రైతన్నలు కన్నీరు పెడుతున్నారు? మొద్దు నిద్రలో ప్రభుత్వం!
posted on Apr 23, 2020 @ 12:19PM
'ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్ రాజధాని మార్పు, మాతృభాష మీడియం రద్దు వంటి తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కోర్డు ఆదేశాలను సైతం ధిక్కరించి, రాజ్యాంగానికి విరుద్దంగా జగన్ పాలన సాగిస్తున్నారు. పండిన పంటకు ధర లేక రైతులు పంటలను వదిలేసుకుంటున్నా.. ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు. కరోనా సమయంలో కూడా యధేచ్చగా ఇసుక దోపిడీ చేస్తున్నారు. లారీల ద్వారా పంటలను పంపించే ఏర్పాట్లు చేయడంలేదు.కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది' అని జగన్ సర్కార్‌పై దేవినేని విమర్శలు గుప్పించారు.
ధాన్యం కొనుగోళ్ళు చేస్తామని చెప్పిన బూతుల మంత్రి.. ఎంత కొన్నారో చెప్పాలని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం గుంటుపల్లిలో టీడీపీ ఆధ్వర్యంలో ప్రజలకు కూరగాయలు, నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు. రైతు కూలీలు, మహిళలకు స్వయంగా అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. మాటలు కోటలు దాటుతున్నాయని.. చేతలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదన్నారు. మామిడి సీజన్ కావడంతో రైతులు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. తోటల్లోనే మామిడి కాయలను వదిలేసి రైతన్నలు కన్నీరు పెడుతున్నారన్నారు.