నిజాయితీగా అమలు చేయండి.. ప్రధానికి రాహుల్ విజ్ఞప్తి

దేశం మొత్తం వలస కార్మికులకు అండగా నిలవాలని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. ఈ రోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలు, వలసకూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. లక్షలాది వలస కార్మికులు కాలినడకన స్వగ్రామాలకు  వెళ్తున్నారని.. వారితో పాటు భావిభారత చిన్నారులు రోడ్లపై వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. భారత నిర్మాణంలో వలస కార్మికులదే కీలక పాత్ర. భవిష్యత్తులోనూ వారు కీలక భాగస్వాములుగా ఉంటారు అన్నారు. ఇప్పుడు వలస కార్మికులకు డబ్బు అవసరం అని తెలిపారు.  పేదలకు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు సాయాన్ని జమచేయాలని ప్రధాని మోదీని కోరుతున్నాను అని రాహుల్ చెప్పారు. చిన్న వ్యాపారులకు ప్రకటించిన ప్యాకేజీని నిజాయతీగా అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం జాగ్రత్తలు వహిస్తూ లాక్‌డౌన్‌ ఎత్తివేతకు చర్యలు చేపట్టాలన్నారు. ఆర్థిక ప్యాకేజి విషయంలో ప్రధాని పునరాలోచించాలన్నారు. కరోనా కంటే ఆర్థిక నష్టం మరింత తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో పేదలు, కూలీలు పడుతున్న ఆవేదనను చూపిస్తోన్న జర్నలిస్టులకు కృతజ్ఞతలు చెబుతున్నాను అని రాహుల్ వ్యాఖ్యానించారు.

శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయం ప్రారంభం.. భారీగా వచ్చిన భక్తులు

లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ రోజు ఉదయం నుంచి మళ్లీ ప్రారంభమయ్యాయి. టీటీడీ ప్రధాన పరిపాలన భవనం వద్ద శ్రీవారి లడ్డూ ప్రసాదం అమ్ముతున్నారు. లాక్‌డౌన్‌ వల్ల 55 రోజుల పాటు నిలిచిపోయిన శ్రీవారి లడ్డూలు విక్రయాలు ఇన్నిరోజులకు మళ్లీ మొదలయ్యాయి. దీంతో, లడ్డూ విక్రయాలు ప్రారంభమయ్యాయని తెలుసుకున్న భక్తులు ఈ రోజు వాటి కోసం భారీగా తరలివచ్చారు. కరోనా వ్యాప్తి కారణంగా భక్తులకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. దర్శనాన్ని నిలిపివేసినప్పటికీ, స్వామి వారి నిత్య కైంకర్యాలను మాత్రం అర్చకులు నిర్వహిస్తున్నారు. సామాజిక దూరం నిబంధనలను పాటిస్తూ త్వరలో పరిమిత సంఖ్యలో భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు.

ఏపీలో మరో 48 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కేసుల తాజా బులెటిన్‌ను వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసింది. ఏపీలో గత 24 గంటల్లో 9,628 శాంపిల్స్‌ని పరీక్షించగా 48 మంది మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. 101 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,205గా ఉందని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 803 మంది చికిత్స పొందుతుండగా, 1353 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో గత 24 గంటల్లో మరొకరు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు ఏపీలో కరొనతో మృతి చెందిన వారి సంఖ్య 49కి చేరింది. రాష్ట్రంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో కర్నూల్‌లో 9, నెల్లూరులో 9, చిత్తూర్‌లో 8, విశాఖలో 4, కృష్ణా 7, గుంటూరు 9, కడప జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది.

కేంద్రం ప్రకటన తర్వాతే తెలంగాణాలో వ్యూహం ఖ‌రారు చేస్తాంః కేసీఆర్

ఈ నెల 17తో ముగుస్తున్న దేశ వ్యాప్త లాక్ డౌన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలను పరిశీలించి, రాష్ట్రంలో అనుసరించే వ్యూహం ఖరారు చేస్తామని సిఎం తెలిపారు. హైదరాబాద్ నగరంలోని నాలుగు జోన్లలో తప్ప, రాష్ట్రంలో ప్రస్తుతం మరెక్కడా కరోనా యాక్టివ్ కేసులు లేవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.  కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు కొనసాగిస్తూనే, వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు రాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్ డౌన్ అమలు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్ శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.  ''తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ హైదరాబాద్ నగరంలోని కేవలం నాలుగు జోన్లకే పరిమితం అయింది. ఎల్.బి.నగర్, మలక్ పేట, చార్మినార్, కార్వాన్ జోన్లలోనే ప్రస్తుతం యాక్టివ్ కేసులున్నాయి. ఈ జోన్లలో 1442 కుటుంబాలున్నాయి.  యాదాద్రి భువనగిరి, జనగామ, మంచిర్యాల జిల్లాలకు చెందిన వలస కూలీలకు కొందరికి వైరస్ సోకినట్లు తేలింది తప్ప, ఆ జిల్లా వాసులకు ఎవరికీ పాజిటివ్ లేదు. ఆ వలస కూలీలు కూడా హైదరాబాద్ లోనే ట్రీట్మెంట్ అందిస్తున్నాం. కాబట్టి ఆ మూడు జిల్లాల్లో పాజిటివ్ కేసులు ఉన్నట్లు పరిగణించడానికి లేదు. పాజిటివ్ కేసులున్న నాలుగు కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాం. లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించి, చికిత్స చేస్తున్నాం'' అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

