రూ. 22 కోట్లతో తండ్యాం ఎత్తిపోతుల పథకం  ప్రారంభం

శ్రీకాకుళం: ఆమదాలవలస నియోజకవర్గంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న లైదాం ఎత్తిపోతల పథకం 75 శాతం పూర్తి అయ్యిందని స్పీకర్‌ తమ్మినేని సీతారం తెలిపారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మధనాపురం, అన్నంపేట, వెన్నెలవలస, తాళపత్రి, నందివాడలలోని లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పనులకు అనుమతులు వచ్చాయని చెప్పారు.  పెండింగ్‌ సాగునీటీ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించిందన్నారు. రూ. 22 కోట్లతో తండ్యాం ఎత్తిపోతుల పథకం  ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల 2500 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన అన్ని ఎత్తిపోతల పథకాలకు నిధులు విడుదల చేస్తూ జీవోలు విడుదల అయ్యాయని వెల్లడించారు. గత ప్రభుత్వం అక్రమాల వలన ఎత్తిపోతల పథకాలు డిజైన్‌లు మార్చడం, నష్టపరిహారం చెల్లింపులు వివాదస్పదం అయ్యాయన్నారు. నీరు చెట్టు పనుల్లో అక్రమాల వలన సాగునీటి వనరులు నిరుపయోగంగా మారయన్నారు. కరోనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సాగునీటి పథకాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనుమతులను, నిధులను ఇచ్చారని చెప్పారు. నారాయణ పురం ఆనకట్ట వద్ద బ్యారేజీ కం రిజర్వాయర్‌ నిర్మించి ఆయకట్ట స్థిరీకరణ చేయాలని ఆయన పేర్కొన్నారు.

గ్యాస్ ప్రమాదంపై ప్రభుత్వ వైఖరి అనుమానాస్పాదంగా ఉంది: వర్ల రామయ్య

సంచలనం రేపిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన బాధితులపై కేసులు పెడుతున్నారని వర్ల రామయ్య ఆరోపణ శ్వేతపత్రం విడుదల చేయాలంటూ డిమాండ్ వైజాగ్ లో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకైన ఘటన రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపింది. దీనిపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ ప్రమాదంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు. ఈ ఘటనలో బాధితులపైనే కేసులు నమోదు చేస్తూ, ముద్దాయిలను గౌరవిస్తున్న తీరు అభ్యంతరకరం అని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ మొత్తం వ్యవహారాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు.

టెన్త్, ఇంటర్‌ పరీక్షలు రద్దు.. అందరూ పాస్!!

టెన్త్, ఇంటర్ పరీక్షలపై ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెన్త్, ఇంటర్‌ విద్యార్థులను పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు ప్రమోట్‌ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంటర్నల్‌ పరీక్షల్లో వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకొని, పై చదువులకు ప్రమోట్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్‌ విభృంభిస్తున్న తరుణంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం అంత శ్రేయస్కరం కాదు. మరోవైపు, కొత్త విద్యా సంవత్సరానికి కూడా సమయం దగ్గర పడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు, ఫలితాలకు చాలా సమయం పట్టొచ్చు. అదే జరిగితే విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. ఈనేపథ్యంలోనే ఇదివరకు రాసిన ఇంటర్నల్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఆధారంగా ప్రమోట్‌ చేయాలని ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. మరోవైపు, ఇదే దారిలో పంజాబ్‌ ప్రభుత్వం కూడా వెళ్లే అవకాశముందని తెలుస్తోంది.

మ‌న డ‌బ్బులు మ‌న‌కే ఇస్తున్న మోదీ ప్యాకేజ్‌!

ఉద్యోగులకు సంబంధించి ప్రావిడెంట్ ఫండ్‌లో వున్న మొత్తం డ‌బ్బు ఉద్యోగుల‌దే. అయితే ఉద్యోగస్తులు పి.ఎఫ్. డ‌బ్బుల్ని తీసుకునేందుకు తాజాగా క‌ల్పించిన స‌దుపాయ‌న్ని కూడా కేంద్ర‌ప్ర‌భుత్వం 20 ల‌క్ష‌ల కోట్ల ప్యాకేజ్‌లో క‌లిపేసింది. టిడిఎస్‌. ఇది ప్ర‌భుత్వానికి టాక్స్ పేయ‌ర్ నుంచి ముందుగా వ‌సూలు అయ్యే డ‌బ్బు. టాక్స్ ఎక్కువ కానీ, త‌క్కువ కానీ ఉన్న‌చో రిట‌ర్న్ ఫైల్ చేసేట‌ప్పుడు స‌ర్దుబాటు చేయ‌వ‌ల‌సిన మొత్తం. దీనికి 25 శాతం డిడ‌క్ష‌న్ వుంటుంది. ఇంత కాలం ఇంతకాలం ప్రభుత్వం దగ్గరి నుంచి టాక్స్ పేయ‌ర్‌కి వాప‌స్ రావలసిన సొమ్ము చాలా వుంది. న్యాయంగా రావలసిన మొత్తం ఇవ్వక పోగా ఇచ్చిన మొత్తం కూడ సహాయం కింద చూపిస్తోంది కేంద్ర‌ప్ర‌భుత్వం. జిఎస్‌టి పేమెంట్ వాయిదా. ఉత్పత్తి సంస్థ లు వారి ఉత్పత్తి నీ అమ్మునప్పుడు బిల్ చేస్తుంది. కానీ నిజానికి ఆ సొమ్ము రెండు లేదా మూడు నెలల తరువాత వసూలు అవుతుంది. కానీ అయా సంస్థలు బిల్ చేసిన మరుసటి నెలలోనే ఆ టాక్స్ మొత్తానికి ప్రభుత్వానికి చెల్లించాల్సి వుంటుంది. అసలు సంస్థ లు అన్ని మూత పడినప్పుడు, రావాల్సిన అసలు వస్తుందో లేదో నని వేచి చూసే వారికి ఆ టాక్స్ మొత్తమ్ ఎదో ప్రభుత్వమే సహాయం చేసినట్టు దానిని ఈ 20 ల‌క్ష‌ల కోట్ల ప్యాకేజ్‌లో చూపించడం కరెక్ట్ కాదు. దారుణమ‌ని చెప్పాలి. టాక్స్ మొత్తాన్ని జూన్ 30 లోపల ఇంట్రెస్ట్ తో చెల్లించమని ప్రభుత్వం చెపుతున్నది పిపిఇ కిట్స్‌. వీటి ఉత్పత్తి వలన రోగులకు ఇక్కట్లు తగ్గాయి. కానీ local vocal అని, లేదా made in India అని చెప్పుకోవడం నామోషీ. ఎందుకంటే అంతకు ముందు వస్త్ర పరిశ్రామ కుదేలు అయిపోయింది. అక్కడి శ్రామికులకు కొంత దీనివలన ఉపాధి దొరికింది. టీడీఎస్‌ను 25 శాతం తగ్గించడం వల్ల జనాల చేతుల్లో రూ.50,000 కోట్ల వరకు ఉంటాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ మొత్తం లేదంటే పన్నుగా ప్రభుత్వం ఖాతాలోకి వెళ్లేది. నాన్ శాలరైడ్ ఆదాయంపై మూల ధనంపై పన్ను (TDS)ను 25 శాతం తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ ప్రకటన వల్ల పన్ను చెల్లింపుదారుల వద్ద ఎక్కువ నిధులు ఉండే అవకాశం ఉంటుంది. ప్ర‌స్తుత పరిస్థితుల్లో 3 నెలల పాటు కంపెనీలకు చెందిన ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ తామే చెల్లిస్తామని మార్చి నెలలో కేంద్ర ఆర్థికమంత్రి ప్రకటించారు. లాక్ డౌన్ కొనసాగుతుండటం, ఆర్థిక వ్యవస్థ అప్పుడే కోలుకునే పరిస్థితులు లేకపోవడంతో దీనిని మరో 3 నెలలు పొడిగిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగులకు ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్‌ను మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. మోడీ ప్రభుత్వం మరో మూడు నెలల పాటు 72 లక్షల మంది ఉద్యోగుల ఈపీఎఫ్‌ను చెల్లిస్తుంది. రూ.15వేల లోపు వేతనం కలిగిన వారికి ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ చేస్తున్నట్లు గతంలోనే చెప్పారు. ఇప్పుడు కూడా ఇదే వర్తిస్తుంది. అంటే ఇప్పటికే మార్చి, ఏప్రిల్, మే నెలల ఈపీఎఫ్‌ను చెల్లించింది. ఇప్పుడు మరో 3 నెలల పొడిగింపు వల్ల జూన్, జూలై, ఆగస్ట్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ప్రయివేటు సెక్టార్ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు ఈ మూడు నెలల పాటు ఈపీఎఫ్ మొత్తాన్ని 12 శాతం బదులు 10 శాతం చెల్లించే వెసులుబాటును కల్పించింది. యజమానులు ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ కేంద్ర ప్రభుత్వమే చేయడం వల్ల కంపెనీలు తమ వంతు ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు ప్రయివేటు కంపెనీ యజమానుల చేతిలో లిక్విడిటీ ఉండే అవకాశం ఉంటుంది.

