ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. మరొకరు మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 8,092 శాంపిల్స్‌ను పరీక్షించగా 45 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,452కి చేరుకుంది. నెల్లూరు జిల్లాలో ఒకరు మృతి చెందగా.. కరోనాతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 54కి చేరింది. కొత్తగా 41 మంది కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు మొత్తం 1,680మంది కరోనాను జయించి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 718 మంది చికిత్స పొందుతున్నారు.

ఏపీ ప్రజలు రేపటి నుంచి జాగ్రత్తగా ఉండాలి

ఏపీ ప్రజలు రేపటి నుంచి జాగ్రత్తగా ఉండాలని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకూ రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, వడగాల్పుల ముప్పు కూడా ఉందని తెలిపింది. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్రలో ఎండలు భగ్గుమంటాయని హెచ్చరించింది.  ఇక గుంటూరు జిల్లాలోని రెంటచింతలలో మూడు రోజులుగా 45 నుంచి 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం 47.2 డిగ్రీల  గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారం రాష్ట్రంలో పలుచోట్ల 42-43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని.. రేపటి నుంచి ఆదివారం వరకు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ, యానాంలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీరు లాంటివి ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

కరోనా పేషెంట్ మిస్సింగ్ మిస్టరీ.. కేటీఆర్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసిన మహిళ

తన భర్త కనిపంచడం లేదంటూ మాధవి అనే మహిళ ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. హైదరాబాద్ లోని వనస్థలిపురంలో నివాసముండే తాము కరోనా బారిన పడ్డామని.. అయితే తామంతా కోలుకుని ఇంటికి తిరిగి రాగా తన భర్త మధుసూదన్ జాడ మాత్రం తెలియలేదని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 27న తన భర్తను కింగ్‌ కోఠి ఆసుపత్రిలో చేర్చుకున్నారని, ఆ తర్వాత ఏప్రిల్‌ 30న గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిపారు. తన భర్త గురించి ఆరా తీయగా ఆసుపత్రి సిబ్బంది పొంతన లేకుండా సమాధానం చెప్పారని, ఒకసారి చనిపోయాడని, మరోసారి వెంటిలేటర్ పై ఉన్నాడని సమాధానం ఇచ్చినట్టు ఆమె తెలిపారు. తరువాత మే 1న తన భర్త చనిపోయాడని, మే 2న అంత్యక్రియలు పూర్తి చేశామని ఆస్పత్రి సిబ్బంది చెప్పారని, అయితే ఆ విషయంలో తమ నుంచి అనుమతి తీసుకోలేదని, మృతదేహాన్ని గుర్తించేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని మహిళ మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. కాగా, ఈ ఘటనపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు స్పందిస్తూ మే 1న మధుసూదన్ చనిపోయినట్టు నిర్దారించారు. ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యే నాటికే ఆయన ఆరోగ్యం క్షిణించిందని.. ఆసుపత్రిలో అడ్మిట్ అయిన 23 గంటల్లోనే చనిపోయాడని తెలిపారు. కోవిడ్ నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులకు చెప్పే డెడ్ బాడీని పోలీసులకు అప్పగించామని చెప్పారు. కుటుంబ సభ్యుల నుండి తీసుకున్న సంతకాలు కూడా తమ రికార్డ్స్‌లో ఉన్నాయని అన్నారు. కుటుంబ సభ్యులు దహన సంస్కారాలకి ముందుకు రాకపోతే ఆ కార్యక్రమాలను జీహెచ్ఎంసీ నిర్వహిస్తుందని ఆయన పేర్కొన్నారు.

వైసీపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌.. టీడీపీ ప్రతిపక్ష హోదా పోవడం ఖాయమా?

