Read more!

బాధించే గతం నుండి బయటపడటానికి గొప్ప మార్గాలు!

చాలామంది గతంలో ఎన్నో చేదు అనుభవాలను చవిచూసి ఉంటారు. వాటి గురించి నిరంతరం ఆలోచిస్తూ తమలో తాము కుమిలిపోతుంటారు. స్ఫూర్తివంతమైన విషయాలు చదివినంత సేపు వారికి ఎంతో ధైర్యం వస్తుంది. కానీ తరువాత అంతా మామూలే! ఇలాంటి వారికి తమ బాధలను స్నేహితులతో చెప్పుకోవాలంటే  ఆత్మాభిమానం అడ్డు వస్తుంది. అలాంటి సమయంలో ఈ పరిస్థితుల నుండి బయటపడే మార్గాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం..

మన సమస్యలన్నింటికీ ముఖ్యకారణం మనస్సు వర్తమానంలో ఉండక పోవడమే! గతాన్ని తలుచుకుంటూ బాధపడడం, భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం మనస్సు స్వభావం. గతంలోని చేదు అనుభవాలను పూడ్చిపెట్టి, భవిష్యత్తు గురించి ఆలోచనల్ని అరికట్టినప్పుడు మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్ని తీర్చిదిద్దుకోవడం సాధ్యమవుతుంది.

ఈ సమస్యను మూడు మార్గాలను అనుసరించడం ద్వారా పరిష్కరించుకోవచ్చు.

భగవంతునితో మొరపెట్టుకోవడం : 

ఒక్కసారి భగవద్భక్తుల జీవితాల్ని తరచి చూస్తే వారంతా ఎన్ని కష్టాల్ని అనుభవించారో మనకు అర్థమవుతుంది. ఆ మహాభక్తులు అనుభవించిన కష్టాలు మేరు పర్వతమంతైతే మన కష్టాల్ని ఆవగింజతో పోల్చవచ్చు. కానీ మనకు కలిగిన ఆవగింజంత కష్టానికే అవధుల్లేని అశాంతికి లోనవుతుంటాం. మరి వారు మేరుపర్వతమంత కష్టాల్ని సైతం అవలీలగా ఎలా దాటగలిగారు? తమ బాధలను భగవంతునితో మొరపెట్టుకోవడం వల్లనే అది సాధ్యమయిందని నిరూపించారు సఖుబాయి, జనాబాయి, మీరాబాయి, ముక్తాబాయి, కాన్హోపాత్ర లాంటి అనేక మంది భక్త శిరోమణులు.

It is difficult to live without someone to whom we can open our hearts. But to whom can we better dis- close them than to God! - Thomas A. Kempis

ఈ ప్రపంచంలో మనల్ని నిస్వార్థంగా ప్రేమించే తల్లి, తండ్రి, బంధువు, మిత్రుడు, శ్రేయోభిలాషి అన్నీ ఆ భగవంతుడు మాత్రమే! కాబట్టి మన బాధలను భగవంతుని వద్ద విలపిస్తూ విన్నవించుకుంటే మేరు పర్వతమంత కష్టమైనా దూదిపింజలా ఎగిరిపోతుంది. 'వ్యాకుల మనస్సుతో భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఆయన మన ప్రార్థనల్ని తప్పక వింటాడు'. ఈ మార్గాన్ని అనుసరించడం కష్టమైనప్పటికీ ప్రయత్నిస్తే అసాధ్యం మాత్రం కాదు!

స్నేహితులతో మనస్సు విప్పి మాట్లాడడం:

మనోవ్యధలను తొలగించేందుకు ఔషధంలా ఉపయోగపడే వారు మంచి స్నేహితులు.

No medicine is more valuable, none more. efficacious, none better suited to be cure of all our miseries than a friend - St. Aleredx

మన బాధలను స్నేహితులతో చెప్పుకోవడానికి ఆత్మాభిమానం అడ్డువస్తోందని అనుకోవడానికి కారణం స్నేహితుడు, మనం వేర్వేరు అనే భేద భావం ఉండడం వల్లనే! 'నిజమైన స్నేహితుడు ఇద్దరిలో ఉన్న ఒకే ఆత్మ' 

A true friend is one soul in two bodies - Aristotle

కాబట్టి బాధలను తలచుకుంటూ కుమిలి పోవడం కన్నా స్నేహితులతో మనస్సు విప్పి మాట్లాడడం వల్ల మనస్సు తేలికపడుతుంది.

కార్యకలాపాల్లో మనస్సును నిమగ్నం చేయడం : 

వీలైనంత వరకూ ఒంటరిగా ఉండకుండా నలుగురితో కలిసిమెలిసి ఉండడం, ఏదో ఒక పనిలో మనస్సును నిమగ్నం చేయడం వల్ల గతాన్ని మరిచిపోవడం సాధ్యమవుతుంది.

స్వామి వివేకానందుని పాశ్చాత్య శిష్యురాలైన మేడం ఈ. కాల్వే మనోవేదనకు గురైనప్పుడు ఆమెను ఓదారుస్తూ స్వామీజీ! ఇలా అన్నారు : "నువ్వు గతాన్ని మరిచిపో. నీ దుఃఖాలను గురించి మౌనంగా తలపోస్తూ కూర్చోవద్దు. నీలోని భావోద్వేగాలను ఏదో ఒక బాహ్యరూపంలో సృజనాత్మకంగా వ్యక్తీకరించే ప్రయత్నం చెయ్యి" అన్నారు.  స్వామీజీ సలహాను పాటించిన ఆమె జీవితం ప్రశాంతమయమైంది.

ఈ మూడు మార్గాల్లో ఏ ఒక్క మార్గాన్ని అవలంబించినా.. మనస్సు గతంలోనికి అడుగుపెట్టదు. పట్టుదలతో ప్రయత్నిస్తేనే ఏదైనా సాధ్యమవుతుందన్న విషయాన్ని మాత్రం మరువకూడదు.

                                    *నిశ్శబ్ద.