రెడ్ జోన్ ప్రాంతాల్లో లాక్‌డౌన్ మినహాయింపులు వర్తించవు: నీలం సాహ్నీ

* మే 3 వరకూ యధావిధిగా లాక్‌డౌన్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాల్సిందే * వీసీలో జిల్లా కలెక్టర్లు ఎస్పీలు, పోలీస్ కమీషనర్లతో ఏపి సీఎస్ నీలం సాహ్ని గ్రామీణ ప్రాంతాల్లోని గ్రీన్ జోన్ మండలాల్లో ఏఏ పరిశ్రమలను తెరిచి స్థానిక కూలీలకు ఉపాధి కల్పించాలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిఎండిఐసి,ఎసిల్ తదిదర అధికారులతో కూడిన జిల్లా స్థాయి నిర్ణయించి ఆ ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై శనివారం విజయవాడ ఆర్ అండ్ బి కార్యాలయం నుండి డిజిపితో కలిసి జిల్లా కలెక్టర్లు ఎస్పీలు, పోలీస్ కమీషనర్లతో ఆమె వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రెడ్ జోన్ మండలాలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఏవిధమైన లాక్ డౌన్ మినహాయింపులు వర్తించవని మే 3 వరకూ యధావిధిగా లాక్ డౌన్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని గ్రీన్ జోన్ మండలాల్లో మాత్రమే లాక్ డౌన్ నుండి కొన్ని మినహాయింపులు ఇచ్చి ఆయా మండలాల పరిధిలో ఉన్న కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉందని ఆదిశగా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. కావున ఆయా మండలాల్లో ఏ పరిశ్రమలను తెరవాలో జిల్లా స్థాయి కమిటీ నిర్ణయించి ఆయా మండలాల్లో 20నుండి పరిమిత స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సిఎస్ నీలం సాహ్ని కలెక్టర్లను ఆదేశించారు.మండల స్థాయి లో తహసిల్దార్,ఎంపిడిఓ, వ్యవసాయ అధికారి, ఎస్ఐ, పరిశ్రమలు, కార్మిక శాఖల అధికారులు స్థానిక ప్రజలు సామాజిక దూరాన్ని పాటిస్తూ పనులు చేసుకునేలా చూడాలని చెప్పారు.లాక్ డౌన్ నుండి మినహాయింపులు చోట్ల వ్యవసాయ,ఉపాధి పనులు, స్థానిక పరిశ్రమల్లోను, పంచాయతీ, ఆర్అండ్బి తదితర పనులుపై పరిశీలనకు గ్రామ స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. పనులు నిర్వహించుకునే చోట్ల ప్రతి ఒక్కరూ ఆరు అడుగుల సామాజిక దూరాన్ని  పాటించాలని, శానిటైజర్స్‌తో ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు.రెడ్ జోన్లు, కంటొన్మెంట్ ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని సిఎస్ నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లు ఎస్పీలు ఆదేశించారు.  ఏపి డీజీపీ గౌతం సవాంగ్ మాట్లాడుతూ లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేయడంలో జిల్లా కలెక్టర్లతో కలిసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈనెల 20నుండి గ్రామీణ ప్రాంతాల్లో గ్రీన్ జోన్ మండలాల్లో లాక్ డౌన్ నుండి మినహాయింపులు ఇచ్చే చోట్ల తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. వైద్య ఆరోగ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ కొవిద్-19 కు సంబంధించి నంబరు 28లో ఇచ్చిన ఆదేశాలను తుచః తప్పక పాటించాల‌ని కలెక్టర్లను ఆదేశించారు.

వాళ్ళది కాలకేయ సైన్యం.. మనదేమో కాలక్షేప కూటమి... 

* అధినేత తీరుపై టీ డీ పీ అభిమానుల ఆవేదన  * కాన్ఫరెన్సులు  పక్కనపెట్టి, కార్యకర్తలను పట్టించుకోండి  * ఓడిపోయి ఏడాది దాటినా, లెసన్స్ నేర్చుకోకపోతే ఎలా అంటూ క్లాస్  * వారం ముందు టముకేస్తే, ఎంత మంది హంగామా బాబులు ఆ కాల్ లోకి వచ్చారో... "ఓడిపోయి ఏడాది అయినా ఇంకా గుణపాఠాలు నేర్చుకోకపోతే ఎలా సామీ....ముందు కార్యకర్తలతో మాట్లాడి ఆ తర్వాత జనంతో మాట్లాడుకుంటే సరిపోయిద్ధి గానీ అధికారం పోయాక కూడా ఇంకా #TeluguDiaspora అని మమ్మల్ని కూడా గుంపులో గోవిందయ్యల్ని చేయమని సలహా ఇచ్చిన ఆ సన్నాసుల్ని పడేసి తంతేగానీ తెలుగుదేశం పార్టీకి మంచిరోజులు రావు...వారం ముందునుంచే Zoom Call Zoom Call అని టముకు వేసుకుంటే ఎంతమంది ఫెక్ గాళ్ళు ఆ కాల్ లో కొచ్చారో..." ఇది ఒక తెలుగుదేశం అభిమాని పేస్ బుక్ ఆవేదన.  చంద్రబాబు నాయుడు ఇంకా ఆ భ్రమల్లోనే ఉన్నారా... మందీ మార్బలం చుట్టూ ఉంటె చాలన్నట్టుందా ఆయనకు... టీ డీ పీ అభిమానులను ఇది ప్రస్తుతం వేధిస్తున్న ప్రశ్న.... ఈ రోజు -విదేశాల్లో ఉన్న తెలుగు వారితో టీడీపీ అధినేత చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనా అంశంపై వారితో చర్చించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో 1,000 మంది ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. అమెరికా, సింగపూర్, మలేషియా, దుబాయ్, లండన్, కెనడా నుంచి పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలు, ఆయా దేశాల్లో తెలుగువారి యోగక్షేమాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. విదేశాల్లో ఉన్న తెలుగువారందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏపీలోని పరిస్థితిని కూడా చంద్రబాబు వారికి వివరించారు. సరిగ్గా ఆ వీడియో కాన్ఫరెన్స్ గురించే తెలుగుదేశం అభిమాని అంతరంగాన్ని పేస్ బుక్ లో వ్యక్తం చేశారు. అలాగే, ఇటీవలే డిజిటల్ కార్పొరేషన్ పదవి పొందిన చిన్నా వాసుదేవ రెడ్డి 2014 లో టీ డీ పీ లోనే ఉన్నాడని ఆ అభిమాని గుర్తు చేశాడు.  "వాసుదేవ రెడ్డి కి పదవి వచ్చిందని ఏడ్చే టీ డీ పీ కార్యకర్తల్లో ఎంతమందికి తెలుసు 2014లో మన కూటమిలో వున్నాడు తాను & రాజంపేట ఎం.పి.  అభ్యర్థిగా చివరి నిముషం వరకు రేసులో ఉన్నాడని... మన కోసం పనిచేసిన ఎందరినో మనం అధికారంలో వున్నప్పుడు లెక్క చేయలేదు..అందులో కొందరు తెలివిగా క్యాంప్ మారి వారి తెలివితేటలతో స్ట్రాటజీలు రచించి వాళ్ళ గెలుపులో కీలకం అయ్యాడు కాబట్టి పదవి ఇచ్చాడు....#2019 ఎన్నికల సమయంలో మన కాంపౌండ్లో ఎంతమంది వాళ్ల విషపురోగులు కూర్చోవడం తో , మన నాయకుడిని ఎవరెవరు ఎపుడెప్పడూ కలిసేది కూడా వాళ్ళకి తెలిసిపోయేది..మనమేమో భజనలో కళ్లు మూసుకున్నాం..వాళ్లేమో వాళ్ళ కోసం తగలబెట్టేదానికి అయినా,  తమని తాము తగలబెట్టుకునేదానికి అయినా సిద్ధపడే #కాలకేయసైన్యం ని తయారు జేసుకున్నారు." అంటూ ఆ అభిమాని తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకత్వం తీరు తెన్నులపై బహు చక్కని విశ్లేషణ అందించారు. ఇంతకీ, ఆయన చెప్పొచ్చేది ఏంటంటే, తెలుగుదేశం ఆత్మ శోధన, అంతఃశోధన చేసుకోవాల్సిన సమయాన్ని ఇలా diaspora ల పేరిట వెచ్చిస్తే, సామాన్య కార్యకర్తలను ఇంకెప్పుడు పట్టించుకుంటారని!!