ఆపరేషన్‌ ఆకర్ష్‌ను వైసీపీ మళ్లీ ప్రారంభించిందా? టీడీపీ ముఖ్య నేతలపై గురి పెట్టిందా? ఇప్పుడిదే టీడీపీలో చర్చనీయాంశమైంది. ఈ కరోనా కష్టకాలంలోనూ..  ప్రతిపక్ష టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీలను తమవైపు రాబట్టుకునేందుకు అధికారపార్టీ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఆపరేషన్‌ ఆకర్ష్‌ కి తెరలేపినట్లు సమాచారం. అయితే అధికారపార్టీ నేతల ప్రయత్నాలకు కొందరు టీడీపీ నేతలు బ్రేకులు వేస్తుండగా, ఒకరిద్దరు నేతలు మాత్రం మాటలు కలుపుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతల పార్టీ మార్పు వ్యవహారంపై విస్తృత చర్చ నడుస్తోంది. విషయం తెలుసుకున్న టీడీపీ అధిష్ఠానం కూడా పార్టీ జిల్లా నాయకులకు ఫోన్లు చేసి మాట్లాడటం ప్రారంభించిందని సమాచారం. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను, ఇతర ముఖ్య నాయకులను టీడీపీకి రాజీనామా చేయించి.. వైసీపీలో చేర్పించేందుకు ఎమ్మెల్యే కరణం బలరాం, ఆయన కుమారుడు కరణం వెంకటేష్ లకు వైసీపీ అధిష్టానం బాధ్యతలను అప్పజెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో కొందరు టీడీపీ ముఖ్య నేతలు పార్టీ మారే ప్రసక్తే లేదని తెగేసి చెబుతుండగా.. మరి కొందరు మాత్రం అధికార పార్టీ నేతలతో మాటలు కలుపుతున్నారట. ముఖ్యంగా టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలే లక్ష్యంగా ఆపరేషన్‍ ఆకర్ష్ ప్రారంభించారట. గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను కూడా వైసీపీలో చేర్పించేందుకు కరణం ప్రయత్నిస్తున్నారని వారితో ఆయన టచ్‍లో ఉంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆ మాజీ ఎమ్మెల్యేలతో నిత్యం చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.  ప్రకాశం జిల్లాలో చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను ప్రధానంగా టార్గెట్ చేశారని తెలుస్తోంది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు వివిధ వ్యాపారాలు నిర్వహిస్తుండడంతో వీరిపై ఒత్తిడి ఉందంటున్నారు. మరోవైపు, ఎమ్మెల్యేల‌ పార్టీ మార్పుపై టీడీపీ అధిష్టానం కూడా అలెర్ట్ అయిందని, వారితో అధినేత మాట్లాడుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మే 30 కి వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది అవుతుంది. మే 30 లోపు పార్టీలో చేర్చుకుని చంద్రబాబుకు ప్రతిపక్షనాయకుని హోదా లేకుండా చేయాల‌నే యోచనలో అధికారపార్టీ ఉందంటున్నారు. అందులో భాగంగానే ముందుగా ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిందని అంటున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ 23 మందిలో ఇప్పటికే ముగ్గురు పార్టీ ఫిరాయించారు. మరో ముగ్గురు కనుక పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతే చంద్రబాబుకు ప్రతిపక్షనాయకుని హోదాపోతుంది. దానికి జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ముహూర్తంగా పెట్టుకున్నారని తెలుస్తోంది. ఆరోజు టీడీపీ నుండి కొందరు నేతలు వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు, ఇదంతా పధకం ప్రకారం వైసీపీ ఆడుతోన్న మైండ్‍ గేమ్‍ అని కూడా టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరూ పార్టీ మారేందుకు సిద్దంగా లేరని అంటోంది. మరి అధికార పార్టీ నిజంగానే ఆపరేషన్‌ ఆకర్ష్ కు తెరలేపిందా? ఆ ఆకర్ష్ కు టీడీపీ నేతలు ఆకర్షితులవుతారా? తెలియాలంటే కొద్దిరోజులు వేచిచూడాలి.

ఆగని కరోనా కేసులు.. యాక్టివ్ కేసుల‌లో టాప్ 5 లోకి భార‌త్!

భారత్‌లో కరోనా కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. గత కొద్దిరోజులుగా ప్రతిరోజూ ఐదువేల‌కు పైగా కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్కరోజులో మరోసారి 5,000 కంటే అధికంగా కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 5,609 మందికి కరోనా సోకినట్లు నిర్దారణ అయింది. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,12,359కి చేరింది. ఇక గత 24 గంటల్లో భారత్‌లో 132 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 3435కి చేరింది. 48,735 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 63,624 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కరోనా యాక్టివ్ కేసుల విష‌యంలో ప్రపంచంలో టాప్ 5 దేశాలలో భారత్ చేరింది. ప్రస్తుతం అమెరికా, రష్యా, బ్రెజిల్, ఫ్రాన్స్‌, భారత్ లలో అత్య‌ధిక యాక్టివ్ కేసులు ఉన్నాయి. అమెరికాలో 1.1 మిలియన్లకు పైగా కరోనా కేసులు ఉన్నాయి. రష్యాలో 2.20 లక్షలకు పైగా, బ్రెజిల్‌లో 1.57 లక్షలకు పైగా, ఫ్రాన్స్‌లో 90 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. భారత్ లో 63 వేలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. అయితే భారత్ లో మిగతా దేశాలతో పోలిస్తే రికవరీ రేటు ఎక్కువగా ఉంది. అలాగే, కరోనా మరణాల రేటు కూడా తక్కువగా ఉంది.

