం.. భర్తలు ఇలా ఇతర మహిళల ప్రొఫైల్స్ సెర్చ్ చేస్తుంటే.. భార్యలు ఆభ్యంతరం చెప్పాలి. నా భర్త పరాయి మహిళల ఫొటోలు చూస్తున్నాడు అని మనసులో ఫీలవ్వడం కంటే నేరుగా భర్తతో అలా చూడద్దని చెప్పడం మంచిది. అలా చెప్పిన తరువాత వారు అదే పని కంటిన్యూ చేస్తుంటే సింపుల్ వారితో మాట్లాడటం తగ్గిస్తే సరి..  వారు నెట్ లో ఇతర మహిళల ఫొటోలు చూడాలని అనుకున్నప్పుడల్లా తాము తప్పు పని చేస్తున్నామేమో అనే ఫీలింగ్ వారికే కలుగుతుంది. క్రమంగా ఆ అలవాటు కూడా తగ్గుతుంది. తప్పు ఎక్కడుందంటే.. చాలా వరకు మగాళ్లు ఇతర మహిళల పట్ల, ఇతర మహిళల ఫ్రొఫైల్స్, ఫోటోస్ చూడటం పట్ల ఆసక్తి కనబరుస్తున్నారంటే దానికి పెద్ద కారణం వారికి భార్య నుండి అసంతృప్తి ఎదురవుతున్నట్టు. చాలా వరకు భార్యలు ఇంటి పని, ఉద్యోగాల కారణంగా తమ పట్ల తాము చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ మహిళలు తమ పట్ల తాము కేర్ గా ఉంటూ, అందంగా ముస్తాబవుతుంటే భర్త కూడా ఇతర మహిళల వైపు కన్నెత్తి చూడడు. కాబట్టి భర్తలను మార్చుకునే మార్గం భార్యల చేతుల్లోనే ఉంది.                                                 *నిశ్శబ్ద.

మన ఉగాది!!

నిజమే ఉగాది పండుగ మనదే. తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది తోనే ప్రారంభమవుతుంది.  మన కొత్త సంవత్సరం అంతా ఎంతో కళను నింపుకుని ఉంటుంది. సాంప్రదాయంగా ఉంటుంది. ముఖ్యంగా కృత్రిమత్వంలో పడిపోతున్న మనిషిని బయటకు తీసుకొచ్చి కాసింత ప్రకృతి మధ్య నిలబెడుతుంది. ఇంతకూ మన ఉగాది మనకు మాత్రమే తెలుసా!! మనకు తెలిసిన ఉగాది ఏంటి?? మనం రేపటి తరానికి ఉగాది గురించి చెబుతున్నది ఏంటి??  ఉగాది వెనుక కథ!! సోమకుడు అనేవాడు వేదాలను హరించాడు(దొంగిలించాడు). అలా వేదాలను దొంగిలించిన సోమకుడిని  మత్స్యవతారంలో ఉన్న  విష్ణువు వధించి(సంహరించి, చంపి) వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభదినంను పురస్కరించుకుని విష్ణువు ప్రీత్యర్ధం 'ఉగాది' ఆచరణలోకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.  అయితే చైత్రశుక్లపాడ్యమినాడు ఈ విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కాబట్టి, సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుతుందని కూడా చెప్పబడుతుంది. శాలివాహన చక్రవర్తి చైత్రశుక్లపాడ్యమినాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా మారిన కారణంతో ఆ యోధుడిని స్మరించుకుంటూ ఉగాది జరుపుకుంటారని చారిత్రక వృత్తాంతం. ఇలా కారణాలు ఎన్ని ఉన్నా ఉగాది అనేది ఓ కొత్తదనానికి సూచిక.  ఆశను మొలిపించే తరుణం!! మనిషి తరతరాలుగా ఓ నమ్మకంతో ఉన్నాడు. అదే కొత్తదనంలో జీవితం కొత్తగా మారుతుందని. అది చాలా మంచి ఆశావహదృక్పథం కలిగి ఉంటుంది. ఆకురాల్చు కాలంలో చెట్ల ఆకులు అన్నీ పోయాక, మోడువారి ఏమీలేనితనంతో ఉన్నప్పుడు, వసంతం వస్తుంది, మెల్లిగా చివురులు తొడుగుతాయి చెట్లు. అవన్నీ పచ్చని ఆశల చివురులు, ఉగాదిలో దాగున్నది అదే అంటారు అందరూ. షడ్రుచులు-జీవితసారం!! ఉగాది రోజు అందరి ఇళ్లలో ఉండే ప్రత్యేక విందు ఉగాది పచ్చడి. నిజానికి జీవితమంతా ఆ పచ్చడిలోనే ఉందని చెబుతారు పెద్దలు. కష్టాలు, సుఖాలు, బాధలు, ఇబ్బందులు, ప్రేమలు, పొట్లాటలు ఇలా అన్నీ ఉగాది పచ్చడిలో ఉండే ఆరు రుచులలో కలిసిపోయి ఉంటాయని చెబుతారు. అందుకే ఉగాది రోజు ఉగాది పచ్చడికి నత ప్రత్యేకత వచ్చి పడింది. అలాగే మరొక విషయం కూడా. ఉగాది సమయంలోనే కొత్త బెల్లం దొరుకుతుంది, మామిడికాయల గురించి ప్రత్యేకంగా చెప్పాలా?? ఈ సమయానికి కాస్త చిన్న చిన్నగా ఉన్న వగరుతో ఉన్న కాయలు వస్తాయి. ఇంకా ఎంతో గొప్ప ఔషధ మూలాలు కలిగిన వేపచెట్లకు పువ్వులు పూస్తాయి, కొత్త చింతపండు ఎర్రెర్రగా నిగానిగలాడుతూ అందరి ముందుకూ వస్తుంది.  వీటన్నింటి కలయిక అయిన వేపపచ్చడి ఆరు రుచులతో కనువిందు చేస్తుంది. సంప్రదాయపు గీతిక!! ఉగాది రోజు మగవాళ్ళు అందరూ పంచెకట్టులోనూ, ఆడవాళ్లు పట్టుచీరల్లోనూ, పిల్లలు కొత్త బట్టల్లోనూ మెరిసిపోతూ ఉంటారు. ఆ వస్త్రధారణలో అసలైన తెలుగుదనం ఉట్టిపడుతూ ఉంటుంది. నగరాలలో కృత్రిమత్వంలో మునిగిపోయిన యువత ఎంతో అందంగా, పద్దతిగా, బుద్దిగా ఇలా తయారైతే ఇంటిల్లిపాదికీ ఎంత సంతోషమో!! ఇంకా పంచాంగ శ్రవణం మరొక వేడుక, పిండి వంటల సంబరం మరొక ఎత్తు. ఇలా అన్ని విధాలుగా ఉగాది మనిషి జీవితంతో ముడిపడి ఉంటుంది. మనిషి జీవితానికి అసలైన నిర్వచనాన్ని ఉగాది చెబుతుంది. అభివృద్ధి వేగంలో మనిషి మర్చిపోతున్న అసలైన నడవడికను మన ఉగాది మనకు తిరిగి అందిస్తుంది. అందుకే ఇది మన తెలుగుసంవత్సరం అని గొప్పగా జరుపుకోవాలి.                                    ◆ వెంకటేష్ పువ్వాడ.

స్వేచ్ఛ మనిషి మీద చూపే ప్రభావం ఎలా ఉంటుంది?