పొతిరెడ్డిపాడు నిప్పు ఆర‌క‌ముందే ఏపీ-తెలంగాణాల మ‌ధ్య ఇసుక తూఫాన్‌!

మొన్న నీళ్ళు, ఇప్ప‌డు ఇసుక ఏపీ, తెలంగాణ మధ్య మరో కొత్త వివాదం ముసురుకుంది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు అంశం రెండు రాష్ట్రాల్లో వేడి పుట్టిస్తోంది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో రెండు రాష్ట్రాల మధ్య మరో కొత్త వివాదం తలెత్తింది. కర్నూలు జిల్లా గుండ్రేవుల వద్ద తుంగభద్ర నదిలో ఇసుకను తవ్వేందుకు వెళ్లిన ఏపీ వాహనాలను తెలంగాణ అధికారులు సీజ్ చేశారు. ఈ అంశం ఉద్రిక్తతకు దారి తీసింది. తెలంగాణ అధికారుల తీరుపై ఏపీ అధికారులు అసహనం వ్యక్తం చేశారు. అంతర్ రాష్ట్ర ఇసుక సరిహద్దులను గుర్తించేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు గతంలో సర్వే చేశారు. ఏపీ సరిహద్దుల్లోనే ఇసుక తవ్వకాలు జరిగాయని కర్నూలు జిల్లా మైనింగ్ అధికారులు అంటున్నారు. కాదు, కాదు తమ సరిహద్దులో తవ్వకాలు జరిపారని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో. ఈ వివాదపై స్పష్టత రావాల్సిఉంది.  

విశాఖ వాసుల ప్రాణాలతో చెలగాటం.. ఇంకెంత కాలం ఈ నిర్లక్ష్యం?

