అత్తాకోడళ్లు పొరపాటున కూడా ఇలాంటి విషయాలు షేర్ చేసుకోకూడదట..!

  పెళ్లైన ప్రతి అమ్మాయి ఒక కొత్త ఇంటికి వెళుతుంది. అక్కడ భర్తతో పాటు ఆమె అత్తమామలు కూడా ఉంటారు. సాధారణంగా చాలా ఇళ్లలో  భార్యాభర్తల కంటే అత్తాకోడళ్ల మధ్య జరిగే గొడవలే ఎక్కువ ఉంటాయి.  అత్తాకోడళ్లు కలిసి ఒకే చోట ఉన్నా, లేకపోయినా.. అత్తాకోడళ్లు కొన్ని విషయాలు ఒకరితో మరొకరు చెప్పుకోకుండటం మంచిదని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు. ఇంతకూ ఒకరితో ఒకరు అనకూడని విషయాలేంటి? తెలుసకుంటే.. బంధువుల విషయాలు.. అత్తవైపు బంధువులు అయినా, కోడలి వైపు బంధువులు అయినా చెడుగా మాట్లాడకూడదు.  ఎవరివైపు బంధువుల గురించి వారికి ప్రేమ, అభిమానం ఉంటాయి.  అత్త కోడలివైపు వారి గురించి, కోడలు అత్తవైపు వారి గురించి ఎప్పుడూ మాట్లాడకూడదు.  ఒకవేళ మాట్లాడితే ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు వస్తాయి. డబ్బు,నగలు.. అత్తాకోడళ్ల మధ్య ఏవైనా చర్చలు జరిగినా,  ఒకరితో ఒకరు ఏదైనా చెప్పుకున్నా అది ఇంటి పనుల గురించి,  ఏదైనా సమస్య ఉంటే వాటి గురించి మాట్లాడుకోవాలి. అంతే తప్ప డబ్బు, నగల గురించి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం,  ఒకరితో ఒకరు గొడవ పడటం చేయకూడదు. ఫిర్యాదులు.. ఎంతైనా భర్త అనేవారు అత్త కొడుకు.  అతను ఏదైనా తప్పు చేసినప్పుడు అతని గురించి అత్తకు ఫిర్యాదు చేయడం మంచిది కాదు. తప్పు చేసినా సరే.. కోడలి ముందు కొడుకును తక్కువ చేయాలసి అతడిని దండించాలని ఏ అత్త అనుకోదు. పైగా తిరిగి కోడలినే మందలించే అవకాశం ఉంటుంది.  దీని వల్ల అత్తాకోడళ్ల మధ్య గొడవలు వస్తాయి. కోడలి తల్లిదండ్రులు.. పెళ్లైన మాత్రాన ఆడపిల్లకు తల్లిదండ్రులంటే పరాయితనం రాదు.  కని, పెంచి, పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల ఆమె ప్రేమ జీవితాంతం ఉంటుంది.  అయితే కోడలు తన ఇంట్లో ఉంటోంది కదా అని అత్తగారు కోడలి తల్లిదండ్రుల గురించి చులకనగా మాట్లాడటం, వారిని నిందించడం చేయరాదు.  ఇది చాలా  గొడవలకు దారి తీస్తుంది. పోలిక.. కోడలిని ఇతర కోడళ్లతో లేదా కూతురితో పోల్చడం, అత్తను ఇతర ఇంటిలోని అత్తతో పోల్చడం లాంటివి అత్తాకోడళ్లు చేయరాదు. దీని వల్ల ఇద్దరి మధ్య బంధం తెగిపోతుంది. అలవాట్లు.. కోడలు అయినా, అత్త అయినా వారు పెరిగిన వాతావరణంకు తగ్గట్టు వారి  అలవాట్లు ఉంటాయి.  ఆ అలవాట్ల గురించి పదే పదే విమర్శలు చేయడం, హేళన చేయడం చేయరాదు. ఇది చాలా అవమానకరంగా ఉంటుంది. పిల్లల పెంపకం.. జనరేషన్ మార్పును బట్టి పిల్లల పెంపకంలో కూడా తేడాలు ఉంటాయి.  ఒకప్పుడు పెద్ద వాళ్లు పెంచిన విధానం వేరు..  నేటితరం వారు పిల్లలను పెంచే విధానం వేరు ఉంటుంది.  వీటి కారణంగా ఒకరిమీద మరొకరు వాదించుకోకూడదు.                                      *రూపశ్రీ.

వర్షాకాలంలో ఫర్నిచర్ దెబ్బతినకూడదు అంటే.. ఇలా జాగ్రత్త పడండి..!

  వర్షాకాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.  కానీ  తేమ కారణంగా, ఇంటి ఫర్నిచర్ దెబ్బతింటుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో చెక్క ఫర్నిచర్ త్వరగా దెబ్బతినడం ప్రారంభమవుతుంది. తేమ కారణంగా చెక్క ఫర్నిచర్  రంగు మసకబారడం లేదా చెదపురుగుల దాడి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో వర్షాకాలంలో కొన్ని సులభమైన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా విలువైన ఫర్నిచర్‌ను సురక్షితంగా ఉంచుకోవచ్చు.  సకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే, వర్షం వచ్చిన కొన్ని వారాలలోనే ఫర్నిచర్ దాని మెరుపును కోల్పోయే అవకాశం ఉంటుంది.  వర్షాకాలంలో తేమ, చెదపురుగులు  నుండి  ఫర్నిచర్‌ను రక్షించుకోవడానికి కొన్ని సులభమైన,  ప్రభావవంతమైన చిట్కాలేంటో తెలుసుకుంటే.. స్థల మార్పిడి. వర్షాకాలంలో చెక్క ఫర్నిచర్‌ను కిటికీలు, బాల్కనీ లేదా బాత్రూమ్ తలుపుల దగ్గర ఉంచకూడదు. వర్షపు నీరు లేదా తేమతో కూడిన గాలులు ఈ ప్రదేశాలకు సులభంగా చేరుతాయి. దీనివల్ల ఫర్నిచర్ దెబ్బతింటుంది. వర్షాకాలంలో కిటికీలను మూసి ఉంచాలి. మందపాటి కర్టెన్లను ఏర్పాటు చేసుకోవచ్చు. కిటికీలు, తలుపుల దగ్గర చెక్క ఫర్నిచర్ ఉన్నట్టైతే వాటి స్థలాన్ని మార్చడం మంచిది. నాప్తలీన్ బాల్.. నాఫ్తలీన్ బంతులు దుస్తులను సురక్షితంగా ఉంచడమే కాకుండా, ఫర్నిచర్‌ను చెదపురుగుల నుండి  రక్షిస్తాయి.  అల్మారా, డ్రాయర్లు,  ఇతర ఫర్నిచర్ లోపల నాఫ్తలీన్ బంతులను ఉంచవచ్చు. ఇది తేమను  నిరోధించడంలో సహాయపడుతుంది.  దీని వల్ల  ఫర్నిచర్ కొత్తగా ఉంటుంది. కాలానుగుణంగా పాలిష్ చెక్క ఫర్నిచర్ కు  ప్రత్యేక శ్రద్ధ అవసరం. వాటిని ఎప్పటికప్పుడు పాలిష్ చేయడం అవసరం. దీనివల్ల ఫర్నిచర్ చాలా కాలం పాటు కొత్తగా కనిపిస్తుంది. అదే సమయంలో వర్షాకాలంలో తేమ,  చెదపురుగుల నుండి కూడా దీనిని రక్షించవచ్చు. వేప ఆకులు..  ఎండిన వేప ఆకులను అల్మారా లేదా చెక్క క్యాబినెట్‌లో  ఉంచవచ్చు . ఈ ఆకులు తేమను గ్రహించడంలో సహాయపడతాయి. దీనితో పాటు, వాటిని ఫంగస్,  కీటకాల నుండి కూడా రక్షించవచ్చు.  కావాలంటే దానిలో కొన్ని కర్పూరం ముక్కలను కూడా వేయవచ్చు. ఇది దుర్వాసన రాకుండా చేస్తుంది. చెదపురుగుల  స్ప్రే ..  ఫర్నిచర్ పై యాంటీ-టెర్మైట్ స్ప్రేను కూడా పిచికారీ చేయవచ్చు. ఇది చెదపురుగుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే  ఫర్నిచర్ సురక్షితంగా ఉంటుంది. చెదపురుగులు ఎక్కువగా ఉండే ప్రదేశంలో దీన్ని ఉపయోగించడం మంచిది.                                      *రూపశ్రీ.

హెల్త్‌కు సైకిల్‌తో హైఫై కొట్టండి!

ఈకాలంలో పుట్టిన పిల్లలకు కాస్త నడవడం రాగానే పేరెంట్స్ అందరూ చేసేపని ఓ చిన్న సైకిల్ తెచ్చి ఇవ్వడం. ఆ సైకిల్ తో పిల్లలు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అయితే కొంచెం పెద్దయ్యాక ఇంకా ముఖ్యంగా స్కూల్ స్థాయి దాటిపోగానే వాళ్ల మనసంతా బైకులు, స్కూటీలు, గాడ్జెట్స్ చుట్టూ ఉంటుంది. కొందరు ఆసక్తి కొద్దీ గేమ్స్ వైపు వెళ్లి ఎన్నోరకాల ఆటల్లో మునిగి తేలిన సైకిల్ ను పక్కకు పెట్టేస్తారు. స్కూల్ దశ అయిపోగానే పక్కకు పెట్టేసే సైకిల్ ఇప్పటి కాలంలో మనుషుల ఆరోగ్యం పాలిట గొప్ప ఆప్షన్ అనేది వైద్యులు, ఫిట్నెస్ ట్రైనర్ ల అభిప్రాయం. అసలింతకూ అలా ఎందుకంటారు.  రెగులర్ ఎక్సర్సైజ్! ఉదయం లేచాక చాలామంది ఇంటి నుండి బయట పడితే తరువాత సాయంత్రం ఇంటికి చేరుతూ ఉంటారు. ఉద్యోగస్తులు అందరూ ఇంతే. అయితే ఉద్యోగం చేసేవాళ్ళు ఆఫీసుల్లో కూర్చునే చేస్తారు. ప్రస్తుతకాల ఉద్యోగాల్లో మానసిక ఒత్తిడి తప్ప శారీరక ఒత్తిడి ఉండదు అనేది వాస్తవం కదా. అయితే ఇంటి దగ్గర ఉండే కొద్దిసమయంలో ఏదైనా చిన్న చిన్న పనులకు బయటకు వెళ్లాలంటే పుటుక్కున బైక్ స్టార్ట్ చేస్తుంటారు అందరూ.  కనీసం కొత్తిమీర కట్టనొ, లేక వెల్లుల్లినో లేదా నిమ్మకాయలో ఇలాంటి చిన్న వాటికి కూడా బైకులు స్టార్ట్ చేస్తే మహానుభావులు ఉంటారు. బయట ఎండలు లేదా అర్జెన్సీ అనే కల్లబొల్లి కబుర్లు చెప్పేవాళ్లకు ఎలాంటి సందేహం లేకుండా సైకిల్ ఒక ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇంజిన్ ఖర్చు లేనే లేదు! బైకు తీస్తే బర్రున శబ్దం చేసుకుంటూ రాకెట్ లో పోవాలంటే అందులో పెట్రోల్ ఉండాలి. పెట్రోల్ లేని బండి మూలన పడి ఉండాల్సిందే. కనీసం దాన్ని తొక్కడానికి  కుదరదు, తోయడానికి మనిషికే కండలు ఉండాలి. పెరిగిపోతున్న పెట్రోల్ ఖర్చులతో మనిషి పాకెట్ కు చిల్లులే. కానీ మన సైకిల్ ఉందండి. కష్టపడి అప్పుడప్పుడు గాలి కొట్టుకుంటే చాలు, టైర్ లలా ఉన్న మనుషులను స్లిమ్ గా చేసేస్తుంది. ఎలాంటి పెట్రోల్ గోల లేకుండా హాయిగా జాగ్రత్తగా వాడుకుంటే జీవితకాలం సేవలు చేస్తుంది.  వేగవంతమైన జీవితంలో అన్ని తొందరగా అయిపోవాలనే ఆలోచనలో చాలామంది ఎంతో ఉపయోగకరమైన వస్తువులను కొన్నింటిని పక్కకు తోసేస్తున్నారు. తీరా ఆరోగ్యాలు నష్టపోతున్న సందర్భాలలో జిమ్ లలో చేరి అక్కడ సేమ్ సైక్లింగ్ వర్కౌట్ చేస్తుంటారు. అలా నెలకు వేలు తగలెయ్యడం కంటే ఒక సైకిల్ పెట్టుకుని కొన్ని పనులకు సైకిల్ ని ఉపయోగించడం మంచిది. బైకులు, స్కూటీల కంటే తక్కువ ఖర్చుతో, పెట్రోల్ గట్రా అదనపు ఖర్చు లేకుండా, రోజూ తగినంత వ్యాయామాన్ని అందించే సైకిల్ కు హైఫై కొడితే పోయేదేముంది?? శరీరంలో అదనపు కొవ్వు తప్ప. అయితే మోకాళ్ళ నొప్పులు సమస్యలు ఉన్నవాళ్లు వైద్యుల సలహా తీసుకోండి మరి. సైకిల్ పెడిల్ తొక్కుతూ కాస్త రౌండ్స్ కొట్టండి మరి.            ◆ వెంకటేష్ పువ్వాడ.