ప్రతి మనిషి తన జీవితంలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చేది గట్టిగా మాట్లాడేది స్వేచ్ఛ గురించే.. ఒకప్పుడు స్వేచ్ఛ లేని జీవితాలు చాలా ఉండటం వల్ల స్వేచ్ఛ స్ఫహించుకోవడం లక్ష్యమని, అది హక్కు అని సమాజంలో పౌరులు గట్టిగా నిర్ణయించుకున్నారు. అయితే..  స్వే చ్ఛకు సంబంధించి పలువురిలో ముఖ్యంగా నేటి యువతరంలో చాలా దురభిప్రాయలు వున్నాయి. స్వేచ్ఛకు వారు ఇచ్చుకునే నిర్వచనాలు పూర్తిగా వేరుగా ఉంటున్నాయి. కేవలం డబ్బు ఉండటాన్ని, భౌతికంగా నచ్చినట్టు జీవించడాన్ని, ముఖ్యంగా విచ్చలవిడితనాన్ని మాత్రమే స్వేచ్ఛగా భావించే  పరిస్థితి ప్రస్తుత సమాజంలో నెలకొని వుంది.  ఈ కంజ్యూమరిస్ట్ ధోరణి తాలూకు స్వేచ్ఛ వాస్తవానికి మనిషిని మానసికంగా ఎదగనీయదు. ఇదంతా కేవలం పైకి కనిపించే ఆడంబరం మాత్రమే. ఇలా ఉండటం వల్ల మనిషిలో కలిగే మార్పులు ఏమీ లేకపోగా ఇంకా వ్యక్తిత్వ పరంగా దిగజారిపోతాడు.  తమ అస్థిత్వంలో భద్రతా రాహిత్యానికి లోనయ్యే వ్యక్తులు, తమ చుట్టూ సిరి సంపదలను, వస్తు సముదాయాన్ని పోగు చేసుకోవటం ద్వారా ఈ అభద్రతా భావాన్ని అధిగమించాలని చూస్తున్నారు. అయితే ఈ పోటీ ప్రపంచంలో శృతిమించిన భౌతిక సంపదలను సంపాదించడం. వాటి వల్ల సుకెబాన్ని పొందాలనే తాపత్రయం మనిషిని విముక్తి చేయలేదు.  కాలంతో పాటు ఈ సంపాదన… సుఖాల దారులు క్రమంగా మరొకరితో పోల్చుకుంటూ పెరుగుతూ ఉంటాయే తప్ప తృప్తితో ఆగిపోయేవి కాదు. ఇలా పోటీగా ఇతరులతో పోల్చుకునే మనస్థత్వం వ్యక్తిని మరింత అభద్రతా భావానికి గురిచేస్తుంది. ఇది వ్యక్తిగత స్వేచ్ఛ తాలూకు నిజమయిన సారం యొక్క వక్రీకరణ. దీనికి ఒక ఉదాహరణ చెప్పవచ్చు.  ఇద్దరు స్నేహితులు ట్రెక్కింగుకు వెళ్లి ఒక కారడవిలో చిక్కుకు పోయారు. ఆ అడవి నుంచి ఎలా బయటపడాలో తెలియని పరిస్థితిలో వారు ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో వీరిలో ఒకరు తాను స్వేచ్ఛా మానవుడినని, తన యిష్టమైన రీతిగా అడవినుంచి బయటపడే మార్గాన్ని ఎంచుకోగలనని భావించాడు. కాగా రెండో వ్యక్తి ప్రకృతిలో కొన్ని నియమ నిబంధనలు సూత్రాలు వున్నాయని భావించి ఆ అడవినుంచి బయట పడేందుకు సూర్యచంద్రుల స్థానాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని అనుకొన్నాడు. అంటే అతను ప్రకృతి నియమాలకు లోబడి తన మార్గాన్ని ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకొన్నాడు.  ఇద్దరిలో ఎవరు ఖచ్చితంగా అడవినుంచి బయట పడేందుకు ఎక్కువ అవకాశాలున్నాయో మనం వేరే ఆలోచించనవసరం లేదు. ప్రకృతి నియమాలకు లోబడి ప్రవర్తించిన వ్యక్తికే ఆ కారడవినుంచి సజీవంగా బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉదాహరణ మనం ప్రజల మధ్య నివసిస్తున్న తీరుకు కూడా వర్తిస్తుంది. మన నాగరిక సమాజంలో విజయవంతంగా జీవితంలో ముందుకు దూసుకు వెళ్ళాలంటే, ఈ సమాజానికి కూడా కొన్ని నియమనిబంధనలు, సూత్రాలు వర్తిస్తాయని గుర్తించిన వారికే అది సాధ్యమవుతుంది. అలా కాకుండా వ్యక్తిగత స్వేచ్ఛ భ్రమలో విశృంఖలంగా ప్రవర్తించే వ్యక్తి స్వేచ్ఛారహితుడిగానూ, చివరకు వైఫల్యం చెందే వాడిగానే మిగిలిపోతాడు.                                          ◆నిశ్శబ్ద.

సుధామూర్తి గారి సలహా.. పిల్లల్ని ఇలా పెంచితే డాక్టర్లు, ఐఏఎస్ లు కావడం ఖాయమట!

ఇంజనీర్, సామాజిక కార్యకర్త,  రచయిత సుధా మూర్తి పిల్లల కోసం కథలు వ్రాస్తారు. ఆమె మానవతావాద సమస్యల గురించి,  సామాజిక సమస్యలపై  మాట్లాడటంలోనూ ఎప్పుడూ ముందుంటారు.  భారతదేశంలో విద్య, గ్రామాల అభివృద్ధి,  మహిళల అభ్యున్నతిలో ఆమె చాలా దోహదపడింది. ఆమె  జీవితమంతా ఒక ప్రేరణ కంటే తక్కువ కాదు. ఆమె జీవితంలో వివిధ సందర్భాలలో పేర్కొన్న ఎన్నో స్పూర్తిదాయక విషయాలు పిల్లలను ముందుకు సాగడానికి ప్రేరేపిస్తాయి. మీ పిల్లలు ఆత్మవిశ్వాసం,  ధైర్యం కోల్పోకూడదని తల్లిదండ్రులుగా మీరు కోరుకుంటే, సుధా మూర్తి చెప్పిన స్పూర్తిదాయకమైన విషయాలను తప్పక పిల్లలకు చెప్పాలి. ఇవి చెబితే ఏ పిల్లవాడు అయినా ఆత్మవిశ్వాసాన్ని పోగుచేసుకుంటాడు. జీవితంలో గొప్ప విజయాలు సాధిస్తాడు. ఐఏఎస్, డాక్టర్ లాంటివి కూడా వారికి చిన్న లక్ష్యాలుగా అనిపిస్తాయి.  కలలను ఎప్పటికీ వదులుకోవద్దు.. జీవితంలో  కలలను ఎప్పటికీ వదులుకోకూడదని సుధా మూర్తి అన్నారు. మొదలుపెట్టిన పని ఎంత కష్టమైనా పూర్తి చేయాలి. కష్టపడి పనిచేయడం వల్ల కలలు నెరవేరుతాయి. పిల్లలు దీన్ని అర్థం చేసుకుంటే వారు చిన్న వైఫల్యాలకు భయపడటం మానేస్తారు. ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి.. జీవితంలో నేర్చుకోవడం ఏ సందర్భంలోనూ  ఆపకూడదని సుధా మూర్తి అన్నారు. ప్రపంచంలోకి ఎప్పుడూ కొత్త విషయాలు వస్తూనే ఉంటాయి.  సాంకేతికతతో ఎంత చురుగ్గా, ఎంత అవగాహనతో  ఉంటే, జీవితంలో  ముందుకు వెళ్లడం అంత సులభం అవుతుంది. నేర్చుకోవడం మెదడు అప్రమత్తంగా ఉండటానికి సహాయపడుతుంది. అపజయానికి భయపడవద్దు.. సుధా మూర్తి చెప్పిన మాటల ప్రకారం  అపజయానికి భయపడకూడదు.  వైఫల్యాల నుండి నేర్చుకుని మళ్లీ ప్రయత్నించాలి. విజయానికి మార్గంలో వైఫల్యం తప్పనిసరి. పిల్లలు వారి వైఫల్యం నుండి నేర్చుకుంటే వారు జీవితంలో ముందుకు సాగకుండా ఎవరూ ఆపలేరు. ఇతరులకు ప్రాముఖ్యత ఇవ్వాలి..  ఎవరి జీవితం  గురించి వారు ఆలోచించడం  సరికాదు.  సమాజంలో జీవిస్తున్నాము కాబట్టి ఇతరుల భావాలను, వారి  అవసరాలను గౌరవించడం ముఖ్యం. తనకే పరిమితమైన మనిషి ఎప్పటికీ ముందుకు వెళ్లలేడు. పిల్లలు చిన్నతనం నుండే ఇతరుల భావాలను గౌరవించడం నేర్చుకోవాలి. పిల్లలు ఈ మూడు విషయాలను అర్థం చేసుకున్నా, పిల్లలకు అర్థమయ్యేలా తల్లిదండ్రులు చెప్పినా.. ఆ పిల్లలు జీవితంలో తప్పకుండా గొప్ప స్థాయికి ఎదుగుతారు.                                             *నిశ్శబ్ద.

ఆత్మవిశ్వాసానికి ఎంతటి శక్తి ఉంటుందంటే.. ఈ కథనమే గొప్ప ఉదాహరణ!