కరోనా కష్టకాలంలో ప్రజలను మరింత ఆందోళనకు గురి చేసిన ఘటన వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్. ఎల్జీ పాలిమర్స్ లో స్టెరైన్ గ్యాస్ లీక్ కావడంతో దాదాపు 12 మంది మరణించారు. వందల మంది ఆసుపత్రుల పాలయ్యారు. పక్షులు, పశువులు, వృక్షాలపై కూడా ఆ గ్యాస్ తీవ్ర ప్రభావం చూపింది. స్టెరైన్ గ్యాస్ లీక్ ఘటనతో విశాఖ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కంపెనీ సమీపంలోని ప్రజలైతే.. ఇలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతకడం మా వల్ల కాదు. ఆ కంపెనీని అక్కడ నుండి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, విశాఖ ప్రాంతంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఒక్కటే కాదు, అలాంటి ప్రమాదకర కంపెనీలు చాలా ఉన్నాయట. రాష్ట్రం మొత్తంలో అలాంటి ప్రమాదకర కంపెనీలు 80 కి పైగా ఉంటే.. అందులో ఒక్క విశాఖ జిల్లాలోనే 20 కంపెనీలు ఉన్నాయని తెలుస్తోంది. అంటే, ప్రమాదకర కంపెనీలలో దాదాపు 25 శాతం ఒక్క విశాఖ జిల్లాలోనే ఉన్నాయన్నమాట. విశాఖ జిల్లాలో అత్యంత ప్రమాదకరమైన కంపెనీలలో హెచ్‌పీసీఎల్‌ ఒకటి. ఇక్కడ ఎల్‌పీజీ గ్యాస్‌, క్రూడాయల్‌ నిల్వలు లక్షల టన్నుల్లో ఉంటాయి. 1997లో ఎల్‌పీజీ గ్యాస్‌ ట్యాంకులు పేలడంతో పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. ఆ తరువాత కూడా ఈ సంస్థలో చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదవశాత్తూ పెద్ద ప్రమాదం జరిగితే నష్టం ఊహించని స్థాయిలో ఉంటుంది. కోరమండల్ సంస్థ‌ రసాయన ఎరువులు తయారుచేస్తోంది. ఇక్కడ ప్రమాదకరమైన అమ్మోనియం నైట్రేట్‌ను పెద్దమొత్తంలో నిల్వ చేస్తారు. ఈ రసాయనాల ప్రభావం వల్ల పరిసర ప్రాంతాల ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. విశాఖ పోర్టు వల్ల కూడా ప్రజలు కాలుష్యం బారినపడి అనారోగ్యంతో బాధపడుతున్నారు. పోర్టు పరిసరాల్లో నిల్వ చేస్తున్న ప్రమాదకరమైన రసాయనాలు, బొగ్గు నుంచి వచ్చే ధూళి వలన పరిసర ప్రాంతాల ప్రజలు ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నారు. దేశంలో మిగతా పోర్టులు దిగుమతి చేసుకోని ప్రమాదకర రసాయనాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. స్టైరిన్, అమ్మోనియం నైట్రేట్‌, బొగ్గు, సల్ఫర్‌.. ఇలా అనేక రసాయనాలు లక్షల టన్నుల్లో ఇక్కడ నిల్వ చేస్తున్నారు. అవి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని అంటున్నారు. విశాఖ చుట్టుపక్కల గల ఫార్మా కంపెనీల్లో తరచూ రియాక్టర్లు పేలుతుంటాయి. అందులో రసాయనాలు సిబ్బందిపై పడి ఆసుపత్రి పాలవుతుంటారు. ఇక, పరవాడలోని ఎన్‌టీపీసీ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నుంచి వెలువడే బూడిద పిట్టవానిపాలేన్ని పూర్తిగా కలుషితం చేసింది. పరిశ్రమలు, పోర్టులు ఉండటం సహజమే. కానీ, అవి సరైన జాగ్రత్తలు పాటించేలా చేసి, పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. దశాబ్దాలుగా పరిశ్రమలు వస్తున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ ప్రజల ఆరోగ్యానికి, ప్రాణానికి భరోసా ఉండట్లేదు. ప్రమాదం జరిగిన తర్వాత నష్ట పరిహారం చెల్లించే కంటే.. అసలు ప్రమాదమే జరగకుండా సరైన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని, ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదంః 23 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో శనివారం ఉదయం ఆ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలస కూలీలతో వెళ్తున్న ట్రక్కును మరో వాహనం ఢీకొట్టింది. దీంతో 24 మంది వలసకూలీలు మృతిచెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఔరాయా జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. రాజస్థాన్ నుండి యూపీ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. భాదితులంతా వలస కూలీలుగా గుర్తించారు. లాక్‌డౌన్ నేపథ్యంతో వీరంతా రాజస్థాన్ నుంచి స్వరాష్ట్రం ఉత్తరప్రదేశ్‌కు ఓ ట్రక్కులో వస్తుండగా.. ఔరయా నుంచి ఎదురుగా వస్తున్న మరో వాహనం ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఔరయా వద్ద రెండు ట్రక్కులు ఒకదానికి ఒకటి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.. ఎదురెదురుగా అతివేగంతో వస్తున్న ఈ ట్రక్కులు అదుపుతప్పి ఢీకొట్టినట్టు భావిస్తున్నారు.

చిరుత ఎక్కడ? హిమాయత్‌సాగర్‌లో నీళ్లు తాగుతుందా?

