రాజధాని తరలింపు పై నీలి నీడలు! సి.ఎం. వ్యూహం ఏంటి?
posted on Apr 25, 2020 @ 10:42AM
కరోనా సమయంలోనూ రాజధాని తరలింపుపై ముందుకు వెళ్లడం అనేది అహంకారమా...ధిక్కారమా?...అలాగే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో జగన్ ప్రభుత్వ వ్యూహం ఏంటి?
మూడు రాజధానుల పేరుతో జగన్ పరి పాలన వికేంద్రీకరణ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. కర్నూలును న్యాయ రాజధానిగా, విశాఖ ను పరిపాలన రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా చేసేందుకు జగన్ సిద్ధపడ్డారు. దీనిపై అమరావతి పరిసర ప్రాంతాల్లో ప్రజలు రైతుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. మే నెలలోనే విశాఖను పరిపాలన రాజధానిగా చేసేందుకు జగన్ సర్వం సిద్ధం చేసుకున్నారు. కానీ ఇదే సమయంలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రతరం అవడంతో రాజధాని తరలింపు పై నీలి నీడలు కమ్ముకున్నాయి.
అమరావతి నుంచి విశాఖకు రాజధానిని తరలించేందుకు జగన్ సర్కార్ ఆఘమేఘాల మీద నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలను తరలించేందుకు ప్రయత్నాలు చేసింది. అయితే ఈ రాజధాని మార్పుపై కోర్టులో బ్రేక్ పడింది. రాజధాని వికేంద్రీకరణ బిల్లులు ఆమోదం పొందేందుకు తరలింపు ప్రక్రియ చేపట్టబోమని అడ్వకేట్ జనరల్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఎదురుదెబ్బల కాలంలో జగన్ ప్రభుత్వం ఏం చేయబోతోంది.
రాజధాని తరలింపు అంశంపై వెనక్కి తగ్గేది లేదంటూ మొండిగా ముందుకు వెళ్తున్న జగన్ సర్కార్‌కు ఎక్కిడక్కడ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఓ వైపు కరోనా కాలంలోనూ రాజధాని తరలింపుపై ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది.
ఎంపీ విజయసాయిరెడ్డి అయితే రాజధాని తరలింపును ఆపడం ఎవరి తరమూ కాదని అన్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఓ వైపు రాజధాని తరలింపును ఆపాలంటూ అమరావతి రైతుల జేఏసీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై జరిగిన విచారణలో అడ్వకేట్ జనరల్ కీలక విషయాన్ని కోర్టుకు విన్నవించారు. ఇప్పుడు ఈ నిర్ణయంతో రాజధాని తరలింపు ప్రక్రియ మరింత కాలం వాయిదా పడనుంది.
ఏపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాజధాని అంశంలో ఏం చేస్తున్నా కూడా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. కోర్టులు కూడా అనేక అంశాలపై మొట్టికాయలు వేస్తూనే ఉంది. ఇక తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా మరోసారి విమర్శలకు దారి తీశాయి. అలాగే అమరావతి రైతుల జేఏసీ కూడా ఈ విషయాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అయితే కోర్టు అడ్వకేట్ జనరల్‌ను ప్రశ్నించగా చట్టం చేసే వరకు కూడా అలాంటి తరలింపు ఏదీ లేదని చెప్పినప్పటికీ కూడా ఈ అంశంపై స్పష్టతనిస్తూ పది రోజుల్లోగా అవిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు అడ్వకేట్ జనరల్‌ను, ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ప్రభుత్వం రాజధాని అంశంలో ఎందుకింత మొండివైఖరి అవలంభిస్తోంది.