ఆయుష్షుకి పొగ పెడుతున్నామా.. 

 

"ధూమపానం ఆరోగ్యానికి హానికరం..  నోటి క్యాన్సరుకి కారకం”... ఇది  మీ జీవితాలను నాశనం చేస్తుంది.... అంటూ ఎన్ని సార్లు ప్రకటనల్లో చెప్పినా, అడుగడుగునా హోర్డింగులు పెట్టి ప్రజలకి  అవగాహన  కల్పించాలని ప్రయత్నించినా సరే రోజురోజుకు స్మోకింగ్ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది తప్ప తగ్గట్లేదని సర్వేలు చెప్తున్నాయి.   ప్రపంచ ఆరోగ్య సంస్థ  నివేదిక ప్రకారం ధూమపానం కారణంగా ప్రతీ సంవత్సరం 80 లక్షల మందికి పైగా మరణిస్తున్నారు. వీరిలో చాలామంది సిగరెట్ పొగను పీల్చిన వారే ఉంటున్నారు. అందుకే స్మోకింగ్  గురించి అవగాహన కల్పించడానికి, ఆ అలవాటు మానే విధంగా ప్రజలను ప్రేరేపించడానికి ప్రతి ఏటా మార్చి నెలలో రెండవ బుధవారాన్ని నో స్మోకింగ్ డేగా  జరుపుకుంటున్నారు. ఈ సంధర్భంగా స్మోకింగ్ ఎంత ప్రమాదమో, నేటి తరాన్ని ఎలా నాశనం చేస్తుందో, ఊపిరిని ఆపేసే ఈ అలవాటునుంచి ఎలా బయటపడాలో తెలుసుకుంటే..

1984లో యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఒక ఆచారంగా  'నో స్మోకింగ్ డే' మొదలైంది.  అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా  ధూమపానం మానేయాలనుకునేవారికి సహాయం చేయడానికి వార్షిక ఆరోగ్య అవగాహన దినోత్సవంగా మారింది. ప్రతి సంవత్సరం నో స్మోకింగ్ డేని ఒక కొత్త థీమ్‌తో ప్రచారం చేస్తారు. 2025 సంవత్సరానికిగానూ "ఈ నో స్మోకింగ్ డే రోజున మీ జీవితాన్ని తిరిగి పొందండి”  అనే థీమ్ ఎంచుకున్నారు.

నేడు భారతదేశంలో మగవారితో పాటు స్మోకింగ్ చేసే ఆడవాళ్ళ సంఖ్య పెరుగుతుండటం  గమనించాలి. పాశ్చాత్య దేశాల వారిని చూసి భారతీయులు కూడా అలవాట్లను మార్చుకుంటున్నారు. క్లబ్బులు, పబ్బులు, కాఫీడేలు, బస్టాపులు, కొంతమంది స్కూళ్ళు, కాలేజీల్లో కూడా విచ్చలవిడిగా పొగ తాగుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. దీంతో ఆడవాళ్ళలో పిల్లలు పుట్టటంలో సమస్యలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతోంది.  స్మోకింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, ఎంఫిసెమా, బ్రోన్కైటిస్, గుండె జబ్బులతో సహా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా గొంతు, నోరు, అన్నవాహిక, మూత్రాశయ క్యాన్సర్ వంటి వివిధ క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.


స్మోకింగ్ అనేది కేవలం పొగతాగేవారికి మాత్రమే ప్రమాదం అనుకుంటే మీరు పొరబడినట్లే… మన  పక్కన తరచూ స్మోక్ చేసేవారు ఉంటే మనం  కూడా  స్మోక్ చేస్తున్నట్టే... నమ్మబుద్ది కావట్లేదు కదా, కానీ అదే నిజమని నిపుణులు చెబుతున్నారు. పొగతాగేవారి కంటే పక్కనుండి ఆ పొగ పీల్చేవారే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని చెప్తున్నారు.  బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడంపై చట్టాలు ఉన్నప్పటికీ అవి పూర్తిగా అమలుకి నోచుకోవడంలేదు. బహిరంగంగా పొగ తాగుతూ పట్టుబడితే తొలిసారి రెండేళ్ల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా, రెండోసారి పట్టుబడితే ఐదేళ్ల జైలు శిక్ష, 500 రూపాయల జరిమానా వంటి చట్టాలు ఆచరణలో అమలుకావట్లేదు.  మరి పొగ తాగేవారికి, అది పీల్చేవారికి ఇన్ని ప్రమాదాలు తెచ్చిపెట్టే ఈ అలవాటుని వదులుకోవటం చాలా అవసరం, ముఖ్యం కూడా. ఈ అలవాటు మానేయాలనుకునేవారికి సహకరించటం కూడా అంతే ముఖ్యం.


స్మోకింగ్ అనేది ఒక ఫ్యాషన్ గా భావించే నేటి యువతకి దాని గురించి అవగాహన కల్పించాలి. సరదాగా మొదలయ్యే ఈ అలవాటు తర్వాత జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో అర్ధమయ్యేలా వివిధ మాధ్యమాల ద్వారా వివరించాలి. సినిమాలు, సోషల్ మీడియాల ప్రభావంతో పిల్లల అలవాట్లలో ఏమైనా మార్పులు వస్తున్నాయేమో అని తల్లిదండ్రులు కూడా ఒక గంట కనిపెడుతుండాలి. రేపటి తరాన్ని స్మోకింగ్ అలవాటు లేనిదిగా మారాలంటే మనం ఇప్పటి నుంచే  జాగ్రత్తలు తీసుకోవాలి.

                                        *రూపశ్రీ.