-->

సమానతలు లేని సమాజమే మన ధ్యేయం.. 

 


 


రాజుల కాలం నుంచి రాజ్యాంగాలు రాసుకున్న కాలం దాకా వచ్చిన మన సమాజంలో  ఇప్పటికీ పూర్తిగా పరిష్కారం దొరకని అంశం ఒకటుంది. అదే సామాజిక న్యాయం.  ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగా సామాజిక న్యాయం సాధించాల్సిన  ఆవశ్యకతని గుర్తించి  2007లో ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని  ప్రకటించింది.  2009 నుండి ప్రతి సంవత్సరం  ఫిబ్రవరి 20న అధికారికంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.  ఈ దినోత్సవం ప్రధానంగా పేదరిక నిర్మూలన, మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక అసమానతల తొలగింపు, లింగ సమానత్వం, ఉపాధి హక్కులు, సమానావకాశాల ప్రోత్సాహం వంటి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు  సహాయపడుతుంది.

విభిన్న సంస్కృతులు, భిన్న సామాజిక స్థాయిలున్న భారతదేశంలో  సామాజిక న్యాయం అందించటం ఎంత అవసరమో, అది సాధించటంలో  ఉన్న సవాళ్లేమిటో, మన దేశం తీసుకుంటున్న చర్యలేమిటో తెలుసుకుంటే..

భారతదేశంలో సామాజిక న్యాయం..

చరిత్రపరంగా భారతదేశం సామాజిక అసమానతలు, కుల వివక్ష, లింగ వివక్ష, ఆర్థిక అసమానత వంటి ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. అయితే, భారత రాజ్యాంగ నిర్మాత అయిన  డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నాయకత్వంలో రూపొందిన రాజ్యాంగం సామాజిక న్యాయం అనే భావనకి  ప్రత్యేక  స్థానాన్నిచ్చింది.  భారత రాజ్యాంగం కుల, మత, లింగ, ప్రాంత, ఆర్థిక వివక్ష లేకుండా సమాన హక్కులు కల్పించటం ద్వారా,   సంపద కొద్దిమంది చేతిలో మాత్రమే కేంద్రీకృతం కాకుండా  ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించడం ద్వారా,  ప్రతీ పౌరుడికి సమాన రాజకీయ హక్కులు ఉండేలా చూస్తుంది. అలాగే  సామాజిక, ఆర్ధిక, రాజకీయ న్యాయాలకి విలువనిచ్చింది.  ఈ లక్ష్యాలను అనుసరించి ప్రభుత్వం విభిన్న సంక్షేమ పథకాలు, చట్టాలు, విధానాలు అమలు చేస్తోంది.

సామాజిక న్యాయం కోసం..

ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం విద్య-ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, విద్యార్థులకు ఉచిత వసతి గృహాలు, స్కాలర్‌షిప్లు, ఎస్సీ/ఎస్టీ సబ్‌ ప్లాన్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను  అమలు చేస్తున్నారు. “ఎం‌జిఎన్‌ఆర్‌ఈజిఏ” పధకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని  పేదల కోసం 100 రోజుల పనిని కల్పించి,    లక్షలాది గ్రామీణ కుటుంబాలకి  ఉపాధినిస్తున్నారు.  మహిళలపై వివక్ష తగ్గించేందుకు, లింగ సమానత్వం పెంచేందుకు ప్రయత్నం చేస్తూనే,  ‘బేటీ బచావో, బేటీ పడావో’ వంటి పధకాల ద్వారా  బాలికల భద్రత, విద్య, ఆర్థిక స్వతంత్రతల మీద   దృష్టి పెట్టారు. "ప్రతి భారతీయుడికి గృహం" అనే లక్ష్యంతో ఉన్న  ప్రభుత్వం ‘ప్రధాన్ మంత్రీ ఆవాస్ యోజన’ పథకం ద్వారా పేదలకు తక్కువ ఖర్చుతో గృహ నిర్మాణం చేస్తుంది. ఆర్థికంగా బలహీనమైన  కుటుంబాలకు 5 లక్షల రూపాయల  వరకు ఉచిత వైద్యం అందించే లాగా, ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకంగా పేరు పొందిన ‘ఆయుష్మాన్ భారత్’ పధకాన్ని మన దేశం అమలు చేస్తుంది. అసంఘటిత రంగ కార్మికుల భవిష్యత్ భద్రత కోసం , ఉద్యోగ అవకాశాలు, బీమా వంటివి అందించటం కోసం  ‘ఇ-శ్రమ్ పోర్టల్’ నిర్వహిస్తుంది.

  సమస్యలు-సవాళ్లు..

ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ సమాజంలో మార్పు రాకపోవటంతో  భారతదేశంలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో కులం ఆధారంగా వివక్ష కొనసాగుతోంది.  అందుకే సామాజిక ఆలోచనని మార్చే ప్రయత్నం చేయాలి. విద్య, ఉపాధి, వేతనాల్లో మహిళలకు సమాన అవకాశాలు దొరక్క లింగ అసమానత కొనసాగుతూ ఉంది. భారతదేశంలో కోటీశ్వరులు ఉన్నప్పటికీ, పేదరికంలో బతికే కోట్ల మంది ప్రజలు కూడా ఉన్నారు. వీరిని దారిద్ర్య రేఖనుంచి పైకి తీసుకొచ్చి  ఆర్థిక న్యాయం చేయటానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలి.  ఇప్పటికీ విద్య, వైద్య సేవల్లో అసమానత ఉంది.  కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో  నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు అందుబాటులో లేవు.

ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం మనకు సమాజంలోని అసమానతలను గుర్తించి, వాటిని తొలగించే మార్గాలను అన్వేషించేందుకు ప్రేరణ కల్పిస్తుంది. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో సామాజిక న్యాయం అమలు చేయడం అత్యంత కీలకం. సమాన అవకాశాలు, సమాన హక్కులు, సామాజిక సంక్షేమం అనే విలువలను ముందుకు తీసుకెళ్లడంలో ప్రభుత్వ విధానాలు, చట్టాలు ఎంతగానో సహాయపడతాయి. అయితే ప్రతీ పౌరుడు సామాజిక న్యాయం అమలు చేయడంలో పాత్ర వహించాలి. కుల వివక్ష, లింగ వివక్ష, ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు సమాజంగా కలిసి కట్టుగా పనిచేయాలి.

                                         *రూపశ్రీ.