రంగనాయకమ్మ ఎవరు? ఆమె ఫేస్‌బుక్‌ పోస్టులో ఏముంది?

విశాఖ గ్యాస్‌లీక్‌ ఘటనపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టింగ్స్‌ పెట్టారంటూ.. గుంటూరుకి చెందిన పూంతోట రంగనాయకమ్మ(66)కు సీఐడీ అధికారులు‌ నోటీసులిచ్చి, కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. రంగనాయకమ్మపై కేసు నమోదు చేయడం పట్ల ప్రతిపక్ష టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యంగా టీడీపీ నేత నారా లోకేష్.. "అమ్మ వయస్సు ఉన్న వారిని కూడా  కక్షగట్టి, వెంటాడి వేధిస్తున్నారు." అంటూ జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. కాగా, అసలు ఈ  రంగనాయకమ్మ ఎవరు?.. కేసులు నమోదుచేసే అంతలా ఆమె పోస్ట్ లో ఏముంది?.. వంటి అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. గుంటూరు నగరంలో ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన రంగనాయకమ్మ ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉంటారు. నిత్యం తన అభిప్రాయాలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తుంటారు. గుంటూరులోని ప్రముఖ హోటల్‌ శంకర్ విలాస్‌కు ఆమె డైరక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్ లీక్ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, వందల మంది ఆసుపత్రుల పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు కంపెనీ నిర్లక్ష్యమే కారణమని, అలాంటి కంపెనీని ప్రభుత్వం వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలో, 20 పాయింట్ల రూపంలో ప్రభుత్వ తీరుపై అనుమానాలను వ్యక్తం చేస్తూ మల్లాది రఘునాథ్ అనే వ్యక్తి రాసిన ఓ పోస్టును రంగనాయకమ్మ షేర్‌ చేశారు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదానికి సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేశారని, కంపెనీని సీజ్ చేయలేదని, లిక్విడ్ ఎస్సెట్‌గా ఉన్న స్టైరీన్‌ గ్యాస్‌ను తెలివిగా తరలించారని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. వేలిముద్రల కోసం వచ్చే క్లూస్‌టీమ్‌కి ఆధారాలు లేకుండా చేశారని.. పోలీస్ బాస్ పర్యటన పేరుతో లోపల ఉద్యోగుల హాజరును కూడా మార్చేశారని పోస్టులో ఆరోపించారు. ఆధారాలు ధ్వంసం చేస్తే ఐక్యరాజ్యసమితిగానీ, సుప్రీంకోర్టుగానీ, హైకోర్టుగానీ నిజాలు నిగ్గు తేల్చగలవా? అని ప్రశ్నించారు. వ్యూహాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుంటే రాజ్యాంగబద్ధ సంస్థలు, కోర్టులు ఏమీ చేయలేవని అన్నారు. ప్రమాద ఘటన తర్వాత పోలీస్ అధికారి అరెస్టులు మా పనికాదనడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఇక ఆ ఐదు గ్రామాల ప్రజలు ఆశలు వదిలేసుకోవడమే మంచిదంటూ వ్యాఖ్యానించారు. పోస్ట్ చివరలో సేకరణ రఘునాథ్ మల్లాది అని రంగనాయకమ్మ పేర్కొన్నారు. ఈ పోస్ట్‌ ఇప్పుడు రంగనాయకమ్మని చిక్కుల్లోకి నెట్టింది. సీఆర్పీసీ సెక్షన్ 41-ఎ కింద ఆమెకు సీఐడీ అధికారులు నోటీసులు అందించారు. కాగా, ఈ ఘటనపై రంగనాయకమ్మ స్పందిస్తూ.. తానేమీ నేరం చేయలేదు అన్నారు. నేషనల్ మీడియాలో వచ్చిందాన్ని తన ఫేస్ బుక్ మిత్రుడు తెలుగులోకి అనువదించి పెట్టారని, ఇది అందరికీ అర్థమవుతుందని తాను షేర్ చేశానని తెలిపారు. మనకు ఆ మాత్రం స్వేచ్ఛ కూడా లేకపోతే మనగురించి ఆలోచించే అవకాశం కూడా ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు. తాను రాజకీయపార్టీలకు వ్యతిరేకంగా పెట్టలేదని, అంతమంది చనిపోయారనే బాధతో, కేవలం ప్రజలకు సమాచారం అందించేందుకే పోస్టు చేశానన్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలపై హైకోర్టు ఫైర్.. సీబీఐ విచారణ ఎందుకు చేయకూడదు?