ఆత్మవిశ్వాసంతో కొండను పిండి చేయవచ్చుననడానికి   దశరథ్ మంజీ సజీవ సాక్ష్యం. బీహార్ రాజధాని పాట్నాకు దాదాపు వంద కిలోమీటర్ల దూరాన ఒక గ్రామం ఉంది. దాని పేరు గెహ్లోర్. ఆ గ్రామానికీ, ప్రక్క గ్రామానికీ మధ్య ఒక కొండ అడ్డంగా ఉంది. గెహ్లోర్ ప్రజలు నిత్యావసరాలు కొనుక్కోవాలన్నా, అత్యవసర పరిస్థితుల్లో వైద్యసహాయం పొందాలన్నా ఆ కొండ చుట్టూ తిరిగి, అవతలి గ్రామానికి పోవాలి. అలా వెళ్ళడానికి సుమారు 32 కిలోమీటర్ల దూరం ఉంది. కొండను తొలిస్తే కేవలం మూడు కిలోమీటర్ల దూరం.  మూడు కిలోమీటర్ల దూరానికి అనవసరంగా 32 కిలోమీటర్లు కొండ చుట్టూ తిరిగి వెళ్ళాలి. శ్రమ దండుగ, సమయం వ్యర్థం. అయినా ఆ గ్రామ ప్రజలు అలాగే తంటాలు పడుతున్నారు. ఆ గ్రామంలోని దశరథ్ మంజీ అనే రైతు ఒకనాడు కొండ అవతల పొలంలో సేద్యం చేస్తున్నాడు. అతని భార్య ఫాగుణీదేవి భర్తకు అన్నం తీసుకొని, కుండ నెత్తి మీద పెట్టుకొని కొండ మధ్యలోనున్న చిన్న చరియ గుండా పోతుండగా రాళ్ళు గుచ్చుకొని క్రింద పడింది. అన్నం నేలపాలయింది. ఆమె గాయాల పాలైంది. ఆ గాయాలతోనే ఆమె మృత్యువుకు బలైంది. కలత చెందిన దశరథ్ మంజీ కొండను తొలిస్తే తప్ప గ్రామానికి మేలు జరుగదని మనస్సులో నిర్ణయించుకొన్నాడు. ఊరి ప్రజలనందరినీ సమావేశపరిచి "నేను ఈ కొండను తొలుస్తాను. అవతలికి దారి చేస్తాను” అని ప్రకటించాడు. ఆ ప్రకటన విని జనమంతా నవ్వుకున్నారు. "ఒరేయ్! కొండను తొలుస్తాడట మొనగాడు" అని అపహేళన చేశారు. అయినా దశరథ్ మంజీ వారి మాటలను పెడచెవిన పెట్టి, చేతులతో ఉలి, సుత్తి పట్టాడు. గుండెల్లో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపుకొన్నాడు. ఎవరి సాయం కోసం ఎదురుచూడకుండా తలవంచుకొని, మౌనంగా, గంభీరంగా అడుగులు వేస్తూ కొండను సమీపించాడు. వినమ్రంగా నమస్కరించి కొట్టడం మొదలుపెట్టాడు. రోజులు, నెలలూ కాదు, ఇరవై రెండు సంవత్సరాలు కొండను కొట్టాడు. మూడు కిలోమీటర్ల పొడవు ముప్ఫై అడుగుల వెడల్పుతో దారి చేశాడు. దశరథ్ మంజీ కొండంత ఆత్మ విశ్వాసం ముందు కొండ చిన్నబోయింది. అతని ఆత్మవిశ్వాసం ముందు తలవంచుకుని దాసోహమంది. మంజీ కృషినీ, ఆత్మ విశ్వాసాన్నీ, పట్టుదలనూ చూసి గ్రామ ప్రజలందరూ విస్తుబోయారు. దశరథ్ కొండను తొలిచి తయారు చేసిన మార్గంలో ఇప్పుడు వాహనాలు కూడా వెళ్తున్నాయి. రోడ్డు కూడా వేశారు. అయితే దశరథ్ మంజీ అనితర సాధ్యమైన ఆత్మవిశ్వాసంతో ఈ మహాకార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసినా ఆ దృశ్యాన్ని చూసే అదృష్టం అతని భార్యకు లేదు. మంజీ ఆత్మవిశ్వాసానికి కృతజ్ఞతగా గెహ్లోర్ ప్రజలు తమ గ్రామం పేరును మార్చి, దశరథ్ నగర్ అని పిల్చుకుంటున్నారు.  చిన్న చిన్న సమస్యలకే నీరసించిపోయే వారికి ఆత్మవిశ్వాసంతో కొండను తొలిచిన దశరథ్ మంజీ ఆదర్శనీయుడు.                                               *నిశ్శబ్ద.

ఆధ్యాత్మిక విజయానికి అసలు అర్థం ఇదే..!

ఆధ్యాత్మిక జీవితంలో విజయం సాధించడం గురించి చెప్పుకొనే ముందు అసలు ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలి. భగవత్ దర్శనమే ఆధ్యాత్మిక జీవితమా లేక మానవాతీత శక్తులను సాధించడమా లేక పూజలు, వ్రతాలు, తపస్సు చేసి ప్రాపంచిక జీవితంలో విజయం సాధించడమా? పరమేశ్వరుడి దర్శనమే చాలు అనుకుంటే రావణాసురుడికి ఆ దేవదేవుడు ప్రత్యక్షమయ్యాడు. మన దేశంలో మానవాతీత శక్తులున్నవారు చాలా మందే ఉన్నారు. కొందరు లోహాన్ని బంగారం చెయ్యగలరు, కొందరు గాలిలో ఎగరగలరు, కొందరు ముందు జరగబోయేదాన్ని చెప్పగలరు, మరికొందరు కాయసిద్ధిని సాధించి తమ ఆయుర్దాయాన్ని పొడిగించు కోగలరు. పూజలూ పునస్కారాలూ చేసి సంపద, కీర్తి, అధికారాలను పొందేవారి సంఖ్య చెప్పలేనంత ఉంది. మరి ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటి? పూజలు చెయ్యొచ్చు, భక్తిని పెంపొందించుకోవచ్చు కానీ భగవంతుణ్ణి ఏమీ అడగకూడదు. "భగవంతుడా! నా కోరిక తీర్చు. నాకు అది ఇవ్వు... ఇది ఇవ్వు... నా కోరిక తీరిస్తే నీకు నేను ఏదో చేస్తాను..." అనడం భక్తి కాదు. అది భగవంతుడితో వ్యాపారం. దీనికి ఉదాహరణగా కింద విషయాన్ని చెప్పుకోవచ్చు.  పర్షియాను జయించి, ఉత్తర భారత దేశంలో పురుషోత్తముడనే రాజును ఓడించి, దక్షిణాపథం వైపు దూసుకుని వెళుతున్నాడు అలెగ్జాండర్ చక్రవర్తి. అతని రథానికి ఇరువైపులా శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నారు జనం. అతని ఆధిపత్యాన్ని ఎదిరించలేక తల వంచుతున్నారు. రథంలో పయనిస్తున్న అలెగ్జాండర్ దృష్టి ఒక వ్యక్తి పైన పడింది. అతను తల వంచి నమస్కరించలేదు. అలెగ్జాండర్ వైపు తదేకంగా చూస్తున్నాడు. అది గమనించి వెంటనే ఒక సైనికుడు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి "బతికి ఉండాలంటే తలదించు. లేకపోతే ప్రాణాలతో ఉండవు" అని బెదిరించాడు. అయితే అతను ఆ సైనికుడి మాటలు వినిపించుకోలేదు. ఇది చూసిన అలెగ్జాండర్ తన రథం ఆపి, ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు. “నేనెవరో తెలుసా" అని గర్జించాడు. అతను బదులు చెప్పకుండా అలెగ్జాండర్నే చూడసాగాడు. అలెగ్జాండర్ కోపంగా తన ఖడ్గం తీసి, "తల వంచక పోతే శిరచ్ఛేదన చేస్తాను" అని హెచ్చరించాడు. అయినా ఆ వ్యక్తి నిశ్చలంగా ఉన్నాడు. అలెగ్జాండర్ అతని మీద పట్టరాని కోపంతో తన చేతిలోని కత్తిని ఎత్తాడు. అయినా అతడు చలించలేదు. అలెగ్జాండర్ నిశ్చేష్టుడయ్యాడు. ధైర్యాన్ని కోల్పోయాడు, మానసికంగా దుర్బలుడయ్యాడు. "నీకు మరణమంటే భయం లేదా?” అని అలెగ్జాండర్ అడగగా ఆ వ్యక్తి మందహాసంతో “లేదు" అన్నాడు. తన జీవితంలో ఇప్పటి వరకూ ఇలాంటి వ్యక్తిని ఎదుర్కోలేదని గ్రహించాడు అలెగ్జాండర్. ఎదురులేని వీరుడిగా పేరుగాంచిన అలెగ్జాండర్కు ఆ వ్యక్తిని తాను ఎదిరించలేనని తెలిసింది. “మరణమంటే ఈ వ్యక్తికి భయం లేదెందుకు?" అని మనస్సులో పదే పదే అనుకున్నాడు. "నువ్వెవరు? నీకు మరణమంటే ఎందుకు భయం లేదు?" అని అడిగాడు. ఆ వ్యక్తి "నేను శరీరాన్ని కాదు, బుద్దిని కాదు, మనస్సును కాదు. నాకు చావు, పుట్టుకలు లేవు. లేని చావుకు భయం ఎందుకు? నువ్వు ప్రపంచ సామ్రాట్ వి కావచ్చు కానీ నిన్ను నువ్వు శరీరమని అనుకుంటున్నావు. ఎంత రాజ్యం ఉంటే ఏమిటి, ఏదో ఒక రోజు మరణిస్తావు. అప్పుడు నీకు కావాల్సింది ఆరడుగుల నేల మాత్రమే. ఆఖరికి నువ్వు సాధించేది అదే" అన్నాడు. అప్పుడు అలెగ్జాండర్ 'ఆ వ్యక్తి ఒక మహాయోగి' అని గ్రహించాడు. వెంటనే యుద్ధప్రయత్నాన్ని విరమించుకొని, ప్రణామం చేసి వెనక్కి తిరిగాడు. ఆధ్యాత్మికత అంటే మనోబుద్ధి అహంకారాలను జయించి తాను ఆత్మస్వరూపుడననే జ్ఞానం పొందడమే. ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో అదే 'అసలైన విజయం!'                                            *నిశ్శబ్ద.  

నాలుగు కొవ్వొత్తులు..