మనిషికి, డబ్బుకు మధ్య సంబంధం!

“మనం డబ్బును సంపాదిస్తాం కానీ, డబ్బు మనల్ని సంపాదించడం లేదు కదా?” అని డాంబికంగా పలికేవారున్నారు. అనడానికైతే ఇలా అన్నప్పటికీ వారి జీవితమంతా డబ్బుకు దాస్యం చేస్తూనే వుంటారు. ఆ డబ్బుకై ఎవరినైనా ఆశ్రయిస్తారు. ఎంతైనా వేడుకుంటారు. లేనితనం వల్ల వీరిలా తయారైనారా అంటే అది నిజం కాదు, కేవలం ధనం మీద ఆపేక్షే వీరినిస్థితికి తెచ్చింది. అసలీ జీవితాన్ని ధనార్జనకు కాక మరొకందుకు వినియోగించే వీలుందనే ఆలోచన కలగదు. మతాన్ని ఆశ్రయించామని, దైవారాధనకు అంకితమయామని ప్రకటించే వారిలో కూడా చాలా మందికి ధనమే దైవం వారు తలపెట్టే “మహత్కార్యా” లన్నిటికీ ధనం పోగుచేస్తుంటారు. ఎక్కడో వందలాది ఎకరాల స్థలం కొంటామంటారు. అక్కడ అనేకమందిని చేర్చి ఏదో విశ్వమానవ కల్యాణం సాధిస్తామంటారు. మిగతా రంగాల్లో పనిచేసేవారు కూడా ఇలాంటి "లోక కళ్యాణ” పథకాలే రూపొందిస్తుంటారు. సినిమాలు తీసేవారు, సినిమాహాళ్ళు కట్టించేవారు. హోటళ్ళు నెలకొల్పేవారూ, మార్కెట్లోకి కొత్తపత్రికలు వెలువరించేవారూ, మార్కెట్లోకి కొత్త సబ్బు, విశిష్టమైన సూటింగ్ క్లాత్, చల్లటి కూల్డ్రింకు ప్రవేశ పెట్టేవారూ, అందరూ కూడా ప్రజాక్షేమం కాంక్షించే ఈ పనులు చేస్తున్నామంటారు. కానీ అందరికీ కావలసింది డబ్బే. కానీ డబ్బు అక్కరలేనివారు అరుదుగా ఎక్కడైనా కనిపించవచ్చు. అలాంటివారు కోర్కెల్నీ, సంకల్పాలనూ దాటి వుంటారు. నీమ్ కరోలి బాబా అలాంటి యోగి. ఆయన ఇటు ఇహంలోను, అటు పరంలోనూ ఏక కాలమందు నివసించినట్లు ఉండేవాడని అంటారు స్వామీ రామా. బాబా ఎవరి పరిచయమూ కోరేవాడు కాదు. ఎవరైనా తన దర్శనార్థమై వస్తే, “నేను మిమ్మల్ని చూడడమైనది. మీరు నన్ను చూడడమైనది. ఇక వెళ్ళిరండి" అనేయడం ఆయనకు అలవాటు. నైనిటాల్లో ఒకసారి బాబాతో కూచోనుండగా, భారతదేశంలోని అత్యంత ధనికుల్లో ఒకరైన ఒక వ్యక్తి కరెన్సీ కట్టలతో బాబా వద్దకు వచ్చారని అంటాడు స్వామీ రామా. " ఈ ధనమంతా మీకు సమర్పించడానికి తెచ్చానండీ" అన్నాడు ఆ ధనికుడు.  బాబా ఆ నోట్లకట్టలను కిందపరిచి చక్కగా వాటి మీద ఆసీనుడయ్యాడు. "కూర్చుకునేందుకు అంత మెత్తగా లేవు. వీటికన్నా దిండు నయం. నాకు చలిమంట వేసుకునే అలవాటు లేదు, పోనీ అందుకైనా ఉపయోగిద్దామంటే వీటినేమి చేయను?" అని అడిగాడు బాబా. "అయ్యా ఇది ధనమండీ" అన్నాడు అతడు.  బాబా ఆ మొత్తం తిరిగి ఇచ్చేస్తూ "దీనితో కాసిని పళ్ళు కొనుక్కురండి. అందరం తినచ్చు" అన్నాడు. "ఈ ప్రాంతంలో మార్కెట్ లేదు గదండీ?” అన్నాడు అతడు. "ఐతే మరి ఇది డబ్బెలా అవుతుందయ్యా. పండ్లు కూడా కొనలేని దీనిని నేనేమి చేసుకోను" అని, కాసేపు ఆగి "ఏమి కావాలని నావద్దకొచ్చావు" అన్నారు.  "నాకు విపరీతమైన తలనొప్పి, భరించలేని బాధ" అని చెప్పాడు అతడు "అది నువ్వు సృష్టించుకున్నదే, నేనేమి చేయగలను." అన్నారు బాబా.  "అలా అంటే ఎలా మహాత్మా? మీరు నాకు సాయపడాలి.” అని వేడుకున్నాడు అతను. అప్పుడు బాబా, “పోనీ పాపం” అనుకున్నట్లున్నారు.. “సరే ఇకనుండి నీకు తలనొప్పి ఉండదు పో, కానీ ఇవాళ నుండి నీవు ఇతరులకు పెద్ద తలనొప్పిగా రూపొందుతావు. నీ దగ్గర వెర్రి డబ్బు పోగవుతుంది. తద్వారా నీవు సమాజానికి గొప్ప శిరోవేదన కలిగిస్తావు, ఇక వెళ్ళు" అని పంపించేశాడు నీమ్ కరోలి బాబా. ఆయన చెప్పినట్లే, ఆ ధనికుడు ఆరోగ్యవంతుడై, తన జీవన విధానంతో సంఘానికి గొప్ప “శిరోభారం" గా పరిణమించాడు.                                             ◆నిశ్శబ్ద.

బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే..?

బ్రహ్మ ముహూర్తానికి మించిన ముహూర్తం లేదు. బ్రహ్మ ముహూర్తంలో ఏ పని ప్రారంభించినా శుభమే. సూర్యోదయానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు... రాత్రి భాగంలో ఆఖరి నలభై ఎనిమిది నిమిషాల ముందు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారం. ఇది ఎంతో విశిష్టమైన సమయం. పూజలు చేయడానికి, వ్రతాలు జపాలు చేయడానికి అనువైన సమయం. అందుకే ఈ ముహూర్తానికి అంత విశిష్టత. అయితే కేవలం ఆధ్యాత్మిక పరంగాగానే కాదు... మన జీవనపరంగా కూడా ఈ ముహూర్తం ఎంతో మేలు చేకూరుస్తుంది. ఏ మంచి పని చేసినా బ్రహ్మ ముహూర్తంలో కనుక మొదలు పెడితే విజయం లభించి తీరుతుంది. పిల్లలను ఉదయమే లేచి చదువుకోమని చెప్పేది అందుకే. ఆ సమయంలో చదివితే చదివింది బాగా ఎక్కడమే కాకుండా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందుకే వైద్యులు, నిపుణులు కూడా ఆ సమయంలోనే చదుకొమ్మని సూచిస్తుంటారు.  ఉదయాన్నే వాకింగ్ కి వెళ్లే సమయం కూడా అదే. లేలేత భానుడి కిరణాల నుంచి విటమిన్ డి లభిస్తుంది. తద్వారా ఎముకలు గట్టిపడతాయి. ఎన్నో రకాల వ్యాధులు నయమవుతాయి. కొన్ని రకాల వ్యాధులు దగ్గరికి రాకుండా ఉంటాయి. అసలు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల మానసిక ఒత్తిడి కూడా ఉండదట. మనసు, మెదడు ప్రశాంతంగా ఉండి ఆరోగ్యం ఇనుమడిస్తుందట.  అందుకే బ్రహ్మ ముహూర్తాన్ని మించిన ముహూర్తం లేదని అంటారు. ఆ ముహూర్తాన్ని చేజార్చుకోకూడదని పెద్దలు సూచిస్తుంటారు. -Sameera  

క్షమించేద్దామా!

తప్పు చేసిన వారిని, నొప్పించిన వారిని పెద్ద మనసుతో క్షమించడం ఎంతో గొప్ప విషయం. ఇది ఇప్పుడు చెబుతున్న మాట కూడా కాదు. ఎప్పుడో ఎన్నో ఏళ్ల నుండి పెద్దలు చెబుతున్న మాట. ఇంకా చెప్పాలంటే మన పురాణాల నుండే ఈ క్షమాగుణాన్ని నలుగురికి తెలిసేలా చేయడం మొదలయ్యింది.  ప్రతి మనిషి తన జీవితంలో ఎవరో ఒకరి వల్ల బాధపడుతూ ఉంటాడు. ఆ బాధలో నుండి కోపం పుట్టుకొస్తుంది. కోపంలో నుండి ఆ మనిషి మీద వ్యతిరేక భావం పుడుతుంది. ఆ వ్యతిరేక భావం కాస్తా శత్రుత్వంగా మారిపోతుంది. ఇలా ఒక నిర్దిష్ట దశలలో మనుషుల మధ్య ఏర్పడే గొడవలు, లేదా చిన్న చిన్న తగాదాలు క్రమంగా శత్రుత్వం వరకు దారి తీయడం అంటే మనుషుల మధ్య అర్థం చేసుకునే గుణం తక్కువ ఉందనే చెప్పాలి. మాటా మాటా కారాదు తూటా! ఇంట్లో సాధారణంగా భార్యాభర్తలు, ఇంకా పిల్లలు కాస్త పెద్దవాళ్ళు అయితే ఏదో ఒక విషయంలో కచ్చితంగా గొడవ జరుగుతూ ఉంటుంది. ఆ గొడవ ఎలాంటిదంటే ఒకరు ఎడ్డేమంటే ఇంకొకరు తెడ్డెమంటూ ఉంటారు. ఎవరో ఒకరు మాత్రమే కాస్తో కూస్తో ఆలోచించే మైండ్ సెట్ కలిగి ఉంటారు. అవతలి వాళ్ళ మొండితనం తెలిసి వాళ్ళతో ఇక వాదులాట ఎందుకు అని వదిలేయాలి. నిజానికి ఇలా వాధించే వాళ్ళతో, మనల్ని నొప్పించిన వాళ్ళను క్షమించేసేయ్యడం అంటే మనం తగ్గిపోవడం కాదు, అవతలి వాళ్లకి భయపడటం అసలే కాదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి.  కాబట్టే ఏదైనా తప్పు జరిగినప్పుడో, గొడవ జరిగినప్పుడో మాటకు మాట పెంచుకుంటూ పోవడం కంటే దాన్ని మొదలులో తుంచేయడం మంచిది. తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు! తప్పులు చేయడం అందరూ చేస్తారు. ఆ తప్పులను అందరూ గమనిస్తారు. అయితే ఆ తప్పులను అదేపనిగా ఎత్తిచూపేవారు కొందరు ఉంటారు. మూర్ఖుల లిస్ట్ లో ధీమాగా నిలబడదగిన వాళ్ళు వీళ్ళు. ఎప్పుడూ ఇతరులను చూస్తూ వాళ్ళ తప్పులు గురించి మాట్లాడటమే కానీ తాము చేస్తున్న తప్పులను విశ్లేషించుకునే తీరికా ఓపిక అసలు ఉండవు వీళ్ళకు.  ఇలాంటి వాళ్ళ గురించి పట్టించుకుంటే బుర్ర పాడు అవ్వడం తప్ప ఒరిగేది ఏమీ ఉండదు. క్షమించడానికి కావాలి కాసింత ఓర్పు, నేర్పు! నిజంగా నిజమే. ఎదుటి వారు నొప్పిస్తే దాన్ని మనసులో ఎంతో లోతుకు తీసుకుని వాళ్ళను తిరిగి ఏమి అనకుండా క్షమించడం గొప్ప విషయం. ఎదుటి వారి ప్రవర్తనను భరించడానికి, ఆ తప్పు తాలూకూ నష్టం మానసికం అయినా, ఆర్థికపరం అయినా దాన్ని భరించడానికి ఎంతో ఓర్పు కావాలి. తరువాత ఆ తప్పు తాలూకూ విషయాలు మళ్లీ మళ్లీ ప్రస్తావనకు తీసుకురాకుండా, అదే వ్యక్తులతో ఆ విషయం గురించి ఎలాంటి చర్చా లేకుండా గడపడమనే నేర్పు కూడా కలిగి ఉండాలి. విలువ కోల్పోకూడదు! కొందరుంటారు. తప్పు చేసిన వాళ్ళను క్షమిస్తారు. అయితే ఆ ఎదుటి వారికి ఆ క్షమాగుణం గొప్పదనం అర్ధం కాదు. వాళ్ళేదో తోపు అయినట్టు. వాళ్లను ఏమీ అనలేమనే కారణంతో క్షమించిన వాళ్ళను తక్కువ చేసి చూస్తుంటారు. దీని పలితం ఎలా ఉంటుంది అంటే మళ్లీ మళ్లీ అదే తప్పులు చేస్తూ, ఇబ్బంది పెడుతూ పైశాచిక ఆనందం అనుభవిస్తారు వాళ్ళు. కేవలం క్షమాగుణం వల్ల ఇలా సఫర్ అవ్వడం చాలా మంది జీవితాలలో గమనించవచ్చు కూడా. అందుకే ఆ క్షమాగుణానికి కూడా ఒక పరిధి అంటూ ఉండాలి. మాటి మాటికి తప్పులు చేస్తూ వాళ్ళు, వాళ్ళను క్షమిస్తూ ఎదుటివాళ్ళు ఇలా అయితే ఆ తప్పులు చేసేవాళ్ళు ఎప్పటికీ ఒక మంచి మార్గాన్ని తెలుసుకోలేరు మరియు దాన్ని ఫాలో అవ్వలేరు. అందుకే క్షమించడం గొప్ప విషయం.  క్షమించేవారిని గౌరవించకపోతే ఎంతో పెద్ద తప్పు చేసినట్టే.  ◆ వెంకటేష్ పువ్వాడ  

