ఆత్మవిశ్వాసానికి ఎంతటి శక్తి ఉంటుందంటే.. ఈ కథనమే గొప్ప ఉదాహరణ!
posted on Apr 3, 2024 @ 10:31AM
ఆత్మవిశ్వాసంతో కొండను పిండి చేయవచ్చుననడానికి దశరథ్ మంజీ సజీవ సాక్ష్యం. బీహార్ రాజధాని పాట్నాకు దాదాపు వంద కిలోమీటర్ల దూరాన ఒక గ్రామం ఉంది. దాని పేరు గెహ్లోర్. ఆ గ్రామానికీ, ప్రక్క గ్రామానికీ మధ్య ఒక కొండ అడ్డంగా ఉంది. గెహ్లోర్ ప్రజలు నిత్యావసరాలు కొనుక్కోవాలన్నా, అత్యవసర పరిస్థితుల్లో వైద్యసహాయం పొందాలన్నా ఆ కొండ చుట్టూ తిరిగి, అవతలి గ్రామానికి పోవాలి. అలా వెళ్ళడానికి సుమారు 32 కిలోమీటర్ల దూరం ఉంది. కొండను తొలిస్తే కేవలం మూడు కిలోమీటర్ల దూరం.
మూడు కిలోమీటర్ల దూరానికి అనవసరంగా 32 కిలోమీటర్లు కొండ చుట్టూ తిరిగి వెళ్ళాలి. శ్రమ దండుగ, సమయం వ్యర్థం. అయినా ఆ గ్రామ ప్రజలు అలాగే తంటాలు పడుతున్నారు. ఆ గ్రామంలోని దశరథ్ మంజీ అనే రైతు ఒకనాడు కొండ అవతల పొలంలో సేద్యం చేస్తున్నాడు. అతని భార్య ఫాగుణీదేవి భర్తకు అన్నం తీసుకొని, కుండ నెత్తి మీద పెట్టుకొని కొండ మధ్యలోనున్న చిన్న చరియ గుండా పోతుండగా రాళ్ళు గుచ్చుకొని క్రింద పడింది. అన్నం నేలపాలయింది. ఆమె గాయాల పాలైంది. ఆ గాయాలతోనే ఆమె మృత్యువుకు బలైంది.
కలత చెందిన దశరథ్ మంజీ కొండను తొలిస్తే తప్ప గ్రామానికి మేలు జరుగదని మనస్సులో నిర్ణయించుకొన్నాడు. ఊరి ప్రజలనందరినీ సమావేశపరిచి "నేను ఈ కొండను తొలుస్తాను. అవతలికి దారి చేస్తాను” అని ప్రకటించాడు. ఆ ప్రకటన విని జనమంతా నవ్వుకున్నారు. "ఒరేయ్! కొండను తొలుస్తాడట మొనగాడు" అని అపహేళన చేశారు. అయినా దశరథ్ మంజీ వారి మాటలను పెడచెవిన పెట్టి, చేతులతో ఉలి, సుత్తి పట్టాడు. గుండెల్లో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపుకొన్నాడు. ఎవరి సాయం కోసం ఎదురుచూడకుండా తలవంచుకొని, మౌనంగా, గంభీరంగా అడుగులు వేస్తూ కొండను సమీపించాడు. వినమ్రంగా నమస్కరించి కొట్టడం మొదలుపెట్టాడు. రోజులు, నెలలూ కాదు, ఇరవై రెండు సంవత్సరాలు కొండను కొట్టాడు. మూడు కిలోమీటర్ల పొడవు ముప్ఫై అడుగుల వెడల్పుతో దారి చేశాడు.
దశరథ్ మంజీ కొండంత ఆత్మ విశ్వాసం ముందు కొండ చిన్నబోయింది. అతని ఆత్మవిశ్వాసం ముందు తలవంచుకుని దాసోహమంది. మంజీ కృషినీ, ఆత్మ విశ్వాసాన్నీ, పట్టుదలనూ చూసి గ్రామ ప్రజలందరూ విస్తుబోయారు.
దశరథ్ కొండను తొలిచి తయారు చేసిన మార్గంలో ఇప్పుడు వాహనాలు కూడా వెళ్తున్నాయి. రోడ్డు కూడా వేశారు. అయితే దశరథ్ మంజీ అనితర సాధ్యమైన ఆత్మవిశ్వాసంతో ఈ మహాకార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసినా ఆ దృశ్యాన్ని చూసే అదృష్టం అతని భార్యకు లేదు. మంజీ ఆత్మవిశ్వాసానికి కృతజ్ఞతగా గెహ్లోర్ ప్రజలు తమ గ్రామం పేరును మార్చి, దశరథ్ నగర్ అని పిల్చుకుంటున్నారు. చిన్న చిన్న సమస్యలకే నీరసించిపోయే వారికి ఆత్మవిశ్వాసంతో కొండను తొలిచిన దశరథ్ మంజీ ఆదర్శనీయుడు.
*నిశ్శబ్ద.