వైసీపీ ఎమ్మెల్యేల లాక్‌డౌన్‌ ఉల్లంఘనపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. లాక్‌డౌన్‌ను పాటించాలని ప్రభుత్వాలు చెబుతుంటే.. ప్రజాప్రతినిధులుగా ఉన్నవారే పాటించకపోవడం ఏంటని హైకోర్టు ఫైర్ అయింది.  వైసీపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన సంగతి తెలిసిందే. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సామాజిక దూరం పాటించకుండా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో వీరిపై ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కరోనా వ్యాప్తి చెందేలా వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించారని, వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ దారులు కోరారు. ఇప్పటికే ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు రోజా, మధుసూదన్‌ రెడ్డి, సంజీవయ్య, వెంకట గౌడ్, విడుదల రజనిలకు హైకోర్టు నోటీసులు కూడా ఇచ్చింది. మరో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలపై కూడా హైకోర్టుకు ఫిర్యాదు అందింది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి జన సమూహాలతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించారంటూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, శ్రీదేవిపై న్యాయవాది ఇంద్రనీల్ హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. తాజా పిటిషన్‌తో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలు ఎదుర్కొంటోన్న వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య ఎనిమిదికి చేరింది. వైసీపీ ఎమ్మెల్యేల లాక్‌డౌన్‌ ఉల్లంఘనపై దాఖలైన పటిషన్లను ఈరోజు విచారించిన హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వంపైనా, నిబంధనలను ఉల్లంఘించిన వైసీపీ ఎమ్మెల్యేలపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలను పాటించని ప్రజాప్రతినిధులపై ప్రభుత్వం చర్యలు తీసుకోనప్పుడు.. వారిపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించకూడదని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో, లబ్ధిదారులతో ఇంటరాక్షన్‌లో భాగంగా ఇలా జరిగిందని ప్రభుత్వ తరపు న్యాయవాది సుమన్‌ వాదించారు. ప్రభుత్వం తరపున వివరాలు అందించేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. దీంతో, తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది హైకోర్టు.