బంగాళదుంపలు ఉడికించేటప్పుడు చాలామంది చేసే తప్పులు ఇవే..!

  భారతీయులు ఎక్కువగా ఉపయోగించే దుంప కూరగాయలలో బంగాళదుంపలు ముఖ్యమైనవి. వీటితో స్నాక్స్,  చిప్స్ తో పాటు,  బోలెడు రకాల వంటలు కూడా చేసుకుంటారు. అయితే బంగాళదుంపలను ఉడికించేటప్పుడు చాలామంది తెలియకుండా కొన్ని తప్పులు చేస్తారు. ఈ తప్పుల వల్ల బంగాళదుంపలు సరిగా ఉడకకపోవడం, పైన పొట్టు వచ్చినా లోపల పచ్చిగా ఉండటం జరుగుతుంది. అయితే 5 విషయాలను గుర్తుంచుకుంటే బంగాళదుంపలు చక్కగా దుంప మొత్తం సమంగా ఉడుకుతాయి. అంతేకాదు.. బంగాళదుంపల గురించి చాలా ముఖ్యమైన చిట్కాలు కూడా ఇదిగో ఇక్కడ తెలుసుకోండి.. ఎక్కువగా ఉడకబెట్టినప్పుడు.. బంగాళదుంపలను ఎక్కువగా ఉడకబెట్టినప్పుడు పెద్ద సమస్య వచ్చి పడుతుంది.  దుంపలు ఎక్కువగా ఉడకడం వల్ల మెత్తగా చేతిలో పట్టుకోగానే విరిగిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు  వాటిని ఫ్రిజ్ లో ఉంచడం వల్ల చాలా ప్రయోజనంగా ఉంటుంది.  కూల్ అయ్యాక బంగాళదుంపలు మెత్తదనం పోయి కాస్త గట్టిగా అవుతాయి.  అప్పుడు వీటిని కూరలలో తగినట్టుగా ఉపయోగించుకోవచ్చు. వేడినీరు.. చాలామంది బంగాళదుంపలను తొందరగా ఉడికిద్దాం అనే ఆలోచనతో ముందే వేడి చేసిన నీటిలో బంగాళదుంపలు వేసి తరువాత వాటిని ఉడికిస్తారు. దీని వల్ల పైన తొక్క తొందరగా వచ్చేస్తుంది.  కానీ లోపల సరిగా ఉడకదు.  పచ్చిగా ఉంటుంది.  అందుకే నేరుగా చల్లని నీటిలో బంగాళదుంపలు వేసి  ఉడికించాలి. ఉప్పు.. బంగాళదుంపలను కుక్కర్ లో ఉడికించేటప్పుడు కాసింత ఉప్పు జోడించాలి.  ఇలా చేయడం వల్ల బంగాళదుంప తొక్క చాలా మెత్తగా అయిపోయి దుంప జారిపోయేలా కాకుండా దుంప మొత్తం సమంగా ఉడకడానికి సహాయపడుతుంది. ఎక్కువ నీరు.. బంగాళదుంపలను ఉడికించడానికి ఎక్కువ నీరు ఉపయోగించడం వల్ల కూడా బంగాళదుంపలు చాలా మెత్తగా, నీటిలోనే కలిసిపోయేలా అయ్యే అవకాశం ఉంటుంది.  4 విజిల్స్‌లో పూర్తయ్యేంత నీటిని మాత్రమే జోడించాలి. అలాగే  మీడియం మంట మీద మాత్రమే ఉడకబెట్టాలి.  దీనివల్ల బంగాళాదుంపలు ఎప్పుడూ పగిలిపోకుండా ఉంటాయి. చిన్న పరిమాణంలో ఉన్న  బంగాళాదుంపలకు ఒక విజిల్ సరిపోతుంది. గిన్నె పద్దతి.. బంగాళాదుంపలు తక్కువగా ఉంటే ముందుగా కుక్కర్‌లో చల్లటి నీరు పోసి స్టీల్ గిన్నె ఉంచాలి. బంగాళాదుంపలను గిన్నెలో వేసి మరిగించాలి.  దీనివల్ల బంగాళాదుంపలు నీటిని పీల్చుకోకుండా ఉంటాయి.  అవి విరగకుండా సులభంగా మృదువుగా మారుతాయి. వంటను సులభతరం చేయడంలో గిన్నె పద్ధతి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.                                    *రూపశ్రీ.

సరైన కెరీర్ ను ఎంచుకోవడం ఎలా?

  ప్రతి మనిషి జీవితంలో ఏదైనా ముఖ్యమైన మొదటి దశ ఉందంటే అది కెరీర్ కు సంబంధించిన విషయమే అయ్యుంటుంది.కెరీర్ విషయంలో తీసుకునే నిర్ణయానికి అనుగుణంగానే  ఉద్యోగం,  ఆనందం,  ఆర్థిక స్థితి, వ్యక్తిగత అభివృద్ది వంటి విషయాలు ఆధారపడి ఉంటాయి. చాలా మంది అవగాహన లేకుండా సమాజంలో దేనికి ఆదరణ ఉందనే విషయాన్ని పరిగణలోకి తీసుకుని దాన్నే తమ కెరీర్ గా ఎంచుకుంటారు. ఇది ఆర్థికంగా బాగానే ఉంటుంది కానీ.. అన్ని వేళలా ఇది పనిచేయదు.  సరైన కెరీర్ ను ఎంచుకోవడానికి ఏం చేయాలి?  తెలుసుకుంటే.. ఆసక్తులు, అభిరుచులు.. మీరు ఏ విషయాలలో ఆసక్తి చూపిస్తారు? (ఉదా: సైన్స్, ఆర్ట్స్, బిజినెస్, టెక్నాలజీ, క్రియేటివ్ ఫీల్డ్స్, సర్వీస్?) చిన్నప్పటి నుండి మీరు ఎక్కువగా ఆసక్తి చూపిన విషయాలు ఏవి? ఏ పని చేసేటప్పుడు మీరు టైమ్ గమనించకుండా మునిగిపోతారు? ఉదాహరణ: మీకు problems solve చేయడం ఇష్టం అయితే — సైన్స్, ఇంజినీరింగ్, డేటా సైన్స్, లా వంటివి మంచి ఎంపికలు.  మీ సామర్థ్యాలు, బలాలు.. మీరు ఏ విషయాన్ని బాగా  చేయగలరు? (ఉదా: గణితం, భాషలు, కమ్యూనికేషన్, ఆర్ట్, లీడర్‌షిప్, డిజైన్) ఇతరులు మీలో ఏ బలాలను గుర్తిస్తారు? దీన్ని అర్థం చేసుకోవడానికి Aptitude Tests లేదా Career Assessment Tests (ఉదా: MBTI, Holland Code) చేయవచ్చు.  మార్కెట్ లో అవకాశాలు.. ఎంచుకోవాలి అనుకున్న రంగంలో ఫ్యూచర్ డిమాండ్ ఉందా? ఆ ఫీల్డ్ లో గ్రోత్, జాబ్ సెటిల్మెంట్ ఎలా ఉంటుంది? కొత్తగా పెరుగుతున్న రంగాలు ఏమిటి? (ఉదా: AI, డేటా సైన్స్, సస్టైనబిలిటీ, డిజిటల్ మార్కెటింగ్) జీతం,  జీవన ప్రమాణాలు.. మీరు ఎంచుకునే కెరీర్ మీ ఆర్థిక అవసరాలను నెరవేర్చగలదా? మీరు కోరుకునే జీవన విధానానికి అనువుగా ఉందా? ఇలాంటి విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి.  మెంటార్లు,  ప్రొఫెషనల్స్.. మీరు ఇష్టపడే రంగంలో ఇప్పటికే ఉన్నవారి అనుభవాలను తెలుసుకోవాలి.   వారు ఎదుర్కొనే సవాళ్లు, సంతృప్తి, అవకాశాలు తెలుసుకోవాలి.  సవాళ్లను అధిగమించడానికి కావలసిన నైపుణ్యాలు, సామర్థ్యాలు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. ప్రాక్టికల్ ఎక్స్పీరిన్స్.. ఇంటర్న్షిప్‌లు, వర్క్‌షాప్‌లు, ప్రాజెక్ట్‌లు, వాలంటీర్ వర్క్ ద్వారా ఫీల్డ్ ను దగ్గరగా చూడడం వల్ల చాలా మంచి అనుభవం లభిస్తుంది. భవిష్యత్తు.. ఈ కెరీర్ లో మీరు 10-20 ఏళ్ళ తరువాత మీరు ఎక్కడ  ఉంటారు, ఎక్కడ ఉండాలని అనుకుంటున్నారు? మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలని అనుకుంటున్నారు? ఇవన్నీ ఆలోచించాలి.  అది మీ వ్యక్తిత్వం, విలువలకు సరిపోతుందా? చివరగా.. కెరీర్ ఎంపికలో ఎప్పుడూ ఒకే సరైన దారి ఉండదు. మీ అభిరుచి, సామర్థ్యం, మార్కెట్ డిమాండ్, జీవిత లక్ష్యాల కలయికతో సరైన దారి ఏర్పడుతుంది. ముఖ్యంగా.. శాంతిగా ఆలోచించాలి.  రీసెర్చ్ చేయాలి. అవసరమైతే కెరీర్ కౌన్సెలింగ్  సహాయం తీసుకోవాలి. ఇది చాలా మంచి పునాదికి దారి తీస్తుంది.                                       *రూపశ్రీ.

భారతీయుల ఆరోగ్య యోగానికి ఆది గురువు.. పతంజలి మహర్షి!

