విమాన సిబ్బందికి ప్రత్యేక బాడీ సూట్! ఫేస్ షీల్డ్!

లాక్ డౌన్ నిబంధనల సరళీకరణ మొదలైన అనంతరం తిరిగి విమాన సర్వీసుల పునరుద్ధరణ ప్రారంభంకానున్న నేపథ్యంలో, విమానయాన సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ సిబ్బందికి కరోనా వైరస్ సోకకుండా పైలట్లు, ఎయిర్ హోస్టెస్ లు, విమానాశ్రయాల్లో పనిచేసే ఇతర సిబ్బందికి ప్రత్యేక డ్రస్ కోడ్ ను సిద్ధం చేశాయి. విమాన సిబ్బంది సురక్షితంగా ఉండేందుకు ఫేస్ షీల్డులు, గౌన్లు, మాస్క్ లు, పీపీఈ కిట్లు తదితరాలను అందించాలని నిర్ణయించామని పౌరవిమానయాన సంస్థలు వెల్లడించాయి. ఇందులో భాగంగా ఎయిర్ ఇండియాతో పాటు, ఇండిగో, విస్తారా, ఎయిర్ ఏసియా తదితర సంస్థలు సంయుక్తంగా ఓ నిర్ణయం తీసుకుని, కొత్త వస్త్రధారణను ఖరారు చేశాయి. ఇప్పటికే ఫిలిప్పీన్స్ ఎయిర్ ఆసియా సిబ్బంది గత నెల 27న కొత్త డ్రస్ కోడ్ లో కనిపించగా, ఆప్రాన్స్, గౌన్లు, మాస్క్ లతో విస్తారా ఎయిర్ లైన్స్ సైతం కొత్త డ్రస్ కోడ్ ను తీసుకుని వచ్చింది. ఇప్పటికే విదేశాల నుంచి భారతీయులను ఇండియాకు చేరుస్తున్న ఎయిర్ ఇండియా సిబ్బంది సైతం ప్రత్యేక బడీ సూట్, ఫేస్ మాస్క్, షీల్డ్ గ్లౌజ్ లను అందించగా, త్వరలో ప్రారంభంకానున్న దేశవాళీ సేవల్లోనూ ఇదే డ్రస్ కోడ్ ను అమలు చేయనున్నారు.

150 రోజులకు చేరుకున్న జై అమరావతి ఉద్యమం!

ఇప్పటికైనా రాజధానిగా అమరావతిని కొనసాగిస్తున్నామని ప్రకటించాలని ఎమ్మెల్సీ నారా లోకేశ్ డిమాండ్ చేస్తున్నారు. జై అమరావతి ఉద్యమం నేటితో 150 రోజులకు చేరుకున్న నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్ రైతుల పోరాటాన్ని కొనియాడారు. 'రైతు పోరాటానికి జయహో. లాఠీ దెబ్బలు, అక్రమ కేసులు, ఆవేదనతో ఆగిన గుండెలు. జై అమరావతి ఉద్యమాన్ని అణచివేయడానికి వైకాపా ప్రభుత్వం అడ్డదారులు తొక్కింది. అయినా రైతులు సహనం కోల్పోలేదు' అని చెప్పారు. 'అణచివేయాలనుకున్న ప్రతిసారీ జై అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం సాగుతున్న జై అమరావతి ఉద్యమం నేటితో 150 రోజులకు చేరుకుంది' అని లోకేశ్ ట్వీట్లు చేశారు. 'జై అమరావతి ఉద్యమంలో నేను సైతం అంటూ భాగస్వామ్యం అయిన రైతులు, మహిళలు, యువత అందరికి ఉద్యమ వందనాలు. భేషజాలకు పోకుండా ప్రభుత్వం ఇప్పటికైనా రాజధానిగా అమరావతిని కొనసాగిస్తున్నాం అని ప్రకటించాలి' అని రాష్ట్ర ప్రభుత్వాన్ని లోకేశ్ డిమాండ్ చేశారు.

గంటకు 500 మందికి దర్శనం?శ్రీవారి దర్శనం పై టిటిడి కసరత్తు

ప్రతి రోజు 14 గంటల పాటు భక్తులును దర్శనానికి అనుమతించే విధంగా ఏర్పాట్లను చేయాలని టిటిడి కసరత్తు చేస్తోంది. గంటకి 5 వందల మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి మూడు రోజుల పాటు టిటిడి ఉద్యోగులను అనుమతించేలా ఏర్పాట్లు చేయాలని సమాచారం. అటు తరువాత తిరుమల, తిరుపతిలో వున్న స్థానికులను ప్రయోగాత్మకంగా 15 రోజులు పాటు అనుమతించేలా కార్యాచ‌ర‌ణ రూపొందిస్తున్నారు. రోజుకి 7 వేల నుండి 10వేల మంది భక్తులకు పరిమితం చేస్తుంది. ఆన్ లైన్ లో స్లాట్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకునేలా ఏర్పాట్లు పరిశీలిస్తోంది.మొదట సర్వదర్శనం,ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను భక్తులకు అందుభాటులో వుంచాలని భావిస్తోంది. టిక్కెట్లను పొందిన భక్తులను మాత్రమే అలిపిరి వద్ద అనుమతించేలా ఏర్పాట్లు చేయబోతోంది. ప్రయోగాత్మక పరిశీలన పూర్తి అయిన తరువాత అంచెల వారిగా చిత్తూరు జిల్లా వాసులు... అటు రాష్ర్ట వ్యాప్తంగా భక్తులను అనుమతించాలని టిటిడి భావిస్తున్నట్టు సమాచారం. వసతి గదులను ఇద్దరికి మాత్రమే పరిమితం చేసేలా చేయాలని తెలుస్తోంది.అలిపిరి, నడకమార్గంలోనే భక్తులను క్షుణంగా తనిఖీ చేసేలా కచ్చితమైన నిబంధనలతో ఏర్పాట్లను చేస్తోంది. కరోనా వైరస్ నుంచి పరిస్థితి అదుపులోకి వచ్చిన తరువాత అందరిని దర్శనానికి అనుమతించేలా చేయాలని టిటిడి యోచిస్తోంది.

గ‌ల్ఫ్ నుంచి వ‌చ్చిన‌వారు క్వారంటైన్ కి 30,000/- చెల్లించాలి!