యూట్యూబ్ దెబ్బకి ఐసీయూ లోకి పోయిన‌ టిక్‌టాక్

టిక్‌టాక్.. తక్కువ టైంలో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన యాప్. పిల్లల దగ్గర నుంచి పండు ముసలివారి వరకు వయస్సుతో సంబంధం లేకుండా కోట్లల్లో టిక్‌టాక్ కి బానిసలు అయిపోతున్నారు. తమలోని వింత వింత టాలెంట్లని టిక్‌టాక్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. టిక్ టాక్ మోజులో ఉన్నవారు ఎంతున్నారో.. అంతకంటే ఎక్కువే టిక్‌టాక్ అంటే మండిపడేవారూ ఉన్నారు. అయినా టిక్‌టాక్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. కానీ, ఇప్పుడు ఆ లెక్కలన్నీ మారిపోయాయి. టిక్‌టాక్‌కు ఇప్పుడు ఊహించ‌ని దెబ్బ తగిలింది. ఇప్ప‌టివ‌ర‌కూ టాప్ రేటింగ్‌తో, దుమ్ము దులిపే డౌన్‌లోన్ల‌తో దూసుకుపోయిన టిక్‌టాక్‌.. ఒక్కసారిగా చతికిల పడింది. ప్లేస్టోర్‌లో టిక్‌టాక్‌ యాప్ రేటింగ్ 1.3 కి ప‌డిపోయింది. ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో 'యూట్యూబ్ వ‌ర్సెస్ టిక్‌టాక్‌' బాగా ట్రెండ్ అవుతోంది. నెట్టింట ఈ ఫైట్ హోరాహోరీగా సాగుతున్న‌ట్టు కనిపిస్తున్నప్పటికీ యూట్యూబ్‌దే పైచేయి అని చెప్పొచ్చు. ఎందుకంటే, యూట్యూబ్ దెబ్బకి.. ప్లేస్టోర్‌లో టిక్‌టాక్‌ యాప్ రేటింగ్ కలలో కూడా ఊహించని స్థాయికి దిగజారిగింది.  ఎల్విష్ యాద‌వ్ అనే యూట్యూబ‌ర్ టిక్‌టాక్ యూజ‌ర్ల‌ను చెత్త‌తో పోలుస్తూ ఓ వీడియో చేశాడు. ఆ వీడియో బాగా వైరలైంది. ఆ వీడియో చూసి బీపీ తెచ్చుకున్న అమీర్ సిద్ధిఖీ అనే టిక్‌టాక్ యూజ‌ర్‌.. యూట్యూబర్లకు ఏదీ చేత కాదంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. అది విన్నాక యూట్యూబ‌ర్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. టిక్‌టాక‌ర్ల‌ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఒక్కమాటలో చెప్పాలంటే,  చెడుగుడు ఆడేసుకున్నారు.  ఇక స్టార్ యూట్యూబ‌ర్ క్యారీమినటీ‌ మే 8న "యూట్యూబ్ వ‌ర్సెస్ టిక్‌టాక్‌" పేరిట‌ అప్‌లోడ్ చేసిన‌ రోస్టింగ్‌ వీడియోకు వ‌చ్చిన వ్యూస్, లైకులు, కామెంట్లు ప్ర‌తీది రికార్డే. అయితే ఏమైందో ఏమో కానీ, ఎన్నో రికార్డుల‌ను సొంతం చేసుకున్న ఆ వీడియో మే 14 నుంచి యూట్యూబ్‌లో క‌నిపించ‌కుండా పోయింది. ఊహించ‌ని ప‌రిణామంతో క్యారీమిన‌టి క‌ళ్ల‌లో నీళ్లు తిరిగాయి. అది చూసిన‌ అత‌ని భార‌త‌ యూట్యూబ్ అభిమానులు ఆవేశంతో ఊగిపోయారు. క్యారీమిన‌టి వీడియో డిలీట్ చేయ‌డానికి కార‌ణ‌మైన టిక్‌టాక్‌ పై ప్రతీకారం తీర్చుకోవాలని సోష‌ల్ మీడియాలో మంగ‌మ్మ‌ శ‌ఫ‌థం చేశారు. టిక్‌టాక్‌ను డౌన్‌లోడ్ చేసుకుని చీప్ రేటింగ్ ఇచ్చి డిలీట్ చేయాల‌ని ఓ ఉద్య‌మ‌మే న‌డిపారు. దీంతో 4.6తో టాప్‌లో ఉన్న టిక్‌టాక్ రేటింగ్ ఇప్పుడు 1.3 కి దిగ‌జారిపోయింది. రానున్న రోజుల్లో ఇది మ‌రింత పాతాళానికి ప‌డిపోయే అవ‌కాశ‌మూ ఉంది. మొత్తానికి, ఈ దెబ్బ‌కు ఐసీయూ లోకి పోయిన‌ట్లున్న టిక్‌టాక్.. ఈ విప‌త్తు నుంచి ఎలా కోలుకుంటుందో?, అసలు కోలుకుంటుందో లేదో చూడాలి.

ఏపీలో రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు.. పాత ధరలు, కొత్త నిబంధనలు

ఏపీలో రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. గురువారం ఉదయం 7గంటల నుంచి బస్సు సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. విశాఖ, విజయవాడలో మాత్రం సిటీ బస్సులు నడపడం లేదని స్పష్టం చేశారు. అలాగే, అంతర్రాష్ట్ర సర్వీసులపై నిషేధం కొనసాగుతుందన్నారు. అంతరాష్ట్ర సర్వీసులు నడపాలని భావించి, ఆయా రాష్ట్రాల అనుమతి కోసం లేఖలు రాశాం. వారి నుంచి అనుమతి వచ్చాక అంతరాష్ట్ర సర్వీసులు ప్రారంభిస్తామన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని దూర ప్రాంతాలకు నైట్ సర్వీసులు నడపనున్నట్లు వెల్లడించారు. కానీ, బస్ స్టాండ్‌కి రాత్రి 7 లోపు చేరుకోవాలని సూచించారు.  భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టామని.. అలాగే బస్సుల్లో ప్రయాణించే ప్రతి ఒక్క ప్రయాణికుడు మాస్క్ తప్పనిసరిగా ఆదేశించారు. బస్ స్టాండ్‌లలో మాస్క్‌లు అందుబాటులో ఉంటాయి. 10 రూపాయలకు మాస్క్ అమ్మాలని నిర్ణయించామని తెలిపారు. ప్రతి బస్ స్టాండ్‌లో శానీటైజర్ సదుపాయాన్ని కల్పించామని.. బస్సు ఎక్కే ముందు ప్రతి ఒక్క ప్రయాణికుడు శానిటైజర్‌తో చేతులు శుభ్రంగా కడుక్కోవాలని చెప్పారు. టిక్కెట్ల విషయంలో నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌కు రిజర్వేషన్ ఫీజు ఉండదని చెప్పారు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, గూగుల్ పే లాంటి అన్ని రకాల వ్యాలెట్‌ల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చన్నారు. ఆర్టీసీలో కొన్నాళ్లపాటు ఆన్ బోర్డ్ కండక్టర్లు ఉండరని తెలిపారు. అలాగే, బస్సు ఛార్జీలను పెంచట్లేదు అని ఆర్టీసీ ఎండీ స్పష్టం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్ల అమలు కుదరదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, కొల్లు రవీంద్ర సహా పలువురు నేతలు.. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వలేదని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. ఈమేరకు తీర్పు వెలువరించింది.  రాష్ట్రంలో 48.13శాతం ఉన్న బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు. 1992లో ఇందిరా సహానీ కేసులో, 2016లో వచ్చిన జయరాజు కేసులో కొన్ని మినహాయింపులకు అవకాశాలు ఉన్నాయని, ప్రత్యేక పరిస్థితుల్లో 50 శాతం మించవచ్చన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అయితే, అవేమీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదని.. 2010లో రిజర్వేషన్లపై రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పునకే కట్టుబడి ఉండాలని జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచ్ స్పష్టం చేసింది. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాద‌ని తేల్చి చెప్పింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా మొత్తం కలిపినా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని తెలిపింది.