వైద్య సేవల్ని పునః ప్రారంభించిన కేర్!

ఔట్ పేషంట్ డిపార్ట్‌మెంట్‌లను గ్లాస్ పార్టీషన్స్‌తో పునః రూపకల్పన చేశాం. తద్వారా రోగి మరియు డాక్టర్ నడుమ కాంటాక్ట్‌ను వీలైనంతగా తగ్గించాం. అలాగే ఎవరైనా ప్రాంగణం లోపలకు అడుగుపెడితే, మూడు దశల స్క్రీనింగ్ ప్రక్రియను వారు దాటాల్సి ఉంటుంది. శస్త్రచికిత్స కోసం వచ్చే రోగులకు మేము ఇప్పుడు సింగిల్ రూమ్స్‌ను కేటాయిస్తున్నాం అలాగే విభిన్నమైన వైద్య అవసరాల కోసం విభిన్నమైన వైద్య బృందాలను కేటాయిస్తున్నాం. తద్వారా కేవలం ఆ డాక్టర్ మరియు నిర్ధేశించిన పారామెడిక్ వ్యక్తులు మాత్రమే రోగి వద్ద కు చేరతాదరనే భరోసానూ కలిగిస్తున్నాం” అని లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ ఏకె దాస్అన్నారు. కోవిడ్-19 వ్యాప్తి చెందడం కారణంగా ఆస్పత్రులకు వచ్చే రోగుల సందర్శనలపై కూడా పలు నియంత్రణలను విధించింది. ఆఖరకు అతి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారు సైతం ఈ మహమ్మారి కారణంగా హెల్త్‌కేర్ ఇనిస్టిట్యూషన్స్‌ను సందర్శించకుండా ఇది అడ్డుకుంది. “అయితే, గతంలోనే వైద్య పరమైన చికిత్స అవసరమై ఉండి తక్షణమే వైద్య సహాయం అందుకోవాల్సిన వారు ఎక్కువ కాలం తమ చికిత్సను ఆలస్యం చేసుకోవడం సూచనీయం కాదు. ఎందుకంటే వారు ఈ అంటువ్యాధుల బారిన పడేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది మరియు కొంతమంది ఆరోగ్యంపై కూడా అది తీవ్ర ప్రభావం చూపవచ్చు” అని డాక్టర్ నిఖిల్ మాథుర్ అన్నారు. “ప్రభుత్వం ఇప్పుడు పాక్షికంగా నిబంధనలను సడలించడం కారణంగా కేర్ హాస్పిటల్స్ తమ సాధారణ పేషంట్ కేర్‌ను పూర్తి స్థాయిలో విస్తృతమైన ముందు జాగ్రత్త చర్యలు, భౌతిక దూర మార్గదర్శకాలను అమలులోకి తీసుకువచ్చి అందిస్తుంది. కేర్ హాస్పిటల్స్ వద్ద, మా రోగుల ఆరోగ్యం, భద్రత అనేవి అతి ముఖ్యమైనవి మరియు అవసరమైన అంటువ్యాధుల నియంత్రణ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటం ద్వారా వారి భద్రత మరియు చక్కటి ఆరోగ్యానికి హామీనిస్తుంది”. మిషన్ సురక్షః కోవిడ్ -19 నేపథ్యంలో సాధారణ పరిస్ధితులను పునరుద్ధరించడానికి కట్టుబడిన కేర్ హాస్పిటల్స్ అత్యంత కఠినమైన భౌతిక దూరం మరియు అంటువ్యాధులను నియంత్రించేందుకు అంటువ్యాధుల నియంత్రణ మార్గదర్శకాలను అమలు చేస్తోంది. ఔట్ షేషంట్ డిపార్ట్‌మెంట్స్ (ఓపీడీలు), ఎలిక్టివ్ కేర్ సేవలు సహా తమ అన్ని వైద్య సేవలనూ పునః ప్రారంభిస్తున్నట్లు కేర్ హాస్పిటల్స్ వెల్లడించింది.

20 లక్షల కోట్లకు ఎన్ని సున్నాలుంటాయి...?

20 లక్షల కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో అర్థం కాక దేశ ప్ర‌జ‌లు జుట్టు పీక్కుంటున్నార‌ట‌.2014 నుండి అంధ్రప్రదేశ్ కు ఒక లక్ష కోట్లు ఇచ్చాము అని అప్ప‌ట్లో మోదీ ప్ర‌‌భుత్వం ఏవో కాకి లెక్కలు చూపించినట్లుగానే ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజి? మోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ సామాన్యుడికి ఉపయోగం లేదని కాంగ్రెస్ పార్టీ విమ‌ర్శిస్తోంది. కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజి వల్ల పేదలకు వచ్చే లాభం ఏంటి? కార్మికులను, వలస కూలీలను , రైతులను పట్టించుకోకుండా కేవలం పారిశ్రామిక వర్గాల పక్షంగా కేంద్ర ప్ర‌భుత్వం వ్యవహరించిందని కాంగ్రెస్ పార్టీ అంటోంది. మరో సారి సూటు - బూటు సర్కారు అని మోడీ ప్రభుత్వం రుజువు చేసుకుంద‌ని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. కరోనా నుంచి దేశాన్ని కాపాడాల్సిన కేంద్రం ప్రజల జీవితాలు గాలికి వదిలేసింది. ఆర్థిక పరిపుష్టి పెంచే చర్యల పేరుతో పేదల కడుపుకొడుతోంది. వలస కూలీల పైన కరుణించని మోడి సంస్కరణల పేరుతో ఉన్న ఉపాధి పోగొట్టేలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు రూ.3 లక్షల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్ర‌క‌టించారు. దేశంలోని మొత్తం 6.3 కోట్ల ఎంఎస్ఎంఈల్లో 45 లక్షల ఎంఎస్‌ఎంఈలకు మాత్రమే నిర్మలా ప్యాకేజీ అనుకూలంగా ఉంది. ప్రకటించిన ప్యాకేజీలో వలస కూలీలకు వాటా లేకపోవడాన్ని బాధాకరం. లాక్‌డౌన్‌ కారణంగా ఆకలితో అలమటిస్తూ వందల కిలోమీటర్లు ప్రయాణిస్తున్న వలస కార్మికుల గురించి ప్రస్తావించకపోవడం, వారిని ఆదుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరం. దేశంలోని పేదలకు డబ్బుల పంపిణీలో కూడా ప్రభుత్వం విఫలమైందన్నారు. 13 కోట్ల కుటుంబాలు లాక్‌డౌన్‌ కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. ప్రభుత్వ చెబుతున్న సాయం వారిని ఈ కష్టాల నుంచి కాపాడలేకపోయింది. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో ఇప్పటి వరకు కేంద్రం 3.6 లక్షల కోట్లు మాత్రమే ప్రకటించింది. మిగిలిన 16.4 లక్షల కోట్లు ఎక్కడ ఉన్నాయి? ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాలి. కానీ అలా చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎక్కువ రుణాలు తీసుకోవాలి. కానీ ఈ ప్రభుత్వం అలా చేయదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ రుణాలు తీసుకోవాడానికి, ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయడానికి అనుమతించాలి. కానీ ఈ ప్రభుత్వం ఆ పని చేయడానికి సిద్ధంగా లేదు’ అసలు సమస్య ఏంటి అంటే అంత పెద్ద డబ్బు ప్రభుత్వం ఎలా సమకూర్చుతుంది. కొత్తగా ముద్రిస్తుందా !! అలాంటి అవకాశమే లేదు. (ప్రభుత్వం కేవలం 2 లక్షల కోట్లు మాత్రమే ముద్రించే అవకాశం ఉంది.) RBI ప్రధాన మరియు ద్వితీయ మార్కెట్లలో నుండి G-secs కొనుగోలు చేయనుందని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి, ఇదే నిజమైతే ప్రజలు వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుంది, ఇది మొత్తం దేశం మునిగిపోయేలా చేస్తుంది. ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనం కోసం చూస్తుంది. నిజమైన అవసరం ఉన్న వాళ్ళకి ఇది అందినప్పుడే ప్రభుత్వం ప్రకటించిన ఈ ప్యాకేజీ విజయం సాధించినట్టు. ఈ నగదు పంపిణీ కూడా ప్రభుత్వ బ్యాంకుల మీద పెడితే, నోట్ల కొరతలో దేశం ఇబ్బందుల పాలవుతుంది. ఈ సొమ్మును మళ్ళీ బడా బడా కంపెనీలకు అప్పులు ఇస్తే మళ్లీ అవి NPAలు ( non-performing- asserts ) గా మారే ప్రమాదం లేకపోలేదు, ఇది కూడా ప్రజల మీద భారంగా మారుతుంది. చిన్న,మధ్య తరగతి పరిశ్రమలకు ఈ ప్యాకేజి అందేలా ప్రభుత్వం చూడాలి, అప్పుడే ఈ ఆర్ధిక సమస్య నుండి బయట పడే అవకాశం ఉంటుంది. covid వల్ల నష్టపోయిన వారి జాబితాను ప్రభుత్వం సిద్దం చెయ్యాలి. ఈ పని కూడా బ్యాంకుల మీద వదిలేస్తే వాళ్ళు మళ్ళీ అదే పెద్ద పెద్ద కార్పరేట్ లకు లాభం చేసేలా పనిచేస్తాయి. ఇలాంటి ప్రభుత్వ ప్యాకేజిలు కాగితాల మీద ఎంత బాగున్నా, అవి పేద వాడికి చేరడంలో మాత్రం ఎప్పడు విజయం సాదించలేదు.