రెడ్ జోన్లలో మూడు నెలల పాటు ఇంటి అద్దె అడిగితే చర్యలు

గుంటూరు  జీజీహెచ్ ఆస్పత్రిని కోవిడ్ ఆస్పత్రిగా మారుస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ప్రకటించారు. జిల్లాలో 126 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. 18 ట్రూ నాట్ మిషన్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నామని, 1,500 పరీక్షలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు. 15 కేసులుంటేనే రెడ్ జోన్ గా ప్రకటిస్తామని, 4 కేసులుంటే క్లస్టర్ జోన్ గా ప్రకటిస్తామని, మూడు నెలలపాటు రెడ్ జోన్లలో ఎవరైనా ఇంటి అద్దె అడగరాదనీ, ఎవరైనా యజమానులు అద్దె అడిగితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. కంటైన్మెంట్ జోన్లలో ముందుగా రూ.1,000 ఆర్థికసాయం అందచేస్తామని, ఇవాళ 220 మందిని క్వారంటైన్ కేంద్రాల నుంచి డిశ్ఛార్జి చేశామని కలెక్టర్ చెప్పారు. కర్ణాటక హుబ్లీలో యజమాని ముందుకు వచ్చి హోటల్ స్వచ్ఛందంగా అప్పగించారని, మిగతా అందరికీ ఇది స్ఫూర్తిదాయకం కావాలని కలెక్టర్ సూచించారు.

చైనా ఆర్ధిక నైచ్యంపై కొరడా ఝుళిపించిన భారత్ 

* ఎఫ్ డి ఐ పాలసీకి వాణిజ్య మంత్రిత్వ శాఖ సవరణ  * చుట్టుపక్కల దేశాలు మన దేశంలో పెట్టుబడులు పెట్టాలంటే, కొత్త నిబంధనలు వర్తిస్తాయి  అంతా అనుకున్నట్టే జరుగుతోందని సంబరపడుతున్న చైనా కు -ఈ రోజు గట్టి ఎదురు దెబ్బే తగిలింది.. భారత్ లో ఆర్ధిక దురాక్రమణకు పాల్పడే కుట్రలో భాగంగా, ఇటీవల పీపుల్స్ బ్యాంక్ అఫ్ చైనా , మన హెచ్ డి ఎఫ్ సి లో పెట్టుబడులు పెంచుకున్న విషయంపై భారత్ గట్టిగా స్పందించింది. కరోనా వైరస్ వల్ల నెలకొన్ని ప్రతికూల పరిస్థితుల్లో విదేశీ సంస్థలు మన కంపెనీల్లో నేరుగా ఇన్వెస్ట్ చేయడాన్ని నియంత్రించేందుకు కేంద్రం ఎఫ్‌డీఐ పాలసీని సవరించింది.  దీంతో భారత్‌తో సరిహద్దులు పంచుకునే దేశాల్లోని కంపెనీలు మన సంస్థల్లో ఇన్వెస్ట్ చేయాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే. ఆటోమేటిక్ మార్గంలో దేశంలో పెట్టుబడులు పెట్టడానికి వీలు లేదు. వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా ఈ విషయాలు వెల్లడించింది. దీనికి సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పాలసీకి సవరణలు చేసింది. భారత్‌తో సరిహద్దులు కలిగిన దేశాలకు  ఈ నిబంధన వర్తిస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ లక్ష్మణ రేఖ గీసింది.  ఇప్పటికే శ్రీలంక, పాకిస్తాన్ లకు అప్పులిచ్చి, ఆ దేశాలను తన గుప్పిట్లో పెట్టుకున్న చైనా, కమ్యూనిజం నుంచి ఇంపీరియలిజం వైపు ప్రయాణిస్తూ  భారత ఆర్ధిక వ్యవస్థను ప్రభావితం చేసే దిశగా ఇటీవలే పీపుల్స్ బ్యాంక్ అఫ్ చైనా ను మన మీదకు ఉసి గొల్పిన విష్యం తెలిసిందే.  పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా కీలక ముందడుగు వేసింది. హెచ్ డీఎఫ్ సీ లిమిటెడ్ లో 1.75 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. మార్చి త్రైమాసికంలో ఈ కొనుగోలు ప్రక్రియ జరిగినట్టు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో హెచ్ డీఎఫ్ సీ లిమిటెడ్ షేర్ల విలువ క్రమంగా పతనమవుతోంది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఇప్పటివరకు 41 శాతం క్షీణత చవిచూసింది. అంతకుముందు జనవరి 14న 52 వారాల గరిష్ట పతనంతో హెచ్ డీఎఫ్ సీ షేర్ రూ.2,499.65 వద్ద ట్రేడయింది. ఏప్రిల్ 10 నాటికి హెచ్ డీఎఫ్ సీ షేర్ వాల్యూ రూ.1,710కి పడిపోయింది. అదే సమయంలో భారత సూచీల్లో సెన్సెక్స్ 25 శాతం నష్టపోగా, నిఫ్టీ 26 శాతం నష్టాలు చవిచూసింది. హెచ్ డీఎఫ్ సీ లిమిటెడ్ లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) కూడా వాటాదారు కాగా, డిసెంబరు త్రైమాసికంలో తన వాటాను 4.21 శాతం నుంచి 4.67 శాతానికి పెంచుకుంది. ఇక, తాజా లావాదేవీపై హెచ్ డీఎఫ్ సీ లిమిటెడ్ వైస్ చైర్మన్, సీఈఓ కెకీ మిస్త్రీ మాట్లాడుతూ, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనాకు తమ కంపెనీలో 2019 మార్చి నాటికే 0.8 శాతం వాటాలున్నాయని వెల్లడించారు. ఇప్పుడా వాటాలు ఒక్క శాతాన్ని దాటాయని, ప్రస్తుతానికి హెచ్ డీఎఫ్ సీ లిమిటెడ్ లో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వాటా 1.1 శాతం అని వివరించారు. గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే చైనా ప్రపంచ ప్రధాన ఆర్థిక సంస్థల్లో భారీగా వాటాలు దక్కించుకుంటోంది. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా కొనుగోళ్ల ప్రక్రియ సాగిస్తున్న చైనా ఇతర ఆసియా దేశాల్లో తన పెట్టుబడులను గణనీయంగా పెంచుకుంటోంది. ముఖ్యంగా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగంలోనూ, టెక్నాలజీ రంగంలోనూ భారీగా పెట్టుబడులు పెడుతోంది. అయితే, భారత్ తాజా నిబంధనలతో, పీపుల్స్ బ్యాంక్ అఫ్ చైనా తాజా గా హెచ్ డి ఎఫ్ సి లో పెట్టిన పెట్టుబడులు ఉపసంహరించుకొవలసి రావచ్చు. పాత ఎఫ్‌డీఐ పాలసీ ప్రకారం భారత్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ కంపెనీలకు మాత్రమే ప్రభుత్వం అనుమతి అవసరం అయ్యేంది. సవరించిన ఎఫ్‌డీఐ పాలసీతో చైనాకు కూడా ఈ రూల్ వర్తిస్తుంది.  హె‌చ్‌డీఎఫ్‌సీలో ఇటీవలో చైనా బ్యాంక్ 1.01 శాతం కొనుగోలు డీల్‌కు కొత్త రూల్స్ వర్తించవని వాణిజ్య వర్గాలు పేర్కొంటున్నప్పటికీ, ఆ సవరణ దిశగా భారత్ ముందడుగు వేసే అవకాశాలున్నాయి.