డాక్టర్ సుధాకర్‌ ఉన్న ఆసుపత్రికి వెళ్లి వాంగ్మూలం తీసుకోండి: హైకోర్టు

డాక్టర్ సుధాకర్ పట్ల విశాఖ పోలీసులు దురుసుగా ప్రవర్తించి, అరెస్ట్ చేసిన విషయంపై ఏపీ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ప్రస్తుతం డాక్టర్ సుధాకర్‌ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి ఆయన వాంగ్మూలం నమోదు చేయాలని విశాఖ సెషన్స్‌ జడ్జిని ఆదేశిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రేపు సాయంత్రంలోగా వాంగ్మూలాన్ని సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. మరోవైపు, డాక్టర్ సుధాకర్ పట్ల విశాఖ పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కూడా స్పందించింది. ఈ ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు లేఖ రాసింది.  "డాక్టర్ సుధాకర్ పై పోలీసులు ప్రవర్తించిన తీరు సరికాదు. ప్రభుత్వ వైద్యుడిపై పోలీసులు ఇలా ప్రవర్తించడం కలచివేస్తోంది. వారి తీరును ఐఎంఏ ఖండిస్తోంది. ఐఎంఏకు చెందిన ఓ నిజనిర్ధారణ క‌మిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఎంకు ఈ లేఖ రాస్తున్నాం. సస్పెన్షన్‌ ప్రభావం సుధాకర్ మానసిక ఆరోగ్యంపై పడిందని ఆ క‌మిటీ గుర్తించింది. సుధాకర్‌పై పెట్టిన కేసులను ఉపసంహరించుకోని, ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. ఆయనపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి." అని కోరుతూ ఐఎంఏ లేఖ రాసింది.

జగన్‌ సర్కార్‌ కు షాక్‌.. పోతిరెడ్డిపాడుపై స్టే

పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో ఏపీకి షాక్ తగిలింది. పోతిరెడ్డిపాడు పథకంపై ఎన్జీటీ స్టే విధించింది. పోతిరెడ్డిపాడుపై నారాయణపేటకు చెందిన శ్రీనివాస్ ఎన్జీటీలో ఫిర్యాదు చేయగా, జస్టిస్‌ రామకృష్ణన్‌ నేతృత్వంలోని బెంచ్‌ విచారించింది. పర్యావరణ ప్రభావంపై అధ్యయనం చేయడానికి నాలుగు శాఖల సభ్యులతో ఎన్జీటీ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ, కాలుష్య నియంత్రణ మండలితో పాటు, ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన ప్రొపెసర్లకు కమిటీలో స్థానం కల్పించారు. రెండు నెలల్లో నివేదిక సమర్పించాలని ఎన్జీటీ ఆదేశించింది. కమిటీ నివేదిక వచ్చేవరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని ఎన్జీటీ సూచించింది.

ఏపీలో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఏపీలో కొత్తగా 68 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో 9,159 శాంపిల్స్ ను పరీక్షించగా 68 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణయింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2407కు చేరింది. కరోనాతో కర్నూలు జిల్లాకి చెందిన ఒకరు మరణించడంతో మృతుల సంఖ్య 53కి చేరింది. కాగా గత 24 గంటల్లో 43 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1639 మంది డిశ్చార్జ్‌ కాగా, ప్రస్తుతం ఆసుపత్రుల్లో 715 మంది చికిత్స పొందుతున్నారు.