బకాయిలు చెల్లిస్తా! కేసు మూసేయండి: విజయ్ మాల్యా ట్వీట్‌!

ఇండియాలోని ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాను చెల్లించాల్సిన పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని, దయచేసి ఆ డబ్బును బేషరతుగా తీసుకుని కేసును మూసివేయాలని యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యా వేడుకున్నాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. ఇదే సమయంలో ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీపై సెటైర్లు కూడా వేశారు. "కొవిడ్ 19 రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. వారు తమకు కావాల్సినంత డబ్బును ముద్రించుకోగలరు. కానీ నా వంటి చిన్న వ్యక్తి, బ్యాంకులకు చెల్లించాల్సిన 100 శాతం మొత్తాన్ని ఇస్తానంటే మాత్రం తీసుకునేందుకు అంగీకరించడం లేదు. దయచేసి నా డబ్బు బేషరతుగా తీసుకుని క్లోజ్ చేయండి" అని ట్వీట్ చేశారు. ఇండియాలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలను తీసుకున్న మాల్యా, వాటిని చెల్లించడంలో విఫలమై బ్రిటన్ కు పారిపోయాడు. అతన్ని ఎలాగైనా ఇండియాకు రప్పించేందుకు సీబీఐ, ఈడీ, బ్యాంకుల కన్సార్టియం అక్కడి కోర్టులలో పోరాడుతున్నాయి.

కాటేదాన్‌ బ్రిడ్జి వ‌ద్ద‌ గాయాలతో చిరుత హ‌ల్‌చ‌ల్‌!

రంగారెడ్డి జిల్లాలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధి కాటేదాన్‌ అండర్‌ బ్రిడ్జి వద్ద స్థానికులు చిరుతను గుర్తించారు. గాయాల కారణంగా చిరుత ఎటూ కదలలేని పరిస్థితి. ఆందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రహదారిపై రాకపోకలను నియంత్రించారు. చిరుతను చూసేందుకు జనం భారీగా గుమికూడారు. ఓ చిరుతపులి రోడ్డుపైన క‌నిపించ‌డం హైదరాబాద్‌లో కలకలం సృష్టించింది. జాతీయరహదారి ఎన్‌హెచ్‌-7 పై గాయపడిన చిరుతను స్థానికులు గుర్తించారు. చిరుతపులి ఒంటినిండా గాయాలున్నాయి. దీంతో రోడ్డుపై ప్రయాణించేందుకు ప్రజలు భయపడ్డారు. స్థానికులు అటవీశాఖకు సమాచారం అందించారు. ట్రాఫిక్‌ను నిలిపివేసి చిరుతను బంధించేందుకు ఫారెస్ట్‌ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ చిరుత ఎక్కడనుండి వచ్చింది, దాని ఒంటి నిండా గాయాలు ఎందుకున్నాయి అనే విషయాలు తెలియడం లేదు.

డీఎస్సీ-2008 అభ్యర్థులకు తాత్కాలిక ఉద్యోగాలు!

డీఎస్సీ-2008 అభ్యర్థులకు తాత్కాలిక ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. కనీస టైం స్కేల్‌తో ఉద్యోగాలు ఇచ్చేందుకు అనుమతించింది. డీఎస్సీ-2008లో సెకండరీ గ్రేడ్‌ టీచర్ల (ఎస్జీటీ) పోస్టులకు మొదట డీఈడీ వాళ్లకే అవకాశం కల్పించారు. దీనిపై బీఈడీ అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా డీఈడీ వాళ్లకు 30శాతం పోస్టులే కేటాయించారు. దీంతో మొదట పోస్టులు వచ్చిన డీఈడీ అభ్యర్థులు పోస్టు కోల్పోవాల్సి వచ్చింది. ఈ అభ్యర్థుల వినతి మేరకు గత ప్రభుత్వం ఎమ్మెల్సీలతో కమిటీ వేసింది. కనీస వేతనంతో వీరికి పోస్టింగ్‌ ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసింది. దీనికి ప్రస్తుతం ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. డీఎస్సీ-2008కి సంబంధించిన అభ్యర్థులు మొత్తం 4,657 మంది ఉన్నట్లు లెక్క తేల్చారు. వీరిలో కొందరు ఇప్పటికే వేర్వేరు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వీరికి పదవీ విరమణ వరకు కనీస టైం స్కేల్‌ ఇస్తూ పోస్టింగ్‌లు ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ దస్త్రాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆమోదం లభించిన తర్వాత పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉంది. ఉపాధ్యాయుల బదిలీలకు వివరాల సేకరణ ఉపాధ్యాయుల బదిలీలకు ఖాళీల వివరాలు పంపాలని కమిషనరేట్‌ నుంచి జిల్లా విద్యాధికారులకు ఆదేశాలు అందాయి. ఫిబ్రవరి 29 వరకు ఉన్న ఎస్జీటీ, ఎల్‌ఎఫ్‌ఎల్‌, గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయుల ఖాళీలు, పాఠశాలల్లో ఖాళీలు, 5, 8 ఏళ్లుగా ఒకేచోట పని చేస్తున్నవారు.. తదితర వివరాలు సేకరిస్తున్నారు. ఉపాధ్యాయుల ప్రస్తుత సర్వీసు రిజిస్టర్‌(ఎస్‌ఆర్‌) స్థానంలో ఈ-ఎస్‌ఆర్‌ తీసుకొస్తున్నారు. ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరినప్పటి నుంచి పదవీ విరమణ పొందిన వరకు అన్ని సేవలను ఆన్‌లైన్‌లోనే నమోదు చేయనున్నారు. జూన్‌ నుంచి దీన్ని అమల్లోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మానవవనరుల సేవలు, వేతనాల చెల్లింపులు, సర్వీసు మొత్తం ఆన్‌లైన్‌ చేయనున్నారు.

కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులపై 40 ఏళ్ల వివరాలు ఇవ్వండి! తెలుగు రాష్ట్రాలను కోరిన నిపుణుల కమిటీ

కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు సంబంధించి 40 సంవత్సరాల వివరాలు ఇవ్వాలని మిగులు జలాలపై కేంద్ర జల్‌శక్తి శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ రెండు తెలుగు రాష్ట్రాలను కోరింది. అయిదుగురితో కూడిన ఈ కమిటీలోని నలుగురు సభ్యులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు.కేంద్ర జలసంఘం చీఫ్‌ ఇంజినీర్‌ విజయ్‌ శరణ్‌, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్యుడు హరికేష్‌ మీనా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్‌ ఇంజినీర్లు నరసింహారావు, నాగేశ్వరరావులు పాల్గొన్నారు. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలకు సంబంధించిన వివరాలు కోరినా ఇవ్వలేదని, వాటిని త్వరగా ఇస్తే అధ్యయనం చేసి జూన్‌ మొదటి వారంలో మళ్లీ చర్చిద్దామని జలసంఘం చీఫ్‌ ఇంజినీర్‌ సూచించినట్లు తెలిసింది. ప్రాజెక్టుల వారీగా పది రోజుల వంతున వచ్చిన ప్రవాహం, బయటకు వదిలిన నీటికి సంబంధించి 40 ఏళ్ల వివరాలు కావాలని కోరినట్లు తెలిసింది. అందుబాటులో లేకపోతే 20 సంవత్సరాల వివరాలైనా వెంటనే ఇవ్వాలని అడిగినట్లు సమాచారం. పూడిక పెరిగినందున తాజా నీటి నిల్వ సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకోవాలని వచ్చిన అభిప్రాయంతో జలసంఘం చీఫ్‌ ఏకీభవించినట్లు తెలిసింది.

‌క‌రోనా కూడా హెచ్ఐవి లాంటిదే!ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ! క‌రోనా ముప్పు తప్పేది ఎప్పుడు?

HIV లాగా కరోనా వైరస్ ఎప్పటికీ పోదని తాజాగా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ బాంబు పేల్చింది. కంటికి కనిపించని శత్రువు కరోనా యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మానవాళి మనుగడకు సవాల్ విసురుతోంది. చాప కింద నీరులా వ్యాపిస్తూ ప్రాణాలు తీస్తోంది. ఇప్పటికే లక్షల మందిని బలితీసుకుంది. ఇంకా ఎంతమందిని చంపుతుందో తెలియదు. మొత్తం ప్రపంచాన్ని చుట్టేసింది. వైరస్ వెలుగులోకి వచ్చి 5 నెలలు అవుతున్నా ఇప్పటివరకు వ్యాక్సిన్ కనిపెట్ట లేకపోయారు. వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాల్సిందే అని డాక్టర్లు చెబుతున్నారు. ఇంకా ఎన్ని రోజులు కరోనా వైరస్ ముప్పు ఉంటుంది? ఇంకా ఎంతకాలం దాన్ని ఎదుర్కోవాలి? కరోనా వైరస్ నుంచి పూర్తి ముప్పు తప్పేది ఎప్పుడు? అయితే హెచ్ఐవీ లానే కరోనా పోదని, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది. పెద్ద బాంబు పేల్చింది. ప్రపంచవ్యాప్తంగా సోకుతున్న హెచ్ఐవీ(AIDS) మాదిరిగానే కరోనా వైరస్ కూడా ఎప్పటికీ పోదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ మైక్ ర్యాన్ జెనీవాలో చెప్పారు. కరోనా వైరస్ సమాజంలో మరో స్థానిక వైరస్ గా మారవచ్చని, ఈ వైరస్ ఎప్పటికీ దూరం కాకపోవచ్చని డాక్టర్ మైక్ ర్యాన్ అభిప్రాయపడ్డారు. హెచ్ఐవీకి ఇంతవరకు వ్యాక్సిన్ కనుగొనలేకపోయారని ఆయన గుర్తుచేశారు. హెచ్ ఐవీ ప్రపంచం నుంచి ఎప్పుడు మాయమవుతుందో ఎవరికీ తెలియదని, అలానే కరోనా వైరస్ కూడా అంతేన్నారు. అత్యంత ప్రభావవంతమైన వ్యాక్సిన్ ను కనుగొనగలిగితే కరోనాను నివారించగలుగుతామని మైక్ ర్యాన్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ ఎప్పుడు మాయమవుతుందో తమకు తెలియదని, దీనికి ప్రభావవంతమైన వ్యాక్సిన్ ను కనుగొనగలిగి, దాన్ని ప్రతీ ఒక్కరికీ పంపిణీ చేయగలిగితే ఈ వైరస్ ను అరికట్టవచ్చని డాక్టర్ మైక్ ర్యాన్ వివరించారు. కరోనాకు వ్యాక్సిన్ తయారీ కోసం డాక్టర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారని ర్యాన్ తెలిపారు. ప్రస్తుతానికి మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, పరిశ్రుభంగా ఉండటం లాంటి కొన్ని జాగ్రత్తలతో కరోనాను అదుపు చేయడం మన చేతుల్లోనే ఉందని ర్యాన్ తేల్చి చెప్పారు. హెచ్‌ఐవి ఎప్పుడూ పోలేదు. కానీ హెచ్‌ఐవి ఉన్నవారు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడానికి మార్గాలు కనుగొన్నాము. మనం వాస్తవికంగా ఉండాలి. వ్యాధి ఎప్పుడు మాయమవుతుందో మాకు తెలియదు. మనకు అవసరమైన ప్రతి ఒక్కరికీ పంపిణీ చేయగల అత్యంత ప్రభావవంతమైన వ్యాక్సిన్‌ను కనుగొనగలిగితే, కరోనాను తొలగించడంలో ఓ అంచనాకు రాగలం"అని ర్యాన్ చెప్పారు. మొదటిసారిగా కొత్త వైరస్ మానవ జనాభాలో ప్రవేశిస్తుంది, అందువల్ల మనం ఎప్పుడు విజయం సాధిస్తామో ఊహించడం చాలా కష్టం అన్నారాయన. కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా 213 దేశాలకు విస్తరించింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 44 లక్షల 27 వేల 900 కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌-19 కారణంగా ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 2 లక్షల 98 వేల 77 మంది చనిపోయారు.

మీ ఇంటిని క‌రోనా రహిత ఇల్లుగా తీర్చి దిద్దుకోండి!