23 రాష్ట్రాలకు విస్తరించిన తబ్లీగి జమాత్ కేసులు

దేశవ్యాప్తంగా 14,378 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా,480 మంది మృతి చెందారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. గడచిన 24 గంటల్లో 991 కొత్త కేసులు నమోదు అయ్యాయని, 43 మంది మృతి చెందారని అయన చెప్పారు.  దేశంలో కరోనా నుంచి ఇప్పటి వరకు 1992 మంది కోలులున్నారని ఆయన పేర్కొన్నారు. 14,378 పాజిటివ్ కేసులలో 4,291 కేసులు29.8 శాతం తబ్లిఘి జమాత్ వల్ల నమోదయ్యాయని ఆయన చెప్పారు.  23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తబ్లిఘి జమాత్ తాలూకు కేసులు నమోదయ్యాయని లవ్ అగర్వాల్ వివరించారు. తమిళనాడులో 84 శాతం కేసులు,ఢిల్లీలో 63శాతం కేసులు,తెలంగాణాలో 79 శాతం కేసులు,ఉత్తరప్రదేశ్ లో 59 శాతం కేసులు,ఏపీలో 61 శాతం కేసులు శాతం తబ్లిఘి జమాత్ వల్ల నమోదయ్యాయన్న ఆయన పేర్కొన్నారు. 67 జిల్లాల నుండి 14 రోజులుగా కొత్త కరోనా కేసులు నమోదుకాలేదు. 23 రాష్ట్రాల్లోని 47 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి RT-PCR పరీక్ష అనేది COVID-19 నిర్ధారణకు ప్రామాణిక ఫ్రంట్‌లైన్ పరీక్ష,కరోనా నిఘా కోసం ఉపయోగించాల్సిన వేగవంతమైన యాంటీబాడీ పరీక్షఅని కూడా లవ్ అగర్వాల్ చెప్పారు. మన దేశంలో మరణాల రేటు సుమారు 3.3 శాతం ఉందన్నారు. 0-45 సంవత్సరాల మధ్య 14.4% మరణాలు, 45-60 సంవత్సరాల మధ్య 10.3% మరణాలు, 60-75 సంవత్సరాల మధ్య 33.1% మరణాలు, 75 సంవత్సరాలు ఆపైన 42.2% మరణాలు నమోదు అయ్యాయని ఆయన వివరించారు. సామాజిక దూరం అమలులో రాష్ట్రాలు బాధ్యత వహించాలని, హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లోని ప్రజలకు ఎక్కువ సంఖ్యలో ర్యాపిడ్‌ టెస్టులు  చేయాలని లవ్ అగర్వాల్ విజ్ఞప్తి చేశారు.

రాసుకో సాంబా.. ఆ ఐఏఎస్ చెపితే, సి.ఎం జగన్ ఎస్ అన్నట్టే...

* కొరివితో తల గోక్కోవటమంటే ఆ ఐ ఏ ఎస్ కు మహా సరదా ! * ఇప్పుడు సౌత్ కొరియా మోడల్ అంటూ, సి.ఎం. ముందు నాద స్వరం ....  * విభేదించిన సీనియర్ ఐ ఏ ఎస్ లు...  * చీఫ్ సెక్రెటరీ నీలం సాహ్నీ 'మౌన రాగం'  రాసుకో సాంబా... ఏపీ సర్కారు స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి కొత్తగా షెడ్యూల్ విడుదల చేయబోతోంది.. ఇహ మనకి చేతి నిండా పనే... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన శనివారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ అంశంపై విస్తారం గా చర్చలు నడిచినట్టు సమాచారం.. కరోనా ఉద్ధృతి మధ్య, దక్షిణ కొరియా జాతీయ అసెంబ్లీలోని 300 సీట్లకు ఎన్నికలు పూర్తి చేసుకుందనే విషయాన్ని సీఎంవో అధికారులు జగన్మోహన్ రెడ్డికి తీసుకెళ్ళినట్లు ఆంగ్ల పత్రిక పరచురించిన కథనాన్ని ఈ సమావేశంలో ఒక ఔత్సాహిక ఐ ఏ ఎస్ అధికారి ప్రస్తావించినట్టు, దానిపైన సుదీర్ఘంగా చర్చజరిగినట్టు, అయితే, ఒకరిద్దరు సీనియర్ ఐ ఏ ఎస్ అధికారులు మాత్రం ఈ సమయం లో స్థానిక ఎన్నికలకు వెళ్లడం అంత అభిలషణీయమైన నిర్ణయం కాదన్నట్టూ-అభిజ్ఞ వర్గాల భోగట్టా. అయితే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మదిని అమితంగా ఆకట్టుకున్న ఆ ఐ ఏ ఎస్ మాత్రం, శాయశక్తులా ఆ సౌత్ కొరియా విత్తనాన్ని ఆయన మెదడులో బలంగా నాటడం వల్ల, అతి త్వరలోనే స్థానిక ఎన్నికల కొత్త షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ప్రస్ఫుటం గా కనిస్పిస్తున్నాయి. ఈ విషయం లో చీఫ్ సెక్రెటరీ నీలం సాహ్నీ మాత్రం పెదవి విప్పలేదని, కరోనా కట్టడి మాత్రమే ప్రభుత్వ ప్రాధాన్యంగా ప్రస్తుతానికి ఉండాలని ఆమె సూచించినట్టు, అందుకు ఇద్దరు రిటైర్డు ఐ ఏ ఎస్ లు మద్దతు తెలిపినట్టు వెలగపూడి సమాచారం.  మూడు రాజధానుల ప్రతిపాదనను బలంగా ఏడ్వొకేట్ చేసిన ఆ ఔత్సాహిక ఐ ఏ ఎస్ అధికారి తీసుకున్న పలు వివాదాస్పద నిర్ణయాల వల్ల , తర్వాత ప్రభుత్వం పలు సందర్భాల్లో హై కోర్టు నుంచి అక్షింతలు వేయించుకునే పరిస్థితి ఏర్పడిందని సచివాలయం వర్గాలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నాయి. కరోనా కారణంగా ఒక పక్క ముఖ్యమంత్రి నివాసం సైతం బఫర్ జోన్ నుంచి రెడ్ జోన్ లోకి వెళ్లిన విషయాన్ని ఉటంకిస్తున్న సీనియర్ ఐ ఏ ఎస్ లు మాత్రం -స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విషయం లో దూకుడు పనికి రాదనే అభియోరాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.  కొత్త ఎస్ఈసీగా నియమితులైన కనగరాజు నియామకంపై హైకోర్టు స్టే ఇవ్వనందున ఎస్ఈసీకి కొత్త షెడ్యూల్ ఇచ్చే సర్వాధికారాలు ఉంటాయంటూ ఆ ఔత్సాహిక ఐ ఏ ఎస్, ముఖ్యమంత్రిని మెస్మరైజ్ చేసిన తీరు చూస్తుంటే, మరో వివాదాన్ని ఏపీ సర్కార్ తొందర్లోనే కొని తెచ్చుకునేట్టు కనిపిస్తోంది.

ఏప్రిల్ 25 వరకు టీటీ డీ అన్నప్రసాదం పంపిణీ

* పశుగ్రాసం, దాణా కూడా                       లాక్ డౌన్ నేపథ్యంలో అమలు చేస్తున్న అన్న ప్రసాదం, పశుగ్రాసం , దాణా పంపిణీని ఈ నెల 25వ తేదీ వరకు  కొనసాగిస్తామని టీటీడీ ప్రకటించింది. ఈ నెల 20వ తేదీ తరువాత కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ లో కొన్ని మినహాయింపులు కల్పించింది. దీనివల్ల రైతులు, కూలీల జీవనోపాధి పనులు చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. అందువల్ల అన్న ప్రసాదం , పశుగ్రాసం, దాణా పంపిణీని ఈ నెల 25వ తేదీ వరకే కొనసాగించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.  లాక్డౌన్ వల్ల తిరుపతి, పరిసర ప్రాంతాల్లో భోజనానికి ఇబ్బంది పడుతున్న వలస కూలీలు, పేదల ఆకలి తీర్చడం కోసం టీటీడీ గత నెల 28వ తేదీ నుంచి అన్నప్రసాదం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.  పశువులు  కూడా మేత లేక ఇబ్బంది పడుతున్నందువల్ల ఏప్రిల్ 1వ తేదీ నుంచి గ్రాసం, దాణా, వీధి కుక్కలకు టీటీడీ ఆహారం అందిస్తోంది.

లాక్ డౌన్ రూల్స్ లోకేష్, దేవాన్ష్ లకు వర్తించవు

ఆయన ఏమి చేసినా సెన్సేషనే...కీలకమైన సమయం లో -పొరుగు రాష్ట్రం తెలంగాణాలో సేదతీరుతున్న నారా లోకేష్ చేస్తున్న సైక్లింగ్, అలాగే ఆయన కుమారుడు దేవాన్ష్ స్కెట్ బోర్డు మీద చేసిన విన్యాసాలు నెటిజెన్లకు ఇప్పుడు కావాల్సినంత స్టఫ్ అందిస్తున్నాయి. లాక్ దొళున్ నిబంధనలు ఉల్లంఘించి మరీ, ఆయన, ఆయన కుమారుడు- హైదరాబాద్ లోని తన ఇంటి రోడ్డుపై మాస్క్ లు లేకుండా లోకేష్ సైకిల్ తొక్కారు. లోకేష్ సైకిల్ తొక్కటమే కాకుండా తన తనయుడు నారా దేవాన్ష్  స్కేట్ బోర్డుపై హంగామా చేశారు. వీళ్లిద్దరి పక్కన ఉన్న సెక్యూరిటీ గార్డ్ మాత్రం మాస్క్ ధరించి ఉన్నాడు. కానీ వీళ్లు మాత్రం మాస్క్ లు లేకుండానే రహదారిపై సరదాగా తిరిగారు.దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉండటంతో బయటకు వస్తే ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించాలని సర్కారు ఆదేశించింది. కానీ బాధ్యత గల మాజీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇలా చేయటం ఏమిటంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఇండియన్ నేవీ నీ వదలని కరోనా

