బాలికల హక్కులే వారి భవితకు చుక్కాని!!

‘ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఆశీర్వాదాన్ని పొందినట్టే’, ‘ఆడబిడ్డ పుడితే అదృష్టం’అనే మాటలు ఊరకనే రాలేదు. ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ కళ, సందడి, సంతోషం వెలకట్టలేనివి. ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఆ అనుభూతి ఎలా ఉంటుందో ఆడపిల్లలు ఉన్నవారికే అర్థమవుతుంది. ఇక ఆడపిల్లను సరైన విలువలు, విద్యతో పెంచే తల్లిదండ్రులు మెరుగైన సమాజానికి బాటలు వేస్తున్నట్టేనని నిస్సందేహంగా చెప్పొచ్చు. అయితే, నాణేనికి మరోవైపు అన్నట్టుగా.. ఈ సమాజం ఆడపిల్లలకు  ఒక సమస్యల సుడిగుండమే అని చెప్పాలి. ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టిన దగ్గర నుంచి తిరిగి లోపలికి వెళ్లే  అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు బాలికలకు కొన్ని ప్రత్యేక హక్కులు ఏర్పాటు చేశారు. ఈ హక్కులను గుర్తించడం, సవాళ్లను అధిగమించడంపై అవగాహన కల్పించడమే ధ్యేయంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది అక్టోబర్ 11న ‘అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని’ నిర్వహిస్తారు. ఈ మేరకు డిసెంబర్ 19, 2011న జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రకటన చేసింది. ఈ అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా బాలికల దినోత్సవం చరిత్ర, విశేషాలను గమనిద్దాం... చరిత్ర ఏం చెబుతోంది... బాలికలపై లైంగిక దాడులు, అఘాయిత్యాలను నియంత్రించి, వారి హక్కులపై అవగాహన కల్పించడం కోసం ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ప్రకటించింది. మహిళల ఆత్మగౌరవం రక్షణ కోసం పోరాడిన ఉద్యమకారుడు, అమెరికన్ పౌరహక్కుల కార్యకర్త ఎలానార్ రూజ్‌వెల్డ్ పుట్టిన రోజయిన అక్టోబర్ 11న ఈ దినోత్సవాన్ని నిర్వహించాలని ఐరాస నిర్ణయించింది. ఈ మేరకు 19 డిసెంబర్ 2011న జరిగిన ఐరాస సర్వసభ్య సమావేశంలో తీర్మానం జరిగింది. అక్టోబర్ 11, 2012న తొలి అంతర్జాతీయ బాలిక దినోత్సవాన్ని నిర్వహించాలని ఆమోదించారు. ఈ తీర్మానానికి అనుకూలంగా సభ్యదేశాలు పెద్ద సంఖ్యలో ఓటు వేశాయి. విద్య, పోషణ, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, హింస, బలవంతపు బాల్య వివాహాలు వంటి విషయాల్లో బాలికలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, లింగ అసమానతలపై అవగాహన కల్పించడమే ముఖ్యొద్దేశ్యంగా ఇది సాగుతుంది. ఇక బాలికలు, యువతులు వారివారి రంగాల్లో సాధించిన అభివృద్ధిని ప్రతిబింబించేలా కార్యక్రమాలను చేపడతారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వివిధ కార్యక్రమాల ద్వారా బాలిక అభ్యున్నతికి తోడ్పాటునందించే ప్రయత్నం చేస్తాయి. భారతదేశంలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతుంటాయి. నారీశక్తి అని, మహిళా రిజర్వేషన్లు అని ఎన్ని అడుగులు ముందుకు వేసినా కొందరు మహిళలు ఇంకా వెనుకబడే ఉన్నారు. 2023 థీమ్ ఏంటంటే... అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఒక ప్రత్యేకమైన థీమ్‌తో వేడుకలు నిర్వహిస్తుంటారు. ‘‘బాలికల హక్కుల్లో పెట్టుబడి: మన నాయకత్వం, మన సంక్షేమం’’ 2023 థీమ్‌‌గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. బాలికలకు రక్షణ, విద్య, ఆరోగ్యంగా జీవించే హక్కులపై అవగాహన కల్పించడమే ఈ థీమ్ ముఖ్య ఉద్దేశ్యం. బాలికల హక్కులు కేవలం చిన్నవయసులోనే కాదు.. మహిళగా రూపాంతరం చెందే వరకు సంరక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని ఈ ఏడాది థీమ్ చాటి చెబుతోంది. బాలికల సాధికారతకు మరిన్ని అడుగులు వేయాలని చెబుతోంది. బాలికలకు మరిన్ని అవకాశాలు కల్పించడం, కేవలం జెండర్ ఆధారంగా బాలికలు చవిచూస్తున్న లింగ అసమానత్వంపై అవగాహనను పెంపొందించడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత. ఆడపిల్లల సాధికారత పట్ల అవగాహన పొందడం, కల్పించడం, వీలైనంత మేర తోడ్పాటునందిస్తే అంతర్జాతీయ బాలికల దినోత్సవానికి గొప్ప గౌరవమిచ్చినట్టవుతుంది. మీ చుట్టుపక్కల బాలికల పరిస్థితి గమనించి సానుకూలంగా స్పందిస్తే మీ వంతు బాధ్యత నిర్వహించినట్టే!                                       *నిశ్శబ్ద.  

సంతోషమైన జీవితానికి తొలిమెట్టు మానసిక ఆరోగ్యమే..

మానసిక ఆరోగ్యం సరిగాలేని వ్యక్తులను పిచ్చివాళ్లంటూ హేళన చేస్తుంది ఈ సమాజం. అందరిలో కలిసేందుకు అనర్హులన్నట్టుగా వెలివేస్తుంది. ఇక మానసిక ఆరోగ్యం బావుంటే ఆత్మవిశ్వాసం వెన్నెంటే ఉంటుంది. ప్రతికూల పరిస్థితులను అధిగమించే ఆత్మస్థైర్యం తొణికిసలాడుతుంది. అంతేనా ఒత్తిడి ఆమడ దూరం పారిపోతుంది. మనిషి సాధారణ జీవితానికి ఎంతో ముఖ్యమైన మానసిక ఆరోగ్యాన్ని ఒక సాధారణ అంశంగా పరిగణించడం, మానసిక రుగ్మతలపై అవగాహన పెంపొందించడమే ముఖ్యొద్దేశంతో ప్రతి ఏడాది అక్టోబర్ 10న ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని’ నిర్వహించాలని 1992లో వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ ప్రకటించింది. దీని వెనుక చరిత్ర ఏంటి? మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ఏం చెయ్యాలి? తెలుసుకుంటే.. మానసిక ఆరోగ్యంతో జీవించడం పట్ల సరైన విజ్ఞానం, సంబంధిత సమస్యలపై అవగాహన కోసం ఉద్దేశించిన ‘ప్రపంచ మానసిక దినోత్సవాన్ని’ తొలుత ప్రత్యేక థీమ్ ఏమీ లేకుండానే నిర్వహించేవారు. అయితే ప్రపంచవ్యాప్తంగా జనాల్లో వస్తున్న విశేష స్పందనను పరిగణలోకి తీసుకొని 1994 నుంచి ప్రత్యేక థీమ్‌తో వేడుకలు నిర్వహించడం మొదలుపెట్టారు. ‘ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సేవలను మెరుగుపరచుకుందాం’ అనే తొలి థీమ్‌తో 1994లో ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ప్రతి ఏడాదీ పాపులారిటీ పెరుగుతూ వచ్చింది. అవగాహన పొందడం చాలా ముఖ్యం.. ప్ర‌ముఖుల నుంచి సామాన్యుల వ‌ర‌కూ చాలామంది ఒత్తిడిలో కూరుకుపోయిన‌ట్లు వార్త‌లు వ‌స్తుంటాయి. ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కూడా చాలానే వెలుగుచూశాయి. ఈ విధంగా ఎందరో ప్రముఖులు సైతం తమ జీవితాలను కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాన్ని మానసిక అనారోగ్యం నాశనం చేస్తోంది. మ‌హిళ‌లు, పురుషులు, చిన్నా-పెద్దా అనే భేదం లేకుండా ఎంతోమందిని కుంగుబాటుకు గురిచేస్తోంది. అయితే.. వారిలో ఎంతమందికి వైద్యం అందుతోందనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. ఈ పరిస్థితిని అధిగమించాలన్నా, వైద్యం అందాలన్నా అవగాహన కలిగివుండడం చాలా ముఖ్యం. ఈ ఉద్దేశ్యంతోనే ప్రతి ఏడాది ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.  నిజానికి బాధ‌, కోపం, నిరాశ, ఆందోళ‌న లాంటి భావోద్వేగాలు అందరికీ ఉంటాయి. అయితే డిప్రెష‌న్ బాధితుల్లో ఇవి దీర్ఘ‌కాలం కనిపిస్తాయి. వీటిని గుర్తించి జీవితాన్ని ప్ర‌భావితం చేయకముందే వైద్యులను సంప్రదిస్తే మేలు జరుగుతుంది. లేదంటే దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి వారు మన చుట్టూ మనతోపాటే ఉండొచ్చు. అలాంటి వారికి సరైన అవగాహన కల్పించడం ద్వారా వారి జీవితాన్ని కాపాడవచ్చు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం కూడా ఇదే. దీనికి అనుగుణంగా ఈ ప్రత్యేకమైన రోజున మానసిక ఆరోగ్యంపై అవగాహన పొందాలి, నలుగురికి అవగాహన కల్పించాలి. ఎవరైనా డిప్రెషన్ లో ఉంటే వారికి మానసిక ధైర్యం, సమస్యను ఎదుర్కొనే మార్గం సూచించాలి. మీతో మేమున్నామనే నమ్మకం వారికి కల్పించాలి. ఇలా చేస్తే ఈ ప్రపంచ మానసిక దినోత్సవానికి సార్థకత చేకూర్చినట్టు అవుతుంది. .  మానసిక ఆరోగ్యాన్ని మెరుగు మెరుగుపరుచుకోవడానికి  ఈ కింది నాలుగు అంశాలు రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలి.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వ్యాయామం శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. తద్వారా హార్మోన్లను నియంత్రిస్తుంది.  ఒత్తిడిని తగ్గిస్తుంది. పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది మానసిక శారీరక ఆరోగ్యానికి మేలు చేస్తుంది.  సరైన నిద్రకు ప్రాధాన్యతనివ్వాలి. ఎందుకంటే నిద్ర గొప్ప ఔషధం. ఇది ఒత్తిడిని నియంత్రిస్తుంది.  సానుకూల దృక్పథంతో ఆలోచించడం వల్ల డిప్రెషన్ ను జయించవచ్చు. ఏ విషయాన్ని అయినా అన్ని కోణాల నుండి ఆలోచించాలి. నెగిటివ్ గా మాట్లాడేవారికి కూడా దూరంగా ఉండాలి. *నిశ్శబ్ద.  

సమాజసేవ ఎందుకు చేయాలి? దానికి అవసరమైనది ఏంటి?