  ఈ రోజు యోగా డే అంటూ చాలా ఆడంబరంగా ఉత్సవాలలా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ప్రధాని మోడీ గారు అతిథిగా విచ్చేస్తున్న సందర్భంగా ఈసారి యోగా డే దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. అందులోనూ అన్ని రాష్ట్రాల చూపులు విశాఖపట్నం ఆర్.కె బీచ్ వైపై ఉంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  ఈ రోజు యోగా అనేది విదేశీయులను కూడా ఆకర్షించే అంశం అయిపోయింది.  ఇది మనిషి ఆరోగ్యానికి జీవనాడి అయ్యింది.  అయితే ఈ యోగాను భారతీయులకు అందించినది పతంజలి మహర్షి. అందుకే యోగా డే  సందర్బంగా ఆ మహనీయుడిని గుర్తుచేసుకోవడం భారతీయుల కర్తవ్యం. అలాగే..  యోగా కోసం పతంజలి మహర్షి చేసిన కృషి,  ఆయన చరిత్ర తెలుసుకుంటే.. పతంజలి మహర్షి చరిత్ర వృత్తాంతం  భారత సంస్కృతిలో ఒక గంభీరమైన, ఆధ్యాత్మికంగా ప్రేరణాత్మకమైన గాథ. ఇది పురాణ, ఇతిహాస, ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా వచ్చిందని చెప్పవచ్చు. ఆయన ఒక భగవద్భక్తుడు, తత్త్వవేత్త, గొప్ప పండితుడు. ఆయన్ను మూడు ముఖ్యశాస్త్రాలలో విపులమైన కృషి చేసినవాడిగా గుర్తిస్తారు . ఆ మూడు ఏమిటంటే.. యోగశాస్త్రం, వ్యాకరణం (సంస్కృత వ్యాకరణం),  ఆయుర్వేదం.  ఆయన చరిత్ర వృత్తాంతం..  ఆదిశేషునిగా అవతారం.. పతంజలి మహర్షి, విష్ణుమూర్తికి సేవ చేసే ఆదిశేషుని అవతారంగా పరిగణించబడతారు. ఒక సందర్భంలో, విష్ణుడు తన హృదయంలో శివుని ఆనందతాండవాన్ని దర్శించుకుంటుండగా, ఆదిశేషునికీ ఆ తాండవాన్ని చూడాలనే కోరిక కలిగిందట. అందుకు అనుగుణంగా  విష్ణుమూర్తి ఆదిశేషునికి భూలోకంలో అవతరించాల్సిందిగా సూచించాడు. గోనికా తపస్సు & పతంజలి అవతారం.. విష్ణుమూర్తి ఆదిశేవును భూలోకంలో అవతరించమని ఆదేశించి  సమయంలో గోనికా అనే పతివ్రత స్త్రీ, సూర్య భగవానుని ప్రార్థిస్తూ  లోకానికి ఉపయోగపడే బిడ్డ కావాలని తపస్సు చేస్తూ, చేతులలో నిండుగా నీటిని తీసుకుని అంజలి ఘటిస్తూ అంటే నమస్కారం చేస్తూ అర్చించుకుంటున్న  సమయంలో పాము రూపంలో ఆదిశేషుడు ఆమె చేతుల్లోకి పడిపోయాడట. అందువల్ల ఆ బాలుని పేరు పతంజలి (పతనము + అంజలి) అని ఉద్భవించింది. నటరాజుని తాండవ దర్శనం.. పతంజలి మహర్షి తన తల్లిదండ్రుల వద్ద పెరిగి, తర్వాత చిదంబరం వచ్చినాడు.  అక్కడ శివుడు నటరాజు రూపంలో తాండవం చేస్తున్నాడని తెలిసి. అతనికి శివుని తాండవాన్ని చూసే అవకాశం లభించింది. నంది, భృంగిలు అతని శరీరాకృతిపై హేళన చేసినా, అతను నోరుతో “నటరాజ నవకం” అనే స్తోత్రాన్ని గానం చేసి శివుని ఆనందింపజేశాడు. ఈ నటరాజ నవకం అనేది పూర్తీగా డమరుక శబ్దంతో ఉంటుంది. నటరాజ నవకం విని సంతోషించిన శివుడు నిన్నునాట్యంలో భాగం చేస్తాను బాధపడకు అని చెప్పి  శివుడు అతనిని తన పాదాల చుట్టూ చుట్టి తాండవంలో భాగస్వామిని చేశాడు.  ఇది పతంజలి మహర్షి  భగవత్‌ ప్రేమకు సంకేతం.  త్రికరణ శుద్ధి లక్ష్యంగా విద్యాబోధన.. శివుని ఆశీర్వాదంతో పతంజలి, భూలోకానికి త్రికరణ శుద్ధి  అంటే మనస్సు, వాక్కు, కర్మ అనేవి  సాధించేందుకు మూడు శాస్త్రాలను అందించాడు. యోగశాస్త్రం – మనస్సు శుద్ధి కోసం వ్యాకరణం – వాక్కు శుద్ధి కోసం ఆయుర్వేదం – శరీర శుద్ధి కోసం శిష్యులకు బోధన.. పతంజలి 1000 మందికి బోధన ఇవ్వాలనుకున్నాడు. అందరి అర్హతలు భిన్నంగా ఉండటంతో, ఓ తెర వెనుక ఆదిశేషురూపంలో బోధించాడు. తెర ఎత్తవద్దని చెప్పినా ఒక శిష్యుడు అతని నియమాన్ని ఉల్లంఘించి తెర తీసేశాడు. దీంతో 999 మంది విద్యార్థులు కాలిపోయారు. మిగిలిన శిష్యుడికి పతంజలి మొత్తం విద్యను బోధించాడు, కాని అతను శాపగ్రస్తుడై బ్రహ్మ రాక్షసుడయ్యాడు. శిష్యుడిని శాప విముక్తుడిని చేసిన ఘట్టం.. ఆ బ్రహ్మ రాక్షసుడు జ్ఞానాన్ని బోధించగల అర్హుడిని వెతుకుతూ, సరైన జవాబు చెప్పని వారిని మింగేవాడు. చివరికి పతంజలి మహర్షి స్వయంగా శిష్యుడి రూపంలో (చంద్రశర్మగా) వచ్చి, సరైన సమాధానం ఇచ్చి, జ్ఞానం తీసుకొని శిష్యుడిని శాపం నుండి విముక్తుణ్ని చేశాడు. ఆ రాక్షసుడు తరువాత గౌడపాదాచార్యుడుగా అవతరించాడు. ఆయన రచనలు.. యోగ సూత్రాలు (196 సూత్రాలు) – యోగ దార్శనికశాస్త్రానికి ప్రామాణిక గ్రంథం. మహాభాష్యం – పాణినీ వ్యాకరణంపై వ్యాఖ్యాన గ్రంథం. ఆయుర్వేదానికి సంబంధించిన రచనలకూ ఆయనకు ఆపాదించబడింది, కానీ ఆధారాల పరంగా స్పష్టత లేదు.  జీవసమాధి స్థలం.. పతంజలి మహర్షి జీవసమాధి స్థలం తమిళనాడు, తిరుపత్తూరు (త్రిచీ దగ్గర)లోని బ్రహ్మపురీశ్వర ఆలయంలో ఉంది.  ప్రార్థన శ్లోకం.. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన। యోఽపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోఽస్మి॥ మనస్సు, వాక్కు, శరీరం శుద్ధి కోసం పతంజలిని ప్రణమిస్తాను అని ఈ ప్రార్థన అర్థం.                                     *రూపశ్రీ

ఎవరినైనా ఎక్కువగా ప్రేమించడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి?

    ఎవరినైనా ఎక్కువగా ప్రేమించడం అనేది సహజమైన భావోద్వేగ ప్రక్రియ. కానీ ఈ ప్రేమ "అతిగా", "అనుదినం అతి ఆసక్తితో", లేదా "అత్యంత అనుభూతులతో" కొనసాగితే, కొన్ని సానుకూలతలతో పాటు ప్రతికూల పరిణామాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని భావోద్వేగ, మానసిక, సంబంధ నైపుణ్యాలు, జీవిత నిర్వాహణ దృష్టికోణాల్లో విపులంగా విశ్లేషిస్తే ఇలా ఎవరినైననా ఎక్కువగా ప్రేమించడం ఎంత వరకు మంచిది అనే విషయం అర్థమవుతుంది.  ఇందులో సానుకూల, ప్రతికూల ప్రభావాలు రెండూ ఉంటాయి కాబట్టి ఈ రెండింటి గురించి తెలుసుకోవాలి. సానుకూల ప్రభావాలు. బంధం బలపడుతుంది.. ఇతరుల మీద  చూపే ప్రేమతో ఎదుటి వ్యక్తికి భద్రత, ఆదరణ, విలువ అనే భావనలు కలుగుతాయి. ఎక్కువ ప్రేమ చూపించడం వల్ల ఇద్దరి మధ్య అవగాహన, విశ్వాసం పెరిగే అవకాశం ఉంటుంది. ఇద్దరూ ఒకరిపట్ల మరొకరు ప్రేమగా ఉండే వాతావరణం పెరుగుతుంది. సహనశీలత పెరుగుతుంది..  ఎవరినైనా బాగా ప్రేమిస్తే వారి లోపాలను సహించగలగడం, వారిని మార్చుకునే అవకాశం ఇవ్వడం సులభమవుతుంది.  దీని వల్ల బంధాలు నిలబడతాయి.  ఇలాగే మనుషులలో మార్పు సాధ్యమవుతుంది.  నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారు కదా వారి కోసం మారితే తప్పేంటి అనే ఆలోచన పుడుతుంది. అలాగే వారికోసం త్యాగాలు చేయడంలో తృప్తి కలుగుతుంది.  ఆ వ్యక్తి కోసం  చేసే త్యాగాలు బాధించవు. ప్రేమించే వ్యక్తి ఆనందంగా ఉండటం చూసి  సంతోషపడటంలో తన సంతోషం చూసుకుంటారు.  ప్రతికూల పరిణామాలు. ఎక్కువగా ప్రేమించడం వల్ల సానుకూల పరిణామాలే కాకుండా ప్రతికూల పరిణామాలు కూడా ఉంటాయి.  స్వీయ గౌరవం తగ్గిపోవడం..  పూర్తిగా ఎదుటివారిని ప్రేమిస్తూ, ఎదుటి వారి కోసం జీవిస్తూ, వారిని సంతుష్టిపరిచే ప్రయత్నంలో  తమ  వ్యక్తిత్వం మరిచిపోవడం జరుగుతుంది. ఇలా తమను తాము పట్టించుకోకుండా ఎదుటివారికే ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల  ఎదుటివారి దృష్టిలో తక్కువయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. తాము ఎదుటివారి కంటే ఎప్పుడూ తక్కువే అనే ఫీలింగ్ ప్రేమించే వ్యక్తులలో కూడా ఏర్పడుతుంది.  అధిక ఆసక్తి.. ప్రేమ అనే భావన క్రమంగా అధిక ఆకర్షణగా మారి, తట్టుకోలేని అసహనంగా, నియంత్రణ కోల్పోయే స్థితికి చేరవచ్చు. ఇది ఎదుటివారికి అసౌకర్యంగా, బంధంలో ఒత్తిడిగా భావించడానికి దారి తీస్తుంది. ఆత్మనిబ్బరత కోల్పోవడం.. తమ నిర్ణయాలు, సంతోషాలు, భావోద్వేగాలు అన్నింటినీ ఒకే వ్యక్తిపై ఆధారపడి చూసే విధంగా మారిపోతారు.  వారు  లేకుండా జీవించలేని స్థితి ఏర్పడుతుంది. ఇది మానసికంగా ప్రమాదకరం. వైఫల్యం.. ఎక్కువగా చూపించే ప్రేమకు తగినట్టు అవతలి వ్యక్తులు  సమానంగా స్పందించకపోతే, తీవ్రమైన హృదయవేదన, నిరాశ, కోపం, డిప్రెషన్ వంటి భావాలు రావచ్చు. కొందరికి ఈ జీవితం వద్దు అని ఆత్మహత్య ఆలోచనలు ఏర్పడే స్థితికి దారితీయవచ్చు. సంబంధంలో అసమతుల్యత.. ఒకరు ఎక్కువగా ప్రేమిస్తే, మరొకరు తక్కువగా స్పందిస్తే, ఈ అసమతుల్యత బంధం అసంతృప్తికరంగా మార్చుతుంది. సమతుల్యంగా ప్రేమించడం ఎలా? స్వీయ గౌరవాన్ని నిలుపుకోవాలి.. ప్రేమించడమే కాదు, తానేంటో గుర్తుంచుకోవాలి. వ్యక్తిగత  విలువను మరువకూడు. ప్రేమించిన వారి కోసం  జీవితవిధానాలను పక్కన పెట్టవద్దు.  కెరీర్, కుటుంబం, ఇతర హక్కులు, అభిరుచుల్ని కొనసాగించాలి. ఎక్కువ మందితో  ప్రేమ చెలామణీ కాకుండా, అవగాహనతో ప్రేమించాలి.  వారి స్వేచ్ఛకు అడ్డుపడకుండా ప్రేమ చూపించాలి. స్పష్టమైన కమ్యూనికేషన్ అవసరం.  మీరు ఎంత ప్రేమిస్తున్నారో చెప్పారు, అలాగే ఎదుటివారి భావనలకూ గౌరవం ఇవ్వాలి. సంతృప్తితో ప్రేమించాలి. సమాధానాల కోసం కాదు. ఎదుటివారు  ప్రేమను తిరిగి ఇవ్వకపోయినా  ప్రేమలో అంతరంగిక తృప్తి ఉండాలి.                     *రూపశ్రీ.