దుబాయ్‌లో పనిచేసే తెలంగాణ వాసులు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ఉపాధి కోసం దుబాయ్‌కు వెళ్లి ఆస్పత్రిలో పనిచేస్తున్నామని.. కరోనా విజృంభణ నేపథ్యంలో తమలో 10 మందికి వైరస్‌ సోకిందని తెలిపారు. వారితో పాటే తమను ఒకే క్యాంపులో ఉంచుతున్నారని.. కనీసం తమకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ‌ల్ఫ్ కార్మికులు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నుండి గల్ఫ్ దేశాలకి ఉపాధి కోసం వలస వెళ్లిన సంఖ్య ఇలా వుంది. దుబాయ్ లో 4,76,000. సౌదీ అరేబియా లో 5,53,163. కువైట్ లో 1,56,054. ఒమాన్ లో 1,33,116. కతర్ లో 1,18,490. బహ్రయిన్ లో 53,196. మొత్తం జనాభా : 14,90,019. గల్ఫ్ నుండి ఇండియన్ బ్యాంకు తెలంగాణ కి వచ్చిన పైసల లెక్క ఇలా వుంది. గల్ఫ్ లో ఉపాధి చేస్తూ ప్రతి నెల ఒకరు కనీసం ఇండియా కి 20,000రూ. ఇరవై వేలు పంపిన కూడా 14,90,019 X 20000 = 29,800,380,000 ఒక నెలకి తెలంగాణ కి పంపినవి. 29,800,380,000 X 12 = 357,604,560,000 ఒక సంవస్సర్రానికి తెలంగాణాకి వచ్చినవి 357,604,560,000 X 6 = 2,145,627,360,000 తెలంగాణ వచ్చిన 6 సంవస్సరాలకి ఇప్పడివరకు వచ్చినవి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ఇంటికి వెళ్ళడానికి బస్సు టికెట్స్ కొంటె వచ్చే ఆదాయం ఇలా వుంది. నిజామాబాదు, కరీంనగర్, వరంగల్ ఎక్కడి నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి వెళ్ళినప్పుడు బస్సు టికెట్ కొనుకుంటే వచ్చిన పైసలు. తెలంగాణ వచ్చిన 6 సంవ‌త్స‌రాల్లో రెండేళ్ళ‌కు ఒక సరి ఇండియా కి వచ్చిన 3 మూడు సార్లు అవుతాది వచ్చి వెళ్ళేటప్పుడు బస్సు టిక్కెట్లు కొంటె తెలంగాణ కి వచ్చే పైసలు వెళ్లిన జనాభా: 14,90,019 మూడు 3 సార్లు వచ్చివెళ్లిన 14,90,019 X 3 = 4,470,057 ఒక సరి 500 రావడానికి 500 పోవడానికి 3,000రూ. 4,470,057 X 3000 = 13,410,171,000 ఇది తెలంగాణ RTC బస్సు లో మనం ప్రయాణం చేస్తే వచ్చిన డ‌బ్బు. 13,410,171,000/- ఇవి బస్సు టికెట్స్ కొంటె వచ్చిన డ‌బ్బు ఇది. 2,145,627,360,000/- ఇవి గల్ఫ్ నుండి ఇండియన్ బ్యాంకు లో కి తెలంగాణ కి వచ్చిన డ‌బ్బులు. విదేశీ మార‌క ద్ర‌వ్యం. ఇన్ని పైసలు మన గల్ఫ్ బిడ్డలు తెలంగాణాకి ఇచ్చిన కూడా కనీసం ఫ్రీ క్వారంటైన్ కూడా పెట్టలేని దుస్థితి తెలంగాణా ప్ర‌భుత్వానిది. 15,000/- మరియు 30,000/- ఒకరికి తీసుకుంటున్నారు. గ‌ల్ఫ్ నుంచి వ‌స్తున్న వారు త‌మ‌ను హోమ్ క్వారంటైన్ కి పంపుతారా? లేక ఫ్రీ క్వారంటైన్ ఇస్తారా? అంటూ తెలంగాణా ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. ఓటు హ‌క్కు వుండి ఉంటే... అదే గ‌ల్ఫ్ నుంచైనా ఓటు వేసే అవ‌కాశం వుంటే రాజ‌కీయ‌పార్టీలు ధృక్ప‌థంలో మార్పు ఉండేదేమో!

ఏపీలో క‌రెంట్ బిల్లు షాక్ కొడుతోంది! బిల్లు చూసి గుడ్లు తేలేస్తున్న జ‌నం!

లిక్కర్‌ దెబ్బతో రాష్ట్ర ఖజనాని నింపుకుంటూ, మందు బాబుల పొట్ట కొడుతున్న ప్రభుత్వం ఇప్పుడు కరెంటు బిల్లులపై దృష్టి పెట్టింది. కరోనా వైరస్‌ కారణంగా ఓ నెల రీడింగులు తీయకపోవడంతో, శ్లాబ్‌లు మారిపోయాయి. అదొక్కటే కారణం కాదు.. ఇతరత్రా కారణాలు కూడా కలిసి బిల్లులు వాచిపోతున్నాయి.. దాంతో, సామాన్యుడి నడ్డి విరిగిపోతోంది. విద్యుత్ శాఖ ఉద్యోగులు 30రోజులకు బిల్ తీయాలి. క‌రోనా కార‌ణంగా బాగా ఆల‌స్యం జ‌రిగింది. దీంతో శ్లాబ్‌ల లెక్క మారిపోయింది. 100 యూనిట్స్ స్లాబ్ వరకు యూనిట్ కి 3.60 రూపాయలు. (ఒక్కొక్క యూనిట్ కాస్ట్.). 2 రోజులు delay చేయడం వల్ల 2 రోజులలో 6 యూనిట్స్ తో కలిపి 106 యూనిట్స్ వొచ్చింది. అంటే అప్పుడు 101 యూనిట్స్ దాటితే పర్ యూనిట్ ధర 6.90 రూపాయలు. ఇక్క‌డే వుంది టెక్నిక్‌. ప్ర‌జ‌లు అన‌వ‌స‌రంగా అంటే మూడు రూపాయ‌ల 60 పైస‌ల స్లాబ్ నుంచి ఆరు రూపాయ‌ల తొంభై పైస‌ల స్లాబ్‌లో బ‌ల‌వంతంగా చేరాల్సి వ‌స్తోంది. లెక్క ఇలా వుంటోంది. కేవ‌లం రెండు రోజులు ఆల‌స్యంగా బిల్ రీడింగ్ చేయ‌డం వ‌ల్ల 6.90 రూపాయల లెక్క ప్రకారం కట్టాలి. అప్పుడు 101 × 6.90 = 690 కట్టవలసి వస్తుంది. 100 యూనిట్స్ కు 390/-, తేడా 690-390=300 అదనం. ఇదే ప్ర‌స్తుతం జ‌రుగుతోంది. రెండు నెలలకు ఒకసారి బిల్లు ఇవ్వడంతో స్లాబులు మారిపోతున్నాయి అని, 4, 5 రేట్లు పెంచి దొంగ లెక్కలతో ప్రభుత్వం ప్రజల్ని దోచుకోవటం దుర్మార్గమని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. మధ్య తరగతి వర్గాలు కరెంట్ బిల్లు పట్టుకుంటే షాక్ కొడుతుందని అన్నారు. లాక్ డౌన్ సమయంలోని కరెంటు బిల్లును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేయ‌డానికి టిడిపి సిద్ధ‌మ‌వుతోంది. అయితే శ్లాబ్‌లు మారిపోయిందంటూ వ‌స్తున్న వార్త‌ల్లో వాస్తవం లేదంటున్నారు అధికారులు. బిల్లింగ్ అనేది ప్రత్యేక సాఫ్ట్‌వేర్ గొడుగు కింద పనిచేస్తుందని.. అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని చెబుతున్నారు. ఎవరో మేధావులు సోషల్ మీడియాలో చేస్తున్నది తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. కరెంట్ బిల్లుల విషయంలో తప్పులు జరగబోవని స్పష్టం చేస్తున్నారు. బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ చాలా కాలం కిందటే సవరించామని, అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు. వినియోగదారుడు 1 బి (1) స్లాబ్ పరిధిలోకి వస్తే, మొదటి స్లాబ్ రేటు 0-100 యూనిట్లకు 3 రూపాయల 30 పైసలు చొప్పున ఉంటే 330 రూపాయల బిల్లు వస్తుంది. అదే బిల్లింగ్ 10 రోజులు ఆలస్యం జరిగినప్పటికీ వినియోగదారుడికి మాత్రం అన్యాయం జరగదని అంటున్నారు అధికారులు. ఒకవేళ 40 రోజుల్లో సదరు వినియోగదారుడు 133 యూనిట్లు కాలిస్తే.. బిల్లింగ్ తేదీని ప్రామాణికంగా తీసుకుని ఆటోమేటిక్‌గా ఆ 133 యూనిట్లు కూడా మొదటి స్లాబ్ పరిధిలోకి వస్తాయే తప్ప రెండో స్లాబ్ లోకి రావని వివరిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో క‌రెంట్ బిల్లుల‌కు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 30వరకు విద్యుత్ బిల్లుల చెల్లింపులు వాయిదా వేయాలని పంపిణీ సంస్థలకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.