ధైర్యానికి బలం అవసరం లేదు. ధైర్యం శారీరక బలం మీద ఆధారపడి లేదు. అది మనస్సుకు సంబంధించినది. ధైర్యానికి ఆలంబన శారీరక బలమే అయితే పులి, సింహం, ఏనుగు లాంటి అడవి జంతువులు ఈ ప్రపంచాన్ని ఏలి ఉండేవి. కానీ వాటి ముందు సోదిలోకి కూడా రాని మనిషి చిన్న కర్రపుల్లతో వాటిని ఆడిస్తున్నాడంటే బలం అనేది శారీరక పరిమాణంలోగానీ, దేహ దారుఢ్యంలోగానీ లేదని అర్ధమవుతోంది. పిరికితనాన్ని దరి చేరనివ్వకపోవడమే ధైర్యం. నిస్సహాయ స్థితిలో కూడా నీరుగారిపోకుండా ఉండడమే ధైర్యం. ధనవంతుడు ధైర్యవంతుడు కాదు. ధైర్యవంతుడే ధనవంతుడు. ధైర్యవంతులంటే క్రూరమృగాలను చంపినవారో, ఖూనీలు చేసినవారో కాదు. ఒక మంచిపని కోసం ముందు నిలిచిన వారు. పరిస్థితులు ఏవైనప్పటికీ, సహకరించేవారూ, అనుసరించే వారూ లేకపోయినప్పటికీ అనుకున్న కార్యం కోసం కార్యరంగం లోకి దూకినవారు. ఉత్తమ లక్ష్య సముపార్జనలో పూర్వాపర విపరిణామాలను లక్ష్యం చేయనివారు. కొల్లాయి ధరించిన గాంధీజీ ధనికుడు కాదు. బలాఢ్యుడసలే కాదు. భవిష్యత్తులో ఇంతమంది తనను అనుసరిస్తారనే భరోసా కూడా లేదు. ఆయన ధ్యేయం స్వాతంత్ర్య సముపార్జన. అంతే! మదర్ థెరెసా ఓ సామాన్య స్త్రీ. భారతదేశంలోని నిరుపేదలకూ, నిర్భాగ్యులకూ సేవ చేయాలనే ఆమె అంకితభావం ముందు ఏ అననుకూల పరిస్థితి నిలబడలేదు. స్వామి వివేకానంద ఘన చరిత్ర జగమెరిగినదే. విజయాలన్నిటా ఆయన ఆయుధం ధైర్యమే. ఆయన ప్రపంచానికిచ్చిన సందేశం కూడా అదే! మన దేశంలోని స్త్రీలు ఎంతో ధైర్యవంతులు. శారీరక దుర్భలత్వం వారి దృష్టిలోకే రాదు. బిడ్డలను పెంచే అత్యంత సుకుమారమైన లాలనల నుండి దేశాన్నేలే కఠినతరమైన కార్యాల వరకూ నిర్వహించే సామర్థ్యమున్న ధీశాలురు. కష్టనష్టాల కారణంగా కుటుంబం మొత్తం క్రుంగిపోయి ఉన్న సమయాలలో ఆ ఇంటి ఇల్లాలే ధైర్యంగా నిలబడి కుటుంబానికి ధైర్యం  నూరిపోస్తుంది. ఆ సంకట స్థితిని ఎదుర్కొనే స్ఫూర్తి కలిగిస్తుంది. కొత్త ఊపిరిలూదుతుంది. బిడ్డను కబళించడానికి వచ్చిన పులిని అచ్చు ఆడపులి లాగే ఎదుర్కొంటుంది స్త్రీ. నిజమైన పురుషత్వం ధైర్యమే! ధీరత్వమే! రాణీ రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి స్త్రీ రత్నాలు శత్రువులకు సింహస్వప్నం అయ్యారంటే దానికి కారణం వారి కత్తులకున్న పదును కాదు, గుండెల్లోని ధైర్యం! అన్ని రకాలుగా అన్ని  కోణాల్లో ఈ సమాజానికి మనమెంతో సేవ చేయవలసి ఉంది. ఈ బాధ్యత మనం కొత్తగా తెచ్చిపెట్టుకోవలసినది కాదు. బరువుగా నెత్తికెత్తుకోవలసినది కాదు. జన్మతః వచ్చిన వారసత్వం. గౌరవంగా స్వీకరించ వలసిన కర్తవ్యం. ఈ కర్తవ్యం నెరవేర్చడానికి మనం పురుషులమా, స్త్రీలమా అనేది ప్రశ్నే కాదు. ధనికులమా, పేదలమా? బలాఢ్యులమా, బలహీనులమా? అన్న ప్రసక్తే లేదు. మనం మనుషులం, ఈ దేశ పౌరులం. అంతే! ఈ దేశం మన కుటుంబం అనుకుని ప్రతి ఒక్కరూ ధైర్యంతో ముందడుగేయాలి .                                             *నిశ్శబ్ద.

సమాచార వ్యవస్థలో బహుదూరపు బాటసారి.. పోస్టల్ సేవలు!

సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి ఇప్పుడంటే రకరకాల మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఇన్ఫర్మేషన్‌ని క్షణాల్లో సులువుగా గమ్యస్థానానికి చేరవేయగల వ్యవస్థలు ఎన్నో రూపుదిద్దుకున్నాయి. సామాన్యులు సైతం స్మార్ట్‌ఫోన్లు, టెలిఫోన్లు,  వందల సంఖ్యలో యాప్స్ ఇలా ఎన్నో సాధనాలు సమాచార వ్యవస్థ రూపురేఖల్నే మార్చేశాయి. కానీ ఇవేమీ లేని పూర్వ ప్రపంచానికి కొన్ని తరాలపాటు లేఖల ద్వారా విశిష్ట సేవలు అందించిన ఏకైక సాధనమే ‘పోస్టల్ వ్యవస్థ’. కుటుంబ సభ్యులు, ప్రియుమైన వ్యక్తులు, ప్రభుత్వప్రైవేటు వ్యవస్థల నుంచి శుభవార్తలైనా, చేదు సమాచారమైనా ఇంటి వద్దకే ఉత్తరాలు మోసుకొచ్చిన ఘనమైన చరిత్ర కలిగిన పోస్టల్ వ్యవస్థ దినోత్సవం నేడు. ‘వరల్డ్ పోస్టల్ డే’ అని కూడా అంటారు. గ్లోబల్ కమ్యూనికేషన్ వ్యవస్థకు నాంది పలికిన పోస్టల్ వ్యవస్థ గొప్పదనం, ప్రపంచ పోస్టల్ దినోత్సవాన్ని ఎందుకు నిర్వహిస్తారు?. ఇందుకు కారణాలు ఏంటి? అంత ప్రాధాన్యత ఎందుకు? వంటి విశేషాలను తెలుసుకుందాం.. పోస్టల్ డే ఎందుకు?.. 1874లో ఏం జరిగింది? ప్రపంచదేశాల మధ్య కమ్యూనికేషన్ కోసం స్విట్జర్లాండ్‌ రాజధాని బెర్న్ వేదికగా 1874 అక్టోబర్ 9న యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (UPU) ఏర్పాటైంది. UPU ప్రపంచంలోనే రెండవ పురాతన అంతర్జాతీయ సంస్థ కావడం విశేషం. ఇది ఏర్పాటైన తర్వాత ప్రపంచ దేశాల మధ్య పోస్టల్ రంగంలో విశిష్టమైన సహకారం పెరిగింది. ఆధునిక వస్తు,సేవలకు యూపీయూ ఏర్పాటు బాటలు వేసింది. ప్రపంచవ్యాప్తంగా లేఖలు, సమాచార మార్పడి వృద్ధి చెందింది. గ్లోబల్ కమ్యూనికేషన్స్ విప్లవానికి నాంది పలికిన యూపీయూ ఏర్పాటైన అక్టోబర్ 9ని ప్రపంచ తపాలా దినోత్సవంగా 1969లో జపాన్‌ రాజధాని టోక్యో వేదికగా జరిగిన యూపీయూ కాంగ్రెస్ నిర్ణయించింది. అప్పటి నుంచి ప్రపంచ దేశాలు ప్రతి ఏడాది వేడుకల్లో పాల్గొంటాయి. ప్రాముఖ్యత ఏంటి? పోస్టల్ రంగంపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడంతోపాటు సామాజిక, ఆర్థిక అభివృద్ధికి తపాలా రంగం అందిస్తున్న భాగస్వామ్యాన్ని ప్రతి ఒక్కరికీ గుర్తుచేయడమే లక్ష్యంగా ప్రతి ఏడాది అక్టోబర్ 9న అంతర్జాతీయ తపాలా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రపంచ గతిలో పోస్టల్ వ్యవస్థ పాత్రను చాటి చెప్పేలా వేడుకలు నిర్వహిస్తారు. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ యువకుల కోసం అంతర్జాతీయ లెటర్ రైటింగ్ పోటీ నిర్వహిస్తుంటుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఐక్యరాజ్యసమితి ప్రత్యేక థీమ్‌తో వరల్డ్ పోస్టల్ డే వేడుకలకు నిర్వహిస్తోంది.  ‘‘ విశ్వాసం కోసం ఉమ్మడిగా: సురక్షితమైన, అనుసంధాన భవిష్యత్తు కోసం సహకారం’’ అనే థీమ్‌తో ఈ ఏడాది పోస్టల్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని ఐరాస ప్రకటించింది. కాగా గతేడాది ‘ప్లానెట్ కోసం పోస్ట్’అనే థీమ్‌తో వేడుకలు నిర్వహించారు.  తపాలా దినోత్సవాన్ని అనేక మార్గాల్లో నిర్వహించవచ్చు. అనేక దేశాలు తపాలా కార్యాలయాల వద్ద ప్రత్యేక స్టాంపు సేకరణ, ప్రదర్శనలను చేపట్టనున్నాయి. పోస్టల్ చరిత్రపై వర్క్‌షాప్‌లు నిర్వహించనున్నాయి. ఇక వ్యక్తిగతం కూడా ప్రపంచ తపాలా దినోత్సవాన్ని నిర్వహించవచ్చు.  ప్రియమైన వ్యక్తులు, కుటుంబ సభ్యులకు లేఖలు రాసి పంపవచ్చు.. ఇలా చేస్తే సాంప్రదాయ పోస్టల్ వ్యవస్థ మీద అభిమానాన్ని చాటినట్టవుతుంది. అంతే కాదు.. ఏన్ని మాటలు ఫోన్లో అయినా, ఎదురుగా అయినా మాట్లాడినా అవన్నీ కొద్దిసేపటికే మరచిపోతారు. ఎంత గుర్తుంచుకున్నా కొన్నింరోజులు మాత్రమే వి గుర్తుంటాయి. కానీ ఉత్తరాల ద్వారా సాగే సంభాషణ ఆ కాగితాల్లో ఏళ్ల తరబడి అపురూపమైన జ్ఞాపకంగా ఉండిపోతాయి. అందుకే ఉత్తరాలకు గొప్ప ప్రాధాన్యత ఏర్పడింది. ఉత్తరాల కోసం  స్థానిక పోస్టాఫీసు సందర్శించాలి. అక్కడి సిబ్బందిని అడిగి పోస్టల్ చరిత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అంతేకాదు పోస్టల్ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగుల అనుభవాలను ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. తద్వారా ఉద్యోగులకు మద్దతు తెలిపినట్టవుతుంది. ఇలా చేయడం వల్ల వారిలో ఉత్సాహాన్ని నింపినట్టువుంది. ఇవీ పోస్టల్ డే విశేషాలు. మీ ప్రియమైన వారికి లేఖ రాయడం మరచిపోకండి మరి..!                                       *నిశ్శబ్ద.

భారత వాయుసేన గగన గర్జన.. యుద్ధమైనా, విపత్తయినా హీరోలా ఎంట్రీ..