అది ఒక చీకటి గది. చీకటంటే అలాంటి ఇలాంటి చీకటి కాదు... చిమ్మ చీకటి. బయట ఉన్న కిటికీలలోంచి కూడా కారు నలుపు రంగు తప్ప మరేమీ కనిపించడం లేదు. అలాంటి గదిలోకి ఓ కుర్రవాడు ప్రవేశించాడు. తడుముకుంటూ తడుముకుంటూ ఓ నాలుగు కొవ్వొత్తులను పోగేసి వెలిగించాడు. కాసేపు ఆ కాంతిలో ఏదో చదువుకున్నాడు. ఇంకాసేపు ఏదో రాసుకున్నాడు. చివరికి అలా చల్లగాలి పీల్చుకుందామని బయటకు వెళ్లిపోయాడు. కుర్రవాడు అలా బయటకి వెళ్లాడో లేదో కొవ్వొత్తులన్నీ మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి. మొదటి కొవ్వొత్తి అంది కదా... ‘నేను శాంతికి ప్రతిరూపాన్ని. నన్ను ఎక్కువసేపు నిలిపి ఉంచడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అందుకే నేను త్వరగా వెళ్లిపోతున్నాను. మరో నిమిషంలో ఆరిపోయేందుకు సిద్ధంగా ఉన్నాను,’ అంటూ భగభగా మండిపోవడం మొదలుపెట్టింది. అన్నట్లుగానే మరో నిమిషంలో ఆరిపోయింది. మొదటి కొవ్వొత్తి అలా ఆరిపోయిందో లేదో, రెండో కొవ్వొత్తి కూడా చిటపటలాడటం మొదలుపెట్టింది. ‘నేను నమ్మకానికి ప్రతిరూపాన్ని. నా అవసరాన్ని ఎవరూ త్వరగా గమనించరు. పైగా శాంతి కూడా లేనిచోట, ఎవరైనా నమ్మకాన్ని ఎలా నిలిపి ఉంచగలరు. అందుకే నేను కూడా ఆరిపోతున్నాను,’ అంటుండగానే వెలుగు తగ్గిపోయి, చివరికి ఆరిపోయింది. రెండో కొవ్వొత్తి ఇలా కొండెక్కిందో లేదో, మూడో కొవ్వొత్తి నసగడం మొదలుపెట్టింది. ‘నేను ప్రేమకు ప్రతిరూపాన్ని. నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం ఎవ్వరూ చేయరు. తమ పక్కనున్న వారితో సైతం ప్రేమగా ఉండేందుకు ఇష్టపడరు. పైగా శాంతి, నమ్మకం లేని చోట నేను మనుగడ సాగించడం చాలా కష్టం. అందుకే నేను కూడా వారి బాటనే అనుసరిస్తాను,’ అంటూ ఏడుస్తూ రెపరెపలాడసాగింది. అలా అటూఇటూ ఊగిసలాడి చివరికి ఆరిపోయింది. నాలుగో కొవ్వొత్తి మాత్రం నిబ్బరంగా అలాగే నిలిచి ఉంది. కాసేపటికి కుర్రవాడు గది లోపలకి రానే వచ్చాడు. తాను వెలిగించిన మూడు కొవ్వొత్తులూ అలా ఆరిపోవడం చూసి అతనికి బాధ కలిగింది. కానీ నాలుగో కొవ్వొత్తి నిబ్బరం చూసి అంతే ఆశ్చర్యం వేసింది.‘మిగతా కొవ్వొత్తులన్నీ ఆరిపోయినా, నువ్వు మాత్రం ఎలా నిలిచి ఉన్నావు?’ అని నాలుగో కొవ్వొత్తిని అడిగాడు కుర్రవాడు. ‘నేను ఆశకు ప్రతిరూపాన్ని! నేను అంత త్వరగా పరాజయాన్ని ఒప్పుకోను. అసలు పరాజయానికి విరుగుడే నేను కదా! విజయం దక్కేదాకా మీరు పోరాడేందుకు నేను అండగా నిలిచి ఉంటాను. ఇక ఈ చీకటి నాకో లెక్కా! పైగా నన్ను ఉపయోగించి మిగతా కొవ్వొత్తులను కూడా వెలిగించేందుకు సాయపడతాను. నేను ఉన్నంతకాలం శాంతి, నమ్మకం, ప్రేమ అనే గుణాలకు లోటు ఉండదు,’ అని చెప్పింది. కుర్రవాడు ఆ కొవ్వొత్తితో మళ్లీ మిగతా మూడు కొవ్వొత్తులనీ వెలిగించాడు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.

తప్పటడుగులలో విజయాలు!

"బుడిబుడి అడుగులు వేసే పిల్లలు ఎన్నో తప్పటడుగులు వేస్తారు. వాటి నుంచేగా సరిగ్గా నడవడం నేర్చుకునేది".- ఇది పెద్దల మాట.  అడుగు ఎలా? పెద్దలంటే పెద్దలు, జీవితంలో అనుభవం సాదించేసి, జీవిత సారాన్ని ఒడిసిపట్టి, తప్పేది, ఒప్పేది అనేది చిటికెలో చెప్పేసేవాళ్లే కాదు, బాల్య దశ దాటి, యౌవనంలో దూకి, గందగరగోళంలో, ఆవేశాల నిర్ణయాల్లో బోల్తా పడుతూ, మళ్ళీ పైకి లేస్తూ మళ్ళీ అదే ఆవేశంలో మళ్ళీ అదే పడటాలు, లేవడాలతో కుస్తీ పడుతూ  చివరకు ఒక అనుభవం అర్థమయ్యి దానికొక అర్థవంతమైన దారి తెలిసి అప్పుడు అటూఇటూ ఊగకుండా, ఎలాంటి భయం లేకుండా ధీమాగా అడుగేసి, ఆ అడుగు తాలూకూ భయాన్ని కడిగేసి విజయమనే సంతకాన్ని చేస్తారు. కానీ పెద్దలు ఏమి చేస్తున్నారు? తప్పటడుగు  పడగానే దాని అనుభవంతో తదుపరి సరైన అడుగు వేస్తారులే అనుకోవాల్సిన పెద్దలు తప్పు చేసేస్తున్నారు అంటే ఆశ్చర్యం వేస్తుంది. నేటి కాలంలో తమ పిల్లలు తప్పు చేస్తే, వాటిని కవర్ చేసి ఆ పిల్లలను సేవ్ చేసే తల్లిదండ్రులే ఎక్కువ కనబడుతున్నారు. ఫలితంగా ఆ పిల్లలకు తప్పు అంటే ఏమిటో పూర్తిగా అర్థమవడం లేదు. దాని మూలంగానే అదేమీ పెద్ద సమస్య కాదుగా అన్నట్టు తయారవుతున్నారు పిల్లలు. పైగా తాము ఏదైనా తప్పు చేస్తే తమ తల్లిదండ్రులు తమను సేవ్ చేస్తారనే ధీమా వాళ్ళను ఇంకా, ఇంకా తప్పులు చేయిస్తోంది. కానీ పెద్దలు మాత్రం వాటిలో పిల్లల పట్ల ప్రేమను, వారిని కాపాడుకోవాలనే తపనను కనబరుస్తారే తప్ప, వాళ్ళ తప్పును తెలియచేసి, వాళ్ళను బాధ్యాతాయుత పౌరులుగా తయారు చేయడం లేదు. పిల్లలకు ఏమి చెప్పాలి? తప్పులు చేయడం సహజం. అందులో అవగాహన లేని ప్రాయంలో తప్పులు చేయడం మరింత ఎక్కువ. అది ఏ విధమైన తప్పు అనేది అనవసరం కానీ తప్పు చేసిన తరువాత ఆ తప్పుకు గల కారణాలు, దాని పర్యావసనాలు, దాని తాలూకూ ఇబ్బందులు, జీవితం మీద దాని ప్రభావం ఇలాంటివన్నీ పిల్లలకు దగ్గరుండి చెప్పాలి. ఎక్కడ తప్పు జరిగింది?? అది ఎందుకు తప్పుగా పరిగణించబడుతోంది?? వంటి విషయాలను వివరించాలి. దానివల్ల పిల్లల్లో విస్తృత జ్ఞానం పెరుగుతుంది. ఏదైనా చేసేముందు దాని గూర్చి అన్ని కోణాలలో ఆలోచించడం అలవడుతుంది. హద్దులు, ముద్దులు! చాలామంది పిల్లలు ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు వారి తల్లిదండ్రులు వెంటనే వద్దు అంటారు.  కానీ వారు చేయాలి అనుకుంటున్న పని ఎందుకు చేయాలని అనుకుంటున్నారు అనే విషయాన్ని వాళ్ళతోనే చెప్పిస్తూ, దాని తాలూకూ ప్రశ్నలు బయటకు తీస్తూ, ఆ ప్రశ్నలకు సమాధానాలు వాళ్ళతోనే చెప్పిస్తూ ఉండటం వల్ల వాళ్లలో ఎలాంటి పనులు చేయాలనే అవగాహన వస్తుంది.  ఏదో పిల్లల మీద ఇష్టం కొద్ది, ప్రేమ ఎక్కువగా ఉండటం వల్ల వారు అడిగింది సమంజసం కాకపోయినా దానికి సరేనని చెప్పే తల్లిదండ్రులు కూడా బోలెడు మంది ఉన్నారు. వాళ్లకు తాత్కాలిక సంతోషం కనబడుతుంది కానీ భవిష్యత్తు గురించి భయం ఉండదు. పైగా బాగా డబ్బున్న వాళ్ళు అయితే ఇంత డబ్బుంది నా పిల్లల భవిష్యత్తుకు ఇంకేం సమస్య అని అనుకుంటారు. కానీ డబ్బు ఎంత పెట్టినా వ్యక్తిత్వం ఉన్నతంగా అభివృద్ధి చెందదు అనే విషయం అర్ధం చేసుకోరు. మార్గదర్శి… తనను ఒక ఉదాహరణగా చెబుతూ కనువిప్పు కలిగించే వారిని మార్గదర్శి అనవచ్చు. ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఇలాగే ఉండాలి. అలాగని సారూప్యత లేని విషయాల్లో కాదు. కొన్ని ఉదాహరణలు, కొన్ని జీవిత అనుభవాలు, కొన్ని ప్రేరణాత్మక సంఘటనలు, కొన్ని కష్టాలు, కొన్ని కన్నీళ్లు జీవితంలో ఉన్నవి అన్ని పిల్లలకు కొన్ని చిన్న సంఘటనలుగానో, కథలుగానో, అనుభవాలుగానో చెబుతూ ఉండాలి. వాటి వల్ల పిల్లలు తప్పటడుగుల నుండి పాఠాలు నేర్చుకుని, అందులో నుండి విజయాలు సాదించగలుగుతారు!! ◆ వెంకటేష్ పువ్వాడ

అంతర్గత శక్తులను బయటకు తీయడం ఎలా?  నిపుణులు చెప్పిన మార్గాలేంటో తెలుసుకోండి!