హైదరాబాద్‌లో గురువారం నాడు సంచలనం సృష్టించిన చిరుతపులి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రస్తుతం ఎక్కడుంది? ఇవీ ఇప్పుడు జవాబుల్లేని ప్రశ్నలు. డ్రోన్‌ కెమెరాలు, డాగ్‌ స్క్వాడ్స్‌తో జల్లెడ పడుతున్నారు. పగ్‌మార్క్స్‌(పాదముద్రల) ఆధారంగా అది శంషాబాద్‌, మొయినాబాద్‌, చిలుకూరు వైపు వెళ్లి ఉంటుందని అనుమానిస్తున్నారు. చిరుత నగరానికి వచ్చిన దారిలోనే తిరిగి వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు. లాక్‌డౌన్‌ తరుణంలో జనసంచారం, వాహనాల రణగొణధ్వనులు లేకపోవడంతో.. అడవుల నుంచి అటవీ జంతువులు జనావాసాల్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువ. గగన్‌పహాడ్‌లో కనిపించిన చిరుత మొయినాబాద్‌ లేదా కల్వకుర్తి నుంచి వచ్చి ఉంటుంది. చిరుత ఆనవాళ్లను గుర్తించినట్లు రాజేంద్రనగర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ రీసెర్చ్‌ డైరెక్టర్‌ ఆర్‌.జగదీశ్వర్‌ తెలిపారు. శంషాబాద్‌ రోడ్‌ నుంచి యూనివర్సిటీ గేటు వైపు చిరుత వచ్చినట్టు యూనివర్సిటీ నిఘా బృందం గుర్తించిందని ఆయన వెల్లడించారు. ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌ ఆవరణలో ఆరునెలల కాలంలో రెండు సార్లు చిరుత కనిపించిందని అక్కడి సెక్యూరిటీ గార్డులు తెలిపారు. రాజేంద్రనగర్‌, కాటేదాన్‌, గగన్‌పహాడ్‌, చిలుకూరు, మొయినాబాద్‌, శంషాబాద్‌ ప్రాంతాల ప్రజలను బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. బోనులో చిక్కకుండా ముప్పుతిప్పలు పెడుతున్న చిరుత ఎట్టకేలకు కనిపించింది. రాజేంద్రనగర్ హిమాయత్‌సాగర్ వద్ద చిరుత ఆచూకీ లభించింది. హిమాయత్‌సాగర్‌లో నీళ్లు తాగుతుండగా చిరుతను స్థానికులు చూశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు, అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకుని హిమాయత్ సాగర్ వెనక వైపు ఉన్న అజీజ్‌నగర్ ప్రాంతంలో చిరుత కోసం గాలిస్తున్నారు.

భారత్ కి షాక్.. ట్రంప్ దెబ్బ మాములుగా లేదు

చైనాలో మొదలైన కరోనా వైరస్ దెబ్బకి ఓ వైపు ప్రపంచ దేశాలు హడలిపోతుంటే, మరోవైపు ఆ కరోనా వైరస్ అటు తిరిగి ఇటు తిరిగి చైనా మీద కూడా గట్టిగానే ప్రభావం చూపుతోంది. కరోనా దెబ్బకి చైనాలోని కంపెనీలు ఇతర దేశాలకు తరలిపోవాలని చూస్తున్నాయి. ఇదే సదావకాశంగా భావించిన ప్రధాని మోడీ ఆ కంపెనీలను భారత్‌ వైపు ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నారు. అయితే మోదీ చేస్తున్న ప్రయత్నాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నీళ్లు చల్లుతున్నారు. చైనా నుంచి తమ తయారీ కేంద్రాలను అమెరికాకు తరలిస్తే పన్ను రాయితీలు ఉంటాయని ఆశ చూపిస్తున్నారు. అలా కాకుండా భారత్‌, ఐర్లాండ్‌ వంటి దేశాలకు తరలిస్తే ఆయా కంపెనీలపై కొత్త పన్నులు విధిస్తామని హెచ్చరిస్తున్నారు. కరోనా దెబ్బకి చైనా కేంద్రంగా ఉత్పత్తి కార్యకలాపాలు చేపడుతున్న అమెరికా తదితర దేశాల కంపెనీలు ఇతర దేశాలకు వెళ్లాలన్న యోచనలో ఉన్నాయి. వాటిలో యాపిల్‌ వంటి దిగ్గజ కంపెనీలు కూడా ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని అమెరికా ఎత్తులు వేయడం మొదలుపెట్టింది. తమ మాన్యుఫ్యాక్చరింగ్‌ కేంద్రాలతో తిరిగి వచ్చే కంపెనీలకు పన్ను అనేది ప్రోత్సాహకం అవుతుందని ట్రంప్‌ చెప్పారు. అంతేకాదు ఆయన కంపెనీలను అమెరికాకు రప్పించడం కోసం ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌’ అజెండాతో ట్రంప్‌ చర్యలకు ఉపక్రమిస్తున్నారు. అమెరికన్‌ కంపెనీలను తిరిగి తమ దేశానికి రప్పించుకోవడానికి ప్రోత్సాహకాలు ఇవ్వడానికి బదులుగా వేరే దేశానికి వెళితే పన్ను విధించాలని చూస్తున్నారు. మొత్తానికి బ్రతిమాలో, భయపెట్టో ఎలాగైనా అమెరికా కంపెనీలను తిరిగి తమ దేశానికి తీసుకెళ్లాలని ట్రంప్ నానా ప్రయత్నాలు చేస్తున్నారు.

సుప్రీం కోర్టులోనే తేల్చుకుంటానంటున్న ఏపీ స‌ర్కార్‌!

