ఏప్రిల్ నెల నష్టం 97 వేల కోట్ల రూపాయలు! నగదు లభ్యత లేక చేతులెత్తేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు
posted on May 15, 2020 @ 10:58AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల అయిన ఏప్రిల్‌లో దేశంలోని 21 ప్రధాన రాష్ట్రాలకు దాదాపు రూ.97 వేల కోట్ల ఆదాయ నష్టం వాటిల్లినట్లు ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చి సంస్థ అంచనా వేసింది. ఇందులో తెలంగాణకు రూ.5,393 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.5,102 కోట్లు నష్టం వాటిల్లిందని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ నగదు లభ్యత లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ రాష్ట్రాల పరిస్థితి మరింత దయనీయంగా ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.
కొవిడ్-19పై పోరులో భాగంగా క్షేత్రస్థాయిలో ఖర్చు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నందున అవి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు విశ్లేషించింది. కేంద్రం నుంచి వచ్చే పన్ను వాటాల్లో ఎంత మొత్తం, ఎప్పటికి వస్తుందో తెలియని అనిశ్చితి నెలకొన్నట్లు పేర్కొంది. రాష్ట్ర సొంత ఆదాయ వనరులు పూర్తిగా పడిపోయిన నేపథ్యంలో ఆదాయం కోసం కొత్త మార్గాలు అన్వేషించడం, చేతిలో ఉన్న డబ్బును పొదుపుగా వాడుకోవడం మినహా వాటికి గత్యంతరం లేకపోతున్నట్లు తెలిపింది.
లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ 40% ఆర్థిక వ్యవస్థ కొనసాగుతూనే ఉందని పేర్కొంది. మే నెలలో కొన్ని వెసులుబాట్లు కల్పించడంతో పరిస్థితుల్లో కొంతమేర మెరుగుదల ఉండొచ్చని ఇండియా రేటింగ్స్ సంస్థ అంచనా వేసింది. ముఖ్యంగా మద్యం అమ్మకాలకు అనుమతివ్వడం వల్ల రాష్ట్రాలపై ఆదాయ ఒత్తిడి కొంతమేర తగ్గే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
దేశంలో మహారాష్ట్ర అత్యధికంగా ఒక నెలలో రూ.13,257 కోట్ల మేర ఆదాయం కోల్పోయినట్లు అంచనా వేసింది. ఆయా రాష్ట్రాల బడ్జెట్ అంచనాల ఆధారంగా ఈ నష్టాన్ని అంచనా వేసినట్లు వెల్లడించింది.