*ఐఎన్‌ఎస్‌ అంగ్రే నావల్‌ బేస్‌లో అలజడి  21 మంది నావికాదళ సిబ్బందికి కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలినట్టు, నేవీ అధికారులు వెల్లడించారు.  ఆ 21 మందినినగరంలోని ఐఎన్‌హెచ్‌ఎస్‌ అశ్వినీ నేవీ ఆస్పత్రికి తరలించి చికిత్స మొదలెట్టారు. ఐఎన్‌ఎస్‌ అంగ్రే నావల్‌ బేస్‌లో పనిచేసే సిబ్బందిలో ఒకరికి ఏప్రిల్‌ 7 న కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అతని ద్వారానే తాజాగా మిగతా వారికి కరోనా వ్యాప్తి జరిగినట్టు నేవీ ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నేవీలో కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఐఎన్‌ఎస్‌ అంగ్రే నావెల్ బేస్ లో లాక్‌డౌన్‌ ప్రకటించారు. మిగతా సిబ్బందికి కరోనా వ్యాపించకుండా భారత నావికాదళం చర్యలు మొదలెట్టింది. బాధిత సెయిలర్లు ఎవరెవరితో కాంటాక్ట్‌లో ఉన్నది తేల్చే పనిలో అధికారులు ప్రస్తుతం బిజీ గా ఉన్నారు. భారత త్రివిధ దళాలలో ఇప్పటికే ఇండియన్‌ ఆర్మీలో 8 కరోనా కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే.

పేషేంట్ లకు జైల్ లో ప్రత్యేక వార్డ్!

తెలంగాణా రాష్ట్రంలో రక్తహీనత రోగులు, తీవ్ర ఇబ్బంది పడుతున్నారు! ఈ నేప‌థ్యంలో బ్ల‌డ్ సేక‌రించడానికి నారాయ‌ణ‌గూడ బ్ల‌డ్ బ్యాంక్ ప్ర‌త్యేక ఏర్పాట్ల‌ను చేసింది. శ‌నివారంనాడు నారాయణ గూడ సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ లో టీఎన్జీవో ల ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను నిర్వ‌హించారు. కోవిడ్ 19 వలన రాష్ట్రంలో బ్లడ్ నిల్వలు తగ్గిపోయాయి. దీనితో తలసేమియా, రక్తహీనత రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేప‌థ్యంలో కొంత మంది యువకులు రక్తదానం చేశారు.   యువకులు పెద్ద ఎత్తున రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారు అందులో భాగంగానే ఇవాళ నారాయణ గుడా ఐపీఎఎంలో టీఎన్జీవో ల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన‌ట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. ప్ర‌స్తుతం బ్లడ్ నిల్వవలు పెరుగుతున్నాయి ఇంకా ఎంతో మంది యువకులు రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారని మంత్రి తెలిపారు. టీఎన్జీవో లు ఎప్పుడు కూడా రక్త దానం చేయడానికి ముందు ఉంటారని మంత్రి ప్ర‌శంసించారు. డాక్టర్ ల పై దాడులు హేమమైన చర్య, డాక్టర్ లపై దాడులు చేస్తే కఠినంగా శిక్షలు ఉంటాయి మంత్రి ఈటెల ఈ సంద‌ర్భంగా మ‌రో సారి హెచ్చ‌రించారు. డాక్టర్లు నిరంతరం కష్టపడి పని చేస్తున్నారు, వారి పై పేషేంట్లు దాడి చేస్తే జైల్‌లో వున్న ప్ర‌త్యేక వార్డుకు త‌ర‌లిస్తామ‌ని మంత్రి హెచ్చ‌రించారు. పేషేంట్ లకు జైల్ లో ప్రత్యేక వార్డ్ పెట్టాం.వారికి కూడా శిక్ష అమ‌లులో వుంటుంద‌ని మంత్రి తెలిపారు.

రంజాన్ నెల‌ ఇంట్లోనే! సౌదీ గ్రాండ్‌ ముఫ్తీ అదే చెప్పారు!

వచ్చే వారం ప్రారంభం కానున్న రమదాన్ ఉపవాస దీక్షలు, అనంతర తారావీహ్‌ ప్రార్థనలు ఇంట్లోనే నిర్వహించుకోవాలని సౌదీ అరేబియా మతపెద్ద, గ్రాండ్‌ ముఫ్తీ షేక్‌ అబ్దులాజీజ్‌ అల్ షేక్ ప్ర‌పంచంలో వున్న ముస్లింల‌కు పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో మసీదులకు వెళ్లే పరిస్థితులు లేవని ముఫ్తీ గుర్తుచేశారు. ఇస్లాంను విశ్వసించేవారంతా ఈ నియమాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. రమదాన్ మాసంలో నిర్వహించే ఇఫ్తార్, తారావీహ్‌ కార్యక్రమాలను అందరూ ఇంట్లోనే నిర్వహించుకోవాలని సూచించారు. రమదాన్ పర్వదినంలో మ‌క్కా, మదీనాలోని ప్రముఖ మసీదులో ప్రతిరోజు ఏర్పాటు చేసే ఇఫ్తార్‌ను (ప్ర‌త్యేక ఇఫ్తార్ పార్టీల‌ను) సైతం రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. వైరస్‌ విజృంభణ నేపథ్యంలో మార్చి రెండో వారం నుంచే సౌదీ అరేబియా న‌మాజ్ విషయంలో మార్గదర్శకాలు జారీ చేసింది. మసీదుకు వెళ్లాల్సిన అవసరం లేదని సూచించింది. ప్ర‌పంచంలో వున్న ముస్లింలంద‌రూ ఇంట్లోనే న‌మాజ్, ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాలు చేసుకోవాల‌ని గ్రాండ్ ముఫ్తీ ఆదేశాలు జారీచేశారు. రంజాన్ సంద‌ర్భంగా ప్ర‌త్యేక ఉమ్రా యాత్ర‌ల‌ను కూడా సౌదీ ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. మే 31వ తేదీ వ‌ర‌కు అన్ని ఎయిర్ లైన్స్ ఆప‌రేష‌న్‌పై నిషేధం విధించింది.

ఆలుగడ్డలు తిని ఆకలి తీర్చుకుంటున్న బెంగాల్ యువకులు

* క్రీస్తురాజపురం లో పశ్చిమ బెంగాల్ యువకుల ఆవేదన లాక్ డౌన్ కారణంగా పనులు లేక పస్తులు ఉంటున్న వలస కార్మికుల అవస్థలు విజయవాడ లో ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. స్థానికులు పెట్టే ఆహారంతో కడుపు నింపుకుంటున్న కార్మికులు తమను ఆదుకునే వారి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం‌ లేదని ఆవేదన. వారి ఆందోళన కు మద్దతు పలికిన బిజెపి నేతలు మైనార్టీ మోర్చా జాతీయ కార్యదర్శి షేక్ బాజి, రాష్ట్ర మీడియా కన్వీనర్ వుల్లూరిగంగాధర్. షేక్ బాజీ మాట్లాడుతూ- మగ్గం పనుల కోసం పశ్చిమ‌బెంగాల్ నుంచి విజయవాడ కు వలస వచ్చిన 536మంది ఈ ప్రాంతంలో నివాసాలు ఉంటున్నారు, అప్పుడప్పుడు దాతలు ఇచ్చిన సాయంతో కడుపు నింపుకుంటున్నారు, లేని రోజు పచ్చి బంగాళ దుంపలు తింటున్నారు.. లేదా పస్తులు ఉంటున్నారని చెప్పారు. ఇక్కడ రేషన్ కార్డు లేకపోవడం తో వీరిని ఎవరూ పట్టించుకోవడం లేదని, వాలంటీర్ లు కూడా వీరి వివరాలను నమోదు‌ చేసుకోవడం లేదని, ప్రభుత్వం వాళ్ల బాధను అర్ధం చేసుకుని ఆహారం అందించాలని, ఇక్కడ సాధ్యం కాదంటే...‌వారి  సొంత రాష్ట్రానికి పంపే ఏర్పాటు చేయాలని బాజీ కోరారు.   గంగాధర్ మాట్లాడుతూ-ఊరు కాని ఊరు వచ్చి వీరంతా అవస్థలు పడుతున్నారని, ఇటీవలే ఈ ప్రాంతానికి సమీపంలో రెడ్ జోన్ ప్రకటించారని, ఇరుకు గదుల్లో నివాసం ఉండే వీరిలో ఎవరికైనా ఇబ్బంది వస్తే నష్టం భారీగా ఉంటుందని, వీరి ఆకలి తీర్చాల్సిన బాధ్యత అధికారుల పై ఉందని అన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టి కి తీసుకెళ్లామనే, స్పందించి బెంగాల్ యువకుల ఆకలి తీర్చేలా ఏర్పాటు చేయాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వాలంటర్ వ్యవస్థను తక్షణమే ఇక్కడకు పంపి వీరికి తగు సాయం చేయాలని గంగాధర్ డిమాండ్ చేశారు.