యోగా గురించి ఆయుర్వేదం ఏం చెప్పింది? దీనికున్న ప్రాధాన్యత ఏమిటి?

  యోగా గురించి ఆయుర్వేదం చాలా ప్రాముఖ్యంగా చెబుతుంది. ఇది శరీరం, మనసు,  ఆత్మ మధ్య సమతుల్యతను ఏర్పరచే సాధనంగా పరిగణించబడుతుంది. ఆయుర్వేదం,  యోగా రెండూ భారతీయ సంప్రదాయ వైద్యం,  ఆధ్యాత్మికతకు మూల స్తంభాలుగా ఉన్నాయి. ఇవి పరస్పరం అనుసంధానంగా ఉండి, ఆరోగ్యాన్ని సంపూర్ణంగా ,  శారీరకంగా, మానసికంగా, బౌద్ధికంగా  మెరుగుపరచే విధానాలను అందిస్తాయి. ఆయుర్వేదంలో యోగ స్థానం ఇదే.. త్రిదోష సిద్ధాంతానికి అనుగుణంగా... ఆయుర్వేదం ప్రకారం మన ఆరోగ్యం మూడు దోషాలపై ఆధారపడి ఉంటుంది.  వాత, పిత్త, కఫ అనే దోషాలు ప్రతి మనిషిలో ఉంటాయి. ఇవి సమతుల్యంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది.  ఈ త్రిగుణాలను సమతుల్యంలో ఉంచడానికి యోగా సహాయపడుతుంది. ఉదాహరణకు.. ప్రాణాయామం వాత దోషాన్ని నియంత్రించగలదు, ఆసనాలు కఫ దోషాన్ని క్రమంలోకి తేస్తాయి. ధ్యానం పిత్త దోషాన్ని శాంతపరచగలదు. ఆహార, ఆచార నియమాలకు తోడుగా.. ఆయుర్వేదం మనిషి జీవన విధానాన్ని సమతుల్యంలో ఉంచే విధంగా ఆహార నియమాలు , జీవన శైలి ,  మానసిక ఆరోగ్యం  ఉండాలని చెబుతుంది.  వీటిని ఆహార, విహార, మనోవ్యాపార నియమాలు అని అంటుంది.  యోగా వీటిని స్థిరంగా పాటించడంలో శరీరానికీ మనస్సుకీ స్థిరత్వాన్ని ఇస్తుంది. యోగ ప్రాముఖ్యత ఇదే.. శరీరశుద్ధి .. యోగిక శుద్ధిక్రియలు  ముఖ్యంగా కపాలభాతి, జలనేతి, శంఖ ప్రక్షాలన మొదలైనవి శరీరంలో తామసిక,  రజసిక సంకలితాలను తొలగించి, సత్వగుణాన్ని పెంచుతాయి. ఇది ఆయుర్వేదంలో చెప్పే "పంచకర్మ" విధానాలకు సహాయకం. ఆత్మ నియంత్రణ .. యోగాభ్యాసం వల్ల శీలం, నియమం, ధైర్యం, సామర్థ్యం వంటి లక్షణాలు పెరుగుతాయి. ఇవి ఆయుర్వేదంలో స్వస్థవ్యక్తి లక్షణాలుగా పేర్కొనబడ్డాయి. మనోవ్యాధుల నివారణ.. ఆయుర్వేదంలో మనోవ్యాధులు (మానసిక రుగ్మతలు) కోసం సత్త్వవజయ చికిత్స అనే ప్రత్యేక విభాగం ఉంది. ఇందులో ధ్యానం, ప్రాణాయామం,  మనస్సు పై నియంత్రణ సాధనాలుగా యోగను ఉపయోగిస్తారు. ఒజస్సు వృద్ధి.. యోగా ఆయుర్వేదంలో ముఖ్యంగా చెప్పే "ఒజస్సు" (శరీర రక్షణశక్తి)ని పెంచుతుంది. దీర్ఘకాలికంగా యోగ సాధన వల్ల దీర్ఘాయువు, యోచనా స్పష్టత, జీవశక్తి పెరుగుతాయి. అంతర్వేద కాలం నుంచి ఆధునిక యోగం వరకు.. ఆయుర్వేద గ్రంథాల్లో  ముఖ్యంగా అష్టాంగ హృదయం, చరక సంహిత, సుశ్రుత సంహిత మొదలైన గ్రంథాలలో  యోగ గురించి ప్రత్యక్షంగా ప్రత్యేక అధ్యాయాలు లేవు కానీ, జీవన నియమాలలో, దినచర్య, ఋతుచర్యల్లో యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం వంటి సాధనలు సూచించబడ్డాయి. ఆయుర్వేదంలోని "స్వస్థవృత్తం" అనే విభాగం యోగానికి ప్రాధాన్యతను సూచిస్తుంది. ఆయుర్వేదంలో యోగ ప్రాముఖ్యత.. శరీర ఆరోగ్యం దోష సమతుల్యం, శుద్ధిక్రియలు మానసిక శాంతి ధ్యానం, మనోవ్యాధుల నివారణ జీవశక్తి ఒజస్సు వృద్ధి, జీవన శైలి దినచర్య, ఋతుచర్యలో భాగంగా ఆత్మీయ వికాసం ధ్యానం ద్వారా ఆత్మ గమనం మొదలైనవి సాధించడానికి సహాయపడుతుందని యోగ గురించి ఆయుర్వేదం చెబుతుంది.                       *రూపశ్రీ.

ఏసీ వేసిన తర్వాత కూడా గది చల్లగా ఉండటం లేదా? ఇదే మీరు చేస్తున్న బిగ్ మిస్టేక్..!

  వేసవికాలంలో తాహతు ఉన్నవారు ఏసీ ఏర్పాటు చేయించుకోవడం,  చల్లని గదులలో సేద తీరడం చాలా సాధారణ విషయం.  పట్టణాలలో ఎండ తీవ్రతలు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంటాయి. వేసవి ముగింపుకు వచ్చినా సూర్యుడి ప్రతాపం తగ్గడం లేదు. అయితే చాలామంది ఇళ్లలో లేదా కార్యాలయాలలో ఏసీ వేసిన తరువాత కూడా గది చల్లబడకపోవడం జరుగుతూ ఉంటుంది.  ముఖ్యంగా పై అంతస్తులలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.  దీని వెనుక కారణం చాలామంది తమకు  తెలియకుండానే చేసిన చిన్న తప్పు కావచ్చు.  దీని వెనుక కారణం ఏమిటి? ఇలా ఏసీ చల్లబడకపోవడం వల్ల కలిగే నష్టం ఏంటి?  తెలుసుకుంటే.. పై అంతస్తులో ఏసీ వేసినా గది చల్లబడకపోవడానికి కారణం ఏసీతో పాటు ఫ్యాన్ కూడా వాడటమే. ఒక వైపు ఏసీ  చల్లగాలిని ఇస్తుంటే.. మరొకవైపు   ఫ్యాన్ వేడి గాలిని   వదులుతూ ఉంటుంది. దీనివల్ల నేల,  పైకప్పు మధ్య 5 నుండి 6 డిగ్రీల తేడా ఉంటుంది. తలను పైకప్పు వైపుకు కదిలిస్తే, ఉష్ణోగ్రతలో ఈ వ్యత్యాసాన్ని అనుభూతి చెందవచ్చు.  అయితే థర్మోకోల్ సీలింగ్‌తో పైకప్పును తీసుకుంటే  అది గది ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఏం చేయాలి? ఏసీతో పాటు ఫ్యాన్ కూడా నడపాల్సిన అవసరం లేదనే విషయం తెలుసుకోవాలి. వేసవిలో ఏసీ వేసిన తర్వాత కొంతకాలం ఓపిక పట్టాలి. క్రమంగా ఇల్లు చల్లబడటం ప్రారంభమవుతుంది. ఒకవేళ ఇంకా గది చల్లబడలేదు అనిపిస్తే గది కొంచెం చల్లబడిన తర్వాత ఫ్యాన్‌ను ఆన్ చేయాలి. ఇది గాలిని కలుపుతుంది. కావాలంటే ఫ్యాన్ ఆన్ చేయకుండా కూడా  హాయిగా ఉండవచ్చు. ఇది విద్యుత్తును కూడా ఆదా చేస్తుంది. ఈ లాజిక్ తెలుసుకోండి.. AC  పని ఏమిటంటే గది గాలి నుండి వేడి,  తేమను తీసుకోవడం ద్వారా దానిని చల్లబరుస్తుంది. AC గాలిని చల్లబరుస్తుంది,  దానిని క్రిందికి పంపుతుంది.  ఎందుకంటే చల్లని గాలి భారీగా ఉంటుంది,  అది దిగువగా ఉంటుంది.  కానీ ఫ్యాన్‌ను ACతో పాటు నడిపినప్పుడు, ఫ్యాన్ గదిలోని గాలిని వేగంగా వ్యాపింపజేస్తుంది. దీనివల్ల  చల్లని గాలి గదిలో సరిగ్గా 'స్థిరపడటానికి' అనుమతించదు. ఈ నష్టం తెలుసుకోవాలి.. ఫ్యాన్ చల్లని గాలిని సరిగ్గా సెట్ చేయడానికి అనుమతించనప్పుడు, సెట్ ఉష్ణోగ్రతను నిర్వహించడానికి AC మళ్లీ మళ్లీ కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. ఇది AC శీతలీకరణ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది,  గది అంతగా చల్లబడదు. అదే సమయంలో AC తన పనిని సరిగ్గా చేయడానికి ఎక్కువ కష్టపడాల్సి వచ్చినప్పుడు అది ఎక్కువ విద్యుత్తును వినియోగించుకుంటుంది. ఫ్యాన్‌ను నడపడం వల్ల విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుంది. ఇవి గుర్తుంచుకోండి.. గదిని చల్లబరచడానికి ఏసీకి తగినంత సమయం ఇవ్వాలి. ఫ్యాన్‌ను ఆన్ చేయడం ద్వారా ఏసీ పనిని పెంచవద్దు. చల్లని గాలి బయటకు వెళ్ళకుండా,  వేడి గాలి లోపలికి రాకుండా తలుపులు,  కిటికీలను సరిగ్గా మూసి ఉంచాలి. పగటిపూట మందపాటి కర్టెన్లు లేదా బ్లైండ్లను వాడాలి. తద్వారా సూర్యుడి నుండి నేరుగా వేడి గదిలోకి ప్రవేశించదు.                         *రూపశ్రీ.

భార్యాభర్తల బంధం బలంగా ఉండాలంటే.. ఇవి పాటించాలి..!