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే ప్రపంచంతో పోటీ పడగలరని పదేపదే ఆయన చెబుతుంటారు. అయితే, హైకోర్టు ఆయన దూకుడుకు బ్రేకులు వేశాయి. ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేయడం కుదరదని తీర్పు ఇచ్చింది. అయితే, కోర్టు తీర్పు ఇచ్చినా ఇంగ్లీష్ మీడియం విషయంలో వెనక్కు తగ్గేందుకు జగన్ సర్కార్ సిద్ధంగా లేదు. ఇందుకు సంబంధించి అన్ని రకాలుగా ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. అయితే, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసి ఇంగ్లీష్ మీడియానికి బ్రేకులు పడేలా చేసిన బీజేపీ నేత సుధీష్ రాంభొట్ల ఇప్పుడు మరోసారి సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. హైకోర్టు తీర్పును ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేయడంతో ఆయన కూడా సుప్రీంలో తన వాదన వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. హైకోర్టు సూచన మేరకు ప్రభుత్వం ఇప్పటికే గ్రామ వాలంటీర్ల ద్వారా తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించింది. 96 శాతానికి పైగా తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలలోనే చదవాలని ఆకాంక్షించారు. మిగతా వారు తెలుగు మీడియం వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు ఈ వివరాలను అన్నీ జతచేస్తూ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. సుప్రీంలో కచ్చితంగా ఇంగ్లీష్ మీడియంకు అనుకూలంగా తీర్పు వస్తుందని ప్రభుత్వం నమ్మకంగా ఉంది. ఇదే సమయంలో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్టీ) కూడా ఇంగ్లీష్ మీడియం అమలుపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేయాలనీ ఎస్‌సీఈఆర్టీ సూచించింది. అయితే, తెలుగు మీడియం కావాలని కోరుకునే వారి కోసం మండలానికి ఒక తెలుగు మీడియం పాఠశాలను కూడా ఏర్పాటు చేయాలని అభిప్రాయపడింది. ఎస్‌సీఈఆర్టీ నివేదిక, మరో వైపు గ్రామ వాలంటీర్ల ద్వారా సేకరించిన తల్లిదండ్రుల అభిప్రాయాలతో సుప్రీం కోర్టులో వాదనలు చేయనుంది ప్ర‌భుత్వం. ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేయాలనేది తల్లిదండ్రుల అభిప్రాయమని, వారి అభిప్రాయాల మేరకే ముందుకు వెళుతున్నట్లు చెప్పబోతోంది. అయితే, తెలుగును తామేమీ నిర్లక్ష్యం చేయడం లేదని, తెలుగును ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలల్లోనూ ఒక సబ్జెక్టుగా తప్పనిసరి చేయబోతున్నట్లు ప్రభుత్వం చేబుతోంది. తెలుగు మీడియం కావాలని కోరుకునే వారి కోసం మండలానికి ఒక తెలుగు మీడియం పాఠశాల కూడా తప్పకుండా ఉంటుందని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ విద్యాసంవత్సరం నుంచే ఒకటవ తరగతి నుంచి ఆరో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో కచ్చితంగా ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేయాలని పట్టుదలగా ఉన్న జగన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు తీర్పు కీలకంగా మారింది.

భూముల అమ్మకం పాలనలో భాగమే

ప్రభుత్వ స్థలాలు అమ్మడం ఇవాళ కొత్తేమీ కాదని.. భూముల అమ్మకాలు పరిపాలనలో భాగమేనని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో భూములు విక్రయించలేదా? అని విపక్షాలను ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న ఖాళీ భూములను విక్రయించి ప్రజల కోసం ఖర్చు పెట్టడం తప్పా? అని నిలదీశారు. భూములు అమ్మడం సీఎం జగన్‌ హయాంలో మొదలైనట్లుగా ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదని మోపిదేవి మండిపడ్డారు. రైతు భరోసా ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 49.56 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. వైకాపా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. సకాలంలో పంట వేసుకోవడం నుంచి అమ్ముకునే వరకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మోపిదేవి భరోసా ఇచ్చారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నట్లు చెప్పారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే రైతు భరోసా కింద 4.52 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ పథకం కింద విడుదల చేసిన రూ.250 కోట్లను ఇవాళ సాయంత్రం లోగా రైతుల ఖాతాల్లో జమచేస్తామని మంత్రి వివరించారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా అన్ని వ్యవస్థలు స్తంభించిపోయాయని మంత్రి అన్నారు. అయితే ప్రభుత్వ పథకాల అమలులో మాత్రం ఆలస్యం జరగడంలేదని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలోనే రాష్ట్రం ముందు వరుసలో ఉందన్నారు. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర వైద్య బృందాలు అభినందించాయని ఆనందం వ్యక్తం చేశారు.