సి.ఎం.గారు కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?రాములమ్మ ఆగ్రహం

క‌రోనా వైర‌స్ హైద‌రాబాద్ నగరవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని విజయశాంతి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కరోనా వైరస్ సోకకుండా నియంత్రించేందుకు హైదరాబాద్‌ను టీఆర్ఎస్ ప్రభుత్వం రెడ్‌జోన్‌గా ప్రకటించిందన్నారు. ఈ మహానగరంలో ఆంక్షలను చూస్తున్నప్పుడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లే వెసులుబాటు కూడా లేదని... మరి అలాంటప్పుడు మళ్లీ కేసుల సంఖ్య పెరగడానికి కారణం ఏమిటో ఎవరికీ అంతుబట్టడం లేదని వ్యాఖ్యానించారు. విదేశాల నుంచి వచ్చిన వారికి క్వారంటైన్ సమయం పూర్తి అయ్యిందని ప్రభుత్వం ప్రకటించిందని... మరి తబ్లిక్ జమాత్‌కు వెళ్ళిన వారందరినీ ప్రభుత్వం గుర్తించిందా? వారందరికీ క్వారంటైన్ పూర్తయిందని టీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వగలదా? అని విజయశాంతి ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సూచనల మేరకు దాదాపు రెండు నెలల నుంచి ఇళ్లకే పరిమితమవుతున్న గ్రేటర్ హైదరాబాద్ వాసులకు కరోనా మహమ్మారి నుంచి ఎప్పుడు ఉపశమనం కలుగుతుందో అంతుబట్టడం లేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి అన్నారు. మే నెల 8 తర్వాత తెలంగాణలో కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోతాయని టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రకటనలు చూసి హైదరాబాద్ వాసులు చాలా ఆశలు పెంచుకున్నారని.. కానీ ప్రభుత్వం ప్రకటించిన తేదీ తర్వాత కరోనా కేసులు తగ్గకపోగా... మళ్లీ ఈ మహమ్మారి ఇంకా విజృంభిస్తోందన్నారు. ప్రస్తుతం వలస కూలీల వల్ల కరోనా వ్యాపిస్తోందని టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చిందని విమర్శించారు. అదే నిజమైతే హైదరాబాద్‌ను రెడ్‌జోన్‌గా ప్రకటించడంలో అర్థమేముందని నిలదీశారు. అంటే వలస కూలీలు హైదరాబాదులో విచ్చలవిడిగా తిరిగే అవకాశం ఉందా? ఈ విషయంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఒకవేళ వలస కూలీల వల్ల నగరంలో కరోనా వ్యాప్తి చెందకపోతే.. ఎవరి కారణంగా గత నాలుగు రోజుల పాటు కరోనా కేసులు పెరుగుతున్నాయో స్పష్టత ఇవ్వాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. మొదటి నుంచీ అయోమయ ప్రకటనలతో, అస్పష్ట నిర్ణయాలతో... కరోనా కట్టడి విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వివాదాలకు తావిస్తోందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా సి.ఎం. కేసీఆర్‌ వైఖరిలో మార్పు రావాలని తెలంగాణ సమాజం కోరుకుంటోందని విజయశాంతి తెలిపారు.

క‌రోనా‌తో కలసి బతికేందుకే తెలంగాణా యాక్ష‌న్ ప్లాన్!