పుట్టినప్పటి నుండి ఎలాంటి పరిచయం లేకుండా పెళ్లి అనే ఒక బంధంతో ఇద్దరూ ఒకటై జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం భార్యాభర్తల బంధం. భార్యాభర్తల బంధం అనేది నమ్మకం, ప్రేమ, పరస్పర గౌరవం మీద ఆధారపడి ఉంటుంది. ఈ బంధాన్ని బలంగా, ఆనందంగా నిలుపుకోవాలంటే కొన్ని ముఖ్యమైన అంశాలను పాటించడం చాలా అవసరం. నేటి కాలంలో వివాహాలు జరిగిన తరువాత చాలా తొందరగా వివాహ బంధాలు విచ్చిన్నం అవుతున్న నేపథ్యంలో వివాహ బంధాలు బలంగా నిలబడటానికి రిలేషన్షిప్ నిపుణులు చెప్పిన కొన్ని చిట్కాలు ఇవే.. సమయం.. రోజువారీ బిజీ జీవితంలోనూ కనీసం కొంత సమయాన్ని ఒకరికి ఒకరు కేటాయించాలి. కలసి భోజనం చేయడం, ప్రాముఖ్యత ఉన్న విషయాల్లో కలిసి మాట్లాడుకోవడం అవసరం. ఇద్దరూ కలసి చేయగలిగిన పనులను పరస్పరం స్నేహభావంతో చేసుకోవాలి. ఇది ఇద్దరి మధ్య దగ్గరితనాన్ని పెంచుతుంది. పరస్పర గౌరవం.. ఒకరినొకరు అవమానించుకోవడం జరుగుతూ ఉంటే ఆ బంధం ఎప్పటికీ నిలబడదు.  ఈ కాలంలో అమ్మాయిలు  తమకంటూ ప్రాధాన్యత ఉండాలని, తమకు గౌరవం ఉండాలని అనుకుంటారు. కాబట్టి భర్తలు భార్యలను  అపహాస్యం చేయడం, గౌరవం లేకుండా మాట్లాడటం,  భార్యలు అంటే పని మనుషులు, బానిసలు అన్నట్టు ట్రీట్ చేయడం మానుకోవాలి.    ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని ఇరువురూ గౌరవించాలి .  విషయం పెద్దదైనా, చిన్నదైనా ఇరువురూ ప్రాధాన్యత ఇచ్చుకుంటూ, గౌరవించుకోవాలి. . నమ్మకం.. అబద్ధాలు, దాచిపెట్టిన విషయాలు బంధాన్ని దెబ్బతీస్తాయి.  ఒకరి పట్ల ఒకరు నిజాయితీగా ఉండాలి.   తప్పు చేసినా సరే.. నిజాయితీగా ఒప్పుకుని సరిదిద్దుకునే అవకాశం అడగాలి. నిజాయితీగా ఉండటం వల్ల విశ్వాసం పెరుగుతుంది. సహనంగా ఉండాలి.. ప్రతి చిన్న విషయం మీద గొడవపడకూడదు.  రెండు విభిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఎప్పుడూ వేర్వేరు అలోచనలతో, వేర్వేరు ప్రవర్తనలతో ఉంటారు.  ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలన్నా,  ఏవైనా తప్పులు జరిగినప్పుడు వాటిని సరి చేసుకోవాలన్నా  సహనం ఉండాలి.  ఏదైనా గొడవ లేదా తప్పిదం జరిగినప్పుడు వెంటనే మాట అనడం లేదా నిందించడం చేయకూడదు. ఇది బంధాన్ని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా చిన్న చిన్న గొడవలను  మౌనంగా వదిలేయడమూ ఒక తెలివైన పరిష్కారం. మెచ్చుకోవడం.. ఒకరి ప్రయత్నాలను,   ఒకరి గెలుపును, ఒకరి సృజనాత్మకతను మెచ్చుకోవడం చాలా ముఖ్యం. భార్యాభర్తలలో ఎవరైనా సరే ఒక విజయం సాధించారు అంటే భాగస్వామి తోడ్పాటు ఎంతో కొంత ఉంటుంది.  అందుకే విజయాలు సాధించినప్పుడు థాంక్స్ చెప్పడం, నీ వల్లే ఈ పని ఫర్పెక్ట్ గా చేయగలిగాను లాంటి మాటలు సంబంధాన్ని సానుకూలంగా ఉంచుతాయి. నిర్ణయాలు.. ముఖ్యమైన విషయాల్లో ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకోవాలి. ఒకరిపై ఆధిపత్యం చూపడం వలన విభేదాలు వస్తాయి. భార్యాభర్తలలో ఇద్దరిలో ఒకరికి విషయం మీద అవగాహన లేకపోయినా సరే.. ఇద్దరూ కలిసి మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటే అవగాహన పెరుగుతుంది. కలిసి నిర్ణయం తీసుకున్నాం అనే ధైర్యం కారణంగా పనులలో వైఫల్యాలు ఎదురైనా తప్పిదం ఒకరిమీదే ఉండదు. రొమాంటిక్ మూడ్.. చిన్న చిన్న సర్ప్రైజులు, ప్రేమపూరిత సందేశాలు, ఒకరి మీద ఒకరు శ్రద్ధ చూపడం బంధాన్ని చాలా సన్నిహితం చేస్తాయి.  రెండు వేర్వేరు జెండర్ ల మధ్య బంధం కాబట్టి శారీరక బంధం బలంగా ఉంటే అది ఇద్దరినీ ఎప్పటికీ కలిపి ఉంచుతుంది. నిందలొద్దు.. ఎవరి తప్పైనా, ఆరోపణలకన్నా పరిష్కార దిశగా ఆలోచించడం మంచిది.  "నువ్వే తప్పు చేశావు" అనే ఆలోచనను మార్చుకోవాలి. ఆర్థిక విషయాలు.. ఖర్చుల విషయంలో ఓపికగా, పరస్పర అవగాహనతో వ్యవహరించాలి. ఆర్థిక విషయాలలో దాపరికాలు ఉండకూడదు. భార్యాభర్తల మధ్య విబేధాలు రావడానికి డబ్బుకు అవకాశం ఇవ్వకూడదు. స్నేహం.. జీవిత భాగస్వామిగా కాక, స్నేహితుల్లా ఉండాలి. ఇలా ఉంటే ఏ విషయాలు అయినా ఒకరితో ఒకరు నిస్సంకోచంగా షేర్ చేసుకోగలుగుతారు.  ఇది ఒకరి మీద మరొకరికి నమ్మకాన్ని పెంచుతుంది.                               *రూపశ్రీ.

మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా ఎదగడానికి అద్భుతమైన చిట్కాలు..!

  సమాజంలో చాలా వరకు మధ్యతరగతి,దిగు తరగతి కుటుంబాలే ఉంటాయి.  అటు పేదవాళ్లలా  తమకు ఏమీ లేదని సమాధానం చెప్పుకోలేరు.  ఇటు ధనికులతో పోల్చుకుని తమ సంతోషాలు ఎందుకు వదులుకోవాలి అని సంఘర్షణ ను దాటలేరు.  రెండింటికి మధ్య రేవడిలా మధ్యతరగతి కుటంబాలు ధనికులకు, పేదవారికి మధ్య సతమతం  అయిపోతుంటారు.  అయితే చాలా వరకు మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా ఎదగకపోవడం అనేది వారు తీసుకునే నిర్ణయాల పైనే ఆధారపడి ఉంటుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.  ఈ కింది చిట్కాలు పాటిస్తే మధ్యతరగతి వారు కూడా ధనికులుగా మారిపోవచ్చు.  దానికోసం పాటించాల్సిన చిట్కాలు తెలుసుకుంటే..  బడ్జెట్.. నెలకి ఎంత ఆదాయం వస్తుందో, ఎంత ఖర్చవుతుందో స్పష్టంగా తెలుసుకోవాలి.  అవసరమైన ఖర్చులు (ఆహారం, ఇంటి అద్దె, విద్య, వైద్యం) & అనవసరమైన  ఖర్చులు (బయట తినడం, వృధా షాపింగ్) వేరు చేయాలి.  ప్రతి నెలా ఖర్చుల లెక్క రాసే అలవాటు పెట్టుకోవాలి. ఇలా చేస్తే బడ్జెట్ ప్లానింగ్ సమర్థవంతంగా అమలు చేయవచ్చు. పొదుపు.. ప్రతి నెలా కనీసం 10%–20% ఆదాయాన్ని పొదుపుగా  మార్చాలి.  RD,SIP లాంటి సురక్షిత, స్థిరమైన పొదుపు పద్ధతులు ఎంచుకోవడం ఉత్తమం.  వీటిని చిన్న మొత్తాలతో మొదలుపెట్టాలి.  ఆ తరువాత దాన్ని పెంచుకుంటూ వెళ్లాలి. పెట్టుబడులు.. SIP, మ్యూచువల్ ఫండ్స్, PPF, FD, RD, Gold Bonds వంటి పెట్టుబడి మార్గాల గురించి తెలుసుకుని వాటిని అనుసరించడం మంచిది. వడ్డీని సంపాదించేవాడు కంటే వడ్డీని చెల్లించేవాడు ఎప్పుడూ నష్టంలో ఉంటాడు. కాబట్టి ఆస్తులపై పెట్టుబడి పెట్టడం మంచిది. ఆర్థిక విద్య.. “ఇన్వెస్ట్ మెంట్ అంటే ఏమిటి? బీమా ఎందుకు అవసరం? రిస్క్ మేనేజ్‌మెంట్ ఎలా?” వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటే పొదుపు చేయడం ఆర్థికంగా ఎదగడం సులువు అవుతుంది.  వీటి కోసం ఎక్కడో డబ్బు కట్టి క్లాసులు అటెండ్ కావాల్సిన అవసరం లేదు. YouTube, ఫ్రీ ఆన్లైన్ కోర్సులు, ఆర్థిక బ్లాగులు చదవితే సరిపోతుంది. అప్పులు.. అవసరం లేని క్రెడిట్ కార్డ్స్, వ్యక్తిగత అప్పులు తీసుకోవద్దు. అప్పులు తీసుకుంటే వాటిని తక్కువ వడ్డీతో త్వరగా తీర్చేయాలి. ఇలా లేకపోతే దీర్ఘకాలం నష్టం ఎదురవుతుంది. అదనపు ఆదాయ మార్గాలు.. వర్క్ ఫ్రం హోం అవకాశాలు, ఫ్రీలాన్స్ పనులు, వంటకాలు/హస్తకళల ద్వారా ఉపాధి మొదలైనవి అదనపు ఆదాయానికి మంచి మార్గాలు.  కుటుంబ సభ్యులు కొంతమంది పని చేసే స్థితిలో ఉంటే, వారికి ఆధునిక నైపుణ్యాలు నేర్పించడం మంచిది.  (Digital Marketing, Data Entry, Content Writing, Handicrafts మొదలైనవి). ఆర్థిక విషయాలు.. భార్యాభర్తలు కలిసి ఆర్థిక ప్రణాళిక ప్లాన్  చేయాలి. పిల్లలకు చిన్న వయసులోనే పొదుపు, ఖర్చుల విలువ నేర్పాలి. ఇది భవిష్యత్తులో పిల్లల ద్వారా ఆర్థిక దుర్వినియోగం జరిగే అవకాశాలు తగ్గించి పొదుపును ప్రోత్సహిస్తుంది. బీమా.. ఆరోగ్య బీమా (Health Insurance), జీవన బీమా (Life Insurance) తీసుకోవడం వలన అనుకోని పరిస్థితుల్లో పెద్ద వ్యయం దూరం అవుతుంది. దీర్ఘకాలిక లక్ష్యాలు.. పిల్లల చదువు, ఇంటి కొనుగోలు, రిటైర్మెంట్ వంటి విషయాలకు ముందుగానే ప్రణాళిక వేయాలి. ఇలా ప్రతి ఒక్కటి ఆలోచనతో, చిన్నగా మొదలుపెడితే మధ్యతరగతి కుటుంబాలు కూడా ధనిక కుటుంబాలుగా ఎదుగుతాయి. ముఖ్యంగా ఒక మనిషి సంపాదన మీద కుటుంబం గడిస్తే అది మధ్యతరగతి కుటుంబాలను ఎదగనీయదు. కాబట్టి కుటుంబంలో ఎవరి సామర్థ్యం,  ఎవరి ప్రతిభకు తగ్గట్టు వారు ఏదో ఒక వర్క్ చేసి సంపాదిస్తూ ఉంటే కుటుంబం ఆర్థికంగా బలపడుతుంది.                              *రూపశ్రీ.

ఇలా ఆలోచిస్తే… జీవితాన్ని అద్భుతంగా సృష్టించుకోవచ్చు!