రైతుల పోరాటం స్ఫూర్తిదాయకం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతి కోసం రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న పోరాటం ఒక చరిత్ర అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేపట్టిన ఉద్యమం నేటికి 150 రోజులు అయిన సందర్భంగా ఆయన ట్వీట్‌ చేశారు. ఈ ఉద్యమంలో కులముద్రలు, అవమానాలు, అరెస్టులు, లాఠీ దెబ్బలు ఇలా ప్రభుత్వం పెట్టిన అన్నిరకాల హింసలను తట్టుకుని రైతులు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారని కొనియాడారు.  రాష్ట్ర ప్రయోజనాల కోసం రైతులు 33 వేల ఎకరాల భూములు త్యాగం చేసి రూ.లక్ష కోట్లు సమకూర్చితే.. వైకాపా పాలకులు దాన్ని మట్టిలో కలిపేశారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులు అమ్మి ‘బిల్డ్‌ ఏపీ’ని ‘సోల్డ్‌ ఏపీ’గా మార్చడం అన్యాయమన్నారు. లాక్‌డౌన్‌ సమయంలోనూ రైతులు, రైతు కూలీలు, మహిళల పోరాటం స్ఫూర్తిదాయకమని చంద్రబాబు కొనియాడారు. అమరావతి రైతులకు న్యాయం జరిగేవరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు ఈ సందర్భంగా రైతులకు హామీ ఇచ్చారు.

గ్రామ సచివాలయం పక్కన వైఎస్సార్ జనతా బజార్ ఏర్పాటు చేస్తాం: సీఎం జగన్

రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రైతులు ప్రతిపంటను జనతా బజార్ల ద్వారా అమ్ముకోవచ్చని వెల్లడి జనతా బజార్లు రైతులకు ఉపయుక్తంగా ఉంటాయని వివరణ ఏపీ సీఎం జగన్ రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, 2021 చివరికల్లా ప్రతి గ్రామ సచివాలయం పక్కన వైఎస్సార్ జనతా బజార్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రైతులు పండించే ప్రతి పంటను అమ్ముకునేందుకు వైఎస్సార్ జనతా బజార్లు ఉపయుక్తంగా ఉంటాయని వివరించారు. వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలకు రైతులు కష్టపడకుండా వైఎస్సార్ జనతా బజార్లు సరైన వేదికలుగా నిలుస్తాయని తెలిపారు. అంతేకాకుండా, గ్రామ స్థాయిలోనే కోల్డ్ స్టోరేజి సదుపాయం కల్పించే స్థాయికి అభివృద్ధి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. మున్ముందు రాష్ట్ర, జిల్లా స్థాయిలో వ్యవసాయ బోర్డులు ఏర్పాటు చేయనున్నామని, ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలు ప్రారంభిస్తున్నామని వెల్లడించారు.