కోవిడ్ బారి నుండి మనల్ని, మన గృహాల్ని కాపాడుకోవ‌డానికి సూచించబడిన ప్రామాణిక కార్య నిర్వహణా విధానాలు / చేపట్టవలసిన భద్రతా చర్యల్ని కోవిడ్‌19 ఏపీ స్టేట్ నోడల్ ఆఫీసర్, డాక్టర్ ఆర్జా శ్రీకాంత్ విడుద‌ల చేశారు. దేశంలో ఒకరి నుండి మరోకరికి తేలికగా వ్యాపించే కోవిడ్ మహమ్మారిని అరికట్టుటకు విధించిన లాక్ డౌన్ తో దేశం సుమారు 60 రోజులపాటు స్తంభించిపోయింది. కోవిడ్ పై దేశం అలుపెరగని పోరాటం చేస్తున్నా క‌రోనా మాత్రం ఎక్కడో ఒక చోట తన ప్రతాపం చూపిస్తూనే ఉంది. లాక్ డౌన్ అనేది కోవిడ్ వ్యాప్తి నిరోధానికి మంచి పరిష్కారమే గాని రోజుల తరబడి దేశాన్ని స్తంభింపచేయడం వలన ముందు ముందు దేశం అనేక రకాల కష్ట నష్టాలను ఎదుర్కునే పరిస్థితులు ఏర్పడతాయి. వీటిని అధిగమించడానికి ఆర్ధికవ్యవస్థని గాడిలో పెట్టడానికి తీసుకునే చర్యల వలన ముందు ముందు లాక్ డౌన్ లు విధించే పరిస్థితులు ఎల్లవేళలా ఉండవు. కాబట్టి బయట మన అవసరమైన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ నే దీనికి సమాంతరంగా కోవిడ్ పై పోరాటం జరిపే పరిస్థితులు ఏర్పడతాయి. బయట మన కార్యక్రమాలు సురక్షితంగా నిర్వహించు కోవడానికి గాను ప్రభుత్వం నిర్దేశించిన విధంగా కేవలం కొద్ది పాటి సురక్షిత చర్యలు మరియు జాగ్రత్తలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే భారతదేశం కోవిడ్ పై విజయం సాధించడం అనేది పెద్ద కష్టసాధ్యమైన పని కాదు. మన ఇంటి అవసరాలకు సంబంధించి బయటకు వెళ్లవలసిన సందర్భాలు ఏర్పడినపుడు సురక్షిత పద్దతులు పాటించి మీ గృహమును కోవిడ్ రహిత గృహముగా తీర్చి దిద్దుకోండి. మీ గృహమును కోవిడ్ రహితముగా ఉంచుటకు మీ గృహములో నివసించు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి మరియు ఆ గృహములో నివసించు వ్యక్తులు సురక్షిత చర్యలు ఖచ్చితముగా పాటించేలా గృహ యజమానురాలు జవాబుదారీతనం వహించాలి. నిత్యవసర వస్తువులు కొనుగోలుకు సంబంధించి మార్కెట్ కి వెళ్లినప్పుడు. ఇంటి నుండి అడుగు బయటపెట్టే ముందే ముక్కు , నోరు ముఖానికి సరైన మాస్క్ ధరించాలి. బహిరంగ మార్కెట్ల కు వెళ్ళేటప్పుడు ప్రత్యేకమైన ప్లాస్టిక్ చెప్పులను ధరించాలి. సహ కొనుగోలుదారులు లేదా షాప్ యజమాని కి మీకు మధ్య కనీసం 6 అడుగులు దూరం ఉండేలా చూసుకోండి. మీకు అవసరం లేని సంబంధం లేని వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో తాకరాదు. ఇంటి నుండి బయటకు వెళ్ళాక ఎట్టి పరిషత్తుల్లోనూ మీ చేతులతో ముఖాన్ని తాకరాదు. బయటకు వెళ్లేటప్పుడు 70% ఆల్కహాల్ గల హాండ్ శానిటైజర్ ను మీ వద్ద ఉంచుకోండి. ఏదేనా అనుమానపు వస్తువు తాకాము అని మీకు అనిపించినపుడు వెంటనే ఈ శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోండి. కొనుగోలు చేసిన వస్తువులను తాకకుండా ఇంటికి తెచ్చుకోవడానికి ప్లాస్టిక్ బాస్కెట్ ని తీసుకెళ్లండి. డబ్బులు డ్రా చేసే ATMల యందు కార్డు ను ఉపయోగించిన తరువాత కార్డు ను మరియు చేతులను 70% ఆల్కహాలు శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలి. అత్యవసరమైన సందర్భాల్లో మాత్రమే వెళ్ళాలి. మరియు వారానికి ఒకటి లేక రెండు సార్లు వెళ్లడానికి మాత్రమే పరిమితం చేసుకోవాలి. కొనుగోలు తరువాత డబ్బు/బిల్లు చెల్లింపులు. G-Pay, Paytm App, Bheem App లేదా మీ Bank App వంటి ఎలెక్ట్రానిక్ పద్దతుల్లో చెల్లించడానికి ప్రయత్నించండి. ఎట్టి పరిస్థితిలో షాపు యజమాని నుండి చిల్లర నోట్లు తీసుకోవడానికి విముఖత చూపండి. చిల్లర నోట్లు ద్వారా కోవిడ్ మీ ఇంటిలోకి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. తిరిగి చిల్లర నోట్లు తీసుకునే బదులు దానికి సరిపడా అవసరమైన ఇతర వస్తువులు కొనుగోలు చేయండి. ఖచ్చితంగా చిల్లర నోట్లు తీసుకోవాల్సిన సందర్భం ఏర్పడినపుడు వాటిని మీరు చేతితో అలాగే పెట్టుకుని ఇంటికి వెళ్ళాక దుస్తులు ఇస్త్రీ చేసుకునే ఐరన్ బాక్సు తో నోటు రెండు వైపులా ఇస్త్రీ చేయండి. ఐరన్ బాక్సు మీరు పట్టుకోకుండా మీ కుటుంబసభ్యులచే ఈ పని చేయించాలి. ఇస్త్రీ చేసిన తరువాతే మీ కుటుంబ సభ్యులు నోటులను తాకాలి. చిల్లర నోట్‌లను 70% శాతం ఆల్కహాల్ శానిటైజర్ లేదా సబ్బు నీరు తో క్రిమి రహితం చేసుకోవాలి. నోట్‌లను క్రిమి రహితం చేసుకున్నా క చేతులను శుభ్రముగా కడుక్కోవాలి. అపార్టు మెంట్లు / భవనాలు లో లిఫ్ట్ లను మరియు మెట్లను ఉపయోగించేటప్పుడు. ప్రస్తుత పరిస్థితుల్లో లిఫ్ట్ ల కంటే మెట్ల దారిని ఉపయోగించడమే సురక్షితం మరియు ఆరోగ్యకరం. మెట్ల దారికి ఉన్న రైలింగ్ ని ఎట్టి పరిస్థితుల్లో తాకకూడదు. లిఫ్ట్ ని మాత్రమే ఉపయోగించవలసిన సందర్భం ఏర్పడినపుడు టిస్యూ పేపర్ ని వెలికి చుట్టుకుని అప్పుడు మాత్రమే లిఫ్టు బటన్లు తాకండి. లిఫ్ట్ నుండి బయటకు వచ్చాక లిఫ్ట్ తలుపులు తాకకుండా బయటకి వచ్చి చేతికి చుట్టుకున్న టిస్యూ పేపర్ జాగ్రత్తగా తొలగించి డస్ట్బిన్ లో వెయ్యా లి, లిఫ్ట్ లో వ్యక్తికి వ్యక్తికి 6 అడుగుల దూరం పాటించాలి. లిఫ్ట్ లో ఒకరు మాత్రమే ఉండేలా జాగ్రత్తపడితే మంచిది. బయటకు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చిన సందర్భాల్లో. డోర్ ని గాని డోర్ హాండెల్ గాని ముట్టుకోకుండా తలుపు తెరవమని కుటుంబ సభ్యులను కోరాలి. మీరు తెచ్చిన వస్తువులు లేదా సామానులు తలుపు బయటే ఒక టేబుల్ మీద ఉంచాలి. వెంటనే వాష్ రూము కి వెళ్ళి మీ ముఖాన్ని మరియు చేతులను సబ్బుతో సుమారు 20 సేకన్లు పాటు కడుక్కోవాలి. దుస్తులను తొలగించి డిటర్జెంట్ నీళ్ళలో నాన పెట్టుకోవాలి.( జన సంద్రం గల ప్రదేశాలు కు వెళ్లినప్పుడు) ప్లాస్టిక్ చెప్పులను డిటర్జెంట్ నీళ్ళతో సరైన రీతిలో శుభ్రం చేసుకోవాలి. బయటి వ్యక్తులు మీ ఇంటికి వచ్చిన సందర్బాల్లో. మన ఇంట్లో రిపేర్లు ఎదురైన సందర్భం లో సంబంధిత ఎలక్ట్రీషియన్ గాని ప్లాంబర్ గాని మన ఇంటికి వచ్చినప్పుడు అతను ఎటువంటి జ్వరంతో బాధపడుతున్నట్లు లేదని డిజిటల్ ధర్మా మీటర్ ద్వారా నిర్ధారించుకోవాలి. తరువాత అతని చేతులు హాండ్ శానిటైజర్ తో మరియు సబ్బునీరుతో శుభ్రం చేసుకోమని కోరాలి. అతని పనికి సంబంధించినవి మినహా మిగతా మరి ఏ ఇతర వస్తువులు అతను తాకకుండా చూడాలి. అతను పని పూర్తిచేసిన తరువాత పనిచేసిన ప్రదేశమును మరియు అతను ఉపయోగించిన పరికరాలను శానిటైజ్ చేయాలి. ఇంటిని వైరస్ రహితముగా చేసుకోవడము. 2% శాతం డిజర్జెంట్ సోల్యూషన్ తో లేదా, 2% శాతం లైజాల్ సోల్యూషన్ తో లేదా 3% శాతం డెట్టాల్ లేదా సేవలాన్ సోల్యూషన్ గల నీటితో నేలను శుభ్రముగా గా తుడుచుకోవాలి. తలుపులూ, కిటికీలు, డోర్ నాబ్ లు మొదలైన తరచుగా ముట్టుకునే వస్తువులను 70% ఆల్కహాల్ గల హాండ్ శానిటైజర్ తో ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. వంట గదిని వైరస్ రహితం గా చేసుకోవడం. వంట గదిలోని సామానులు సామాన్యంగా ఎప్పటికప్పుడు డిజర్జెంట్ లేదా వాషింగ్ లిక్విడ్ తో శుభ్రం చేయబడతాయి కాబట్టి ప్రత్యేకంగా చేయవలసి నది ఏమి ఉండదు. దుస్తులను వైరస్ రహితముగా చేసుకొనడం. బయట నుండి వచ్చాక తక్షణం మీ దుస్తులను సరైన డిజర్జెంట్ తో ఉతకాలి. ఉపయోగించే టవళ్ళు దుస్తులను ఎప్పటికప్పుడు ఉతుక్కోవాలి. చేతులను సరైన విధంగా క్రిమి రహితం చేసుకొనడము. మీ చేతులను ఎల్లప్పుడు సుమారు 20 సెకనుల పాటు సబ్బు నీరుతో శుభ్రం చేసుకోవాలి. అర చేతులు, వేళ్ళు మధ్య , గోళ్ళు మరియు మణి కట్టు వద్ద సుమారు 20 సెకనుల పాటు సబ్బు నీటితో శుభ్రం చేసుకోవాలి. సబ్బు నీరు అందుబాటులో లేనపుడు 70% ఆల్కహాల్ గల హాండ్ శానిటైజర్ ని ఉపయోగించవచ్చు. ఈ కార్యక్రమం కేవలం బయటకు వెళ్ళి వచ్చిన సందర్బాల్లో తప్పక చెయ్యాలి. బయట నుండి తెచ్చిన పండ్లు కూరగాయలను వైరస్ రహితముగా చేసుకొనడము. ప్రస్తుత పరిస్థితుల్లో బయట నుండి కొని తెచ్చిన పండ్లు గాని కూరగాయలు గాని ఉపయోగించక ముందు వైరస్ రహితముగా చేసుకోవాల్సిన అవసరము ఏర్పడింది. పండ్లు కూరగాయలను బట్టి వాటిని ఉప్పు లేదా బేకింగ్ పౌడర్ కలిపిన గోరు వెచ్చని నీటిలో గాని లేదా 2% శాతం సబ్బు గాని డిజర్జెంట్ కలిపిన నీళ్ళలో చేతులతో బాగా రుద్ది వైరస రహితం చేసుకోవాలి. తదుపరి వాటిని పంపు నీళ్లతో కడగాలి. ఫ్రీడ్జ్ లో నిలువ చేసుకోవాలి. ప్యాకెట్ లలో వచ్చే పాలను వైరస్ రహితంగా చేసి వాడుకునే విధానం. పాల ప్యాకెట్ ను 2% శాతం సబ్బు లేదా డిజర్జెంట్ నీళ్ళతో చేతులతో బాగా రుద్ది శుభ్రం చేయాలి. తరువాత పంపు నీళ్ళతో కడగాలి. ప్యాకెట్ ని కత్తిరించి పాలను పాత్రలోకి తీసుకుని వెంటనే వేడి చేసుకోవాలి. ఒకవేళ పాల వ్యక్తి దగ్గర కొనుగోలు చేస్తే పాలు పోయించుకునే అప్పుడు పాల వ్యక్తికి మీకు కనీస దూరం పాటించాలి. మరియు ఆ పాలను వెంటనే వేడి చెయ్యాలి. ఆహార పదార్ధాలను వైర స్ రహితంగా చేసుకోవడం. నీటితో శుభ్రం చేయబడలేని ప్యాకింగ్ చేయబడని ఆహార పదార్ధాలను ఉపయోగించే ముందు వాటిని ఒక ప్రత్యేకమైన ప్రదేశం లో సుమారు 72 గంటలపాటు ఉంచాలి. బయట నుండి డైరీ ఉత్పత్తులు స్వేట్లు కొనుగోలుచేయడం మానుకోవాలి. సాధ్యమైనంత వరకూ వాటిని ఇంటిలోనే తయారు చేసుకొనటుకు ప్రయత్నం చేయాలి. ఇతర వస్తువులను వైరస్ రహితము చేసుకొనడం. ఇతర తినుబండారాలు కానీ వస్తువులను ఉపయోగించుటకు ముందు సుమారు 72 గంటల పాటు ఒక ప్రత్యేకమైన ప్రదేశం లో నిలువ ఉంచాలి. శరీరం లో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం. రోజూ సుమారు 30 నిముషాల పాటు యోగాసనాలు, ప్రాణాయామం మరియు మేడిటేషన్ చేయడం. తులసి, దాల్చిన చెక్క, బ్లాక్ పెప్పర్, సొంటి, మునగ కాషాయాన్ని రోజుకు ఒకటి లేదా రెండు సార్లు సేవించాలి. రుచి కొరకు బెల్లం లేదా నిమ్మరసం అదనంగా కలుపుకోవచ్చు. కరోనా ఎదుర్కొనుట మన బాధ్యత!! పైన తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు మన కర్తవ్యం!!! మన కంటే ముఖ్యంగా మన ఇంటిలో ఉన్న పెద్దలు పైన కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందని గమనించాలి!!! కావున పైన సూచించిన అనేక జాగ్రత్తలను పాటించి కరోనా మహమ్మారిని ఎదుర్కొందాం!!!