శత్రు మూకలతో యుద్ధమైనా, ప్రకృతి విపత్తులతో పోరాటమైనా.. సాయం అడగకుండానే గగనం నుంచి ఆపన్నహస్తాన్ని చాచే మన హీరో ఎవరంటే ‘భారతీయ వాయుసేన’ (Indian Airforce). కేవలం ఆరుగురు అధికారులు, 19 మంది సిపాయిలతో ప్రస్థానం ప్రారంభించి నేడు ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద వాయుసేనగా భారతదేశానికి భరోసా, శత్రుదేశాలకు దడ పుట్టించగల సత్తావున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నేడు 91వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ప్రతి ఏడాది అక్టోబర్ 8న నిర్వహించే ఈ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ డే విశిష్టత, చరిత్రను ఒకసారి గుర్తుచేసుకుందాం. ఎయిర్‌ఫోర్స్ డే జరుపుకోవడానికి కారణం ఏంటి.. భారత వైమానిక దళాన్ని స్థాపించిన తేదీ 8 అక్టోబర్ 1932ని పురస్కరించుకొని ప్రతి ఏడాది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ డే నిర్వహిస్తారు. నిజానికి భారత వైమానిక దళాన్ని బ్రిటీష్ పాలనాకాలం 1932లోనే స్థాపించారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని రాయల్ ఎయిర్ ఫోర్స్‌కు సహాయక దళంగా భారత వాయుసేనను ఏర్పాటుచేశారు. మొదటి కార్యచరణ స్క్వాడ్రన్ ఏప్రిల్ 1933లో రూపుదిద్దుకుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న తర్వాత ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ పేరుకు ముందు రాయల్ అనే ట్యాగ్‌ను జోడించారు. అప్పటి నుంచి రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌గా పిలిచేవారు. అయితే 1950లో భారత్ గణతంత్ర దేశంగా అవతరించిన తర్వాత తిరిగి ‘ఇండియన్ ఎయిర్ ఫోర్స్’ పేరును స్వీకరించారు. 1933లో కేవలం ఆరుగురు అధికారులు, 19 మంది హవాయ్ సిపాయిలతో ఏర్పాటైన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ క్రమక్రమంగా తన శక్తిసామర్థ్యాలను మెరుగుపరచుకుంటూ నేడు ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద క్రియాశీల వైమానిక దళంగా రూపుదిద్దుకుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  అనేక సేవలు అందించింది. అనేక యుద్ధాలలో పాలుపంచుకుంది. పాకిస్తాన్‌తో నాలుగు యుద్ధాలు, చైనాతో జరిగిన ఒక యుద్ధం ఎంతో ముఖ్యమైనవి. ఒక్క యుద్ధాలే కాకుండా భారత భూభాగానికి అన్ని వేళలా పహారాకాయడం, గగనతలాన్ని సదా సంరక్షించడం, దేశ ప్రయోజనాలను కాపాడటంతోపాటు ప్రకృతి వైపరీత్యాల సమయంలో దేశానికి విశిష్టమైన సేవలు అందిస్తోంది. నిరంతరాయంగా నిస్వార్థ సేవలను దేశానికి అందిస్తోంది. వాయుసేన సేవలను గౌరవిస్తూ ప్రతి ఏడాది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ డే ఘనంగా నిర్వహిస్తుంటారు. ఎంతో ముఖ్యమైన ఈ రోజున వైమానిక దళ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పేలా ప్రత్యేక వైమానిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. మరింత దృఢంగా, పటిష్టంగా.. భారత సాయుధ దళాలలో ఒకటైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ముందుచూపుతో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది. భవిష్యత్‌లో ఎలాంటి యుద్ధ, విపత్కర పరిస్థితులనైనా అలవోకగా ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకంగా పటిష్టతపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా వాయుసేనలో అధునాతన టెక్నాలజీతో కూడిన విమానాలను ప్రవేశపెడుతోంది. విమానాల తయారీలో దేశీయ టెక్నాలజీ వినియోగించడంతోపాటు కొత్త సాంకేతికతతో కూడిన విమానాలను పలు దేశాల నుంచి సేకరిస్తోంది. ఇందుకోసం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తోంది. మరోవైపు నియామకాలపై కూడా శ్రద్ధ పెట్టింది. ముఖ్యంగా వాయుసేన మహిళలకు కూడా విశిష్ట ప్రాధాన్యతను కల్పిస్తుండడం మనమంతా గర్వించదగిన అంశం. మొత్తంగా..  ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దినోత్సవాన మన వాయుసేన మరింత పటిష్టంగా,  శత్రువులకు వణుకు పుట్టించేలా రూపాంతరం చెందాలని ఆకాంక్షిస్తూ ఎయిర్‌ఫోర్స్ హీరోలకు ఒక సెల్యూట్ చేద్దాం..                                           *నిశ్శబ్ద.

ప్రపంచం మీద తెల్లబంగారం మెరుపులు!!

ప్రపంచవ్యప్తంగా కోట్లాది మందికి జీవనోపాధి.. మానవాళి శరీరాన్ని సదా రక్షిస్తున్న దుస్తుల తయారీలో ముఖ్య ముడిపదార్థం..  ఫైబర్‌గా మాత్రమే కాకుండా ఆహారంగానూ అక్కరకొస్తున్న ఏకైక పదార్థం  ఒకటుంది. అదే ‘మనం తెల్ల బంగారం’గా పిలుచుకునే పత్తి. ప్రపంచవ్యాప్తంగా అనునిత్యం అనేక విధాలుగా అందరికీ ఉపయోగపడుతూ మరింత అన్వేషణలకు మార్గం చూపుతున్న పత్తి  దినోత్సవం నేడు (అక్టోబర్ 7). రోజువారి జీవితంలో విడదీయరాని ప్రాధాన్యత ఉన్న పత్తిని కేవలం ఒక ముఖ్యమైన వస్తువుగా మాత్రమే పరిమితం చేయలేం. గ్రామీణ జనాభాకు జీవనోపాధి కల్పించడంలో పత్తి ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాలు, ముఖ్యంగా వెనుకబడిన ప్రదేశాల్లో పత్తి ఒక ముఖ్యమైన ఆదాయ, ఆర్థిక, ఉపాధి వనరుగా విశిష్ట గుర్తింపు పొందింది. మనవాళి జీవితాల్లో అంత ప్రముఖమైన పత్తి ఆవశ్యకత, దాని ప్రయోజనాల గురించి సమాజంలో అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ప్రతి సంవత్సరం ప్రపంచ పత్తి దినోత్సవం నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 7న నిర్వహించే ఈ ప్రత్యేక రోజు ప్రాధాన్యతను ఏమిటో చూస్తే.. అసలు ఎలా మొదలైంది.. పత్తి దినోత్సవాన్ని నిర్వహించడం 2019లో ప్రారంభమైంది. సబ్-సహారా ఆఫ్రికాలోని బెనిన్, బుర్కినా ఫాసో, చాడ్, మాలీ అనే నలుగురు ప్రధాన పత్తిసాగుదారులు ఇందుకు తోడ్పడ్డారు. వీరు నలుగురు 2012లో ప్రపంచ పత్తి దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించారు. ఈ విషయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థకు ప్రతిపాదన చేశారు. 2019లో బెనిన్, బుర్కినా ఫాసో,చాడ్, మాలీల ప్రతిపాదనను ప్రపంచ వాణిజ్య సంస్థ స్వీకరించి మొదటి ప్రపంచ పత్తి దినోత్సవ వేడుకలను నిర్వహించింది. తొలిసారి జరిగిన ఆ వేడుకల్లో యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ కాటన్ అడ్వైజరీ కమిటీ, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ కూడా ఆ వేడుకల్లో పాలుపంచుకున్నాయి. దీంతో అప్పటి నుంచి పత్తి దినోత్సవం వేడుక కొనసాగుతోంది. పత్తి దినోత్సవం గమ్యం ఇదే.. ‘మేకింగ్ కాటన్ ఫెయిర్ అండ్ సస్టైనబుల్’ అనే థీమ్‌ను మూడవ అధికారిక పత్తి దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి స్వీకరించింది. వ్యవసాయం నుంచి ఫ్యాషన్ వరకు ఆర్థికాభివృద్ధిలో పత్తి పోషిస్తున్న పాత్రపై అవగాహన కల్పించాలని ఐరాస ఆశాభావం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ వాణిజ్యం, పేదరిక నిర్మూలన, సమ్మిళిత ఆర్థికాభివృద్ధి, ఉత్పాదక ఉపాధిని కల్పిస్తున్న పత్తి గొప్పతనాన్ని చాటి చెప్పాలని ఐరాస లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు ఐక్యరాజ్యసమితి అధికారిక వెబ్‌సైట్‌ చెబుతోంది. మెరుగైన ఉత్పత్తి, పౌషకాహారం, మెరుగైన పర్యావరణం, మెరుగైన జీవితం కోసం పత్తిరంగం పునరుద్ధరణను పత్తి దినోత్సవం గుర్తుచేస్తుంది. పత్తి దినోత్సవం లక్ష్యం సాకారం కావాలని సగటు పౌరులుగా అందరూ ఆశించాలి. ఇక  పత్తికి సంబంధించిన   రెండు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటే.. 1. ఒక టన్ను పత్తి సగటున 5 మందికి ఏడాది పొడవునా ఉపాధిని అందిస్తుందని అంచనాగా ఉంది. 2. వస్త్రాలు, దుస్తులలో ఉపయోగించే ఫైబర్‌తో పాటు ఆహార ఉత్పత్తులను పత్తి నుండి సేకరించవచ్చు. పత్తి విత్తనాల నుంచి తినదగిన నూనె, పశుగ్రాసం సేకరించవచ్చు.                                           *నిశ్శబ్ద.  

చిన్న చిరునవ్వు చాలు మనిషి జీవితాన్ని పాజిటివ్ గా మార్చడానికి..

‘ఒక చిన్ని నవ్వే నవ్వి యుద్ధాలెన్నో ఆపొచ్చు. ఒక చిన్న నవ్వే నవ్వి బంధాలెన్నో కలపొచ్చు’ అన్నాడు ఓ సినీగేయ రచయిత. ‘‘చిరునవ్వుతో శాంతి మొదలవుతుంది’’ అని చాలా గొప్ప మాట చెప్పారు మదర్ థెరిసా. నవ్వుకు ఉన్న శక్తి అలాంటిది మరి. చిన్న చిరునవ్వు స్నేహ బంధాలకు అంకురార్పణ చేస్తుంది. దూరమైనవారు దగ్గరవుతారు. నవ్వితే నవరత్నాలు అనే మాట ఏమో కానీ హాయిగా నవ్వితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మనసారా నవ్వడం మనిషికి నూతనోత్తేజాన్ని ఇవ్వడమే కాదు రోజంతా ఆహ్లాదకరంగా ఉండేందుకు బాటలు వేస్తుంది. చుట్టుపక్కల ఉన్నవారిలో కూడా పాజిటివ్ శక్తిని నింపే శక్తి నవ్వుకుంది. నవ్వడం మొదలెడితే ఆందోళనలు ఆమడ దూరం పారిపోతాయి. అంతెందుకు ప్రపంచాన్ని మరింత మెరుగైన ప్రదేశంగా మార్చే సులభమైన ఆయుధమే నవ్వు. అసలు నవ్వు గురించి ఇంతలా ఇప్పుడెందుకు చర్చించాల్సి వచ్చిందో  తెలుసా?  ఎందుకంటే నేడు (శుక్రవారం) ప్రపంచ నవ్వు దినోత్సవం ( World smile day). ప్రతి వ్యక్తి ఆనంద క్షణాల్లో తనతోపాటే ఉండే నవ్వు గురించి,  అక్టోబర్ 6నే ప్రపంచ నవ్వు దినోత్సవంగా ఎందుకు నిర్వహించుకుంటారు? అనే అంశాలను గురించి ఎంతమందికి తెలుసు??  ఆనందాన్ని, దయను వ్యాపింపజేసే సామర్థ్యమున్న నవ్వు గురించి, ప్రపంచమంతా జరుపుకునే నవ్వు దినోత్సవం గురించి  వివరాలు తెలుసుకుంటే.. అసలు ఎలా మొదలైందంటే.. నవ్వు దినోత్సవం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది.  మసాచుసెట్స్‌లోని వొర్సెస్టర్‌కు చెందిన హార్వే బాల్ అనే కమర్షియల్ ఆర్టిస్ట్ 1963లో స్మైలీ ఫేస్ సింబల్‌ని రూపొందించారు. నవ్వుతూనే దీనిని తయారు చేయడం విశేషం. ప్రజలు ఎల్లప్పుడూ నవ్వుతూ దయ, సంతోషాన్ని మరింత వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో 1999లో ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని నిర్వహించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి అక్టోబర్ నెలలో మొదటి శుక్రవారాన్ని నవ్వు దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.  వ్యక్తుల నేపథ్యంతో సంబంధం లేకుండా ఇతరులకు చిరునవ్వు పంచాలనే ఉద్దేశ్యంతో దీనిని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు చోట్ల వేర్వేరు విధాలుగా దీనిని నిర్వహిస్తారు. ప్రాముఖ్యత ఇదే.. ప్రపంచ చిరునవ్వు  దినోత్సవం నిర్వహించుకోవడానికి ఆ నవ్వులో దాగివున్న శక్తే కారణం. చుట్టుపక్కలవారిని చూసి నవ్వడం, నవ్వించడం, దయాగుణంతో కూడిన  చర్యలు. స్నేహపూర్వక, సహకార,  సానుకూలతను ప్రోత్సహించవచ్చు. అంతేకాదు ఎవరి రోజునైనా నవ్వు ప్రకాశవంతం చేయడానికి తోడ్పడుతుందని గమనించాలి. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మెరుగుపరచడానికి సాధారణ చిరునవ్వు ఎంతోకొంత శక్తినిస్తుందని గమనించాలి. అందుకే ప్రపంచ చిరునవ్వు దినోత్సవాన మీకు తెలిసినవారిని నవ్వించండి. నవ్వమని చెప్పండి. ఎవరి మీద అయినా కోపాలు, అలకలు ఉంటే వారి ముందు మనస్పూర్తిగా నవ్వి చూడండి. నిజంగా మనుషుల మధ్య అపార్థాలు, అపోహలు, గొడవలు అన్ని మంత్రమేసినట్టు మాయమైపోతాయి.  పసిపిల్లల నవ్వును కల్మషం లేనిది అంటారు. మనసులో ఏమీ పెట్టుకోకుండా నవ్వడం పిల్లలలో ఉన్న గొప్ప గుణం. ప్రతి మనిషి ఇలా నవ్వగలిగితే ఆ వ్యక్తి ఉన్నతవ్యక్తిత్వం కలిగిన వాడిగా రూపాంతరం చెందుతాడు.  స్నేహితులను, కుటుంబ సభ్యులను హాయిగా  నవ్వించే ప్రయత్నం కుటుంబాన్ని, బంధాలను దృఢంగా మారుస్తుంది. కేవలం కుటుంబంతో ఆగిపోకుండా సామాజిక మాధ్యమాల ద్వారా  నలుగురిని నవ్వించే ప్రయత్నం చేయవచ్చు. లాఫింగ్ క్లబ్బులు తరహాలో సన్నిహితులు, మిత్రులు అందరూ కలసి సరదాగా నవ్వు దినోత్సవానికి కితకితలు పెట్టొచ్చు. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. నవ్వు ఎప్పుడు ఆరోగ్యకరంగా ఉండాలి. ఇతరులను నొప్పించే పద్దతిలో నవ్వు సృష్టించడం వల్ల పెద్ద అనర్థాలే జరుగుతాయి. కాబట్టి ఆరోగ్యంగా నవ్వాలి, ఆరోగ్యంగా నవ్వించాలి. ఓ కవి  చెప్పినట్టు "నవ్వడం  భోగం, నవ్వించడం యోగం, నవ్వలేకపోవడం రోగం". గుర్తుపెట్టుకోండి మరీ..                                               *నిశ్శబ్ద.

