ఇతరుల కోసం ఈ అలవాట్లను ఎప్పుడూ మార్చుకోకూడదు..!

 

మార్పు మనిషి జీవితంలో చాలా సహజమైన విషయం. మార్పు వల్ల కొందరికి నచ్చినట్టు, మరికొందరికి నచ్చనట్టు జరిగిపోతూ ఉంటుంది.  సాధారణంగా కొందరు ఇతరుల కోసం మారడం జరుగుతూ ఉంటుంది.  ప్రేమించిన వ్యక్తి,  పెళ్లి చేసుకునే వ్యక్తి.. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు. అధిక స్థాయిలో ఉన్నవారి ముందు.. ఇలా ఒకటనేమిటి.. చాలా సందర్భాలలో మార్పు అనేది జరిగిపోతూ ఉంటుంది. అయితే మార్పు మంచిదే కదా అని ప్రతి విషయాన్ని మార్చుకోవడం మంచిది కాదు.  ముఖ్యంగా కొన్ని అలవాట్లను ఎట్టి పరిస్థితులలోనూ మార్చుకోకూడది వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాట్లు మార్చుకుంటే సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకోవడమే అని అంటున్నారు. ఇంతకీ ఏవి మార్చుకోకూడదు తెలుసుకుంటే..

ప్రాధాన్యత..

మీరు మీ అవసరాలను ఇతరుల కంటే ముందు ఉంచితే చాలా సార్లు ప్రజలు మిమ్మల్ని స్వార్థపరులు అంటారు. కానీ గుర్తుంచుకోవసి విషయం ఏమిటంటేృ మీకు మీరు ప్రాధాన్యత ఇవ్వడం ఎప్పటికీ స్వార్థం కాదు.  అది సెల్ఫ్ లవ్ అనబడుతుంది.  స్వీయ ప్రేమ. మీ ఆనందాన్ని,  అవసరాలను విస్మరిస్తే మనసులో మీకంటూ ఏమీ లేకుండా ఖాళీ అయిపోతుంది. అందుకే ఇతరులకు సహాయం చేయడం మంచిదే కానీ మీ ప్రాధాన్యతలు వదిలి మరీ సాయం చేయక్కర్లేదు.

కలలు, ఆశయాలు..

కన్న కలలు ఏవైనా సరే. వయసు ఎంతైనా సరే.. చేయాలని అనుకున్న పనులు, సాధించాలి అనుకున్న లక్ష్యాలు ఎప్పటికీ విడవకూడదు. మీ కలలు, ఆశయాలు వదిలి ఇతరులకు నచ్చినట్టు జీవితాన్ని జీవిస్తే తర్వాత పశ్చాత్తాప పడాల్సి ఉంటుంది.

నో చెప్పడం..

చాలామందికి మొహమాటం  ఎక్కువ ఉంటుంది.  దీని వల్ల నష్టమే కానీ లాభం ఏమీ ఉండదు. చాలామంది ఏం చేప్పినా  దానికి ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా ఓకే అని చెప్పి, ఆ పనులు చెయ్యాలని అనుకుంటారు. కానీ ఇష్టం లేని పనులు,  బాధ పెట్టే పనులు,  సమయాన్ని దుర్వినియోగం చేసే పనులు. ఇతరులకు మంచి చేయని పనులను చేయడానికి ఎప్పుడూ ఓకే చెప్పకూడదు.  సున్నితంగా నో చెప్పడం నేర్చుకోవాలి.

నైతిక విలువలు..

ప్రతి మనిషి వ్యక్తిత్వాన్ని అతని నైతిక విలువలు వ్యక్తం చేస్తాయి. అబద్దం చెప్పడానికి,  మోసం చేయడానికి,తప్పు పనులు చేయడానికి, ఎదుటివారికి న ష్టం కలిగించడానికి ఎప్పుడూ ముందుకు వెళ్లకూడదు. అవి చేయకపోతే మీకు నష్టం కలిగినా సరే.. ఎప్పుడూ అలాంటి పనులు చేయకూడదు.

మానసిక ఆరోగ్యం..

ఇప్పటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్.  మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే వ్యక్తులు,  వాతావరణం.. పరిస్థితులు.. ఇలా ఏవైనా సరే.. వాటి నుండి దూరం వెళ్లడం మంచిది.

పర్సనల్..

ప్రతి వ్యక్తికి పర్సనల్ అనేది ఉంటుంది.  జీవితంలో మొత్తం అంతా తెరచిన పుస్తకంలా ఉంచడం మంచిది కాదు. పర్సనల్ జీవితాన్ని డిస్టర్బ్ చేసే పనులు,  పరిస్థితులకు దూరంగా ఉంచడం మంచిది.

దయ..

దయతో ఉండటం,  ఇతరులతో దయగా ప్రవర్తించడం చాలా ముఖ్యం.  ఇది మనిషిలో సున్నిత కోణాన్ని వ్యక్తం చేస్తుంది. జాలి, ప్రేమ,  దయ లేని వ్యక్తి రాయి వంటి వాడు, కఠిన మనస్కుడు అని అంటారు.   దయ కలిగిన వ్యక్తి ఎల్లప్పటికీ మంచితనంతో ఉంటాడు.

స్వంత గుర్తింపు..

ఇలా ఉండకు, అలా ఉండకు,  ఇది చేయకు, అది చేయకు.. ఇలా చాలా  మంది అంటూ ఉంటారు. ఇది కంట్రోల్ పెట్టడం అవుతుంది. దీనివల్ల ఒక వ్యక్తి  తన సహజ స్వభావాన్ని,  సహజ గుణాన్ని కోల్పోతాడు. సొంత గుర్తింపును కోల్పోయే వ్యక్తి ఎప్పటికీ సొంతంగా బ్రతకలేడు.

                               *రూపశ్రీ.