'నవరత్నాలు' కోసం భూముల వేలం! రూ.300 కోట్లు రావచ్చని అంచనా!

భూములను వేలం వేసే ప్రక్రియను వైసీపీ ప్రభుత్వం షూరూ చేసింది. తొలి విడతలో విశాఖ, గుంటూరు జిల్లాల్లోని తొమ్మిది ప్రాంతాల్లో ఉన్న భూమిని వేలం వేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 29న ఈ ఆక్షన్ ప్రక్రియ ద్వారా వేలం కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ వేలంలో సమకూరే ఆదాయాన్ని నవరత్నాలు, నాడు-నేడు వంటి కార్యక్రమాల అమలుకు వెచ్చించనుంది. ఈ వేలం ప్రక్రియను బిల్డ్ ఏపీ మిషన్ చేపట్టబోతోంది. ఈ సందర్భంగా బిల్డ్ ఏపీ మిషన్ డైరెక్టర్ మాట్లాడుతూ, వేలంపాటలో ఎవరైనా పాల్గొనవచ్చని తెలిపారు. ధరావతు కింద పది శాతం చెల్లించాలని తెలిపారు. వేలం వేసే భూముల వివరాలు ఇలా వున్నాయి. గుంటూరు జిల్లాలో ని నల్లపాడు - 6.07 ఎకరాలు, శ్రీనగర్ కాలనీ - 5.44 ఎకరాలు, మెయిన్ బీటీ రోడ్డు - 1.72 ఎకరాలు. విశాఖ జిల్లాలో చిన గడ్లీ - 1 ఎకరం, చిన గడ్లీ - 75 సెంట్లు, ఆగనంపూడి - 50 సెంట్లు, ఫకీర్ టకియా ఎస్ఈజెడ్ - 35 సెంట్లు, ఫకీర్ టకియా ఎస్ఈజెడ్ - 1.93 ఎకరాలు, ఫకీర్ టకియా ఎసీఈజెడ్ - 1.04 ఎకరాలు. తొలివిడత కింద విశాఖ, గుంటూరు జిల్లాల్లో కలిపి 9చోట్ల ప్రధాన ప్రాంతాల్లోని విలువైన ప్రభుత్వ భూములను ఈ-వేలం ద్వారా వేలం వేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ భూముల ద్వారా రూ.300 కోట్ల వరకు ఆదాయం రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ‘నవరత్నాలు’, ‘నాడు-నేడు’ వంటి ప్రభుత్వ పథకాల అమలుకు ఈ నిధులు వెచ్చిస్తామని బిల్డ్ ఏపీ మిషన్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

సీఎస్ విషయంలో జగన్ కీలక నిర్ణయం.. కేంద్రానికి లేఖ!