జూన్ 1 నుంచి రోజూ 200 రైళ్లు

జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా రోజుకు 200 నాన్ ఏసీ, సెకెండ్ క్లాస్ స్పెషల్​ ప్యాసింజర్ రైళ్లు నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఇప్పుడున్న శ్రామిక్ స్పెషల్​, ఎయిర్ కండిషన్డు స్పెషల్​ ట్రయిన్లకు అదనంగా ఈ రైళ్లు నడుస్తాయని.. చిన్న నగరాలు, పట్టణాల ప్రయాణికుల అవసరాలను ఇవి తీరుస్తాయని తెలిపింది. ఇవి రాకపోకలు సాగించే మార్గాలు షెడ్యూల్ ను త్వరలో వెల్లడించనున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది.  ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. అన్ని కేటగిరీల ప్యాసింజర్లు ఆన్ లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. త్వరలోనే బుకింగ్ ప్రారంభమవుతుందని పీయూష్ గోయల్​ ట్వీట్ చేశారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ నుంచి పలు రాష్ట్రాలకు కొన్ని ప్రత్యేక రైళ్లను రైల్వే నడుపుతున్న సంగతి తెలిసిందే. వీటికి తోడు.. వలస కూలీలను తరలించే రైళ్లు కూడా రాకపోకలు సాగిస్తున్నాయి. అలాగే శ్రామిక్ రైళ్లను రెట్టింపు చేశామని, మంగళవారం రాత్రి నుంచి 200 శ్రామిక రైళ్లు నడుపుతున్నట్లు తెలిపారు.

రేపటి నుంచి ఉద్యోగులు తప్పనిసరిగా హాజరు కావాలి

సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులంతా గురువారం నుంచి తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, కంటైన్‌మెంట్‌ జోన్లలో ఉన్న వారికి, గర్భవతులు, ఎక్కువ వయస్సుగల వారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి మాత్రం మాత్రం కాస్త ఊరట ఇచ్చారు. పరిస్థితుల ఆధారంగా వారిని ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతించనున్నారు.  అలాగే ఉద్యోగులు తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పాటించాలని ఉత్తర్వుల్లో సూచించారు. "కార్యాలయాల ద్వారం వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి, చేతులను శానిటైజ్‌ చేసిన తరువాతే లోపలికి పంపిస్తారు. అన్ని కార్యాలయాల్లో ప్రతి రోజు శానిటైజ్‌ చేయాలి. ప్రతీ ఉద్యోగి విధిగా మాస్క్‌ ధరించి విధులకు హాజరు కావాలి. కార్యాలయాల్లో ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలి. రెండు గంటలకోసారి సబ్బు, శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకోవాలి. భౌతిక సమావేశాలు తగ్గించి టెలి, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారానే సమావేశాలను నిర్వహించాలి. ఉద్యోగులు విధుల్లో ఉండగా జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే హోం క్వారంటైన్‌లో ఉండాలి. సంబంధిత అధికారులు సెలవును మంజూరు చేస్తారు." అని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వానికి కృష్ణా బోర్డు లేఖ.. ఏపీ ఫిర్యాదుపై మీ జవాబేంటి?