  మనకు ప్రతి రోజూ ప్రతి సందర్భంలో ఏదో ఒకటి అవసరం అవుతూ ఉంటుంది. నిజానికి అవసరం అవుతూ ఉంటుంది అనడం కంటే మనకు అది కావాలి, ఇది కావాలి అని అనిపిస్తూ ఉంటుంది అనడం సమంజసం ఏమో… అందరూ తమకు లేనిదాని గురించి, కావలసిన దాని గురించి, సాధించుకోవలసిన దాని గురించి ఇలా ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ వుంటారు. వాటికోసం ప్రణాళికలు కావచ్చు, వాటిని నెరవేర్చుకునే మార్గాలు కావచ్చు, వాటి గురించి సమాచారం కావచ్చు. ఖచ్చితంగా వాటిని జీవితంలో అవసరం కింద లెక్కవేసుకుని  ఇక వాటిని మనం కచ్చితంగా నెరవేర్చుకోవాలి అన్నంత బలంగా వాటి కోసం ఆలోచిస్తారు.  అయితే మన దైనందిన జీవితంలో మనలో ఎవరికైనా ఏమీ లేని దాని గురించి ఆలోచించడానికి సమయం ఉందా? ఏమీ లేకపోవడం అంటే ఏంటి అని సందేహం అందరికీ వస్తుంది. ఏమి లేకపోవడం అంటే మనకు అవసరం లేని,  మనకు సంబంధంలేని విషయం గురించి ఆలోచించడం అని అర్థం. అలా ఆలోచించే తీరిక ఎవరికైనా ఉందా అని అడిగితే… చాలామంది "దాని గురించి ఆలోచించే తీరిక నాకు ఒక్కక్షణం కూడా లేదు" అని చెబుతారు.  సమయం, పని, మరి ఇతర కారణాల వల్ల ఇప్పటి కాలంలో వారు  జీవితంలో చాలా ఒత్తిళ్లకు గురి అవుతున్నారు. మరీ ముఖ్యంగా ఆధునిక జీవితం ఒకప్పటి జీవితం కన్నా చాలా ఒత్తిడితో కూడుకుని ఉంది.  ప్రతి ఒక్కరూ ప్రతిరోజు, ఆరోజంతా చేయాల్సిన పని గురించి ఆలోచించడం, వాటికి తగిన సన్నాహాలు చేసుకోవడం, వాటి కోసం పరుగులు పెట్టడం ఆ పనిని పూర్తి చేయడానికి తమ వంతు ప్రయత్నం చేయడం చేస్తారు. అందువల్ల అందరూ ఆనందాన్ని కోల్పోతున్నారు.  ఏమిటిది?? ఇలా పనులు చేయడం వల్ల ఆనందాన్ని కోల్పోవడం జరుగుతుందా?? అనే ప్రశ్న వేసుకుంటే…. ఇలా ఒక ఆశింపు భావనతో చేసే పనులలో ఆర్థిక పరమైన అవసరాల కోసం చేయడమే ఉంటుంది కానీ మానసిక ప్రశాంతత, మనసుకు తృప్తి లభించే కోణంలో చేసే పనులు ఉండవు.  ఎప్పుడైనా సరే  కేవలం పది నిమిషాలు మీకు కావాల్సి వస్తుంది. దేని గురించి ఆలోచించకుండా అంటే కావలసిన వాటి గురించి, అవసరమైన వాటి గురించి ఆలోచించకుండా కేవలం శూన్యత కోసం సమయం కేటాయించడానికి. అప్పుడు రకరకాల ఆలోచనలు  బుర్రలో తిరుగుతుంటాయి. అలా బుర్రను అవరించుకునే ఆలోచనలను  ఒకటొకటిగా బయటకు పంపించే ప్రయత్నం చేయాలి. ఆ సమయంలో  అలా చేస్తున్నప్పుడు అప్పటి  ప్రస్తుత స్థితిని గమనించడం ప్రారంభిస్తారు. చుట్టూ ఉన్న వాతావరణం ప్రకృతిలోని సూక్ష్మమైన మార్పులు నిశితంగా గమనిస్తే గనుక అవి మిమ్మల్ని సజీవంగా ఉంచుతాయి.చాలామంది ఏదో విషయాలను ఆలోచిస్తూ పర్సధ్యానంగా ఉంటారు. అయితే అలా ఇతర విషయాల వల్ల  పరధ్యానంలో లేనప్పుడు నిజాయితీతో కూడిన స్వచ్ఛమైన  వ్యక్తిత్వం బయటకు వస్తుంది. అప్పుడు ఇతరత్రా వాటి గురించి ఆలోచించడానికి సమయం కూడా ఉండదు.   నిజమైన వ్యక్తిత్వాన్ని  చూసుకున్నప్పుడు అది మనిషికి ఎంతో తృప్తిని, తనలో తాను చేసుకోవలసిన మార్పులను స్పష్టం చేస్తుంది. ఇలా వేరే ఆలోచనలు చేయడానికి సమయం వెచ్చించకపొవడం అనేది సాధారణ జీవితాన్ని అద్భుతంగా  సృష్టించుకునే దిశగా వేసే మొదటి అడుగు అవుతుంది.                                        ◆నిశ్శబ్ద.

టీ తాగే సరైన విధానం మీకు తెలుసా?

  టీ భారతీయులకు ఒక గొప్ప ఎమోషన్. ఇది వేరే దేశం నుండి మన దేశానికి వచ్చిన పానీయమే అయినా భారతీయులు టీ అంటే ప్రాణం ఇస్తారు.  సమయం పాడు లేకుండా టీ తాగే వారు ఉంటారు.  నలుగురు స్నేహితులను అయినా,  ఉద్యోగ చర్చలకు అయినా, పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడానికి అయినా ఛాయ్ సిట్టింగ్ ఒక మంచి మార్గం.  అయితే చాలా మందికి టీ తాగే సరైన మార్గం తెలియదు. టీ తాగడానికి కూడా ఒక పద్దతి ఉంది.  టీ కప్పు పట్టుకోవడం దగ్గర నుండి దాన్ని సిప్ చేయడం వరకు టీ వెనుక ఒక సంప్రదాయం,  దానికంటూ ఒక ప్రత్యేక గౌరవం ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద రెస్టారెంట్లు,  ఖరీదైన లైఫ్ గడిపే వ్యక్తుల దగ్గర టీ తాగాల్సి వస్తే ఇష్టమొచ్చినట్టు తాగకూడదు.  టీ తాగేటప్పుడు పాటించాల్సిన టిప్స్ ఏంటి తెలుసుకుంటే.. కొన్ని ప్రాంతాలలో కొన్ని పదార్థాలను ఇష్టమొచ్చినట్టు తినలేం, తాగలేం.  తప్పు పద్దతిలో తినడం, తాగడం చేస్తే ప్రాంతీయత పరంగా వారిని అవమానించినట్టు ఫీలవుతారు.  అందుకే ప్రతి పదార్థం ఎలా తినాలి, ఎలా తాగాలి అనేవి తెలుసుకోవాలి. వాటిలో టీ తాగడం కూడా ఒకటి.  టీ భారతీయుల పానీయం కాదు.. కాబట్టి దాన్ని భారతీయులు వారికి నచ్చిన పద్దతిలో నచ్చినట్టు తాగేస్తారు. టీ తాగేటప్పుడు టీ కప్పు హ్యాండిల్ ను ఎల్లప్పుడూ టీ కప్పు సాసర్ పై ఉంచాలి. అది కూడా టీ కప్పు హ్యాండిల్ గడియారంలో  3 సంఖ్య ఎక్కడ ఉంటుందో ఆ కోణంలో ఉండాలి.  ఇక ఎడమ చేతితో టీ తాగేవారు అయితే టీ కప్పు హ్యాండిల్ గడియారంలో 9 సంఖ్య ఎక్కడ ఉంటుందో ఆ కోణం దగ్గర ఉండాలి. ఇలా ఉంటే టీ కప్పు అందుకోవడం సులభంగా ఉంటుంది. టీ కప్పు హ్యాండిల్ పట్టుకోవడానికి ఎప్పుడు చూపుడు వేలు, మధ్యవేలు,  బొటన వేలును ఉపయోగించాలి.  ఉంగరపు వేలు,  చిటికెన వేలును సపోర్ట్ కోసం ఉపయోగించాలి. టీ కప్పుతో పాటు చెంచా ఉంచితే దాన్ని కప్పు వెనుక భాగంలో ఉంచాలి.  కప్పులో ఎప్పుడూ చెంచాను ఉంచకూడదు.  టీలో పాలు లేదా పంచదార వేసుకున్నప్పుడు చెంచాను  కప్పు లో వృత్తాకారం లో తిప్పకూడదు.  అర్థవృత్తాకారంలో మాత్రమే అది కూడా ముందుకు వెనక్కు తిప్పాలి. శబ్దం రాకుండా తిప్పాలి. పంచదారను టీలో వేసుకుని చెంచాతో కలుపుతూ సుడిగుండం సృష్టించినట్టు తిప్పకూడదు.  అలాగే చెంచాను కప్పు మీద గట్టిగా కొట్టడం లాంటివి కూడా చేయకూడదు. టీని కలిపిన తరువాత చెంచాకు అంటుకున్న టీని నాకడం చేయకూడదు.  చెంచాను టీ కప్పు వెనుక భాగంలో పెట్టేయాలి. టీని కప్పులో సొంతంగా పోసుకునే పరిస్థితి ఉన్నప్పుడు కప్పు నిండుగా టీ పోసుకోకూడదు. ఎప్పుడూ కప్పులో 75శాతం మాత్రమే టీతో నింపాలి. 25శాతం ఖాళీగా ఉంచాలి.                                                *రూపశ్రీ.

తల్లిదండ్రులు తెలియకుండా చేస్తున్న ఈ తప్పులు పిల్లలను దూరం చేస్తాయ్..!

  పిల్లలను పెంచడం అనేది బాధ్యతాయుతమైన,  కష్టమైన పని. తల్లిదండ్రుల ప్రతి మాట పిల్లల జీవితంపై గాఢమైన ప్రభావాన్ని చూపుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును  మెరుగ్గా ఉంచడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తారు. తల్లిదండ్రులుగా మారడం ఖచ్చితంగా ఒక ఆహ్లాదకరమైన అనుభూతి, కానీ తల్లిదండ్రులుగా సమర్థవంతమైన బాధ్యత కత్తిమీద సాము వంటిదనే చెప్పవచ్చు.  ప్రస్తుత కాలంలో పెంపకం కూడా చాలా మారిపోయింది. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. దీనివల్ల సమయం లేకపోవడంతో పాటు అనేక ఇతర సమస్యలు తల్లిదండ్రులకు  ఇబ్బందిగా మారుతున్నాయి. తమ పిల్లలకు మంచి పెంపకాన్ని అందించాలంటే డబ్బు బాగా సంపాదించాలని  తల్లిదండ్రులు  పగలు రాత్రి కష్టపడి పనిచేస్తారు.    విద్య, మంచి బట్టలు,  ఖరీదైన వస్తువులు ఇస్తారు.  అయితే, ఇవన్నీ ఉన్నప్పటికీ చాలా సార్లు పిల్లలు తమ తల్లిదండ్రుల నుండి దూరం అవుతుంటారు. పిల్లలను వారి తల్లిదండ్రుల నుండి దూరం చేసే తల్లిదండ్రుల 3 తప్పులు ఉన్నాయి.  అవేంటంటే..   రిజెక్ట్ చేయడం.. ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు తమ మాట ఏ విధంగానూ వినడం లేదని ఆందోళన చెందుతుంటారు.   ఈ కారణంగా తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య గొడవలు అవుతుంటాయి. దీనికి ప్రధాన కారణం తల్లిదండ్రులు,  పిల్లల మధ్య సరైన వాతావరణం  లేకపోవడం. తల్లిదండ్రులు తరచుగా తమ పిల్లలు చెప్పే ప్రతిదాన్ని పట్టించుకోకపోవడం లేదా పిల్లలు చెప్పిన దాన్ని వ్యతిరేకించడం, రిజెక్ట్ చేయడం చేస్తారు.దీని కారణంగా  పిల్లలు కూడా తల్లిదండ్రులతో అదే విధంగా ప్రవర్తిస్తారు.ఈ సమస్య పోవాలంటే పిల్లలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. కూర్చుని పిల్లలతో మాట్లాడాలి. సమయం.. నేటికాలం  తల్లిదండ్రులు ఇద్దరూ తమ పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వాలని  డబ్బు సంపాదనలో మునిగిపోతున్నారు.  దీని కారణంగా వారికి పని ఒత్తిడి పెరుగుతుంది.   పగలు మరియు రాత్రి పనిపై దృష్టి పెట్టడం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలకు సమయం కేటాయించలేకపోతున్నారు. దీని కారణంగా పిల్లలు ఒంటరితనం ఫీలవుతారు.  తల్లిదండ్రులు  పిల్లల మధ్య దూరం పెరగడానికి ఇదే కారణం. పోలిక..  తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చుతారు. చదువు అయినా, ఆటలు అయినా, ప్రతి చిన్న విషయానికి  పిల్లలను ఇతరులతో పోల్చడం వల్ల వారి మనస్సులలో న్యూనతా భావన ఏర్పడుతుంది. దీని కారణంగా, పిల్లలు తల్లిదండ్రులపై కోపంగా ఉండి, వారికి దూరంగా ఉండటం మొదలుపెడతారు. తమ తల్లిదండ్రులను శత్రువులుగా భావిస్తారు.                                     *రూపశ్రీ.