తెలంగాణా రాష్ట్రంలో ప్రధానంగా ఆర్టీసీ బస్సులు, క్యాబ్‌లు, ఆటోలు వంటి ప్రజారవాణా పునరుద్ధరణపై ఈ రోజు కీలక నిర్ణయాల్ని తెలంగాణా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌నుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే నెలలో పూర్తి స్థాయి వేతనాలు చెల్లించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై చర్చిస్తారు. జూన్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావాల్సి ఉంది. ఈ విషయాన్ని సైతం ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. కరోనా ఇప్పట్లో తగ్గుముఖం పట్టదని, ఈ వైరస్‌తో కలసి బతికేందుకు అవసరమైన వ్యూహాన్ని ఖరారు చేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. కరోనా నియంత్రణకు రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్‌డౌన్‌కు సంబంధించిన భవిష్యత్తు వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్రం ప్రకటిం చిన సడలింపుల్లో ఇప్పటికే రాష్ట్రంలో కొన్నిం టిని అమలు చేస్తున్నారు. గ్రీన్, ఆరెంజ్‌ జోన్ల పరిధిలో నియంత్రిత పద్ధతిలో చాలావరకు వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల నిర్వహణకు ప్రభుత్వం అనుమతించింది. హైదరాబాద్, రంగారెడ్డి తదితర రెడ్‌ జోన్‌ జిల్లాల్లో మాత్రం ఆంక్షలు యథాతథంగా కొనసాగుతున్నాయి. రెడ్‌ జోన్‌ జిల్లాల్లో కొన్ని సడలింపులకు అనుమతి ఇచ్చే విషయంపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా జీహెచ్‌ఎంసీ మినహా ఇతర రెడ్‌ జోన్‌ జిల్లాల్లో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అక్కడ కొంత వరకు ఆంక్షలు సడలించే అవకాశం ఉంది. అలాగే కేంద్రం జారీ చేసిన కొత్త మార్గదర్శకాల మేరకు ఇతర రాష్ట్రాల్లో చాలా వరకు సడలింపులిచ్చారు.

దేశ‌భక్తి వుంటేనే లోకల్- వోకల్ నినాదం అర్థం అవుతుంది!

భారత ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి ప్రధాని మోదీ రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. లాక్‌డౌన్‌ 4.0 ను సూచిస్తూ, దేశంలో లోక‌ల్‌-వోక‌ల్ ఫార్ములా అమ‌లవుతుంద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. ఈ ఫార్ములా ప్ర‌కారం మ‌న దేశం మునుపటి మాదిరిగా ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందట‌. ప్ర‌స్తుతం అమెరికా దగ్గర యుద్ధ విమానాలు, ఆయుధాలు కొంటున్నాము, ఇజ్రాయెల్ దగ్గర వ్యవసాయ సాంకేతికతని వాడుకుంటునము. ఇతర అన్ని దేశాల కంపెనీలు ఉన్నాయి కియో, ఉంది. ఎల్‌.జి. ఉంది అసలు సాఫ్ట్వేర్ ఎవరిది? గూగుల్ ఎవరిది? ఫేస్ బూక్ ఎవరిది? టిక్ టాక్ ఎవరిది? కెఎఫ్‌సి ఎవరిది? జామోటో ఎవరిది? ఫ‌్లిప్‌కార్ట్ ఎవరిది? నిజంగానే ఇవన్నీ తక్షణమే బహిష్కరణ చేయ‌డానికి భార‌త ప్ర‌భుత్వం నిర్ణ‌యించిందా? విదేశీ వ‌స్తువుల వాడ‌కం వ‌ద్దు. వోక‌ల్ లోక‌ల్ అని చెప్పిన వాళైనా చేస్తారా? అసలు కెఎఫ్‌సి వాళ్ళు నెల రోజుల కింద కోసిన చికెన్ లెగ్ పిసుల్ని ఇండియా కి దిగుమతి చేసుకుంటున్నాం. అలాంటి కెఎఫ్‌సిని మూసేస్తారా? ‌వాల్‌మార్ట్ సూపర్ మార్కెట్ మూసేస్తారా? మన దగ్గర 4 జి టెక్నాలజీ సరిగా లేదు. చైనా, అమెరికా దగ్గర సూపర్ కంప్యూటర్ లు ఉన్నాయి. 7 జి, 8 జి. అంటున్నాడు. కాబట్టి మనం దేశ ప్ర‌జ‌లు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం బహిష్కరించడం కాదు. ప్రభుత్వం విదేశీ పెట్టుబడులు, విదేశీ కంపెనీల్ని బహిష్కరించి స్వదేశీ వస్తువులు ఉపగించేలా చూడాలి. అసలు ప్రభుత్వం దృష్టిలో ఇలా వస్తూ బహిష్కరణ చేయడం చట్ట రీత్యా నేరం. బీజేపీ ఆర్ ఎస్ ఎస్ తమ రాజకీయ పబ్బం గడుపు కోవడానికి ఇలాంటి తప్పుడు ప్రచారాలు అది కూడా అధికారికంగా చెప్పరు కానీ కింది స్థాయి లో మాత్రమే ప్రచారం చేస్తారు. అర్థం చేసుకోవడం రాజకీయ అవగాహన ని బట్టి ఉంటుంది. ఎ మాట వెనక ఎవరి ప్రయోజనం దాగి ఉందొ తెలుసుకోనంత వరకు మోస పోతూనే ఉంటారు దేశ ప్ర‌జ‌లు. అస‌లు మోదీ మాస్టారీ 20 ల‌క్ష‌ల కోట్ల ప్యాకేజ్ కేవ‌లం దేశ‌భ‌క్తుల‌కే అర్థం అవుతుంది. దేశ‌ద్రోహుల‌కు కాదు.

ఏప్రిల్ నెల న‌ష్టం 97 వేల కోట్ల రూపాయలు‌! నగదు లభ్యత లేక చేతులెత్తేస్తున్న రాష్ట్ర ప్ర‌భుత్వాలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల అయిన ఏప్రిల్‌లో దేశంలోని 21 ప్రధాన రాష్ట్రాలకు దాదాపు రూ.97 వేల కోట్ల ఆదాయ నష్టం వాటిల్లినట్లు ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చి సంస్థ అంచనా వేసింది. ఇందులో తెలంగాణకు రూ.5,393 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.5,102 కోట్లు నష్టం వాటిల్లిందని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ నగదు లభ్యత లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ రాష్ట్రాల పరిస్థితి మరింత దయనీయంగా ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. కొవిడ్‌-19పై పోరులో భాగంగా క్షేత్రస్థాయిలో ఖర్చు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నందున అవి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు విశ్లేషించింది. కేంద్రం నుంచి వచ్చే పన్ను వాటాల్లో ఎంత మొత్తం, ఎప్పటికి వస్తుందో తెలియని అనిశ్చితి నెలకొన్నట్లు పేర్కొంది. రాష్ట్ర సొంత ఆదాయ వనరులు పూర్తిగా పడిపోయిన నేపథ్యంలో ఆదాయం కోసం కొత్త మార్గాలు అన్వేషించడం, చేతిలో ఉన్న డబ్బును పొదుపుగా వాడుకోవడం మినహా వాటికి గత్యంతరం లేకపోతున్నట్లు తెలిపింది. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నప్పటికీ 40% ఆర్థిక వ్యవస్థ కొనసాగుతూనే ఉందని పేర్కొంది. మే నెలలో కొన్ని వెసులుబాట్లు కల్పించడంతో పరిస్థితుల్లో కొంతమేర మెరుగుదల ఉండొచ్చని ఇండియా రేటింగ్స్‌ సంస్థ అంచనా వేసింది. ముఖ్యంగా మద్యం అమ్మకాలకు అనుమతివ్వడం వల్ల రాష్ట్రాలపై ఆదాయ ఒత్తిడి కొంతమేర తగ్గే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దేశంలో మహారాష్ట్ర అత్యధికంగా ఒక నెలలో రూ.13,257 కోట్ల మేర ఆదాయం కోల్పోయినట్లు అంచనా వేసింది. ఆయా రాష్ట్రాల బడ్జెట్‌ అంచనాల ఆధారంగా ఈ నష్టాన్ని అంచనా వేసినట్లు వెల్లడించింది.