విభజన చట్టానికి వ్యతిరేకంగా ప్రాజెక్టులు చేపట్టారన్న ఏపీ ప్రభుత్వం ఫిర్యాదుపై సమాధానం చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు కోరింది. ఈ మేరకు బోర్డు సభ్యుడు హరికేశ్‌ మీనా తెలంగాణ ఇరిగేషన్‌ శాఖ ముఖ్యకార్యదర్శికి లేఖ రాశారు. కొత్తగా నిర్మిస్తున్నారని ఏపీ చెబుతున్న ప్రాజెక్టులతో పాటు మరింత నీటిని వినియోగించుకునేలా విస్తరించిన ప్రాజెక్టుల డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్ (డీపీఆర్‌) ఇవ్వాలని సూచించింది.  బోర్డు, కేంద్ర జల సంఘం, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు లేకుండానే.. తెలంగాణ చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి, భక్తరామదాసు, మిషన్‌ కాకతీయ, తుమ్మిళ్ల ఎత్తిపోతలు ప్రాజెక్టులు చేప్పట్టిందని ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. వీటితో పాటు సామర్థ్యాన్ని పెంచిన కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీ వంటి ప్రాజెక్టులపై కూడా ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ ప్రాజెక్టుల కారణంగా తమ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతం, నెల్లూరు, ప్రకాశం వంటి జిల్లాలు తీవ్ర ప్రభావానికి గురికావాల్సి వస్తోందని తెలిపింది. తాము అభ్యంతరం చెబుతున్న ప్రాజెక్టులపై గతేడాది అక్టోబర్‌లో తెలంగాణ వివరణ కోరామని, ప్రాజెక్టుల డీపీఆర్‌ ఇవ్వాలని అడిగినా స్పందించలేదన్న విషయాన్ని ఏపీ బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. ఇప్పటికైనా తెలంగాణ ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాలని కోరింది. దీని పై స్పందించిన కృష్ణా బోర్డు.. ఆయా ప్రాజెక్టులపై అభిప్రాయాలు తెలపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది.  మరోవైపు ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డికి కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి ఎ.పరమేశం లేఖ రాశారు. నాగార్జునసాగర్‌ కుడి కాల్వ, హంద్రీ-నీవా ఎత్తిపోతల, ముచ్చుమర్రి ఎత్తిపోతలకు కేటాయింపుల కంటే ఎక్కువగా నీటిని వాడుకున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడాన్ని ఆపేయాలని కోరారు. నాగార్జునసాగర్‌ కుడి కాల్వకు 158.225 టీఎంసీలు కేటాయిస్తే 158.264 టీఎంసీలు వాడుకున్నారని, హంద్రీ-నీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతలకు 47.173 టీఎంసీలు కేటాయిస్తే 47.328 టీఎంసీలు వినియోగించుకున్నారని లేఖలో పేర్కొన్నారు. నీటి కేటాయింపు ఉత్తర్వులను విధిగా పాటించాలని సూచించారు.

భారత్ లో కరోనా విజృంభణ.. ఒకేరోజు 5,611 పాజిటివ్ కేసులు

భారత్ లో కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. రోజురోజుకి కేసులు పెరుగుతున్నాయి. ప్రతిరోజూ ఐదువేలకి పైగా కేసులు నమోదవుతున్నాయి. తొలిసారిగా 24 గంటల వ్యవధిలో 5,600కు పైగా కేసులు నమోదయ్యాయి. మంగళవారం నాడు దేశవ్యాప్తంగా 5,611 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 140 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,06,750కి చేరగా, వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య  3,303 కి చేరింది. ప్రస్తుతం 61,149 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, 42,297 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

బోనీ కపూర్ ఇంట కరోనా కలకలం

బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. ముంబైలోని బోనీకపూర్ ఇంట్లో పనిచేస్తున్న 23 ఏళ్ల యువకుడు చరణ్‌ సాహూ కి కరోనా సోకింది. శనివారం సాయంత్రం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న అతనిని కరోనా పరీక్ష‌ల నిమిత్తం పంపించగా పాజిటివ్‌ అని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా బోనీ కపూర్ వెల్లడించారు. అయితే.. తనకు గానీ, తన ఇద్దరు కుమార్తెలకు గానీ ఎటువంటి కరోనా లక్షణాలు లేవని తెలిపారు. తన ఇంట్లో పనిచేస్తున్న మిగిలిన సిబ్బందికి కూడా లక్షణాలు లేవన్నారు. లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి తాము బయటకు వెళ్లడం లేదని, ఇంట్లోనే ఉన్నామని చెప్పారు. వైద్యాధికారుల సూచనలను తాము విధిగా పాటిస్తున్నామని, చరణ్‌ సాహూ సైతం త్వరగా కోలుకుని తమ వద్దకు చేరతాడని భావిస్తున్నామని బోనీ కపూర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

కశ్మీర్ లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో దాదాపు 10 గంటల పాటు సాగిన ఎన్‌కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్‌లోని నవకడల్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించారు. నిన్న అర్థరాత్రి ప్రారంభమైన ఆపరేషన్ ఈరోజు మధ్యాహ్నం ముగిసింది. ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్‌ కమాండర్ జునైద్ అష్రఫ్ షహ్రాయ్‌ ‌ను, అతడి సహచరుడిని హతమార్చారు.  ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌లో ఆపరేషన్ ఆల్ ఔట్ పేరుతో కొనసాతున్న ఆపరేషన్‌లో ఇండియన్ ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఇప్పటివరకూ 80 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చారు. ముఖ్యంగా రియాజ్ నైకూ, తాహిర్ అహ్మద్ భట్ వంటి కరడుగట్టిన ఉగ్రవాద నేతలను మట్టుబెట్టారు. మొత్తానికి, ఆపరేషన్ ఆల్ ఔట్ పేరుతో హిజ్బుల్ ముజాహిదీన్, లష్కర్ ఎ తొయిబా, జైష్ ఎ మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెమటలు పట్టిస్తున్నారు.