జూన్ నెలాఖరుతో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వానికి సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. సీఎస్ పదవీకాలాన్ని మరో 6 నెలలు పొడిగించాలని జగన్ కేంద్రాన్ని కోరారు. సీఎస్ గా నీలం సాహ్ని పదవీ బాధ్యతలు స్వీకరించి 6 నెలలే కావడంతో పదవీకాలాన్ని పొడిగించాలని కోరారు. అదీగాక, ప్రస్తుతం కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ సమయంలో పరిపాలనకు కేంద్రబిందువైన సీఎస్ మార్పు పై జగన్ విముఖంగా ఉన్నట్లు సమాచారం. కరోనా విపత్తు నేపథ్యంలో పదవి విరమణ చేసే అధికారులకు పలువురికి 3 నెలల వరకు పదవీ కాలాన్ని కేంద్రం పొడిగించింది. అదే విధంగా నీలం సాహ్ని పదవీ కాలాన్ని కూడా పొడిగించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో కూడా సీఎస్ పదవీకాలాన్ని పొడిగించిన సందర్భాలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత అప్పటి పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అప్పటి ఉమ్మడి ఏపీ సీఎస్ రమాకాంత్ రెడ్డి పదవీకాలాన్ని 3 నెలల పాటు పొడిగించింది. అలాగే, 2014లో రాష్ట్ర విభజన సమయంలో పీకే మహంతీ పదవీకాలాన్ని 4 నెలల పాటు పొడిగించింది. కరోనా నేపథ్యంలో ఇప్పుడు కూడా అలాగే సీఎస్ పదవీకాలాన్ని పొడిగించే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ అంశంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

గ్యారంటీ లేకుండా ఎంఎస్ఎంఈలకు 3 ల‌క్ష‌ల కోట్ల రుణం!

ఎంఎస్ఎంఈలకు (సూక్ష్మ స్థూల మధ్యతరహా పరిశ్రమలు) అధిక ప్రాధాన్యం లభించిందని చెప్పుకోవచ్చు. వీటికి రూ.3 లక్షల కోట్ల ఆటోమేటిక్ రుణాలు అందిస్తామని తెలిపారు. వీటికి ఎలాంటి గ్యారంటీ అవసరం లేదన్నారు. 4 ఏళ్ల కాల పరిమితితో ఈ రుణాల జారీ ఉంటుందని తెలిపారు. అక్టోబర్ 21 వరకు ఈ లోన్స్ పొందొచ్చని పేర్కొన్నారు. దీంతో 45 లక్షల యూనిట్లకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఎంఎస్ఎంఈల నిర్వచనం కూడా మారుస్తున్నామని ఆమె తెలిపారు. దీంతో వారి పరిమాణం పెరుగుతుందని, ప్రయోజనం పొందుతాయని పేర్కొన్నారు. ఇన్వెస్ట్‌మెంట్ పరిమితిని పెంచామని తెలిపారు. అలాగే టర్నోవర్ పరిమితిని కూడా పెంచామని వివరించారు. ఈ-మార్కెట్‌ప్లేస్, సప్లై చెయిన్ మెరుగుపరచడం, ఇన్వెస్ట్‌మెంట్లు సహా పలు కీలక చర్యలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ఐటీఆర్ దాఖలు గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. 2020 జూలై 31 నుంచి 2020 నవంబర్ 30కు ఎక్స్‌‌టెండ్ చేశారు. దీంతో పన్ను చెల్లింపుదారులకు ఊరట కలుగనుంది. అలాగే టీడీఎస్, టీసీఎస్ రేట్లను 25 శాతం తగ్గించారు. నాన్ శాలరీడ్ పేమెంట్స్‌కు ఇది వర్తిస్తుంది. 2021 మార్చి 31 వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుంది. దీంతో వ్యవస్థలోకి రూ.50 వేల కోట్లు రానున్నాయి. పీఎఫ్ కంట్రిబ్యూషన్ మొత్తాన్ని 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఉద్యోగుల టేకోమ్ శాలరీ పెరుగుతుంది. దీంతో చేతిలో కొంత ఎక్కువ డబ్బులు మిగులుతాయి. వచ్చే మూడు నెలలు ఇది వర్తిస్తుందని తెలిపారు. కంపెనీలు మాత్రం 12 శాతం పీఎఫ్ అకౌంట్‌కు కంట్రిబ్యూట్ చేస్తాయని పేర్కొన్నారు. పీఎఫ్ కంట్రిబ్యూషన్ మొత్తాన్ని మరో మూడు నెలలపాటు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. జూన్ నుంచి ఆగస్ట్ వరకు ఇది వర్తిస్తుంది. కంపెనీలు, ఉద్యోగుల పీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను కేంద్ర ప్రభుత్వమే ఈపీఎఫ్ ఖాతాకు చెల్లిస్తుంది. రూ.15000 లోపు వేతనం ఉన్న వారికి ఇది వర్తిస్తుంది. లాక్ డౌన్ కారణంగా కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టడానికి ప్రధాని మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ఎకనామిక్ ప్యాకేజీ  ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ సుధీర్ఘ వివ‌ర‌ణ ఇచ్చారు. వివిధ మంత్రిత్వ శాఖలతో చర్చించిన అనంతరం ప్యాకేజీకి రూపకల్పన చేసినట్లు తెలిపారు. 50 వేల కోట్లతో ఎంఎస్ఎంఈ లకు నిధి ఏర్పాటు. ఈ రోజు నుంచి ప్యాకేజీ వివరాల్ని ఒక్కొక్కటిగా ప్రకటిస్తామ‌ని కేంద్ర మంత్రి తెలిపారు.  ఆత్మనిర్భర భారత్ మిషన్‌కు ఆర్థిక వ్యవస్థ, మౌలిక రంగం, వ్యవస్థ, డెమోగ్రఫీ, డిమాండ్.. ఈ అయిదూ మూలస్తంభాలని, వాటిని బలోపేతం చేయడానికి ఈ ప్యాకేజీని వినియోగిస్తున్నట్లు తెలిపారు.  కుటీర‌ పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమ, MSMEలు, కార్మికులు, రైతులు, మధ్య తరగతి పన్ను చెల్లింపు దారులు, భారతీయ పరిశ్రమల్లోని వివిధ విభాగాలను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక ప్యాకేజీని రూపొందించాం. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఉపయోగపడేలా ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం.  నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. స్థానిక ఉత్పత్తులకు గ్లోబల్ డిమాండ్ కల్పించడమే ఈ పథకం ఉద్దేశమ‌ని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ.. అసలు ఉద్దేశం అదే!

ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించారు. వివిధ మంత్రిత్వ శాఖలతో చర్చించిన అనంతరం ప్యాకేజీకి రూపకల్పన చేశామని తెలిపారు. స్వదేశీ బ్రాండ్లను తయారుచేయడమే ఈ ప్యాకేజీ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ఉత్పత్తులకు పేరు తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు.  దేశాన్ని అన్ని రకాలుగా పునరుత్తేజం చేసేందుకే ఈ ప్యాకేజీని రూపొందించినట్లు చెప్పారు. రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ దేశ అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఐదు సూత్రాలతో ఈ ప్యాకేజీని రూపొందించామని.. ఆర్థిక, మౌలిక, సాంకేతిక, దేశ జనాభా, డిమాండ్ ప్రధాన సూత్రాలని నిర్మలా ప్రకటించారు.