  సినిమాల్లోని సూపర్‌హీరోల మాదిరిగానే మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ అంతర్నిర్మితమై ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉండటానికి శరీరానికి ఎదురయ్యే అనారోగ్యాలు, గాయాలతో పోరాడుతూ ఉంటుంది.  ఇలా కేవలం శరీరమే కాదు.. మనిషి మనసు కూడా ప్రత్యేక సామర్థ్యాలు కలిగి ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి  మనసు, శరీరం రెండూ కలసి ఎలా పనిచేస్తాయో..  మనిషిలో ఉన్న అంతర్గత శక్తులను బయటకు తీయడం ఎలాగో తెలుసుకుంటే.. బాల్యం.. బాల్యం ప్రతి ఒక్కరి జీవితంలో భాగం. పెద్దయ్యాక ప్రతి ఒక్కరూ బ్యాలంలోకి వెళ్లిపోవాలని అంటుంటారు. అదొక అందమైన దశ. అమాయకత్వం, ప్రేమ, సంతోషం, కల్మషం లేని వ్యక్తిత్వం బాల్యంలో ఉంటుంది. ఒకవేళ ఇలా ప్రేమ, ఆప్యాయతల మధ్య కాకుండా నిర్లక్ష్యం చేయబడటం, హింసకు గురికావడం వంటివి బాల్యంలో జరిగి ఉంటే అవి మానసికంగా చాలా బాధపెడతాయి. బాల్యంలో ఏం జరిగిందో అర్థం చేసుకోవడం వల్ల భవిష్యత్తును ఆశాజనకంగా తీర్చిదిద్దుకోవచ్చు. తప్పులను సరిదిద్దుకోవచ్చు. బాద్యత కలిగిన పెద్దలుగా ఎదగవచ్చు. ట్రీట్మెంట్..  చాలామందిలో చిన్నతనంలో జరిగిన ఎన్నో అనుభవాలు మనసులో పాతుకుపోయి ఉంటాయి.  వర్తమానానికి తగినట్టు కాకుండా మనసులో పాతుకుపోయిన విషయాలకు అనుగుణంగా నటిస్తుంటారు. దానికి తగినట్టు ప్రవర్తిస్తుంటారు. అయితే మనసులో ఉన్న ఈ పాత విషయాలను మార్చేయడం ద్వారా మనసులో ఉన్న అంతర్గత శక్తులను బయటకు తీయగలరని అంటున్నారు నిపుణులు. తద్వారా జీవితాన్ని ఉన్నతంగా మార్చుకునే అవకాశం పొందగలం. చిత్తశుద్ది.. వర్తమానం గురించి తెలుసుకోవడం కోసం సమర్థవంతమైన మార్గాలలో మైండ్‌ఫుల్‌నెస్ ఒకటి. అంటే ప్రస్తుతం జరుగుతున్నవాటిని జడ్జ్ చేయకుండా వాటిని నిశితంగా గమనించడం.  వర్తమానంలో భావాలు, అనుభూతులు, ఆలోచనలు, చుట్టూ జరుగుతున్న విషయాలు మొదలైనవాటిని గమనించాలి. మైండ్‌ఫుల్‌నెస్ పాత బాధలను నయం చేయడంలో సహాయపడుతుంది. ప్రస్తుత క్షణంపై దృష్టి కేంద్రీకరించినప్పుడు పాత విషయాలను బాగా అర్థం చేసుకోవచ్చు. వాటిని అంతే ధీటుగా ఎదుర్కోవచ్చు. తద్వారా మనసుకు చికిత్స చేయవచ్చు. క్షమాపణ.. క్షమాపణ అడగడం, ధన్యవాదాలు చెప్పడం, ప్రేమను హృదయపూర్వకంగా వ్యక్తం చేయడం వంటివి వ్యక్తిలో ఉండే ప్రతికూల శక్తులను బయటకు విడుదల చేస్తాయి.  ప్రతికూల ప్రభావాలకు బాధ్యత వహించడం, పశ్చాత్తాపాన్ని, కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేయడం ద్వారా వ్యక్తిలో అంతర్గత శాంతి నెలకొంటుంది. ఇది వ్యక్తిగతంగానూ, ఇతరులతోనూ సామరస్యాన్ని నెలకొల్పుతుంది. శ్వాస ఉపయోగించడం.. గతాన్ని నయం చేయడానికి శ్వాసను ఉపయోగించడం చాలా గొప్ప మార్గం. పాత జ్ఞాపకాలను, మనసులో ఉన్న విషయాలను వదిలించకోవడానికి శ్వాసమీద దృష్టి పెట్టడం, నెమ్మదిగా లోతైన శ్వాస తీసుకోవడం ద్వారా మనస్సును, శరీరాన్ని  శాంతపరచవచ్చు. ఇది గతంలో ముడిపడిన భావోద్వేగాలకు విశ్రాంతి ఇవ్వడానికి, వాటిని విడుదల చేయడానికి సహాయపడుతుంది. జర్నలింగ్.. రిఫ్లెక్షన్స్.. ఆలోచనలను, భావాలను రాయడం వల్ల గతాలకు సంబధించిన గాయాలను, భావోద్వేగాలను నయం చేయడం సులువుగా ఉంటుంది. వ్యక్తులు తమను తాము అర్థం చేసుకోవడంలో ఇది సహాయపడుతుంది. ప్రతికూల విధానాలను విడిచిపెట్టి, ఆరోగ్యకరమైన మార్గంలోకి మెదడును, ఆలోచనలను  తీసుకెళ్లడంలో ఇది సహాయపడుతుంది. సపోర్ట్.. ఏ విషయంలో అయినా స్వంతంగా చేసే ప్రయత్నాల కంటే ఒకరి మద్దతుతో చేసే ప్రయత్నాలు ఎప్పుడూ మంచి ఫలితాలు ఇస్తాయి. భావోద్వేగాలకు సంబంధించిన గాయాలు నయం చేయడంలో సామాజిక మద్దతు కీలకపాత్ర పోషిస్తుంది. ప్రతి ఒక్కరికి వ్యక్తి గురించి ఆలోచించేవారు, అన్ని విషయాలలో మద్దతు ఇచ్చే వారుంటే తప్పొప్పుల గురించి చర్చించి మాట్లాడటం, అర్థం చేసుకోవడం, సరైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే గతాన్ని వదిలించుకునే క్రమంలో ఎప్పుడూ ఒంటరితనం వేధించదు. మనస్సు, శరీరం రెండూ ఏకమైనప్పుడు , అవి రెండూ కలిస్తే ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకున్నప్పుడు స్వతహాగానే మనిషిలో అంతర్గత శక్తులు బయటకు వస్తాయి.                                          * నిశ్శబ్ద.

షాపింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

  షాపింగ్‌పై నియంత్రణ కోల్పోయి అవసరం లేని వస్తువులు కూడా కొనేసి, ఇంటికి వచ్చాక లెక్కలు కట్టి బాధపడేవారు చాలామందే ఉంటారు. ఇలా అవసరాన్ని మించి హ్యాండ్ బ్యాగ్‌లో లేదా ATM లో ఉన్న డబ్బంతా ఖర్చుచేస్తే ఆ నెలంతా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. * ఈ విషయంలో సెల్ఫ్ కంట్రోల్, ముందుచూపు చాలా అవసరం. అందుకే షాపింగ్‌కు వెళ్ళేముందు కావాల్సినంత డబ్బు మాత్రమే తీసుకువెళ్ళండి. ATM కార్డులో పుష్కలంగా బ్యాలెన్సు ఉంది కదా అని ఎడా, పెడా ఉపయోగించకండి. ఈ కార్డులు హ్యాండ్ బ్యాగులో ఉంటే అవసరానికి మించి కొనడానికి ఉత్సాహపడతారు. కాబట్టి వీలయినంతవరకూ వాటిని బైటకు తీయవద్దు. * షాపింగ్‌కు వెళ్ళే ముందే ఇంటి దగ్గర ఒక చిన్న స్లిప్‌మీద ఏమేమి కొనాలి, ఎక్కడ కొనాలి, ఎంత డబ్బు వాటికి అవసరం అవుతుంది అని చిన్న జాబితా తయారుచేసుకోండి. జాబితా తయారుచేసుకున్నాకా మీ వద్ద ఉన్న డబ్బుకు మించి జాబితా తయారైతే అవసరం లేని వస్తువులేమైనా ఉన్నాయో చూసుకుని వాటిని తొలగించండి. ఇంకా వీలైతే అత్యవసరం ఉన్న వాటినే లెక్కలో ఉంచుకోవాలి. షాపింగ్ కు వెళ్ళాక తయారుచేసుకున్న జాబితాలో నుంచే కొనుగోళ్ళు ప్రారంభించాలి. *  వ్యాపార ప్రకటనలు చూసి మోసపోవద్దు. చాలామంది కూడా ప్రకటనలపైనా, ఫ్రీ గిఫ్ట్‌లపైనా దృష్టి పెడుతుంటారు. వీటిని దృష్టిలో పెట్టుకోకుండా కొనుగోళ్ళు చేస్తే తగిన నియంత్రణలో ఉన్నట్లు లెక్క. * కొంతమంది బోర్‌గా ఉందని, ఏం తోచక షాపింగులు చేస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. బోర్ కొట్టేవాళ్ళు కాలక్షేపానికి మరేదైనా పనిమీద మనసు లగ్నం చేస్తే బాగుంటుంది. అంతేకాని షాపింగు చేయడాన్ని ఎంచుకోవద్దు. * నెలంతా అవసరమయ్యే అన్ని ఖర్చులు రాసుకుని ఆ తర్వాతే షాపింగు ఖర్చు తీసి పక్కన పెట్టాలి. ఎందుకంటే వచ్చిన డబ్బంతా షాపింగ్‌కు ఖర్చుపెట్టి ఆ తర్వాత అప్పులు చేయవద్దు. * హైక్లాస్ అయినా మిడిల్, లోయర్ క్లాసుల వాళ్ళయినా షాపింగ్‌లో నియంత్రణ కలిగి ఉండటం చాలా మంచిది.