గతంలో మీ పత్రిక తెలుగు కోసం గుండెలు బాదుకోలేదా?

మన భాషని, మన సంస్కృతిని మనం చిన్నబరుచుకుంటే ఎలా? ఇంగ్లిష్‌ నేర్పాలి, కానీ తెలుగుని అగౌరవపరిచే పద్ధతి మానుకోవాలి. మాతృభాషను రక్షించుకోవడం, ప్రచారం కల్పించుకోవడంలో కన్నడిగులు, మరాఠీలు, తమిళులు, హిందీ వాళ్లను చూసి నేర్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా గతంలో ‘మాతృభాషకు మంగళం’ అనే శీర్షికతో సాక్షి పత్రికలో క‌థ‌నాలు ప్ర‌చురించారు.  వైసీపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగు మీడియం కావాలంటూ డిమాండ్‌ చేశారు. ఇప్ప‌డేమో ఇంగ్లిష్‌ మీడియం అంటూ  కపటనాటకాలు ఎందుకు?   ‘దేశ భాషలందు తెలుగు లెస్స. మాతృభాష మన ప్రాచీన సంపద. కాపాడుకుందాం. పెంపొందిద్దాం. తెలుగు భాష అభ్యున్నతికి ఇంగ్లిష్‌ వాడైన బ్రౌన్‌ ఎంతగానో కృషి చేశాడు. మన తెలుగు నాయకులు మాత్రం మాతృభాష అంతరించిపోయే విధంగా చేస్తున్నారు.   విద్యాహక్కు చట్టం ప్రకారం.. ప్రాథమిక విద్య బోధన మాతృభాషలోనే జరగాలి. 8వ తరగతి వరకు పిల్లలకు స్థానిక మాతృభాషలోనే బోధించాలని జాతీయ నూతన విద్యా విధానం కూడా చెబుతోంది. 1968, 1986 సంవత్సరాల్లో రూపొందించిన విధానాల్లోనూ ఇదే విషయం చెప్పారు. ఆంగ్ల మాధ్యమంతో పాటు సమాంతరంగా తెలుగు మాధ్యమం.. అంటే రెండూ ఉండాలని రాజకీయ పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయల ఎమ్మెల్సీలు సూచించారు. ఇప్పటి వరకు తెలుగులో చదివిన విద్యార్థులను ఒకేసారి ఆంగ్ల మాధ్యమంలోకి మారిస్తే విద్యా ప్రమాణాలు పడిపోతాయని, పేద పిల్లలు బడి మానేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు భాషావేత్తలు, విద్యావేత్తలు, శాస్త్ర వేత్తలు సైతం మాధ్యమాన్ని పిల్లలే ఎంచుకునే అవకాశం ఉండాలని సూచించారు.

కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి, క్లాస్ రూమ్ సిలబస్ కి సంబంధం ఉండటం లేదా?