భారీ తుఫాన్ గండం! దూసుకొస్తున్న 'యాంపిన్'...

బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రాల్లో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఇది నేడు వాయుగుండంగా మారి దక్షిణ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుండగా, దీనికి వాతావరణ శాఖ 'యాంపిన్' అని పేరు పెట్టారు. రేపు సాయంత్రం లేదా ఎల్లుండి ఉదయానికి తుఫాన్ గా రూపాంతరం చెందే యాంపిన్, ఆపై తొలుత వాయువ్య దిశలో, ఆపై ఉత్తర ఈశాన్య దిశలో పయనించి పెను తుఫాన్ గా మారే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే ఉపరితల ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా, దీనికి యాంపిన్ తోడు కానుందని 16 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు. 17వ తేదీన తీరం వెంబడి 80 కిలోమీటర్ల వరకూ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, 18న గాలుల తీవ్రత అధికమవుతుందని హెచ్చరించారు. కాగా, నేడు రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

ఉద్యోగుల తొలగింపు లేదా జీతాల‌ కోత త‌ప్ప‌దంటున్న ప్రైవేట్ సంస్థ‌లు!

కరోనా వైరస్‌, లాక్‌డౌన్ ప్ర‌భావంతో చాలా ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించేందుకు, వేతనాల్లో కోత విధించేందుకు సిద్ధమవుతున్నాయని ఓ సర్వే తెలిపింది. దాదాపు 68% సంస్థలు ఈ దిశగా ఆలోచిస్తున్నాయట‌. కరోనా వైరస్‌ ముప్పుతో అమలు చేసిన లాక్‌డౌన్‌ ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపించడమే ఇందుకు కారణమని స‌ర్వే నివేదిక‌ పేర్కొంది. మైహైరింగ్‌క్లబ్‌.కామ్‌, సర్కారినౌకరి. ఇన్ఫో సంస్థలు సంయుక్తంగా మే1 నుంచి 10 వరకు ఈ సర్వే చేపట్టాయి. దేశవ్యాప్తంగా 25 నగరాల్లో 11 రంగాలకు చెందిన 1,124 కంపెనీలు ఇందులో పాల్గొన్నాయి. దాదాపు 68% కంపెనీలు ఉద్యోగుల వేతనాల్లో కోత విధించేందుకు సిద్ధమవుతున్నాయట. 57% యజమానులు తాత్కాలికంగా ఉద్యోగాలు తీసేస్తామని, 21% మంది రెండేళ్ల వరకు శాశ్వత ఉద్యోగాలు తీసేస్తామని వెల్లడించాయి. ఐతే 32% కంపెనీలు వేతనాలు, ఉద్యోగాల్లో కోతలు విధించడం లేదని చెప్పడం ఆసక్తికరం. రిటైల్‌ అండ్‌ ఎఫ్‌ఎంసీజీ రంగంలో 49%, ఆతిథ్య/వైమానిక/రవాణా రంగాల్లో 48%, ఆటోమొబైల్‌/తయారీ/ఇంజినీరింగ్‌లో 41%, స్థిరాస్తిలో 39%, విద్యుత్‌ రంగంలో 38% ఉద్యోగుల తొలగింపు ఉంటుందని సర్వే వెల్లడించింది. 6-10 ఏళ్ల అనుభవజ్ఞుల్లో 31%, 11-16 ఏళ్ల అనుభవజ్ఞుల్లో 30%, అంత కన్నా ఎక్కువ అనుభవజ్ఞుల్లో 21%, జూనియర్‌ స్థాయి ఉద్యోగుల్లో (1-5 ఏళ్ల అనుభవం) 18% తొలగింపు ఉంటుందని పేర్కొంది. ‘కరోనా మహమ్మారి వల్ల అన్ని పరిశ్రమలు తీవ్ర సంక్షోభాన్ని అనుభవిస్తున్నాయి. అదిప్పుడు పరిశ్రమలోని ప్రతిస్థాయిలో వివిధ రూపాల్లో వ్యక్తమవుతోంది. ఉద్యోగ‌స్తుల్ని తొల‌గించ‌డ‌మా? లేక వారి జీతాల్లో కోత విధించ‌డ‌మే. ఏదో ఒక‌టి చేసే దుస్థితి. క‌రోనా సంక్షోభం నుంచి కంపెనీలు బయటపడగానే కొత్త ఉద్యోగాల సృష్టి మొదలవుతుంది’ అని మైహైరింగ్‌క్లబ్‌, సర్కారి నౌకరీ సీఈవో రాజేశ్‌ కుమార్‌ అన్నారు. వైమానిక, ఆతిథ్య, రవాణా, ఎఫ్‌ఎంసీజీ, ఆటోమొబైల్‌, తయారీ రంగాలు ఎక్కువ ప్రభావం చెందాయని ఆయన తెలిపారు. ఇవి కోలుకొనేందుకు సమయం పడుతుందని పేర్కొన్నారు.

తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల్ని అడ్డుకోరా? ఏపీ చేస్తున్న ఫిర్యాదుల‌న్నీ బుట్ట‌దాఖ‌లేనా?