ప్రతి మనిషిలోనూ ఓ వేటగాడు!

ఈమధ్య కాలంలో ఎక్కడ చూసినా జనం ‘పోకెమాన్‌ గో’ ఆటని ఆడుతూ కనిపిస్తున్నారు. ఇది వేలంవెర్రిగా మారిందని పెద్దలు తిట్టుకుంటున్నా, దీని పర్యవసానాల గురించి పరిశోధనలు జరుగుతున్నా... ఆటలు ఆడేవారు మాత్రం పోకెమాన్ల వెంట పడుతూనే ఉన్నారు. ‘ఇంతకీ మనిషి ఈ ఆటకి ఎందుకింతగా వ్యసనపరుడయ్యాడు?’ అన్న ప్రశ్నకి ఓ స్పష్టమైన జవాబు లభిస్తోంది. తన జీవితమే ఒక పరిశోధన రష్యాలో పుట్టి పెరిగిన ‘వ్లాదిమిర్‌ డినెట్స్’ అనే ఆయన, ప్రస్తుతం అమెరికాలో మనస్తత్వ శాస్త్రంలో ప్రొఫెసరుగా పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన పోకెమాన్‌గో పిచ్చి గురించి వ్లాదిమిర్‌కి కూడా కొన్ని సందేహాలు వచ్చాయి. మనిషిలో స్వతహాగా ఉండే వేటగాడి మనస్తత్వం వల్లే మనం ఈ ఆటని ఇష్టపడుతున్నామా అన్న అనుమానం కలిగింది. దాంతో ఒక్కసారి తన జీవితంలో జరిగిన విషయాలనే ఒక్కొక్కటిగా నెమరువేసుకుంటూ ‘మనిషిలో వేటగాడు’ అనే ఆలోచనకు ఓ రూపం ఇచ్చేందుకు ప్రయత్నించారు. వేటే ఆధారం ఇప్పుడంటే తాజా ఆకుకూరలు, షడ్రసోపేతమైన ఆహారాలు లాగిస్తున్నాం కానీ, ఆదిమానవులుగా ఉన్నప్పుడు మనం వేట మీదే కదా ఆధారపడింది. ఆ వేటతోనే కదా వారి ఆకలి తీరింది. కాబట్టి మిగతా జంతువులలాగానే మనిషిలో ఇంకా ఆ వేట తాలూకు ఛాయలు పోలేదంటారు వ్లాదిమిర్‌. అందుకు తన జీవితమే ఒక ఉదాహరణగా చెప్పుకొస్తున్నారు. వ్లాదిమిర్‌ చిన్నప్పుడు తన తండ్రి సీతాకోక చిలుకల వెంటపడటాన్ని గమనించేవాడు. ఆయన సీతాకోక చిలుకల్ని గమనిస్తూ, వాటి వెంటపడుతూ, వాటిలో అరుదైనవాటిని సేకరిస్తూ ఉండేవారట. వ్లాదిమిర్‌కు ఐదేళ్లు వచ్చేసరికి దగ్గరలో ఉన్న అడవులకు వెళ్లి అక్కడ ఉండే జంతువులని గమనించే అలవాటు మొదలైంది. తరువాత కాలంలో వ్లాదిమిర్‌, మాస్కో మహానగరంలో అడుగుపెట్టాడు. అక్కడ అతను పార్కుల్లో పక్షులనీ, పెరట్లో పురుగులనీ గమనించడం మొదలుపెట్టాడు. ఆ తరువాత అరుదైన జంతువులని గమనించడాన్నే వ్యాపకంగా పెట్టుకొన్నాడు. చివరికి జంతువుల స్వభావాల మీదే డాక్టరేటు పుచ్చుకున్నాడు. అన్నీ వేటగాడి సూచనలే సీతాకోక చిలుకల వెంటపడటం, పక్షులను గమనించడం, జంతువులని పరిశీలించడం, పురుగులను పట్టుకోవడం... ఇవన్నీ మనలో దాగి ఉన్న వేటగాడి చర్యలే అంటారు వ్లాదిమిర్‌. అంతేకాదు పోకెమాన్‌గోలో లేని జంతువులను ఊహించుకుంటూ వాటి వెంటపడటం కూడా మనలోని వేటగాడిని తృప్తి పరుస్తోందని విశ్లేషిస్తున్నారు. అయితే ఈ ‘వేటగాడి’లో ఉండే పోరాటపటిమని లక్ష్యసాధన కోసం ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితాలనిస్తుందని సూచిస్తున్నారు.   -నిర్జర.

హోళీ ఆడే తీరు...ఒక్కో చోట ఒక్కోలా!