మూగజీవాల మనుగడ కోసం మానవుడి స్వరం..

ఈ ప్రపంచంలో మనుషులతో పాటు జంతువులు, పక్షులు, సరీసృపాలు ఇలా చాలా జీవులు ఉన్నాయి. జంతువులకు లేని ఎన్నో అడ్వాంటేజస్ మనుషులకు ఉన్నాయి. ఈ కారణంగానే జంతువులు మనుషుల్లా అభివృద్ది చెందలేకపోయాయి.   అయితే జంతువులకు మనసుంటుంది. అవి కూడా వాటి మనసులో ఉన్న భావాల్ని వ్యక్తం చేయడానికి విభిన్న రకాలుగా ప్రయత్నిస్తాయి. వాటికి కావలసిన స్వేచ్చ గురించి మరెన్నో విషయాల గురించి చెప్పాలనుకుంటాయి. కానీ అవి చెప్పలేవు. అందుకే వాటి  తరపున సగటు మనిషే గొంతు వినిపిస్తాడు. జంతువుల సంరక్షణ,  జంతువుల హక్కులు, అంతరించిపోతున్న జంతుజాతుల కోసం పోరాడటం వంటి ఎన్నో విషయాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఒక రోజు ఏర్పాటుచేయబడింది. ఇది అక్టోబర్ 4వ తేదీన నిర్వహించబడుతుంది. ఈ రోజున జంతు ప్రేమికులు జంతువుల తరపున తమ గొంతును ప్రపంచానికి వినిపిస్తారు. అసలు ఈ జంతు దినోత్సపం ఎప్పుడు ఎలా ఏర్పడింది? మూగజీవుల కోసం ఒకరోజు ఏర్పాటు చెయ్యాలని అనిపించడం వెనుక కారణం ఏమిటి? పూర్తీ వివరాలు తెలుసుకుంటే.. చరిత్ర ఏం చెబుతోందంటే.. ప్రపంచ జంతు దినోత్సవం 1925లో హెన్రిచ్ జిమ్మెర్‌మాన్ బెర్లిన్‌లో మొదటిసారి  నిర్వహించింది. జిమ్మెర్‌మాన్, జర్మన్ జంతు ప్రేమికుల మ్యాగజైన్ “మ్యాన్ అండ్ డాగ్” ను  ప్రచురించారు.  జంతువుల పట్ల అవగాహన పెంచడానికి, ఆ అవగాహనను  మెరుగుపరచడానికి  ఈ ఈవెంట్‌ను ప్రారంభించారు. కాథలిక్కులందరూ గౌరవంగా భావించే  సెయింట్ ఫ్రాన్సిస్ జంతువులు ఇంకా ఇతర  అన్ని జీవులతో  ఎంతో గొప్ప అనుబంధాన్ని ఏర్పరుచున్నారు.   జంతువుల కోసం సెయింట్ ఫ్రాన్సిస్ ఎన్నో గొప్ప పనులు చేశారు.  ఈ రోజున కొన్ని కాథలిక్ చర్చిలు పెంపుడు జంతువులకు ఆశీర్వాదాలు అందిస్తాయి. ప్రపంచ జంతు దినోత్సవం పర్యావరణ శాస్త్రవేత్తలకు అంతరించిపోతున్న జాతులకు సంబంధించిన సమస్యలను చర్చించడానికి ఒక వేదికగా మారింది. 2003 నుండి, UK-ఆధారిత స్వచ్ఛంద సంస్థ నేచర్‌వాచ్ ఫౌండేషన్ ఈ ఈవెంట్‌ను ఏర్పాటు  చేసింది.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతు ప్రేమికులు ఈ ఈవెంట్ కు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని వ్యాప్తం చేస్తూ వచ్చింది. ప్రపంచ జంతు దినోత్సం రోజున  కేవలం పెంపుడు జంతువులకు మాత్రమే కాదు అడవి జంతువులు, అంతరించిపోతున్న జాతులు,  పర్యావరణ విధ్వంసం లేదా రక్షణ లేకపోవడం వల్ల  జరుగుతున్న నష్టాన్ని చర్చించడం, దాన్ని నిర్మూలించడానికి చర్యలు తీసుకోవడం. జంతువుల హక్కులు, వాటి సంరక్షణ, ప్రజల ఆలోచనలలో మార్పు మొదలైన విషయాల గురించి అవగాహన పెంచండం దిశగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సగటు పౌరుడి భాద్యత ఏంటంటే.. చాలామంది ఇళ్ళలో పెంపుడు జంతువులు ఉంటాయి. అయితే కేవలం పెంపుడు జంతువులనే కాకుండా సమాజంలో భాగంగా ఉన్న జంతువులకు కూడా ఆహారం ఇవ్వడం వాటి సంరక్షణ దిశగా ఆలోచన చెయ్యడం, జంతు హింస మానడం, జంతువుల పట్ల అనుచితంగా ప్రవర్తించేవారిలో మార్పు తీసుకురావడం, సమాజంలో మనుషులతోపాటు నివసించే హక్కు జంతువులకు ఉందని గుర్తించడం, ఈ విషయాలను అందరికీ తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. జంతువులకు ఫీలింగ్స్ ఉంటాయి. వాటిని గుర్తించి ఆ జంతువులతో ప్రేమగా మసలుకోవడం ఎంతో ముఖ్యం. మనిషి జంతువులను ప్రేమిస్తే మనిషి కంటే ఎక్కువ ప్రేమను అవి తిరిగి ఇస్తాయి. ఈ విషయాలు అందరూ గుర్తుపెట్టుకోవాలి. జంతు దినోత్సవం వెనుక కొన్ని ఆసక్తిర విషయాలు.. జంతువుల పట్ల తన గొంతు వినిపించడం అనేది ఇప్పటినాటి మాట కాదు. గ్రీకు తత్వవేత్త పైథాగరస్  జంతువులకు ఫీలింగ్స్ ఉంటాయని, అవి కూడా బాధపడతాయని, వాటికి కూడా ఆత్మ ఉంటుందని గుర్తించాడు. అందుకే అందరూ శాఖాహారం తీసుకోవాలని, జంతు హింస మానేయాలని  ఎప్పుడో చెప్పారు.   లూయిస్ గోంపెర్ట్జ్ అనే వ్యక్తి జంతువుల హక్కుల కోసం వాదించడానికి మొదటిసారి ఒక పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తకం పేరు “Moral Inquiries on the Situation of Man and of Brutes,” ఇది 1624లో జరిగింది. 1877లో సాహిత్య పరంగా కూడా జంతువుల హక్కులు, వాటి జీవితం గురించి ఒక నవల వెలువడింది. అన్నా సీవెల్ రచించిన ఈ  నవల 'బ్లాక్ బ్యూటీ'.  మానవేతర దృక్కోణం నుండి వ్రాయబడిన మొదటి ఆంగ్ల నవల ఇదే.   గుర్రాల చికిత్సపై ఈ నవల  చర్చను రేకెత్తిస్తుంది. ఫ్లోరెన్స్ ఇటలీలోని ఇంటర్నేషనల్ యానిమల్ ప్రొటెక్షన్ కాంగ్రెస్ ప్రపంచవ్యాప్తంగా 'ప్రపంచ జంతు దినోత్సవాన్ని' ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇది 1931 వ సంవత్సరంలో జరిగింది. సొసైటీ ఫర్ యానిమల్ ప్రొటెక్టివ్ లెజిస్లేషన్ (SAPL) USలో హ్యూమన్ స్లాటర్ చట్టం కోసం లాబీయింగ్ చేసిన మొదటి సంస్థ. ఇది 1955లో జరిగింది.                                                              *నిశ్శబ్ద.

ఈ పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దంటారు చాణక్యుడు..!!