* ఒక ప్రభుత్వ టీచర్ చేసిన విశ్లేషణ.. * తప్పకుండా ఆలోచించాల్సిన అంశాలు...  ప్రభుత్వ విద్యా వ్యవస్థ, ప్రైవేటు విద్యా వ్యవస్థ మధ్య పోటీలో..  ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎలా బలిపశువులు చేసి చూపుతున్నారో, వాళ్ళు అలా ఎందుకు బలికావాల్సి వస్తుందో వివరించే ప్రయత్నం నాది... కొంత హిస్టరీలో కి వెళ్దాం...  30 సంవత్సరాలకు పూర్వం అందరూ ప్రభుత్వ పాఠశాలలోనే విద్య అభ్యసించేవారు. డాక్టర్ కొడుకైనా, లాయర్ కొడుకైనా, ఇంజనీర్ కొడుకైన, టీచర్ కొడుకైనా, రాజకీయ నాయకుడి కొడుకైనా, రైతు కొడుకైనా, కూలి కొడుకైన ఎవరైనా ఒకే పాఠశాలలోనే చదవాల్సిందే. అప్పుడు పాఠశాలలన్నీ తెలుగు మీడియంలోనే ఉండేవి.. దాదాపు ప్రతి గ్రామంలోనూ పాఠశాలలు విద్యార్థులతో కిటకిటలాడేవి. అప్పుడు కూడా విద్యార్థులకు సరిపడే టీచర్లు కూడా ఉండేవారు కాదు. ఏ కొంత మంది విద్యార్థులకో ప్రత్యేక తర్ఫీదు లు ఉండేవి కాదు. కానీ విద్యార్థులు వారి యొక్క సామర్ధ్యాన్ని బట్టి ముందు తరగతులకు వెళ్తూ ఉండేవారు. తెలివైన విద్యార్థులు 5 నుండి 10 శాతం మంది  ఉన్నత తరగతులు చదువుతూ కాలేజీల్లోనూ.. యూనివర్సిటీల్లోని సీట్లు సంపాదిస్తూ  ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళేవారు. మిగతా 90 శాతం మంది విద్యార్థుల్లో ప్రాథమిక విద్యలో విద్యను ఆపేసిన వారు కొందరు, హైస్కూల్ స్థాయిలో  విద్యను ఆపేసిన వారు కొందరు, కాలేజీ స్థాయిలో కొందరు, రకరకాల వృత్తులో స్థిరపడిన వారు కొందరు ఉండేవారు. అలా ఉన్న 90 శాతం మందిలో ఏ ఒక్కరు కూడా ఆ పాఠశాల వలనే మాకు చదువు రాలేదు అని ఎవరూ అనుకోలేదు. మేము చదువు మీద సరైన శ్రద్ధ చూపలేదు అని మాత్రమే అనుకునేవారు. వారికి చదువు చెప్తున్న ఏ ఉపాధ్యాయుని కూడా నిందించే వారు కూడా కాదు.  తర్వాత వాస్తవం లోకి  వెళ్దాం... కాలంతో పాటు జనాభా కూడా పెరుగుతోంది. గ్రామాల్లోని విద్యార్థులకు కూడా చదువుకోవాలనే ఆసక్తి పెరిగింది. కానీ ప్రాథమిక విద్య తర్వాత హైస్కూల్ లో  జాయిన్ చేయడానికి  అందుబాటులో లేక చదువు మానేసిన వాళ్లు  కొందరు.  దీనికి కారణం ఉపాధ్యాయులా? ప్రభుత్వమా?  ఏదోలా దూరాన ఉన్న హై స్కూల్లో చేరి హైస్కూలు చదువు పూర్తి చేసిన తర్వాత జూనియర్ కాలేజీలో చేరుదామనుకుంటే రెండు, మూడు మండలాలకు కలిపి ఒక జూనియర్ కళాశాల దానిలో 100 నుంచి 200 సీట్లు ఉండేవి. మరి మిగతా విద్యార్థుల పరిస్థితి ఏంటి ?   ప్రభుత్వాలు వాళ్లకి ఎందుకు చదువుకునే అవకాశాలు కల్పించలేకపోయింది?అప్పుడే విద్యార్థులు అవసరాలకు అనుగుణంగా ప్రైవేట్ కళాశాలలు పుట్టుకొచ్చాయి. ప్రభుత్వం కూడా తన భారం తగ్గుతుంది కదా అని పర్మిషన్ లు కూడా ఇచ్చేసేది. కానీ  ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు రాని వాడు మాత్రమే ప్రైవేటు కళాశాలలో జాయిన్ అయ్యే వారు. కానీ ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు రాని వారి సంఖ్య పెరుగుతూ పోయింది. కానీ ప్రభుత్వ కళాశాలలు పెరగలేదు. వాటిల్లో సీట్ల సంఖ్య పెరగలేదు. ప్రైవేటు కళాశాలల సంఖ్య మాత్రం  వారికి అనుగుణంగా పెరుగుతూ పోయింది. అపార్ట్ మెంట్ లో నడుస్తున్నా.. విద్యా ప్రమాణాలు పాటించకున్నా.. ప్రభుత్వం తన మీద భారం లేదు కదా అనుకుంటూ పర్మిషన్ ఇచ్చుకుంటూ పోయింది. మరి ప్రాథమిక విద్య లో విద్యార్థులను ఆకర్షించడం ఎలా..?  వాళ్ల దగ్గర లేనిది మన దగ్గర ఏముంది? దానికి సమాధానమే ఇంగ్లీష్ మీడియం... ఇబ్బడిముబ్బడిగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రారంభమయ్యాయి... ఉన్నత తరగతి వ్యక్తులందరూ అటు వైపు ఆకర్షింపబడ్డారు. ప్రభుత్వం ప్రాథమిక విద్యని మాతృభాషలోనే బోధించాలని  రూల్ ఏమి పెట్టలేదు. అడిగిన వాళ్లందరికీ ఇంగ్లీష్ మీడియం పర్మిషన్ ఇచ్చేసింది. కానీ ఏ ఒక్క గవర్నమెంట్ స్కూల్లోనే ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీడియం పెట్టలేదు. ప్రభుత్వం మీద భారం లేకుండా ఎవరికి వారే కదా డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రైవేట్ గా చదివేస్తున్నారు. ప్రభుత్వానికి చాలా సంతోషించదగ్గ విషయమే కదా..! ప్రభుత్వ ఖర్చు లేకుండా ప్రజలు విద్యావంతులై పోతుంటే..!! అలా ఉన్నత, మధ్య తరగతి విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ వైపు వెళ్ళిపో సాగారు.  అది సమాజంలో లో స్టేటస్ సింబల్ గా మారిపోయింది. ప్రభుత్వ పాఠశాల క్రమేపీ పేదల పాఠశాల గా మారిపోయింది. కష్టం చేసుకునే ప్రజల పిల్లలు.. ఇంటి దగ్గర కష్టపడుతూ స్కూల్ కి వచ్చి చదువుకునే పిల్లలు.. ఏ మాత్రము చదువుకు సహకరించని తల్లిదండ్రులున్న పిల్లలు... ప్రభుత్వ పాఠశాలలకు దిక్కయ్యారు. వాళ్లలో కూడా తెలివైనవారిని రెసిడెన్షియల్ పాఠశాలలు, నవోదయ పాఠశాలలు లాంటివి పరీక్షలు పెట్టి తీసుకెళ్లిపోయారు . ఇక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల మీద భారం వేసి నీవల్లే ప్రభుత్వ పాఠశాల నాశనమయ్యిందంటూ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ప్రజల మీద దురభిప్రాయం రుద్దింది.   ఆకులు చిదిమేసి, కొమ్మలు నరికేసి, చెట్టు మొదలు కి నీరు పోసినట్టు..ఇన్ని సంవత్సరాల తర్వాత మేము ఇంగ్లీష్ మీడియం పెడుతున్నాం అని.. తూతూమంత్రంగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాయి... పెట్టినా.. అందుకు తగ్గట్టు వనరులు సమకూర్చ లేకపోయింది. ‌ప్రైవేటు పాఠశాల పక్కన, ప్రభుత్వ పాఠశాల చిన్న పోయేలా ప్రభుత్వం తయారుచేసింది. సరిపడినంత మంది ఉపాధ్యాయులు ఇవ్వలేకపోవడం. విద్యార్థులకు ఫర్నిచర్ తరగతి గదులు సరిపడా  లేకపోవడం. ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్లు, ట్రాన్స్ఫర్లు సరైన సమయంలో చేసి,  సరైన పద్ధతిలో పాఠశాలలను నడిపించలేక పోవటం.  ప్రైవేటు విద్యార్థులు సొంతంగా సిలబస్లో రూపొందించుకున్న వారిని అదుపు చేయలేక పోవడం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి, క్లాస్ రూమ్ సిలబస్ కి సంబంధం లేకపోవడం.ఉదాహరణకు 5వ తరగతి పూర్తి చేసి నవోదయ రాస్తున్న విద్యార్థికి ఐదవ తరగతి సిలబస్ లో ఉన్న ప్రశ్నలు కాకుండా ఇతరత్రా జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువ ఉండటం వల్ల వాటిని పాఠశాలలో బోధించే ఏవిధంగా సిలబస్ లేకపోవడం.  ఇంటర్మీడియట్ రెండు సంవత్సరములు MPC గ్రూప్ గవర్నమెంట్ కాలేజీలో చదివి  లెక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక్క లైను కూడా మిస్ అవ్వకుండా మొత్తం అవపోసణ చేసిన వాడికి ఐఐటీలో సీటు వస్తుందా?  ‌రాదు...  ఎందుకంటే ఆ సిలబస్లో లేని అంశాలు, అంతకు మించిన అంశాలను ఆ ఎక్జామ్ లో ప్రశ్నించడం వలన.  అంటే ప్రభుత్వం ఆ అంశాలను ఎందుకు సిలబస్ లో పొందుపరచ లేకపోయింది. లేదా ఇంటర్మీడియట్ సిలబస్ కు మించకుండా ఐఐటీ ఎగ్జామ్ ని ఎందుకు నిర్వహించలేక పోతుంది? అంటే గవర్నమెంట్ పాఠశాల పుస్తకాలు, గవర్నమెంట్ కాలేజీ చదువులు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు సరిపోవు.. అనే భావాన్ని ప్రజల్లో బాగా నాటింది... ఈ విధంగా ప్రభుత్వం తన విధానాలతో ప్రభుత్వ స్కూళ్ల విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ..  ఆ తప్పిదాన్ని ఉపాధ్యాయులు మీదికి నెట్టేస్తూ ప్రజల్లో ఆ భావాన్ని గట్టిగా నాటింది.నిజంగా ఇప్పుడు ప్రాథమిక విద్య అభ్యసిస్తున్న రాష్ట్రంలో విద్యార్థులందరూ ప్రభుత్వ స్కూల్లో జాయిన్ అయితే వారి సంఖ్యకు తగ్గట్టు స్కూళ్లను ఏర్పాటు చేసి, ఉపాధ్యాయులను ప్రభుత్వం నియమించగలదా...?  ఆ సామర్ధ్యం ప్రభుత్వం దగ్గర ఉంటే ప్రభుత్వ స్కూళ్లు ఎందుకు బలోపేతం కావు ..ఇక్కడ నేను చెప్ప వచ్చే ముఖ్యమైన విషయం ఏంటంటే .ఫలితాలు చూపిస్తూ మేము మీ కంటే మెరుగ్గా ఉన్నాం అని విర్రవీగే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, వాటిని సమర్థించే గొర్రె మంద లాంటి జనాలు ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకోవాలి. నీళ్లు ఉన్నచోట ఎవరైనా పంట పండిస్తారు. ఎడారిలో పండించండి .మీ ప్రవేట్ స్కూల్ కి వచ్చిన ప్రతి పిల్లాడు ప్రతి రోజు స్కూల్ కి వస్తాడు. వారిని స్కూల్ దాకా దింపే తల్లిదండ్రులు ఉంటారు.నువ్వు అడిగిన ప్రతి పుస్తకం కొంటాడు.నువ్వు ఎన్ని గంటలు రుద్దుతున్నా వింటారు. . వాళ్ల తల్లిదండ్రులు విద్యావంతులై ఉంటారు. ఇంటి దగ్గర మాత్రం వారి కోసం సమయం  కేటాయించగల గలవారై ఉంటారు.ఆ పిల్లలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తారు.మరి నా ప్రభుత్వ స్కూల్ కి వచ్చిన పిల్లాడు నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు, రోజువారి కూలీల పిల్లలు... అడిగిన పుస్తకం కూడా లేని పరిస్థితి.ఇంటి పని అంతా చేసుకొని సమయానికి స్కూలు రాని పరిస్థితి.పేదరికంలో ఉన్న వాళ్లు ఆరోగ్యం చెడిపోతే మధ్యలోనే నెలలపాటు పాఠశాల మాని వేసే పరిస్థితి. ఉదయాన్నే పనికిపోయే తల్లిదండ్రులు వాడు పాఠశాలకు వెళ్తున్నాడు లేదో కూడా పట్టించుకోని పరిస్థితి. పౌష్టికాహారం లేక బక్కచిక్కిన పిల్లలు. నువ్వు మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలను చేర్చుకోవు.మేము చేర్చుకుంటాం..మీరు పుస్తకం లేకపోతే బడీకి రానివ్వరు.మేము రానిస్తాం. మీరు పాఠశాలకు ఆలస్యమైతే ఒప్పుకోరు.మాకు వాడు పాఠశాలకు ఎప్పుడు వచ్చినా అదే పదివేలు.. మీరు మీ విద్యార్థులకు హోం వర్క్ చేయకపోతే వాళ్ల తల్లిదండ్రులను కూడా మందలిస్తారు.మా పిల్లల తల్లిదండ్రులు 90 శాతం నిరక్షరాస్యులు మీ పాఠశాలను శుభ్రం చేసే మనుషులు ఉంటారు. మాకు మా విద్యార్థులు మరియు మేమే ఆ పని చేస్తాం. మీరు చదువులో వెనుకబడిన విద్యార్థులకు పాఠశాల నుండి తీసివేసి పంపించేస్తారు. ఎందుకంటే వాడు ఉంటే మీ పాఠశాల పరువు తక్కువ కాబట్టి.మేము వెనుకబడిన విద్యార్థులకు పిలిచి మరీ పాఠశాలలో చేర్చుకుంటాం. మీ పాఠశాలలో క్రీడలు లాంటివి లేవు. అంతెందుకు గ్రౌండ్ లే లేవు. మా పాఠశాలలో తప్పనిసరిగా క్రీడలు ఆడించవలసిందే. మీ పాఠశాలలో తెలివైన విద్యార్థులను మీరే దాచుకుంటారు.  ఫీజు రాయితీలు అంటూ బయటికి పోనివ్వరు.  ఎందుకంటే వాడి పేరు చెప్పి ఇంకో వందమందిని ఆకర్షించాలిగా..మా పాఠశాలలో తెలివైనవారిని నవోదయ రెసిడెన్షియల్ స్కూల్స్ కి పంపించేస్తుంటాం...మీరు కొన్ని వందల పాఠశాలల  బ్రాంచ్ లు కలిపి అది మీ యొక్క పాఠశాల రిజల్ట్ గా చెప్పుకుంటారు... మాకు మా పాఠశాలలో వస్తేనే మా గొప్ప. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి...  అవన్నీ మీకు కూడా తెలుసు...వ్యవస్థలో లోపాలు సరిచేయకుండా ప్రభుత్వ ఉపాధ్యాయుడిదే లోపం అని  మాట్లాడుతున్న గా.. అందరూ ఈ అన్ని విషయాలు గమనించండి. అయినా మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ తోపులు కాలేదు. లక్షల మంది దగ్గర్నుంచి ఐఐటీ సీట్లంటూ లక్షలు.. గుంజేస్తుంటే ఏ వందమందికో సీట్లు వస్తున్నాయి...మరి మిగతా వాళ్ల సంగతేంటి..?   మా ప్రభుత్వ పాఠశాలలో పదికి పది పాయింట్లు వచ్చిన వారిని నీలాగ రాష్ట్రం అంతా కలిపి లెక్కేస్తే, టీవీల్లో ప్రకటనలు ఇస్తే నువ్వు ఒక పక్కకు కూడా రావు.. అది నీ లాంటి సౌకర్యాలు లేకుండా..   ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టు ఉంది ప్రైవేట్ పాఠశాలలు గోదారి బ్రిడ్జి మీద కారులో పోతున్నట్టు ఉంది.  అన్ని తెలుసుకోకుండా ఎవడికి వాడు ఈ రంగంలో లేకుండా ఒడ్డున కూర్చుని మామీద రాళ్లువేయడం సరికాదు.దయచేసి ప్రభుత్వ పెద్దలు ఈ లోపాలను సరి చేయండి.