హోళీ అంటే ప్రపంచానికి రంగుల పండుగే కావచ్చు. కానీ భారతీయుల దృష్టిలో అంతకంటే ఎక్కువే! ఆధ్మాత్మికంగానూ, భౌతికంగానూ భారతీయుల జీవనవిధానానికి హోళీ ఓ రంగుల ప్రతీక. అందుకనే వారు హోళీని ఇలా మాత్రమే జరుపుకోవాలి అని నిశ్చయించుకోలేదు. ఒకో ప్రాంతంవారు రంగులతో ఆడుకునేందుకు ఒకో తీరున హోళీ ఆచారాన్ని సాగిస్తుంటారు. కావాలంటే చూడండి... లాఠ్మార్ హోళీ ఉత్తర్ప్రదేశ్లో జరిగే హోళీ మిగతా దేశానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణుని జీవితంతో ముడిపడిన మధుర, బృందావన్ వంటి ప్రాంతాలన్నింటినీ కలిపి వ్రజభూమిగా పిలుస్తారు. ఈ వ్రజభూమిలో హోళీ లాఠ్మార్ పేరుతో జరుగుతుంది. అలనాడు శ్రీకృష్ణుడు, రాధాదేవితో కలిసి హోళీ ఆడేందుకు ఆమె పుట్టిళ్లయిన బర్సానాకు చేరుకున్నాడట. తనని ఆటపట్టిస్తున్న కృష్ణుని ఎదుర్కొనేందుకు రాధాదేవి లాఠీతో కృష్ణుని వెంటపడిందట. ఆ సంఘటనను గుర్తుచేసుకుంటూ ఈ వ్రజభూమిలో మగవారేమో ఆడవారి మీద రంగులు చల్లే ప్రయత్నం చేయడం, ఆడవారేమో ఆ ఆకతాయితనాన్ని ఎదుర్కొనేందుకు లాఠీలు ఝుళిపించడం చేస్తుంటారు. షిమోగా గోవాలో సంప్రదాయంగా జరుపుకొనే వసంత ఉత్సవం ‘షిమోగా’. హోళీ పౌర్ణమికి ఐదు రోజుల ముందునుంచే మొదలయ్యే ఈ పండుగకు హోళీ ఓ ముగింపునిస్తుంది. ఇందులో భాగంగా ఊరూరా తమ చరిత్రను గుర్తుచేసుకునేలా సంప్రదాయ నృత్యాలు సాగుతాయి. డప్పు వాయించేవాళ్లు ఇంటింటికీ తిరుగుతూ భిక్షమెత్తుకుంటారు. గ్రామదేవతలకు బలులు సాగుతాయి. గుళ్లలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. హోళీనాటికి షిమోగా పండుగ పతాకస్థాయిని చేరుకుంటుంది. స్థానికులతో కలిసి ఈ పండుగను చేసుకునేందుకు వేలమంది విదేశీయులు వస్తారు. ఈ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కూడా పెరేడ్లు నిర్వహిస్తుంటుంది. కుమౌనీ హోళీ ఎక్కడన్నా పండుగ ఒకరోజు జరుగుతుంది, రెండు రోజులు జరుగుతుంది... ఇంకా మాట్లాడితే పదిరోజులు జరుగుతుంది. కానీ కుమౌనీ హోళీని దాదాపు 40 రోజుల పాటు జరుపుకుంటారు. వసంత పంచమి రోజున మొదలవుతుంది వీరి హోళీ పండుగ. అందులో బోలెడు రకాలు, ఆచారాలు ఇమిడి ఉంటాయి. ఉదాహరణకు ‘బైఠకీ హోళీ’లో సంగీతకారులు ఒకచోటకు చేరి కొన్ని ప్రత్యేక రాగాలను ఆలపిస్తారు. వీటిని వినేందుకు జనం గ్రామగ్రామంలోనూ ఒకచోటకి చేరతారు. ఇలా సంగీతాన్ని కూర్చుని వినే అవకాశం కల్పిస్తుంది కాబట్టి దీనికి బైఠకీ హోళీ అని పేరు వచ్చింది. ఇక ఈ హోళీ సమయంలో సంప్రదాయ ఖాదీ వస్త్రాలను ధరిస్తారు కాబట్టి ‘ఖాదీ హోళీ’ అని పిలుచుకుంటారు. ఈ సమయంలోనే మహిళలు ప్రత్యేకించి ఒక చోట చేరి గీతాలను ఆలపిస్తారు. ఆ సందర్భాన్ని ‘మహిళా హోళీ’ అంటారు. ఫాల్గుణ పౌర్ణమి నాటి హోళీ ఘట్టానికి రంగులు చల్లుకునేందుకు ఈ నలభై రోజుల నుంచీ కూడా చెట్టూపుట్టా తిరుగుతారు. అక్కడ వేర్వేరు రంగు పూలను సేకరించి, పొడిచేసి సిద్ధంగా ఉంచుకుంటారు. హోళీ ముందు రోజు... హోళిక అనే రాక్షసి మంటల నుంచి ప్రహ్లాదుడు తప్పించుకోవడాన్ని గుర్తుచేసుకుంటూనే మంటలు వేసుకుంటారు. హోళీకి ముందే ఇంత హడావుడి ఉంటుందంటే, ఇక హోళీనాడు ఎంత సంబరం సాగుతుందో చెప్పేదేముంది! హోళా మొహల్లా పంజాబులో హోళీ మరునాడు జరుపుకొనే ఈ పండుగలో సిక్కులు తమ యుద్ధవిద్యలను ప్రదర్శిస్తారు. సిక్కులలోని యుద్ధనైపుణ్యాలను మెరుగుపరిచేందుకు సాక్షాత్తూ వారి గురువైన గోవింద్ సింగ్ ఏర్పరిచిన సంప్రదాయం ఇది. హోళీ మర్నాడే ఈ ఆచారాన్ని మొదలుపెట్టడం వెనుక ఆయన ఉద్దేశం ఏమైనప్పటికీ... పంజాబువాసులు అటు హోళీనీ, ఇటు హోళా మొహల్లాను కూడా ఘనంగా జరుపుకుంటారు. ఇంతేనా! గుజరాత్లో హోళీ సందర్భంగా ఉట్టి కొడతారు, ఒడిషాలో రాధాకృష్ణులను ఊరేగించి వారికి రంగులను అర్పిస్తారు, పశ్చిమబెంగాల్లో దీనిని డోలీ పూర్ణిమ పేరుతో ఓ సంగీతోత్సవంగా నిర్వహిస్తారు. ఇలా చెప్పుకొంటూ పోతే ప్రతి రాష్ట్రంలోనూ హోళీకి ఒకో ప్రత్యేకత కనిపిస్తుంది. రంగుల ప్రపంచం అన్నా, ఆ ప్రపంచంలో లయబద్ధంగా జీవించడం అన్నా భారతీయులకు ఎంత ఇష్టమో హోళీ తెలియచేస్తుంటుంది. - నిర్జర.

ఇవి కూడా రంగుల పండుగలే!

హోళీ అంటే భారతీయులకి మాత్రమే ప్రత్యేకమైన పండుగ. ఎక్కడో ఈశాన్యంలోని మణిపూర్లో ఉన్నా, ఖండాలు దాటుకుని ఏ అమెరికాలో ఉన్నా.... హోళీనాడు రంగు చేతపట్టని భారతీయుడు ఉండదు. ఇందులో ఒకో ప్రాంతానిదీ ఒకో ప్రత్యేకత. ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకోవడం ప్రపంచంలో బహుశా మన హోళీ సందర్భంలో మాత్రమే కనిపిస్తుంది. కానీ జీవితాన్ని రంగులమయం చేసుకునే ప్రయత్నం మాత్రం చాలా దేశాల్లో ఉంది... టమాటాల పండుగ స్పెయిన్‌లోని వలెన్‌సియాన్ నగరంలో ఏటా ఈ పండుగ చేసుకుంటారు. ఆగస్టు చివరి బుధవారం  జరుపుకొనే ఈ పండుగలో ఒకరి మీద ఒకరు టమోటాలు విసురుకుంటారు. 1945 నుంచి మొదలైన ఈ పండుగ రాన్రానూ ప్రచారాన్ని అందుకుంటోంది. నిజానికి ఈ సంప్రదాయం ఎలా మొదలైందో ఎవరికీ తెలియదు. కొందరు కుర్రకారు టమాటాలతో కొట్టుకున్న గొడవ ఇలా మారిందనీ, ఓ టమాటా లారీ బోల్తా పడటంతో ఈ సంప్రదాయం మొదలైందనీ, ఊళ్లో కౌన్సిల్‌ సభ్యుల మీద కోపం వచ్చిన పౌరులు టమాటాలను విసరడంతో ఈ ఆచారానికి పునాది ఏర్పడిందనీ రకరకాల వాదనలు ఉన్నాయి. కారణం ఏదైనా ఆ రోజు సంబరం మాత్రం అంబరాన్ని అంటుతుంది. ఆ సందర్భంగా ఎవ్వరికీ ఎలాంటి గాయం జరగకుండా చాలా నియమాలనూ పాటించాల్సి ఉంటుంది. ఒకటే రంగు నెదర్లాండ్‌ రాజుగారైనా విలియం అలగ్జాండర్ పుట్టినరోజు సందర్భంగా ఆ దేశంలో జరుపుకొనే సంబరాలే ‘Koningsdag’. ఈ రోజున నెదర్లాండ్స్ యావత్తూ ఆ దేశపు రంగైన నారింజరంగుతో నిండిపోతుంది. గోడల మీద నారింజ రంగు కనిపిస్తుంది. జనమంతా నారింజరంగు బట్టలు వేసుకుని తిరుగుతారు. ఆఖరికి జుట్టుకి కూడా నారింజ రంగు వేసుకుంటారు. ద్రాక్ష ఎరుపులో మందుప్రియులందరి నోరూరేలాంటి ఓ పండుగ ఉంది. అదే స్పెయిన్‌లో జరిగే ‘హారో వైన్‌ ఫెస్టివల్‌’. ఏటా జూన్‌ 29న ఆ దేశంలోని క్రైస్తవ సన్యాసి ‘శాన్‌ పెడ్రో’ జ్ఞాపకార్థం ఈ పండుగ జరుగుతుంది. హారో అనే ఊరిలో జరిగే ఈ పండుగలో ఊరి జనమంతా ఉదయం నుంచే ద్రాక్షసారాయి నిండిన పాత్రలతో బయల్దేరతారు. దారిలో తమకు ఎదురుపడినవారందరి మీదా ఈ సారాయిని ఒంపుతూ ముందకుసాగుతారు. సాయంత్రం అయ్యేసరికి ఊరంతా ద్రాక్షమయంగా మారిపోతుందన్నమాట. ఇక ద్రాక్షసారాని ఒంపుకోవడమే కాదు... దానిని తాగడంలో కూడా బోలెడు పోటీలు జరుగుతాయి. నారింజ యుద్ధం ఇటలీలోని ఇవ్రియా అనే పట్నంలో జరిగే పండుగ ఇది. దీని మూలాలు ఎప్పుడో 13వ శతాబ్దంలో ఉన్నాయని చెబతారు. అప్పట్లో రాజవంశానికి చెందిన వ్యక్తి, ఓ పల్లెటూరి పిల్లని బలాత్కారం చేయబోయాడట. దానికి తిప్పికొట్టిన ఆ అమ్మాయి, ఏకంగా ఆ వ్యక్తి తలని నరికేసిందని చెబుతారు. అంతేకాదు! విషయం తెలుసుకున్న పౌరులంతా కలిసి రాజవంశం మీద తిరగబడ్డారట. ఆనాటి ప్రతిఘటనకు గుర్తుగా ఇవ్రియావాసులు నారింజపండ్లని ఒకరిమీద ఒకరికి విసురుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా హోళీని తలపిస్తూ రంగులతో నిండే ఇలాంటి పండుగలు చాలానే ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి మాత్రం పైన పేర్కొన్నవే!   - నిర్జర.

రంగుల జీవితం!