చాణక్య నీతిలో జీవితానికి ఉపయోగపడే ఎన్నో విషయాలు ప్రస్తావించారు. జీవితంలో  ఏది సరైనది...ఏది తప్పు అని నిర్ణయించుకోవలసిన సందర్భాలు చాలా ఉన్నాయి.  కానీ కొన్ని పరిస్థితులలో నిర్ణయాలు తీసుకోవడం ప్రాణాంతకం అని ఆచార్య చాణక్య చెప్పారు. అవేంటో చూద్దాం.  ఆచార్య చాణక్యుడు మానవ ప్రవర్తనను చాలా లోతుగా అధ్యయనం చేశాడు. ఆ తర్వాత అతను తన చాణక్య నీతిలో అనేక సూత్రాలను వ్రాసాడు. వీటిని స్వీకరించడం ద్వారా ఒక వ్యక్తి  అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చు. తన నీతి శాస్త్రంలో, ఒక వ్యక్తి ఎవరికీ సమాధానం ఇవ్వకూడదు..వాగ్దానం చేయకూడదు లేదా ఏ నిర్ణయం తీసుకోకూడదు అనే మూడు పరిస్థితుల గురించి ఆయన ప్రస్తావించారు. లేకుంటే ఆ వ్యక్తి దాని చెడు పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని పేర్కొన్నారు. ఎప్పుడు వాగ్దానం చేయకూడదు? ఆచార్య చాణక్యుడు ప్రకారం, మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీరు ఎవరికీ ఎలాంటి వాగ్దానం చేయకూడదు. లేదంటే మీరు తర్వాత పశ్చాత్తాపపడవచ్చు. ఎందుకంటే  సంతోషంగా ఉన్న సమయంలో, ఒక వ్యక్తి కొన్నిసార్లు అతను నెరవేర్చలేని వాగ్దానాలను ఇస్తాడు. అందుకే వాగ్దానాలు ఎప్పుడూ ఆలోచించి మాత్రమే ఇవ్వాలని చాణక్య నీతిలో చెప్పబడింది. ఈ పరిస్థితిలో ఎవరికీ సమాధానం చెప్పవద్దు: మీరు కోపంగా ఉన్నప్పుడు ఎవరికీ సమాధానం చెప్పకూడదు. ఎందుకంటే కోపంతో ఉన్న వ్యక్తి తన నిగ్రహాన్ని కోల్పోతాడు. దీని కారణంగా అతను కొన్నిసార్లు ఎదుటివారి మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడతాడు. అందువల్ల, మీకు కోపం వచ్చినప్పుడు ఓపికపట్టండి.  నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకూడదు? ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే అటువంటి పరిస్థితిలో, తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు తప్పు కావచ్చు, దాని వల్ల భవిష్యత్తులో మీరు నష్టపోవాల్సి రావచ్చు. కాబట్టి, చాణక్య నీతి ప్రకారం, దుఃఖ సమయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.  

పేదరికం ఉంటే జీవితంలో ఎదగలేమనే నిరాశతో ఉన్నారా..

అంగవైకల్యం ఉన్నా అనుకున్నది సాధించగలమేమో   కానీ, ఆలోచనలకు వైకల్యం వస్తే దేన్నీ సాధించలేం. కాబట్టి పేదరికం ఒక శాపమని ఊహించుకొని శిలలా మారిపోవడం కన్నా, అదీ ఒక వరమేనని భావించి చైతన్యవంతంగా మారడం ధీరుని లక్షణం. నిజానికి పేదరికం శాపం కాదు. అది  కార్యసిద్ధికి సహకరించే ఒక సాధనం. జీవితంలో మహోన్నత స్థితికి ఎదిగిన మహాత్ముల్లో ఎంతోమంది పేదరికపు కడలిని దాటినవారేనన్న విషయాన్ని మరిచిపోకూడదు. ఉదాహరణకు గణిత శాస్త్రంలో అద్భుతమైన పరిశోధనలు చేసి విదేశీయుల్ని సైతం అబ్బురపరిచిన యువకుడు శ్రీనివాస రామానుజం; బాల్యంలో వార్తాపత్రికల్నీ, కిరాణా సామాగ్రినీ అమ్ముతూ చదువు కొనసాగించి గొప్ప శాస్త్రవేత్తగా పేరుగాంచిన 'భారతరత్న' అబ్దుల్ కలామ్ - ఆ పేదరికపు కొలనులో వికసించిన కుసుమాలే. అలాగే అబ్రహామ్ లింకన్, టంగుటూరి ప్రకాశం, కందుకూరి వీరేశలింగం, డాక్టర్ అంబేద్కర్ మొదలైన వారు కూడా పేదరికాన్ని ప్రగతికి సోపానంగా మలచుకొని విజయాలను సాధించినవారే. success, not as a reason for failure. The full scope of our ability and ingenuity is usually only called forth by problems. - R.J. Heathorn 'కష్టాలు మనలోని అంతర్గత శక్తిని వ్యక్తపరిచేందుకు తోడ్పడేవే కానీ అపజయాలకు గురిచేసేవి కావు' అని సానుకూల దృక్పథంతో ధైర్యంగా ముందుకు సాగిపోవడమే సరైన మార్గం.  మనస్సుంటే మార్గాలెన్నో! కాబట్టి ముందు మన మనస్సుకు నిరాశ అనే అంటువ్యాధి సోకకుండా జాగ్రత్త పడాలి.  స్వామి వివేకానంద ఇచ్చిన ఈ సందేశాన్ని అర్థం చేసుకుంటే ధైర్యంగా ముందుకు సాగడానికి తగినంత ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. Fire and enthusiasm must be in our blood... Think not that you are poor, that you have no friends. Ay. who ever saw money make the man? It is man that always makes money. - Swami Vivekananda పేదరికం వల్ల పస్తులుంటున్న  కుటుంబాలకు  ఆర్థికంగా సహాయపడడం  కుటుంబ సభ్యులుగా ప్రతి ఒక్కరి  ప్రథమ కర్తవ్యం. కాబట్టి ఏ చిన్న పనైనా చేస్తూ డబ్బు సంపాదిస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడవచ్చు. అలా పనిచేస్తూనే యువత చదువు కూడా కొనసాగించవచ్చు. చదివే పిల్లలు డబ్బు సంపాదించకూడదు అనే నియమం ఎక్కడా లేదు. పైన చెప్పుకున్న గొప్పవారి జీవితాలను ఆదర్శంగా తీసుకొని శ్రమిస్తే అప్పుడు శారీరక లోపం అయినా,  పేదరికం అయినా  శాపం కాదనీ, అది మీలో ఉన్న నైపుణ్యాన్నీ, సామర్థ్యాన్నీ నిరూపించడానికి ఒక అవకాశమనీ అర్థమవుతుంది.  అలాంటివారు జీవితంలో తప్పకుండా విజేతలు అవుతారు.                                          *నిశ్శబ్ద.

శ్రీకృష్ణుడి జీవితం నుండి ప్రతి ఒక్కరూ ఈ విషయాలు తెలుసుకుని ఆచరిస్తే విజేతలు అవుతారు..

ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని కృష్ణ పక్షం ఎనిమిదవ రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు.  కృష్ణుడు కేవలం పురాణాల్లోని ఒక పాత్ర, దశావతారాలలోని ఒక దైవం మాత్రమే కాదు. అయన  ఒక తత్వవేత్త, ఎడతెగని కర్మయోగి, తెలివైన వ్యక్తి ,  భవిష్యత్తు గురించి తెలిసినవాడు. కృష్ణుడి గురించి తెలిసిన వారు ఆయనను మార్గదర్శి అని కూడా అంటారు. ఆయన ఆలోచనలు  బోధనలు ఒకకాలానికి సంబంధించినవి కాదు.  ఇవొక నిరంతర ప్రవాహిని లాంటివి. యుగాలు మారినా ఆ వాక్యాలలో శక్తి, అందులో ఉన్న నిజం ఏమాత్రం మారలేదు.  జీవితంలో విజయవంతమైన వ్యక్తిగా ఎదగాలంటే శ్రీకృష్ణుడి జీవితం నుండి ఈ కింది విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. వాటి గురించి ఆలోచించాలి. వాటిని జీవితంలో ఆచరించాలి. అప్పుడే మనిషి జీవితంలో విజేత అవుతాడు. ప్రతికూల పరిస్థితులలో కూడా పట్టు వదలకూడదు. కృష్ణుడు భగవంతుని స్వరూపం అయినా ఆయన తన జీవితంలో కష్టాలు ఎదుర్కొన్నాడు. ఎన్నో గండాలనుండి ప్రాణాలు కాపాడుకున్నాడు. రేపల్లెనుండి కంసుడి వరకు ఎన్నో చోట్ల నిందలు, ప్రమాదాలు మోశాడు. కానీ వాటిని అధిగమించాడు. అలాంటి పట్టుదల అందరికీ ఉండాలి. మహాభారతాన్ని తరచి చూస్తే కృష్ణుడు  ఎప్పుడూ శాంతి కోసం పరితపించాడు. కానీ కౌరవ పౌండవుల యుద్దం అనివార్యం అయింది.  కృష్ణుడు అర్జునుడితో ఒకసారి చెబుతాడు. శాంతి కోసం ప్రయత్నించాలి, ఎన్నో ప్రయత్నాలు చేయాలి. ఏనీ సఫలం కాకపోతే చివరి అవకాశంగా మాత్రమే యుద్దాన్ని ఎంచుకోవాలని. ఇదే అందరి జీవితాలకు వర్తిస్తుంది. సమస్యలు పరిష్కరించుకోవాలి తప్ప గొడవలు పడటం, శత్రువులుగా మారడం వల్ల ఎప్పుడూ ఎవరూ ప్రశాంతతను పొందలేరు. గీతోపదేశం తెలుసుకున్న ప్రతి మనిషి తమ జీవితంలో ఎన్నో గొప్ప మార్పులు రావడం చూస్తారు. మనిషి ఐదుక్రియలు, జ్ఞానేంద్రియాలతో సహా మనస్సు ను కూడా జయించాలంటే సాత్వికాహారాన్ని తినాలని చెబుతాడు.  ఇది మనిషికి ధీర్ఘాయువును ఇస్తుంది. ఆరోగ్యం చేకూరుస్తుంది. శరీరం మనసు రెండు స్వచ్చంగా ఉంటాయి. కాబ్టటి సాత్వికాహారం అందరూ తీసుకోవాలి. కృష్ణుడు పాండవులకు మద్దతు ఇచ్చినా కౌరవులకు వ్యతిరేకి మాత్రం కాదు. కృష్ణుడు-జాంబవతులకు పుట్టిన కుమారుడు   సాంబుడు, కౌరవ రాజు అయిన దుర్యోధనుడి కూతురు లక్ష్మణ ను వివాహం చేసుకున్నాడు. దీన్నిబట్టి చూస్తే బంధువుల మధ్య విభేదాలు ఉండవచ్చేమో కానీ బంధాలను మాత్రం తెంచుకోకూడదు. శ్రీకృష్ణుడికి 16వేలా 100 మంది భార్యలు అని అందరూ బుగ్గలు నొక్కుకుంటారు. వీరందరిని నరకాసురుని బారి నుండి రక్షించాడు, వారికి ముక్తి కలిగించడం కోసం భార్యలనే అర్హతను ఇచ్చాడు తప్ప వారందరితో కృష్ణుడు ఎప్పుడూ శారీరక సంబంధం పెట్టుకోలేదు. పైపెచ్చు కృష్ణుడి భార్యలు అనే గౌరవాన్ని వారికి అందేలా చేశాడు. త్రేతాయుగంలో రావణుడిని అంతం అయినా, ద్వాపర యుగంలో కౌరవుల అంతం అయనా ఆడదాన్ని అవమానించినందువల్ల జరిగిన అనర్థాలే అవన్నీ. కాబట్టి ఆడవారిని గౌరవించాలి. వారిని అవమానిస్తే తిరిగి అనుభవించే సమయం వస్తుంది.                                                 *నిశ్శబ్ద.

జీవితంలో అనుకరణ ఎంతవరకు మంచిది!