న్యాయ‌ప‌రంగా త‌మ‌కు రావాల్సిన నీటి వాటాపై తెలంగాణాతో తేల్చుకోవ‌డానికే ఆంధ్ర‌ప్ర‌దేశ్ సిద్ధ‌మౌతోంది. గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులపై గోదావరి నదీ యాజమాన్య సంస్థ (జీఆర్‌ఎంబీ), కృష్ణా నదీ యాజమాన్య సంస్థ (కేఆర్‌ఎంబీ)లను ప్రశ్నించేందుకు ఆంధ్రప్రదేశ్‌ సన్నద్ధమైంది. ఈ మేరకు ఈ రెండు బోర్డులకూ విడివిడిగా రాసిన లేఖలకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆమోదం తెలిపింది. గోదావరి, కృష్ణా బోర్డులకు నేడు విడివిడిగా ఆంధ్ర లేఖలు కేంద్ర జలసంఘానికీ ప్రతులు పంప‌నున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి సంగమేశ్వరం నుంచి శ్రీశైలం కుడి ప్రధాన కాలువ వరకూ నాలుగు కిలోమీటర్ల మేర రోజుకు మూడు టీఎంసీలు తరలించేలా ఎత్తిపోతల పథకానికి రాష్ట్రప్రభుత్వం సిద్ధమైంది. శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను రాయలసీమ దుర్భిక్ష ప్రాంతాలకు పంపే పథకానికి రూ.6,829.15 కోట్లతో పరిపాలనా ఆమోదంతో పాటు పనులు చేపట్టేందుకు ఈ నెల 5న జీవో 203ని విడుదల చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే తమ పథకాలన్నీ కృష్ణా ట్రైబ్యునల్‌ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌ వాటా 512 టీఎంసీలకు లోబడే ఉన్నాయని ఆంధ్రప్రదేశ్‌ స్పష్టం చేస్తోంది. ఇవన్నీ వరద జలాలపై ఆధారపడి నిర్మిస్తున్నామని.. తెలంగాణకు అభ్యంతరం ఏమిటని కృష్ణా బోర్డును ప్రశ్నించనున్నారు. అదే విధంగా కృష్ణా ట్రైబ్యునల్‌ కేటాయింపులకు అదనంగా తెలంగాణ అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తోందని గుర్తుచేయనున్నారు. పాలమూరు-రంగారెడ్డి నుంచి 90 టీఎంసీలు, డిండి రిజర్వాయరు నుంచి 10 టీఎంసీలు, మిషన్‌ భగీరథ నుంచి 19.59 టీఎంసీలు, తుమ్మిళ్ల ఎత్తిపోతల నుంచి 5.44 టీఎంసీలు, భక్తరామదాసు ఎత్తిపోతల నుంచి 5.50 టీఎంసీలు, కల్వకుర్తి సామర్థ్యం పెంచడం ద్వారా 10 టీఎంసీలు, జూరాల ఫోర్‌షోర్‌ నుంచి నెట్టెంపాడు సామర్థ్యాన్ని పెంచడం ద్వారా 3.40 టీఎంసీలు.. మొత్తం 178.93 టీఎంసీల ప్రాజెక్టులను అనధికారికంగా తెలంగాణ నిర్మిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ చెబుతోంది. ఈ మేరకు ఇప్పటికే ఐదు సార్లు కృష్ణా బోర్డుకు లేఖలు రాసింది. వీటిపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆరో లేఖలో నిలదీయనుంది. గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్‌ మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రతిపాదించిన ప్రాణహిత-చేవెళ్లకు ప్రతిరూపమే ఈ ప్రాజెక్టు అని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. సీతారామ ప్రాజెక్టుపైనా ఆంధ్ర అభ్యంతరం చెబుతోంది.

జులై 10 నుంచి భౌతిక దూరం పాటిస్తూ టెన్త్ పరీక్షల నిర్వహణ!

రాష్ట్రంలో జులై 10 నుంచి 15 వ‌ర‌కు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డు వెల్లడించింది. ఈ సారి ప్రతి సబ్జెక్టుకు ఒక్క పేపర్‌తో మాత్రమే పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. 11 పరీక్షల పేపర్లను 6కి కుదించింది. జులై 10న ఫస్ట్‌ లాంగ్వేజ్‌, 11న సెకండ్‌ లాంగ్వేజ్‌, జులై 12న థర్డ్‌ లాంగ్వేజ్‌, 13న గణితం, 14 సామాన్య శాస్త్రం, 15న సాంఘీక శాస్త్రం పరీక్షలు ఉంటాయని తెలిపింది. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తామని ఎస్‌ఎస్‌సీ బోర్డు వెల్లడించింది. కరోనా వైరస్ నేపథ్యంలో పదవ తరగతి పరీక్షలు 11 పేపర్ ల నుంచి ఆరు పేపర్లకు కుదించారు. ప్రతి పేపర్ కు వంద మార్కులు... టెన్త్ పరీక్షలు మారిన పరీక్షా విధానాన్ని మార్చి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భౌతిక దూరం పాటిస్తూ టెన్త్ పరీక్షలను నిర్వ‌హించ‌నున్నారు. Time table సమయం ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు. 10 వ తేదీ తెలుగు, 11వ తేదీ హిందీ , 12వ తేదీ ఇంగ్లీష్ , 13వ తేదీ గణితం , 14వ తేదీ సైన్స్ , 15వ తేదీ సోషల్ స్టడీస్

వలస కార్మికులను కేంద్రం విస్మరించలేదు!

వలస కార్మికులను కేంద్రం విస్మరించలేదని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ చెప్పారు. వలస కార్మికులకు మూడు రకాల ప్రయోజనాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. వచ్చే రెండు నెలలకు ఆహార ధాన్యాలు ఉచితంగా ఇస్తామని ఆమె ప్రకటించారు. రేషన్‌కార్డు లేని వాళ్లకు కూడా ఈ ఆహార ధాన్యాలు అందేలా చర్యలు తీసుకున్నామని ఆమె చెప్పారు. ఇది వలస కార్మికులకు ఊరట కలిగించే విషయం. ఈ పథకం ద్వారా 8 కోట్ల మంది వలస కార్మికులు లబ్ధి పొందబోతున్నారని వివరించారు. ఇందు కోసం రూ. 3500 కోట్లు కేటాయిస్తున్నామని, వలస కార్మికులకు కేంద్రం అందించే ఆహార ధాన్యాలు చేరవేసేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలేనని నిర్మల స్పష్టం చేశారు. కార్మికులు ఎక్కడెక్కడ ఉన్నారో, అందరికీ ఆహార ధాన్యాలు అందేలా చూడాల్సిన బాధత్య రాష్ట్రాలదేనని ఆమె తేల్చిచెప్పారు. రెండు నెలల్లో 11 వేల కోట్లు కేంద్రం నిధులను ఖర్చుపెట్టుకునే వెసులుబాటు రాష్ట్రాలకు కల్పించినట్లు తెలిపారు. కార్మికులకు కనీస వేతనాలు అమలయ్యేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పొరుగు రాష్ట్రాల నుంచి వలస కార్మికులను రప్పించుకునేందుకు సంస్థలకు అవకాశం కల్పించామని, అలాగే సంస్థలతో నేరుగా ఒప్పందం చేసుకున్న కార్మికుల హక్కుల రక్షణకు ప్రత్యేక నిబంధనలు రూపొందించామని నిర్మల వెల్లడించారు.