మనకిష్టమైన వాళ్ళు మన ఎదురుగా ఉంటే నిజంగానే లైఫ్ కలర్ ఫుల్ గానే  కనిపిస్తుంది. కాని కొన్ని రోజులు అయ్యాకా దాటాకా రోటీన్ లైఫ్ తో బోర్ కొడుతుంది ఎవరికైనా. పొద్దున్నే లేవటం అవే ఉరుకులు పరుగులు, అదే టైం టేబుల్. జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు ఉండే బ్రైట్నెస్ రానురాను కరువవుతుంది. అందులోనూ ఇంట్లోనే ఉండే హోం మేకర్స్ ఇంకా ఇంకా బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పుడూ చేసిన పనే చేస్తూ, మళ్ళీ తెల్లారిందా అనుకుంటూ వాళ్ళు పడే పాట్లు అన్ని ఇన్ని కావు. అలాంటి లైఫ్ లో కాస్త రంగులు నింపితే.....ఆనందాలు రెట్టింపయ్యి, అనురాగాలు విరబూస్తాయి, కదూ. మరి ఆ రంగుల్ని నింపటానికి ఏం చెయ్యాలంటే...... రొటీన్ లైఫ్ కి కాస్త భిన్నంగా ఉండాలంటే వీకెండ్స్ లో ఏదైనా లాంగ్ డ్రైవ్ గాని, లేదా చిన్న ట్రిప్ గాని ప్లాన్ చేసుకోవచ్చు. అలా వెళ్లివస్తే మన మూడ్ హాయిగా ఉంది నిజంగానే జీవితం రంగులమయంగా కనిపిస్తుంది. మనం రోజూ వాడే బట్టల్ని పక్కకి పెట్టి ఏదో ఒక న్యూ స్టైల్ ని మార్చాలి. రోజూ పంజాబీ డ్రెస్, సారీ వేసుకునే వాళ్ళు కాస్త డిఫెరెంట్ గా జీన్స్, కుర్తీ లాంటివి ట్రై చేస్తే మీలో వచ్చే మార్పు మీరే గమనించచ్చు. ఇంట్లో ఉండే ఫర్నిచర్ ఎప్పుడు ఒకేలా ఉంటే మజానే రాదు. అందుకే ఇంటికి కొత్త కళ రావాలంటే వాటి ప్లేస్ లు మారుస్తూ ఉండాలి.  మీ భాగస్వామి ఇంటికి వచ్చేసరికి ఒక స్వీట్ సర్ప్రైజ్ ప్లాన్ చేసుకోండి. ప్రతిరోజులా కాకుండా ఇంట్లోనే కేండేల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసుకుంటే రొటీన్ కి బిన్నంగా ఉంటుంది. మీకు సన్నిహితమైన వాళ్ళని ఇంటికి భోజనానికి పిలవండి. వాళ్ళు వచ్చారు వెళ్లారు అనేలా కాకుండా కాస్త వెరైటీగా కార్డ్స్ గేమ్ గాని, డంషరాడ్స్ లాంటి ఫన్నీ గేమ్స్ గాని ప్లాన్ చేసుకుంటే మనసు హాయిగా రంగులతో నిండిపోతుంది.  మాములుగా ఇంట్లో అందరు ఉన్నప్పుడు మీకు ఇష్టమైన సినిమా వస్తున్నా అది చూసే అవకాశం మీకు ఉండదు. పిల్లలు కార్టూన్ చూస్తామని, మిగిలిన వాళ్ళు సీరియల్స్ చూస్తామని రిమోట్ మీ చేతికి అందనీయరు. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు హాయిగా మీకిష్టమైన సినిమాని ప్లే చేసి చూడండి. మీకిష్టమైన కలర్ డ్రెస్, అది మీ పార్టనర్ కి నచ్చకపోతే మీరు వేసుకోటానికి సాహసించరు. అందుకే ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు లేదా మీ ఫ్రెండ్స్ తో బైటకి వెళ్ళినప్పుడు ఆ కలర్ డ్రెస్ వేసుకుని మీ కోరికని తీర్చుకోవచ్చు. ఇంట్లో మీకు బాగా ఇష్టమైన పెంపుడు జంతువుని పెంచుకుంటే మీకు బోర్ కొడుతోంది అనే మాటే గుర్తు రాదు. ఖాళీగా ఉన్న సమయంలో వాటితో ఆడుకుంటూ టైం ఇట్టే గడిచిపోతుంది. మీకిష్టమైన వాళ్ళ స్పెషల్ డేస్ గుర్తుపెట్టుకుని వాళ్ళకి గ్రీటింగ్ గాని, ఫ్లవర్ బొకే గాని పంపితే వాళ్ళు తిరిగి మీకు రెస్పాండ్ అయ్యే విధానం మీ లైఫ్ లో ఖచ్చితంగా కలర్స్ నింపుతుంది. మనకున్నదే చిన్న లైఫ్, అందులో మనకి దొరికే టైం కూడా చిన్నదే. ఆ టైంని కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటూ, ప్రతి సారి ఏదో ఒక కొత్త కోణంలో లైఫ్ ని చూసినట్లయితే మన లైఫ్ మనకి ఎప్పటికి బోర్ కొట్టదు. అది మన కళ్ళకి ఎప్పటికీ కలర్ ఫుల్ గానే కనిపిస్తుంది.  ...కళ్యాణి     

బంధాన్ని పదిలంగా మార్చే సరికొత్త సిద్దాంతం.. లెట్ దెమ్!

జీవితంలో బంధాలు చాలా అపురూపమైనవి. ముఖ్యంగా జీవిత భాగస్వాముల మధ్య బంధం బలంగా ఉంటేనే జీవితం సంతోషంగా ఉంటుంది.  అయితే బంధంలో సంతోషం కంటే కలతలు, గొడవలు ఎక్కువగా ఉన్న జంటలే ఎక్కువగా ఉంటున్నాయి ఈ కాలంలో. దీనికి కారణం జీవిత భాగస్వాములు ఒకరినొకరు నియంత్రించాలని, ఒకరు చెప్పిందనే జరగాలని, ఒకరి మాటే నెగ్గాలని అనుకోవడం. దీనివల్ల ఇద్దరి జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి. ఇద్దరి జీవితాలు ప్రశాంతతను కోల్పోతాయి. స్పష్టత లేకుండా తయారవుతాయి.   వీటిని పరిష్కరించి జీవితం సంతోషంగా ఉండటానికి సరికొత్త సిద్దాంతాన్ని పరిచయం చేస్తున్నారు మానవ సంబంధాల నిపుణులు.   లెట్ దెమ్ అనే ఈ సరికొత్త సిద్దాంతం వల్ల  జీవిత భాగస్వాములు ఒకరిని మరొకరు నియంత్రించాలనే ఆలోచన విడిచిపెట్టి స్వీయ నియంత్రణ పాటించడం జరుగుతుందని అంటున్నారు. అసలింతకూ ఈ లెట్ దెమ్ అనే సిద్దాంతం పాటించడం వల్ల కలిగే  ఇతర ప్రయోజనాలేంటో తెలుసుకుంటే.. గౌరవం.. స్వీయ నియంత్రణ, స్వీయ విమర్శ, స్వీయ ప్రోత్సాహం వంటివి ఎప్పుడూ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తాయి.  ఇది జీవితభాగస్వామి దృష్టిలో వ్యక్తిత్వాన్ని మరింత గొప్పగా మారుస్తాయి. ఇద్దరి మధ్య సరిహద్దులు, ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవించడం వంటి విషయాలలో ఎప్పుడూ సంతృప్తికర ఫలితాలను ఇస్తాయి. అందుకే లెట్ దెమ్ సిద్దాంతాన్ని పాటించే వ్యక్తులు తమ గౌరవాన్ని పెంచుకుంటారు. ఎక్స్పెక్టేషన్స్.. లెట్ దెమ్ ను స్వీకరించడం వల్ల వ్యక్తి జీవితం నుండి అంచనాలు, ఆశించడాలు, ఇతరుల విషయంలో ఒత్తిడికి లోనుకావడం వంటివి తగ్గుతాయి. ఇది వ్యక్తిని రిలాక్స్ గా మారుస్తుంది.  భాగస్వాములు ఇద్దరూ లెట్ దెమ్ సిద్దాంతాన్ని పాటిస్తే వారిద్దరి మధ్య ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి.  ఇది ఇద్దరి మధ్య సంతృప్తికరమైన జీవితానికి దారితీస్తుంది. సరిహద్దులు.. లెట్ దెమ్ సిద్దాంతాన్ని భాగస్వాములు పాటిస్తే వారిద్దరి మధ్య ఆరోగ్యకమైన సరిహద్దులు ఏర్పరుచుకోవడానికి, వాటిని నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది.  ఇది ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పాటుచేసుకోవడానికి సహరకరిస్తుంది. యాక్సెప్ట్ చేయడం.. డిమాండ్ ఉన్నప్పుడు తనకు నచ్చింది మాత్రమే జరగాలనే పట్టుదల, మొండితనం ఉంటుంది. కానీ డిమాండ్ లేకుండా స్వీయ నియంత్రణ ఉన్నప్పుడు భాగస్వామి కోణంలో ఆలోచించడం, భాగస్వామికి సంబధించిన అన్ని విషయాలను స్వీకరించడం, ఇద్దరి మధ్య అంగీకారం  మొదలైనవి సులువు అవుతాయి. కంట్రోల్.. కోపం, ద్వేషం, ఆవేశం వంటి భావోద్వేగాలు ఎక్కువైనప్పుడు చాలావరకు భాగస్వాముల మధ్య గొడవలు, అపార్థాలు వస్తుంటాయి. కానీ ఈ ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోవడం, స్వీయ నియంత్రణ, స్వీయ విమర్శ, ఆత్మ పరిశీలన మొదలైనవాటి వల్ల భావోద్వేగాలు చాలావరకు నియంత్రణలో ఉంటాయి. ఇవి నియంత్రణలో ఉంటే చాలు.. సహజంగానే ఇద్దరిమధ్య అపార్థాలు తొలగిపోతాయి.  బంధం పదిలంగా ఉంటుంది.                                       *నిశ్శబ్ద.