Read more!

ఒంటరితనం బాధిస్తోందా?? మీకోసమే ఇది!

ఎన్నో నిద్రలేని రాత్రులు  ఒంటరిగా పక్కమీద కూర్చుని అనంతార్థాల విశ్వాన్ని అర్ధరహితంగా గమనిస్తున్నప్పుడు చాలామందికి తోడుగా ఎవరుంటారో తెలుసా??.... ఒంటరి తనమే.. భయంకరమైన ఒంటరితనం వెంటగా ఉంటుంది. అయితే చాలామందికి ఒంటరిగా ఉండటానికి, ఒంటరి తనానికి మధ్య ఉన్న సన్నని గీత కనబడదు. చుట్టూ ఎవరూ లేకుండా ఒంటరిగా ఉంటే అది భౌతికంగా ఒంటరిగా ఉండటం. కానీ చుట్టూ ఎవరున్నా లేకపోయినా మనసులో ఒక అంధకారం ఉంటే అది మానసికంగా మనిషిని నిలువనీయని ఒంటరితనం అవుతుంది.


ఒంటరి తనానికి, ఒంటరిగా ఉండటానికి తేడా ఉంటుంది.  అయితే   ఒంటరి తనమే మనిషిని ఒంటరిగా వుండేటట్లు చేస్తుంది. ఒంటరిగా ఉండటం యాదృచ్ఛికం కావచ్చు. కానీ అది తాత్కాలికమైనది, లేదా స్వయంకృతం.  కానీ ఎలా చూసినా ఒంటరి తనం మాత్రం శాపం.  అది శాశ్వతంగా అంటి పెట్టుకొనుండేది. ఇదే ఒంటరి తనంతో బాధపడే ఒక వ్యక్తి ఆవేదన,


మన జీవితాలలో రెండు విషయాలెప్పుడూ మనని వెంటాడుతుంటాయి. అవి, ప్రేమ-ఒంటరి తనం. ప్రేమ బలమైనది. శక్తివంతమైనది. కానీ, అదెప్పుడు శిఖరాగ్రాలలోనే ఉండదు. కాబట్టి, ప్రేను క్షీణించినప్పుడల్లా ఒంటరితనం విజృంభిస్తుంది.


ఈ ఒంటరితనాన్ని ప్రతి మనిషి తన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అనుభవించి తీరతాడు అయితే ప్రధానంగా బడిలో చదువుకునే పిల్లలు, కాలేజీ విద్యార్థులు, గృహిణిలు, విడాకులు తీసుకున్న దంపతులు దీని బారిన అధికంగా పడుతుంటారు.


మనిషి మీద ఒత్తిడి అధికమవుతున్న కొద్దీ ఈ ఒంటరి తనం అధికమవుతుంది. శిశువుకి తల్లితో సాన్నిహిత్యం లేకపోతే ఒంటరితనం ప్రాప్తిస్తుంది. పిల్లలకి ఆటపాటల్లో తల్లిదండ్రుల సహచర్యం లేకపోయినా లేదా వాళ్ళతో మాట్లాడేవారే కరువయినా గానీ వారు ఒంటరితనానికి లోనవుతారు. స్కూల్లోగానీ, ఆటల్లోగానీ తన స్నేహితులచే తిరస్కరింపబడేవాడు. భయంకరమైన ఒంటరితనానికి లోనవుతాడు.


ఒంటరి తనానికి కారణాలు అనేకం. మనిషి సహజ పద్ధతివల్ల అయితేనేమి, బుద్ధికౌశల్యం లోపించడం వల్ల అయితేనేమి, పేదరికంవల్ల అయితేనేమీ, తప్పు చేసినందుపల్లె గానీ లేదా వైఫల్యాల వల్ల అయితేనేమి ఒంటరితనం అలవడుతుంది. ఆకర్షణీయంగా లేవనే భావన, అంగవైకల్యాలు ఒంటరి తనాన్ని అధికం చేస్తాయి.


ఒక్కోసారి అస్వస్థతవల్ల కూడా ఒంటరితనం ఏర్పడవచ్చు.. అయితే, తమలోని ఒంటరితనపు భావనే తమ అస్వస్థతకు అసలైన కారణమని చాలామంది గ్రహించరు. ఒక్కోసారి మనం నివసిస్తున్న పరిసరాలు కూడా మనని ఒంటరితనానికి లోనుచేస్తాయి. ఆందోళనలు, వాతావరణ కాలుష్యం, రణగొణ ధ్వనులతో నిండిపోయిన పట్నవాసం, నైతిక విలువలు లోపించిన కుటుంబ సభ్యుల ప్రవర్తన, ప్రేమ రాహిత్యం, గుర్తింపులేని గానుగెద్దు జీవితం ఇవన్నీ మానసికంగా మనని కృంగదీసి మనని ఒంటరి వాళ్ళని చేయవచ్చు.


ఒంటరి తనానికి కారణాలేమైనా కానివ్వండి దానివలన ఏర్పడే ఫలితాలు మాత్రం చాలా బాధాకరమైనవి.


ఒంటరి తనమనేది పూర్తిగా మానసికమైనది. కాబట్టి, అన్నిటి కన్నా ముందు మానసికంగా ఒంటరితనాన్ని ఎదుర్కోడానికి సన్నద్ధులు కావాలి. నలుగురు మధ్య గడిపినంత మాత్రాన ఒంటరితనం పారిపోదు. ఒంటరితనం వేరు. ఒంటరిగా ఉండటం వేరు. 


ఒంటరితనం కన్నా ఆందోళన చెందటమే నయం ఆందోళనకన్నా మనం ఈర్ష్యపడే వ్యక్తితో స్నేహామే నయం అన్నాడో ప్రఖ్యాత రచయిత కాబట్టి మన మనస్సు క్లిష్టమైన వ్యక్తితో సంపూర్ణంగా "స్నేహం చెయ్యాలి ఒక్కోసారి కొన్ని రకాల వ్యక్తుల సమక్షంలో మనం ఒంటరితనాన్ని పూర్తిగా మర్చిపోగలుగుతాం. అటువంటి వ్యక్తుల మనస్తత్వాన్ని గ్రహించి మీరు వ్యక్తిత్వాన్ని  అలాగే మలుచుకోడానికి ప్రయత్నించవచ్చు..


మనసులోని కల్మషాన్ని, ఈర్ష్యాద్వేషాల్ని, ద్వంద ప్రవృత్తుల్ని తగ్గించుకోగలిగిననాడు ఒంటరితనం దానంతట అదే నిష్క్రమిస్తుంది. బ్రతుకు శాపం గావచ్చు. కానీ ఆహ్లాదమైన స్నేహం వరం. దాన్ని తాము అనుభవిస్తూ..  ఇతరులకు పంచితే.. అదే ఒంటరితనాన్ని తరిమి కొట్టడానికి తిరుగులేని సాధనం అవుతుంది.

                                             ◆నిశ్శబ్ద.