పిల్లలు పెద్దల్ని అనుకరించడం, వాళ్ళలాగే గొప్పవాళ్ళు కావాలని ఆశించడం సహజమైన విషయం. మనం మనకు తెలియకుండానే ఇతరులను అనుకరిస్తుంటాం. మన జీవితంలో ఈ'అనుకరణ'ఎంత వరకు అవసరమో తెలుసుకోవడం మంచిది. తల్లితండ్రులతో మొదలు..  పిల్లలు ప్రధానంగా తల్లి తండ్రులను అనుకరిస్తారు. కాబట్టి తల్లితండ్రులు ముందుగా ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపితే పిల్లలు వారంతట వారే అమ్మా నాన్నల నుంచి అన్నీ నేర్చుకుంటారు. ఈ రోజుల్లో తల్లి తండ్రులకు పిల్లలతో కాస్త సమయం గడపడానికే తీరిక లేనప్పుడు వారి నుంచి పిల్లలు ఏం నేర్చుకోగలరు? నేటి తరం వారికి టీవీ, ఇంటర్ నెట్లో మిత్రులు, బంధువులు. పిల్లలు ఏమైనా పాఠాలు నేర్పుతున్నది ఇవే.. వీటిలో ఏముంటాయో  మనకూ తెలుసు. ఇలాంటి విషయాలు పిల్లలకు అలవాటు చేస్తే వారిలో ఏ పాటి ఉన్నత విలువలు అలవడతాయో మనం ఊహించవచ్చు. నేటి యువతరం ప్రసార మాధ్యమాల ప్రభావంతో ప్రతికూల భావాలకు బానిసలై, వాటినే తమ జీవితాల్లో అనుకరిస్తోంది. ఈ ప్రభావాలకు దూరంగా ఉంటూ, మనదైన ఉన్నత సంస్కృతికీ, ఆధ్యాత్మికతకూ ప్రాధాన్యం ఇచ్చినప్పుడే యువతీ యువకులు ప్రగతిని సాధించగలరు. వివేచనతో అనుకరణ ఉండాలి.. మనం సాధారణంగా ఒక వ్యక్తి, లేదంటే  సమాజంలో బయటకు కనిపించే ఎన్నో విషయాలకు ఆకర్షితులమై, వాటిని అనుకరించే ప్రయత్నం చేస్తాం. దీని వల్ల కొంచెం కూడా ప్రయోజనం లేకపోగా నష్టం కలిగి తీరుతుంది. సింహం చర్మాన్ని వేసుకున్నంత మాత్రాన గాడిద కాస్తా సింహం కాబోదు కదా! మనం వివేచన లేకుండా గుడ్డిగా ఎవరినైనా అనుకరిస్తే పురోగతి చెందే మాట అటుంచి, అధోగతి పాలయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి అనుకరణ వల్ల మన వ్యక్తిత్వాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ కోల్పోయి జీవచ్ఛవాలుగా మారతాం. అందుకే, మనం ఉన్నత విలువలను సొంతం చేసుకునే ప్రయత్నం చేయాలి. మంచిని అనుకరిస్తేనే ఉన్నత స్థితి..  మనం చెడును అనుకరిస్తే అధోగతిని పొందినట్లే, మంచిని అనుకరిస్తే ఉన్నతమైన స్థితికి చేరుకోగలం. 'Be not an imitation of Jesus, but be Jesus. You are quite as great as Jesus, Buddha, or anybody else' అని స్వామి వివేకానంద చెప్పారు. ఈ విషయాన్ని ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుంటే.. "ఒక దొంగ అర్ధరాత్రి సమయంలో రాజమందిరానికి వెళ్ళాడు. అక్కడ రాజు, రాణితో 'మన అమ్మాయి వివాహం నదిఒడ్డున తపస్సు చేసుకుంటున్న ఒక సాధువుతో జరిపించాలి'. అన్నాడు. ఇది విన్న దొంగ 'నేను సాధువు వేషం వేసుకుంటాను. అదృష్టం బాగుంటే నన్నే రాజకుమారి వరించవచ్చు' అని మనస్సులో అనుకున్నాడు. తరువాత రోజు రాజు సేవకులు నది ఒడ్డుకు వెళ్ళి సాధువులను ఒక్కొక్కరినీ రాజకుమారిని వివాహం చేసుకోవలసిందిగా కోరారు. అయితే ఎవరూ అంగీకరించలేదు. చివరకు ఈ ‘దొంగ – సాధువు' దగ్గరకు వచ్చి అడిగారు. ఇతను మౌనం వహించాడు. మౌనాన్ని అంగీకారంగా భావించి రాజ సేవకులు వెళ్ళి, జరిగినదంతా రాజుతో చెప్పారు. రాజు స్వయంగా ఆ నది ఒడ్డుకు వచ్చి, తన కుమార్తెను వివాహం చేసుకో వలసిందిగా ఆ దొంగ సాధువును ప్రార్ధించాడు. ఆ దొంగ- సాధువు తన మనస్సులో 'నేను సాధువు వేషం వేసినంత మాత్రాన స్వయంగా రాజు నా దగ్గరకు వచ్చి బతిమాలుతున్నాడు. నేను నిజంగా సాధువును కాగలిగితే ఈ జీవితం ఎంత సార్థకమవు తుందో కదా!' అని అనుకొని, వెంటనే తన మనస్సు మార్చుకున్నాడు. భవిష్యత్తులో గొప్ప సాధువుగా ప్రఖ్యాతి చెందాడు". మనం కేవలం ఒకరిని అనుకరించడంతో ఆగిపోకుండా వారిలో ఉన్న ఉన్నత విలువలను సొంతం చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే జీవితంలో మంచి స్థాయికి చెరగలం.                                  *నిశ్శబ్ద.

భగవద్గీత 1వ అధ్యాయం నుండి ఈ 3 పాఠాలు నేర్చుకోండి..!

భగవద్గీత మొదటి అధ్యాయం నుండి మనం మన ఆచరణ జీవితంలో అన్వయించుకోగల మూడు పాఠాలను నేర్చుకోవచ్చు. మనం మంచి జీవితాన్ని గడపడానికి భగవద్గీత ఒక దీపం. భగవద్గీత సూత్రాలను మన జీవితంలో స్వీకరించడం ద్వారా మనం మెరుగైన జీవితాన్ని గడపవచ్చు. భగవద్గీత మొదటి అధ్యాయంలో, అర్జునుడు శ్రీకృష్ణునితో, నా స్వంత సోదరులను చంపడం ద్వారా నేను విజయం సాధించినా, అది నాకు సంతోషాన్ని ఇవ్వదు, పశ్చాత్తాపాన్ని మాత్రమే ఇస్తుందని చెబుతాడు. భగవద్గీతలోని ఈ మొదటి అధ్యాయం అన్నదమ్ముల మధ్య ప్రేమ పాఠాన్ని నేర్పుతుందా..? లేక అన్నదమ్ముల మధ్య యుద్ధానికి నాంది పలుకుతోందా..? మరి మొదటి అధ్యాయంలో ఏం నేర్చుకుంటామో చూద్దాం.. 1. మంచి మూడ్ ఉండాలి: దుర్యోధనుడిని తలచుకున్నప్పుడల్లా అసూయపడే వ్యక్తిగా కనిపిస్తాడు. దుర్యోధనుడిలోనే కాదు మనలో అసూయపడే గుణం కూడా ఉంది. భగవద్గీత మొదటి అధ్యాయం నుండి మనం స్థిరమైన మనస్సు కలిగి ఉండాలని అర్థం చేసుకోవాలి. మనం ఇతరులకు ఎంతగా అసూయపడతామో, అంత ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటాం. భగవద్గీత మొదటి అధ్యాయం నుండి మనం ఇతరులపై అసూయపడకూడదని.. స్థిరమైన మనస్సును కలిగి ఉండకూడదని నేర్చుకోవచ్చు. 2. అభ్యాసం నిరంతరంగా ఉంటుంది: మనం ఎంత నేర్చుకున్నా, మనకు తెలిసినది పరిపూర్ణమైనది కాదు. నేర్చుకోవడం ఎప్పటికీ శాశ్వతం కాదు. మనం ఏమి నేర్చుకున్నా, మరింత తెలుసుకోవడానికి చాలా ఆలోచనలు ఉన్నాయి. మహాభారతంలో, అర్జునుడు ఎల్లప్పుడూ జీవితం గురించి ఆసక్తిగా ఉండేవాడు. జీవితాంతం విద్యార్థిగా ఉండాలనుకున్నాడు. ఈ కారణంగా అతను శ్రీకృష్ణుడితో స్నేహం చేశాడు. శ్రీకృష్ణునికి శరణాగతి చేయడం ద్వారా, అతను అతని నుండి అన్ని రకాల జ్ఞానాలను పొందుతాడు. 3. జీవితంలో విజయం సాధించడానికి అన్ని పనులు చేయండి: మనం విజయవంతమైన జీవితాన్ని గడపాలంటే, పనిలో ప్రతిష్టను లెక్కించకూడదు. పని పెద్దదైనా చిన్నదైనా దాన్ని పూర్తి చేయాలనే దృఢ సంకల్పం ఉండాలి. ఉదాహరణకు: అర్జునుడు కృష్ణుడిని తన రథసారధిగా ఉండమని కోరినప్పుడు, కృష్ణుడు ఆ ప్రతిపాదనను సంతోషంగా అంగీకరించాడు. “నేనే పరమాత్మను, నేనే భగవంతుడిని. నేనెందుకు రథసారధి పాత్రను ధరించాలి?” అని ఆలోచించినవాడు కాదు, వెనక్కి తగ్గినవాడు కాదు. శ్రీకృష్ణుడు పనిలో విజయం గురించి మాత్రమే ఆలోచించాడు. భగవద్గీత మొదటి అధ్యాయం యుద్ధానికి నాంది పలికింది. యుద్ధం ఎలా ప్రారంభించాలి..? ఇది ఎలా ప్రారంభించాలో మీకు చెబుతుంది. ఈ అధ్యాయం నుండి మనం పైన పేర్కొన్న మూడు సూత్రాలను లేదా సందేశాలను మన జీవితాల్లో స్వీకరించడం ద్వారా మెరుగైన జీవితాన్ని గడపవచ్చు.  

అబ్రహం లింకన్ వ్యక్తిత్వాన్ని తెలిపే అద్భుత సంఘటన..

అబ్రహామ్ లింకన్ అమెరికా అధ్యక్షునిగా ఎన్నిక కాగానే అమెరికాలోని కోటీశ్వరులు, ప్రముఖులు, అతిగౌరవనీయ కుటుంబాలకు చెందిన వేల మంది లోలోన అతలాకుతలమై పోయారు. ఎందుకంటే లింకన్ తండ్రి వడ్రంగి పనితో పాటు చెప్పులు కుట్టి జీవించాడు. అలాంటి హీనమైన వృత్తి చేసినవాడి కొడుకు తమ దేశానికి అధ్యక్షుడా! అతని హయాంలో తాము జీవించాలా! అది తమకు తలవంపులు అన్నది వారి బాధ. అమెరికా 'సెనేట్'లో అందరూ ప్రముఖ వ్యాపారవేత్తలూ, అత్యంత ధనవంతులూనూ! లింకన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత, సెనేట్ను ఉద్దేశించి తన తొలి ఉపన్యాసాన్ని ప్రారంభించాడు. ప్రసంగం ప్రారంభమైన కొద్దిసేపటికి, ఎంతో గర్విష్టి అయిన ఓ కోటీశ్వరుడు లేచి, తన బూట్లను అందరికీ కనిపించే విధంగా చేతితో పట్టుకుని, వాటిని గాలిలో ఊపుతూ, బిగ్గరగా అరుస్తూ లింకన్ ప్రసంగానికి అడ్డు తగిలాడు. "మిస్టర్ లింకన్! నువ్వేదో అనుకోకుండా అధ్యక్షుడవయ్యావు గానీ, నీ తండ్రి చెప్పులు కుట్టేవాడు. ఆ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకు! మీ నాన్న మా కుటుంబంలో ప్రతి ఒక్కరికీ చెప్పులూ, బూట్లు కుట్టేవాడనేది వాస్తవం! ఇదిగో! నేనిప్పుడు చూపిస్తున్న బూట్లు ఒకప్పుడు మీ నాన్న కుట్టినవే!" అని అరిచాడు అతడు. అతడి మాటలు విని సెనేట్లో ఉన్న వారంతా ఘల్లున నవ్వారు. అలా నవ్వడం ద్వారా తాము కూడా ఆ కోటిశ్వరుడితో పాటు లింకన్ ను దారుణంగా అవమానించగలిగామని సంతోషించారు. లింకన్ కొన్ని క్షణాలు తన ప్రసంగాన్ని ఆపి, మౌనంగా నిలబడి పోయాడు. అతని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. భావోద్వేగాన్ని అణచుకుని, ప్రశాంత స్వరంలో తన ఉపన్యాసాన్ని ఇలా పునఃప్రారంభించాడు: "ఈ సమయంలో నా తండ్రిని నాకు జ్ఞాపకం తెచ్చినందుకు మీకు నేనెంతైనా కృతజ్ఞుణ్ణి. నా తండ్రి చెప్పులు కుట్టడంలో చాలా నేర్పరి. ఏ రంగంలో చూపించినా ప్రతిభ అనేది గొప్పదే. నేను అధ్యక్షుడిగా, నా తండ్రి తన వృత్తిలో చూపించినంతటి ప్రతిభను చూపించడానికి ప్రయత్నిస్తాను!" అన్నాడు. ఒక్క క్షణం ఆగి, తన గంభీర స్వరంతో, "ఇంతకు ముందు ఈ పెద్ద మనిషి చెప్పినట్లే మా తండ్రి వారి కుటుంబంలోని అందరికీ చెప్పులు కుట్టాడు. వీళ్ళ కుటుంబంలో వాళ్ళకే కాదు ఇంకా చాలామంది శ్రీమంతుల కుటుంబాలలోని వాళ్ళకు పాదరక్షలు కుట్టాడు. మా నాన్న చెప్పులు కుట్టడం లోని నేర్పును తన వారసత్వంగా నాకు కూడా కొంత ప్రసాదించాడు. ఆయన కుట్టిన చెప్పులు మీకు సరిగ్గా సరిపోక పోయినా, బిగుతుగా ఉన్నా, మీ కాళ్ళకు నొప్పి కలిగిస్తున్నా. నాకు ఇవ్వండి. నేను వాటన్నింటినీ చక్కగా సరిచేసి మళ్ళీ మీకు ఇస్తాను. నేను ఆ తండ్రి కొడుకును. ఇప్పుడే కాదు, ఎప్పుడూ చెప్పులు కుట్టడానికి సిగ్గుపడను" అంటూ ముగించాడు. సభ అంతా నిశ్శబ్దంతో నిండి పోయింది. అంతా నిశ్చేష్ఠులయ్యారు. లింకన్ లాంటి మేరునగధీరుణ్ణి అవమానించడం అతి కష్టమని సెనేటర్లందరికీ అప్పటికి అర్ధం. అయింది.                                            *నిశ్శబ్ద.