అన్నదాతలకు రూ 86,600 కోట్ల రుణాలు!

వ్యవసాయం, వలస కార్మికులు, వీది వ్యాపారాలు చేసే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి నిర్మలా సీతారామన్ రెండో ప్యాకేజ్ విడుదల చేశారు. పేదలు, వలస కార్మికులు, రైతు కూలీలుకు చేయూతనివ్వనున్నాట్టు తెలియచేసారు. మొత్తం 9 రంగాలకు ఉద్దీపన చర్యలు ప్రకటించారు నిర్మలా సీతా రామన్. ఇప్పటికే చిన్న కారు, సన్నకారు రైతులకు 4 లక్షలు కోట్లు ఇవ్వగా కొత్తగా 25 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వబోతున్నట్టు తెలియచేసారు. రైతులను ఆదుకునేందుకు ప్యాకేజ్‌లో రెండు పథకాలు పెట్టాం. సన్నకారు రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు. గ్రామీణ మౌలిక వసతులకు రూ 4200 కోట్లు కేటాయించాం. రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తామని, వారి కోసం పలు సంక్షేమ పథకాలు కొనసాగుతాయని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మాలా సీతారామ‌న్‌ ప్రకటించారు. రూ 86,600 కోట్ల వ్యవసాయ రుణాలు ఆమోదించామని తెలిపారు. పాతిక లక్షల మంది నూతన కిసాన్‌కార్డు దారులకు రూ 25,000 కోట్ల రుణం అందచేస్తామని తెలిపారు. మధ్యతరగతి కోసం ప్రత్యేకంగా క్రెడిట్‌ లింక్డ్‌ సబ్సిడీ పథకం ప్రవేశపెడతామని మంత్రి వెల్లడించారు. మార్చి, ఏప్రిల్‌లో రైతులకు రూ 86,600 కోట్ల రుణాల ఆమోదం. చిన్నసన్నకారు రైతులకు రూ 4 లక్షల కోట్ల రుణాల మంజూరు. 25 లక్షల మంది నూతన కిసాన్‌కార్డుదారులకు రూ 25,000 కోట్ల రుణం. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు రాష్ట్రాలకు రూ .6700 కోట్లు నాబార్డు ద్వారా 29,500 గ్రామీణ బ్యాంకులకు నిధులు. రబీలో సన్నకారు, మధ్యతరహా రైతులకు రూ 30 వేల కోట్ల రుణాలు. సహకార బ్యాంకుల ద్వారా 3 వేల కోట్ల మంది రైతులకు అదనంగా రుణాలు ఇవ్వ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు.

రేషన్‌ కార్డు ఉంటే ఎక్కడైనా రేషన్‌ తీసుకోవచ్చు!

ప్ర‌ధాన‌మంత్రి మోదీ ప్రకటించిన రూ.20లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ రెండో రోజు వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీలో భాగంగా ఈ రోజు తొమ్మిది విభాగాల కేటాయింపులను ఆమె మీడియాకు వివరించారు. వలస కార్మికులు, వీధి వ్యాపారులు, స్వయం ఉపాధి, చిన్న, సన్నకారు రైతులు, ముద్ర యోజన, హౌసింగ్‌, ఉద్యోగ కల్పన తదితర అంశాలకు సంబంధించిన కేటాయింపుల వివరాలను ప్రకటించారు. ‘‘రేషన్‌ కార్డు ఉన్న వారు ఎక్కడైనా రేషన్‌ తీసుకోవచ్చు. రేషన్‌ కార్డుదారులందరికీ ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తాం. ఒక్కో వ్యక్తికి 5కిలోల చొప్పున బియ్యం, గోధుమలు పంపిణీ చేస్తాం. ఒక్కో కార్డుపై కిలో పప్పు ధాన్యాలు, రేషన్‌ కార్డు లేనివారు కూడా బియ్యం, గోధుమలు, పప్పు పొందవచ్చు. వలస కార్మికులు ఎక్కడ ఉన్నా.. కార్డు లేకున్నా ఉచితంగా ఆహార ధాన్యాలు పొందవచ్చు. ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. రేషన్‌ కార్డు పోర్టబులిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆగస్టు నాటికి ఒకే దేశం - ఒకే కార్డు విధానం అమలులోకి తీసుకొస్తాం. ప్రస్తుతం 63 కోట్ల మందికి ఈ కార్డు వెసులుబాటు వస్తుంది’’ అని తెలిపారు. ‘సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు మే 31 వరకు వడ్డీ రాయితీ పొడిగిస్తున్నాం. సన్న కారు రైతులకు తక్కువ వడ్డీ రేటుకే రుణాలు గిరిజనులకు ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. కిసాన్‌ కార్డుదారులకు రూ.25వేల కోట్ల రుణాలు. దేశంలో 3 కోట్ల మంది రైతులకు రూ.4.22లక్షల కోట్ల రుణాలు ఇప్పటికే మంజూరుచేశాం. ఈ రుణాలపై మూడు నెలల మారటోరియం కల్పిస్తున్నాం. రైతులకు 25లక్షల కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు అందజేశాం. గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులకు మార్చిలో 29,500 కోట్లు ప్రభుత్వం రీఫైనాన్స్‌ చేసింది. ఇంతటితో వ్యవసాయరంగానికి సాయం ముగిసినట్టు కాదు’’ అని వివరించారు. రాష్ట్రాల మధ్య కనీస వేతనంలో వ్యత్యాసాలు ఉన్నాయి. దేశమంతా ఒక్కటే కనీస వేతనం ఉండేలా చేస్తాం. వసల కార్మికులందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని నిర్ణయించాం. వలస కార్మికులందరినీ ఏజెన్సీల ద్వారా కాకుండా నేరుగా తీసుకొనేలా వెసులుబాటు కల్పిస్తాం. సంస్థలు, కంపెనీలన్నీ నేరుగా కార్మికులను నియమించుకొనేలా ఏర్పాటు. 10 మందికి పైగా ఉపాధి కల్పించే సంస్థలన్నింటికీ ఈఎస్‌ఐ సౌకర్యం కల్పిస్తాం. సుదూర ప్రాంతాల్లో ఉపాధికి వెళ్తున్న కార్మికులకు నైపుణ్యం పెంచేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తాం. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కింద రాష్ట్రాలకు ఇప్పటికే రూ.11,002 కోట్లు కేటాయించాం’’ అని చెప్పారు.