భార‌త టాలెంట్ ను చాటుతున్న సైంటిస్ట్‌! డాక్ట‌ర్ సౌమ్యా స్వామినాథ‌న్!

కోవిద్‌-19 పేరు సూచించింది డాక్ట‌ర్ సౌమ్యానే! కోవిద్‌-19.. అంటే క‌రోనా వైర‌స్‌కు పెట్టిన కొత్త పేరు. ఇది వ్యాధి పేరు. ఈ పేరును ఫిక్స్ చేసింది ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌. అయితే ఆ వైర‌స్‌కు నామ‌క‌ర‌ణం చేసింది మాత్రం మ‌న భార‌తీయ డాక్ట‌రే. ఆ డాక్ట‌ర్ పేరు సౌమ్యా స్వామినాథ‌న్‌. డ‌బ్ల్యూహెచ్‌వోలో ఆమె చీఫ్ సైంటిస్ట్‌గా చేస్తున్నారు. సీఓ అంటే క‌రోనా, వీఐ అంటే వైర‌స్‌, డీ అంటే డిసీజ్‌, 19 అంటే 2019లో ఆ వ్యాధి పుట్టింద‌ని అర్థం. వ్యాధుల‌కు పేరు పెట్టాలంటే కొన్ని నిబంధ‌న‌లు ఉంటాయి. ఆ నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే క‌రోనా వైర‌స్‌కు కోవిద్‌-19 అని పేరు పెట్టిన‌ట్లు డాక్ట‌ర్ సౌమ్యా స్వామినాథ‌న్ తెలిపారు. వ్యాధికి పేరు పెట్టిన‌ప్పుడు ఆ వ్యాధి పేరు ఓ ప్రాంతాన్ని కానీ, న‌గ‌రాన్ని కానీ సూచించ‌కుండా ఉండాలి. వ్యాధి పేరు కూడా ప‌ల‌క‌డానికి ఈజీగా ఉండాలి. క‌న్ఫూజ‌న్ ఉండకూడ‌దు, కానీ లాజిక్ మిస్ కావొద్దు. భ‌విష్య‌త్తు త‌రాలు తెలుసుకునే ర‌కంగా వ్యాధి పేరు ఉండాలి. క‌రోనా వైర‌స్ వ‌ల్ల వ‌చ్చే మిగ‌తా వ్యాధుల‌కు కూడా పెరు పెట్టేంత సులువుగా ఉండాల‌ని డాక్ట‌ర్ సౌమ్యా స్వామినాథ‌న్ అన్నారు. హరిత‌విప్ల‌వ పితామ‌హుడు ఎంఎస్ స్వామినాథ‌న్ కూతురే డాక్ట‌ర్ సౌమ్యా స్వామినాథ‌న్‌. డాక్ట‌ర్‌ సౌమ్యా స్వామినాథన్‌ బాల్యమంతా మేధావుల సాంగత్యంలోనే గడిచింది. ఈమె తండ్రి ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త కావటంతో ఇంటికి నోబెల్‌ గ్రహీత సి.వి రామన్‌, మరో ప్రైజ్‌ విన్నర్‌ నోర్మన్‌ బోర్లాగ్‌ వచ్చిపోతూ ఉండేవారు. సౌమ్య మీద ఆ మహానుభావుల ప్రభావం చిన్నతనం నుంచే మొదలైంది. పుణేలో మెడిసిన్‌ పూర్తి చేసిన తర్వాత ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఎమ్‌డి చదివి, తర్వాతి శిక్షణ కోసం అమెరికా వెళ్లారామె. లాస్‌ ఏంజిల్స్‌లోని పిల్లల ఆస్పత్రిలో నియో నాటాలజీ, పీడియాట్రిక్‌ పల్మనాలజీలో ఫెలోషిప్ తో కూడిన శిక్షణ తీసుకున్నారు. 1992లో చెన్నైలోని ట్యుబర్‌క్యులోసిస్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో పరిశోధకురాలిగా చేరారు. అక్కడే దాదాపు 23 ఏళ్లపాటు పరిశోధనల్లో గడిపారు. అలా వైద్య రంగంలో ఆమె చేసిన కృషి ఫలితంగా, భారతీయ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ (రీసెర్జ్‌)లో సెక్రటరీగా, ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐ.సి.ఎం.ఆర్‌)కు డైరెక్టర్‌ జనరల్‌గా అత్యున్నత పదవులు అలంకరించారు. ఐ.సి.ఎం.ఆర్‌ వందేళ్ల చరిత్రలో ఆ స్థాయికి ఎదిగిన రెండో మహిళ సౌమ్యే! గత 30 ఏళ్లుగా వైద్య రంగంలో ఎనలేని పరిశోధనలతో, నిరంతర కృషితో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్‌ఓ)లో రెండవ అత్యున్నత పదవిని అలంకరించిన తొలి భారతీయ మహిళగా డాక్ట‌ర్ సౌమ్య చరిత్ర సృష్టించారు. డాక్టర్‌ సౌమ్యా స్వామినాథన్ పిల్లల వ్యాధులతోపాటు, క్షయ, హెచ్‌ఐవిలో పోషకాహారం పాత్ర...ఇలా ఎన్నో పరిశోధనల్లో నూతన కోణాలను ఆవిష్కరించి పేరు తెచ్చుకున్నారు. డాక్టర్‌ సౌమ్యా స్వామినాథన్‌ చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ ట్యూబర్‌క్యులోసిస్ కు డైరెక్టర్‌గా ఉన్న సమయంలో, టిబి జీరో సిటీ ప్రాజెక్ట్‌ (క్షయ రహిత చెన్నై)లో భాగంగా క్షయను తేలికగాగుర్తించటం కోసం ‘మాలిక్యులర్‌ డయాగ్నొస్టిక్స్‌’ అనే కొత్త పద్ధతిని అవలంబించారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌కు డైరెక్టర్‌ జనరల్‌గా నియమితురాలైన డా.సౌమ్య, బాధ్యతలు చేపట్టిన వెంటనే చేసిన మొట్టమొదటి పని సర్రొగసీ బిల్లుకు ప్రత్యేక హోదా కల్పించటం. అంతకుముందు వరకూ అసిస్టెడ్‌ రిప్రొడక్టివ్‌ టెక్నాలజీలో భాగంగా కొనసాగిన సర్రొగసీ బిల్లును దాన్నుంచి వేరు చేసి అద్దె గర్భం ప్రక్రియ దుర్వినియోగం కాకుండా కాపాడారు. వైద్యులు వైద్య వృత్తి దగ్గరే ఆగిపోతే వారి సేవ ఒక పరిధి వరకే పరిమితమవుతుంది. అదే వైద్య పరిశోధనలతో అనారోగ్యాలకు పరిష్కారాలను కనిపెట్టగలిగితే, ఆ సేవ విశ్వవ్యాప్తమవుతుంది.