శత్రువులను ఓడించాలంటే..ఇవి అవసరం

ఆచార్య చాణక్యుడు తన నీతిలో మానవ జీవితానికి సంబంధించిన అనేక సమాచారాన్ని అందించాడు. చాణక్యుడు ప్రకారం, ప్రతి మనిషికి శత్రువులు ఉంటారు. చాణక్యుడి నీతి ప్రకారం, ప్రతి వ్యక్తి తన శత్రువును బలహీనుడిగా భావించకూడదు, వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీ శత్రువులు అవకాశం దొరికిన వెంటనే మిమ్మల్ని దెబ్బతీస్తారు. శత్రువులను ఓడించడానికి ఆచార్య చాణక్యుడు తన నీతిలో కొన్ని విషయాలను ప్రస్తావించాడు. ఆ విషయాలు మీకు తెలుసా?  చెడు సహవాసాన్ని నివారించండి: చాణక్య నీతి ప్రకారం, ఒక వ్యక్తి తన కుటుంబంతో పాటు తన స్నేహితులతో, పనిలో ఉన్న వ్యక్తులతో ఎక్కువ సమయం గడుపుతాడు. అందువల్ల, ప్రతి వ్యక్తి తన సంస్థపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎవరు మంచివారో, ఎవరు సహవాసానికి అర్హులో చెక్ చేసుకోవాలి. మన చుట్టూ ఉన్నవారు లేదా మన సహవిద్యార్థులు ఎక్కువ సమయం మనకు హాని చేయడానికి వేచి ఉంటారు. అదే సమయంలో, మన సహవాసం చెడ్డవారితో ఉంటే, శత్రువు దానిని పూర్తిగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తాడు. అవకాశం వస్తే దాడి చేయడానికి వేచి ఉంటాడు. అందుకే ఎవరితో స్నేహం తీసుకోవాలన్నదానిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మీ ప్రసంగం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి: చాణక్యుడి నీతి ప్రకారం, మనిషి తన ప్రసంగంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ శత్రువు దానితో మీకు మరింత హాని చేయడానికి ప్రయత్నిస్తాడు. మీ ప్రసంగం చెడ్డది అయితే, మీ సంబంధం క్షీణించవచ్చు. పేలవమైన ప్రసంగం కారణంగా, మీ మంచి స్నేహితులు, బంధువులు మిమ్మల్ని దూరం చేయడం ప్రారంభిస్తారు. ప్రతి ఒక్కరూ చేదు, కఠినంగా మాట్లాడే వ్యక్తుల గురించి ఫిర్యాదు చేయడానికి ఇష్టపడతారు. అందుకే ఎప్పుడూ ఎదుటివారితో మాట్లాడేటప్పుడు మాటను మధురంగా ఉంచుకోవాలని, వినయంతో మాట్లాడాలని చాణక్యుడు అంటాడు. చెడు అలవాట్లను వదిలేయండి: ప్రతి వ్యక్తి వ్యసనం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. శత్రువులు మాదకద్రవ్యాల బానిసలను చాలా సులభంగా ఓడిస్తారు. మత్తులో ఉన్న వ్యక్తి తన తెలివితేటలను, విచక్షణను ఈ విధంగా ఉపయోగించుకోలేడు. అటువంటి పరిస్థితిలో, అతను తప్పు చేస్తాడు. ఇది మీ శత్రువులు ప్రయోజనాన్ని పొందడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, మీరు మీ శత్రువును ఓడించాలనుకుంటే, మీ శత్రువుకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని మీరు కలిగి ఉండాలి. ప్రతి మనిషి తన శత్రువుల బలాన్ని తెలుసుకోవాలి. మీ శత్రువు గురించి మీకు పూర్తి అవగాహన ఉంటే, మీరు వారిని సులభంగా ఓడించగలరు. చాణక్యుడి తత్వశాస్త్రం ప్రకారం, పై విషయాలలో జాగ్రత్తగా ఉంటే శత్రువును సులభంగా ఓడించవచ్చు. మన శత్రువుల పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలనీ, నిర్లక్ష్యంగా ఉండకూడదనీ చాణక్యుడు చెబుతున్నాడు.   

మీ కష్టాలకు కారణం ఇవే..!!

మన చుట్టూ ఉన్న వ్యక్తులను విభిన్న వ్యక్తిత్వంతో చూస్తాం. కొందరు ఎప్పుడూ సంతోషంగా ఉంటే మరికొందరు ఎప్పుడూ విచారంగా ఉంటారు. అలాంటి వారి గురించి చాణక్యుడు తన చాణక్య నీతిలో చెప్పాడు. మనిషి ఎప్పుడూ విచారంగా ఉండడానికి కారణమేంటో తెలుసా..?  మోసపూరిత వ్యక్తులతో స్నేహం: ఆచార్య చాణక్యుడు ప్రకారం, మోసపూరిత వ్యక్తితో స్నేహం చేయడానికి ఎవరూ ఇష్టపడరు. ఎందుకంటే మోసపూరిత వ్యక్తులు తమ స్నేహితులను ఏదో ఒక ఆలోచనతో బాధపెడతారు. జిత్తులమారి తనకు మంచివా, చెడ్డవా అన్నది పట్టించుకోడు. అతను మొదట తన మంచిని దృష్టిలో ఉంచుకుంటాడు. ఈ కారణంగా ఏ వ్యక్తి కూడా మోసగాళ్లతో స్నేహం చేయడానికి ఇష్టపడడు. దీనివల్ల వారు నిత్యం కష్టాల్లోనే ఉంటారు. ఒంటరిగా: ఆచార్య చాణక్యుడు ఒంటరివాడు ఎప్పుడూ విచారంగా ఉంటాడని చెప్పాడు.  ఒంటరిగా ఉండాలనుకునే వ్యక్తులు తమ స్నేహితులందరినీ దూరం చేసుకుంటారు. అయితే, వారికి చాలా మంది శత్రువులు ఉంటారు. ఒంటరిగా ఉండాలనుకునే వ్యక్తులు తమ బాధలను ఎవరితోనూ పంచుకోరు. తమను తాము అనుభవించడం ద్వారా వారు ఎల్లప్పుడూ దుఃఖపు గుంటలో ఉంటారు. ఇతరులను బాధపెట్టే వ్యక్తి: ఇతరులకు హాని కలిగించే లేదా బాధించే వ్యక్తికి దూరంగా ఉండాలని కోరుకోవడం సాధారణం. మనం చేయలేని వాటితో మనం ఉన్నవారిని బాధపెట్టకూడదు లేదా హాని చేయకూడదు. కానీ, కొందరు అలాంటి తప్పులు చేస్తుంటారు. ఇది వారికి మరింత దుఃఖాన్ని, అసూయను సృష్టిస్తుంది. సమస్యలను గోప్యంగా ఉంచే వ్యక్తి:  కొంతమంది తాము ఏ సమస్యలో ఉన్నా ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. వారు దాని నుండి అన్ని బాధలను అనుభవించడానికి సిద్ధంగా ఉంటారు. వారి మనసు ఎప్పుడూ దుఃఖంతో బరువెక్కుతుందని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. చాణక్య నీతిలో చాణక్యుడు చెప్పిన ప్రకారం, సత్యవంతులు, జ్ఞానులతో స్నేహం చేసే వ్యక్తి ఏ కారణం చేతనూ దుఃఖపడడు. తనకి ఏదైనా దుఃఖం కలిగితే దాన్ని స్నేహితులతో పంచుకుని తగ్గించుకుంటాడు.

ఈ ఆరుగురి గురించి చెడుగా మాట్లాడకూడదు..!!

ఈ 6 మంది వ్యక్తుల గురించి చెడుగా ఆలోచించకూడదని లేదా చెడుగా మాట్లాడకూడదని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. భగవద్గీత ప్రకారం మనం ఏ 6 మందిని అవమానించకూడదో తెలుసా..? శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఫలానా వ్యక్తులను అవమానించకూడదని.. వారి గురించి చెడుగా ఆలోచించకూడదని చెప్పాడు. ముఖ్యంగా ఈ 6 మంది గురించి ఎప్పుడూ చెడుగా ఆలోచించకూడదని చెప్పాడు. ఈ ఆరుగురు వ్యక్తుల గురించి చెడుగా ఆలోచిస్తే మనల్ని నాశనం చేసే అవకాశం ఉంది. వారిని అవమానించడం ద్వారా మనమే నాశనం చేసుకుంటాం. శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారం మనం ఏ 6 మందిని చెడుగా చూడకూడదో తెలుసా..? వారి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.. దేవతల గురించి: భగవంతునిపై తక్కువ విశ్వాసం ఉన్నవారిని నాస్తికులు అంటారు. అలాంటి వ్యక్తులు ఎప్పుడూ దేవుడి గురించి చెడుగా మాట్లాడతారు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన ప్రకారం, అటువంటి వ్యక్తులు వీలైనంత త్వరగా నశిస్తారు. కాబట్టి మీరు ఈ తప్పు చేయడం మానేయాలి. ఈ తప్పు చేయడం వల్ల మీరు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇది మీరు దేవుని కోపానికి గురి కావచ్చు. వేదాల గురించి: వేదాలు ప్రపంచంలోని పురాతన,  గొప్ప గ్రంథాలలో ఒకటిగా పరిగణిస్తారు. వేదాలలో సనాతన ధర్మం గురించి మాత్రమే కాదు. ఇది మనకు శాస్త్రీయ ఆలోచనలను కూడా చెబుతుంది. మన జ్ఞానాన్ని పెంపొందించే, ఏదైనా విషయాన్ని తెలియజేసే పవిత్ర వేదాలను మనం ఎప్పుడూ అవమానించకూడదు. ఆవు గురించి: మత గ్రంధాల ప్రకారం, గోమాతలో కోట్లాది దేవతలు నివసిస్తారని నమ్ముతారు. అందుకే ఆవును పూజనీయమైనదిగా భావిస్తారు. గోవులు మానవులకు అన్ని విధాలుగా క్షేమాన్ని కలిగిస్తాయి. అందుకే మనం ఆవులను తల్లిగా గౌరవిస్తాం. బ్రాహ్మణుల గురించి: మత గ్రంధాల ప్రకారం, బ్రహ్మదేవుని నోటి నుండి బ్రాహ్మణులు జన్మించారని నమ్ముతారు. దీనివల్ల బ్రాహ్మణులు గౌరవించబడ్డారు. వారి గురించి చెడుగా మాట్లాడకండి. వారు తప్పు చేసినా మనం వారిని అవమానించకూడదని భగవద్గీతలో పేర్కొన్నారు. మతం గురించి: మతం గురించి అవగాహన లేని లేదా మతం గురించి సరిగా తెలియని వ్యక్తులు మతం గురించి అసంబద్ధంగా ప్రవర్తిస్తారు. మతానికి విశాలమైన అర్థం ఉంది. కాబట్టి సరిగ్గా ఆలోచించకుండా లేదా తెలియకుండా మతం గురించి చెడుగా మాట్లాడకండి. ఋషి గురించి: శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఋషులను ఎప్పుడూ అవమానించకూడదని లేదా వారి గురించి చెడుగా మాట్లాడకూడదని చెప్పాడు. మీకు వీలైతే, మీరు వారికి సహాయం చేయాలి లేదా వారికి అవసరమైన వస్తువులను విరాళంగా ఇవ్వండి. అది మీకు మేలు చేస్తుంది.  