400 మందికి పైగా తెలుగు ఎన్నారైలు చిక్కుకుపోయారు: కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి

లాక్ డౌన్ కు ముందు భారత్ వచ్చిన ఎన్నారైలు లాక్ డౌన్ ప్రకటించడంతో ఇక్కడే చిక్కుకుపోయిన వైనం ఓ యువతి ట్వీట్ కు స్పందించిన చంద్రబాబు కరోనా వైరస్ భూతం ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రూపంలో కష్టాలను తెచ్చిపెట్టింది. విదేశాల్లో ఉంటున్న అనేకమంది ఎన్నారైలు కూడా లాక్ డౌన్ కు ముందు భారత్ వచ్చి ఇక్కడే చిక్కుకుపోయారు. దీనిపై ఓ యువతి చేసిన ట్వీట్ కు టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. 400 మందికి పైగా తెలుగు ఎన్నారైలు ఏపీలోనూ, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయి దురవస్థ ఎదుర్కొంటున్నారని, వారిని ఆదుకోవాలంటూ కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ ను కోరారు. "జయశంకర్ గారూ ఎన్నారైల అంశాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. లాక్ డౌన్ కు ముందు భారత్ వచ్చిన 400 మందికి పైగా తెలుగు ఎన్నారైలు ఇక్కడే నిలిచిపోయారు. ఈ ఎన్నారైల కుటుంబాలు అమెరికాలోనే ఉండిపోయాయి. వీళ్లేమో ఇక్కడ అమెరికా కాన్సులేట్ లో నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల జారీ ప్రక్రియ ప్రారంభం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. దయచేసి ఈ సమస్యను పరిష్కరించండి" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

వ్యాక్సిన్‌ అభివృద్ధిపైనే శాంతా బయోటెక్‌ దృష్టి

హైదరాబాద్‌: కరోనా వ్యాక్సిన్ డెవలప్‌మెంట్‌కు దాదాపు 1000 కంపెనీలు దృష్టి పెట్టాయని శాంతా బయోటెక్‌ వ్యవస్థాపకుడు డా. వరప్రసాద్‌ రెడ్డి అన్నారు. ఆయన గురువారం మాట్లాడుతూ  వ్యాక్సిన్‌ అభివృద్ధిపైనే శాంతా బయోటెక్‌ దృష్టి పెట్టిందని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది మధ్యలో కానీ చివరలో కానీ వాక్సిన్‌ రావచ్చని ఆయన చెప్పారు. రక్షణ విభాగానికే  బడ్జెట్ నిధులు ఎక్కువగా కేటాయించారని ఆయన అన్నారు. వార్షిక బడ్జెట్‌లో విద్య, వైద్యం,ఆరోగ్యం పట్ల చిన్నచూపు ఉందని తెలిపారు. ఇకపై భవిష్యత్‌లో ఆరోగ్యంపై ఎక్కువ నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు.  మేక్ ఇన్‌ ఇండియా పిలుపు మేరకు ఆవిష్కరణలు జరగాలని వరప్రసాదరెడ్డి చెప్పారు. దేశంలో వైద్యుల సంఖ్య పెరగాలని, కరోనా వంటి వివత్తుల కోసం ప్రత్యేక వైద్య బృందాలు ఉండాలని వరప్రసాదరెడ్డి చెప్పారు. జిల్లా కేంద్రాల్లో వైద్య సదుపాయాలు మెరుగు పరచడం అవసరని ఆయన తెలిపారు. భవిష్యత్ అంతా జీవ సాంకేతిక ఆయుధాలదే అని ఆయన చెప్పారు.  భవిష్యత్‌లో ఎవరూ మిస్సైల్స్, ఆయుధాలు వాడరు, అంత ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. భవిష్యత్ దృష్ట్యా అవసరాలు మారాలని ఆయన పేర్కొన్నారు. మేథో సంపత్తిని ప్రోత్సహిస్తే ఆవిష్కరణలు పెరుగుతాయని ఆయన చెప్పారు. లాక్‌డౌన్‌ను పొడిగించుకుని కూర్చుంటే ఇంకా ప్రమాదం ఎక్కువని, జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పోవాల్సిందేనని డా. వరప్రసాద్‌రెడ్డి అన్నారు.

వలస కార్మికుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి: గల్లా జయదేవ్

వలస కార్మికులు విపరీతమైన బాధలు పడ్డారని వెల్లడి ఆర్థికమంత్రిని అభ్యర్థిస్తున్నానంటూ ట్వీట్ ఉపాధి, పునరావాసం కల్పించే ప్యాకేజి కావాలని సూచన గుంటూరు: దేశంలో ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం కోసం ప్రధాని నరేంద్ర మోదీ రూ.20 లక్షల కోట్లతో భారీ ప్యాకేజీ ప్రకటించడం, ఆపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆ ప్యాకేజీలో కేటాయింపుల వివరాలు వెల్లడించడం తెలిసిందే. దీనిపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు. కరోనా సంక్షోభానికి ముందు నుంచే కునారిల్లుతున్న దేశ ఆర్థిక వ్యవస్థకు తాజా ప్యాకేజి ఎంతో ఊతమిస్తుందని, ప్యాకేజీలో భాగంగా ఆర్థికమంత్రి ప్రకటించిన చర్యలు ఆర్థిక రంగ పునరుజ్జీవానికి శుభారంభం పలికే విధంగా ఉన్నాయని ట్విట్టర్ లో వివరించారు. ఈ చర్యలు ప్రధాని ప్రవచించిన స్వావలంబన సిద్ధాంతానికి దన్నుగా నిలుస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు. తాజా ప్యాకేజి, ఆర్థికపరమైన చర్యలతో ఎక్కువగా లబ్దిపొందేది చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగమేనని, ఆ రంగంపై రాయితీల జల్లు కురిపించారని వెల్లడించారు. స్థానిక బ్రాండ్లకు ప్రపంచవ్యాప్త పోటీ ఎదుర్కొనే సత్తాను ఈ ప్యాకేజి అందిస్తుందని భావిస్తున్నట్టు గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. అయితే,  వలస కార్మికులు గత కొన్నివారాలుగా చెప్పనలవిగాని బాధలు పడ్డారని, వలస కార్మికులను ఆదుకునే విధంగా వారికీ ఓ ప్రత్యేక ప్యాకేజి ప్రకటించాలని ఆర్థికమంత్రిని అభ్యర్థిస్తున్నానని పేర్కొన్నారు. వలస కార్మికులకు ఊరట కలిగించేలా ఉండడమే కాకుండా, వారికి సరైన ఉపాధి, పునరావాసం అందించేలా ఆ ప్యాకేజి ఉండాలని సూచించారు.