బద్దకం వీడండి

చింతిస్తూ కూర్చోకుండా చింత కలిగించే విషయాలను చీపురుతో చితక్కొడదాం. అయితే ఆ చింతింప జేసే విషయాలు ఏంటో చూద్దాం.  మొదటిది 1.బద్ధకం, సోమరితనం, అలసత్వం... పేర్లు వేరైనా భావం ఒక్కటే. ఇదే నన్ను, నిన్ను, సమాజాన్ని, దేశాన్ని పట్టి పీడిస్తున్న రోగం. ఇదే ఎక్కువ బాధ పెడుతున్న విషయం. జపాన్ చాలా చిన్న దేశం అయినా మనకన్నా ఏంతో ఎత్తులో ఉంది. భూకంపాలు అగ్నిపర్వతాలు సునామీలు ప్రతినిత్యం పలకరిస్తున్నా అగని పోరాటం వాళ్ళది. మనం మాత్రం పనికి రాని బిగ్ బాస్ లు, కుల్లిజోకుల జబర్దస్త్ లు చూసుకుంటూ గడిపెద్ధాం.   రెండవది 2. ప్రశ్నించే దైర్యం లేక పోవడం. పక్కవాడికి అన్యాయం జరిగితే నాకేంటి నేను నా కుటుంబం బాగుంది కదా అనే భావం మన నరనరాల్లో కూరుకు పోయింది.  మూడవది 3. ఐక్యత లేక పోవడం. ముసల్మానుల కాలం నుండి తెల్లదొరల కాలం వరకు మనలోని లోపం అదే.  నాలుగవది. 4. శుభ్రత లేకపోవడం. నదులు శుభ్రంగా ఉంచలేం(జపాన్ లోని మురికి కాలువ మన యమునా నది కన్నా 10రెట్లు స్వచ్చంగా ఉంటుంది) పరిసరాలు శుభ్రంగా ఉంచలేము. మనకెందుకు ghmc వాళ్ళు వచ్చి శుభ్రం చేస్తారుగా అంటారా? పోని వాళ్ళకి ఫిర్యాదు చేశారా?? రోడ్ల మీద ఉమ్మి , చెత్త, యూరిన్ వెయ్యకుండా ఎంతమంది ఉన్నారు? ఇక వ్యవస్థను శుభ్రంగా కూడా ఉంచలెం. ఏ నాయకుడు నిజం నవాబులా వ్యవహరిస్తున్నాడో అతనికే మళ్లీ పట్టం కడతాం. ఎవడైతే కోట్ల రూపాయల అవినీతి చేస్తాడో అతన్ని నాయకుడిని చేస్తాం. విద్య, వైద్య, వివాహ... ఇలా ఎన్నో వ్యవస్థలను భ్రష్టు పట్టించాం  5. కుల మత వర్గ వర్ణ వివక్ష... ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇన్ని కులాలు, వర్ణాలు ఉండవు. మనం అంతా మనుషులమే అని మరిచి మనలో మనం కొట్టుకుచస్తా ఉంటాం. అరే వాడు మన కులపొడురా వాడికే మన ఓటు అంటాం గాని, మన బతుకులు బాగు చేసే వాడురా వాడికి ఓటు వేద్దాం అని చాలా మంది ఆలోచించం.  వీటన్నింటిలో ముఖ్యంగా ఆలోచించాల్సింది సోమరితనం గురించి. సోమరితనం రాచపుండు అని గాంధీజీ అన్నట్టు, సోమరి పోతు దేశానికే భారం.  మన భారత దేశంలో మనమే మన జాతీయ సంపద. ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన రెండవ అతిపెద్ద దేశం. అయినా ఇంకా వెనుక బడిన దేశం. ఉద్యోగాలు లేవు లేవు అని గగ్గోలు పెడతాం, కానీ ఆలోచిస్తే ఎన్ని ఉపాధి అవకాశాలు కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెట్టీ , టీవీలు కంప్యూటర్లు సినిమాలు చూస్తూ మన విలువైన జీవితాన్ని ఏం సాధించకుండా సమాధి కట్టెద్ధాం. ఏముందీ..పుట్టాం..పెరిగాం...చదివాం...ఏదో బొడి ఉద్యోగం తెచ్చుకున్నాం, పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాం, వాళ్ళ బాగోగులు చూసాం, వాళ్ళ పెళ్లి చేశాం..ముసలి అయ్యం..ఇంకేం ఉంది...కృష్ణా రామా అనుకుంటూ గడిపెద్ధాం...ఇంతేనా చరిత్రలో మనకో పేజీ ఉందొడ్డూ??  KFC owner 60 ఏళ్ల వయసులో KFC స్థాపించారు. అది చదవడం వరకే అలాంటివి చెయ్యడానికి మనం పునుకోము . ఒక లక్ష్యం నిర్దేశించుకుని ముందడుగు వెయ్యము. అంతేగా ఈ జీవితం ◆వెంకటేష్ పువ్వాడ

అమ్మాయిలు తప్పనిసరిగా చెయ్యాల్సిన పని!

  ఈ కాలంలో అమ్మాయిలు ఎంచక్కా చదువుకుంటున్నారు. చక్కగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఒక నిర్ణీత వయసు రాగానే పెళ్లి అనేది సాధారణ విషయం. అయితే పెళ్లికి ముందు పుట్టింట్లో నాన్న దగ్గర గారాలు పోయి, అమ్మ దగ్గర బుజ్జగింపులు చేసి, అవ్వతాతల దగ్గర డిమాండ్ చేసి ఇలా అందరి దగ్గరా హాయిగా డబ్బు తీసుకుని అవసరాలు తీర్చేసుకుంటారు. కానీ పెళ్లి అయ్యాక అసలు సీన్ అన్నట్టు ఎంత కట్టుకున్నవాడు అయినా భర్త దగ్గర చెయ్యి చాపలేరు కొంతమంది అమ్మాయిలు. ఒకవేళ స్వేచ్ఛగా అడిగి తీసుకున్నా ఒకసారి కాకపోతే ఒకసారి అయినా మొగుళ్ల దగ్గర, అత్త మామల  దగ్గర ఏదో ఒక సంఘటనలు జరుగుతుంటాయి. ఫలితంగా ఒకానొక గిల్టీ ఫీలింగ్, ఇంకా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేవి ఎంతో మంది అమ్మాయిల జీవితాలలో ఉంటాయి. అయితే అలా కాకుండా అమ్మాయిలు ఎవరి దగ్గర చెయ్యి చాపకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి అంటే దానికి పరిష్కారం అమ్మాయిలు తమకు తాము ఆర్థిక భరోసా ఇచ్చుకోవాలి. విద్యార్హత, ఉద్యోగం! ఇంజనీర్లు, సాఫ్ట్ వేర్ లు, బ్యాంకింగ్, పీజీ లు పిహెచ్డి లు ఇవి ఇవే పెద్ద ఉద్యోగాలని, వీటి ద్వారా ఆర్థిక భరోసా సాధ్యమని అనుకునేవాళ్ళు నిజంగా అమాయకులు అనుకోవాలి.  పదవ తరగతి నుండి డిగ్రీ వరకు కనీస స్థాయి విద్య చదివిన వాళ్ళు చాలా మందే ఉన్నారు ఈ సమాజంలో. అయితే వాళ్ళందరూ ఈ పోటీ ప్రపంచంలో ఈ విద్యార్హత పెద్దది కాదులే అనుకోవడమే పెద్ద వైఫల్యం. పడవ తరగతి మొదలు డిగ్రీ వరకు ఎన్నో అవకాశాలు ఉంటూనే ఉంటాయి. చెయ్యాల్సిందల్లా ప్రయత్నమే.  ప్రతి మనిషిలోనూ ఏదో ఒక విషయంలో ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తిని ఫాలో అవుతూ దాన్ని పదును పెట్టుకుంటూ అందులో నైపుణ్యం సంపాదిస్తే అందులోనే పైసలు సంపాదించొచ్చు. ఇంటి దగ్గర ట్యూషన్లు చెప్పడం నుండి దగ్గరలోనే ఉన్న షాప్స్, ఆఫీస్ లు, షాపింగ్ మాల్స్, జ్యువెలరీ షోరూమ్స్ వంటి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అలాంటి చోట్ల పని చేసేవాళ్ళు సరైన వ్యక్తిత్వం కలిగి ఉండరు, తప్పు దారిలో వెళ్తారు లాంటి పిచ్చి ఆలోచనల వల్ల అమ్మాయిలు ధైర్యం చేయడం లేదు. సరైన వాక్చాతుర్యం, ఉన్నంతలో శుభ్రంగా ఉండటం, కాసింత ఓపిక ఉంటే మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. ఏమీ చేయకుండా ఉండటం కంటే ఏదో ఒకటి అయినా చేయడం ఉత్తమం కదా!! ఈ ఉద్యోగాలలో వచ్చే సంపాదనలో కనీసం 40-50% డబ్బును అమ్మాయిలు జాగ్రత్త చేసుకోగలిగితే గొప్ప ఆర్థిక భరోసా ఉంటుంది. జీవితంలో ధైర్యం దానికదే వస్తుంది. విభిన్న మార్గాలు! చదువుతో సంబంధం లేని మార్గాలు కూడా బోలెడు ఉన్నాయి. మొబైల్, కెమెరా గురించి కాస్త అవగాహన పెంచుకుంటే వంటిట్లో వండర్స్ చేసే మహిళలు యూట్యూబ్ లో అదరగొట్టేస్తారు. కిచెన్ చానల్స్ ను స్టార్ట్ చేసి దిగ్విజయంగా నడుపుతూ లక్షలు సంపాదిస్తున్న మహిళలే నిదర్శనం మరి. వాళ్లలో ఉన్నది మనలో లేనిది ఏంటి అని క్వశ్చన్ చేసుకుంటే మనలో లేనిది అవగాహన మాత్రమే అనే విషయం ఒప్పుకుని తీరాలి. కొందరు కారణాలు వెతికి చూపిస్తారు. కానీ నిజానికి ఉన్నదాంట్లో విభిన్నంగా చూపించడంలో సహజమైన ప్రతిభ ఉంటుంది.  పొదుపు భరోసా! సంపాదించుకునే దాంట్లో 40-50% పొదుపు సాధ్యమా అనే అనుమానం అందరికీ వస్తుంది. కానీ ఆలోచిస్తే నిజమే సాధ్యమే అనే విషయాన్ని నమ్మాలి. ఎందుకంటే ప్రతి ఇంట్లో మగవాళ్ళు ఊరికే బలాదూర్ గా ఏమి ఉండరు. వారి సంపాదన వాళ్లకు వుంటుంది. ఇంకా చెప్పాలంటే పెళ్లి కాని అమ్మాయిలలో సంపాదించిన డబ్బు మొత్తం ఇంట్లో ఇవ్వమని ఫోర్స్ చేసేవాళ్ళు చాలా తక్కువే. చాలా దిగువ తరగతి కుటుంబాలలో కూడా ఈ పరిణామాలు తక్కువే ఉంటాయి. కాబట్టి కనీసం 20% అయినా పొదుపు వైపు మళ్లించడం మంచిది. ఒకవేళ అలా అవ్వదు అనే అనుమానం వస్తే సింపుల్ గా వచ్చే సాలరీ ని తగ్గించి చెబితే సరోపోతుంది. ఇది మోసం అని అనుకునే కంటే భవిష్యత్తు గురించి జాగ్రత్త అనుకోవడం మంచిది. పొదుపు చేస్తున్నట్టు చెప్పినా ఎప్పుడూ ఆ పొదుపు గురించి డిస్కస్ చేయడం చాలా మంది అలవాటు కాబట్టి ఆ పొదుపును కూడా కాసింత రహాస్యంగానే చేసుకోండి తప్పు లేదు.  ప్రస్తుత కాలంలో కొందరు మగవాళ్ళు నాకు మంచి ఉద్యోగం ఉంది, అమ్మాయి బాగా చదువుకున్నా ఉద్యోగం చెయ్యక్కర్లేదు ఇంట్లోనే ఉంటే బెస్టు, ఇంటిని, పిల్లల్ని చూసుకుంటేనే నాకు ఇష్టం అంటూ ఉంటారు. నిజానికి పెళ్లి అయిన తరువాత కూడా పిల్లలు పుట్టిన తరువాతే చాలా ఆర్థిక భారాలు పెరుగుతాయి.  అన్నిటినీ భర్త, అత్త మామలు ఇచ్చే డబ్బుతోనే మైంటైన్ చెయ్యలేరు హౌస్ వైఫ్స్. కాబట్టి పెళ్లికి ముందు ఆర్థిక భరోసా, పెళ్లి తరువాత విభిన్న మార్గాల సంపాదన ఎంతో ముఖ్యం.                                  ◆వెంకటేష్ పువ్వాడ.