పంచెన్ లామా ఎక్కడ?: అదృశ్యంపై చైనాను నిలదీసిన అమెరికా

1995లో ఆరేళ్ల బాలుడిని పంచెన్ లామాగా నియమించిన దలైలామా మూడు రోజుల్లోనే ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్న చైనా అప్పటి నుంచి ఇంతవరకు ఎవరికీ కనిపించని పంచెన్ లామా 1995లో అదృశ్యమైన పంచెన్ లామా ఎక్కడున్నారంటూ చైనాను అమెరికా ప్రశ్నించింది. పంచెన్ లామ్ ఎక్కడున్నారో యావత్ ప్రపంచం తెలుసుకోవాలనుకుంటోందని వ్యాఖ్యానించింది. 1995 మే 14న అప్పటికి ఆరేళ్ల వయసున్న గెద్హూన్ చోక్యీ న్యీమా (టిబెట్ బాలుడు)ను పంచెన్ లామాగా బౌద్ధ గురువు దలైలామా ప్రకటించారు. బౌద్ధ మతానికి సంబంధించి లామా తర్వాతి స్థానం పంచెన్ లామాదే. ఈయనే తదుపరి లామాగా బాధ్యతలను స్వీకరిస్తారు. అయితే న్యీమాను పంచెన్ లామాగా ప్రకటించిన మూడో రోజే ఆయనను చైనా అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి ఆయన మరెక్కడా కనిపించలేదు. ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో కూడా బయటి ప్రపంచానికి తెలియదు. ఆయనను ప్రపంచంలోనే అతి పిన్న రాజకీయ ఖైదీగా మానవహక్కుల సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ అంశంపై అమెరికా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పంచెన్ లామా ఎక్కడున్నారో చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ అంశాన్ని కేవలం దలైలామా వారసుడిని హ్యాండిల్ చేస్తున్న ఎపిసోడ్ మాదిరిగా మాత్రమే చూడొద్దని హెచ్చరించింది. పంచెనా లామాకు నిర్బంధం నుంచి స్వేచ్ఛను కల్పించేలా చైనాపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పింది.  దలైలామా (బౌద్ధమత అత్యున్నత గురువు) వారసుడిని నియమించే అధికారం తనకు ఉందని చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం భావిస్తోందని... ఆ హక్కు వారికి  లేదనే విషయాన్ని చైనా గుర్తుంచుకోవాలని అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ శాఖ రాయబారి శ్యామ్ బ్రౌన్ బ్యాక్ అన్నారు. దలైలామాను నియమించే హక్కు చైనాకు లేదని స్పష్టం చేశారు. బౌద్ధ మతానికి కేంద్ర బిందువుగా, ఎంతో ప్రశాంతంగా ఉండే హిమాలయా దేశం టిబెన్ ను చైనా ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. టిబెట్ తమ దేశంలో అంతర్భాగమని వాదిస్తోంది. దలైలామాను ను కూడా అడ్డుతొలగించే ప్రయత్నం చేసింది. దీంతో, దలైలామాకు మన దేశం ఆశ్రయం కల్పించింది. భారత్ పై చైనా కోపానికి ఇదే కారణమనే విషయం గమనార్హం. మరోపైపు చైనా నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తూ, చైనాకు భయపడి ఎందరో టిబెటన్లు తమ మాతృభూమిని వదిలిపెట్టి... వివిధ దేశాలకు వలస వెళ్లారు. ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో చైనా సొంతంగా ఒక వ్యక్తిని పంచెన్ లామాగా నియమించింది. చైనా విధించిన అత్యంత కట్టుదిట్టమైన ఆదేశాలు, ఆంక్షల మధ్య పబ్లిక్ లో ఆయన కనిపించినా... ఎక్కువ మంది టిబెటన్లు ఆయనను కనీసం గుర్తించలేకపోయారు. చైనా కోరుకుంటున్నది కూడా ఇదే. ఛరిష్మా లేని వ్యక్తి దలైలామాగా ఉంటే... ఆ వ్యవస్థ కనుమరుగవుతుందని చైనా భావిస్తోంది. దలైలామా నియమించిన పంచెన్ లామా గురించి బీజింగ్ కు అనుకూలమైన ఓ అధికారి 2015లో మాట్లాడుతూ... ఆ యంగ్ మేన్ చాలా ఆరోగ్యంగా ఉన్నారని, చదువుకుంటున్నారని చెప్పారు. ఆ తర్వాత ఆయన గురించి ఇంతవరకు ఎవరూ మాట్లాడింది లేదు. ఇప్పుడు ఇదే అంశాన్ని అమెరికా లేవనెత్తింది. యూఎస్ వ్యాఖ్యలపై చైనా ఏ విధంగా ప్రతిస్పందిస్తుందో వేచి చూడాలి.

కాటన్ ని పొగుడుతూ జగన్ కి చురక

ధవళేశ్వరం ప్రాజెక్టు రూపకర్త సర్ ఆర్థర్ కాటన్ జయంతిని పురస్కరించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఓ వైపు కాటన్ గొప్పతనాన్ని ప్రశంసిస్తూనే, మరోవైపు పోలవరం ప్రాజెక్ట్ పనులు ముందుకు సాగట్లేదు అంటూ జగన్ సర్కార్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. "ఒక వ్యక్తి తలుచుకుంటే ఎన్ని అద్భుతాలు చేయవచ్చో కాటన్ మహశయుడు రుజువు చేశాడు. సాంకేతిక పరిజ్ఞానం ఏమాత్రం అందుబాటులో లేని రోజుల్లో రెండు జిల్లాల పరిధిలో ఆనకట్టను, కాలువల వ్యవస్థలను కేవలం అయిదేళ్ల వ్యవధిలో పూర్తిచేసిన కాటన్ సంకల్పం మాటలకు అందనిది." అని ప్రశంసిస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు. "నీటితో ప్రజల తలరాతలను మార్చవచ్చని నిరూపించిన కాటన్ మహానుభావుని స్ఫూర్తితోనే పోలవరం పూర్తికి సంకల్పించి, 70 శాతం పని పూర్తిచేయగలిగింది తెలుగుదేశం. అటువంటి ప్రాజెక్టు ఈ రోజు పడకేయడం బాధాకరం. కాటన్ జయంతి సందర్భంగా ఆ నిస్వార్థ ప్రజాసేవకుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను." అంటూ మరో ట్వీట్ చేశారు.