కేసీఆర్‌-జ‌గ‌న్‌ మధ్య జ‌ల‌జ‌గ‌డం! మ‌రో పోరాటానికి సిద్ధ‌మంటున్న టిఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బిజెపి

ఇప్పటివరకు ఉన్న రూల్ ప్రకారం కృష్ణా బేసిన్‌లోని నికర జలాల్లో ఏపీ, తెలంగాణకు 811 టీఎంసీలను కేటాయించగా... వాటిలో తెలంగాణ 299 టీఎంసీలు, ఏపీ 512 టీఎంసీలు వాడుకోవాల్సి ఉంది. అంతా క్లారిటీగా ఉంటే... మరి వివాదం ఎందుకు వచ్చిందన్నది కీలక అంశం. కర్ణాటక, మహారాష్ట్రలో కొన్ని సంవత్సరాల్లో భారీ వర్షాలు కురిసినప్పుడు పెద్ద ఎత్తున వరదలు వస్తాయి. అప్పుడు కృష్ణా బేసిన్‌లో 811 టీఎంసీల కంటే ఎక్కువ నీరు వస్తుంది. ఆ ఎక్కువ నీరును ఎలా పంచుకోవాలి అన్నది ఇప్పటివరకూ డిసైడ్ చెయ్యలేదు. ఎందుకంటే... అలా ఎక్కువ నీరు వస్తున్న సందర్భాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. కానీ ఇప్పుడు ఆ మిగులు జలాలపై రచ్చ నడుస్తోంది. రాయలసీమ జిల్లాల్లోని కీలక సాగునీటి ప్రాజెక్టులకు నీరు విడుదల చేయాలంటే పోతిరెడ్డిపాడు ద్వారానే సాధ్యమవుతుంది. ఇది శ్రీశైలం బ్యాక్ వాటర్ మీద ఆధారపడి ఉంటుంది. నీటిని విడుదల చేయాలంటే శ్రీశైలంలో 854 అడుగులు ఎత్తులో నీటి లభ్యత ఉండాలి. జీఓ 69 ప్రకారం నీటి మట్టం 834 కి కుదించారు. మరో వైపు వరదలు వచ్చినపుడు కూడా రోజుకు నాలుగు టీఎంసీల నీరు మాత్రమే డ్రా చేసుకునే అవకాశం ఉంది. వాటిని ప్రాజెక్టులకు తరలించే కాల్వల నిర్మాణం సరిపడే రీతిలో లేవు. ఫలితం 2 నెలల వరద 1500 టీఎంసీల నీరు శ్రీశైలం నుంచి కిందకు విడుదల చేసినా 100 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న సీమలో నింపింది 60 , 70 టీఎంసీల నీరు మాత్రమే. వాస్తవానికి రాయలసీమకు అన్నీ కలిపి 131 టీఎంసీల నీటి హక్కు ఉంది. పోతిరెడ్డిపాడు వెడల్పు చేసి కాల్వల సామర్థ్యం పెంచినా కూడా వరదల సమయంలో పూర్తి హక్కును వాడుకోలేం. ప్రత్యేకించి సముద్రం పాలు అవుతున్న నీటిని వాడుకునే అవకాశం లేదు. అలాంటి సమయంలో సిద్దేశ్వరం సమీపంలో శ్రీశైలంలో 800 - 854 అడుగుల మధ్య రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా పోతిరెడ్డిపాడుకు డైవర్షన్ స్కీమ్‌తో బనకచర్ల కు వెళ్లే దారిలో 6వ కిలోమీటరు వద్ద కలుపుతారు. శ్రీశైలంలో 800 - 854 అడుగులు మధ్య ఉండే నీటి విలువ 60 - 80 టీఎంసీలు మాత్రమే. ఈ మొత్తం కూడా నూతనంగా తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా తరలింపు సాధ్యమేనా ? అని ప్రశ్నించుకుంటే.. కాదు అనే సమాధానం వస్తుంది. ఎందుకంటే ఎత్తిపోతల ఉద్దేశం 3 టీఎంసీలు. కానీ ఇది 854 అడుగులు ఉన్నపుడు లిఫ్ట్ చేసినట్లుగా అంతకన్నా దిగువ ఉన్నపుడు సాధ్యం కాదు. మరీ ముఖ్యంగా శ్రీశైలం నుంచి కుడి , ఎడమ కాల్వల ద్వారా నీటి విడుదల చేస్తూనే ఉన్నారు. మొత్తం నీరు రాయలసీమకు తరలిస్తారన్న విమర్శ సరికాదు. వరదలు ఉండి సముద్రంలోకి విడుదల చేసే సమయంలో ఈ నీటిని రాయలసీమ ప్రాజెక్టులకు తరలించడానికి అవకాశం ఉంది. ఈ చర్య వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఉన్న రహస్య ఒప్పందం మేరకే ఏపీ ముఖ్యమంత్రి జగన్ జీవో 203 తీసుకొచ్చారని బీజేపీ ఆరోపిస్తోంది. కృష్ణా నదిపై నిర్మిస్తున్న ప్రాజక్టులను కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని పోతిరెడ్డిపాడును అడ్డుపెట్టుకుని కేసీఆర్ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని చూస్తున్నారని బిజెపి ఆందోళ‌న‌కు దిగింది. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ ప్రభుత్వం నాలుగు టీఎంసీల నీళ్లను తరలించడం దక్షిణ తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంది. ఇది తెలంగాణ ఏర్పాటు లక్ష్యానికే తూట్లు పొడిచినట్టు అవుతుందని కాంగ్రెస్ పార్టీ ఘోటుగా విమ‌ర్శిస్తోంది. పోతిరెడ్డిపాడుపై దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చింది. కృష్ణా నీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరలించుకుపోతే ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగు నీటి సమస్య ఏర్పడుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఎపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర భంగకరమైన ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి న్యాయ పోరాటం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. వాస్త‌వానికి రాయలసీమకు 131 టీఎంసీల నీటి హక్కు ఉన్నప్పటికి తీసుకుంటున్న నీరు సగం మాత్రమే. ఇక నీటి దోపిడీకి అవకాశం ఎక్కడ? నీటి దోపిడీ జరుగుతోందని. ఇలాంటి ఆరోపణలు తెలంగాణ ప్రభుత్వం, నేతలు తరచూ చేస్తున్నారు. తెలంగాణా రాజకీయ పార్టీలు ఒక్కటై వారి రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఉద్య‌మానికి సిద్ధం అయ్యారు. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం రాజకీయ పార్టీలు తగిన రీతిలో స్పందించడం లేదు.

కరోనా పాజిటివ్ వచ్చినా ఇంటికి పంపించారు.. నన్ను కాపాడండి!

ఒకవైపు కరోనా చాలా ప్రమాదకరమైనది, ఇంటి నుండి ఎవరూ బయటకు రావద్దని ప్రభుత్వాలు చెబుతుంటే.. మరోవైపు కరోనా పాజిటివ్ తేలిన ఓ వ్యక్తికి పూర్తి చికిత్స చేయకుండా నిర్లక్ష్యంగా ఇంటికి పంపించిన ఘటన చెన్నైలో వెలుగులోకి వచ్చింది. చెన్నైలో ఉంటున్న ఏపీకి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే అక్కడి డాక్టర్లు.. బాధితుడికి కేవలం రెండు రోజులు చికిత్స అందించి మూడో రోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేశారు.  పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడుకు చెందిన వ్యక్తి చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌లో పని చేస్తున్నాడు. అతను కరోనా లక్షణాలతో మే 5న స్థానిక ఆసుపత్రిలో చేరగా.. 8న పాజిటివ్ అని తేలింది. అయితే రెండ్రోజుల చికిత్స అనంతరం 10న అతడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. దీంతో ఆ బాధితుడు.. తనకు పాజిటివ్‌ వచ్చినప్పటికీ ఇంటికి పంపారని.. ప్రభుత్వం తనని కాపాడాలని కోరుతూ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. తీవ్ర అనారోగ్యంతో ఒంటరిగా బాధపడుతున్నానని, తాను బయట తిరిగితే తన ద్వారా మిగతావారికి వైరస్‌ సోకే ప్రమాదం ఉందని.. కావున తనకు చికిత్స అందించాలని, ఏపీ అధికారులు తనను రక్షించాలని వీడియోలో విజ్ఞప్తి చేశాడు.