విజేతగా నిలవాలని అనుకునేవారు తెలుసుకోవలసిన విషయమిది!!

మనిషి జీవితంలో విజయం సాధించాలంటే చాలా కష్టాలు ఎదుర్కోవాలి. కానీ విజయం సాధించి మళ్ళీ కింద పడి, ఎమ్మల్లి లేచి నిలదొక్కుకోవాలంటే మాత్రం కష్టం, తెలివి, ఆత్మవిశ్వాసం, తన మీద తనకు నమ్మకం.. ఇవ్ణనే ఉండాలి. దేనికి ఒక కథ ఉదాహరణగా నిలుస్తుంది. విదేశంలోని ఒక వ్యాపారవేత్త అనుకోని పరిస్థితుల్లో ఘోరంగా దివాళా తీశాడు. ఫలితంగా అప్పుల్లో కూరుకుపోయాడు. మరోవైపు ఆయనకు డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తులు కూడా ముఖం చాటేస్తూ ఉన్నారు. ఈ విషయం తెలిసిన అప్పుల వాళ్ళు తీవ్రంగా ఒత్తిడి తెస్తూ ఉన్నారు. పరిస్థితి అగమ్యగోచరమైపోయింది. ఎంతో ఆందోళనతో ఆ వ్యాపారి ఒక రోజు తన ఇంటికి సమీపంలోని ఓ పార్క్ కు  వెళ్ళి, తలపై చేతులు పెట్టుకొని విషాదంగా కూర్చున్నాడు. ఇంతలో హుందాగా వస్త్రధారణ చేసుకున్న ఓ అరవై ఏళ్ళ వృద్ధుడు ఆయన వద్దకు వచ్చాడు. "ఏదో కోల్పోయిన వాడిలా ఉన్నావు. జీవితంలో ఏమైనా నష్టం వాటిల్లిందా?" అని అడిగాడు. ఎంతో ఆత్మీయంగా పలకరించే సరికి, కదలిపోయిన ఆ వ్యాపారి తన కష్టనష్టాల్ని ఆ పెద్దాయనకు వివరించాడు. వెంటనే ఆ వృద్ధుడు స్పందించి "నేను నీకు ఏదైనా సహాయం చేద్దామనుకుంటున్నాను" అంటూ, "నీ పేరేంట"ని అడిగాడు. ఆ వ్యాపారి తన పేరు చెప్పగానే వెంటనే తన చెక్ బుక్ జేబులో నుంచి తీసి, ఆ పేరుతో చెక్ రాసి, సంతకం చేసి వ్యాపారి చేతిలో పెట్టాడు. "ఈ చెక్కు తీసుకో. నేను దీన్ని నీకు అప్పుగా ఇస్తున్నాను. సరిగ్గా సంవత్సరం తరువాత నేను నిన్ను ఇక్కడే కలుస్తాను. అప్పుడు నా అప్పు తీర్చేయ్" అన్నాడు. అయిదు లక్షల డాలర్ల చెక్కు అది. పైగా ఇచ్చిన వ్యక్తి ఎవరో కాదు - ప్రపంచంలోనే అత్యంత శ్రీమంతుల్లో ఒకరైన రాక్ఫెల్లర్ అని తెలిసి వ్యాపారికి నోట మాట రాలేదు. ఆ చెక్కు తీసుకొని ఇంటికి చేరుకున్నాడు ఆ వ్యాపారి. కానీ దాన్ని నగదుగా మార్చుకొని అప్పులు తీర్చుకోలేదు. దాన్ని బీరువా అరలో పెట్టుకొని, అది ఉందన్న నమ్మకంతో ముందు తన వ్యాపారాన్ని చక్కదిద్దుకోవడం మొదలుపెట్టాడు. ఆ అయిదు లక్షల డాలర్లు తన వెనుక ఉన్నాయన్న విశ్వాసంతో ధైర్యంగా ముందడుగు వేశాడు. అప్పుల వాళ్ళ వద్దకు వెళ్ళి, కొద్దిరోజులు గడువు ఇవ్వమని అడిగాడు. తనకు రావలసిన మొత్తాన్ని చాకచక్యంతో రాబట్టుకున్నాడు. తిరిగి కొంత పెట్టుబడితో కొత్త వ్యాపారం ప్రారంభించాడు. కొన్నాళ్ళకు మళ్ళీ తన పూర్వవైభవానికి చేరుకున్నాడు. సరిగ్గా సంవత్సరం తరువాత అదే చెక్కు తీసుకొని, కృతజ్ఞతలు చెప్పుకొని ఇచ్చేసేందుకు అదే పార్క్ కు వెళ్ళాడు. సాయంత్రానికి ఆ వృద్ధుడు మళ్ళీ అక్కడకు వచ్చాడు. ఎంతో ఆనందంతో ఈ వ్యాపారి ఆయన వద్దకు వెళ్ళబోతుండగా, దూరంగా ఉన్న ఓ మొబైల్ వ్యాన్ నుంచి నర్సు దిగి పరుగెత్తుకుంటూ వచ్చింది. ఆ వృద్ధుడిని పట్టుకొని "హమ్మయ్య! ఇప్పటికి దొరికాడు. పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చి, కనిపించిన వారికల్లా. 'నేను రాక్ఫెల్లర్ని' అంటూ చెక్కులు రాసి ఇచ్చేస్తున్నాడు" అంటూ డ్రైవర్ సహాయంతో ఆ వాహనంలోకి అతణ్ణి ఎక్కించుకొని తీసుకువెళ్ళి పోయింది. వ్యాపారి ఆనందాశ్చర్యాలకు గురయ్యాడు. ఇన్నాళ్ళూ తన దగ్గర ఉన్నది ఓ చెల్లని చెక్కనీ, దానిపై భరోసా పెట్టుకొని ఇంత సాధించానా అనీ ఆత్మశోధన చేసుకొని పులకరించి పోయాడు. నిజానికి ఆ వ్యాపారికి బయట నుంచి ఏ సహాయమూ అందలేదు. కానీ తనలో అచేతనంగా ఉన్న ఆత్మవిశ్వాసాన్ని తట్టి లేపేందుకు ఆ చెల్లనిచెక్కు ఉపయోగపడింది అంతే! అదే విధంగా చాలాసార్లు మనం బయట నుంచి ఏదో ఒక ఆలంబన కావాలని తపించిపోతూ ఉంటాం. కానీ అది కొంత వరకే మనకు సహకరిస్తుంది. ఎప్పుడైనా మనకు వాటిల్లిన ఉపద్రవం నుంచి బయటపడడానికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది మనమే!  బాహ్యప్రపంచం నుంచి ఎవరికీ, ఎప్పుడూ ఏ సహాయమూ అందదు. ఎవరికి వారే ఆలంబనగా నిలిచి, నిలదొక్కుకోవాలి. అలాంటివారే గొప్ప విజయాలను సాధించగలరు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి.                                         *నిశ్శబ్ద.

నిన్ను నువ్వే రక్షించుకోవాలంటాడు చాణక్యుడు..!!

ఆచార్య చాణక్యుడు గొప్ప వ్యక్తి, సలహాదారు, వ్యూహకర్త, ఉపాధ్యాయుడు, ఆర్థికవేత్త, రాజకీయవేత్త. అతని జ్ఞానం, సామర్థ్యాలు భారతదేశ చరిత్రను మార్చాయి. మానవుల సంక్షేమం కోసం తన విధానంలో ఎన్నో ఆలోచనలను ఇచ్చారు చాణక్యుడు.  అవి నేటికీ ప్రసిద్ధి చెందాయి. మీరు ఈ సూత్రాలను పాటించినట్లయితే మిమ్మల్ని విజయాల మెట్లు ఎక్కకుండా ఎవరూ ఆపలేరు. అంతే కాదు, వారి సూత్రాలను అవలంబించడం ద్వారా మనం రోజువారీ జీవితంలో జరుగుతున్న అన్ని కష్టాల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు. మనల్ని మనం రక్షించుకోవడానికి చాణక్యుడి ఎలాంటి సూత్రాలు పాటించాలి..? మీ ప్రసంగం మధురంగా ఉండాలి: చాణక్యుడి సిద్ధాంతం ప్రకారం, ప్రసంగం మధురంగా ఉండే వ్యక్తి జీవితంలో గొప్ప విజయాన్ని సాధించగలడు. కఠినమైన మాటలు మాట్లాడే వ్యక్తి జీవితంలో విజయం సాధించడం కష్టమే అంటాడు చాణక్యుడు. డబ్బును ఎప్పుడూ విస్మరించవద్దు: చాణక్యుడి విధానం ప్రకారం, ఏ వ్యక్తి తన ఆర్థిక పరిస్థితి గురించి ఇతరులకు చెప్పకూడదు. మీరు చాలా డబ్బు సంపాదించి ఉంటే లేదా ఆర్థిక సంక్షోభంలో ఉంటే, అలాంటి ఆలోచనలను మీలో ఉంచుకోండి. పొరపాటున కూడా ఇతరులతో పంచుకోవద్దు. ఇది మీకు మరిన్ని సమస్యలను కలిగిస్తుంది. ఈ తప్పు చేయవద్దు: మీరనుకున్న విజయాలను సాధించాలంటే...మీ ప్రణాళికల గురించి ఇతరులకు చెప్పకుండా గోప్యంగా ఉంచాలని చెబుతాడు చాణక్యుడు.  ఎందుకంటే మీరు మీ ప్లాన్ గురించి ఎవరికైనా చెబితే, వారు మీ నుండి ప్రయోజనం పొందవచ్చు. దీనివల్ల మీరు విజయవంతం కాకపోవచ్చు. ఎల్లప్పుడూ ఓపికతో పని చేయండి: ఏది జరిగినా సహనం కోల్పోకూడదని చాణక్యుడు చెప్పాడు. అలాగే, వారు ఎల్లప్పుడూ తమ ఆలోచనలను సానుకూలంగా ఉంచుకోవాలి. మనం ఏమీ చేయలేము అని అనుకుంటే అది మన వల్ల జరగదు. ఈ పనిని మనం చేయగలమనే పాజిటివ్ ఆలోచనతో మొదలు పెడితే...ఈ పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఎక్కువ ఖర్చు పెట్టకండి: చాణక్య విధానం ప్రకారం, ప్రతి వ్యక్తి డబ్బును పొదుపు చేయాలి. ఎందుకంటే సంక్షోభ సమయాల్లో, డబ్బు మీ గొప్ప మిత్రుడిగా పనిచేస్తుంది. చేతిలో డబ్బు ఉందని ఫిర్యాదు చేసే బదులు వీలైనంత ఎక్కువ పొదుపు చేసేందుకు ప్రయత్నించండి.