పోలవరం విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు సాంకేతిక, న్యాయ సలహాదారుగా ఉన్న హెచ్‌కే సాహును తప్పిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జలవనరులశాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్‌ ఉత్తర్వులను జారీ చేశారు.  నెలకు రూ. 2 లక్షల వేతనంతో 2018 ఏప్రిల్‌ 14న అప్పటి ప్రభుత్వం సాహుని కన్సల్టెంట్‌గా నియమించింది. అప్పటి నుండి హైదరాబాద్‌లోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయంలో ప్రాజెక్టు సాంకేతిక, న్యాయ సలహాదారుగా సాహు పనిచేస్తున్నారు. అయితే..  ఆయన పనితీరు సంతృప్తికరంగా లేదని ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు సీఈ నివేదిక పంపారు. దీంతో, కన్సల్టెంట్‌గా సాహును తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా.. ఆయన స్థానంలో ఎవరినైనా నియమిస్తారా? లేదా ఆ పోస్టును పూర్తిగా తొలగిస్తారా..? అన్నది ఆసక్తికరంగా మారింది.

కరెంట్ బిల్లులపై తప్పుడు ప్రచారం.. అసలు మేటర్ ఏంటంటే?

ఏపీలో కరెంట్ బిల్లులు అధికంగా వస్తున్నాయని గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. గతంలో వందల్లో వచ్చే బిల్లులు ఇప్పుడు వేలల్లో వస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాలు కరెంట్ బిల్లులు అధికంగా వస్తుండంపై, జగన్ సర్కార్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. కరోనా కష్టకాలంలో కరెంట్ బిల్లుల రూపంలో ప్రజలను మరింత ఇబ్బందులకు గురి చేస్తుందని ప్రభుతంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారాలపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. విద్యుత్ బిల్లులపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. శ్లాబుల ధరలు పెరగకపోయినా పెరిగినట్టు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్‌ డౌన్‌తో ప్రజలు ఇళ్లల్లోనే ఉండటంవల్ల కరెంట్ వినియోగం పెరిగిందని చెప్పుకొచ్చారు. అదీగాక, ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఏసీ, టీవీల వాడకం వల్ల పెరుగుతుంది అన్నారు. ‘మార్చి, ఏప్రిల్‌ నెలల్లో బిల్లులు ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తున్న బిల్లులను మూడు నెలల సగటు యూనిట్లు లెక్కేసే ఇస్తున్నాం. మూడునెలల బిల్లు ఒకేసారి కట్టాల్సి రావడం వల్లే ఎక్కువ బిల్లు వచ్చినట్లు కనిపిస్తోంది.' అని మంత్రి చెప్పుకొచ్చారు.

పార్టీలకు అతీతంగా రైతులందరికీ పెట్టుబడి సాయం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌’ పథకం ప్రారంభమైంది. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వరుసగా రెండో ఏడాది అన్నదాతలకు సాయం చేస్తున్నామన్నారు.  రైతు కుటుంబాలకు తొలి విడత రూ.7,500 సాయం అందిస్తున్నామని ప్రకటించారు. రైతుల అకౌంట్లలో నేరుగా నగదు జమచేస్తామన్నారు.  ‘పెట్టుబడి సాయం అందించేందుకు రైతు కుటుంబాలకు ఏటా రూ.13,500 సాయం అందిస్తున్నాం. గతేడాది రూ. 6,534 కోట్లు రైతు భరోసా కింద చెల్లించాం. ఇప్పుడు 49 లక్షల మంది రైతన్నలకు లబ్ధి చేకూరేలా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. రైతు భరోసా కింద రూ. 5500 నగదు రైతుల అకౌంట్‌లో జమ అవుతాయి. ఏప్రిల్‌లో 2 వేలు ఇచ్చాం.. ఇప్పుడు రూ. 5500 ఇస్తున్నాం. అక్టోబర్‌లో 4వేలు, వచ్చే సంక్రాంతికి మరో 2వేలు అందజేస్తాం. పార్టీలకు అతీతంగా రైతులందరికీ పెట్టుబడి సాయం చేస్తున్నాం’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.

ఏపీఎస్ ఆర్టీసీ భారీ షాక్.. ఒకేసారి ఆరు వేల మందిపై వేటు

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీఎస్ ఆర్టీసీ భారీ షాకిచ్చింది. ఒకేసారి ఆరు వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి విధులకు హాజరుకావొద్దంటూ వారికి డిపో మేనేజర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్టు సమాచారం.  ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలు కూడా ఇంకా అందలేదు. అసలే ఏప్రిల్ నెల జీతాలు అందక తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న ఉద్యోగులకు.. ఇప్పుడు ఏకంగా ఉద్యోగాలను తొలగిస్తూ ఆర్టీసీ భారీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఆర్టీసీ యాజమాన్యం తీరును తప్పుపడుతున్నాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను యథావిధిగా కొనసాగించాలని కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. బాలకాశి, కార్యదర్శి నూర్ మొహమ్మద్ డిమాండ్ చేస్తున్నారు.