షుగ‌ర్ పరీక్ష చేసినట్లుగా ర్యాపిడ్ టెస్టు చేస్తారా? కేంద్రం చుర‌క‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం దక్షిణ కొరియా నుంచి కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లు తెప్పించింది. ప్రత్యేక విమానంలో అవి వచ్చిన రెండు గంటల్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి అధికారులు టెస్ట్ చేసేశారు. నెగిటివ్ అని డిసైడ్ చేశారు. ఇది వివాదం అయింది. ముఖ్య‌మంత్రే కాదు అధికారులు కూడా టెస్ట్ చేయించుకుని చూసుకున్నారు. నెగెటివ్ అని సంతోష‌ప‌డ్డారు. అయితే ర్యాపిడ్ టెస్టుల మార్గదర్శకాలు మాత్రం వేరేగా ఉన్నాయి. ర్యాపిడ్ టెస్టులతో వెంటనే.. నెగెటివ్‌గా నిర్ధారించలేమని కేంద్రం తేల్చి చెబుతోంది. కరోనా ర్యాపిడ్ టెస్టుల ద్వారా…వైరస్ పాజిటివ్ లేదా నెగెటివ్ నిర్ధారించడం సాధ్యం కాదని.. అక్కడ పాజిటివ్ వచ్చిన వారి శాంపిళ్లను ఖచ్చితంగా ఐసీఎంఆర్ నిర్ధారించిన ల్యాబుల్లోనే టెస్టు చేసి.. ఖరారు చేయాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. అంతే కాదు.. ఇలా ఎవరికి పడితే.. వారికి టెస్టులు చేయకూడదని కేంద్రం చుర‌క‌లంటించింది. వైరస్ భిన్నమైనది. మనిషి శరీరంలోకి సోకినా లక్షణాలు బయటపడటం లేదు. ఒక్కొక్కరిలో నెల రోజుల తర్వాత లక్షణాలు బయటపడుతున్నాయి. టెస్టులు చేసినా.. మొదట్లో నెగెటివ్ అనే వస్తోంది. ఈ కారణంగా ఐసీఎంల్ ప్రత్యేకంగా కొన్ని నియమనిబంధనలు విధించింది. నిబంధ‌న‌లు ఫాలో అవ్వకుండా సింపుల్‌గా షుగ‌ర్ పరీక్ష చేసినట్లుగా.. ముఖ్యమంత్రికి టెస్ట్ చేసి.. నెగెటివ్ అని ప్రకటించ‌డంపై కంద్ర‌ప్ర‌భుత్వం స్పందించింది. కరోనా రాపిడ్ టెస్ట్ మార్గదర్శకాల రూపొందించి విడుద‌ల చేసింది.

వేదపారాయణం చేస్తున్న పురంధేశ్వరి!

ప్ర‌ముఖ సినీ న‌టుడు, దివంగ‌త‌ మాజీ ముఖ్య‌మంత్రి నందమూరి తారక రామారావు గారి తనయ శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి  తండ్రి నుండి రాజకీయ వారసత్వం మే కాకుండా కృషి, కార్యదీక్ష తో పాటు ఆధ్యాత్మిక వారసత్వం కూడా తీసుకుందా అనిపిస్తున్నది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం నాలుగు భాషల్లో అనర్గళంగా  మాట్లాడ గలిగే పురంధ్రీశ్వరి  సంస్కృతం నేర్చుకొని వేదపారాయణం కూడా చేస్తుందా అనిపిస్తుంది. ఆమె ప్రతిరోజూ ఇంట్లో దేవుని సన్నిధి లో దేవతారాధన, షోడశోపచారాలతో అర్చన, భిల్వాస్టుకం, ఆదిత్య హృదయం, త్రిశతి, ఖడ్గమాల పారాయణం చేయడం చూస్తుంటే  నిజమేననిపిస్తోంది.  వేదాలతోనే సమాజం చైతన్యవంతం కాగలుగుతుందని హిందూ ధ‌ర్మ‌శాస్త్రం చెబుతోంది. భారతీయ జీవన విధానాలు, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను చాటిచెప్పేవి, సమ సమాజ నిర్మాణానికి దిశా నిర్దేశం చేసేవి నాలుగు వేదాలే. కమలం వికసించిన తీరు ఎంతగా మనలో దివ్య అనుభూతి కలిగిస్తుందో అదే అనుభూతి సామ వేదం ద్వారా మనకు లభిస్తుందట‌.  లాక్‌డౌన్ స‌మ‌యంలో బ‌య‌టికి వెళ్ళ‌కుండా ఆధ్మాత్మిక‌త పెంచుకోవ‌డ‌మే కాదు ఇంట్లోని పిల్ల‌ల‌కు వాటి యొక్క ప్రాధాన్య‌త‌ను  బోధించి నేర్పించాల్సిన అవ‌స‌రం వుంది. అందుకు శ్రీమతి దగ్గుబాటి పురధరేశ్వరి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

తెనాలిలో ప్రయివేట్ వ్యక్తులకూ వాకీ టాకీలిచ్చిన ఎస్ ఐ

* ఎస్ పి కి  కాకపోతే డీజీపీకి చెప్పుకో తెనాలిలో 2 టౌన్ ఎస్సై మధు పవన్ ఓవర్ యాక్షన్  గుంటూరు జిల్లా తెనాలిలో 2 టౌన్ ఎస్సై మధు పవన్ ఓవర్ యాక్షన్ చేశారు. ప్రభుత్వం నియమించిన పోలీసు సిబ్బందితో పాటు తనకు కావాల్సిన ప్రయివేటు వ్యక్తులకు పోలీసు విధులు అప్పగించారు. ప్రయివేటు వ్యక్తులకు పోలీసు లాఠీతో పాటు వాకీటాకీలను కూడా అప్పగించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ అనుమతి ఉన్న వాహనాలను కూడా ఆ ప్రయివేట్ వ్యక్తులు అడ్డుకుంటున్నారు. ఐడీ కార్డులు చూపించినా వినకుండా దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. డీఎస్పీ ప్రోగ్రామ్‌కు వెళ్తున్న ఓ మీడియా ప్రతినిధిపై ఎస్సై దురుసుగా ప్రవర్తించడంతో పాటు అతడి అక్రిడేషన్ కార్డును విసిరిపడేశారు. ‘ఇదేంటి సార్..’ అని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో పాటు ‘ఎస్పీకి కాకపోతే డీజీపీకి చెప్పుకో’ అంటూ హెచ్చరించారు.  కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ నేపథ్యంలో పోలీసుల పాత్ర కీలకంగా మారింది. ప్రజలు అనవసరంగా రోడ్లపై తిరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులది. అయితే అదే సమయంలో అత్యవసర విభాగాల వారికి అనుమతి ఇవ్వాలని కూడా పోలీసులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయి. అయితే అవేం పట్టించుకోకుండా అంతా తన ఇష్టం అన్నట్లు తెనాలి ఎస్సై ప్రవర్తన ఉందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.